తెలుగు కథకు కొత్త కిటికీ .. ఇద్దరు శస్త్రకారులు

‘విరాటపర్వం’ సినిమా చూసిన తర్వాత మా అమ్మాయి ఒక ప్రశ్న వేసింది.

నక్సలైట్‌ అంటే ఎవరు?

మొత్తానికి ఈ సినిమా, వామపక్ష సాయుధ ఉద్యమాల గురించి బొత్తిగా తెలియని, ఆసక్తిలేని ఈ తరం ఆలోచనల్లోకి ఒక ప్రశ్నను నాటగలిగిందని అర్ధమైంది.

‘విరాటపర్వం’ సినిమా చూస్తున్నపుడు నాకు షహీదా బాగా గుర్తుకు వచ్చింది. మావోయిస్టు రహస్యోద్యమంలో ముప్పయి ఏళ్లకుపైగా ఉన్న షహీదా రాసిన కథలు గుర్తుకు వచ్చాయి. షహీదా ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎలా ఉంది? అసలుందా? అడపా దడపా కనిపిస్తున్న ఆమె కథలే ఆమె ప్రాణాలతోనే ఉందని ఊరటనిస్తుంటాయి. ‘జాజిపూల పరిమళం’ పేరుతో షహీదా రాసిన 33 కథలను విరసం ప్రచురించింది. ‘ఇద్దరు శస్త్రకారులు’          అనేది ఈ పుస్తకంలోని ఆఖరి కథ. ఈ కథలో ఇడిమె అనే ఆదివాసీ దళ సభ్యురాలు కొన్ని పాత జ్ఞాపకలను బయటకు తీసింది.

90ల మధ్యకాలంలో నక్సలైట్‌ నాయకులను ఇంటర్వ్యూ చేయడానికి అడవుల్లో తిరిగిన రోజుల్లో నాకూ, ఉత్తరాది జర్నలిస్టు ఒకరికీ  అడవి దాటేదాకా రక్షణ కోసం కొందరు మిలిటెంట్లను నియమించారు. ఒక పగలంతా దట్టమైన అడవుల్లో నడక సాగింది. అలసటతో అక్కడక్కడా ఆగి బండలమీద నడుము వాల్చినపుడు తుపాకులతో మా వెంట ఉన్న దళసభ్యులతో మాట్లాడే అవకాశం దొరికేది. తెల్లగా, బక్కపలుచగా, మోకాళ్ల కిందదాకా వేలాడే జుత్తుతో ఒక అమ్మాయి కూడా మా రక్షణదళంలో ఉంది. ‘విరాటపర్వం’లో సాయిపల్లవి లాగే అతి సున్నితంగా కనిపించే రూపం ఆమెది. ఆమె రూపానికీ, ఆమె చేతిలోని ఎకె47 తుపాకీకి పొంతనే లేదు. ఒక చోట మధ్యాహ్నపు తిండి యేదో తిని బండలమీద వాలిన సమయంలో సెంట్రీలుగా కొందరు పహరా కాస్తుండగా ‘సాయిపల్లవి’ లాంటి అమ్మాయి మా దగ్గరే ఉంది. సంవత్సరాల పాటూ అడవుల్లోనే తిరుగుతూ ఉండే నక్సలైట్లకు అన్నం, పప్పు, వేపుడు, చారు, పెరుగు వంటి భోజనాలు ఎప్పుడూ ఉండవు. అడవులకు సమీపంలో ఉండే పల్లెలకు  రాత్రి పూట వెళ్లి ఇళ్లలో మిగిలిఉన్న అన్నం, కూరలు  ఒక గుడ్డలో మూటగట్టుకుని తెచ్చుకుంటారు.  యే అర్ధరాత్రికో మళ్లీ అడవికి చేరుకుని, మోసుకువచ్చిన మూట విప్పుతారు. దాని చుట్టూ కూర్చుని ఆవురావురమని తింటారు. అది గొప్ప విందుభోజనం వాళ్లకు. ఊళ్లకు దూరంగా ఉన్నపుడూ, పోలీసు నిఘా గట్టిగా ఉన్నపుడూ అడవి దాటరు. ఆ రోజుల్లో తిండికి పెద్ద సమస్య ఉంటుంది. అడవిలో దొరికిన వాటిమీదే ఆధారపడుతారు. అటువంటి సమయంలో ఏమి తిని కడుపునింపుకుటారు? అని అడిగినపుడు‘ సాయిపల్లవి’ ముఖంలో చిత్రమైన నవ్వు ఒకటి పూసింది. తామరతూడుల్లా ఉన్న వేళ్లతో తుపాకీని శుభ్రం చేసుకుంటూ ఆమె సమాధానం ఇలా చెప్పింది..

‘ ఒక్కోసారి పండ్లూ, కాయలూ కూడా దొరకవు. చుట్టూ జంతువులున్నా, వాటిని చంపకూడదనేది దళ నియమం. తప్పని సరి అయినపుడు బండల కింద దొరికే పాములనీ, కప్పలనీ తింటాం. పాము చర్మం వొలిచేసి పొట్ట శుభ్రం చేసి ముక్కలు చేసుకుని కాల్చుకుని తింటాం. పిడికెడంత కప్పల్లో కండ ఉండేది తొడ భాగంలోనే. రుచిగా ఉంటుంది’ ముఖంలో ఏ రకమైన భావకవళికలూ లేకుండా చేపల పులుసు గురించో, రొయ్యల వేపుడు గురించో చెప్పినట్టుగా ఆమె వివరిస్తూ ఉంటే నాకు దిగ్భ్రమగా ఉండింది. ఈ ‘సాయిపల్లవి’ కాల్చిన కప్ప మాంసం తినడాన్ని ఊహించుకోవడం నాకు కష్టంగా అనిపించింది.

చావు నీడలో ఉండే వీరికి బహుశా అదొక సాధారణ విషయమే కావచ్చు. బయట నుంచీ వచ్చిన నాకుగానీ, ‘ఇద్దరు శస్త్రకారులు’ కథలోని డాక్టర్‌కి గానీ అదొక దిగ్భారంతికర సమాచారమే. నడక అలసటతో మేము విశ్రాంతి కోసం ఆగినప్పుడు, ఆమె తన కిట్‌ సంచిలోంచి కాయితాలు బయటకు తీసి యేదో రాసుకుంటూ ఉండేది. దాదాపు 20 గంటల నడక ప్రయాణంలో ఆమె విశ్రాంతిగా ఎప్పుడూ లేదు.

పుట్టిన ఊరినీ, కన్న తల్లిదండ్రులనీ వదిలేసి ఇలా అడవి జీవితం దుర్బరం కాదా, విసుగు అనిపించదా?

‘పార్టీ అప్పగించిన పని కోసం అడవి దాటి నగరాల్లోనో, పట్టణాల్లోనో ఉండాల్సి వచ్చినపుడు ముళ్లమీద ఉన్నట్టు ఉంటుంది మాకు. ఎప్పుడెప్పుడు అదవిలో వాలిపోదామా అనిపిస్తుంటుంది. ఊళ్లలో అభద్రత వెంటాడుతూ ఉంటుంది. అడవిలో మాత్రం అమ్మ ఒడిలో బిడ్డకు ఉన్నంత భద్రతగా ఉంటుంది మాకు.’  అని చెప్పింది ఆమె.

‘ఇద్దరు శస్త్రకారులు’ కథలో పోలీసు దాడుల్లో తీవ్రంగా  గాయపడి, ఒక గిరిజన పల్లెలో కదల్లేని స్థితిలో రహస్యంగా ఉన్న రైనూ అనే మిలిటెంట్‌ను పట్టణం నుంచీ వచ్చిన డాక్టర్‌ ఆపరేషన చేశాక అడిగాడు.

‘మళ్లీ సైన్యంలోకేనా?’

‘ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా’

అని రైనూ చెప్పిన మాటలోని దృఢ సంకల్పం నాకు ‘సాయిపల్లవి’ లోనూ, చిరిగిన యూనిఫారం  భుజం మీద, తుపాకి పెట్టుకుని నడుస్తున్న  మిలిటెంట్‌ లోనూ కనిపించింది. ఈ కథలో డాక్టర్‌ పలువురికి ఇదే ప్రశ్న పదేపదే వేసినట్టే నేనూ చాలా మందిని అడిగాను. ఊత పదంలాంటి సమాధానమే అందరి నుంచీ వచ్చింది. చావు భుజం మీద చేతులేసుకుని నడిచేంత శక్తి వీళ్లకు ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతాం. ఎందుకిదంతా? ఇట్లా అవసరమా? వీళ్లు అలవోకగా ప్రాణాలు అర్పిస్తున్న పోరాటం విజయవంతం అవుతుందా? ఏ నమ్మకం వీళ్లని ఇలా నడిపిస్తోంది?

ఈ ప్రశ్నలన్నింటికీ ‘ఇద్దరు శస్త్రకారులు’ కథలో సమాధానాలు దొరుకుతాయి. ఈ కథ రాసిన షహీదా, తన స్వీయ అనుభవాలనే కథలుగా మలుస్తోంది.

పోలీసు దాడిలో తుపాకీ రజను పడి రైనూ రెండు కళ్లూ కనిపించకుండా పోయాయి.  అడవి అంచున ఉండే ఒక  పల్లె శివార్లలో పాడుబడిన గుడిసెలో అతన్ని ఉంచారు. పట్టణం నుంచి ఒక డాక్టర్‌ని బతిమాలి, ఒప్పించి తీసుకువచ్చారు.  అప్పటికే దళంలోని డాక్టర్‌  రైనూ కళ్లు శుభ్రం చేసి కళ్లు తెరవకుండా నల్ల పట్టీలు కట్టారు. కళ్లలో చుక్కల మందు వేస్తున్నారు. యాంటిబయాటిక్స్‌  ఇస్తున్నారు. అయినా ‘కాల్జేతులకంటే కళ్లు ముఖ్యం కదా’’ అని డాక్టర్‌ని తీసుకువచ్చారు. పేషెంట్‌ను చూశాక ‘అడవి డాక్టర్‌లు మరీ వెనకబడి లేరని అర్ధమైంది’. ఇడిమె ఇంజక్షన ఇస్తున్న నైపుణ్యం చూసి పట్టణం నుంచి వచ్చిన డాక్టర్‌ ఆశ్చర్యపోయాడు.  నిజానికి వెంటనే కంటి డాక్టర్‌ దగ్గరకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. దాడిలో దళసభ్యులు కొందరు గాయపడ్డారని తెలియడంతో చుట్టుపక్కల మందుల దుకాణాల వద్దా, ఆసుపత్రుల వద్దా పోలీసులు నిఘా పెట్టారు. ప్రాథమిక వైద్యం చేయగలిగిన ఒకరు ప్రతి దళంలోనూ డాక్టర్‌గా ఉంటారు. దళానికే గాక, ఆదివాసీ పల్లెల్లోనూ వారు వైద్య సేవలందిస్తారు.

ఇంటర్వ్యూల కోసం అజ్ఞాత నాయకులను దట్టమైన అడవుల్లో కలిసిన ప్రతిసారీ మిలిటెంట్లను చూసి నాకు కలిగిన ఆలోచనలే ఈ కథలో డాక్టర్‌కీ కలిగాయి.  దళంలోని వారినుంచి ఆయన సందేహాలకు సమాధానాలు లభిస్తున్నాయి. రోగంతో ఉన్నవారికి మందులే కాదు, బలవర్దకమైన ఆహారం ఇవ్వాలి. అయితే పండ్లు, గుడ్లు వంటివి దొరకకుండా సంతల్లో నిఘా ఉంటుంది. ఒక దశలో సంతలే మూయించారు గానీ, ఆదివాసీ ప్రజలు తిరగబడడంతో తెరవక తప్పలేదు. గ్రీనహంట్‌ పేరుతో మావోయిస్టు సైన్యంలో కొత్తగా ఎవరూ చేరకుండా చూడడం, వారికి డబ్బు అందకుండా అడ్డుకోవడం, సమాచారం, సప్లయ్‌లు చేరకుండా నిరోధించడం అనే నాలుగు అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టిందని డాక్టర్‌కి వివరించారు. ఇంత నిర్బంధంలోనూ పోరాటం కొనసాగుతూనే ఉంది.

దళంలోని పేషెంట్లు కోలుకుంటున్నది మందులతోకన్నా మనోధైర్యంతోనే అని ఒక మహిళా నక్సలైట్‌ చెప్పినపుడు, ‘ గుండెబలం గాయాల్ని మాన్పగల్గుతుందా?’ అనే సందేహం డాక్టర్‌కి కలుగుతుంది.  తనకు వచ్చిన అరాకొరా హిందీలో రోగాల గురించీ, వాటికి వాడాల్సిన మందుల గురించీ ఇడిమె రాసుకున్న నోటుపుస్తకాలు చూశాడు డాక్టర్‌. ఈ ప్రాథమిక వైద్య జ్ఞానంతో వీరు ఇంత యుద్ధమూ చేయగలరా అనిపించింది ఆయనకు. ప్రతి చిన్న అవకాశాన్నీ దళం వినియోగించుకుంటుందని ఆయనకు అర్ధమైంది. వైద్య సంబంధమైన అనేక సందేహాలను అడగి, ఆ ఆదివాసీ అమ్మాయి శ్రద్ధగా నోటుపుస్తకంలో రాసుకుంటూ ఉంటే ఆయనకు ముచ్చట వేసింది. సకాలంలో వైద్యం అందక ఒక్కోసారి దళంలోని వారు చనిపోతూ కూడా ఉంటారు. ఇంకా పెద్ద సంఖ్యలో గెరిల్లా డాక్టర్‌లు, మందులూ అవసరం. దళానికే కాదు, దళాలు తిరిగే ఆదివాసీ పల్లెలకూ అవసరం. కానీ ప్రభుత్వం అడ్డుకుంటుంది. అందుకే రోగాలతో ఆదివాసీ జనం చనిపోతూవుంటారు.

వైద్యంలో రెండు విషయాల్లో తమకు శిక్షణ అవసరం అని చెబుతుంది ఇడిమె. ఒకటి ప్రసవం చేయడం. రెండు సర్జరీలు చేయడం. ఈ రెండూ నేర్చుకోగలిగితే వేల ప్రాణాలు కాపడగలమని ఆశగా చెబుతుంది ఆమె. డాక్టర్‌ను నేర్పమనే అభ్యర్ధన ఆ ఆదివాసీ గెరిల్లా డాక్టర్‌ మాటల్లో ధ్వనిస్తోంది. నేర్పడం ఎంత ప్రాణాంతకమో తెలిసిన పట్టణ డాక్టర్‌ ఎటువంటి హామీ ఇవ్వలేకపోయాడు.

ఒక దాడిలో గాయపడ్డ పోలీసుకు,  గెరిల్లా డాక్టర్‌గా తాను వైద్యం చేసి బతికించిన సందర్భాన్ని ఇడిమె గుర్చు చేసుకుంటున్నపుడు ఆమె కళ్లలో కనిపించిన వెలుగు, మందుపాతర్లలో గాయపడ్డ పోలీసులకు ఎందరికో వైద్యం చేసే ఆ డాక్టర్‌ని కదిలించింది. ‘ఆత్మవిశ్వాసం కళ్లు, నిస్సహాయమైన ముఖాలు, పేదరికం.. బలికి తీసుకుపోయే గెర్రెల్లాగా’ కనిపించేవారు గాయపడ్డ పోలీసులు ఆయనకు. మరి వీళ్లో?

గాయపడ్డా దిటవు తగ్గని ధైర్యంతో, కోలుకుంటామనే నమ్మకంతో, తిరిగి మావోయిస్టు సైన్యంలోకి వెళ్లాలనే తహతహతో కనిపిస్తున్నారు.

ఇన్ని దెబ్బలు, ఇన్ని గాయాలతో చేస్తున్న యుద్ధం ‘గెలుస్తామనే అనుకుంటున్నారా?’ అని అడిగినపుడు రుక్మతి అనే మిలిటెంటు చెప్పిన సమాధానం, ‘ గెలుస్తామనుకోకుండా బహుశా ఎవరూ యుద్ధం చేయరేమో కదా డాక్డర్‌ దాదా. ప్రజలు ఈ యుద్ధాన్ని తప్పక గెలుస్తారు. మేం కాకుంటే మా తర్వాతి తరాలవారు’ అని. స్పష్టమైన ఎరుకతో చేస్తున్న పోరాటం అది. అందుకే కళ్లుపోయినా, కాళ్లు తెగినా, ప్రాణాలే పోతున్నా వాళ్ల కళ్లలో అఖండమైన విశ్వాసం ఆ సాధారణ పట్టణ డాక్టర్‌కి కనిపించింది. వాళ్లు కోరుకుంటున్నట్టుగా తాను గెరిల్లా దళాలకు వైద్యమూ, వైద్య శిక్షణా ఇవ్వగలడా? ‘ ఏమో.. తన తటపటాయింపును కూడా వాళ్లు గెలుచుకుంటారేమో’ అనిపించింది ఆయనకు, వీడ్కోలు చెప్పేటపుడు వాళ్ల గుండెల్లో వెలుగుతున్న దీపపు జ్వాలను చూసినపుడు.

తెలుగు సాహిత్యానికి అతి సమీపంగా ఉండే అరుదైన వస్తువు ఇది. బయట నుంచి సానుభూతితోనో, సహానుభూతితోనో కథలు రాయడం వేరే. ఆయుధం చేతబట్టుకుని పోరాడేవారు, కలం పట్టి కథలు రాయడం వేరే. ప్రతి అనుభవాన్నీ యధాతధంగా రాసేయలేరు. రాసిన సమాచారంలో నుంచి ‘శత్రువు’ దేనిని పసిగడతారో అనే ఆందోళన ఉంటుంది. సాంకేతిక జాగ్రత్తలు, స్వీయ నియంత్రణ తప్పనిసరి. కథారచనను తమ భావజాల ప్రచారానికే ప్రధానంగా ఉపయోగించుకోవాలనే ఆలోచనవల్ల సాయుధపోరాటాన్ని వస్తువుగా స్వీకరించిన చాలా కథల్లో శిల్పనిర్మాణం బలహీనంగా కనిపిస్తుంది. షహీదా, మిడ్కో వంటివారు ఈ బలహీనతను జయిస్తున్నారు. రహస్యోద్యమ అనుభవాలను కథలుగా రికార్డు చేస్తున్నారు.  ‘ఇద్దరు శస్త్రకారులు’ కథ అటువంటిదే.

ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు

17 comments

Leave a Reply to దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

    • జాజిపూల పరిమళం కథా సంపుటి లభ్యం అవుతుందా? అయితే వివరాలు తెలియజేయండి.

      • ఎంతో బాగుంది కథను వివరించిన తీరు. చావు అంచున నిలబడి ప్రజలకోసం పోరాడే తీరు అబ్బురం.

        చాలా బాగుంది.

      • అవుతుంది. నవతెలంగాణ, నవోదయ బుక్ షాప్స్ లో ప్రయత్నించండి.

  • ఇప్పుడే కాదు సార్ ఆ రోజుల్లో , వారితో కలిసి సాగించిన ప్రయాణం, అక్కడ ఇంటర్వ్యూ వరకుర్ ఆంధ్ర జ్యోతి మొదటి పేజీలో చదివిన కథనాలు ఇప్పటికింకా గగుర్పాటు నే సార్..

  • కళ్ళ ముందు అడవుల్లో ఉండే అన్నల దుస్థితిని అక్షరాల్లో కనిపించేటట్టు చేశారు.

  • ఒక ప్రకటన వచ్చేదాకానో, ఒక కొత్త కథ చదివేదాకానో వాళ్ళు బతికున్నట్లే. ఎంత ప్రాణం పెట్టి రాసావ్ ఉమా! కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేడులో కూడా బతకలేకపోతున్న మన రేపటి కోసం బతుకుతున్న నీళ్లలో చేపలు వాళ్ళు.
    I hug you to my heart ❤️

  • Inspiring.The present commercial medical practice can never understand the nuances of these values.its buy a seat,buy a degree and siphon public money through investigationns and procedures presently.Insurance for health is another offshoot of profitability in health care.Yes. the present generation cannot afford even a few hours of hungry stomach and service without remuneration…Nothing Humane is existing…Currency and Data exploitation is the order of the day.Thanks for giving this story here.

  • ఒక కొత్త ప్రపంచం లోని కష్టాల్నీ ఇబ్బందుల్నీ అనివార్యతల్నీ అద్భుతంగా ఆవిష్కరిచారు, ఉమా గారూ

  • గొప్ప అనుభవాలు ,గొప్ప అనుభూతులు అంతకు మిచి చక్కటి వివరణాత్మక విశ్లేషణ.. నాకైతే కొత్తనిపించలేదు.

  • ఉమా అత్యద్భుతంగా గుండె పిండి రాసినావు .నీ ఈ ఆవిష్కరణ తర్వాత ఏమి కామెంటు చేసినా బాగోదు .మన:పూర్వక అభినందనలు

  • నక్సల్ ఉద్యమం పట్ల మొదట్లో మా తరానికి ఉన్న నమ్మకం ,ప్రశ్నలు ఇక్కడ కనిపించాయి .జవాబులకోసం ఆ కథలు చదవాలన్న మాట .
    థ్యాంక్యూ.

  • ఎంతో బాగుంది కథను వివరించిన తీరు. చావు అంచున నిలబడి ప్రజలకోసం పోరాడే తీరు అబ్బురం.

    చాలా బాగుంది.

  • ఈ కథ గురించి అల్లం రాజయ్య తరచూ తన వ్యాసాల్లో ఇంటర్వ్యూల్లో ప్రస్తావిస్తాడు. దండకారణ్య రచయితల కథలెన్నో బయటి ప్రపంచానికి తెలియకుండా పోయాయి.
    ఈ లోటుని తీర్చే గొప్ప ప్రయత్నం ఉమా సమీక్ష.
    Thank you Uma and Afsar for introducing this story

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు