ఈ టి వి లో ప్రతి ఆదివారమూ వచ్చే “పాడుతా ! తీయగా ” కార్యక్రమం చూసే వాళ్లందరికీ ఒక విషయం అనుభవం లోకి వచ్చి ఉంటుంది . పోటీదారులు అందరూ బహుమతి గెల్చుకోవడం కోసం ఎంచుకునే పాటలు వందకు తొంభయి శాతం డెబ్బై , ఎనభై దశకాలలో వచ్చిన సినిమాలలోవే ఉంటున్నాయి . తొంభైల తరువాత వచ్చిన సినిమాలలో మంచి పాటలు లేవా అని ప్రశ్న వేసుకుంటే , వున్నాయి కానీ … అని ఒక ముక్తాయింపు వినబడుతుంది
అలాంటి పరిస్థితే ఇవాళ తెలుగు కథ ప్రపంచం లో కూడా ఉంది . ఒక మంచి తెలుగు కథ అనగానే మళ్ళీ మనం అదే బుచ్చిబాబునూ , అదే గోపీచంద్ నూ , అదే చలాన్ని , శ్రీపాదనూ , కరుణకుమారనూ, పెద్దిభొట్లనూ మననం చేసుకుంటూ ఉంటాము . కథ సిరీస్ తో రెండు దశాబ్దాలుగా వస్తున్న కథా సంపుటాలలో కూడా కాల పరీక్షకు నిలిచిన కథలను వేళ్ళ మీద లెక్కించవచ్చు . ఒక పక్క ఇబ్బడిముబ్బడిగా కథలు వస్తున్నా , పాఠకుడిని ఉద్వేగపరచి , కల్లోల పరచి , వెంటాడి , వేధించే కథలంటే మళ్ళీ వెనుకకు చూసుకోవలసి వస్తోంది . ఎందుకని ?
ఇటీవల సంచలనం సృష్టించిన కథలు , కథాసంపుటాలు అన్నీ అవి సృష్టించిన సంచలనం తో పోల్చదగిన మంచి కథలను కలిగి ఉన్నాయా ఇలాంటి సందేహాలు ఎన్నో ?
కథ కథా స్వభావము లాంటి అంశాల జోలికి , సిద్ధాంత చర్చల వైపుకి వెళ్లకుండానే ప్రతి పాఠకుడికి కథ పట్ల తనకైన కొన్ని అభిప్రాయాలూ , అనుభవాలు ఉంటాయి . ఆ అభిప్రాయాల , అనుభవాల వెలుగు లో తాను చదువుకున్న కథలను విశ్లేషించుకుంటాడు . అలా ఒక పాఠకుడిగా విశ్లేషించుకున్నప్పుడు నన్నో ఉద్వేగానికి గురిచేసి , వెంటాడిన కథలను గురించి సంక్షిప్తంగా పరిచయ చేస్తూ
అది ఎందుకు ఉద్వేగ పరుస్తుందో , ఎలా మన సంస్కారాలను ఉన్నతీకరిస్తుందో చెప్పడం ఈ శీర్షిక ముఖ్య ఉద్దేశ్యం
దీనికి నేను అనుకున్న పేరు తరళ మేఘ ఛాయ . అంటే నిండు గ్రీష్మం లో ఆకాశం లో ఎప్పుడో ఒకసారి అలవోకగా వచ్చే మేఘం నేలమీద కురిపించే నీడ అనే అని అర్ధం . ఆ మేఘం కొద్దిసేపే ఉన్నా గ్రీష్మం లో చెమట చిత్తడితో తడిసి అలసి, సొలసి , నిస్తేజంగా , నిర్వీర్యమయిన శరీరానికి అందించే ఆహ్లాదం , సౌఖ్యం , అపురూపం . ఆ మేఘం వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ జీవితం ఎడారి అయిపోయినా సరే. తరళా యతం కావడం అంటే ప్రకాశించడం అని కదా అర్ధం . నిండు గ్రీష్మం లో మేఘం ప్రకాశించడం కూడా ఒక విరోధాభాస . ఒక ప్యారడాక్స్ . నిజానికి కథ ఎప్పుడూ జీవితంలోని విలోమ సంబంధాలను అనులోమం గానూ . అనులోమ సంబంధాలను విలోమం గానూ తరళించి చూపించాలి . మరో మాట లో చెప్పాలి అంటే ప్రతి సంబంధాన్ని అది ఉన్న స్థలం నుండి , కాలం నుండి విడదీసి పుటం పెట్టి పరీక్షించాలి . అలా పరీక్షకు నిలబడిన సంబంధాలే మానవ జీవితాన్ని ఉన్నతీకరిస్తాయి
ఈ శీర్షిక రాయడానికి నాకు ఉన్న అర్హతల్లా కొన్ని కథలు రాయడం , జ్యేష్ఠ అనే ప్రముఖ కథకుడి పేరు మీద ఇచ్చే ఒక పురస్కారాన్ని స్వీకరించడమూ ను . , వీటన్నిటినీ మించి కనిపించిన కథనల్లా చదవడం . ఈ శీర్షిక కి నేను ఎన్నుకున్న మొదటి కథ
ఈ తరళ మేఘచ్చాయ అనే పదబంధాన్ని నేను మెహర్ కథలో చదివాను . తరళ మేఘచ్ఛాయ , తర్వాతి ఎడారి అనే పేరుతొ ఒక కథ కూడా ఉన్నది
ఈ శీర్షికన నేను పరిచయం చేద్దాము అనుకున్న కథ కూడా మెహెర్ దే .
తరళమేఘ ఛాయ.. పేరు లోని అర్థం తెలిసింది సర్,ధన్యవాదాలు..💐మీ రచనలు కోసం.ఎదురుచూస్తున్నం👍👌!
* తర్వాత వెతుక్కుంటూ ఉన్నాను…మళ్ళీ సారి మొదలు పెడతారాండీ..!? సరే
ఎదురుచూస్తూ
చాలా సంతోషం వంశీకృష్ణ గారూ .. ఎదురుచూస్తున్నాను.