ఇసురుగాలికి ఈదిలోబడింది
దట్టెం మీంచి ఒక తునక.
మిగిలినదాన్ని పోనూక్కుంటే
పొగిలే ఆకల్ని పొణుకోబెట్టేదెట్టా!?
సౌకగా దొరికినాక
లౌక్కెంగా దాపెట్టుకోకపోతే
రేపుటికి బువ్వెట్టా!?
సూరుకింది నుంచి
తునకలదండెం పరమటగాలికి
కమ్మటి నీసోసన అద్దతాఉంది.
ఇయాళ సరే
రేపుటికి ఉండాలగదా?
దాపుడుసొక్కా పెట్టినట్టు
మిగిలిపోయిన కువ్వల్ని
తునకలుగా ఎండగట్టి దాపెట్టుకోవాల.
తెల్లార్తాకి ఇంకా టయముండంగనే
మొదులవుద్దిగదా కడుపాకలి?
పలుగు, పార, తట్ట, సేతుల్లోకి రావాల
యాడాడ మేటేసిన మట్టీ
అయ్గోరి టాట్టర్లోకి ఎక్కాల,
మరి కడుపు సేతుల్లో పెట్టకతిరిగే జనానికి
కడుపాకలి సాజ్జం గాదూ!?
ఐనా బువ్వ
పని సేతుల్లోకి ఏనాటికి పువ్వైతదీ!?
రేపేందిమా!? అని దేవుళ్ళాడకుండా
ఏనాటికి సీకటి పడిద్దీ!?
ఒరేయ్ కడపటోడా
నువ్ బాగా సదవరా పోరగా
ఆ సూపుడేలు సూపిచ్చేదారి నువ్వు కనిపెట్టాల.
ఈ కాల్నీ బోడ్డు పెరికిపార్దెంగి
ఊర్ని ఊళ్లోకలపాల.
సెరువుకట్టకాడి రెండురేవుల్ని కలిపి
అలుగ్గొట్టాల
మన బండలసేలల్లోగూడ
బువ్వపండాల.
దట్టెం మీన ఆరేసిన తునకలు
పలకలమింద సిర్రా సిటికెన పుల్లలుగావాల.
అద్దీ కత..
(సాజ్జెం : సహజం, దేవుళ్లాట: వెతుకులాట, అలగ్గొట్టాల: గండి కొట్టాల)
*
యాసలో భావం పటిష్టం
ధన్యవాదాలు సర్.
చాలా బావుంది రవిగారూ
ధన్యవాదాలు మనోజగారూ.
భాష ప్రాణం పోసింది.అద్దీ కత.
ధన్యవాదాలు మిత్రమా