తెల్లవాళ్లను వణికించిన మైసూర్ పులి

టిపు వ్యక్తిగతంగా ఒక నిబద్ధుడైన ముస్లిం. కానీ ఒక పరిపాలకుడిగా సర్వ మత సహనంతో ఎంతో పరిపక్వతతో ప్రవర్తించే వాడు.

  ఆధిపత్యం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం దురుద్దేశంతోనే పాలకులు చరిత్రను వక్రీకరిస్తారు. హిట్లర్ యూదులను, నెపోలియన్ ఆంగ్లేయులను, ఆంగ్లేయులు ముస్లింలను అత్యంత కౄరులుగా, ఘోరమైన నేరాలు చేసినవారుగా చిత్రీకరించారు. ప్రస్తుత భారత రాజకీయాల్లో సైతం ఓట్లకోసం ఆంగ్లేయుల ధోరణిలోనే గతంలో ముస్లింలు ఈ దేశ ప్రజలపై దుర్మార్గాలు చేశారనీ, ఇప్పుడు చేస్తున్నారనీ ప్రచారం చేస్తున్నారు!

15 వ శతాబ్దంలో వ్యాపారం కోసం భారత దేశానికి రాక పోకలు సాగించిన పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, బ్రిటీష్ వారిమధ్య ఆధిపత్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 1750 వరకూ అంటే 18 వ శతాబ్దం మధ్య వరకూ బ్రిటీష్ తూర్పు ఇండియా కంపెనీ ఒక వ్యాపారసంస్థ గానే కొనసాగింది. భారతదేశ పాలకుల అనైక్యత వల్ల 1757 లో ప్లాసీ, 1764 లో బక్సారు యుద్ధాల్లో ఆంగ్లేయులు విజేతలయ్యారు. దానితో కొందరు అధికారుల్లో రాజ్యకాంక్ష మొదలయింది. ఈ ధోరణిని పార్లమెంట్ సభ్యుడైన ఎడ్మండ్ బర్క్ కంపెనీ చర్యలను దౌర్జన్యాలుగా అభివర్ణించాడు.

ఈ రెండు యుద్ధాలకు కారకులైన రాబర్ట్ క్లైవ్, వారెన్ హేస్టింగ్స్ ల పై అవినితి ఆరోపణలతో విచారణ జరిగింది. ఈ ఆరోపణలను ఎదుర్కోలేని రాబర్ట్ క్లైవ్ 1974 లో ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారుల అండదండలతో హేస్టింగ్స్ నిర్దోషిగా బయటపడ్డాడు. వీరిద్దరే కాక అధికారులనేకులు భారత్ లో అక్రమంగా ఆర్జించిన ధనంతో స్వదేశానికి వెళ్ళి అకడ ఎస్టేట్లు కొని విలాసవంతమైన జీవితాలను జీవించడమే కాక అ డబ్బు ఖర్చు పెట్టి పార్లమెంట్ లో సీట్లు కొనగలిగే స్థాయికి ఎదిగారు. ఇదంతా బ్రిటన్ లోని కొన్ని వర్గాలకు అభ్యంతరకరంగా ఉండేది. వారు వీరిని నబోబ్స్ (నవాబులు) అని హేళన చేసేవారు. 1784 లో విలియం పిట్ చేసిన ఇండియా చట్టం వల్ల బ్రిటీష్ ప్రభుత్వానికి తూర్పు ఇండియా కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశం కల్పించింది. తెల్లజాతి చాలా ఉన్నతమైనదని విశ్వసించే కార్నవాలిస్, వెల్లస్లీ, హెన్రీ డుండాస్ మొదలైనవారు ముఖ్యమైన పదవుల్లోకి వచ్చారు. వీళ్ళు భారతీయులకు పాలించడం రాదనీ, అనాగరికులైన నల్లజాతివారిని తెల్లజాతివారే ఉద్దరించగలరనే అభిప్రాయాలతో మితిమీరిన జాత్యహంకారంతో ఉండేవారు. అప్పటి మన పాలకులకు పక్కనున్న రాజులతో పరస్పర కలహాలు, యుద్ధాలే తప్ప మొత్తంగా అఖండ భారత దేశాన్ని కబళించబోతున్న బ్రిటీష్ వారి కుటిల నీతిని అర్ధం చేసుకోలేక పోయారు. మిగిలిన రాజులందరూ ఆంగ్లేయులకు దాసోహమనే పరిస్థితుల్లో, టిపు అతని తండ్రి హైదర్ అలీ బ్రిటీష్ వారి సామ్రాజ్యాధిపత్య కాంక్షని ముందుగానే పసిగట్టి దానిని నిలువరించే ప్రయత్నం చేశారు!

హైదర్ అలీ గత చరిత్రను అవలోకిస్తే, భారత దేశంలో మధ్యయుగాల్లో ముస్లిం రాజ్యస్థాపన జరిగింది. అరేబియా, ఇరాన్, టర్కీ, ఇరాక్, మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్ మొదలైన దేశాల నుంచి, ముస్లిం దర్బారులలోకి జీవనోపాధికోసం ప్రజలు వలసలొచ్చేవారు. వారిలో హైదర్ అలీ పూర్వీకులు కూడా ఉన్నారు. హైదర్ అలీ ముత్తాత వలీ అహమ్మద్ అరేబియా నుంచి ఢిల్లీ వచ్చి, అక్కడినుంచి దక్షణ భారతదేశం లోని ముస్లిం రాజ్యమైన బిజాపూర్ లోని గుల్బర్గాకు వచ్చి, అక్కడ మత సేవకుడుగా స్థిరపడ్డాడని చారిత్రక సమాచారం తెలియజేస్తుంది. ఇతని కుమారుడు మహమ్మద్ అలీ మత వృత్తిని వదిలి మొదట బిజాపూర్ సైన్యంలో చేరి తర్వాత కర్నాటక రాష్ట్రం లోని కోలార్ ప్రాంతంలో వ్యవసాయదారుడిగా స్థిరపడ్డాడు. ఇతని కుమారుల్లో ఒకడైన ఫతే మహమ్మద్ మైసూరు ఓడయారు సామంతుడైన సిరా నవాబ్ దర్గా అలీఖాన్ సైన్యంలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఈ సిరా నవాబ్ దర్గా అలీఖాన్, ఫతే మహమ్మద్ సామర్ధ్యానికి మెచ్చుకోలుగా 400 పదాతి దళాలకు, 200 అశ్విక దళాలకు అధిపతిని చేస్తూ, దొడ్ల బళ్ళాపూర్ జాగీర్ ను రాసిచ్చాడు. ఫతే మహమ్మద్ కు 1721లో జన్మించిన వాడే హైదర్ అలీ. ఫతే మహమ్మద్ హత్యకు గురి కాగా, హైదర్ అలీకి ఐదు సంవత్సరాల వయసప్పుడు అతని తల్లి వారి బంధువైన హైదర్ సాహెబ్ సహాయంతో శ్రీరంగ పట్టణం వచ్చి స్థిరపడింది.

ఈ శతాబ్దంలోనే భారత దేశ చరిత్రను గనుక గమనిస్తే, 1707 లో ఔరంగజీబు మరణించాక, 1724 లో మొగలాయీ సుబేదారైన ఖమ్రొద్దీన్ ఖాన్ నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా పేరుతో హైదరాబాద్ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఆ రోజుల్లో ధనం, సైనికబలం, ధైర్య సాహసాలున్నవాళ్ళు తమకు తామే పాలకులుగా ప్రకటించు కునేవారు! టిపు తండ్రి హైదర్ అలీ ఆ విధంగాగే మైసూరు రాజ్యానికి పరిపాలకుడయ్యాడు. సామాన్య సైనికుడి స్థాయి నుండి, ఫొజ్ దార్ గా, దిండిగల్ సుబేదార్ గా ఎదిగి మైసూరు పాలకుడైన కృష్ణరాజ ఒడయార్ ను తొలగించి తానే నవాబయ్యాడు. మరాఠాలు, హైదరాబాద్ నిజాం, ఆర్కాట్ నవాబు, కాలీకట్ సంస్థానాధీశుల నుండి హైదర్ అలీ విపరీతంగా రాజ్య విస్తరణ చేశాడు!

హైదర్ సాహెబ్ మైసూరు సైన్యాధిపతి నంజరాజ్ కు సన్నిహితుడు కావడంతో హైదర్ అలీ, అతని సోదరుడు షాబాజ్ లకు మైసూరు సైన్యంలో ఉద్యోగాలిప్పించాడు. 1749 లో మరాఠాలకూ – మైసూరుకీ మధ్య జరిగిన దేవనహళ్ళి యుద్ధంలో హైదర్ అలీ ధైర్య సాహసాలు చూసిన నంజరాజ్, హైదర్ అలీకి “ఖాన్” అనే బిరుదుతో పాటు 200 కాల్బలానికీ, 50 అశ్విక దళానికీ అధిపతిని చేశాడు. 1748 లోనూ, 1952 లోనూ జరిగిన చిన్న చిన్న రాజ్యాల పరస్పర యుద్ధాల్లో ఆంగ్లేయ సైన్యా లొకవైపు, రెండో వైపు ఫ్రెంచ్ సైన్యాలు ఇరుగు పొరుగు రాజులకు సహాయ సహకారాలందించేవి. వీటిలో మైసూరు రాజ్యం తరఫున పాల్గొన్న హైదర్ అలీ, యూరోపియన్ (ముఖ్యంగా ఫ్రెంచ్) సైన్యాల యుద్ధ నైపుణ్యాలతో ప్రభావితుడయ్యాడు. ఆ సమయంలో కొంత ధనాన్ని తనకోసం వెనకేసు కున్నాడు. 1755 లో దిండిగల్ ఫౌజ్ దార్ గా పదోన్నతి పొందిన హైదర్ అలీ ఫ్రెంచ్ వారి సహాయంతో ఫిరంగి దళాన్ని పెంచుకున్నాడు. 1757 లో మైసూరు రాజ్యంలో రాజకీయంగా విపత్కర పరిస్థితు లేర్పడ్డాయి. దిండిగల్ నుండి శ్రీరంగపట్టణం చేరుకున్న హైదర్ అలీ మరాఠాలతో యుద్ధంలో గెల్చి, పరిస్థితుల్ని ఒక కొలిక్కి తెచ్చి, రాజకీయ చతురతతో తనకు ప్రీతిపాత్రుడైన నంజరాజ్ నే వ్యూహాత్మకంగా తొలగించాడు. రాజు ఇచ్చిన బిరుదు”నవాబ్” తో “నవాబ్ హైదర్ అలీ ఖాన్” గా మైసూరు రాజ్య రక్షకుడయ్యాడు!

రెండుసార్లు హైదర్ అలీ చేతిలో మరాఠాలు ఓడిపోయారు. 1760 లో ఆయనపై హత్యాయత్నం జరిగింది. కుటుంబాన్ని శ్రీరంగ పట్టణంలో వదిలి హైదర్ అలీ బెంగుళూరు పారిపోయాడు. మైసూరు రాజ్యంలోనే దీవాన్ గా ఉన్న ఖండేరావు హైదర్ అలీ కుటుంబాన్ని బంధించాడు. అప్పటికి టిపు వయసు 10 సంవత్సరాలు. ఆఫ్గన్ రాజు చేతిలో ఘోరంగా ఓడిన మరాఠాలపై 1761 లో దండెత్తి, హైదర్ అలీ వారి రాజ్యంలో కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. తర్వాత శ్రీరంగ పట్టణంలో ఖండేరావును ఓడించి జైల్లో పెట్టాడు. 1766 లో రెండవ కృష్ణరాజ ఒడయార్ మరణం తర్వాత ఒడయార్ వంశస్థులనే సింహాసనం మీద కూర్చోబెట్టాడు గానీ ఆయనెప్పుడూ సింహాసనా శీనుడు కాలేదు. కానీ శ్రీరంగ పట్టణ ప్రజలు మాత్రం “హైదర్ నవాబ్” అని పిల్చుకుంటూ ఆయన్నే మైసూరు రాజ్యాధిపతిగా గుర్తించేవారు!

టిపు తల్లి ఫాతిమా మన కడప వాస్తవ్యురాలే! ఆమె కడప నవాబు కొలువులో కడప కోటకు అధిపతి అయిన మీర్ మొయినుద్దీన్ కుమార్తె ! హైదర్ అలీ ఒక రాజకుమారునికి అవసరమయ్యే విద్యలన్నీ శ్రద్ధాసక్తులతో హైదర్ అలీ టిపుకి నేర్పించాడు. ఉర్దు, ఫార్సి, కన్నడ, అరబిక్, మరాఠీ భాషలను నేర్పించడానికి, ఖురాన్, ఇస్లాం, న్యాయ శాస్త్రాలను బోధించడానికి, సైనిక శిక్షణ కోసం ఆయా రంగాల్లో నిష్ణాతులైన విద్యావేత్తలను నియమించాడు.

16 వ ఏట 1766 లో టిపు తండ్రితో మైసూరు యుద్ధంలో పాల్గొన్నాడు. టిపు సాహసానికి మురిసిన హైదర్ అలీ మలవల్లి, కొన్ననూర్, ధర్మపురి, పెన్నాగరం, టెంకరాయ్, కొట్టం ప్రాంతాలకు జాగీర్దార్ ని చేసి 500 అశ్వికదళానికి అధిపతిని చేశాడు. హైదరాబాద్ నిజాం అలీఖాన్ మొదటి ఆంగ్లో-మైసూరు యుద్ధంలో ఆంగ్లేయుల తరఫున పోరాడడానికి నిశ్చయించు కున్నాడు. 1767 లో టిపు చెన్నపట్టణంలో ఉన్న నిజాం అలీఖాన్ ని కలిసి మంతనాలు జరిపాడు. పదిహేడేళ్ళ వయసు లోనే సకల విద్యాపారంగతుడై తెలివి తేటలతో టిపు జరిపిన దౌత్యానికి ముగ్ధుడైన హైదరాబాద్ నిజాం ఆంగ్లేయులకు ఏమాత్రం సహాయం చెయ్యబోనని మాటిచ్చాడు!

మొదటి ఆంగ్లో- మైసూర్ యుద్ధంలో టిపు మద్రాస్ పై దాడిచేసి చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమించాడు. ఆ సమయంలో టిపు ఒక ఫ్రెంచ్ వర్తకుని ఇంట్లో మైక్రోస్కోప్ ని చూశాడు. అప్పటినుంచి యూరోపియన్ల జీవన విధానాలూ, సాంకేతిక పరిజ్ఞానం టిపును జీవితాంతం ప్రభావితం చేశాయి. ఈ యుద్ధంలో టిపు మైసూర్ అశ్విక దళానికి ఆధిపత్యం వహించాడు. 1768, మార్చ్ 7 న మంగుళూరు పట్టణాన్ని చేరుకుని, రెండు నెలల ఎడతెరిపి లేని పోరాటం ద్వారా టిపు పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు గానీ మంగుళూరు కోటలో ఆంగ్లేయులు తిష్ఠ వేశారు. కానీ హైదర్ అలీ అదనపు సైన్యాలతో వస్తున్నాడనే వార్తతో కలవరపడిన ఆంగ్ల సైనికాధికారులు, 80 మంది ఆంగ్ల, 180 మంది భారతీయ సైనికులను, మందుగుండు సామాను, తుపాకులను అక్కడికక్కడే వదిలి పెట్టి, మంగుళూరు కోట నుండి రహస్యంగా పారిపోయారు. టిపు మంగుళూరు కోటను స్వాధీన పరుచుకున్నాడు. తర్వాత హైదర్ అలీ, టిపు కలిసి ఆంగ్లేయులను చిత్తుగా ఓడించి మలబారులో ఆంగ్లేయులు ఆక్రమించుకున్న ప్రాంతాలన్నింటినీ తిరిగి స్వంతం చేసుకున్నారు. 1769, మార్చ్ లో ఆంగ్లేయులకూ మైసూర్ కూ సంధి కుదరడంతో మొదటి ఆంగ్లో- మైసూర్ యుద్ధం ముగిసింది. తండ్రీ-కొడుకులిద్దరూ పరిస్థితులు ప్రతి కూలంగా ఉన్నప్పుడు వెనక్కి తగ్గుతూ, తమ కనువైనప్పుడు యుద్ధాన్ని కొనసాగిస్తూ విజ్ఞతతో యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించేవారు. ఈ యుద్ధంలో టిపు పాత్ర చాలా ముఖ్యమైనది. 1767 లో టిపుకి పదిహేడేళ్ళ వయసులో ప్రారంభమై, 1769 లో పందొమ్మిదేళ్ళ వయసులో అంతమైంది. అప్పటికింకా టిపు టీనేజరే! అయినప్పటికీ అతను అంత చిన్న వయసులో సాహసంతో ఆంగ్లేయులతో పోరాడిన తీరు ప్రశంసనీయం!

1769 లోనే మరాఠా-మైసూర్ యుద్ధంలో మరాఠాలు మైసూర్ పై దాడి చేసి, హైదర్ అలీ, టిపు సైన్యాలపై పై చేయి సాధించి, వరుసగా చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. మరాఠా సైన్యాలు, మైసూర్ రాజ్యానికి రాజధాని అయిన శ్రీ రంగ పట్టణం వరకూ తరుముతూ వచ్చాయి. టిపు ఆరువేల మైసూర్ సైన్యంతో మరాఠా సైన్యాలను ఎదుర్కొన్నాడు గానీ ముప్పై ఐదువేల మరాఠా సైన్యాల ముందు విఫలం చెందాడు. అదును కోసం వేచి టిపు, హైదర్ అలీలు 1774-1779 మధ్యకాలంలో మరాఠాలు ఆక్రమించుకున్న ప్రాంతాలనన్నిటినీ తిరిగి స్వంతం చేసుకున్నారు. 1774 లో టిపు తండ్రి సూచన మేరకు ఒకరినీ, తాను ప్రేమించిన సేనాధిపతి బుర్హాన్ ఖాన్ సోదరి రుఖయ్యాభానునీ ఒకేసారి వివాహమాడాడు.

దక్షణ భారత దేశంలో ఆంగ్లేయుల ప్రధాన కేంద్రమైన మద్రాసు పట్టణం అప్పట్లో కర్నాటకలో ఉండేది. ఆంగ్లేయులను అడ్డుకునే క్రమంలో కర్నాటకలో విస్తరించడానికి హైదర్ అలీ మొదటి ఆంగ్లో-మైసూరు యుద్ధాన్ని 1767 లో ప్రారంభించి, 1769 లో ముగించాడు. ఆంగ్లేయులను అన్ని వైపులనుంచి నిలువరించడానికే హైదర్ అలీ ఉత్తరాన మరాఠాల వైపు, దక్షిణాన కేరళ వైపు, తూర్పున కర్నాటక, తమిళనాడు, హైదరాబాద్ నిజాం వైపు, పశ్చిమాన అరేబియా సముద్రతీరం లోని మంగుళూరు వంటి రేవు పట్టణాల వైపు ఇంతకుముందెన్నడూ లేని విధంగా మైసూరు రాజ్య సరిహద్దుల విస్తరణ చేశాడు. ఉత్తరం వైపు విస్తరించే క్రమంలో మరాఠా- మైసూరు యుద్ధం 1769 లో మొదలై 1772 లో ముగిసింది. బ్రిటీష్ వారికి దాసోహమనే మలబార్, నిజాం లాంటి సంస్థానాధీశులతో హైదర్ అలీ, టిపు నిరంతర యుద్ధాలు చేస్తూనే ఉన్నారు! రెండవ ఆంగ్లో-మైసురు యుద్ధం 1780 లో మొదలై 1784 లో ముగిసింది.

కానీ 1782 లో హైదర్ అలీ మరణించాడు. అయినప్పటికీ రెండు యుద్ధాల్లో టిపు విజయం సాధించాడు!

హైదర్ అలీ తన అద్భుతమైన తెలివితేటలతో మొదటిసారిగా మంగుళూరు వంటి రేవు పట్టణాలతో మైసూరు రాజ్యానికి నౌకా దళాన్ని ఏర్పాటు చేశాడు. కేరళ లోని సుగంధ ద్రవ్యాలు, కలప, గంధపు చెక్కలతో విదేశీ వ్యాపారం చేశాడు. మస్కట్, టర్కీ వంటి విదేశాలతో దౌత్య సంబంధాలేర్పరచుకున్నాడు.సర్ ఐర్ క్యూట్ వంటి ఆంగ్ల సేనాని హైదర్ అలీ మరణ వార్త విని “ఇక భారత దేశంలో ఆంగ్లేయులకు ఎదురుండద”ని వ్యాఖ్యానించాడంటే అనితర సాధ్యమైన ఆయన యుద్ధ నైపుణ్యాన్ని అంచనా వెయ్యవచ్చు. హైదర్ అలీకి చదవడం, రాయడం తెలియదు. కొత్త విషయాలను ఆకళింపు చేసు కోవడంలో మాత్రం అగ్రగణ్యుడు. బ్రిటీష్ వారిని చూచి వర్తక వ్యాపార మెళకువలు నేర్చుకున్నాడు. ఫ్రెంచ్ వారినుంచి తెలుసుకున్న జ్ఞానంతో తన సైన్యాన్ని ఆధునీకరించుకున్నాడు. హైదర్ అలీ మరణించే సమయానికి అధునీకరించిన 88 వేల సైన్యంతో, 1200 మండి రాకెట్ ప్రయోగ నిపుణులతో భారత దేశంలో మైసూరు రాజ్యం ప్రధమ స్థానంలో ఉండేది. నిరక్షరాస్యుడైన హైదర్ అలీ సందర్భాను సారంగా వ్యూహాలెలా రచించాడో, ఉత్తర ప్రత్యుత్తరాలెలా జరిపాడో మనకర్ధం కాదు!

తర్వాత హైదర్ అలీ, టిపు కలిసి కర్నాటకలో ఆంగ్లేయుల అధీనంలో ఉన్న కోటలపై వరుస దాడులు జరిపారు. ఆర్కాట్ కోట, సత్కూరు కోటలను ముట్టడించి మైసూరు సైన్యాలు కైవసం చేసుకున్నారు. అంబూరు అధిపతి కెప్టెన్ కీటింగ్ ముందు వ్యతిరేకించి తర్వాత విధిలేక 1781, జనవరి 15 న లొంగిపోయాడు. టియాఘర్ కోటకు అధిపతిగా ఉన్న కెప్టెన్ రాబర్ట్స్ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆరు నెలల భీకర పోరాటం తర్వాత 1781, జూన్ లో టిపు టియాఘర్ కోటను ఆక్రమించుకోగలిగాడు. 1781, జూన్ 22 న టిపు హైదర్ అలీ పంపగా ‘వందవాసి’ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నాడు గానీ ‘వందవాసి కోట’ను ఆక్రమించడం సాధ్యం కాలేదు. కల్నల్ పియర్స్ అదనపు బలగాలతో వందవాసికి చేరు కుంటున్నాడని విని, టిపు కోట ముట్టడిని మధ్యలోనే ఆపి అతనిని నిరోధించడానికి తన సైన్యంతో అటువైపుగా ప్రయాణించాడు. కానీ ఈసారి ‘పొల్లిలూరు యుద్ధ ఓటమి’ అనుభవంతో అసలు దారి తప్పించి నెల్లూరు మీదుగా పులికాట్ చేరుకుని అక్కడ ‘సర్ ఐక్యూట్’ సైన్యాలతో కలిసి టిపుతో యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఇక గెలుపు సాధ్యం కాదని టిపు వెనక్కి మళ్ళి, ఆర్కాట్ లో హైదర్ అలీని కలిశాడు. తర్వాత హైదర్ అలీ, టిపును తంజావూరు ముట్టడికి పంపాడు. కుంభకోణం వద్ద ఆంగ్లసేనాని కల్నల్ బ్రెయిత్ వెయిట్ ను 1782, ఫిబ్రవరి 18న ఘోరంగా ఓడించి తంజావూరు ప్రాంతాలనన్నింటినీ టిపు ఆక్రమించాడు. ఈ యుద్ధంలో ఆంగ్లసైనికులు గణనీయంగా పట్టుబడ్డారు!

ఉత్తరాన కృష్ణానది, దక్షణాన కేరళ లోని ట్రావెన్కూర్, తూర్పున తమిళనాడు లోని తిరునల్వేలి, పశ్చిమాన అరేబియా మహాసముద్రం సరిహద్దులు గానున్న విశాలరాజ్యానికి టిపు వారసత్వ అధిపతి అయ్యాడు. ప్రస్తుత భారతదేశం లోని మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళలలో టిపు రాజ్యం విస్తరించి ఉండేది! ఇంత పెద్ద రాజ్యాన్ని ముఖ్యంగా బ్రిటీష్ సామ్రాజ్యవాదుల నెదిరించి పోరాడడంలో టిపు తన పదిహేనవ ఏటనుంచి హైదర్ అలీతో పాటు విపరీతమైన కృషి చేశాడు!

1782 లో హైదర్ అలీ మరణించేటప్పటికి టిపుకి ముప్ఫై రెండేళ్ళు. ఇన్నేళ్ళూ తండ్రికి అనుచరుడిగా, వారసుడిగానే గాకుండా నిరంతరం తండ్రిని అంటిపెట్టుకునే ఉండి యుద్ధాల్లో, పరిపాలనలో సహచరుడిగా మెలిగాడు. తండ్రిని ఎంతో ప్రేమించి గౌరవించాడు. బ్రిటీష్ వారి అస్థిత్వం మన దేశానికి ఎంత ప్రమాదకరమో ఈ తండ్రీ-కొడుకులిద్దరూ గ్రహించి వారిని నిలవరించడానికి వారి పూర్తి జీవితాలను వెచ్చించారు!

టిపు ఆంగ్లేయులతో నిరంతరం ఎడతెగని యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. ఫ్రెంచ్ సైన్యాలు మైసుర్ సైన్యానికి అండగా ఉండేవి. కానీ ఐరోపాలో ఫ్రెంచ్ వారికీ-ఆంగ్లేయులకూ మధ్య జరుగుతున్న యుద్ధం ముగిసి, వారి మధ్య సయోధ్య కుదరడంతో ఫ్రెంచ్ సైన్యాలు, మైసుర్ సైన్యాలకు సహాయం చెయ్యకూడదనే నిబంధనతో టిపుకి కష్టాలు మొదలయ్యాయి. ఫ్రెంచ్ సైనికాధికారి ‘డిమోర్లా’ దౌత్యంతో 1783, ఆగస్టు 2న టిపు-ఆంగ్లేయుల మధ్య సంధి జరిగింది!

“ఆంగ్ల ఈస్ట్ ఇండియా కంపెనీకి తూర్పున మద్రాస్, ఉత్తరాన కలకత్తా, పశ్చిమాన బొంబాయి ముఖ్యమైన స్థావరాలు. టిపు పశ్చిమాన మలబారులో ఆంగ్లేయులతో యుద్ధం చేస్తుంటే, తూర్పున కర్నాటకలో మైసుర్ కోటలపై దాడి చేసేవారు. టిపు తూర్పున ఆంగ్లేయులతో పోరాడుతుంటే పశ్చిమాన మలబారును బొంబాయి నుంచి వచ్చిన ఆంగ్ల సైన్యాలు ముట్ట డించేవి”. ఈ రకంగా ఆంగ్లేయులు నిరంతరం ఎన్ని కుట్రలు, యుద్ధ వ్యూహాలు పన్నినప్పటికీ వారిని నెగలనీయకుండా చేయడమే తన ధ్యేయంగా నిరంతర పోరాటాలు చేశాడు టిపు.

1784 లో రెండవ ఆంగ్లో- మైసూర్ యుద్ధం ముగిసినప్పుడు గొప్ప విజయాన్ని సాధించిన టిపు పెద్ద సంఖ్యలో బ్రిటీష్ సైనికులను యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నాడు. యుద్ధం తర్వాత జరిగిన సంధి ననుసరించి 1100 మంది బ్రిటీష్ సైనికులను విడుదల చేశాడు. కానీ 100-150 మంది బ్రిటీష్ సైనికులు మాత్రం టిపు సైన్యంలో చేరి, ఇస్లాం మతం తీసుకుని, మైసూరు రాజ్యంలో గొప్ప హోదాలతో ఉన్నత పదవుల్లో స్థిరపడి టిపుతోనే ఉండిపోయారు. వాస్తవం ఇది కాగా భారతదేశంలో తమ సామ్రాజ్య విస్తరణకు టిపు ఒక్కడే ఆటంకంగా ఉన్నాడని గ్రహించిన ఆంగ్లేయులు మూడో ఆంగ్లో- మైసూర్ యుద్ధాన్ని ప్రకటించారు. మొదటి, రెండవ ఆంగ్లో-మైసూరు యుద్ధాలలో హైదర్ అలీ, టిపుల గెలుపునే గాక, ఆంగ్ల సైనికులు వారి అధీనంలో ఉండడాన్ని సహించలేకపోయారు. ‘కార్నవాలిస్’ బృందం టిపుపై మూడవ ఆంగ్లో – మైసూరు యుద్ధానికి ఇదే కారణాన్ని సాకుగా చూపడమేకాదు, టిపుని వక్రీకరించిన శుద్ధ అబద్ధాలతో కరడు గట్టిన ఇస్లాం మతోన్మాదిగా ముద్ర వేసింది. అన్ని వైపుల నుంచి శత్రుసైన్యాలు చుట్టు ముట్టడంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ యుద్ధంలో ‘కార్నవాలిస్’ తో టిపు ‘శ్రీరంగ పట్టణం’ సంధి కుదుర్చుకున్నాడు. సగం రాజ్యాన్నీ, ఆరుకోట్ల నష్ట పరిహారాన్నీ టిపు చెల్లించ వలసి వచ్చింది. అంతేకాదు, 18 సంవత్సరాల పెద్ద కుమారుణ్ణి టిపు హామీగా పంపిస్తానంటే, క్రూరుడైన ‘కార్నవాలిస్’ ఒప్పుకోలేదు. పసివారైన 8, 5 ఏళ్ళ ఇద్దరు బాలుర్ని చెరబట్టాడు. పైగా పసివారు తలిదండ్రుల దగ్గర కంటే తన సంరక్షణ లోనే హాయిగా ఉన్నారని (వారి వయసు పెంచి) అబద్ధపు ప్రచారం చేశాడు. ఈ సంఘటన టిపును మానసికంగా చాలా బలహీనపరిచి కుంగదీసింది!

భారత దేశంలో బ్రిటీష్ సామ్రాజ్య విస్తరణే వెల్లస్లీ లక్ష్యం. ఫ్రెంచ్ వారంటే అతని కంటగింపుగా ఉండేది. వారి స్వాతంత్ర్యం, సమభావం, సౌభ్రాతృత్వాలను ఏవగించుకునేవాడు. ఫ్రెంచ్ వారి ఆధునికతతో ప్రభావితుడైన టిపును సహించలేని వెల్లస్లీ, నాల్గవ ఆంగ్లో – మైసూరు యుద్ధానికి ఫ్రెంచ్ వారితో టిపు స్నేహమే కారణంగా చూపాడు. ఇక ఫ్రెంచ్ వారితో టిపు స్నేహం అంటే ఒక స్వతంత్ర పాలకుడిగా తన స్నేహితులను ఎంచుకునే హక్కు టిపుకి ఉంది. అదీగాక హైదర్ అలీ కాలం నుంచే ఫ్రెంచ్ వారితో చిరకాల స్నేహ సంబంధాలు టిపుకుండేవి. వారినుండి అధునాతన యుద్ధ విద్యలను హైదర్ అలీ, టిపు, మైసూరు సైన్యాలు నేర్చుకున్నాయి! బ్రిటీష్ సామ్రాజ్య విస్తరణకు టిపు అడ్డుగా ఉండడమే మూలకారణం కాగా ఈ అన్యాయమైన ‘ఫ్రెంచ్ వారితో టిపు స్నేహం’ మొ.న ఆరోపణలన్నీ దౌర్జన్య పూరితమైన అభూత కల్పనలే గానీ నిజాలు కావు!

1799 ఏప్రిల్ 5 నాటికి శ్రీరంగ పట్టణం కోట ముట్టడి ప్రారంభమైంది. 20 న ఆంగ్ల ప్రతినిధి ‘హారిస్’ కి టిపు సంధి ప్రతిపాదనలు పంపాడు. ‘హారిస్’ నాలుగు షరతుల్ని విధించాడు.1. బ్రీటీష్ వారి మిత్రుల్నే దర్బారులో రాయబారులుగా ఉంచాలి. (ఇది పరోక్షంగా టిపును సామంత రాజుగా ఉండమనడమే!) 2. ఫ్రెంచ్ వారితో ఎటువంటి సంబంధాలుండకూడదు.3. రెండుకోట్ల నష్ట పరిహారాన్ని చెల్లించాలి.4. అప్పటి మైసూరు రాజ్యంలో సగభాగాన్ని అప్పజెప్పాలి. ఈ నాలుగు హామీలు నెరవేరే వరకూ నలుగురు కుమారుల్ని (ఏ నలుగురో అతనే నిర్ణయిస్తాడు) ఆంగ్లేయుల అధీనంలో ఉంచాలి!

ఈ పైశాచికమైన షరతులకు లొంగిపోవడానికి నిరాకరిస్తూ,” గొర్రె లాగా వంద సంవత్సరాలు బ్రతకడం కంటే పులిలా ఒక రోజు బ్రతకడం మేలు” అని టిపుయే ఒక సందర్భంలో చెప్పినట్లు సామాన్య సైనికుడిగా యుద్ధ రంగాని కురికి కత్తి యుద్ధం చేస్తూ వీరోచిత మరణం పొందాడు. సైనికులు పల్లకీలో తప్పించాలని చూస్తే టిపు ఒప్పుకోలేదు. వ్యక్తిగత సేవకుడు మీరు “టిపు”అని ఆంగ్లేయులకు తెలియజేస్తానంటే టిపు స్వాభిమానంతో తిరస్కరించాడు!

జేంస్ మిల్ అనే బ్రిటీష్ చరిత్రకారుడు, తూర్పు ఇండియా కంపెనీ సైన్యాధికారులు, పాలనాధికారులు మొ.న వారు రాసిన చరిత్ర రచనలు రాజకీయ దురుద్దేశంతో భారతదేశంలో బ్రిటీష్ పాలనను సమర్ధించేవి గానే ఉన్నాయి. వీరి రాతలన్నీ భారతదేశంలో టిపును ఒక నిరంకుశ మతోన్మాదిగా ప్రపంచం ముందు నిలిపాయి. బ్రిటీష్ వారికి టిపు ఒక అబ్సెషన్ ఐపోయాడు. 18వ శతాబ్దంలో కర్నాటక నవాబ్, అవధ్ నవాబ్, బెంగాల్ నవాబ్, హైదరాబాద్ నిజాం వంటి ముస్లిం సంస్థానాధీశులైనా, మరాఠాలు, రాజపుత్రులు, ట్రావెంకూర్ రాజు వంటి హిందూ రాజులైనా బ్రిటీష్ సైనిక, సామ్రాజ్యశక్తి ముందు మోకరిల్లారు. బ్రిటీష్ వారు తమపై విధించిన అవమానకరమైన సైనిక ఒప్పందాలకు తలవంచి తమ స్వేచ్చనూ, సార్వభౌమత్వాన్నీ వదులుకున్నారు!

వీరికి భిన్నంగా టిపు ఆంగ్లేయులకు సామంతులుగా ఉండడానికి అంగీకరించలేదు. మైసూరు రాజ్యంలో ఆంగ్లేయులకు వర్తకాన్ని నిషేధించాడు. ఆంగ్లేయులు అనుమతి లేకుండా తన రాజ్యంలో ప్రవేశించకూడదని టిపు ఆంక్షలు విధించాడు. భారత దేశంలో యధేచ్చగా హద్దులు లేకుండా సాగుతున్న బ్రిటీష్ వర్తక వ్యాపారాలకు ఒక్క టిపు సుల్తానే అడ్డంకిగా ఉన్నాడు కాబట్టి టిపును తొలగించాలనుకున్నారు. మొదట్లో బ్రిటీష్ ప్రభుత్వం, తూర్పు ఇండియా కంపెనీ అధికారులు స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకోవడాన్ని సమర్ధించలేదు. ఇస్లాం మతోన్మాది అని ముద్ర వేసి తొలగిస్తే అది దురాక్రమణలా కాకుండా విలువలను కాపాడే చర్యగా చెప్పుకోవచ్చనుకున్నారు.

బ్రిటీష్ సామ్రాజ్య వాదులు టిపును క్రూర నియంతగా అనేక విధాలుగా నిందిస్తూ ప్రచారం చేశారు. మతాలకతీతంగా శ్రీరంగ పట్టణం ప్రజలు టిపు మరణానికి అమితంగా దుఃఖించారు. టిపు రెవెన్యూ మంత్రి ‘మీర్ సాదిక్’, అతనితో పాటు కొందరు మంత్రులు, దర్బారు లోని సైనికాధికారులు ఆంగ్లేయులతో చేరి, టిపు వెనక చేసిన కుట్రల ఫలితంగా, టిపు నమ్మకద్రోహానికి గురయ్యాడని ప్రజలు గుర్తించారు. అక్కడి ప్రజలు ఇప్పటికీ జానపద పాటల్లో ఈ నమ్మకద్రోహాన్ని గురించి పాడుకుంటూ తమ రాజును కీర్తిస్తారు! పదిహేను రోజుల తర్వాత టిపు మరణం గురించి తెలుసుకున్న ప్రజలు ‘మీర్ సాదిక్’ సమాధిని తవ్వి తీసి, కాళ్ళతో తన్ని రాళ్ళు రువ్వుతూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారట! పెద్దగా రోదిస్తున్న వారి అంతులేని దుఃఖాన్ని చూచి ఆంగ్లేయులు విపరీతంగా ఆశ్చర్యపోయారట. ఇప్పటికీ శ్రీరంగ పట్టణాన్ని సందర్శించే పర్యాటకులు అతను చేసిన నమ్మకద్రోహానికి ‘మీర్ సాదిక్’ సమాధిపై రాళ్ళు రువ్వి, టిపుని గౌరవంగానూ, భక్తితోనూ తల్చుకుంటారు!

“ఇది నిరంకుశ రాచరిక పాలనే అయినా మైసూరు రాజ్యంలో, హైదర్ అలీ, టిపు పర్యవేక్షణలో సైనిక, పౌర పాలనా వ్యవస్థలన్నీ సక్రమంగా పని చేశాయి. అధికారుల నియమకంలో ప్రతిభ తప్ప కుల, మత, జన్మ ఆధిపత్యాల ప్రసక్తి ఉండేది కాదు. జమీందార్లు, స్వతంత్ర ప్రభువుల ఆధిపత్యం రద్దు చేయబడింది. ప్రతివ్యక్తికీ న్యాయం జరిగే వ్యవస్థలు రూపుదిద్దు కున్నాయి. అట్టడుకు వర్గాలకు చెందినవారు తమ ప్రతిభతో ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశం టిపు పరిపాలనలో ఉండేది. ఇంత క్రమ శిక్షణ కలిగిన సైన్యం బహుశా ప్రపంచంలోనే ఉండదేమో” అని ఆంగ్ల సైనికాధికారి సర్ థామస్ మన్రో మైసూరు రాజ్య పరిపాలన గురించి 1790, జనవరి 17 న తన తండ్రికి రాశాడు. ఆ రోజుల్లో రాజులందరూ నిరంకుశులే! అది ఆ కాలపు రీతీ, రివాజులు. అలెగ్జాండర్ డౌ అనే ఆయన “ఆశబోతుతనంతో నిండిపోయిన తూర్పు ఇండియా కంపెనీలో ప్రతి ఉద్యోగి ఒక నియంతే. పన్ను చెల్లించలేని పేదరైతులపై రోజూ దౌర్జాన్యాలు చేసి, సైన్యాలను పంపి భీభత్సం సృష్టించేవారు” అని తన పుస్తకం “History of Hindustan”లో రాశారు. దీనికి భిన్నంగా టిపు పన్ను చెల్లించలేని పేదరైతులు ప్రభుత్వానికి అప్పీలు చేసుకుంటే వారి ఆర్ధిక పరిస్థితుల్ని విచారించి పన్ను మాఫీ చేసేవాడు!

టిపు వ్యక్తిగతంగా ఒక నిబద్ధుడైన ముస్లిం. కానీ ఒక పరిపాలకుడిగా సర్వ మత సహనంతో ఎంతో పరిపక్వతతో ప్రవర్తించే వాడు. హిందూ ప్రజలు మెజారిటీగా ఉన్న రాజ్యానికి నేను పాలకుడిననే స్పృహను టిపు ఎన్నడూ విస్మరించలేదు. హిందూ మతాన్ని ఎంతగానో గౌరవించి హిందూ దేవాలయాలకు, మఠాలకు, బ్రహ్మణులకు సర్వ మాన్యాలు, వెండి, బంగారు, వజ్రాలతో పాత్ర సామగ్రి ఇచ్చినట్లు శాసనాలు, ఫర్మానులు, ఉత్తరాలు, రికార్డులు లభించడమే కాకుండా ఆ ఆభరణాలు, పాత్రసామగ్రి టిపు అవలంభించిన మత సామరస్య విధానానికి ప్రత్యక్షసాక్షులుగా ఆయాదేవాలయాల్లో ఇప్పటికీ వాడకంలో ఉన్నాయి. మైసూరులో మొదటి చర్చి నిర్మాణానికి అనుమతి నిచ్చాడని, తన అధీనంలో బందీలుగా ఉన్న బ్రీటీష్ క్రైస్తవ సైనికులు ప్రార్ధనలు, ఇతర మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక ఫాదర్ని పంపించవలసిందిగా గోవా అధికారులకు లేఖ రాశాడు. బ్రిటీష్ వారు భారత దేశానికి మొదట వ్యాపారం కోసం శరణార్ధుల్లా వచ్చారు.తర్వాత యజమానుల్లా శాసించారు! కానీ హైదర్ అలీ, టిపు మతాతీత జనరంజక పరిపాలన చేశారు!!

పులి తలతో అలంకరించబడిన టిపు సింహాసనం లండన్ విండ్సర్ భవనంలో, బ్రిటీష్ రాజ భవనాలలో, మ్యూజియంలలో, స్కాట్లాండ్ ఎడిన్ బరోలో మైసూరు రాజ్యపు అంతులేని సంపద, కళాకృతులు కొలువు తీరాయి. టిపు బహు భాషాకోవిదుడు. స్వతహాగా రచయిత. టిపు సేకరించుకున్న ఎన్నో విలువైన, అమూల్యమైన గ్రంధాలను తరలించుకుపోయారు!

ఆంగ్లేయుల రాకతో 18 వ శతాబ్దంలోనే భారతదేశం మధ్య యుగాల ఆలోచనల నుండి ఆధునికత వైపుకి అడుగులెయ్యడం మొదలెట్టింది. హైదర్ అలీ, టిపులు ఆంగ్లేయుల పెత్తనాన్ని వ్యతిరేకించారు గానీ వారి విజ్ఞానాన్ని వ్యతిరేకించలేదు. ఫ్రెంచ్ వారి నుంచి కూడా ఎన్నో అత్యాధునిక విషయాలను నేర్చుకున్నారు. వారి విజ్ఞానం తండ్రీ-కొడుకులిద్దర్నీ జీవితాంతం ప్రభావితం చేసింది. టిపు మైసూరులో పట్టు పరిశ్రమకు ఆద్యుడు. పండ్ల, పూలతోటల అభివృద్ధికి టిపు ఆద్యుడు. మస్కట్ కేంద్రంగా విదేశీ వ్యాపారం చేశాడు!

ఆంగ్లేయులు టిపు గురించి సాహిత్యం, నాటకాలు, కథనాలు, కార్టూన్లు, పెయింటింగ్ లను వెలువరించడం, బ్రిటీష్ పార్లమెంట్ లో చర్చలను జరిపేవారంటే ఎంతటి అసాధ్యుడో అర్ధమవుతుంది!

ఆంగ్లేయులు బ్రిటన్ లోనూ, భారతదేశంలోనూ కూడా మన పాఠ్యపుస్తకాలతో సహా టిపు మీద అనేక విష ప్రచారాలు చేశారు. చివరికి టిపు మీద విషం కక్కిన ఆంగ్లేయులే టిపు పాలనను మెచ్చుకున్నారు. ఆంగ్ల సైనికాధికారి ‘అలెగ్జాండర్ డిరోం’, “టిపు రాజ్యంలో పల్లెలు, పట్టణాలు ఎంతో ఐశ్వర్యవంతంగా ఉన్నాయనీ, వ్యవసాయం చాలా సంతృప్తిగా, సమృద్ధిగా కొనసాగేదని, పరిపాలన ప్రజల పట్ల ఎంతో ప్రేమగా, వారికి మేలు చేసే విధంగా ఉండేదని” రాశాడు.

కల్నల్ ఎడ్వర్డ్ మూర్, టిపు రాజ్యంలో ప్రయాణిస్తుంటే పచ్చని పంట పొలాలు,కష్టించి పని చేసే ప్రజలు, కొత్తగా ఏర్పడిన పట్టణాలు, అభివృద్ధి చెందినవర్తక వ్యాపారాలు కనిపిస్తాయి. ఇవన్నీ ప్రజల సంతోషాన్ని ప్రతిబింబించి, ఇక్కడి ప్రభుత్వం ప్రజానుకూల ప్రభుత్వం అని మనకు తెలియజేస్తాయి.ఇది ఇక్కడ మనకు కనిపించే సుందర దృశ్యం” అని రాశాడు.

కల్నల్ మెకంజీ టిపు బలమైన పరిపాలనా వ్యవస్థ, సైన్యం లోని క్రమశిక్షణ అతన్ని సమకాలీన భారతీయ సంస్థానాధీశులందరి కంటే ఉన్నతుడిగా, శక్తిమంతుడిగా ఉంచాయి” అని రాశాడు.

ఒక బ్రిటీష్ సైనికుణ్ణి పులి రూపంలో ఉన్న టిపు చీల్చి చెండాడుతున్నట్లున్న ఎం ఎఫ్ హుస్సేన్ చిత్రాన్ని బ్రిటీష్ వారు లండన్ మ్యూజియంలో భద్రపరుచుకున్నారట! (ఈ పుస్తకం అట్ట పేజీ మీద అదే బొమ్మ ఉంది) ఆంగ్లేయులు ద్వేషంతో “మైసూరు పులి” అని పేరు పెట్టుకుని పిల్చుకునే మన “టిపు పులి” ని మనం ఆరాధనగా చరిత్రలో చిరస్థాయిగా నిలుపుకుందాం!

ఈ చరిత్ర రచనను యార్లగడ్ద నిర్మల గారు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఎంతో ఆర్ధ్రతతో, గ్రంధస్థం చేశారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ దీన్ని ప్రచురించింది.

దీని వెల 150రూ. ప్రతులకు, వివరాలకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్

ప్లాట్ నెం. 85, బాలాజి నగర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్ 500006.

ఫోన్:23521849.

 

శివలక్ష్మి

7 comments

Leave a Reply to Rajeswari Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పదేళ్ళ క్రితం అనుకుటాను. హిందూ పత్రికలో లండన్ లో బయట పడిన టిపు ఉంగరం ముద్రించారు. దాని మీద అత్యంత స్పష్టింగా ‘ రామ్ ” అనే దేవనాగరి అక్షరాలు వున్నాయి.
    తను యుధ్ధానికి బయలు దేరబోయే ముందు మైసూరు లోని చాముండేశ్వరి దేవాలయానికి వెళ్ళే వాడని కూడా నశీరహమ్మద్ రాశారు. బహుశా యివన్నీ పుస్తకంలో వుండి వుంటాయి. ప్రజల మతవిశ్వాసాలను కేవలం గౌరవించటమేకాక స్వంతం చేసుకున్నవాడు టిప్పు సుల్తాన్ . రాచరిక యుగంలో ప్రజాస్వామిక బీజాలను చైతన్యవంతం గా గ్రహించిన వాడు. గిరీష్ కర్నాడ్ అన్నట్లు అతను ముస్గిం కాకుంటే ఝాన్సీ లక్ష్మి కంటే ఎక్కువ కీర్తి గడించి వుండేవాడు.
    శివలక్ష్మి గారి పరిచయం చాలా ఆసక్తికరంగా వుంది. అభినందనలు. – దివికుమార్

  • Sir,
    చాలా బాగా రాసారు ఇవన్నీ చరిత్ర పుస్తకాలలో ఉన్నవే కానీ అందులో లేనివి ఉన్నాయి.మేల్కొటే గ్రామంలో ఇప్పటికి కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు దీపావళి పండుగ చేసుకోరు.కారణం ఒక దీపావళికి టిప్పు సుల్తాన్ 800 మంది బ్రాహ్మణులను వారి స్త్రీలు పిల్లల తో సహా చంపించాడు.ఆడవాళ్ళని మానభంగం చేసాడు చేయించాడు , ఇవన్నీ చరిత్ర పుస్తకాలలో రాయరు. check చేసుకో గలరు. ఇదే కాదు మన పుస్తకాలలో రాయని చరిత్రలు ఎన్నో వాటి వల్ల చాలా మంది గొప్ప వ్యక్తులు గా మన పిల్లల కు పరిచాయం కావటం మన దౌర్భాగ్యం.

    • Rajeswari Garu,

      Meeru cheppina dantlo kontha nijam undi . oka raju konni manchi panulu konni chedda panulu chestadu.
      ippudu vunna mata moudyam vaaru chedu matrame chustaru.. Writer wrote most good deedsdone by tiger of mysore Tipu Sultan

  • చాలా ఇన్ఫర్మేటివ్ వ్యాసం. బాగుంది 👏👏👏
    సంజయ్ ఖాన్ సీరియల్ కూడా తీసినట్లున్నారు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు