ఆకుపచ్చని లోకంలో
-పాపినేని శివశంకర్
అనాది హరిత స్వప్నం
ఈ ప్రపంచం
ఎన్నడో విప్పారిన వింత పుష్పం
ఎల్లలు లేని నాడు కల్లలు లేని నాడు ఏ తొడుగులూ లేని నాడు
ప్రకృతీ మనిషీ ఒక్కటిగా ఉన్ననాడు
అడవి అతనికి నీడ నిచ్చింది నిప్పు నిచ్చింది
ఋతువులు పరిణామాన్నిచ్చాయి
నదులు కదలిక నిచ్చాయి పర్వతాలు పోరాట ధైర్యానిచ్చాయి
అడవి అతని మాతృగర్భం ప్రకృతే తొలి పాఠశాల
ఆకుపచ్చని లోకంలో ఆశ్రమాలు వెలసినప్పుడు
వృక్షమూలం గురుపీఠమైంది
జీవిత మూలాలు వెదుకుతూ
అడవికి చేరిన అహింసామూర్తికి
వృక్షమే మహాబోధి అయ్యింది
చెట్టు మన ఆదిమ దేవత
*
బహుశా ఒక స్వప్నాన్ని మోస్తూ మోస్తూ మనిషి అడవిని దాటాడు
ప్రకృతి నుంచి ప్రసవ రహస్యం తెలుసుకున్నాడు
అడవిబిడ్డ భూమిపుత్రుడయ్యాడు
నేల మహా సృష్టికర్త
మట్టి చేతుల్లోంచి జారిన విత్తు మెత్తమెత్తగా
నేల్లోంచి మొక్కై మొలవటం ఒక అద్భుత దృశ్యం
విశాలాకాశం కింద నల్లరేగడిలో చాళ్లు చాళ్లుగా
పైరగాలికి పరవశించే మొలకచేను ఒక అద్భుత దృశ్యం
కుంట గట్టు మీద నడెండలో నిలబడ్డ జమ్మిచెట్టు
కూలీల చెమట తుడవటం ఒక అద్భుత దృశ్యం
చెరువొడ్డున ఒకళ్ళు నాటిన మొక్క మన కళ్ల ముందే
మన కాళ్లూ చేతులూ దాటి తల దాటి మబ్బంత మర్రిచెట్టై
ఊడల కాళ్ల మీద నిలిచి ఊరన్ని పిట్టలకి గూడునివ్వటం
తరతరాలకి నీడ నివ్వటం ఒక అద్భుత దృశ్యం
మొక్క కూడా మనిషే – ఆకలి దప్పికా అనంత ప్రేమ
*
బహుశా ఒక స్వార్థాన్ని మోస్తూ మోస్తూ మనిషి నాగరికుడయ్యాడు
స్వప్నం భగ్నమై దృశ్యం ధ్వంసమై
మట్టితో తొలి రక్తబంధం తెగిపోయింది
తనకీ తన చుట్టూ ఉన్నదానికీ సామరస్యం తీరిపోయింది
అసహజత్వం అమానవీకరణ
సుడేసిన యంత్రధూమాల్లో మానవారణ్యాలు
మానవారణ్యాల్లో లోహవృక్షాలు
లాభాల వేటలో పక్షీ పశువూ, చెట్టూ చేమా అన్నీ పరాయివే
చల్లని నీడలు కరిగిపోయి
కిలకిలలూ, కువకువలూ ఆవిరై
నదులూ అంతర్నదులూ కలుషితాలై –
ఇప్పుడు ప్రకృతే మనిషికి ప్రథమ శత్రువు
క్రౌర్యానికి రూపం లేదు – అది కనబడదు గాక కనబడదు
నేల మూగది – ఆక్రోశం వినబడదు గాక వినబడదు
బహుశా రేపు మన పిల్లలకి మోడులు మిగిలిన ఎడారి వారసత్వమిస్తామేమో
నిర్జీవ నదీనదాల నిస్తామేమో
విషవాయు మేఘాల మధ్య ఆక్సిజన్ తొడుగులిస్తామేమో
తడి లేని గుండెలతో పిడికెడు అణుధూళి నిస్తామేమో
*
దేంతో సామరస్యం కోల్పోయామో అది మనల్ని వదిలిపెట్టదు
అదే చెదిరిన దృశ్యం మనల్ని నిశ్శబ్దంగా వెన్నాడుతుంది
మన తప్పిదాన్ని ఎల్లప్పుడూ గుర్తు చేస్తుంది
*
ఆత్మల కాలుష్యమే ఆధునిక సమస్య
మట్టి మీదా బతుకంతా ఆవరించిన పచ్చదనం మీదా
మమకారం చచ్చిపోతే
చేతులు విధ్వంస పరికరాలుగా మారిపోతే
మనిషి కంటే వ్యర్థపదార్థం లేదు
ప్రకృతేనా మనిషికి చెందేది?
మనిషి కూడా ప్రకృతికి చెందుతాడు
ఆకుపచ్చని లోకంలో మనిషి కూడా మొక్కే
ఆకలీ దప్పికా పిడికెడు హృదయమూ
దూరదర్శన్, భావ ఉగాది, 1994.
( ” ఆకుపచ్చని లోకంలో ” కవితాసంపుటి నుంచి )
పర్యావరణ స్పృహతో మానవ పరిణామ దశలను పరిశీలించిన కవిత ఇది. స్థూలంగా మూడు దశలను ప్రస్తావించారు కవి. ఒక్కో దశలో ప్రకృతితో మనిషి సంబంధం ఎట్లా సాగుతూ వచ్చిందో చెప్పుకుంటూ వెళ్ళే ఈ కవిత పాపినేని శివశంకర్ రాశారు.
మొదటి దశలో – అడవి, ” అతని” మాతృగర్భం. ప్రకృతే పాఠశాల. వృక్షమూలం గురుపీఠం. చెట్టు దేవత. మనిషి ప్రకృతిలో ఒక భాగంగా బతికిన దశ అది. మొత్తంగా ప్రపంచం ఒక ఆకుపచ్చని లోకం, ఆ దశలో.
తర్వాతి దశలో – ” అడవి బిడ్డ భూమిపుత్రుడయ్యాడు”. “ప్రకృతి నుండి ప్రసవ రహస్యం తెలుసుకొని” పంటలు పండించడం నేర్చుకున్నాడు. ఈ దశలో మనిషి మట్టికి మరింత దగ్గరయ్యాడు. సమస్త ప్రాణి ప్రపంచం తన వంటిదేనని అతను తలపోసిన దశ ఇది.
అనంతర దశలో – మనిషి నాగరికుడయ్యాడు. ఈ దశ గురించి మాట్లాడటమే ఈ కవిత ప్రధాన లక్ష్యం అనిపిస్తుంది.
” బహుశా ఒక స్వార్థాన్ని మోస్తూ మోస్తూ మనిషి నాగరికుడయ్యాడు” అన్నది ఈ కవితలో ఒక కీలక వాక్యం. ఆధునిక మానవుడు లాభాల వేటలో పడ్డాక, ఇక పక్షీ పశువూ, చెట్టూ చేమా అన్నీ అతనికి పరాయివయ్యాయి. నదులూ, అంతర్నదులూ కలుషితమయ్యాయి. మనిషిలోకి సరికొత్త క్రౌర్యం ప్రవేశించింది.
ఎక్కడ మొదలైన మనిషి ఎక్కడికి దాకా ప్రయాణించాడు!? ఇదీ ఈ కవి, ఈ కవితలో వేయకుండా వేస్తున్న ప్రశ్న.
” బహుశా రేపు మన పిల్లలకి మోడులు మిగిలిన ఎడారి వారసత్వమిస్తామేమో
నిర్జీవ నదీనదాల నిస్తామేమో
విషవాయు మేఘాల మధ్య ఆక్సిజన్ తొడుగులిస్తామేమో
తడిలేని గుండెలతో పిడికెడు అణుధూళి నిస్తామేమో “
ఈ వాక్యాల్లో ప్రవహిస్తున్న ఆవేదనను, ఉద్వేగాన్నీ గమనించాలి.
ఈ మొత్తం స్థితికి కారణం ఏమిటన్నది కవి అన్వేషణ. “ఆత్మల కాలుష్యమే ఆధునిక సమస్య ” అని నిర్ధారణ.
ఈ కవితను ఒక తాత్విక ఆలోచనతో ముగించారు కవి.
” ప్రకృతేనా మనిషికి చెందేది?
మనిషి కూడా ప్రకృతికి చెందుతాడు
ఆకుపచ్చని లోకంలో మనిషి కూడా ఒక మొక్కే
ఆకలీ దప్పికా పిడికెడు హృదయమూ”.
ఆధునిక మానవుడికి అవసరమైన ఒక చింతనను ఈ కవిత సరళంగా అందిస్తున్నది. మనిషి ప్రకృతితో సామరస్యంతో బతికే ఆకుపచ్చని లోకాన్ని తిరిగి కలగంటున్నది. చారిత్రక, ప్రాకృతిక అవగాహనలను కలిగిస్తూనే ఇవాళటి సమాజానికి అవసరమైన పర్యావరణ స్పృహను ఆర్ద్రంగా అందిస్తున్న ఈ కవితను మళ్ళీ ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
*
”ప్రకృతేనా మనిషికి చెందేది?
మనిషి కూడా ప్రకృతికి చెందుతాడు
ఆకుపచ్చని లోకంలో మనిషి కూడా ఒక మొక్కే
ఆకలీ దప్పికా పిడికెడు హృదయమూ”
ఎప్పటికీ గుర్తుండే గొప్ప వాక్యాలు. విశ్లేషణ బాగుంది.
ధన్యవాదాలండీ!