ఒక రచయిత కి శత జయంతి జరుపుకోవటం అంటే ఏమిటి? కేవలం ఒక మీటింగ్, ఒక సదస్సు, ఒక పుస్తకం విడుదల ఇవి కొన్ని ఉదాహరణలా? లేక కొన్ని చెరిపేయలేని గుర్తులా?
అభ్యుదయ కవి, రచయిత, అనువాదకుడు, జర్నలిస్ట్.. ఇంకా అనేక విశేషణాలు పేరుకు ముందు వచ్చే బహు కొద్ది మంది అలనాటి రచయితలలో రెంటాల గోపాలకృష్ణ ఒకరు.
అవును, రెంటాల గోపాలకృష్ణ మా నాన్న గారు. ఈ వ్యాసం నేను ఆయన కుమార్తె గా కాకుండా ఆబ్జెక్టివ్ గా ఒక రచయిత గా నా కళ్ళతో చూసినది, నాకు తెలిసినవి, తెలుసుకున్నవి, నా చిన్న తనం నుంచి నేను పరిశీలించిన వాటి ఆధారంగా ఒక రచయిత వందేళ్ల జీవిత కాలాన్ని రాఅక్షరబద్ధం చేసే ప్రయత్నం చేస్తాను. క్షీర నీర న్యాయం అనేది ఒకటున్నది కదా. అది ఇక్కడ అప్లై చేసుకోండి. నచ్చితే ఒప్పుకోండి. నచ్చకపోతే పక్కన పెట్టేయండి. చనిపోయిన వ్యక్తి జీవితం గురించి అది కూడా సాహిత్య జీవితం గురించి రాయటం లో ఏదో పెద్ద ఉపయోగం ఉంటుందో లేదో తెలియదు కానీ పది దశాబల సాహిత్య చరిత్ర లో ఒక రచయిత స్థానం ఎక్కడ ఉంటుంది అన్న ఆలోచన కి ఈ వ్యాసాలు ఒక కొనసాగింపు. చూద్దాము, ఈ అక్షర ప్రయాణం ఎటు దారి తీస్తుందో?
ఒక తండ్రి గానే కాకుండా, ఒక రచయిత గా కూడా మా నాన్న తరచూ గుర్తు వస్తూనే ఉంటారు. కారణం ఇప్పటి సాహిత్య వాతావరణం. మా నాన్న గారు పుట్టిన తరం లో , లేదా ఆయన ఒక సాహిత్యవేత్త గా ఎదిగిన క్రమం లో ఉన్న సాహిత్య వాతావరణం .. ఇప్పటి సాహిత్య వాతావరణం రెండింటికీ ఉన్న మార్పు గురించిన నా ఆలోచనలను ఈ శత జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని వరుస గా పంచుకోవాలనిపించింది.
ఇది నాన్న రెంటాల జీవిత చరిత్రే. కానీ నేను లేని కాలానికి, నాన్న ను పొదువుకున్న కాలానికి నేను ముందు వెనకలుగా వెళ్ళి వస్తూ రాసే ప్రయత్నం చేస్తున్నాను. ఇది రెండు రకాలుగా కొత్త ప్రయోగం. ఒకటి నేను రాస్తున్నవి కేవలం మా నాన్న జ్ఞాపకాలే కాదు. లేదా ఆయన అనుభవాలే కాదు. వాటినుంచి ఆ కాలాన్ని, ఆ సాహిత్య వాతావరణాన్ని అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇందుకు పరిశోధన, పరిశ్రమ రెండూ అవసరం. చేయగలను అన్న విశ్వాసం, చేయాలన్న ఆకాంక్ష రెండూ ఈ మొదటి వ్యాసానికి అంకురార్పరణ చేశాయి.
కృష్ణాష్టమి జన్మదినం
రెంటాల గోపాలకృష్ణ ఒక కృష్ణాష్టమి నాడు అష్టమ సంతానంగా గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా లోని రెంటాల గ్రామం లో పుట్టారు. ఊరి పేరే ఇంటి పేరు. నందవరీక వంశం వారిది. ఆ గ్రామం లో బ్రాహ్మణ కుటుంబాలు బహు స్వల్పం. గోపాలకృష్ణ తండ్రి గారు వాళ్ళు ఏడుగురు అన్నదమ్ములు. అందరి ఇళ్ళు వరుసగా ఉండేవట. ఇప్పుడు ఆ ఊర్లో ఈ కుటుంబానికి చెందిన వారెవ్వరూ లేరు. ఆ ఊరి పేరు ని నిలబెట్టిన ఒక గొప్ప రచయిత ఆ ఊర్లో పుట్టాడని ఎవరికైనా తెలుసో లేదో?
పలనాటి సీమ లో పౌరుషం పంచుకొని పుట్టారో లేదో కానీ ఒక చేత్తో ప్రతిభ, పాండిత్యాలు, మరో చేత్తో పరువు, పేదరికం పట్టుకొని గోపాలకృష్ణ , పల్నాడు, మాచర్ల, గురజాల ను దాటుకొని నరసరావు పేట కు వచ్చి మునిసిపల్ ఉన్నత పాఠశాల లో స్కూలు ఫైనల్ దాకా చదువుకున్నారు.
అక్కడే పరిచయమయ్యారు బెల్లంకొండ రామదాసు,ఏల్చూరి సుబ్రహ్మణ్యం, అనిశెట్టి సుబ్బారావు. వీరి నలుగురిది ఒక కూటమి. ఒక సంఘం. అందరిదీ ఒకే బాట. ఒకరికొకరు తోడూనీడా. వీరిలో ఏల్చూరి, రెంటాల కు సీనియర్. కులపతి లాగా మెలిగేవారు. “ మా ఏసు గాంధీ లాంటి వాడు” అని ఎప్పుడు ఏల్చూరి ని గుర్తు చేస్తుకున్నా రెంటాల కళ్ళల్లో నీళ్ళు కదిలేవి. ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ.వీరితో పాటు కుందుర్తి ఆంజనేయులు, గంగినేని వేంకటేశ్వర రావు,తదితరులు కూడా ఉన్నారు. కుందుర్తి , రెంటాల కు జూనియర్.
అవని రెంటాల పురధామ
స్కూలు ఫైనల్ లో ఉండగానే ఒక రోజు అనిసెట్టి సుబ్బారావు, గాంధీజీ ప్రభావం తో, “ ఊరక ఇంటి లోన పడి ఉండక, వేగమే లెమ్ము ఆంధ్రుడా “ అనే పద్య పాదం వ్రాసి రెంటాల ని మిగతా పాదాలు పూరించమని అడిగాడట. అది ఉత్పలమాల చివరి పాదం. ఓ నాలుగు రోజులు కసరత్తు చేసి రెంటాల ఇలా పూరించారట.
భారతభూమికిన్ మనకు పట్టము
గట్ట ఏతెంచియున్న యా
ధీరుడు గాంధీజీ కడు విధేయుడు
దేవుని దూత వోలె తా
భారం బూని భారతి కి బాధలు
మాన్పగ ఏగు దెంచే నీ
ఊరక ఇంటి లోన పడి యుండక
వేగమె లెమ్ము ఆంధ్రుడా”
రెంటాల కి పద్య సాహిత్యం మీద మక్కువ ఎక్కువ. ఛందస్సు ని క్షుణ్ణం గా అభ్యసించి అనేక సీస పద్యాలను, శతకాలను రాశారు. వాళ్ళ ఊరి దేవుడు భీమేశ్వర స్వామి పేరున “ అవని రెంటాల పురధామ అఘవిరామ భీమలింగేశ్వర పార్వతీ భామ వరద” మకుటం తో పాతిక సీస పద్యాలు రాశారు.
రిస్ట్ వాచీ అమ్మి నవల ప్రచురణ
సరిగ్గా పదహారేళ్ల నవ యవ్వన యువకుడిగా “ రాజ్యశ్రీ” చారిత్రక నవల రాసి పెద్దల చేత శెభాష్ అనిపించుకున్నారు. వెంకట పార్వతీశ్వర కవుల నవలలు చదివి, వారి శైలి లో నవలలు రాయలాని ఉబలాట పడ్డారు రెంటాల. గురువు నాయని సుబ్బారావు గారి “ హిందూ దేశ చరిత్ర” లో రాజ్యవర్ధనుడి సోదరి “ రాజ్యశ్రీ” ప్రస్తావన ఉంది. అది రెంటాల ను ఆకట్టుకుంది. రాజ్యశ్రీ చారిత్రక నవలను రాశారు. చరిత్ర అధ్యాపకుడు, ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మారేమండ రామారావు గారి దృష్టి కి ఈ నవల వెళ్ళింది. రెంటాల లోని సృజనాత్మకత ను, ఉత్సాహాన్ని, అన్నింటికీ మించి ఆయన లోని పాండిత్యాన్ని గుర్తించారు మారేమండ. రాజ్యశ్రీ 1936 లో రచిస్తే 1939 దాకా ప్రచురించుకోలేకపోయారు, ఎందుకు? డబ్బు లేక.
నవల ప్రచురించటానికి స్నేహితులంతా కలిసి డబ్బు పోగు చేసి ఇచ్చారు.స్కూలు ఫైనల్ విద్యార్ధులు ఆ రోజుల్లో ఎంత సంపాదించగలరు? ఎలా సంపాదించగలరు? ఎలా పొదుపు చేయగలరు? కానీ స్నేహితుడి నవల మీద సహచరులకు ఉన్న ప్రేమ అది . సహోదరులుగా మిగిలిన సన్నిహిత మిత్రులు బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, అనిశెట్టి సుబ్బారావు, తదితరులు కలిసి డబ్బు పోగు చేశారు. రెంటాల కు అప్పుడే కొత్తగా పెళ్లి అయింది. అత్తగారు అంటు మామిడి తోట ఇవ్వలేదు కానీ ర్యాలీ సైకిల్,వెస్ట్ అండ్ కంపెనీ రెక్టాంగులర్ షేప్ లోని రిస్ట్ వాచీ కొని పెట్టారు. సైకిల్ అమ్మితే కాలేజీ కి వెళ్ళటం కష్టం కాబట్టి రిస్ట్ వాచీ 15 రూపాయలకు అమ్మేశారు. స్నేహితులు 20 రూపాయలు పోగు చేసి ఇచ్చారు. 35 రూపాయలతో గుంటూరు వేంకటేశ్వర ప్రెస్ లో 500 కాపీలు రాజ్యశ్రీ నవల అచ్చయింది. నవల వెల 8 అణాలు. పుస్తకాలు మిత్రులకు పంచి పెట్టాక పుస్తకాల షాపుల వాళ్ళకు ఒక్కో పుస్తకం రెండు అణాల చొప్పున అమ్మేశారు. ఆ పుస్తకం లో రెంటాల టైటిల్ పేరు తో పాటు “ స్కూలు ఫైనల్ విద్యార్ధి “ అని కూడా అచ్చు వేయించుకున్నారు. రెంటాల ఈ నవల లో పార్వతీశ్వర కవుల వచన రీతిని అనుకరించారు. రాజ్యశ్రీ నవల గ్రాంధిక రీతి లో సాగుతుంది. “ చదువరీ, !నీకోక మనోహర దృశ్యంబు చూపెదను “ అంటూ మొదలవుతుంది నవల.
శ్రీశ్రీ అడుగుజాడల్లో..
అదే సందర్భం లో రెంటాల పద్య కవిత విన్న చంద్రిక ప్రెస్ వారు శతకం పూర్తి చేస్తే ఉచితం గా అచ్చు వేస్తామని చెప్పారట కానీ ఆయన పూర్తి చేయలేదు. తర్వాత శ్రీశ్రీ సింహ గర్జన వినిపించేటప్పటికి రెంటాల పద్యాన్ని పక్కన పడేశారు. మార్క్సిజం మంత్రనుష్టానం మొదలైంది. “ శివుడు కమ్యూనిస్టు, విష్ణువు కాపిటలిస్ట్. కాబట్టి శివుడి పై శతకం రాసి అచ్చు వేస్తాను ” అని మిత్రులతో చెప్పారు రెంటాల. బెల్లంకొండ రామదాసు సరే అన్నా, అనిశెట్టి సుబ్బారావు మాత్రం సుతరాము ఒప్పుకోలేదు. గేయాలు రాయి కానీ శతకం వద్దని వారించాడు. అలాగే రెంటాల దారి మార్చుకొని అభ్యుదయ మార్గం లో ముందుకు సాగిపోయారు. రాజ్యశ్రీ నవలను అలా గ్రాంధికం లో రాసినందుకు తనకు తానే సిగ్గు పడి ఆ నవలను చించి పారేశారట.
స్కూలు ఫైనల్ తర్వాత రెంటాల గుంటూరు కళాశాల లో బి. ఏ.( సాహిత్యం) చదువు కు వెళ్ళడం తో మిత్రులు చీలిపోయారు కానీ కవిత్వం లో మాత్రం కలిసే ఉన్నారు. నవల తర్వాత రెంటాల కవిత్వ మార్గం లో పయనించారు. రెంటాల మొదటి కవిత్వ సంపుటి “ సంఘర్షణ” రావటానికి పదేళ్ళు పట్టింది. సంఘర్షణ మొదటి సారి 1950 లో ప్రచురితమైంది.
కవిత్వ పుస్తకం అచ్చు వేసుకోలేక….
దురదృష్టం ఏమిటంటే రెంటాల మొదటి నుంచీ పేదరికం తో పెరిగారు. రచనలు చేసినా వాటిని అచ్చు వేసుకునేందుకు డబ్బుల్లేవు. రెండు వందల పుస్తకాలు రాసిన రచయిత సొంతంగా ప్రచురించుకున్నవి రెండో, మూడో పుస్తకాలు మాత్రమే .. కేవలం డబ్బు లేక మూడో కవిత్వ పుస్తకం “ శివధనువు” అచ్చులో చూసుకోవాలన్న కోరిక తీరకుండానే కన్ను మూశారు. ఒక కుమార్తె గానే కాకుండా, ఒక కవి గా, ఒక రచయిత గా కూడా ఇప్పటీకీ నన్ను అమితం గా బాధ పెట్టె విషయం అది.
పేదరికం తో శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి చివరి రోజులు ఎలా గడిచాయో, శారద నటరాజన్ లాంటి రచయిత ఎలాంటి దుర్భర పేదరికం తో గడిపారో తలచుకుంటే కన్నీళ్ళు ఆగవు. ఇంకా ఎంతో మంది రచయితల ఆర్ధిక పరిస్థితి గురించి ఉదహరించవచ్చు. ఆ సన్నివేశాలతో పోలిస్తే రెంటాల పుస్తకం వేసుకోలేకపోవటం మరీ అంత దుర్భరం కాదనిపించవచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పదల్చుకున్నది ఎవరి కష్టం ఎక్కువ, తక్కువ అని కాదు. మొత్తంగా తెలుగు రచయితల ఆర్ధిక పరిస్థితి, సాహిత్యాన్నికి, ఉదర పోషణకు మధ్య ఉన్న ఒక లింకు. ఆ తరం రచయితలకు ( ఎక్కువ శాతం అని నేననుకుంటున్నాను) సాహిత్యం పట్ల ఇష్టం తో పాటు అందులో సాధన చేయాలన్న పట్టుదలకూడా ఉండేది. దానికి గురువుల దగ్గర శిష్యరికం ఉపయోగపడేది. స్నేహితులందరూ ఒకరి రచనలు మరొకరు చదివి ఒకరినొకరు సరి చేసుకోవటం, ప్రోత్సహించటం, కలిసి సంకలనాలు తేవటం, సంఘాలు పెట్టడం ఇలా ఉండేది అప్పటి సాహిత్య వాతావరణం, ఒక పక్కన ఆంధ్రభారతి లాంటి పత్రికలు, నాయని సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ లాంటి గురువులు. ఇంకో వైపు భయద జలద గర్జన లాంటి శ్రీశ్రీ పిలుపు. స్వాతంత్రోద్యమం లో గాంధీజీ ప్రభావంతో నిండిన సమాజం. కవులు, రచయితలకు ఓ ఆవేశపూరిత వాతావరణం అది . ప్రపంచ సాహిత్యం లో ఏం జరుగుతోందో, ఎలాంటి పుస్తకాలు వస్తున్నాయో రష్యా తో పాటు అనేక ఇతర దేశాల నుంచీ కూడా సమాచారం అందేది. ఇంగ్లీష్ పుస్తకాలు లైబ్రరీల ద్వారానో, మరో రకంగానో చేతికి అందేవి. రచయితలు తమను తాము మెరుగుపర్చుకునేవారు. ఇతర భారతీయ భాషల సాహిత్యం తో పాటు విశ్వ సాహిత్యం చదివేవారు. నచ్చిన పుస్తకాలను అనువదించారు. అంటే తమ ప్రవృత్తి ని ఒక రకమైన వృత్తి గా మలుచుకున్నారు. ఉద్యమాల్లో పాల్గొన్నారు. పీడిత ప్రజల పక్షాన నిలబడ్డారు. అభ్యుదయం, ఆదర్శం, స్వాతంత్ర్యం అంటూ కలలు కన్నారు. కవులకి డ్రెస్ కోడ్ లాగా తెల్ల లాల్చీ, పైజమా వేసుకునేవారు. జుట్టు పైకి దువ్వుకొని, చేతిలో సిగరెట్ తో కనిపిస్తే ఖచ్చితంగా కవి అని చెప్పేసేవిధంగా ఉండేవారు అప్పటి కవులు, రచయితలు.
ఊహిస్తుంటే , ఆ కాలానికి వెళ్ళి ఒక్క సారి నారాయణ బాబు ని చూడాలని అనిపించటం లేదూ, సరే, శ్రీశ్రీ అంటుంటూనే ఒళ్ళు జలదరిస్తుంది.
శ్రీరంగం నారాయణ బాబు , శిష్ట్లా, శ్రీశ్రీ లాంటి కవులు ముందు వరుస లో నిలబడితే ఎలా ఉంటుందో ఒక్క సారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి, ఒళ్లు పులకరిస్తుంది. “ పోతే పోనీ సతుల్,హితుల్ , వస్తే రానీ కష్టాల్ నష్టాల్ “ అని ఎలుగెత్తి శ్రీశ్రీ తో కలిసి గర్జించాలనిపించదూ!?
( వచ్చే సంచిక లో మరికొన్ని స్మృతి జ్ఞాపికలు)
అభినందనలు మేడం గారూ!
Crisp, succinct, and an affectionate remembrance. Please continue without gaps. Some of us feel closer to RGK’s commitments. Best. VRV
‘రెంటాల ఒక తరం, ఒక స్వరం, ఒక జ్వరం’ అంటూ ‘సాక్షి’లో మందలపర్తి కిశోర్ రాసిన చిరు వ్యాసం ఆ బహుముఖ ప్రజ్ఞను రేఖామాత్రంగా చెప్పింది. మీ జ్ఞాపకాలు ఆ ప్రతిభా,వ్యక్తిత్వాలను సవివరంగా కళ్ళకు కట్టిస్తాయనీ, టైం మెషిన్ లా గతంలోకి తీసుకెళ్లి, ఆ కళా దర్బార్ ను ఆస్వాదించేలా చేస్తుందనీ అనుకుంటున్నాను.
ఆ నాటి జ్ఞాపకాలన్నీ నెమరేసుకోవడం ఎంతో బావుంది కల్పనా
మీరన్న పాయింట్ చాలా విలువైనది, ఆనాటి సాహిత్య కారుల ఆర్థిక దైన్యం.
డబ్బు లేక పుస్తకాలు వేసుకోలేక పోవడం ఎంతటి విషాదకర విషయం. వాచీ అమ్మకపోయి ఉంటె, స్నేహితుల సహాయం లేకుంటే ఆ పుస్తకం బయటికే వచ్చేది కాదేమో
అటువంటి పేదరికం లో కూడా రాయాలనే తృష్ణను పోగొట్టుకోక నిలుపుకోవడం ఎంత స్ఫూర్తినిచ్చే విషయం!!
రెంటాల అనగానే వాత్సాయన గుర్తొచ్చే తరానికి ఆయన జ్ఞాపకాలు రుచి చూపించడం బావుంది
తన సమగ్ర సాహితీ మూర్తి మత్వాన్ని మీ కంటే ఎక్కువగా ఎవరు అక్షర బద్దం చేయగలరు దయచేసి కొనసాగించండి