తన చరిత్ర తానే మలచుకున్న భానుమతి!

యెక్కడో పల్లెటూరులో పుట్టి, యెనిమిదవ తరగతి మాత్రమే చదివిన ఒక మహిళ తన కృషితో, పట్టుదలతో, స్వాభిమానంతో జీవితాన్ని మలుచుకున్న తీరు దానికదే ఒక చరిత్ర!

క్షిణాది చిత్రసీమలో శ్రీమతి పాలువాయి భానుమతిని బహుముఖ ప్రజ్ఞావతి అని ఎందుకంటారంటే ఆవిడ‌లో ఒక నటి, గాయని, రచయిత్రి, నిర్మాత, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, స్టుడియో అధినేత, చిత్రకారిణి, జ్యోతిష్య‌ శాస్త్రవేత్త ఇంతమంది కొలువై వున్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు. పైగా ఈ అన్ని రంగాలలో కూడా  యేదో ఆషామాషీ ప్రవేశమున్నట్టుగా కాక, విశేష ప్రతిభ కనపరచే వారు ఆవిడ‌. భానుమ‌తి దక్షిణాదిలో మొట్టమొదటి లేడీ దర్శకురాలు, మొట్టమొదటి స్టుడియో అధినేత, మొట్టమొదటి లేడీ సంగీత దర్శకురాలు.

ఇంక ఆవిడ‌ నటన గురించి చెప్పాలంటే సినిమాలలో ప్రవేశించిన తొలిరోజులలో వేసిన పాత్రలు కొన్ని మినహాయిస్తే.. పాత్రలోకి ఆవిడ‌ ఒదిగి పోరు, పాత్రే ఆమెలో ఒదిగి పొతుంది. అంటే, యే పాత్రలోనయినా భానుమతే ప్రతిఫలిస్తుంది. పాత్రోచితమైన హావభావాలను అలవోకగా పలికించే మొఖం ఆవిడ‌ది. హాస్యరసం వొలికించే పాత్రలనయితే  మరింత ఎఫర్ట్ లెస్ గా తన సొంత సంభాషణలను కూడా చేర్చి చక్కగా పండిస్తుంది. ఉదా: “మట్టిలో మాణిక్యం”

“స్వర్గసీమ”, “మల్లీశ్వరి”, “విప్రనారాయణ,” “బాటసారి” భానుమ‌తి అత్యున్నత నటనకు అద్దం పట్టే చిత్రాలు. ఆవిడ‌కి తెలుగులోనే కాదు తమిళంలో కూడా మంచి పేరుంది. భానుమ‌తి పలికే తమిళాన్ని తమిళ ఛాందస వాదులు కూడా తప్పు పట్టలేరు. తమిళులు ఆవిడ‌ని అష్టావధాని అంటారు. “రంగూన్ రాధా” అనే తమిళ చిత్రంలో భానుమ‌తి నటన చూసిన సి.యన్. అన్నాదురై ఆవిడ‌ని “నడిప్పుక్కు ఇలక్కణం”, అంటే “నటనకు వ్యాకరణం” అన్నారట.

గాయనిగా భానుమ‌తిది విలక్షణమైన కంఠం. వీణ తీగె లాగ సన్నగా వుండి, కొద్దిగా  నేసల్ టోన్ లాగా అనిపిస్తూ, గమకాలు, రవ్వ సంగతులూ తేలికగా పలికే చక్కని గొంతు. దానికి చిన్ననాడు తండ్రి గారి దగ్గర తీసుకున్న సంగీత శిక్షణ యెంతో  మెరుగులు దిద్దింది. అయితే ఆవిడ‌ది కొంచెం శ్రుతి తక్కువ గొంతనీ, డ్యూయట్లు పాడేటప్పుడు ఘంటసాల లాంటి మగ గాయకులకి కష్టంగా వుండేదనీ చెబుతారు. అయితే ఘంటసాల పాడిన మొట్ట మొదటి పాట భానుమతితో “స్వర్గ సీమ” లో పాడిన ఒక డ్యూయట్. ఆయన గొంతు వినంగానే ఆయనది రిచ్ వాయిస్ అనుకున్నాననీ తనకు సరిజోడీ అయిన వాయిస్ అనీ చెబుతారు భానుమతి. ఘంటసాల కూడా భానుమతితో పాడడం ఛాలెంజింగ్ గా వుంటుందనేవారు.

ఆవిడ‌కి కర్ణాటక సంగీతంతో పాటు హిందూస్థానీ సంగీతం లో కూడా పట్టువుంది. తన తండ్రి గారికిచ్చిన మాట ప్రకారం తనకు అవకాశం దొరికినప్పుడల్లా త్యాగరాజ కృతులనో, అన్నమయ్య పదాలనో, దీక్షితార్‌ కృతులనో,  తరంగాలనో,  జయదేవ అష్ట పదులనో సినిమాలలో వినిపిస్తూ వుండేవారు .”అంతా మనమంచికే” లో హిందూస్థానీ పోకడలతో “నేనే రాధనోయీ” పాడారు. ఆవిడ‌కి ఇష్టమైన రాగం యమన్ కల్యాణి. ఆవిడ సినిమాలలో తప్పకుండా ఈ రాగంలో ఒకటో రెండో పాటలుంటాయి. ఆవిడ‌ మొట్టమొదట సంగీత దర్శకత్వం వహించిన చిత్రం “చక్రపాణి”.

భానుమ‌తి చిత్రసీమలో ప్రవేశించేటప్పటికి తమ పాటలు తామే పాడుకునే క‌న్నాంబ‌, యస్.వరలక్ష్మి,  జి.వరలక్ష్మి,  ఋష్యేంద్రమణి  లాంటి వారుండే వారు. క్రమేణా ప్లేబాక్ సింగింగ్ ప్రాచుర్యంలోకి వచ్చి, వేరే  నటీనటులకు వెనక వేరే గాయకులు పాడటం అలవాటుగా మారినా, చివరి వరకూ భానుమతి మాత్రం తన పాటలు తానే పాడుకున్నారు.

ఆవిడ‌ యెవరికీ ప్లేబాక్ పాడలేదు. కానీ “చండీ రాణి” హిందీ వర్షన్ లో విద్యావతి అనే సహనటికి ప్లేబాక్ పాడింది. ఆమె ఎవరో కాదు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పిన్ని.

భానుమ‌తి “మల్లీశ్వరి, స్వర్గసీమ, విప్ర నారాయణ, లైలామజ్నూ, బాటసారి” లలోపాడిన పాటలు ప్రజలను వెర్రెత్తించాయి. ఆవిడ‌ “ఓ పావురమా” అని పాడినా, “మనసున మల్లెల మాలలూ గెనే” అని కలవరించినా, “ఓ బాటసారి నను మరువకోయీ” అని యెలుగెత్తి పిలిచినా పరవశించిపోయారు. చివరి కాలంలో “మంగమ్మ గారి మనవడు “లో “శ్రీ సూర్య నారాయణా” అని పాడినా వంక పెట్టలేనట్టుగానే వుంది.

వారి స్వంత చిత్రాలలోనే కాక తాను నటించే యే చిత్రం లోనయినా తాను పాడే పాటలకు ట్యూన్ కట్టే సమయంలో సంగీత దర్శకుడి దగ్గర కూర్చుని తనకు నచ్చినట్టుగా మార్పులు చేర్పులు  చేయించే వారు.

భానుమ‌తి ప్రయివేట్ గా పాడి రికార్డ్ ఇచ్చినది ఒకే ఒక పాట. అది మద్రాస్ ప్రోవిన్స్ నుండీ ఆంధ్ర రాష్ట్రం విడిగా  యేర్పడినప్పుడు బాలాంత్రపు రజనీకాంతరావు రాసి స్వరపరచి, భానుమతి తో కలిసి పాడిన “పసిడి మెరుంగుల తళతళలు”అనే పాట (1953).

ఇక చిత్రాలలో ఆమె చేసిన నాట్యాల గురించి చెప్పవలసి వస్తే, తనకు పెద్దగా నాట్యం మీద శ్రధ్ధ లేదనీ, “భక్తిమాల” లో నటించే సమయంలో త‌న‌ నాట్యం చూసి “కీళ్లనెప్పుల భంగిమల తార భానుమతి” అని ఒక పత్రిక లో రాశారనీ చెబుతారు. ఈ విషయంలో ప్రముఖ విమర్శకులు వి.ఎ.కె రంగారావు గారు యేమంటారంటే “మల్లీశ్వరి”, “విప్రనారాయణ” సినిమాలలో ఆవిడ‌ చేసిన నాట్యాలు ఉత్తమమైనవి. ఆవిడ విడిగా గొప్ప డాన్సర్ కాక పోవచ్చు, కానీ ఆ నృత్యాలలో ఆమె చేసిన అభినయమూ ముఖంలో పలికిన భావాలూ ఇంకే నర్తకి లోనూ కనపడవు” అని.

రచయిత్రిగా ఆవిడ‌ స్థానం చాలా ప్రత్యేకమయినది. ఆవిడ‌ “వరవిక్రయం” లో నటించేటప్పుడు పరిచయమైన మల్లాది విశ్వనాథ కవిరాజు గారి దగ్గర  కథలు రాయడమూ, ఛందోబధ్ధంగా పద్యాలు రాయడమూ నేర్చుకున్నారు.

ఆవిడ‌ మొట్టమొదటి కథ “మరచెంబు”. దీనిని చక్రపాణి గారి సారథ్యంలో వెలువడే “ఆంధ్ర జ్యోతి “లో ప్రచురించారు. అదిచూసిన కవిరాజు గారు  “హాస్యం చక్కగా రాస్తున్నావమ్మా” అని మెచ్చుకున్నారు. ఆవిడ‌ కూడా తనకొచ్చిన కళలలో రచనా వ్యాసంగం అటేనే మక్కువ అని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో.

నిజానికి రచనలలో  హాస్యాన్ని పండించడం చాలా కష్టం. ఎలా సాధించారో కానీ భానుమ‌తి ఈ ప్రావీణ్యం అలవోకగా సాధించారు. ఆవిడ‌ రాసిన “అత్తగారి కథలు” పుస్త‌కానికి ఆంధ్ర దేశంలో  అపూర్వమైన ఆదరణ లభించింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు కూడా లభించింది.

ఆవిడలాగా ఆరోగ్యకరమైన హాస్యంతో పూర్తిస్థాయి  రచనలు  చేసిన రచయిత్రులెవరూ కనపడరు. ఈ మాట నేననడం కాదు. ప్రఖ్యాత రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారు అన్నారు. ఇంకో విషయం ఏమంటే, మిగతా రచయిత్రులందరూ ప్రేమకథలు రాస్తూ నేల విడిచి సాము చేస్తున్న కాలంలో ఈవిడ‌ మాత్రం నిజజీవితానికి దగ్గరగా వుండే సంఘటనలను ఆధారం చేసుకుని, సున్నితమైన హాస్యం ఒలికిస్తూ రచనలు చేయడం విశేషం. భానుమ‌తి రాసిన “రంభా చక్రపాణీయం” చదివిన చక్రపాణి గారు మెచ్చుకుని, “నీ అబ్జర్వేషన్ చూస్తుంటే భయంగా వుంది” అన్నారట. ఆవిడ స్వీయచరిత్ర “నాలోనేను” కి కేంద్ర ప్రభుత్వ స్వర్ణకమలం లభించింది.

ఆమె తో  సాహిత్య చర్చలు చేయడానికి వారింటికి కొడవటిగంటి కుటుంబరావు, డి.వి. నరసరాజు, చక్రపాణి, దాశరథి  లాంటి ప్రముఖులు తరచూ వెళుతూ వుండే వారంటేనే అర్థం చేసుకోవచ్చు సాహిత్యం లో ఆవిడ‌ స్థాయి యెంతటిదో.

చిత్రం: అన్వర్

ఆవిడ  చాలా పట్టుదల గల మనిషి. ఎనిమిదో తరగతి తో ఆపేసిన మనిషి.. 1966లో హఠాత్తుగా చదువుకోవాలనిపించి, ఆంధ్రా మెట్రిక్ కి కట్టి ఫస్ట్ క్లాసులో పాసయింది. మరుసటి సంవత్సరం పి.యు.సి కి కట్టి అదికూడా పస్ట్ క్లాస్ లో పాసయింది. అదీ భానుమతంటే. తర్వాత కొనసాగించడానికి అనారోగ్యం అడ్డొచ్చింది. ఆవిడకి హస్త సాముద్రికంలోనూ, జ్యోతిష్య‌ శాస్త్రం లోనూ కూడా ప్రవేశముంది. ఆ శాస్త్రాలను అధ్యయనం చేశానని రాశారావిడ.

ఇక ఆవిడ వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే స్వాభిమానం, స్వాతిశయం నిండుగా వున్న మనిషి. పరమ నిర్మొహమాటి. ఈ లక్షణాల వలన ఆమెకు పొగరనీ, గర్వమనీ, యెంతటి వారినయినా  లక్ష్య పెట్టదనీ చెప్పుకునే వారు. అందు వలన ఆమె కొన్ని మంచి పాత్రలను కూడా చేజార్చుకున్నారు .

అందులో “మిస్సమ్మ” లోని హీరోయిన్ పాత్ర ఒకటి. ముందుగా భానుమతి గారిని హీరోయిన్ గా తీసుకుని నాలుగు రీళ్లు షూట్ చేసినాక, ఒక రోజు షూటింగ్ కు ఆలస్యం గా వచ్చారావిడ‌. చక్రపాణి గారికి కోపం వచ్చింది. సారీ చెప్పమన్నారు. “వరలక్ష్మీ వ్రతం చేసుకుని ఆలస్యంగా వస్తానని నేను ముందు రోజు మానేజర్ తో చెప్పాను. నా తప్పేం లేదు.  సారీ చెప్పను” అన్నారావిడ‌. చివరకు షూటింగ్ కాన్సిల్ చేసి ఆమె వున్న ఆ నాలుగు రీళ్ల సినిమా ఆమె ఎదురుగానే చక్రపాణి కాల్చివేశారని అంటారు. భానుమ‌తి చాలా బాధపడుతూ వెనుదిరిగి వెళ్లిపోయిందే కానీ సారీ చెప్పలేదు.

నాగిరెడ్డి గారు “కనీసం ఫోన్ లో అయినా సారీ చెప్పు చక్కన్న కి సరిపోతుంది” అన్నారు. అయినా ఆవిడ‌ చెప్పలేదు. అదీ త‌న‌ ఆత్మాభిమానం. ఆ తర్వాత ఆవిడ‌ స్థానంలో  అప్పటి దాకా చెల్లెలి పాత్ర వేస్తున్న సావిత్రిని తీసుకున్నారు. పిక్చర్ హిట్టయ్యాక, “నేను మిస్సయితేనేం సావిత్రిలాంటి మంచి నటి దొరికింది. నాకు రాసిపెట్టి లేదాపాత్ర” అనేవారామె. ఇక్కడొక విచిత్రం.. చక్రపాణి గారు  భానుమతి గారిని సినిమా నుండీ తొలగించినా, ఆమెతో స్నేహం అలాగే కొనసాగించారు. ప్రతి సంవత్సరం యువ పత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో ఆమె కథ వుండి తీరాల్సిందే.

భానుమ‌తి ఆత్మ గౌరవానికీ, ధైర్యానికీ ఉదాహరణగా ఇంకో సంఘటన చెబుతారు. తమిళంలో ఒక దర్శకుడు లేడీ ఆర్టిస్టులను మర్యాద లేకుండా “ఏమే, ఒసే” అని పిలిచేవాడట. ఒకసారి ఈవిడ‌ను కూడా అలాగే “ఏమే డైలాగ్ చూసుకున్నావా?” అంటే, ఈవిడ తిరిగి “ఏమిట్రా డైలాగ్ చూసుకునేది” అన్నదట. అలా త‌న‌ మర్యాదని నిలుపుకునే వారు. భానుమ‌తికి ఘంటసాల గారితో కూడా యేదో మాట తేడా వచ్చింది. అందువలననే “విప్ర నారాయణ” లో ఆయనతో కాకుండా ఎ.యమ్ .రాజా తో పాడించారు. చివరకు “చింతామణి” లో పద్యాలకోసం ఘంటసాలని పిలిపించి పాడించారు.

ఇక డైరెక్టర్ గా ఆవిడ‌ ప్రతిభ గురించి చెప్పాలంటే 1953లోనే  “చండీ రాణి “అనే సినిమా ద్విపాత్రాభినయంతో తెలుగు, తమిళ, హిందీ భాషలలో తీశారు. ఎంత సాహసమో చూడండి. తెలుగు, తమిళాల్లో సరే హిందీలో కూడా  పాటలు ఆవిడే పాడుకున్నారు. ఆ తర్వాత  భానుమ‌తి దర్శకత్వం వహించిన చిత్రాలు “అంతా మన మంచికే”, “విచిత్ర వివాహం”, “అమ్మాయి పెళ్లి”, “రచయిత్రి”, “ఒకనాటి రాత్రి”, “భక్త ధృవ మార్కండేయ”. ఆమె ఆఖరి చిత్రం “అసాధ్యురాలు” (1993) .

భానుమ‌తి మొట్టమొదటి సంగీత దర్శకురాలు అని చెప్పుకున్నాం కదా. ఆవిడ సంగీత దర్శకత్వం వహించిన మొదటి సినిమా “చక్రపాణి”. ఇందులో చాలా మంచి పాటలున్నాయి. “పక్కల నిలబడి” అనే త్యాగరాజ కీర్తన కూడా పాడిందావిడ. ఆవిడకిష్టమైన యమన్ కల్యాణి లో పాడిన “మెల్లమెల్లగా చల్ల చల్లగా రావె నిదురా హాయిగా” అనే పాట కూడా చాలా హాయిగా వుంటుంది. “నన్ను చూచి ఇంత జాలి యేలనమ్మ మాలతీ” అనే పాట అత్యంత మధురంగా వుంటుంది. ఇంకా “అంతా మన మంచికే, విచిత్ర వివాహం, అమ్మాయి పెళ్లి, రచయిత్రి, ఒక నాటి రాత్రి , అసాధ్యురాలు”  చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించారు.

ఇలా ఇన్ని విశేషాలున్న ఆవిడ నేపథ్యమేమిటీ, ఆవిడ వ్యక్తిగత జీవితం యెలా గడిచింది ఒకసారి తెలుసుకుందాం.

ఆవిడ ఒంగోలుకు సమీపంలో వున్న దొడ్డవరం గ్రామంలో  1925 సెప్టెంబర్ 9వ తేదీన  మూడవ సంతానంగా జన్మించింది. తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య, తల్లి సరస్వతి. కుటుంబానికి సంగీత సాహిత్య నేపథ్యం వుంది. తండ్రి గారికి కర్ణాటక సంగీతంలో మంచి ప్రావీణ్యం వుంది. వీణ కూడా వాయించే వారు. తల్లిగారు బాగా పాడేవారు. ఎక్కడో ఒక పేరంటంలో పాడుతున్న సరస్వతి గారిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారట సుబ్బయ్య గారు.

భానుమతి మీద తండ్రి ప్రభావం అధికం. తండ్రే తొలిగురువు. చిన్న నాటనుండీ  బాగా పాడుతున్న భానుమతి చేత గ్రామఫోన్ రికార్డులిప్పించి యం.యస్. సుబ్బలక్ష్మి అంత దాన్ని చేయాలనుకున్నాడాయన. అయితే త‌న‌ స్నేహితులైన గోవిందరాజుల సుబ్బారావు, మైనంపాటి నరసింహారావుల సలహాలను పాటించి, దర్శకుడు సి.పుల్లయ్య గారి “వరవిక్రయం” (1939) సినిమాలో  కాళింది పాత్రలో భానుమతి నటించడానికి ఒప్పుకున్నారు, యెన్నో షరతులను విధిస్తూ. అలా ఒప్పుకోవడానికి ముఖ్య కారణం భానుమతి గొంతు ఆంధ్ర దేశమంతా వినపడుతుందనే ఆశే గానీ సినిమాల మీద మోజు కాదు. “వరవిక్రయం” లో “పలుకవేమి నా దైవమా” అనే త్యాగరాజ కీర్తన పాడింది భానుమతి.

అలా సుమారు 13 యేళ్ల వయసులో సినీ పరిశ్రమలో ప్రవేశించిన భానుమతికి ఈ సినిమాలూ, నటన ఇష్టం లేదు. హాయిగా మామూలు మధ్య తరగతి ఆడపిల్లల్లాగా ఆడుతూ పాడుతూ కాలం గడిపి ఒక సామాన్య గృహిణి గా సంసారం నడపాలనుకునేది.

“వరవిక్రయం” తర్వాత వరసగా “మాలతీ మాధవం”, “భక్తిమాల”, “కృష్ణప్రేమ” మొదలైన చిత్రాలలో తండ్రిగారి అదుపాజ్ఞలలో వుంటూ నటిస్తూ వుండేది. ఆయన చాలా ఆంక్షలు విధించే వాడు. “హీరో మా అమ్మాయిని ముట్టుకోకూడదు, కౌగిలించుకోకూడదు” ఇలా.

అయితే “కృష్ణప్రేమ” లో నటించేటప్పుడు ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గానూ ఎడిటింగ్ శాఖలో పని చేస్తున్న రామకృష్ణ గారితో ప్రేమలో పడింది. ఆయన్నే పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టింది. తండ్రిగారికీ వివాహం ఇష్టంలేదు. వరుడు ఆయన ఆశించినంత ఆస్తిపరుడూ, అందగాడూ కాదనే కారణంతో ఆయన అభ్యంతరం చెప్పారు. రామకృష్ణ గారిని తప్ప వేరొకర్ని వివాహం చేసుకోనని పట్టుబట్టుకుని కూచుంది భానుమతి. చివరికి రామకృష్ణ గారి బంధువులు మనపాక కమలమ్మ గారి చొరవతో వారిద్దరికీ ఒక గుళ్లో 8-8-1943 లో  వివాహం జరిగింది.

భానుమతి తాను ఆశించినట్టుగా  సినిమాలు మానేసి ఒక మధ్య తరగతి గృహిణిగా, భర్త చాటు భార్యగా సాధారణ జీవితం గడపాలనుకుంది. దానికి రామకృష్ణ గారు కూడా వత్తాసు పలికారు. ఇద్దరూ కలిసి ఒక ఉద్యోగం వెతుక్కుని మద్రాసు వదిలేసి దూరంగా వెళ్లిపోదామనుకున్నారు. అయితే విధి వేరే విధంగా తలిచింది. బి యన్ రెడ్డి గారు వాహినీ సంస్థ తరఫున “స్వర్గసీమ” తలపెట్టారు. అందులో వాంప్ షేడ్సున్న ముఖ్య పాత్రకి భానుమతి మాత్రమే న్యాయం చేస్తుందనీ, ఆమెను యెలాగైనా ఒప్పించమనీ నటుడు ముదిగొండ లింగమూర్తినీ, రచయిత సముద్రాల రాఘవాచార్యులు గారినీ రాయబారమంపి, యెలాగో ఒప్పించారు.

ఆ సినిమా తెలుగునాట, తమిళ నాట సూపర్ హిట్టయ్యింది. అందులో  బాలాంత్రపు రజనీకాంతరావు రాయగా ఆమె పాడిన “ఓ పావురమా “పాట విని ప్రజలు పిచ్చెక్కి పోయారు. ఆ చిత్రం పూర్తయ్యే సమయానికి వారి యేకైక కుమారుడు భరణీ కడుపున పడ్డాడు. ఆవిడ‌కి వరసగా సినిమా అవకాశాలు రాసాగాయి. వారికి కూడా కుమారుడి భవిష్యత్తుకోసం డబ్బు సంపాదించవలసిన అవసరం కనపడింది.

ఆమె ఆ తర్వాత “తాసిల్దార్”,  “గృహప్రవేశం” మొదలైన చిత్రాలలో నటించసాగింది. 1947లో తమ కుమారుడు “భరణీ” పేర చిత్ర నిర్మాణ సంస్థ స్థాపించి, చిత్రాలు తీయనారంభించారు. 1950లో భరణీ స్టూడియోను నెలకొల్పారు. భరణీ సంస్థ చాలా ప్రతిష్ఠాత్మకమైన చిత్రాలు తీసింది. వాటిలో “లైలా మజ్నూ, విప్రనారాయణ, బాటసారి, చండీరాణి, చింతామణి, గృహలక్ష్మి, అంతా మన మంచికే” ముఖ్యమైనవి. వారి చిత్రాలలో చాలావాటికి రామకృష్ణ గారే దర్శకులు. కొన్ని చిత్రాలకు భానుమతి దర్శకత్వం వహించారు. స్టుడియో నిర్వహణ అంతా కూడా యెక్కువగా భానుమతి గారే చూసుకునే వారు. భరణీ సంస్థ తీసిన మొదటి చిత్రం “రత్నమాల”. చివరి చిత్రం “అసాధ్యురాలు”.

తమిళంలో కూడా భానుమతి నటించ సాగింది. ఆవిడ‌ మొట్టమొదటి తమిళ చిత్రం “రత్నకుమార్ (1949). “రాజముక్తి, అంబికా పతి, అన్నై, రంగూన్ రాధ” ఆమె నటించిన ముఖ్యమైన చిత్రాలలో కొన్ని.

భానుమతి తెలుగు,తమిళం,కన్నడం,హిందీ భాషలలో సుమారు వంద చిత్రాలలో నటించింది.

తెలుగులో అగ్ర హీరోలయిన యన్.టి.ఆర్., ఎ.యన్.ఆర్ లు కూడా ఆమె సరసన నటించడానికి కొంచెం జంకేవారు అని చెబుతారు. ఎవరైనా “అక్కినేని తో కలసి మీరు నటించిన…” అని చెప్పబోతుంటే, “ఆయనతో నేను కలిసి నటించలేదు, అక్కినేనే నాతో కలిసి నటించాడు” అని సరిచేస్తారామె.

యన్.టి.ఆర్. తో కలిసి నటించిన “చండీ రాణి, అగ్గిరాముడు, మల్లీశ్వరి” సూపర్ హిట్లు.

“మల్లీశ్వరి”ని నేటికీ ఒక కళాఖండంగా ఆరాధించే వారెందరో. అందులో పాటలు చాలా ప్రజాదరణ పొందాయి. “ఆకాశవీథిలో, మనసునమల్లెల మాలలూగెనే” ఇప్పటికీ ఇష్టంగా పాడుకునే మెలోడీస్.

అలాగే ఎ.యన్.ఆర్ తో కలిసి నటించిన “విప్రనారాయణ, లైలామజ్ను బాటసారి,గృహలక్ష్మి” కూడా మంచి హిట్లు. ఎ.యన్.ఆర్. భరణీ వారి అభిమాన హీరో, రామకృష్ణ గారికి ఇష్టమైన హీరో అని చెబుతారావిడ.

తమిళంలో యం.జి.ఆర్, శివాజీ గణేశన్, పి.యు. చిన్నప్ప, యం.కె.త్యాగరాజ భాగవతార్ మొదలైన వారితో నటించారు.

యం.జి.ఆర్ కి భానుమతి అన్నా, ఆవిడ‌ పాటన్నా చాలా ఇష్టం. అందువలననే 1985లో  ఆవిడ‌ని మద్రాసు ప్రభుత్వ సంగీత కళాశాలకి ప్రిన్సిపాల్ గానూ, డైరెక్టర్ గానూ నియమించారు. ఆ పనిని భానుమ‌తి యెంతో సమర్థవంతంగా నిర్వహించారు. అప్పటిదాకా కేవలం తమిళ కీర్తనలనే చెబుతుంటే, ఆ పధ్ధతి మార్చి త్యాగరాజ కీర్తనలను కూడా సిలబస్ లో చేర్చానని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. 1986లో విద్యార్థులందరితో కలిసి తిరువయ్యూరు వెళ్లి త్యాగరాజ స్వామి సమాథి వద్ద, యం. యస్. సుబ్బలక్ష్మి బృందం తో కలిసి “ఎందరో మహానుభావులు” పాడుతుంటే తండ్రి గారి ఋణం తీర్చుకున్నట్టనిపించింది అని రాసుకున్నారు త‌న  స్వీయచరిత్రలో.

1967 తర్వాత శరీరంలో వచ్చిన మార్పులు దృష్టిలో పెట్టుకుని హీరోయిన్ వేషాలు వేయడం మానేశారు. “గృహలక్ష్మి” లోనే ఆఖరుగా హీరోయిన్ గా వేసింది. “మట్టిలో మాణిక్యం, అంతా మనమంచికే” ఈ చిత్రాలలో అంతా మధ్య వయసు పాత్రలే వేశారు.

1984లో రామకృష్ణ గారు అమెరికాలో గుండెపోటుతో మరణించారు. భానుమ‌తి  ఒక్కరే ఇండియా తిరిగి వచ్చారు. అడపా దడపా చిత్రాలలో నటిస్తూ, నిర్మిస్తూ కాలం గడపసాగారు. అలా నటించినవే “మంగమ్మ గారి మనవడు, బామ్మమాట బంగారు బాట, ముద్దుల మనవరాలుష‌ మొదలైనవి. ఆమె చివరి చిత్రం కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన “పెళ్లి కానుక”(1998).

ఆమె నటించిన హిందీ చిత్రాలు:   రాణీ, షంషీర్, నిషాన్, మంగళ, చండీరాణి

కన్నడ చిత్రం: నలదమయంతి

ఆమె అందుకున్న గౌరవాలు:  నడిప్పుక్కు ఇలక్కణం – 1956(రంగూన్ రాధా లో నటనకు)                                                                 కలైమామణి – 1983

సాహిత్య అకాడెమీ అవార్డ్ – (1965) అత్తగారి కథలు

పద్మశ్రీ – 1966       నటనకు రాష్ట్రపతి అవార్డ్ మూడుసార్లు: “అన్నై” – 1962,  “అంతస్తులు” – 1965, “”పల్నాటి యుధ్ధం” – 1966

ఆంధ్ర యూనివర్సిటీ నుండీ గౌరవ డాక్టరేట్ మరియూ కళాప్రపూర్ణ 1975 వ సంవత్సరంలో. శ్రీ వేంకటేశ్వరా యూనివర్సిటీ నుండీ గౌరవ డాక్టరేట్ 1985లో. రఘుపతి వెంకయ్య అవార్డ్ 1986లో.

ఉత్తమ డైరెక్టర్ గా నంది అవార్డ్ – 1986      ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డ్ – 1987

రాష్ట్రపతి స్వర్ణ కమలం “నాలో నేను ” పుస్తకానికి – 1994

యన్.టి.ఆర్. జాతీయ అవార్డ్ – 2000

పద్మభూషణ్ – 2001

భారత ప్రభుత్వం 2013లో ఆవిడ‌ పేర పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది.

1998 నుండీ భానుమ‌తి సినిమాల్లో నటించడం మానేశారు. ఆవిడ “అత్తగారి కథలు”,  స్వీయ చరిత్ర టీవీల్లో ప్రసారమయ్యాయి. ఆవిడ దృష్టి ఆధ్యాత్మికం వేపు మళ్లింది. శృంగేరీ శంకరాచార్యుల వద్ద మంత్రోపదేశం పొందారు. కుమారుడు డాక్టర్ భరణీ అమెరికానుండీ వచ్చి తల్లి దగ్గరే వుండసాగాడు.

2005 డిసెంబర్ 24వ తేదీన భానుమతి ఈ లోకం నుండీ శెలవు తీసుకున్నారు. ఆంధ్ర దేశంలో యెక్కడో పల్లెటూరులో పుట్టి, యెనిమిదవ తరగతి మాత్రమే చదివిన ఒక మహిళ తన కృషితో, పట్టుదలతో, స్వాభిమానంతో జీవితాన్ని మలుచుకున్న తీరు మహిళలందరికీ ఆదర్శప్రాయం. సినీ రంగంలో యెంతోమంది దగాపడి, మోసపోయి, బేలగా వ్యసనాలకి బానిసలయి చేజేతులా జీవితాన్ని నాశనం చేసుకున్న ఆడవాళ్లను చూస్తూ వుంటాం. అలాంటి వాళ్లందరూ ఈవిడని చూసి చాలా నేర్చుకోవచ్చు అనిపించింది.

జై భానుమతి!

*

 

రొంపిచర్ల భార్గవి

20 comments

Leave a Reply to Bhargavi Rompicherla Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బావుంది భార్గవి గారూ. I had an idea that Bhanumathi was stubborn and versatile. కానీ, సంగీతంలో ఆవిడ ఎంత ప్రతిభ కనబరిచారు, ఆవిడకి ఎంత గుర్తింపు లభించింది అన్నది నాకు తెలియదు. భానుమతి గురించి తెలుసుకోవాలని ఎవరైనా అనుకుంటే, మీరు రాసిన ఈ వ్యాసం కన్నా better source వుండదు. Thanks you 🙏

  • ఆమెకు పొగరు ఉన్నమాట వాస్తవమే కానీ అందుకు తగ్గట్టుగానే విద్వత్తూ ఉండడం వలన నెగ్గుకొచ్చింది. ఆ సత్తా ఉన్నవారికి అది స్వాభిమానం లేని వారికి పొగరు. స్త్రీల హాస్య రచనలంటే గుర్తుకొచ్చేది ఆమె అత్తగారి కథలే.

    చాలా కొత్త విషయాలు తెలిసాయి. మంచి వ్యాసం.

  • Bhargavi..
    చాలా బాగుంది , భానుమతి మీద ఈ వ్యాసం. కూలంకషగా మాకు తెలియని ఎన్నో వివరాలు , విశేషాలు తెలియపరచారు.

    ఆమె లాంటి కళాకారిణి మరొకరు ఉండరు..ఎన్ని రంగాల్లో నిష్ణాతురాలు,భానుమతి. నూటికో , కోటికో ఒక్కరు ఉంటారు..ఆమె వంటి వారు.

    పొగరు అని అందరూ అనే , ఆమె ఆత్మవిశ్వాసం , ఆడవారికి ఆదర్శం కావాలి అని నా అభిప్రాయం.

    తన మీద తనకు ఎంత విశ్వాసం ఉంటే తప్ప , ఆ నాటి సినిమా ప్రపంచంలో మేటివారు , అయిన , చక్రపాణి మొదలైన వారితో అలా తల ఎత్తి మాట్లాడగలిగే వారా..

    నేను ఆమెకు వీరాభిమాని నే..నాకు తెలిసిన కొద్ది పాటి సంగీత జ్ఞానం..అంటే..పై పైనే, కీర్తనల మొదటి వరస ఆమె నటించిన సినిమాలలో ఉన్న కీర్తనలు వింటూ , తెలుసుకున్నవే..

    మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు , భార్గవి.

  • చాలా క్లుప్తంగా భానుమతి గురించి తెలియచేసారు. ఆవిడ కథలు రాయడమే కాదు, మంచి చదువరి కూడా! తెలుగు మాత్రమే కాదు ఆంగ్లం కూడా బాగా చదివేవారు. బాటసారి (1961)కి కధనం అందించింది, వివాహబంధం (1964) కి కథనం – సంభాషణలు అందించింది మా నాన్న గారు అట్లూరి పిచ్చేశ్వరరావు గారు.

  • చాలా బాగా రాసారు.. అన్ని రంగాలను కవర్ చేస్తూ..
    అమూల్యమైన విషయసేకరణ..

    మా నాన్నగారికి చాలాఇష్టమైన నటి.. ఆడవారంతా ఆవిడను చూసి నేర్చుకోవాలని
    ఆ రోజుల్లోనే చెప్పేవారు..
    మీరన్నట్టు ‘నేను కాదు వారు నాతో కలిసి నటించారు..’ అది ఆత్మాభిమానం అంటే..
    చండీరాణి గురించి మీ నాన్నగారి వద్దే విన్నాను.

  • బాగా రాశారండి. భానుమతి గారి గురించి ఎన్ని సార్లు విన్నా చదివినా కొత్తగానే ఉంటుంది.
    ఒక మాట –
    ఈ మధ్య నేను విన్న ప్రకారం –
    ఘంటసాల గారు విప్రనారాయణ లో (మిస్సమ్మ కూడా ) పాడక పోవడానికి కారణం ఆ సమయంలో ఘంటసాల తన రెందవ పెళ్ళి గొడవల్లో తలమునకలై ఉండటం వల్ల అని విన్నాను – నిజం పెరుమాళ్ళకెరుక 🙂
    నేను కనిపెట్టిన మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే –
    క్రిష్ణప్రేమ లో నటించిన శాంతకుమారి, సూర్యకుమారి, భానుమతి గార్లు కూడబలుక్కున్నట్లు పార్థివ నామ (2005 – 06) సంవత్సరంలోనే చనిపోవడం కాకతాళీయం.
    17 ఏళ్ళ క్రితం భమిడిపాటి రామగోపాలం గారు భానుమతి గారి మీద చక్కటి సావనీర్ తెచ్చారు – దానిపేరు “మహా మహిళ ”
    స్వస్తి !

  • భానుమతి గురించి నాకు బాగానే తెలుసు అనుకున్నాను. నాకు తెలియని ఎన్ని విశేషాలు ఉన్నాయో !ఇన్ని రంగాల్లో రాణించడమనేది సామాన్యమైన విషయం కాదు . Good job ,as always Bhargavi garu.👍👍

  • భానుమతి ఆ తరంలోని అద్భుతమైన నటీమణుల్లో నిస్సందేహంగా ఒకరు. అది మాట పాట రచన సంగీతం మరేదైనా కానీ ఆమె ప్రత్యేకత చివరివరకు నిలుపుకున్నారు. ఇక్కడే మీరు ఆమె సారంగధర లో పాడిన ‘ అడుగడుగో అల్లడుగో అభినవనారీ మన్మధుడు’ గురించి కూడా రాసుండాల్సింది. రాణివాసం కోరినా , రాణిగా ధిక్కారం చూపినా భానుమతిగారిలో ఆ పాత్రల్లో జీవించారు. థాంక్స్ భార్గవి గారు.

    • సారంగధర లో ఆ పాట రికార్డింగ్ కోసం ఆ సినిమా సంగీత దర్శకుడైన ఘంటసాల చాలా రోజులు భానుమతి గారికోసం నిరీక్షించవలసి వచ్చిందనీ,ఒక సారి ఒంట్లో బాగాలేదనీ,ఒకసారి గొంతు బాగా లేదనీ ఇలాంటి కారణాలతో ఆ పాట రికార్డింగ్ కి భానుమతి ఇబ్బంది పెట్టిందని ఘంటసాల గారి భార్య సావిత్రమ్మ గారు స్వయంగా నాతో చెప్పారు.అయితేనేం ఆ పాట అద్భుతంగా పాడారు.మీ స్పందనకు ధన్యవాదాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు