లౌకికవాది, హర్యానాలో వ్రేళ్ళూనికునివున్న కులవ్యవస్థని వ్యతిరేకించి కులాంతర వివాహాల్ని ప్రోత్సహించిన సామాజిక కార్యకర్త. ఎమర్జెన్సీ కాలంలో ఏడాదిపాటు జైలుగోడల మధ్య బందీ. ప్రొఫెసర్ మహవీర్ నార్వాల్. కోవిడ్ బారినపడ్డ ఆయన 2021 మే ఎనిమిదిన కన్నుమూశారు. ఆయన కూతురే పింజ్రా టోడ్ ఏక్టివిస్ట్ నతాషా నార్వాల్.
2020 ఫిబ్రవరిలో ఈశాన్య దిల్లీలో చెలరేగిన అల్లర్లకు వ్యూహం పన్నిన కుట్రదారు అనే నేరారోపణ వలన గతేడాది నుంచి తిహారీ జైలులో బందీగా వున్న నతాషా తన తండ్రిని కడసారి సజీవంగా చూసుకోవాలని చేసుకున్న అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఆమె సోదరుడు కూడా కోవిడ్ వ్యాధిగ్రస్థుడై వున్నందున, తన తండ్రి అంత్యక్రియలు నెరపడానికి అనుమతిస్తున్నామంటూ న్యాయస్థానం మహవీర్ మరణానంతరం ఆమెకు బెయిలు మంజూరు చేసింది.
ప్రసిద్ధ పాత్రికేయుడు, సాహితీవేత్త స్వరాజ్ బిర్ ఆ క్షణాన్నే పంజాబీలో రాసిన కవిత ఇంగ్లీషు Kind Judge Sahib కు ‘ఆర్తికవి‘ బైరెడ్డి కృష్ణారెడ్డి వెనువెంటనే చేసిన తెలుగు అనువాదం. ఈ అనువాదానికి ప్రేరణనిచ్చిన సతీశ్ బైరెడ్డికి కృతజ్ఙతలతో…
దయామయ న్యాయమూర్తిగారూ
మహావీర్ నార్వాల్ చచ్చిపోయిండు
దయామయ న్యాయమూర్తిగారూ
నతాషా కన్నతండ్రి చచ్చిపోయిండు
తనకు ఈ భూమ్మీద నూకలు వొడిసినై
దయామయ న్యాయమూర్తిగారూ
నిన్ననే కద ఆ కన్నబిడ్డ
మీ న్యాయ అస్థానాన్ని ఆశ్రయించింది
తనమీద నింద ఆరోపించవద్దని అడిగెనా
తను నిరపరాధినని ప్రకటించమని కోరెనా
ఆ బిడ్డ తరఫున వకీలు చేసిన
ఒక్కగానొక్క అభ్యర్థన
ఆ బిడ్డ ఆ కన్నతండ్రిని
రొండంటె రొండు ఘడియలు
కడసారి చూసుకుంటనన్నదని
చావుకు కాళ్ళు చాచినడు కద
చివరి చూపుగ ఒక్కసారి
ఆఖరి సారిగ పలకరించుకుంటనన్నదని
అమ్మ పోయిననాడు
పట్టుమని పదమూడేండ్ల పసిప్రాయం
కన్నతండ్రే కన్నతల్లై సాకినడు
ఆ పసిప్రాయానికి నీడనిచ్చిన చెట్టైనడు
అయ్యా!
దయామయ న్యాయమూర్తిగారూ
దిల్లీ హింసాకాండతో ఆమెకు
ఏ సంబంధమూ లేదనే
గీమాత్రం నిజం తమరికి
తెలియని విషయమా
మానవాళికి బిగుసుకున్న పంజరాన్ని
తెగనాడాలనుకున్నది ఆ బిడ్డ
అంతమాత్రమే
అంతమాత్రానికే
రాజ్యమనే పంజరం ఊచలెనుక
ఆమెను బంధించినరు
దయామయ న్యాయమూర్తిగారూ
తమరు అపార అధికార సంపన్నులు
ఉన్నతోన్నత న్యాయాధిపీఠ అధిష్ఠితులు
చావుకు కాళ్ళుచాచిన కన్నతండ్రిని
రొండంటె రొండు ఘడియలు
చివరి చూపుగ ఒక్కసారి
కడసారి చూసుకుంటనన్నది
ఆఖరిసారిగ పలకరించుకుంటనన్నది
అనుమతి ఇయ్యగలిగే వారే తమరు
ఇయ్యకపోతిరి
దయామయ న్యాయమూర్తిగారూ
ఆ అమాయకపు బిడ్డను
ఇంకెన్నినాళ్ళైనా
మీ జైలుగోడల మధ్య బంధించవొచ్చు
జీవితఖైదను శిక్ష వెయ్యనూవొచ్చు
దయామయ న్యాయమూర్తిగారూ
తమరి వొంటిమీది నల్లకోటుకు
అనన్య అధికారాలు కదా
తమరు న్యాయం చేకూర్చగల సమర్థులు
దయామయ న్యాధికారి గారూ
తలుచుకోవాలే కాని
తమరు చేయలేనిది లేదు
ఐనా రొండంటె రొండు ఘడియలు
చివరి చూపుగ ఒక్కసారి
కడసారి చూసుకుంటనన్నది
ఆఖరిసారిగ పలకరించుకుంటనన్నది
అనుమతి ఇయ్యగలిగే వారే తమరు
ఇయ్యకపోతిరి
ఆ రొండు ఘడియలు ఇయ్యరైతిరి
దయామయ న్యాయమూర్తిగారూ
రొండంటె రొండు
ఆ రొండు ఘడియలు ఇయ్యడానికి
తమరికి మనసొప్పదాయె
మనసులేకపాయె
దయామయ న్యాయాధిపతిగారూ
న్యాయం మీ చేతిల ఉన్నది
అధికారం మీ చేతిల వున్నది
ఆ రొండు ఘడియలు ఇయ్యరైతిరి
దయామయ న్యాయమూర్తిగారూ
తమరు ఉద్ఘాటించినరు కదా
వొచ్చే సోమవారం నాడు
ఆయన ఆత్మశాంతికి ప్రార్థిస్తానని
దయామయ న్యాయమూర్తిగారూ
ఆ సోమవారం రాదసలు
ఆ సోమవారం
క్యాలెండరునుంచి జారిపోయింది
ఆ సోమవారం తిరిగి రాదసలు
తిరిగి రానేరాదసలు
దయామయ న్యాయమూర్తిగారూ
తమరు ఇక తమ జీవితకాలమంతా
ఆ సోమవారం కోసం
దేవులాడుకుంటూ బతకవలె.
*
కవిత అనువాదం లాగా లేదు, కవి గుండెల్లోంచి ఉబికిన రోదన లా ఉంది. ‘ఆర్తి కవి’ కి మనసారా అభినందనలు
good morning babu gaaru. thank you.