తడుముకుంటూనే….

ఆమె చేతి వేళ్ళని పోనిచ్చి మెడ వెనుక నిమురుకుంది – ఏం తగల్లేదు, మళ్ళీ మళ్ళీ వేగంగా  తడిమింది.. లేదు! గాలి స్పర్శేనా అని అనుమానించింది కానీ కాదు, ఏదో సన్నటిది మెడ మీదుగా కదలాడుతూనే ఉన్నట్లు ఉంది. జుట్టు మొత్తం ముడి విప్పి దులిపింది. ఒకటి రెండు విడి వెంట్రుకలు లాగి పడేసి మళ్ళీ ముడేసింది. కాసేపు ప్రశాంతంగా ఉంది.

ఆమె కార్పొరేట్‌ సెక్టార్‌ లో పని చేస్తుంది. జీతంలో మిగులేమీ ఉండదు. టేక్స్‌ కట్టయ్యేంత శాలరీ కావడంతో ఏ నెలకానెల కమిట్మెంట్లు పెట్టుకోందే ఈమాత్రం వెసులుబాటు కూడా ఉండదు. అసలు మిగిల్చే పరిస్థితే లేదు.

చెయ్యి జోరుగా మెడమీద ఆడిస్తూనే ఉంది, రెండు వేళ్ళతో దేన్నో పట్టుకోడానికి ప్రయత్నిస్తూనే ఉంది!

ఆమె వంట చేస్తూ మధ్యలో వచ్చి ఫాన్‌ కింద కూర్చుంది. కుక్కర్‌ విజిల్‌ వచ్చేవరకూ ఖాళీ. అలా విశ్రాంతిగా వెనక్కి వాలిందో లేదో మెడ మీద సెన్సేషన్‌ మొదలైంది. కూతురితో మాట్లాడతూనే చెయ్యెత్తి మెడ వెనుక రాస్తోంది. ఏం దొరకట్లేదు.

ఆఫీసులో అడుగుపెట్టగానే చుట్టూ చూసింది – గాజుగోడలని ఆనుకుని ఉన్న బ్లైండ్స్‌ ఎత్తేసి ఉంచారు. గబగబా సిస్టమ్‌ లాగిన్‌ చేసి అది ఆన్‌ అయే లోపల వెళ్ళి అవన్నీ క్లోజ్‌ చేసి వస్తుంటే మిగతా టీమ్స్‌ వాళ్ళు చూసీచూడనట్లు తలలు తిప్పుకున్నారు. లోపలంతా వేడి! వీళ్ళకేం పట్టదు అందరూ చిన్నపిల్లలు కదా! తనకో – యాభై దాటాక ఇంతేనేమో మరి!  ఆలోచిస్తూ మెడమీదకి చెయ్యి పోనిచ్చింది. అక్కడ అంతా చెమట డ్రమ్ములో ముంచేసినట్లు ఉంటుంది తనకి ఎండాకాలం వొస్తే! టిష్యూతో మెడంతా తుడుచుకుంది. కాస్త చల్లబడింది.

జీవితం మొత్తం అన్నిటికీ తడుముకుంటూనే గడిచింది ఇప్పటిదాకా! ఇక ముందైనా బాగుంటుందేమో చూడాలి మరి!
అప్పుడప్పుడూ ఎవరితోనైనా మాట్లాడటానికి కూడా తడుముకోవడం మొదలైంది ఈ మధ్యనే! ఓసీడీ కేండిడేట్‌ లాగా తయారయ్యాను అనుకుని నవ్వుకుంది కాసేపు!

వర్క్‌ చేసుకుంటూ కూడా ఏదో మెడ మీద ఉందేమోననే అనుమానంతో చెయ్యి మెడమీదకు పెడుతూనే ఉంది.
ఇంటికెళ్ళాక కూడా ఏం చేస్తున్నా మధ్య మధ్య చేత్తో తడుముతూనే ఉంది.. విసుగ్గా.. ఆత్రంగా.. అనుమానంగా.. అలవాటుగా!

…తడుముతూనే ఉంది నిద్రలో కూడా!

*
చిత్రం: రాజశేఖర్ చంద్రం

గీతా వెల్లంకి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు