తాయిమాయి తండ్లాట 

అతనిలో పూర్తిగా బయల్పడని తెలంగాణతనం ఉంది. నాకు ఈ ప్రాంతమంటే కేవలం వేషభాషలు కాదు. ఒక వ్యక్తిత్వం. అందుకే అతనివంటి మిత్రులవలనే నాకీ ప్రాంతం గురించిన ప్రాథమిక అవగాహన ఏర్పడినది.

నాకు గాజోజు నాగభూషణం గారు ‘వాళ్ళు ఇల్లు చేరాలి’ అనే కవిత ద్వారా మరింత పరిచయమయ్యారు. బహుశా అది 2020 ఏప్రిల్ కావచ్చు. ఆ కవితలో ని ‘ఆదిమానవుడి ఆకలి వేట కాదీ నడక, ఆధునిక అంతరాల కంచెలపై పావురాల నెత్తుటి పాదముద్రల పాట’ వంటి వాక్యాల్లో అతడి వేదన ఒక పాఠకుడిగా నన్ను కదిలించివేసింది. పూట పూటకీ అన్నం ముద్ద వెతుక్కునే రోజువారీ కూలీవాని జీవితంలో కరోనా చేసిన విధ్వంసాన్ని ఒక కవి ఎలా చూస్తున్నాడు ? ఆ మనోవ్యాకులతని ఎలా మనకి బట్వాడా చేస్తున్నాడు ? ఆ అశాంతికి మూలాల్ని ఎక్కడున్నాయో ఎలా చూపిస్తున్నాడు ? ఇలా అనేకానేక ఆలోచనల్లోకి నెట్టివేశాక అతన్ని తరచూ అనుసరించడం మొదలుపెట్టాను. ఇలాంటి కవిని అనుసరించడం కూడా మన వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించుకోవడంగానే భావిస్తాను.

గాజోజును అటు తర్వాత ఉద్యోగరిత్యా నేను కరీం నగర్ రావడంతో మరింత దగ్గరగా చూసే వీలు కలిగింది. అతను కవిత్వం, పాట, కథ వంటి ప్రక్రియల్లో కృషి చేయడం గమనించాను. అనేక సభల్లో అతనికి ఇక్కడి ప్రజ ఇచ్చే గౌరవం చూసి ఆశ్చర్యపోయాను. కేవలం ఒక కవిత్వ పుస్తకం వేసిన ఇతను ఇంత గౌరవపాత్రుడెలా అయ్యాడూ అన్నది నా సందేహం. ఇలా ఆలోచించడం తప్పుగావచ్చు. అతనికేం ఘనవారసత్వం లేదు. అధికారిక, రాజకీయ స్థాయీ ప్రభావాలూ లేవు. నాకు ఆలస్యంగా అర్థమయిందేమంటే అతనికొక విశాల ఉద్యమ సాంస్కృతిక నేపథ్యం ఉంది. ఉన్నంత మాత్రాన ఏమిటయ్యా గొప్పదనం అనిపిస్తే నేను స్తిమిత పడ్డానికి ఒక కారణం దొరికింది. అతని వ్యక్తిత్వం పై ఈ నేల నాలుగు చెరగులా వ్యాపించిన తెలంగాణ సంస్కృతి యొక్క ప్రభావం చాలా గాఢంగా ఉంది. అది అతని మూర్తిమత్వ వికాసంలో ప్రముఖ పాత్ర వహించింది. ఒక సామాజిక సంబంధాన్ని నిర్వచించుకోవడంలో మానసిక స్వతంత్రత లేదా పరస్పరావగాహన యొక్క మూలాలు దాగి ఉంటాయి. ఇక్కడ ఎవరికన్నా ప్రముఖ మానసిక తత్వవేత్త ఎరిక్ ఫ్రాం గుర్తొస్తే తప్పు నాది కాదు. అది గాజోజులోని సామాజిక విలువల కుదురుకు చెందుతుంది. అందులోంచే అతని కవిత్వాన్నిగానీ, పాటను గానీ మరింకేదాన్నైనా చదవగలుగుతాం. అర్థం చేసుకోగలుగుతాం. మనిషి సామాజికంగా ఒక సృజనాత్మక జీవితం గడపడంలో ఉన్న ఆవశ్యకతని గాజోజు తన వ్యక్తిత్వం ద్వారా ప్రదర్శించగలిగాడు. అందులో ఉన్న నిజాయితీని కూడా నేను పరిగణించదలిచాను.

గాజోజు ప్రాణదీపం కవిత్వ సంపుటి 2021 లో వచ్చింది. ఎనభై కవితల పుస్తకం. కవి దూసిన కత్తై మెరిసేందుకు తన తల్లి ఎంత కష్టపడిందో ఈ పుస్తకం శీర్షిక కవిత తెలియజేస్తుంది. ఇదొక స్మృతి కవితే కావచ్చు, కానీ తల్లి పట్ల పిల్లల ఆలోచనలను ఈ కవిత ప్రతిబింబిస్తుంది. ఈ కవితను దెంచనాల semi biographical poem అన్నాడు. semi కన్నా full అనేవచ్చును అన్నంతగా తన తల్లి జీవిత చిత్రణ చేసిన కవిత ఇది. ఈ పుస్తకంలో ‘తల్లిపేగు కాలిన శోకం’ ఉంది. తల్లికోడితనం ఉంది. నైట్ డ్యూటీ చేసే డాక్టర్ల దగ్గరనుంచి, ఊరు వదిలివచ్చిన వలస గురించి, హాస్టల్ లో ఉండే పిల్లలు ఇంటికొచ్చి తిరిగి వెళ్ళడం గురించి – ఇలా ఈ పుస్తకంలో ఉన్న కవిత్వం అంతటి వెనుకా ఒక మాతృ హృదయం ఉంది.

ఒక స్త్రీత్వం ఉంది. దీన్నే గాజోజు కావ్య లక్షణం అనవచ్చును. అంటే కావ్యంలో కథ ఎలా తప్పనిసరిగా ఉంటుందో తెలిసినవారికి గాజోజులోని వస్తుబలానికిగల కారణం తెలిసివస్తుంది. దిశ వంటి అమానవీయ సంఘటనని కవితగా చేసినా, ఒక వాగు గురించి, కొండ గురించి, చెరువు గురించి, నదీ ప్రాకృతిక వనరుల గురించి మాట్లాడుతూ మనిషే లుప్తమయిపోయాడని దు:ఖిస్తాడు. అమ్మమ్మ ఊరు చదవండి. బతుకు పాఠం చదవండి. ఈ కవి కవి ఎలా అయ్యాడు, శిల్పిగా ఎప్పుడు మారాడు, ఎందుకు గానమయ్యాడు, చిత్రకారుడయ్యాడూ ఈ పుస్తకంలో మనకి ఆనవాళ్ళనిస్తాడు. ఎవరైనా ఒక సృజనరూపం దాల్చడం వెనుక సాంద్రంగా సారాంశం అయిన ఒక గుణసంపన్నతని (Quality Collective) ఈ కవిలో చూడవచ్చు. దాన్ని మాతృత్వాన్ని ఉన్నతంగా చూడటంలోంచి మనం దర్శించవచ్చు. దీన్ని సినారె ‘స్త్రీ సమారాధానము’ అన్నారొకచోట.

నాయని, కొప్పర్తిలో, అరసవిల్లి కృష్ణ వంటి వారి కవిత్వంలో ఎక్కువగా కనబడే లక్షణమిది అని నా భావన. స్త్రీకి కవికీ గల సంబంధంలో ఉన్న ఉదాత్తత గాజోజు కవిత్వాన్ని కలిపి కుట్టే ఏకసూత్రత. ఆఖరి కోరిక కవిత చదవండి, లేదా ఆకలి సంబంద్గం చదవండి. ఇది స్త్రీగురించి రాసిన కవితల్లోనే కనబడుతుందంటే పొరబాటు. గ్లోబరీనా తప్పుడు రిజల్ట్స్ తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులపై రాసిన మీరుండాలి కావచ్చు, వాళ్ళూ నేను వంటివి గమనించవచ్చు. ఈ లక్షణానికి రాయప్రోలు సుబ్బారావు గారు మొదటివారంటారు కానీ, భావకవిత్వ నేపథ్యంలోంచి గాక దీన్ని మరొక విశాల ప్రాంగణంలో చర్చించవచ్చు.

బహుశా ఇది అధ్యాపక వృత్తిలో ఉండే కవుల్లో ఎక్కువగా ఉండవచ్చు. వాళ్ళ అవగాహనలో సైకాలజీ పునాది ఉంటుంది. అందుకే గాజోజువంటివారి కవితల్లో మరణాన్ని ఎదిరించే ‘మరణాన్ని చిరునవ్వుతో స్వాగతిస్తా’ కవిత, జీవిద్దాం యథాతధంగా, పునరుత్తాన పుష్పం, కత్తివి నీవే ఖండిత శిరస్సూ నీదే వంటి కవితలు గాజోజులోని తాత్విక బలాన్ని నిరూపిస్తాయి. ఇవన్నీ అతని కవిత్వ వస్తు సముదాయం. శీతల పవనం  (నరెడ్ల శ్రీనివాస్), మిత్రుడు భద్రయ్య సహచరి ఉమ పోయినప్పుడు రాసిన నీ యాదులు, మచ్చప్రభాకర్ యాదిలో రాసిన జ్ఞానవృక్షం వంటి స్మృతికవితల్లో కూడా కవి తత్వబలం చూడగలుగుతాం. నలిమెల భాస్కర్, కందుకూరి అంజయ్య వంటి వారిపై రాసిన కవితల్లో అతనిలో ఉన్న అతి మెత్తటి మనిషి కనబడతాడు.

గాజోజు కవిత్వ వస్తువులో ఎంత అభ్యుదయకర, ప్రగతిశీల కవిత్వ వస్తువు ఉన్నప్పటికీ అది సున్నితంగా వ్యక్తీకరింపబడటం గమనించవచ్చు. అంటే ఆ విప్లవకర వస్తువు విప్లవకర శిల్పాన్ని ఆశ్రయించగలిగిందా లేదా అన్న విషయం. అది ఇంద్రావతిలో పూలను చల్లి ప్రణమిల్లాలి (పోయి రావాలి) అని రాసినా, తెలంగాణ కోసం యుక్తభూమి అన్న కవిత రాసినా, వీల్ చైర్ విస్పోటం లో ‘హితుడా నీ కోసం కార్చిన కన్నీటిలో అభిషేకించిన గుప్పెడు అక్షరాల్ని గుండె గుండెకూ తాకేలా లోకం వాకిట్లోకి విసిరేస్తున్నాను’ అని సాయిబాబాని తలుచుకున్నా గాజోజు వ్యక్తీకరణలో దయాపారావతాలున్నాయి. ఈ పదం తిలక్ ని గుర్తుకు తెస్తే దోషం నాది కాదు. ఆకలి ఆలాపనలు అన్న కవిత రైతు చట్టాల్ని గురించి ప్రస్తావిస్తుంది. రారా తిలక్ ని ‘సుకుమార హృదయ స్పందన శక్తి’ గలవాడిగా చెబుతాడు. అనుభూతిని వ్యక్తం చేయగల శబ్దశక్తికి అలంకార పుష్టికి తిలక్ గుర్తుంచుకోదగ్గవాడిగా మనం చదువుకుని ఉన్నాం.

గాజోజు అనుభూతివాది కాడు. అతని కవిత్వంలో భావసంపన్నత చాలా గొప్పగా పరిమళిస్తుంది. కాంపస్ కాంతులు కవితకి, ఉద్యమ నేపథ్యం వలన కొత్త జీవశక్తి చేకూరింది గానీ లేకపోతే గాజోజును మరొక విధంగా చూడవలసి వచ్చేదేమో అన్నంత లయాత్మకత (lyricalness) ఉంటుంది. పాటలో కూడా ప్రవేశం ఉండటం చేత గాజోజు కవితలో అణచిపెట్టబడి ఉన్న జీవనక్రౌర్యం మీద నిరసన స్పష్టంగా వినిపిస్తుంది. అనుభూతి దశను దాటిన వాస్తవిక చైతన్యం తెలిసివస్తుంది. ఇవన్నీ రంగరించుకుని గాజోజు రీతిని ‘సమన్వయ శిల్పం’ అనవచ్చును. చెంచు లోకం, ఆకాశతంత్రిపై ఆశల బాల్యం వంటి కవితల్లో గాజోజు రసప్రవృత్తి వస్తువును దాటి దేదీప్యమానం చేస్తుంది. కవిత్వంలో విస్తారత వల్ల కూడా శిల్పాధిక్యతకు అవకాశం ఏర్పడ్డది.

అయినప్పటికీ గాజోజు కేవలం ఉద్వేగజీవి కాడు. అతని కవిత్వ నిర్మాణంలో ఒక జాగరూకత ఉన్నది. అందులో సహజమైన తెలివిడి ఉన్నది. అందుకే దెంచనాల అతన్ని సంప్రదాయ హేతువాది అన్నాడు. చాలా చిత్రమైన మాట అది. గాజోజు వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పదం ఉపకరిస్తుంది. ఇది అతని శిల్పానికి ఎక్కువ అన్వయిస్తాను నేను.భాషను చాలా శుభ్రంగా ఉపయోగిస్తాడు. అతని పలుకుబడిలో పండితస్పర్శ ఉంటుంది.

గాజోజు కథలు బాగుంటాయి. తనదైన దృక్కోణాన్ని ఆవిష్కరిస్తాయి. మంచి కథలు రాసినప్పటికీ గాజోజును కవిగా నేను ఎక్కువ ఇష్టపడతాను. అతని కథల్లో కన్నా కవిత్వంలోనే అతను ఎక్కువ వ్యక్తం అయ్యాడు అనిపిస్తుంది. ఈ వ్యక్తం కావడానికి జీవితం అనేక సందర్భాల్ని ఇస్తుంది. వాటిని సద్వినియోగ పరుచుకోవాలి. అవకాశాల్ని అంది పుచ్చుకోవాలి. గాజోజుకు ఉన్న అనుభవం అతని రచనల్లో మరింత ప్రతిఫలించాలి. అతను సాదృశ్యం చేసుకున్న జీవన పోరాటం, అందులోని దౌర్భల్యం మరింత అక్షరీకరించబడాలి. అతని వయస్సుతో పోల్చినప్పుడు అతని రచనల సంఖ్య మరింత పెరిగి ఉండవలసింది అనిపిస్తుంది. బహుశా బాధ్యతలు అతణ్ణి కట్టడి చేసి ఉంటాయి. ఇప్పటికైనా అతను రెక్కలు విశాలంగా సాచి సాహిత్య గగనం పై మరింత ఎత్తు ఎగరాలి.

ఇవన్నీ ఒకెత్తు. నా నాలుగేళ్ళ కరీం నగర్ జీవితానికి గాజోజు అనేక మరపురాని జ్ఞాపకాలనిచ్చాడు. అందులో ఒప్పుకోళ్ళూన్నాయి, వాదోపవాదాల నడుమ అనేక మూల్యాంకనాలున్నాయి. అతనిలో పూర్తిగా బయల్పడని తెలంగాణతనం ఉంది. నాకు ఈ ప్రాంతమంటే కేవలం వేషభాషలు కాదు. ఒక వ్యక్తిత్వం. అందుకే అతనివంటి మిత్రులవలనే నాకీ ప్రాంతం గురించిన ప్రాథమిక అవగాహన ఏర్పడినది. ఇది గాక జీవితానుభవమూ, మానవ స్నేహశీలత కన్నా ఎక్కువ మరింకేముంటాయి. మనుషుల్ని కలిస్తేనే మానవ చరిత్ర తెలుస్తుంది. అతడు సంచరించిన, సజీవంగా బ్రతికిన నేల గురించి తెలిసివస్తుంది. గాజోజు వల్ల ఉత్తరతెలంగాణ నాకు ఎంతో సవ్యంగా బోధపడింది. అతను నన్ను తాయిమాయి జేశాడు.

*

శ్రీరామ్ పుప్పాల

ఈ తరం కుర్రాళ్ళలో శ్రీరాం కవిత్వాన్నీ, విమర్శనీ సమానంగా గుండెలకు హత్తుకున్నవాడు. అద్వంద్వం (2018) అనే కవితా సంపుటితో పాటు, బీమాకోరేగావ్ కేసు నేపథ్యంగా 1818 (2022) అనే దీర్ఘ కవితని ప్రచురించాడు. తనదైన సునిశిత దృష్టితో వందేళ్ళ వచన కవితా వికాసాన్ని 'కవితా ఓ కవితా' శీర్షికన అనేక వ్యాసాలుగా రాస్తున్నాడు. ఆ వ్యాస సంకలనం త్వరలో రావలసి ఉంది.

1 comment

Leave a Reply to chelamallu giriprasad Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు