1
జీవితం జీవించడంలా ఉంది..
2
ఒక అధ్బుతమైన అనుభవమిప్పుడు
గడుస్తున్న ప్రతి క్షణం లోకి వసంతమేఘగర్జలతో అడుగిడుతోంది
కాలం కరుకుతనమ్మీద ఎవరో అద్దిన మెత్తదనం
నా ఊహలసాంతం వసంతం వసంతం
3
నింగి హాంగింగ్ గార్డెన్లో భువి ఓ బంతిపూవులా వేలాడుతుంటే దాన్ని
జాగ్రత్తగా ఒడిసిపట్టుకు వేల్లాడుతూ నేనో పసిపిల్లాణ్ణి
లోపలంతా కేరింతలూ కవ్వింతలూ
ఒక మగువ
నక్షత్రాలు పొదిగిన టీ షర్ట్ నింగినీలం తాగిన బ్లూజీన్స్
రబ్బరుబేండ్తో ముడేసిన పోనీటెయిల్
భువనాన్ని గాలిబంతిని చేసి నా వైపు విసుర్తుంది క్యాచ్ అంటూ
నేనపుడు దాన్ని పట్టడానికి దూకే సూపర్ మేన్
కలలకాలువల్లోంచి జ్ఞాపకాల తరగలను పుట్టిస్తూ పేలుస్తూ
పడవొకటి గతం పొగమంచును చీలుస్తూ వర్తమానంలోకి దిగుతుంది
గుండె మాంసంముద్ద కాదపుడు
అద్నాద్ పియానో నోట్స్ ను కాపీకొట్టిన ఫాస్ట్ ట్యూన్
4
ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచి జారిన రాయేదో
వాతావరణంతో ఘర్షణపడి బూడిద పూలుగా విడిపోతుంది
ఊహల డాబా మీద మౌనం ఈజీఛైర్లోంచి వీక్షిస్తూన్న నా పక్కన పడి పట్ మని విరుగుతుంది విశ్వపు సుగంధం వొదులుతూ
అప్పుడే తెలియని వర్ణసమ్మేళనాన్ని “తూట్తా సితారా” నా మీద వెదజల్లిపోతుంది
రంగు రంగుల మిణుగుర్ల మధ్య నేనపుడు సీతాకోక
5
ఎర్రరంగు గౌనుపై తెల్లగులాబీ డిజైన్లో పాలపుంత కురిపిస్తున్న డార్క్మేటర్ నా దేహదర్వాజాపై వెన్నెల దస్తక్ చేసిపోతుంది
సంధ్య తన గమ్యంలోకి జారగానే
మిణుకుమిణుకు వెలుతురుమధువును తాగిన రాత్రిసూఫీ బైరాగీగీతం
పాడుతుంటాడెపుడు నాకు మాత్రమే వినపడేడట్టు
గదిలోపలికి కిటికీ చువ్వల్లోంచి తప్పించుకుని పరుచుకున్న కిరణసమూహాన్ని బెడ్ కాఫీలా తాగుతుంది నిద్రయుధ్ధంలో నలిగిన బెడ్ షీట్ నాకు ఛీర్స్ చెబుతూ
నేనపుడు ఎగరడానికి సిధ్ధమైన ఉదయపు రెక్క
6
కలల పసిపిల్లలను కనుల ఊయలలో నిదురపుచ్చుతూ నేను
ఇప్పుడు నవ్వుని తప్ప దేన్నీ మోయలేకపోతున్నాను
నాలోపల నువ్వున్నావనే కదా…
*
Add comment