తెలంగాణ పల్లె పదాల బుట్ట అన్నవరం దేవేందర్

అక్టోబర్ 16 అన్నవరం దేవేందర్ సమగ్ర కవిత్వం ఆవిష్కరణ సందర్భంగా…..

దేవేందర్ మా తెలంగాణ నేల కన్న అపురూపమైన కవి.

అతని భావాలు స్వచ్చమైనవి. భాష జీవ భాష. అతని కవిత్వమంతా తెలంగాణ పలుకుబడి అందంగా ఒదిగిపోయింది. పంజాబ్, కాశ్మీర్ లలో కల్లోలాలకు మధనపడి, బోపాల్లో జరిగిన సంఘటనలకు బాధ పడి కన్నీళ్ళతో తన అక్షర పయణాన్ని 1988లో ఆరంభించారు అన్నవరం దేవేందర్.  జలపాత ప్రవాహ జ్ఞాపకాలతో జడివానలో మత్తడి పై అడుగులేసిన అనుభవంతో  బాలశిక్ష లో దాచుకున్న నెమలి కన్నుతో 2001లో కవిత్వ ‘తొవ్వ’లో అడుగిడారు.  పల్లెతనం పీల్చిన ప్రపంచీకరణకు వలవలా ఏడుస్తూ అక్షరాల ‘నడక’ సాగించారు. కరీంనగర్ మట్టి పిడికిట్ల పట్టుకుంటూ చెమట కన్నీళ్ల మిశ్రమంతో కరీంనగర్ చెరువుల ఒడుపుగా ‘బుడ్డ పర్కలు’ పట్టి తెలంగాణ సాహిత్య లోకానికి అక్షర పొత్తాలనందించారు.

జూకంటి జగన్నాథం దస్తావేజుతో నలిమెల భాస్కర్, మద్దికుంట లక్ష్మన్, పత్తిపాక మోహన్, పెద్దింటి అశోక్ కుమార్, కొలిపాక శోభారాణి సాక్షులుగా కరీంనగర్ ‘మంకమ్మతోట లేబర్ అడ్డా’లో కూలీల బక్కచిక్కిన దేహాల అవస్థలను లోకానికి తెలిపిండ్రు అన్నవరం దేవేందర్. చినుకులు కురువని పల్లెలు ఎల్లడొడితే అడ్డ మీద కూలీలైన పల్లీయుల బతుకు బాధను పుస్తక తనువంతా రాసిండు. తన భాషను అంబుక్క పెట్టిన తీరుకు కలిపి కొత్త వ్యాకరణం రాసిండు. లెక్కల్లో అన్నీ పొక్కలే అంటూ పాలకుల వివక్షను ఎండగట్టిండు. కొత్త గుణకార లెక్కలు దీసిండు.

హుస్నాబాద్ లో ఎనభై తొంభై దశకాల మధ్య పారిన నెత్తుటి ధారలకు సజీవ సాక్షమయిన మల్లె చెట్టు చౌరస్తాలో వెలిసిన ‘బొడ్డు మల్లె చెట్టు’ ను జ్ఞాపకాల పొత్తం చేసిండ్రు అన్నవరం దేవేందర్. తపిస్తున్న పల్లెను బతికించండి, పరితపిస్తున్న పల్లెకింత జీవగంజి పోయండి అంటూ కవితల నిండా ఎక్కెక్కి పడి ఏడుస్తడు. పల్లె వెయ్యి వచ్చలైన గుండెపాట అంటడు. కోటి లింగాలను రెండు వేల ఏండ్ల పై నాటి కోట అని తెలుగు జాతికి పెద్దర్వాజ అంటడు.

ఊరు వాడ  పట్నం పల్లెల అల్లిబల్లిగ ఒక్కటిగ అల్లుకున్న తీరును ‘పొద్దు పొడుపు’గ వివరించిండు. ఒక సైగ ఒక కేక ప్రత్యేకమైన శబ్ద సంకేతం సాదుకం జీవులకు అయస్కాంత వలయం అంటూ జీవ భాష రహస్యం తేటతెల్లం జేస్తరు. పుట్లకు పుట్లు దినుసు పండిచ్చి దేశానికి బువ్వ పెట్టిన రైతు చితికి దు:ఖ పడుతడు.  తినమరిగిన కోండ్రుగాడు ఊకెనే పోతడా అని మంత్రాలకు చింతకాయ రాలదంటూ తెగించి కొట్లాడుతూ, రాళ్ళు రువ్వాలె లేకుంటే రాల గొట్టాలే అంటూ ఉద్యమ పాఠాలు నేర్పుతరు.

మలి దశ తెలంగాణ పోరాటం, తెలంగాణ ప్రకటన, పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్ పాసవడం మొదలయిన ఆనంద విషాద సంఘటనల సమాహారం ‘పొక్కిలి వాకిళ్ళ పులకరింత’ల కైతలు చేసిండ్రు అన్నవరం దేవేందర్. చిచోర అంటూ ఆగ్రహించిన వారే ది బిల్ ఈజ్ పాస్డ్ అంటూ హర్షం వ్యక్తం చేస్తారు.

సృష్టి రహస్యం ఎంతటి మార్మికతో కుండ సృష్టి అంతటి క్రియాత్మకత అంటూ ‘బువ్వ కుండ’లో కమ్మటి తెలంగాణ పదాల భోజనమందిస్తరు.  సొగసైన తెలంగాణ భాషా పదాలతో ‘ఇంటి దీపం’ వెలిగించారు. ఏడాది పాటు ఎవుసం చేసుకుంటనే గడిపినా నాలుగు వేళ్ళు నోట్లోకి వెల్లని రోజులు ఇవి. రైతు పక్షపాతంతో ప్రపంచానికి తిండి పెట్టె ‘వరి గొలుసులు’ పచ్చకుండాలంటారు అన్నవరం దేవేందర్. పుట్టిన పుట్టుకనే బతుకుకు ‘గవాయి’ అంటరు. కాలం బహురూపులది అంటూ ఈ కాలానికి తగిన కవిత్వం రాస్తరు. జీవితనికి అవసరమైన కవితలు ‘జీవన తాత్పర్యం’లో కనిపిస్తయి.

తనకు ఎదురైన ప్రతి సందర్భాన్ని అక్షరాలుగా చేసుడు ఆయన నుంచే నేర్చుకోవాలే. కవిత్వం చేసుడు ఎంత ఇష్టమో   ముచ్చట్లు చెప్పుడు అంతా ఆరాటం వీరికి. వ్యాసం రాసుడు అంత అల్కగ. ‘ఊరి దస్తూరి’ నిండా ఊర్లే ముచ్చట్లే. తెలంగాణ పల్లెల్లో ప్రజల వాడుకలో వున్న ప్రతి పదాన్ని, సందర్భాన్ని అక్షరాలుగా రాసిండ్రు. అందుకే మా తెలంగాణ పల్లె పదాల బుట్ట అన్నవరం దేవేందర్. అతని బృహత్కవితా సంకలనాల ఆవిష్కరణ 16 వ తారీఖున కరీం నగర్ లో వైభవంగా జరుగుతోంది. అతనికి శుభాకాంక్షలు. రెండు సంపుటాల ధర 1000/- కావల్సిన వాళ్ళు +91 94407 63479  కి  సంప్రదించగలరు.

*

 

రవీందర్ విలాసాగరం

5 comments

Leave a Reply to అన్నవరం దేవేందర్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచిగ, ఆల్కగ, సాదా సీదగ రాసినవ్…..

  • బా రాశారు సర్. మీరు మరిన్ని చక్కటి వ్యాసాలు రాయాలని కోరుతున్నాను.

    • ధన్యవాదాలు సార్. తప్పకుండా

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు