తరళ మేఘ ఛాయ:వంశీ కృష్ణ కొత్త శీర్షిక త్వరలో…

ఈ   టి వి  లో  ప్రతి ఆదివారమూ  వచ్చే “పాడుతా ! తీయగా ” కార్యక్రమం  చూసే వాళ్లందరికీ ఒక విషయం  అనుభవం లోకి వచ్చి ఉంటుంది . పోటీదారులు అందరూ బహుమతి గెల్చుకోవడం కోసం ఎంచుకునే పాటలు వందకు తొంభయి శాతం డెబ్బై , ఎనభై దశకాలలో వచ్చిన సినిమాలలోవే  ఉంటున్నాయి . తొంభైల తరువాత వచ్చిన సినిమాలలో మంచి పాటలు లేవా అని ప్రశ్న వేసుకుంటే , వున్నాయి కానీ …  అని ఒక ముక్తాయింపు వినబడుతుంది

అలాంటి  పరిస్థితే ఇవాళ తెలుగు  కథ ప్రపంచం లో కూడా ఉంది . ఒక మంచి తెలుగు కథ  అనగానే మళ్ళీ మనం అదే బుచ్చిబాబునూ , అదే గోపీచంద్ నూ , అదే చలాన్ని , శ్రీపాదనూ , కరుణకుమారనూ, పెద్దిభొట్లనూ  మననం చేసుకుంటూ ఉంటాము . కథ  సిరీస్ తో రెండు దశాబ్దాలుగా వస్తున్న  కథా  సంపుటాలలో కూడా కాల పరీక్షకు నిలిచిన కథలను  వేళ్ళ  మీద లెక్కించవచ్చు . ఒక పక్క ఇబ్బడిముబ్బడిగా  కథలు  వస్తున్నా , పాఠకుడిని  ఉద్వేగపరచి , కల్లోల పరచి , వెంటాడి , వేధించే కథలంటే  మళ్ళీ వెనుకకు చూసుకోవలసి వస్తోంది . ఎందుకని ?

ఇటీవల సంచలనం సృష్టించిన కథలు , కథాసంపుటాలు  అన్నీ అవి సృష్టించిన సంచలనం తో పోల్చదగిన మంచి కథలను  కలిగి ఉన్నాయా  ఇలాంటి సందేహాలు ఎన్నో ?

కథ  కథా  స్వభావము లాంటి అంశాల జోలికి , సిద్ధాంత చర్చల వైపుకి వెళ్లకుండానే ప్రతి పాఠకుడికి కథ  పట్ల తనకైన  కొన్ని అభిప్రాయాలూ , అనుభవాలు  ఉంటాయి . ఆ అభిప్రాయాల , అనుభవాల వెలుగు లో  తాను చదువుకున్న కథలను  విశ్లేషించుకుంటాడు . అలా ఒక పాఠకుడిగా విశ్లేషించుకున్నప్పుడు నన్నో ఉద్వేగానికి గురిచేసి , వెంటాడిన కథలను  గురించి సంక్షిప్తంగా పరిచయ చేస్తూ
అది ఎందుకు ఉద్వేగ పరుస్తుందో , ఎలా మన సంస్కారాలను ఉన్నతీకరిస్తుందో చెప్పడం ఈ శీర్షిక ముఖ్య ఉద్దేశ్యం

దీనికి నేను అనుకున్న పేరు తరళ మేఘ ఛాయ . అంటే నిండు గ్రీష్మం లో ఆకాశం లో ఎప్పుడో ఒకసారి అలవోకగా వచ్చే మేఘం  నేలమీద కురిపించే నీడ అనే అని అర్ధం . ఆ మేఘం కొద్దిసేపే ఉన్నా  గ్రీష్మం లో చెమట చిత్తడితో తడిసి అలసి, సొలసి , నిస్తేజంగా , నిర్వీర్యమయిన శరీరానికి అందించే ఆహ్లాదం , సౌఖ్యం , అపురూపం . ఆ మేఘం వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ జీవితం ఎడారి అయిపోయినా సరే. తరళా యతం  కావడం అంటే ప్రకాశించడం అని కదా అర్ధం . నిండు గ్రీష్మం లో మేఘం ప్రకాశించడం  కూడా ఒక  విరోధాభాస . ఒక ప్యారడాక్స్ . నిజానికి కథ  ఎప్పుడూ జీవితంలోని విలోమ సంబంధాలను అనులోమం గానూ . అనులోమ సంబంధాలను విలోమం గానూ తరళించి  చూపించాలి . మరో మాట లో చెప్పాలి అంటే ప్రతి సంబంధాన్ని అది ఉన్న  స్థలం నుండి , కాలం  నుండి  విడదీసి పుటం పెట్టి పరీక్షించాలి . అలా పరీక్షకు నిలబడిన సంబంధాలే మానవ జీవితాన్ని ఉన్నతీకరిస్తాయి

ఈ శీర్షిక రాయడానికి నాకు  ఉన్న  అర్హతల్లా కొన్ని కథలు  రాయడం , జ్యేష్ఠ అనే ప్రముఖ కథకుడి పేరు మీద ఇచ్చే ఒక పురస్కారాన్ని స్వీకరించడమూ ను .  , వీటన్నిటినీ మించి కనిపించిన కథనల్లా  చదవడం .  ఈ శీర్షిక కి నేను ఎన్నుకున్న మొదటి కథ

ఈ తరళ   మేఘచ్చాయ  అనే పదబంధాన్ని నేను మెహర్ కథలో  చదివాను . తరళ  మేఘచ్ఛాయ , తర్వాతి ఎడారి  అనే పేరుతొ ఒక కథ  కూడా ఉన్నది

ఈ శీర్షికన నేను పరిచయం చేద్దాము అనుకున్న కథ  కూడా మెహెర్ దే .

*
ఎడిటర్

ఎడిటర్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తరళమేఘ ఛాయ.. పేరు లోని అర్థం తెలిసింది సర్,ధన్యవాదాలు..💐మీ రచనలు కోసం.ఎదురుచూస్తున్నం👍👌!

  • * తర్వాత వెతుక్కుంటూ ఉన్నాను…మళ్ళీ సారి మొదలు పెడతారాండీ..!? సరే
    ఎదురుచూస్తూ

  • చాలా సంతోషం వంశీకృష్ణ గారూ .. ఎదురుచూస్తున్నాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు