తరాల మధ్య అంతరాలు

నిత్య తల్లి ఇచ్చిన పచ్చళ్ల పొట్లాలు, తినుబండారాల పొట్లాలు సూట్ కేస్ లో సర్దుకున్నది.ఆ పెద్ద సూట్ కేస్ ను, కంప్యూటరు, పర్సు ఇంకా చిన్న, చిన్న వస్తువులు పెట్టుకున్న బ్యాగ్ ను  తీసుకుని  హాల్లోకి వచ్చి  ‘ నాన్నా  నేను రెడీ ‘  అంది పెద్దగా.

శశిధరరెడ్డి,  శ్రీదేవిల ద్వితీయ సంతానం నిత్య. కొడుకు మహేష్ ఆమె కంటే నాలుగేళ్ల పెద్ద, బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. రెండు సంవత్సరాల  క్రితం పెళ్లి చేశారు , అతడికి ఒక బాబు .

నిత్య ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాసయింది. తల్లిదండ్రులు ఇంజినీరింగ్ చెయ్యమని బలవంత పెట్టారు. లోకంలో అందరూ డాక్టర్లూ, ఇంజనీర్లు అయితే ఇక మిగతా వృత్తుల సంగేతేంటి అని వాదించి , అందరినీ ఆశ్చర్యపరుస్తూ బి.ఏ లో చేరింది . ఆ తర్వాత సెంట్రల్ యూనివేర్సిటీలో కమ్యూనికేషన్ లో ఎం.ఏ చేసింది. ఫైనల్ ఇయర్ లో ఉండగా జరిగిన కాంపస్ ఇంటర్వ్యూలో చెన్నైలో బాగా పేరు పొందిన న్యూస్ పేపర్లో ఉద్యోగం వచ్చింది. ఎం.ఏ. చదవడం అయిన తర్వాత ఇప్పుడు ఉద్యోగంలో చేరడానికి వెళ్తున్నది.

తల్లిదండ్రులకి ఆమెను అంత దూరం పంపించడం ఇష్టం లేదు. హైదరాబాదులో ఉద్యోగం చేస్తుంటే ఏదో ఒక సంబంధం చూసి పెళ్ళి చేసి తమ బాధ్యత తీర్చుకోవాలని అనుకున్నారు. ఆధునిక భావాలు గల నిత్య దానికి ససేమారా అంది. “అన్నయ్యకి బెంగుళూరులో ఉద్యోగం వచ్చినప్పుడు మీరేమీ అడ్డంకులు పెట్టలేదే? నేను ఆడపిల్లననేగా నన్ను వేరుగా చూస్తున్నారు!” అని నిష్టూరంగా మాట్లాడింది. చివరకు వాళ్ళకు ఒప్పుకోక తప్పలేదు.

ఆ రోజు ఉదయం పది గంటలకు ఫ్లైట్. శశిధర్ ఆమెను ఎయిర్ పోర్టులో దింపడానికి వెళ్తున్నాడు. అందరూ బయటకు వచ్చారు. నిత్య తల్లిని కౌగలించుకొని “ఊరికే దిగులు పడకు నా గురించి. నేను   బాగానే మేనేజ్ చేయగలను. రోజు నీతో ఫోన్లో మాట్లాడతాను సరేనా” అని తల్లిని ఊరడించి కారెక్కెంది.

కారెళ్లే వరకూ నిలబడి చివరికి చిన్నగా నిట్టూర్చి లోపలికి వచ్చింది శ్రీదేవి. చలాకీగా, సందడిసందడిగా ఉండే నిత్య లేకపోయేసరికి ఇల్లంతా చిన్నబోయినట్లనిపించింది ఆమెకు. భర్త శశిధర్ రెడ్డి హైదరాబాదులోని యూనివర్సిటీలో ఫిజిక్సు ప్రోఫెసర్. నాలుగేళ్లలో రిటైర్ అవుతాడు. ఈ లోపల బాధ్యతలన్నీ తీర్చుకుని హాయిగా ఉండాలని భార్యాభర్తల కోరిక.

*               *                        *

నిత్య చెన్నైలో బాగానే సెటిలయ్యింది. ఆఫీసుకు మరీ దూరంగా లేని వర్కింగ్ విమెన్స హాస్టల్లో గది దొరికింది. హాస్టల్ నుంచి ఆఫీసుకు డైరెక్టు బస్సుంది. ఎప్పుడైనా ఆలస్యం అయితే ఆటోలో వెళ్తుంది. మధ్య మధ్యలో ఇంటి మీద మనస్సు మళ్లినప్పుడు సెలవు పెట్టి హైదరాబాదు వెళ్లొస్తుంది. అలా సంవత్సరం గడచిపోయింది.

ఆ తర్వాత ఒకసారి ఇంటికెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఒక సంబంధం చూశామని, అబ్బాయి బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నాడని, ఈ పెళ్లి చేసుకుంటే బొంబాయి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చని, తన ఆఫీసు బ్రాంచ్ అక్కడ కూడా ఉంటే అక్కడకు ట్రాన్స్ఫర్ కు ప్రయత్నించవచ్చని బలవంతం పెట్టారు. నిత్య బాంబు పేల్చినట్లు అసలు విషయం బయటపెట్టింది. “ నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. అతని పేరు నిఖిల్ త్రివేది. అతని తల్లిదండ్రులు అలహాబాదులో ఉంటారు. వాళ్ళు ఉత్తర్ ప్రదేశ్ కి   చెందిన బ్రాహ్మణులు. నిఖిల్ ఎం‌సిఏ చేశాడు. మా ఆఫీసు పక్కనే ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరికీ పరిచయం అయి ఆరేడు నెలలవుతుంది. ప్రస్తుతం ఇద్దరం డేటింగ్ లో ఉన్నాం. ఇంకో సంవత్సరం ఆగి పెళ్లి చేసుకుందామనుకుంటున్నాం” అంది .

తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు . తండ్రి ఇలాంటి విషయాల గురించి విన్నాడు కాబట్టి అంత షాక్ అవలేదు. బయట ప్రపంచంతో ఎక్కువ సంబంధం పెట్టుకోని శ్రీదేవికి ఇది అంతుబట్టని విషయం.  “ మన ఊరు కాదు, మన భాషా కాదు, మన కులం కాదు, ఆఖరికి మన రాష్ట్రం కూడా కాదు. ఇదేం విడ్డూరం? ఇంతోటి అబ్బాయి మనవాళ్ళలో లేడా? పైపెచ్చు ఈ డేటింగ్ ఏమిటి? ఇంకో సంవత్సరం తర్వాత గాని చేసుకోరా? ఇలాంటివి మన ఇంటావంటా ఉన్నాయా?” అంది కోపంగా .

“అమ్మా!  కాలం  మారింది. ఇంకా మీ చాదస్తాలు, అలవాట్లే  సాగలంటే కుదరదు. కాలంతో పాటుగా మీరూ మారాలి. సంవత్సరం తర్వాత పెళ్లి ఎందుకంటున్నానంటే ఒకళ్లనొకళ్ళము బాగా అర్ధం చేసుకోవాలి కదా? దానికి టైము పడుతుంది . ఒకవేళ చివరికి మేం ఒకరినొకరు ఇష్టపడకపోతే స్నేహితుల్లా విడిపోతాం” అంది స్థిరంగా.  “ఇక అది కూడానా” అంది శ్రీదేవి వ్యంగ్యంగా.  శశిధర్ కల్పించుకుని ‘ అలా అంటే ఎలా అమ్మా! మా గురించి కూడా నువ్వు ఆలోచించాలి. ముఖ్యంగా మీ అమ్మ గురించి. నీకు చూసిన సంబంధం చాలా యోగ్యమయినది. మనవాళ్లే, అబ్బాయి నా చిన్ననాటి  స్నేహితుని కొడుకే. వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు, తొందరేమీ లేదు , నువ్వు తాపీగా ఆలోచించుకుని చెప్పు. ‘

“లేదు నాన్నా నా నిర్ణయానికిక తిరుగులేదు” అని మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడ నుంచి లేచి వెళ్లిపోయింది.  శ్రీదేవి శశిధర్లు ఒకరి ముఖాలోకరు అయోమయంగా చూసుకున్నారు. వాళ్లకిక ఏం చెయ్యాలో తోచలేదు.

నిత్య చెన్నై వెళ్లిపోయింది. అన్నయ్య మాట వింటుందని మహేష్ ని ఒకసారి చెన్నై పంపించారు, నిత్య తల్లిదండ్రులు. అక్కడ నిఖిల్ ని కలుసుకున్న మహేష్ కి అతనంటే మంచి అభిప్రాయం కలిగింది. ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు సీరియస్ అని తెలుసుకొన్నాడు. హైదరాబాదు వచ్చాక “వాళ్ళిద్దరి నిర్ణయాలు ఇంకెవ్వరూ మార్చలేరు!. మీరు కాదంటే వాళ్ళే పెళ్లి చేసుకునేట్లున్నారు! మీ మర్యాద పోకుండా వాళ్ళు పెళ్లి చెయ్యమన్నప్పుడు చెయ్యండి!” అని తల్లిదండ్రులకు  సలహా ఇచ్చాడు. వాళ్ళిద్దరికీ ఒప్పుకోక తప్పలేదు.

మధ్య మధ్యలో నిత్య హైదరాబాదు వస్తున్నా, సంవత్సరం వరకూ మాట్లాడొద్దన్న షరతు గుర్తుంచుకుని మెదలకుండా ఊరుకున్నారు శ్రీదేవి, శశిధర్లు. సంవత్సరం తర్వాత నిత్య తనంతట తానే పెళ్లి ప్రస్తావన తెచ్చి , “నేనూ, నిఖిల్ పెళ్లి చేసుకుందామన్న నిర్ణయం తీసుకున్నాం. ముందుగా వచ్చే నెలలో నన్ను చూడటానికి ఇక్కడకు నిఖిల్ అమ్మా, నాన్న వస్తారు. అప్పుడు అతడిని  మీకు పరిచయం చేస్తాను” అంది.

ఇన్నాళ్ళూ డేటింగ్ చేసి, విడిపోకుండా, చివరికి పెళ్లి చేసుకుందామన్న నిర్ణయానికి వాళ్ళు సంతోషించారు. “ఈ డేటింగ్లూ అవీ అందరికీ తెలిస్తే ఎంత నామర్దా! ఇన్ని రోజులూ కలిసి తిరిగి పెళ్లి చేసుకోకపోతే ఎంత అప్రతిష్ట!” అనుకుంది శ్రీదేవి.

*                                         *

అనుకున్నట్టుగానే రెండు కుటుంబలు హైదరాబాదులో కలుసుకున్నాయి. నిఖిల్ ఒక్కడే కొడుకవడం వలన, అతని తల్లిదండ్రులు మాత్రమే వచ్చారు . సమయానికి మహేశ్ కూడా వచ్చాడు బెంగళూరు నుంచి . నిఖిల్ తండ్రి రాజీవ్ త్రివేది అలహాబాదులో ఇన్కమ్ టేక్స్   డిపార్టుమెంటులో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య సంగీత పెద్దగా చదువుకోలేదు. మనిషి  సంప్రదాయబద్ధంగా ఉన్నది.

“నా కూతురు ఫైర్ బ్రాండ్. దానితో ఎట్లా వేగుతుందో ఏమో?!” అనుకుంది శ్రీదేవి ఆమెను చూసి.

సంగీతకి అంత బాగా ఇంగ్లీష్ రాదు. శ్రీదేవికి హిందీలో మాట్లాడే అలవాటు లేదు, అందుకని ఇద్దరి మధ్య మాటలంతగా సాగలేదు. సంభాషణలు మొగవాళ్ళ మధ్యే ఎక్కువగా జరిగాయి.

నిఖిల్ తల్లిదండ్రులు పక్కా శాఖాహారులు. నిఖిల్ మాత్రం గుడ్లు తినే అలవాటు చేసుకున్నాడు. “ నా కూతురికి నాన్వెజ్ బాగా ఇష్టం. వీళ్ళింట్లో ఎలా ఉండగలుగుతుందో” అనుకుంది శ్రేదేవి.

పెళ్లి మాటలు జరిగేటప్పుడు మళ్ళీ బాంబు పేల్చారు నిత్య , నిఖిల్. పెళ్లి చాలా సింపుల్ గా , రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుంటామని పట్టుబట్టారు. కనీసం రిసెప్షన్ కన్నా ఒప్పుకోమని ఇరువైపుల తల్లిదండ్రులు కోరారు. ముందు ససేమిరా అని, చివరికి మహేశ్ సర్ది చెపితే సరే అన్నారు. అదయినా కొన్ని షరతుల మీద. రిసెప్షన్ కి కేవలం బంధువుల్ని, బాగా దగ్గిరి స్నేహితుల్ని తప్ప ఎక్కువ మందిని పిలవకూడదని, తాము ప్రత్యేకంగా తమ స్నేహితులకి పార్టీ ఇచ్చుకుంటామని అన్నారు.

ఒక్కడే కొడుకు, ఒక్కతే కూతురు పెళ్లి ఇలా జరగడం వాళ్లకేమి బాగాలేదు. పిల్లలు పట్టుబట్టి ససేమిరా అంటే ఇంకేం చెయ్యలేక ఒప్పుకున్నారు . కూతురు పెళ్లి వైభవంగా జరపాలనుకున్న శ్రీదేవి ఆశ నిరాశయింది. కొడుకు పెళ్ళికి ఎంతో మందిని ఆహ్వానిద్దామనుకున్న నిఖిల్ తల్లిదండ్రుల క్కూడా ఆశాభంగం అయింది. “ అగ్నికి ఆజ్యం తోడయినట్లు వీళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా సరిపోయారు “ అనుకున్నాడు శశిధర్ .

కానీ, అందం, ఆకర్షణ పోటీ బడుతున్నట్లున్న నిత్యను చూసి నిఖిల్ తల్లిదండ్రులకు కొడుకు సెలెక్షన్ బావుందనిపించింది. నిఖిల్ దగ్గర నేర్చుకుని, తమతో అనర్గళంగా హిందీలో మాట్లాడే నిత్యను మెచ్చుకోకుండా ఉండలేక పోయారు. ఇక, హుందాగా, మర్యాదగా ఉండే నిఖిల్ ను  ఇష్టపడక పోవటానికి కారణం కనిపించలేదు నిత్య తల్లిదండ్రులకు.

*               *                      *

పెళ్లి జనవరి 21వ తారీకున జరగాలని నిర్ణయం అయింది.నిఖిల్ వైపు నుంచి ఇరవై మంది కన్నా రాలేదు.వారికి ఇంటి దగ్గరలో ఉన్న  గెష్ట్ హౌస్ లో బస ఏర్పాటు చేశాడు శశిధర్. నిత్య వైపు బంధువులు స్నేహితులు ముప్పై మంది వచ్చారు. రిజిష్టర్ ఆఫీసుకి కేవలం రెండు కుటుంబాలు, సాక్షులు మాత్రమే వచ్చారు.

ఎటువంటి ఆడంబరం లేకుండా షిఫాను చీర కట్టుకుని , మెడలో సన్నటి గొలుసుతో వచ్చింది నిత్య. నిఖిల్ కూడా కుర్తా, పైజమాతో సింపుల్ గా వచ్చాడు. తను కొన్న కంజీవరం సిల్కు చీర కట్టుకుని, తాను చేయించిన బంగారు నగలు పెట్టుకోమని తల్లెంత ప్రాధేయపడినా వినలేదు నిత్య. అలా తయారయి వచ్చిన  కోడల్ని చూసి విస్తుపోయింది సంగీత. రిజిస్టర్ పెళ్లి తర్వాత గెష్ట్ హౌస్ లోనే అందరికీ భోజనం ఏర్పాట్లు జరిగాయి .

సాయంత్రం రిసెప్షన్  ఒక చిన్న హోటల్లో ఏర్పాటు చేశాడు శశిధర్. ఇప్పుడైనా తను పెట్టిన బెనారస్ పట్టుచీర, చేయించిన బంగారు నగలు పెట్టుకుని వస్తుందనుకున్న నిత్యను చూసి మరోసారి అవాక్కయింది సంగీత. పొద్దుటి లాగే సింపుల్ గా వచ్చారు నవదంపతులు. రిసెప్షన్ కి ఎనభై మంది కన్నా ఎక్కువ మంది లేరు.

మామూలు రిసెప్షన్ లో  లాగా తమ కోసం అలంకరించిన కుర్చిల్లో కూర్చోకుండా నిత్య, నిఖిల్  అందరితో కలసిపోయి తిరిగారు.  సింపుల్ గా ఉండడం వలన, కొత్త దంపతులెవరో తెలియక కొంత మంది తికమక పడ్డారు. ఇక గిఫ్టులు తేకూడదని పెళ్లి శుభలేఖలో ప్రత్యేకంగా పిల్లల కోరిక మీద   రాయించడం వలన ఎవరూ తేలేదు. ఈ విషయం తల్లిదండ్రులనే కాకుండా బంధువులను కూడా నిరాశ పరిచింది.  మొత్తానికి ఎంతో వైభవంగా జరిగే పెళ్లిళ్లకు అలవాటు పడ్డ రెండు వైపుల వాళ్లకి “ఇదీ ఒక పెళ్లేనా?!” అనిపించింది. ఆ తర్వాత అందరూ అలహాబాద్  వెళ్లారు. అక్కడ కూడా ముఖ్యమైన వాళ్ళకి చిన్న పార్టీ ఇచ్చారు నిఖిల్ తల్లిదండ్రులు.

*                          *                  *

సామాన్యంగా వెళ్ళే హనీమూన్ యాత్రకి  పోకుండా తమ తమ ఆఫీసులకి పోయారు నిత్య , నిఖిల్. రొటీన్లో పడిపోయారు. ఇలా కొన్ని నెలలు గడచిపోయాయి. ఒక నెల రోజులుందామని నిఖిల్ తల్లిదండ్రులు చెన్నై వచ్చారు.

ఎటువంటి బంగారు ఆభరణాలు పెట్టుకోకుండా, షల్వార్ కమీజ్ లో సింపుల్ గా ఉండే నిత్యని చూసి, సంగీత “అసలు ఈ పిల్లకి ఖరీదైన బట్టలు కట్టుకోవాలని, బంగారు నగలు పెట్టుకోవాలని అనిపించదా?!”   అనుకొనేది.

ఇంట్లో వంట నిఖిల్ చేస్తాడు. డస్టింగ్ చెయ్యడం, కూరగాయలు కోయడం, వాషింగ్ మెషీన్ లో బట్టలుతికి ఆరేయడం లాంటి పనులు చేస్తుంది నిత్య. అంట్లు తోమడానికి, ఇల్లూడ్చి తుడవడానికి పనిమనిషి ఉంది.

“వంట నువ్వు చేయడం ఏమిటిరా నిఖిల్, నిత్యకి వంట రాదా?“ అడిగింది సంగీత  నిత్య లేనప్పుడు. అమ్మా“నిత్యకి వంట చెయ్యడం బోర్! నాకు వంట చెయ్యడం ఇష్టం . మనింట్లో కూడా నేను చాలాసార్లు చేస్తూండేవాడిని కదా” అన్నాడు. “అదేమిటిరా? ఎప్పుడయినా చెయ్యడం వేరు, రోజూ చెయ్యడం వేరు. వంట చెయ్యడం బోర్ అయితే అసలు పెళ్ళెందుకు  చేసుకుందట?”

“అందులో ఏముందమ్మా! ఎవరికిష్టమైన పనులు వాళ్ళు చెయ్యాలి. అయినా తను మిగతా పనులు చేస్తున్నది కదా?. ఈ ఎరేంజమెంట్ మా కిద్దరికీ నచ్చింది” అన్నాడు ఆ విషయాన్ని తేలిగ్గా కొట్టి పారేస్తూ.

సంగీత ఇక చూడలేక అక్కడ ఉన్ననాళ్ళు తానే వంట చేసింది . ఒకొక్కసారి బయటనుంచి నాన్వెజ్ తెచ్చుకుని తినే నిత్యని చూసి ఆ వాసన భరించలేక ఇంకో గదిలోకి వెళ్లిపోయేది సంగీత. నిఖిల్ మాత్రం అది ఒక సమస్యే కాదన్నట్లు పక్కన

కూర్చుని తన మానాన తను తినేవాడు. ఎప్పుడయినా హోటల్ కి  వెళ్లినప్పుడు కూడా నిత్య కోసం నాన్వెజ్ ఆర్డరు చేసేవాడు. ఆ వాసన భరించలేక వాళ్ళతో బయటికి వెళ్లడమే మానేశారు నిఖిల్ తల్లిదండ్రులు.

కోడల్ని మార్చాలని చాలా ప్రయత్నాలు చేసింది సంగీత. ఆమె చెప్పేవన్నీ సావధానంగా విని “మీరేందుకు అనవసరంగా హైరానా పడతారు ఆంటీ,? మా ఎరేంజ్మెంట్లు, ప్లానింగ్లూ మాకు బాగానే ఉన్నాయి. మేం హాయిగా ఉన్నాం కదా” అని నవ్వుతుంది . కపటం లేని ఆ నవ్వు చూశాక ఇంకామెకి ఏమనాలో తెలిసేది కాదు.

ఇక శని, ఆదివారాలైనా నిత్య, నిఖిల్ హాయిగా ఇంట్లో ఉంటారా అంటే అదీ లేదు . సంఘసేవ కార్యక్రమాల్లో సౌయంత్రం నాలుగు వరకూ బిజీగా ఉంటారు. ఒక స్వచ్ఛంద  సేవాసంస్థలో ఇద్దరూ సదస్యులు. వయోజన విద్య, స్త్రీ సంక్షేమ పథకాలు, అనాధ పిల్లల సంరక్షణ మొదలైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. తమ జీతాల్లోంచి కొంత డబ్బు వాటికి ఉపయోగిస్తారు కూడా. ఇవన్నీ చూసి ఉండబట్టలేక “కనీసం శని, ఆదివారాలు హాయిగా ఉండొచ్చు కదా?” అని  అడిగింది సంగీత.  దానికిద్దరూ ” మన సమాజం మనకో గుర్తింపునిచ్చింది, స్టేటస్నిచ్చింది. దానికి బదులుగా మనం సమాజానికి ఎలా ఉపయోగపడాలి?  ఆ ఋణం ఇలా తీర్చుకుంటున్నాం” అన్నారు. ఇక సంగీత కేమనాలో  తెలియలేదు.

ఈ విషయం భర్తకు చెబితే ఆయన ”చూసి చూడనట్లుండు. అనవసరంగా వాళ్ళ విషయాల్లో కల్పించుకోకు” అని సలహా ఇచ్చాడు. ఆ సలహా పాటిస్తూ మెదలకుండా ఉండడం నేర్చుకుంది.

*                       *                               *

మూడు సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి. ప్రతి సంవత్సరం లాగానే, రాజీవ్ , సంగీత,  చెన్నై వచ్చారు. ఈ మధ్య సంగీత బుర్రలో ఒక ఆలోచన రాసాగింది. నిఖిల్, నిత్యలకు పిల్లలు పుడితే వాళ్ళలో ఉన్న ఈ పిచ్చి తగ్గి కొంత మార్పు వస్తుందని. అందుకని వచ్చిన వారం రోజులకి సాయంత్రం అందరూ కలసి చాయ్ తాగుతున్నప్పుడు పిల్లల ప్రసక్తి తీసుకువచ్చింది.  అది విని నిఖిల్, నిత్య  ఒకళ్ల ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. నువ్వు చెప్పు, లేదు నువ్వు చెప్పు అన్నట్లు, సైగలు చేసుకున్నారు. చివరికి నిత్య మౌనంగా తలదించుకుని కూర్చుంటే నిఖిల్ తనే మొదలు పెట్టాడు.

“అమ్మా ఈ విషయం మేమే నీకు చెబుదామని అనుకున్నాం! నువ్వే అడిగేసావు. మేమిద్దరమూ మాకు  పిల్లలు అఖర్లేదన్న నిర్ణయం తీసుకున్నాం. దానికి కారణాలున్నాయి. జనాభాతో భూభారాన్ని పెంచకూడదన్నది మొదటి కారణం. కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని పూర్తిగా సంఘసేవకి మా జీవితాలు అంకితం చేయాలన్నది రెండవ కారణం. అంతగా మాకు తర్వాత పిల్లలు కావాలన్న గాఢమయిన కోరిక కలిగితే అనాధ పిల్లలను దత్తత తీసుకొని పెంచుకుందామన్నది మూడో కారణం. మా యీ  నిర్ణయాలు మీకు బాధ కలిగిస్తాయని తెలుసు. కానీ ఇవి మాకు ఆనందాన్నీ, తృప్తినిచ్చే నిర్ణయాలు. మా ఆశయాలు, ఆదర్శాలు సఫలం చేసుకునే నిర్ణయాలు“ అన్నాడు.

ఈ మాటలు విని రాజీవ్, సంగీతా విస్తుపోయారు . సంగీత కనుసన్నలని అర్ధం చేసుకుని రాజీవ్ ఇద్దరికీ సర్ది చెబుతూ చాలాసేపు మాట్లాడు. చివరగా ”మా గురించి కూడా మీరు ఆలోచించాలి. మనవళ్లని, మనవరాళ్లని చూసుకోవాలన్న ఆరాటం మాకుంటుంది. మా వృద్దాప్యంలో అది మాకెంతో ఆనందానిస్తుంది. నిఖిల్ మాకు ఒక్కడే కొడుకు. అతనికి పిల్లలు లేకపోతే ఇక మా వంశం అంతరించిపోతుంది కదా?!. ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు మరొక్కసారి ఆలోచించుకోండి” అన్నాడు.

ఆ మాటలన్నీ విని నిత్య, “ అంకుల్, ఇలాంటి నిర్ణయాలు ఈ మధ్య మా జనరేషన్ వాళ్లకు కొత్త కాదు. మా స్నేహితుల్లో కొంత మంది ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. మీరు ఆలోచించినట్లే మేం కూడా ఆలోచించాలంటే కుదరదు. మీ తరం పరిధుల్ని దాటి మేం ముందుకు వెళతాం. మమ్మల్ని మీరు అందుకోలేరు. మీరనుభవించే ఈ డైలమా మేం మా ముందు తరాల వారితో ఎదుర్కుంటామేమో!? చెప్పలేం! తరాల్లో అంతరాలు ఎప్పుడు ఉంటాయి” అంది.  నిఖిల్  “ఈ సారి మా ఇంటికి వెళ్లినప్పుడు ఈ విషయం మా తల్లిదండ్రులక్కూడా చెపుదాం” అంది.

ఆ తర్వాత ఇద్దరూ లేచి తమ గదిలోకి వెళ్లారు, ఇక మాట్లాడవలసింది ఏమీ లేనట్లు.

*                                           *               *

రాత్రి భోజనాలయ్యాక రాజీవ్, సంగీత తమ బెడ్రూంలోకి వెళ్లారు. రాజీవ్ పడుకున్నాడు గాని సంగీత నిస్తేజంగా కూర్చుండి పోయింది. ఆమె ముఖం చిన్నబోయి ఆలోచనలతో సతమతమవుతున్నట్టుగా ఉంది. మధ్యలో మెలకువ వచ్చిన రాజీవ్ లేచి భార్య పక్కకు వచ్చి కూర్చుని భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి” వాళ్ళు తీసుకున్న నిర్ణయాల గురించి బాధ  పడ్తున్నావా?, కాలం మారింది ఈ తరం పిల్లల వేగాన్ని మనం అందుకోలేక పోతున్నామనిపిస్తుంది. అయినా ఒక విషయం మనం గ్రహించాలి. మనిద్దరమూ ఎంత సేపూ మన గురించి, మన పిల్లల గురించి, మన కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. వాళ్ళు సమాజం గురించి ఆలోచిస్తున్నారు. సమాజ ప్రగతి కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారు. మన ఆలోచనా పరిధులు ఇరుకైనవి. వారివి విశాల దృక్పధాలు. మనం వాళ్ళకి సహాయపడకపోతే పోయాం, కనీసం వాళ్ళ ఆశయాలకు అడ్డు రాకూడదని అనుకుంటున్నాను “ అన్నాడు.

సంగీత భర్త వంక దీర్ఘంగా చూసి  “ అదే మంచిదేమో !” అని అతని భుజం మీద తలపెట్టుకుని కళ్ళు మూసుకుంది.

_               _

శాంతిశ్రీ బెనర్జీ గారు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, డిల్లీ లో ఎమ్.ఫిల్ చేశారు. తీన్ మూర్తి భవన్, డిల్లీ లో నెహ్రూ కి సంబంధించిన ప్రాజెక్టు లో అసోసియేట్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు.  వాలంటరీ రిటైర్మెంట్ తర్వాత తెలుగు లో కథలు, కవితలు, travelogues, వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు. కొన్ని ఆదివారం ఆంధ్రజ్యోతి, ఆదివారం ఈనాడు, నవ్య వీక్లీ, భూమిక, ఆంధ్రభూమి వీక్లీ ల లోనూ, గోదావరి అంతర్జాల మాస పత్రికలోనూ ప్రచురించబడ్డాయి. 

ఈ   కధ లో శాంతిశ్రీ బెనర్జీ గారు,  తరాల మధ్య ఉండే ఆలోచన –  విలువలు   గురించి. రాష్ట్రేతర వివాహం చేసుకున్న  యువకుల సంఘం గురించి, అందులోనూ బాధపడే వారి గురించి,  సొసైటీ లో వారీలాంటి కొంతమందిని కలుపుకొని పనిచేయడం  ఎంత అవసరమో చెప్పారు.

-దేవరకొండ సుబ్రహ్మణ్యం

శాంతిశ్రీ బెనర్జీ

4 comments

Leave a Reply to రత్నశ్రీ వఠెం Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇలాంటి దృక్పథాలు ఉన్న విద్యావంతులు సమాజానికి అవసరం. ఈ యువడంపటుల ఆలోచన విశాలం. అందరికీ ఉపకరించేది.

    కథను, అందులో సందేశాన్ని సరళంగా చెప్పిన రచయిత్రి శాంతిశ్రీ గారికి. అభినందనలు. ఇలాంటి రచనలు ఇంకా చెయ్యాలి.

  • మార్చ్ 24, 2020 ఏమాత్రం ఆలోచించడానికి కూడా టైమ్ లేకుండా మన దేశంలో కోవిడ్ లాక్ ఔట్ ప్రకటించినప్పుడు అందరమూ ఇబ్బందిపడ్డాం. కానీ త్రివంగా నష్టపోయిన వారు వలసకార్మికులు. కొన్ని లక్షలమంది ఉండడానికి వసతి లేకుండా తిండిలేక , తమ స్వంత ప్రదేశాలకి వెళ్లడానికి ప్రయాణ సౌకర్యాలు లేక విపరీతమయిన కష్టాలు పది నడిచి వెళ్లడానికి కూడా వెనుకాడలేదు. కొన్ని వందలమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

    ఆ సమయంలో హైదరాబాదులో పింగళి చైతన్య, సి వనజ ఇంకా చాలామంది Camps ఏర్పాటు చేసి కొన్ని వేలమందికి బ్జోజన వసతి వాళ్ళు వెళ్లడానికి బస్సులు ఏర్పాటుచేశారు. ఈ‌ కార్యక్రమా ఏర్పటంతా విరాళాలతో చేయడం గొప్పవిషయం. కొన్ని వేలమందికి ఇలాంటి ఏర్పాటు చేశారు.

    ఈ కధలో నిత్య, నిఖిల్ కూడా అలాంటి వారే . ఇలా కొత్తగా , సమాజం కోసం తపన పడడం చాలా బావుంది, నిజానికి అవసరం కూడా.

    ఈ ఆలోచన కలిగిన శాంతిశ్రీ గారు అభినందనీయులు. బహుశా వారు చదివిన జే‌ఎన్‌యూ వల్ల ఈ ఆలోచన వచ్చివుండవొచ్చు.

  • చాలా బావుంది కథ. అర్థంపర్థం లేని ప్రేమలతో పెళ్లిళ్లు చేసుకుని, తర్వాత ఏవేవో సమస్యలతో కొట్టుకుంటూనో లేక విడిపోవాలనుకునే జంటల కంటే, చక్కని ఆలోచనలూ, సారూప్య స్వభావాలు కల మంచి జంట వీళ్లు. తల్లితండ్రులు, సమాజం అర్థం చేసుకుని ఇలాంటి వారిని ప్రోత్సహించాలి.

  • My story was circulated on different WhatsApp groups. Many writers, especially
    Women writers from Aksharyan Hyderabad, Lekhini, Srujana Sruti etc., appreciated the story as It highlighted the thinking process of the present generation. Other general WhatsApp groups also reacted to the story and gave critical as well as encouraging comments. I am overwhelmed by the response and thank each and everyone for reading it, discussing and analysing it. Thanks to Saranga for publishing it.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు