దాగుడు మూతల దండాకోర్!

ఎక్కడైనా సరే అంతిమంగా స్త్రీలే బాధితులు, నేరస్తులు అవుతారు!

తర రచయితల తాలూకు రచనల్లో మీకు ఏది ఇష్టం అంటే చప్పున చెప్పడానికి ఉంటుంది కానీ మనం రాసిన మన కథలు అన్నప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంటుంది. మనకి ఇంచుమించు బాగా నచ్చిన తర్వాతనే అచ్చుకు పంపిస్తాం కదా!

అయితే కొన్ని కథలు మన మనసును తాకినవి, గాఢమైన ముద్రవేసినవి ఉంటాయి. అలా నా కథల్లో నాకు నచ్చిన కథ అంటే, నా రాజకీయ కథలన్నీ నాకు ఇష్టమైనవే  అయినప్పటికీ, నా మనసుకి బాగా దగ్గరగా వచ్చిన కథ, ఒక  ఉద్విగ్న భరితమైన స్థితిలోంచి వచ్చిన కథ “అక్క ఈగ”.

ఏకపక్ష నైతిక విలువలు ఉన్న సమాజంలో, సాగుతోన్న కుటిల, ద్వంద్వనీతి ఎట్లా స్త్రీని మగవాడి చేతికి ఒక ఆట బొమ్మగా అందించింది అన్న ఆలోచన నిలవనివ్వలేదు ఆ రాత్రి నన్ను!

అది నా ప్రియమైన స్నేహితురాలు మరణించిన రాత్రి-

ఆమె తన భర్తకి మొదటి భార్య.. ఆమె చెల్లెలు అతడి రెండో భార్య.

ఒక స్త్రీకి పురుషుడితో వివాహమై ఆమెకి పిల్లలు లేకపోతేనో, లేదా భార్య చనిపోతేనో వెంటనే ఆమె చెల్లెలితో అదే కర మంత్రపు వేదిక మీద పెళ్లి చేసేసే వారు.  అమ్మాయి అభిప్రాయానికి ఇసుమంతైనా ప్రాధాన్యత విలువ ఉండేవి కావు. అదే స్త్రీలు ఈడేరకముందే చేసిన పెళ్లి తాలూకు పెళ్ళికొడుకు మరణిస్తే విధవగా రాజముద్ర వేసుకుని జీవితమంతా చాకిరి చీకట్లోకి నెట్టబడుతుంది.

అస్తిత్వ ఉద్యమాల రాకడ, ఆధునిక కాలం  కొన్ని చిన్న చిన్న మార్పుల్ని తెచ్చి ఉండొచ్చును,గానీ స్త్రీల మీది  హింస మాత్రం రూపాలను మార్చుకుని కొనసాగుతూనే ఉంది.

నాకు పరిచయం అయ్యే నాటికే ఈ అక్క చెల్లెళ్లు ఇద్దరూ అతడి భార్యలు.  వాళ్ళు సహన, కవన అని మనం అనుకుంటే   కవన మెడికల్ ఆఫీసర్ గా పని చేస్తూ ఒక సెలబ్రిటీ స్థానంలో ఉండేది. నా స్నేహితురాలి పెళ్ళై ఒక పాప కలిగాక కేవలం ఆమె సంపాదన కోసమే ఇతడు కవనకు దగ్గరయ్యాడు. తన ప్రమేయం ఏమీ లేకుండా జీవితం తొక్కిన పెద్దలోతు సహనని విషాదాశ్చర్యాలకు గురి చేసింది. గాయమైన ఆమె గుండెకి  లేపనం రాసాడు అతడు. రాబోయే సంపదను చూపించి తన కూతురి భవిష్యత్తుని కలలు కలలుగా ఆమె కళ్ళ ముందు ఆవిష్కరించాడు.

ఈ విధంగా ఆస్తులు బయటికి  పోకుండా వాళ్లలో వాళ్లే పెళ్లిళ్లు  చేసుకోవడం… ఒకరికి ఇద్దరినీ, ముగ్గురిని కట్టబెట్టడం మా జిల్లాలో అప్పటికి ఆనవాయితీగా ఉండేది. ఈ త్రిజంట చాలా అన్యోన్యంగా, కలిసికట్టుగా ఉన్నట్టు పైకి కనిపించే వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురూ కలిసి వెళ్లడం, ఏ ఫంక్షన్ లో నైనా ముగ్గురూ కలిసి కనిపించడం జరిగేది. ఆడవాళ్ళిద్దరూ కూడా చాలా కలిసిమెలిసి ఉండే వాళ్ళు. వాళ్లిద్దరూ కూడా నా పట్ల స్నేహపూర్వకంగా ఉండేవారు.

ఈ నేపథ్యంలో నుండి సహన హఠాన్మరణం నన్ను తీవ్రంగా కృంగదీసింది. అంతగా నేను కృంగిపోవడానికి కారణం ఆమె మామూలుగా మరణించలేదు.  మరణించడానికి నెల రోజుల ముందు నుండి రెండు మూడు సార్లు నాకు ఫోన్ చేసి “ఒక్కసారి రా ప్రతిమా నీతో చాలా మాట్లాడుకోవాలి” అన్నది. నా రొటీన్ పనులలో నుండి నేను వెళ్లడం సాధ్యం కాలేదు.  వాళ్లప్పుడు మద్రాసు మహానగరంలో ఉండే వాళ్ళు నేను ఈ చిన్న ఊరిలో…. ఇది సాకుగా ఎంచుకున్న కారణమే తప్ప, అసలు కారణం అలసత్వమే.

నేను వెళ్లి ఉంటే నా స్నేహితురాలు ఏం చెప్పి ఉండేది నాతో ఏం పంచుకొని ఉండేది ఆ క్రమంలో ఆమె గుండె బరువు పలుచబడి ఉండేదా ? అప్పుడిలా జరిగి ఉండేది కాదా? అంటూ ఒక స్త్రీగా, ఒక స్నేహితురాలిగా రకరకాల  ఆలోచనలతో కూడిన అపరాధ భావం చుట్టుముట్టి నన్ను కలచివేసింది. చెప్పాలంటే ఇవాల్టికీ ఆ ఆపరాధ భావం నన్ను వీడిపోలేదు.

ఆమె మరణించిన రోజు రాత్రి అక్కడి నుండి తిరిగి వస్తూ నేను పొందిన దుఃఖం మాటలకందనిది. నిద్ర పట్టని ఆ రాత్రి, ఆ ఉద్వేగ భరిత స్థితిని కాగితం మీద పెడితేనే తప్ప, చీకట్లు తొలిగే వేళకి గుండె బరువు తగ్గలేదు. అప్పటికి ఇప్పటికీ ఒకే ఒక్క సిట్టింగ్లో లేవకుండా రాసిన కథ- ఒక ఎమోషనల్ మూడ్ లో వచ్చిన కథ “అక్క ఈగ” మాత్రమే. ఈకథ కథ సిరీస్ లో  వచ్చింది.

ఒకసారి మాలతీ చందూర్ గారి అక్క శారదగారు నాకు ఫోన్ చేశారు. ” అసలీ కథ ఇంత లోతుగా,చూసినట్టుగా ఎలా రాయగలిగావమ్మా… కధ కాదు జీవితం” అన్నారు గొంతు బొంగురు పోతుండగా- ఆ తర్వాత ఆమె దుఖాన్ని దిగ మింగుతున్నట్టనిపించి వికలమై ఫోన్ పెట్టేశాను.  లక్ష్మీ రెడ్డి గారు ఈ కథ చదివి వెంటనే దాన్ని హిందీలోకి అనువదించి అక్కడి పత్రికలో ప్రచురించారు. ఆయనేమంటారంటే అక్కఈగ కథ శైలి ఒక లేసు అల్లికలా వుంది. ఒక వాక్యం లో నుండి మరో వాక్యం పొదిగినట్లుగా ఉంది అని…అది వేరే సంగతి.

ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు చూస్తుంటే- ఏమాత్రం మార్పు లేకపోగా-  ప్రతి హిందీ, తెలుగు సీరియల్స్ లో ఇద్దరు ఆడవాళ్లు సర్వసాధారణమైపోయింది…అదే సహజమని నమ్మేంతగా! ఇదిలా వుంటే  పిల్లలు పుట్ట నందుకు నేరస్తురాలిగా పరిగణింపబడిన ఒక కలవారింటి కోడలు నాతో ఒక మాటoది. “ఎవడో ఒకడి తో ఒక బిడ్డని కనేస్తే ఒక పనయి పోతుంది.” అని..ముందు నా చెవులు నమ్మలేదు…నమ్మాక ఆపిల్ల ఎంతగా విసిగి పోయిందో అర్థమైంది.

అపుడు విత్తనం అని ఒక కథ రాశాను… అది ఆంగ్లంలోకి అనువాదమైంది.  ఎందుకు చెప్తున్నాను అంటే ఎక్కడైనా సరే అంతిమంగా స్త్రీలే బాధితులు, నేరస్తులు అవుతారు.  స్త్రీలకు సంబంధించి అనేక రకాల వివక్షలతో, ఏకపక్ష నైతిక విలువలతో, అణిచివేతలతో దాడులతో, నిండి  అవి సంఘం ఏర్పరిచిన నియమాలుగా భావించి, సహజమే అని తమను తాము నమ్మించుకుంటూ ముందుకు సాగుతోన్న ఈ వ్యవస్థ ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా తన మేనిఫెస్టోని మార్చుకుంటే మంచిది.

*

  అక్క ఈగ

“అబ్బా” …ఇప్పుడు నాక్కొంత రిలీఫ్ గా ఉంది…..

నా తల, వీపు, నడుము, కాళ్లు ఈ మంచం మీద ఆనిన తర్వాత, ఈ నెల రోజులుగా నేను పడుతున్న శారీరక బాధంతా ఎక్కడికో ఎగిరిపోయినట్లుగా ఒకిoత తేలిగ్గా ఉంది….

సంజీవని పర్వత సానువుల్లో నిలబడి, మరణాన్ని పిలుస్తున్నట్లుగా ఆనందంగా ఉంది….

మరణం అంటే ఏమిటి ?

ఎవరో అన్నట్లుగా రెండు జన్మల నడుమ నిద్రా?…. నిద్ర…. హాయిగా నిద్ర పడితే ఎంత బాగుంటుంది….

పట్టదు ఎందుకు పడుతుంది ?మనసు ,శరీరము యమయాతన పడుతుంటే మనిషికి ఎక్కడైనా నిద్ర పడుతుందా?

మరి మనిషికి ఎప్పుడు నిద్ర పడుతుంది??

పక్కింటి లక్ష్మీ ఎంత హాయిగా నిద్రపోతున్నట్లుగా ఉంది,, అసలు లక్ష్మి నిజంగా మరణించిందా?    అంతా కలలా ఉంది….

అప్పటిదాకా బాగా మాట్లాడి వెళ్లిన లక్ష్మి అరగంట తర్వాత శవమై కనిపించినప్పుడే కదా జీవితానికీ, మరణానికీ నడుమ వ్యత్యాసం ఒక సన్నని తెర మాత్రమే నని  అర్థమైంది తనకి…….

జీవితమంటే ఏమిటి?

అవును ఈ మంచం మీదే తొలిసారిగా తనకి జీవితమంటే ఏమిటో తెలిసింది.. అప్పటిదాకా నిజంగా తనకి ఏమీ తెలియదు.

జీవితం అంటే రంగురంగుల రమ్యమైన సీతాకోకచిలుక జీవితమంటే అరవిరిసిన పూలతోట, జీవితం అంటే చదువు, స్నేహం, ప్రేమ ,ఆర్తి ఆత్మీయత, కబుర్లు, నవ్వులు…ఆ ఆనందార్ణవం లోనుంచి అలాఅలా ఎగురుకుంటూ, ఎగురుకుంటూ వచ్చి సీతాకోకచిలుక అందంగా ఈ మంచం మీద వాలిపోయింది…..

చాలా కాలం తరువాత తిరిగి చూసుకుంటే దాని రెక్కలు తెగ్గొట్టబడ్డాయి….

అయ్యో ..రెక్కలు విరిగిన సంగతే తెలీనంతా సమ్మగా… మళ్ళీ మళ్ళీ..

అరెరే తను గమనించనే లేదే… అప్పుడెప్పుడో భరించరాని నొప్పేస్తే పోనీలే అని సరిపెట్టుకుంది….. ఒక్కసారేనా తనకి నొప్పి వేసింది ? ఒక్కొక్కసారీ పొన్లెమ్మని సరిపెట్టుకుంది.. అప్పుడే విరిగిపోయి ఉండాలి రెక్కలు….

ఇదంతా తనదే అనుకుంది… అసలు ఎవరూ పరాయి వాళ్ళు లేరు అనుకుంది……..

పరాయి వాళ్ళు ఎవరు? ఒకరిలో ఒకరికి రక్తం కలిసి పోయాక. ఎవరయినా పరాయి వాళ్ళు అవుతారా??….ఎవరూ

అవునూ

రక్తం మనుషుల్ని కలుపుతుందా?

మరి శరీరాలు కలుపుతాయా

మనసు కలుపుతుందా? అభిప్రాయాలో మరి? వాటిని ఎక్కడ పాతి పెడదాం?

వాటిని పాతి పెట్టడమంటే మనషుల్ని పాతి పెట్టడమే కదా… మనసుల్ని పాతిపెట్టడ మంటే మనుషుల్ని పాతి పెట్టడమేనా?  మనుషుల్ని ఎక్కడ పాతి పెడతారు?

మట్టిలోనా?ఆ మట్టెక్కడ …స్మశానం లోనా?..

స్మశానంలో ఒంటరిగా ఉండాలంటే భయమేయదూ? అక్కడ మనుషులు ఉండరు భయం ఎందుకు వేస్తుంది?

వేస్తే గీస్తే ఇంట్లోనే వేయాలి  హహహ హా!

ఈ ఇంట్లో… ఈ ఇల్లు తనెoత కష్టపడి కట్టుకుంది. రెక్కలు ముక్కలు… ముక్కలు ఎప్పుడో గాలికి ఎగిరిపోయాయి. .

ఇల్లు కావాలని తను, వద్దని అతడూ అసలు ఆలోచనలు, అభిప్రాయాలు కలిసింది ఎక్కడ? ఈ వైరుధ్యంలోనే తండ్రిని అడిగి కొంత,. లోన్లతో కొంత  సమకూర్చుకొని కట్టుకుంది ఇల్లు…

మనుషులు ఎందుకు ఇటువంటి పిచ్చి పనులు చేస్తారో అర్థం కాదు… సొంత ఆస్తి ఉండడానికి లేకపోవడానికి నడుము కలిగే సంఘర్షణ గురించి ఆయన ఎవరో ఎంత బాగా చెప్పాడని?

మనం చాలా చదువుకుంటాం.. వర్గాలు తెలుసుకుంటాం వర్ణాలనిగురించి ఆలోచిస్తాం. వైన వైనాలుగా జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం….. అయినా సరే ప్రవర్తన దగ్గరికి వస్తే మనం మామూలు మనుషుల కంటే ఏమంత గొప్ప వాళ్ళం. ?

సొంత ఇల్లు, ఆ ఇంటికి రెండు గేట్లు… ఒకటి మనుషుల కోసం, రెండోది వాహనాలు నడవడానికి….

అన్నీ తెలిసుండి బుద్ధి లేకుండా అందరి మనుషుల్లాగే తనూ కప్పేసుకుంది.

ఇల్లoటే ఇష్టమే మరి…. ఇంట్లోని మనుషులంటేనో …..

మనుషులు మనసులు, మనసులు, మనుషులు  ఈ ఇంట్లో మనుషులు కాదు మొత్తం మాటలే.. మాటలా సూదులు మాటల శూలాలు. .  మనిషికి మనసు ఉంటుoదనేది తెలియని మనుషులు.,..

చెప్పులోని రాయి, చెవిలోని జోరీగా, కాలిలోని ముల్లు, ఇంటిలోని పోరు, గురించి వెర్రి బాగులోడు వేమన్న ఎంత బాగా చెప్పాడని?

పోరు, పోరు ఎక్కడ చూసినా పోరే ఉదయం లేస్తే పాలు ఉన్నాయో లేదో చూసుకుని  కాఫీ కలిపే లోపల ఒక పోరు …గ్యాస్ అయిపోయిందంటే ఒక పోరు. కూరలో ఒకిoత ఉప్పు తక్కువైనా, ఎక్కువైనాకూడా పోరే….

చీకటితో నిద్రలేస్తే పక్కలోకి తక్కువనీ  పోరు, నిద్ర లేవకపోతే కంచంలోకి తక్కువ అని పోరు….

ఇంటికి స్నేహితులు వస్తే వాళ్ళ ముందుకొస్తే ఒక పోరు.. రాకుండా వంటింటి కతుక్కుపోతే మరో పోరు. అంతా వెరసి తను ఉద్యోగస్తురాలు కాదనేది మొదటి పోరు….

ఉదయం పడక మంచం మీద నుండి లేచింది మొదలు, రాత్రి తిరిగి మంచం ఎక్కే వరకూ కూడా పోరాటమే, ఒంటరి పోరాటం, మౌన పోరాటం…

ఛ ..ఛా. …స్వేచ్ఛగా హాయిగా గునుగు నా పరుగులెత్తుతూ తిరిగే కుందేలుకి తనతో పోలిక ఏంటి ?

సిగ్గు సిగ్గు కుందేలు సిగ్గుపడుతోంది. తనని ఆడదానితో పోల్చినందుకు. ఆ మాటకొస్తే ఈగ కూడా సిగ్గుపడే ఎగిరిపోతుంది.

ఎక్కడె గుర్తోంది. . పిచ్చిఈగా తెలిసి తెలిసి శ్లేష్మంలో పడుతోంది… లేకుంటే తన చెల్లి ఈగ ఎలా చిక్కుకుంది ఈ ఊబి లో?  చెల్లి ఈగైనా, అక్క ఈగైనా సరే మగ గాలంలో చిక్కుకొని తీరాల్సిందే…..హా హా…

ఇదే మంచం మీద తన చెల్లెలు డేగ గ్యాలంలో తగులుకుoది….

జీవితం అంటే ఇప్పుడు గుండ్రాళ్ల మీద గలగల పారే సెలయేరు కాదు…. చుట్టూరా వేయినాల్కలు చాస్తున్న జ్వాల.

చెల్లి ఈగ నిజంగానే సుభాషిణి….. భాషణమే భూషణం దానికి… అందంలో ఎవరికి ఎవరూ తీసికట్టు కాకపోయినా అది కెరీర్ ఈగ ….పది రాళ్లు సంపాదిస్తుంది. పదునుగా,అందంగా మాట్లాడుతుంది ప్రస్తుతం మగాడికి కావాల్సింది ఇదే. కెరీర్ ఉమెన్…పెళ్లంటే ఇప్పుడు గణితం కదా…..

మేధావి అయిన భార్య, తన తిరుగుళ్ళనీ తాగుళ్ళనీ…. పరిపూర్ణంగా అర్థం చేసుకుని, ఆరాధించగలిగిన భాగస్వామి…. ఆ మేధావితనం మళ్ళీబయట వాళ్ళకి చూపించుకోవడానికే తప్ప, తన ముందు ప్రదర్శించకూడదు….. కూడదంటే కూడదంతే…..

ఒకవేళ పొరపాటున అప్పటికే కెరీర్ లెస్, విస్డం లెస్, టాలెంట్ లెస్ ఆడదాన్ని భాగస్వామిగా పొంది ఉన్నట్లయితే మరో కెరీర్ వుమన్ ని తన జీవితంలోకి ఆహ్వానించే హక్కు కలిగి ఉంటాడు ఇక్కడ మగాడు….

చట్టాలు చట్టాలు గానే ఉంటాయి… కాగితాల్లో సెక్షన్లు చెక్క భజన చేస్తుoటాయి .

ఒక్కోసారి ఆ వివాహం చట్టబద్ధం కాదు అంటాయి కాగితాలు…

చట్టబద్ధమైతే ఎంత? కాకపోతే ఎంత? 20ఏళ్లుగా వివా(దం)హం కొనసాగుతూనే ఉంది….

అవునూ?…..

ఆడది ఎందుకు రెండో పెళ్లి చేసుకోకూడదు?..

కూడదని ఎవరు చెప్పారు? మగాడే చెప్పి ఉండాలి….. ఇద్దరు మగాళ్లతో కాపురం చేస్తే ఎట్లా ఉంటుంది చ చ అటువంటి అవకాశం ఉండకూడదు….

ఆడదానికి అసలేముంది గనుక ఇక్కడ ఏం లేకపోయినా బతకాల్సిందే ఏం లేకపోయినాఅంటే ఏది లేకపోతే

ప్రేమ లేకపోయినా, ఆప్యాయత లేకపోయినా, మాటల్లేకపోయినా ఆఖరికి మొగుడు దగ్గరికి తీసుకోకపోయినా, ఏ సుఖమూ లేకపోయినా సరే ఇదంతా నా ఖర్మ నా ఖర్మ …నాకు ఇట్లా రాసిపెట్టి ఉంది అని పదేపదే అనుకుంటూ అయినా సరే బతకాల్సిందే… కనీసం చావడానికి కూడా వీలుండదు.. అంతే….

ప్రేమా.?… అది ఎక్కడుంది సమాజంలో, సంపాదన స్థాయిని బట్టి స్త్రీపురుష సంబంధాలు ఉంటాయి ఆ సంబంధాల్ని  బట్టే ప్రేమ నిర్మించబడుతుంది…. మన కుటుంబాల్లో దాని జాడే లేదు ..ఇక్కడ ఏ మొగుడూ పెళ్ళాన్ని ప్రేమించడం లేదు… ఒకవేళ పెళ్ళాం ప్రేమించినా అది భద్రత కోసమో ,లేక సమాజం కోసమో నటన….

నరుడి బతుకు నటన, మొగుడి ప్రేమ నటన, ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన?.. తపన… తపన నటన

ఈ శరీరానికి ఎందుకంత తపనగా ఉంటుంది.. తపన….. తపన అవును మొగుడు ఎందుకు దగ్గరికి తీసుకోడు? దానికి సవాలక్ష కారణాలు చెప్తాడు సమరం….హహ…

అసలు వాత్సాయనుడేం చెప్పాడో తెలియదు గానీ సమరం చెప్పిందే వేదం. ఏం అతడు మాత్రం పెళ్ళానికి సుఖమొద్దన్నాడా?

చెల్లి ఈగ మంచం ఎక్కిన్నాటి నుండి తనే అతడిని క(ప)న్నెత్తి పలకరించలేదు…. ఆ తర్వాత తనకి తాను సరిపెట్టుకుని తపనగా అతడికి దగ్గరవాలని చూస్తే అతడు కన్నెత్తి చూడలేదు…

అసలు తనకి తెలియక అడుగుతుంది కానీ పెళ్ళాన్ని వేధించి రేప్ చేసే మగాళ్ళని గురించి తెగ మాట్లాడుకుంటాము కానీ మొగుడు నుంచి సుఖం లేక మరో మగాడితో పంచుకోవడం ఇష్టం లేకో,అవకాశం లేకో అల్లాడిపోయే ఆడదాన్ని గురించి ఒక్కడూ రాయడేం..?..

ఆడదానికెందుకులే సుఖం మనకుంటే చాల్లే –

శక్తి లేకపోయినా సరే ఓజోమెన్లు వయాగ్రాలు రెడీగా ఉంటాయి.. ఒంట్లో శక్తి లేకపోతే సరే మనసుకు శక్తి లేకపోతే ఏమి మింగించాలి ?

వాడు వద్దనుకుంటే వద్దే వాడి చేత ఏమి మింగిoచలేం..

అంతగా అయితే ఆవిడ ఎవరో అన్నట్టు మనసింకి పోవడానికి తనే మాత్ర వేసేసుకుంటే సరిపోతుంది.

ఎన్ని నిద్రలేని సుదీర్ఘ రాత్రులు ముండ మోసిన దానిలా బతికింది తను అమరాన్ని అడిగి విషం మింగి ఉండాల్సిoది..

అసలు ఈ ఆడముండలకి బొత్తిగా బుద్ధి లేదబ్బా… ప్రపంచంలో మరెక్కడా మగాడే దొరకనట్టు సెకండ్ హ్యాండ్ మగాడిని తగులుకుంటారు ఎందుకో??

ఎంత చదువులు ఉండి ఊళ్లేలుతుంటే మాత్రం ఏం లాభం? ఆడదాని ఆలోచనలు ఆ స్థాయిలోనే ఉంటాయి….

మంచి అందమైన చదువుకున్న ఢిల్లీలో పెద్ద కేడర్ లో ఉన్న వరుణ్ణి మాట్లాడాడు తన తండ్రి ఈ లోపుగా చెల్లిఈగ వీడిని తగులుకుoది….

తండ్రికి తెలియకుండా పెళ్లి కూడా చేసుకుంది …ఎవరి జీవిత మార్గాన్ని ఎవరు మళ్ళించగలరు?

ఈ సెకండ్ హ్యాండ్ మనిషిలో ఏం సుఖం చూసిందో? ఎట్లా పొరపాటు పడిందో మరి?..

మళ్ళీ ఏదైనా గట్టిగా మాట్లాడితే తనకి అసూయ అంటుంది.

అసూయ ఏంటే పిచ్చి మొఖమా నన్ను చేసుకునీ నిన్నూ  చేసుకుని మధ్యన వాడు సుఖపడి పోతున్నాడే అన్ని  విధాలా….హాయిగా నువ్వు డబ్బు సంపాదించి పెడతావు అన్ని ఆడంబరాలకీను,  సోగ్గా అలంకరించుకుని పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్తావు వాడితో కలిసి అక్కడ పనికిమాలిన మేధావులు అందరితోనూ ఆస్ బీస్మంటూ ఇంగ్లీషులో మాట్లాడేస్తావు ఇంకా వీలైతే అతడి పై ఆఫీసర్ తో చనువుగా మెసులుకుని ఓ ప్రమోషన్ సంపాదించి పెట్టగలవు ….

ఇకపోతే నేను ఇంట్లోనే ఉండి హాయిగా ఇల్లంతా సర్డి పెడతాను…. ఒక చిన్న వస్తువు అయినా బయటికి పోకుండా కాపలా కాస్తాను…

మీరు వచ్చేసరికి కమ్మగా వండి  పెడతాను… నువ్వు బయట నేను ఇంట్లో హాయిగా కూర్చోబెట్టి మేపుతున్నామే వాడిని అంటే అర్థం కాదేమే నీకు?

ముందు నువ్వు అసూయలో పడి కొట్టుకుపోతూ నన్ను అర్థం చేసుకోకపోతే నేనేం చేయను??

నువ్వా అవకాశం ఇవ్వబట్టే కదా మనిద్దరినీ కీలుబొమ్మలని చేసి ఆడించాడు ….

కీలు బొమ్మ..,ఫీల్ బొమ్మ ..

మూగ బొమ్మ ,ఆట బొమ్మ ఒక బొమ్మకి ఏ కీలు కా కీలు ఊడగొట్టేసాడు.. ఊపిరి మాత్రం ఎక్కడో కాస్త ఆడుతోంది ….

అది కూడా రేపో మాపో ఆగిపోతుంది ఆగి పోవాల్సిందే అంతే …

అన్ని సినిమాల్లోనూ అదే కదా చూపెడతారు… చిన్నదో,పెద్దదో

ఏదో ఒకటి అంత మవాల్సిందే …అదే ఎండింగ్… ఇద్దరు పెళ్ళాలతో చివరిదాకా త్రిల్లింగ్ గా సుఖంగా ఎంజాయింగ్ గా చూపించేసి చివరాఖరికి మాత్రం ఒకదాన్ని లేపేస్తాడు… లేదా దూరంగా పంపించేస్తాడు.. చీ

అసలు ఎందుకు  హీరోని లేపేస్తే పోలా?

అట్ట చేస్తే సినిమా ఉండదు…..

ఏం సినిమాలో, ఎత్తు భారాలో అర్థమే కావడం లేదు …

“నారీ నారీ నడుమ మురారి” “ఏమండీ ఆవిడ వచ్చింది”

“ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం” .

” ఆవిడే మా ఆవిడ”

అబ్బబ్బ ఇద్దరు హీరోయిన్ల సినిమాలు చూసి చూసి అదే ఇప్పటి సంస్కృతి అన్నట్లుగా మారిపోయింది…

యువతరం ఇదే సంస్కృతి అన్నట్టుగాఆ సంస్కృతిలోనే కొట్టుకుపోతోoది….

చిన్నాన్న కూతురు వసుమతి ముందే పెళ్ళాం ఉన్న మగాడ్ని తెలిసో తెలియకో ప్రేమించేసింది….. వాడిని పెళ్లి చేసుకోమని అడిగితే నాకు పెళ్లయింది కావాలంటే నిన్ను ఉంచుకుంటాను అన్నాడట….

ఆ రాత్రి కిరసనాయిలు డబ్బా ఖాళీ చేసేసింది….

అబ్బా చావాలనుకుంటే మరో మార్గమే లేదా? అంత దారుణంగా మంటల్లో మండి చావాలా?  అబ్సర్డ్….

ఏం వాడికి రెండో పెళ్ళాం గా పడుండకపోతే హాయిగా వేరే వాడిని పెళ్లాడకూడదూ…

ఊహూ వాడే కావాలి వాడు వద్దంటే మరణమే శరణ్యం …రెండో చేయి మనుషులు రెండో చేయి మనుషులని చా….

అరెరే ఎప్పటెప్పటివో సంఘటనలు ఇంత స్పష్టంగా జ్ఞాపకానికి వస్తున్నాయి ఏమిటి?

తనకి బాగైపోయిందా?

నెల రోజులుగా హాస్పిటల్ లో పడి ఉండి ఇంటికి వెళ్తే నైనా గాలి మార్పు వస్తుందని వచ్చేస్తే అయ్యో ఈ మంచం మీదికి వచ్చాక కొంత తేలిగ్గా ఉందేమిటి ?

గాలి మారిపోయిందా అంటే తను చచ్చిపోదా? ఊపిరి ఆగదా?

అయ్యో జీవితపు పాటలన్నిoటి నీ సమాధిలో దాచు ఉంచుకున్నానే….

ఇప్పుడెలా?

సమాధి వరకూ ఎవరైనా చేయి పట్టి నడిపిస్తే బాగుండు .. అక్కడ అమ్మ ఉంది. తనని ఒడిలో దాచుకుంటుంది. అమ్మంటే అదే కదా, అమ్మ రుణము ఎలా తీర్చుకోవాలి?

రుణం తీర్చుకోవాలంటే అమ్మకి పుట్టాలట అమ్మ తన కడుపులో పుట్టిందా?

షర్మిల కడుపులో పుట్టింది.

షమ్మి…. షమీ… వస్తావా? నేను వెళ్లే లోపు

వస్తావా తల్లీ

“మమ్మీ మమ్మీ నేను నీ పక్కనే ఉన్నాను అమ్మా” చెబుతున్నారు ఎవరో వీణ లాంటి గొంతుతో …

“అమ్మా నీకు ఏమీ అవ్వదమ్మా

నేను నిన్ను నాతో పాటు అమెరికా తీసుకెళ్తాను… అక్కడ పెద్ద డాక్టర్లకి చూపిస్తానమ్మ” వెక్కుతోంది షర్మిల…

షమ్మీ.. నాకేమీ లేదని నువ్వు చెప్తే మాత్రం డాక్టర్లు కీమో తెరపి గురించి మాట్లాడుకోవడం నేను వినలేదు అనుకున్నావా? నాకు కూడా కొంచెం కొంచెం తెలిసే తల్లి అనుకుంటూ అడిగినట్టు ఉంది తను..

నివీ. నివి బుజ్జి రా ఆమమ్మ పిలుస్తోంది చూడు” అంటున్నారు ఎవరో

మ్మీ.. అమ్మీ బుజ్జి గొంతు అబ్బ ఎంత హాయిగా ఉంది.. వదిలి ఎలా వెళ్లాలి?

ఏడుస్తున్నారు ఎవరు? ఎవరో కాదు అంతా ఏడుస్తున్నారు….

“అక్క ఎట్లా ఉంది అక్కా” చెల్లి ఈగ వెక్కిళ్లు…

అరెరే ఒకవైపు దిగులు,ఏడుపుతో పాటు చెప్పలేనంత నవ్వొచ్చేస్తోంది ఏమిటి? నవ్వు అహహ నవ్వు ఎవరో చక్కిలిగింతలు పెట్టినట్టుగా…నవ్వు.

మనుషులు జీవించి ఉన్నప్పుడు చూపించుకోలేని ప్రేమాభిమానాలు ఆత్మీయత, బంధాలు, చనిపోయేక ఫోటోలు పెట్టి పూజిస్తే మాత్రమే ఏం లాభం?

అన్నీ తెలిసి ఎందుకిలా అజ్ఞానంలో పడుతున్నారు మనుషులు…

అజ్ఞానం అంటే ఏమిటి జ్ఞానం లేకపోవడమా?… ఎరుక లేకపోవడం జీవితాన్ని గురించి, ప్రకృతిని గురించి, పరిణామాన్ని గురించి, ఈ సమాజంలో మనుషుల గురించి, వాళ్లు మగైనా ఆడైనా సరే అసలు మనిషికి తన గురించి తనకు ఎరుక లేకపోవడం…..

ఆ ఎరుక అనేది ఏర్పడ్డాక అంతా పేలవంగా ఉంటుంది… కన్నీళ్లు …

ఏ పొరపోచ్చాలూ లేనట్టుగానే పైకి ఎంతో గంభీరంగా ముసుగులు వేసుకుని, ఈ జీవితం ఇంతేనని నమ్మబలుక్కుంటూ గడిపేసింది కదా ఇప్పుడు ఎందుకు ఈ బాధ..కన్నీళ్లు?

ఈ ఆలోచనలు ?

తెలివి చావు తెలివి అని  ఇట్లా చేసి ఉంటే బావుండునని అట్లా ప్రవర్తించి ఉండాల్సిందే అనుకుంటూ ఒక

అపరాధ భావం తో చర్విత చరణం చేసుకుంటూ ఈ సంధ్యా సమయాన..

“జయమ్మా… జయమ్మ ఎట్లుంది రా” అత్తమ్మ పలకరిస్తోంది దయగా. ఆవిడ గొంతులో ఎంతో జాలి,, ప్రేమ, ఆర్తి, దిగులు…

పాపం ఆవిడా అంతే తనకు పిల్లలు పుట్టలేదని గొప్ప త్యాగశీలిగా గొప్పకు పోయి తన చెల్లెల్ని తెచ్చి మొగుడికి ఇచ్చి చేసిందంట. అటు పెళ్లి చేసీ చేయగానే ఈవిడకి  నెల తప్పిందట …పుట్టింటికి పంపేసి రెండో పెళ్ళాంతో మామగారు ఎంజాఇంగు….

ఆవిడ ఆరు నెలలు, ఈవిడ ఆరు నెలలు, అలా వంతుల కాపురం…. ఛీ అసహ్యం వెయ్యలేదేమో

“జయమ్మ తల్లి మాట్లాడరా” అత్తమ్మ

మెల్లిగా కళ్ళు తెరిచింది తను. నేను వెళ్ళిపోతున్నాను అత్తమ్మ అని కష్టంగా అన్నట్టుంది…..

“ఛ చ అట్లా అనకూడదమ్మా.. నా తల్లివి కదూ.. నీకు బాగుంటుంది రా. ఆరోగ్యంగా ఉంటావు.. ఇదిగో నీ ఫ్రెండ్ వచ్చింది చూడు శమంత చాలాసేపటి నుండి కాచుక్కూర్చుంది.”.

“జయా..జయా మై డియర్” పిలుస్తున్నది శమంత తన చెవి దగ్గరికి వెళ్లి. పీల గొంతుతో.. బలవంతంగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది తను విడివడ్డం లేదు…. తెరుస్తుంటే మళ్ళీ మూతలు పడిపోతున్నాయి అబ్బా ఒక్కసారి తెరవాలి శమంత వచ్చింది…

ప్రాణం తన ప్రాణం కష్టంలోనూ సుఖంలోనూ తన హృదయమై స్పందించిన శమంత.

ప్రాణమా ..ఏమైపోయావే  ఇన్నాళ్లు ?

ఆ ప్రైవేటు కాలేజీకి, ఇంటి చాకిరికి అంకితమైపోయి, చేసి చేసీ కండలు కరగబెట్టుకునే క్రమంలో ఈ స్నేహితురాలు గుర్తు రాలేదా నీకు? వచ్చే ఉంటుంది లే ..

అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తోందని బహుశా తెలిసి ఉండదు నీకు…..

శమంత పెదవులు కదిలాయి నిశ్శబ్దంగా వెక్కిళ్లు పెడుతున్న చప్పుడు….

శమంతా…తా… ఎందుకమ్మా ఏడుస్తున్నావు?

మాట్లాడినట్టే ఉంది తను.. మరి దానికి వినిపించిందో లేదో?

శమంత బాల్యం… దాని బాల్యం మంచు ముద్దల నడుమ ఎంత దారుణంగా గడిచిందో తనకి బాగానే గుర్తు …దాని తల్లి అతనికి రెండో భార్య మొదట్లో భార్యా పిల్లలు, శమంత, దాని తల్లి అంతా కలిసి ఉండేవాళ్ళు….

ఇంట్లో వాళ్ళ డామినేషన్ చాలా ఎక్కువగా ఉండేది.. తండ్రి ఒడిలో కూర్చోవాలన్నా శమంత జంకేది….సాధ్యమైనంత వరకు స్కూల్లోనూ ట్యూషన్ లోను తనతోనే ఎక్కువ భాగం బయటే గడిపేది…. ఎన్నోసార్లు నాన్నే తనతో పాటే శమంత క్కూడా ఫీజులు కట్టేవారు… తర్వాత దాని తండ్రి పోయినప్పుడు నిర్దాక్షిణ్యంగా తల్లీకూతుళ్ళని ఇద్దరినీ నడిరోడ్డు మీదికి విసిరే సారు వాళ్ళు..

ఛ చ ఇద్దరు ఆడవాళ్ళకి సమానంగా జీవితాన్ని, ప్రేమని ,పంచుతామంటూ భుజాలు ఎగురవేసే మగాళ్ళని నడిరోడ్డులో నిలబెట్టి కాల్చిపారేయాలి…

ఈ సెకండ్ హ్యాండ్ మనిషి మాకొద్దు అంటూ ఆడవాళ్లు బహిష్కరించేయాలి….

“జయా జయా” అబ్బ ఆ పిలుపుతో పేగు కదిలింది…

“ఎట్లా ఉంది”  కరకర చప్పుడు అవుతోంది..  ఎన్నో యుగాల తరువాత వినిపించిందా గొంతు…

జీవముండి తను తిరుగుతున్నంత కాలం అవసరం లేకుండా పోయింది… ఇప్పుడు ఈ మనిషి లేకుండా పోతోoదని తెలిసి ఎంత ప్రేమ, ఎంత ఆత్మీయత….

అంతా నటన.. నరుడి బతుకు నటన

“జయా”… తనకెందుకో కళ్ళు తెరవాలి అనిపించలేదు. జీవిత పర్యంతం నువ్వు చూపిన నిర్లక్ష్యము నా హృదయకవాటాల నిండా పేరుకుపోయి, అదేదో అటాక్ అన్నారు స్ట్రోక్ అన్నారు… ఇప్పుడు తీరా క్యాన్సర్ అంటున్నారు.. ఆ నిర్లక్ష్యాన్ని అంతా తట్టుకోవడం కోసం మరణాన్ని మందు అడుగుతున్న దానిలా పడి ఉన్నా ఈ మంచం మీద

అతడికేమి వినిపించినట్టు లేదు

“జయాఎట్లా ఉంది” అనంతమైన జాలి ఆ గొంతులో

ఒక్కసారి, చివరిసారిగా కళ్ళు తెరిచి అతడి కేసి చూసింది తను…

అతడి

కళ్ళ నిండా నీళ్లు…

వద్దు వద్దు ఇక జన్మజన్మలకి ఏ జన్మలోనూ మొగుడిగా నువ్వు నాకొద్దు. నిజ్జంగా చెబుతున్నాను.. జీవిత పర్యంతపు నా సేవకి ఫలితంగా నువ్వు నాకేదైనా ఇవ్వదలుచుకుంటే నా చివరి కోరిక ఏమిటి అని ప్రశ్నిస్తే నేను నిన్ను ఒకే ఒక్కటి అడుగుతాను..

వచ్చే జన్మలోనే కాదు ఇక ఏ జన్మలోనూ ఇద్దరు ఆడవాళ్లకు జీవితాన్ని ,ప్రేమని ,హృదయాన్ని, పంచకు.

అతడు బాగా పరిశీలించగలిగితే, నా కళ్ళల్లో ఈ భావాలు పట్టుకోగలిగి ఉండేవాడు…

తనకేదో అవుతోంది.. ఒళ్లంతా బరువుగా,… కాస్త తేలిగ్గా ఎక్కిళ్ళు వస్తూపోతూ, గాలిలో తేలుతున్నట్టుగా…నా కళ్ళు మూతలు పడనే లేదు…

అలాగే నిశ్చలంగా నిలిచిపోయాయి అతని సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్టుగా….

*

ప్రతిమ

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ప్రతిమ గారు,
    మీకు నచ్చిన మీ కథ గురించి ఆద్యంతం చదివాక ” ఏ జన్మలోనూ ఇద్దరి ఆడవాళ్ళ్కు ప్రేమనీ, జీవితాన్నీఎ పంచకు ” అన్న వాక్యం ఆయువు పట్టుగా నిలిచింది. కాన్సెప్ట్ … వివరణ ఎన్ని సార్లు చదివినా … ఇప్పటికీ , ఈ కాలానికీ మారలేదు ….మారదు …🙏🏼🙏🏼
    డా .లక్ష్మీ రాఘవ

  • ప్రతిమ గారు, ఎంత బాధాకరమయిన నిజం రసేరండీ. ఈ దేశం లొ స్త్రి గురించి వారికి మంచి జరహగాలంటే అది జరిగే పనేనా. ఘనత వహించిన సుప్రిం కొర్ట్ మగుడుకి లైంగిక హక్కు ఉందని చెప్పాకా ఇక్కడ ఎవరు స్త్రీ గురించి బాధ పడతారండీ.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు