తడి ఆరని సంతకం ‘పరావలయం’ కవిత్వం

       కవిత్వం రాయటానికి అవసరమైన వస్తువులను గూర్చి అవగాహనున్న ప్రతి కవికి ప్రతిదీ కూడా కవిత్వమై అల్లుకుపోతు పలకరిస్తుంది.  కవిత్వం సమాజంలో జరుగుతున్న అనేక  మార్పులను గూర్చి  లోతుగా అన్వేషణ చేయమంటుంది.  పాలనపరమైన సంస్కరణలతో పాటుగా సాంస్కృతికి సంబంధించిన మార్పులు, చేర్పులు నిత్యం చోటు చేసుకుంటూనే ఉంటాయి.  బాధ్యత కలిగిన కవులు వాటిని ఎప్పటికప్పుడు తమ కవితల్లో నమోదు చేస్తూనే ఉంటారు.  అట్లా నమోదు చేస్తున్న నేటికాలపు కవుల్లో బలంగా తనదైన ప్రత్యేక గొంతుకను వినిపిస్తున్న కవి ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌.   మొదటి కవితా సంపుటి ‘దు:ఖానంతర దృశ్యం’(2014) తర్వాత వెలువరించిన ‘పరావలయం’ ఒద్దిరాజు రెండో కవితా సంపుటి.  ఈ కవి యొక్క వైవిధ్యభరితమైన ఆలోచనల ధారలకు  అద్దం పడుతున్న కవిత్వమిది.
పలు సాహితీ సంస్థలు నిర్వహించిన కవితల పోటీల్లో బహుమతులు అందుకున్నారు. వర్తమాన జీవన సంఘర్షణకు తన కవితా పాదాలు దర్పణం పడుతున్నాయి. ‘భూమి పుట్టినప్పుడే ప్రేమ పుట్టింది/కత్తి మొనల మీదుగా నాగరికత నడిచి వచ్చింది. నీటి జాడ లేని బంజర్ల మీదుగా/మనషుల మీదుగా, మనసుల మీదుగా/నడక నేర్చిన వాడి మడత పేచి’ అంటూనే మనుషుల మనసుల మీద చొప్పించిన కులాల, మతాల కుళ్ళును  ప్రశ్నించారు.  సామూహిక సుఖ సంతోషాలకు దూరం చేశారని ఆవేదన చెందుతారు.  స్వార్థం కోసం మానవ సంబంధాలకు వ్యాపారపు రంగులను పూసారని కలత చెందుతాడు.
     ‘మనిషి చూపు పరుచుకున్నంత మేర
     జాలి నదుల జాడ లేనంత వరకు
     పువ్వుల గుస గుసలు చీకట్లో చీకటై
     సాంప్రదాయపు వాకిట్లో శవాలవుతున్నాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైన తర్వాత జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద పలు కవితలను రాసారు.  నీటి ప్రాజెక్టుల మీద ‘నీటి పువ్వు’ కవితను రాసారు.  ‘నది అంటే నడుస్తున్న సంపద/నీటిని మూట గట్టి/పొలాల్లో విప్పితే/అది సీతాకోక చిలుకల గుంపవుతుంది’  అంటూనే మరో కవితలో ఇంకా ఇలా అంటున్నారు.
     ‘నది ఒకప్పుడు మనకు ఎండమావి
     ఇప్పుడు మేడిగడ్డ నుంచి కన్నెపల్లి మీదుగా
     తరలివస్తున్న పాలపొదుగు
     నది ఒకప్పుడు చుట్టపు చూపు
     ఇవ్వాళ ఒట్టిపోయిన చెరువుల్లో
     జల సిరులు కురిపించే ప్రజల కలల నీటి పువ్వు’
మార్పులు మనం అనుకున్నంత త్వరగా కనబడకపోవచ్చు.  కాలం గడుస్తున్న కొద్ది వాటి ఫలితాలు కనిపిస్తాయి.  నిధులు, నియమాకాలు, నీళ్ళు అనే అంశాలతోను తెలంగాణ ఉద్యమం బలంగా నడిచింది. తెలంగాణ ప్రభుత్వం కూడా నీళ్ళకు మొదటి ప్రాధాన్యతనే ఇచ్చింది.  ఆగిపోయిన ప్రాజెక్టులకు కొత్త చేర్పులతో త్వరత్వరగా పూర్తి చేస్తున్నది.  రైతులకు ఉచిత కరెంటు, పెట్టుబడి కోసం ‘రైతుబంధు’ పథకంను అమలు చేస్తున్నది.  ‘స్వాప్నికుడు’ కవితలో ఇంకేమి కావాలో కవి స్పష్టంగా ప్రకటించాడు.
 ‘రైతంటే మట్టితో మాట్లాడి
          నీటి తల నిమిరి మట్టినీ నీటినీ సంగమింపజేసి
          విత్తనానికి పురుడు పోసే ప్రాణదాత
          పాలకుండై పిల్లల కడుపు నింపి
         మనకు బువ్వై బక్కచిక్కిన జీవదాత
         రైతు పొలాలను గీసే చిత్రకారుడు
         పంటలను కలగంటున్న స్వాప్నికుడు
         మన నాగరికతను నెత్తికెత్తుకున్న ఆధునికుడు
        రైతుకు కావాల్సింది నీళ్ళు, కరంటే కాదు
        గిట్టుబాటు ధర కూడా’
మానవీయమైన సంబంధాల పట్ల ఈ కవికి మక్కవ ఎక్కువ.  మనుషుల యొక్క లౌక్య ప్రదర్శనల పట్ల కలత చెందుతాడు.  స్వార్థపరమైన విధానాల పట్ల ఆగ్రహం చెందుతాడు.  చెప్పే మాటల్లోని డొల్లతనాన్ని కచ్చితంగా నిలదీస్తాడు.  ఇప్పటి జీవనానికి అవసరమైన అంశాల్ని ‘నిజం నిలకడ మీద’ కవితలో ఇలా వ్యక్తీకరించారు.
        ‘మాఘమాసపు వెన్నెల గాలుల్లో
        మృదువుగా ముద్దుగా కదిలే క్యాంపస్‌
        రాజకీయ పాదరసంలో చిక్కుకుపోయింది
        అ,ఆ లు దిద్దిన జ్ఞాపకం నన్ను వెంటాడుతుంటే
       పుస్తకాల గుండెల్లో/‘దాస్‌ క్యాపిటల్‌ ’కై వెతుకున్నాను’
కవిత్వం నేరుగా పాఠకునికి అర్థం కావాడానికి అర్థవంతమైన పోలికలను వాడే కవికి సహజంగానే ఆదరణ లభిస్తుంది.  కేవలం పద గాంభీర్యం ప్రదర్శిస్తే మాత్రం చదివిన కొద్ది సేపటికే పాఠకుడు మరిచిపోతాడు.  కవితా వాక్యం వెంటాడాలి.  మనల్ని నిలువనీయకుండా చేయాలి.  వాక్యంలో విరుపులు, మెరుపులు తళుక్కుమనాలి.  నిత్యం కవిత్వ సాధన చేస్తున్న కవి కాబట్టి ఈ సంపుటిలో అవన్నీ పుష్కలంగా ఉన్నాయి.  నా కలలను ఎవరో ఎత్తుకెళ్ళారని అంటున్న ‘పరావలయం’ కవిత తన ప్రతిభకు తార్కాణంగా నిలిచింది.
         ‘పొలాల మడి కట్లలో
         సాయం సంధ్య వెలుతురు ముసురులో
         నా ఆలోచనలను కమ్ముకున్న
         నిన్నటి రాత్రి చివరి కలలను ఎవరో ఎత్తుకెళ్ళారు
         నేను దీపదీపాలుగా విస్తరిస్తూ
         మొదటి రోజు కమ్ముకున్న
        పురిటి వాసనల స్పర్శమీదుగా
       ఎదురు చూపుల ఇంటి గుమ్మం నవ్వునై
       మొగ్గలు దోసిట్లో పువ్వులౌతున్న సమయాన
        నా కలల కన్నులను ఎవరో ఎత్తుకెళ్ళారు’
ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా ‘తెలుగు పండుగ’,  ఉగాది కవిసమ్మేళనం కోసం ‘ఉత్సవం’, జ్యోతిభా ఫూలే గూర్చి ‘నిజమైన మనిషి’,  సినారె గూర్చి ‘అతడు లేక పాట లేదు’,  కరోనా కాలపు విషాదాలను గూర్చి ‘చావు చిత్తడి’,  ‘కన్నీటి సంతకం’, ‘జీవితపు సరిహద్దుల దగ్గర’,  వలస కార్మికుల దు:ఖం గూర్చి ‘నీళ్ళింకిన కళ్ళు-నెత్తుటి పాదాలు’, ‘కొంచెం ఉపశమనం కావాలి’,  ‘ముగింపు లేని సలపరం’,  ‘అస్తిత్వ పతాక’, ‘హామి’  వంటి కవితలు వస్తు వైవిధ్యానికి నిదర్శనంగా ఉన్నాయి.
2015 నుంచి 2021 వరకు వివిధ సందర్భాలను పురస్కరించుకుని 52 కవితలను రచించారు.  ఆ కవితలను ‘పరావలయం’ పేరుతో సంపుటిగా మనకు అందించారు కవి ఒద్దిరాజు.  సామాజికంగా స్పష్టమైన చూపున్న కవి ఆలోచనల్లో గందరగోళం కనిపించదు. అందుకే ‘అక్షరం ఎప్పటికీ కుట్ర కాదు’ కవితలో ఇలా అంటున్నారు.
        ‘అక్షరం వికసించి
        కవిత్వం రెపరెపలాడుతున్నప్పుడు
       రాజ్యం గుండెలో చలి మొదలవుతుంది
       ఎంతకూ నిద్ర పట్టని అధికారం
      పదే పదే తలుపు తడుతుంది’
కవిత్వం పట్ల మక్కవ కలిగిన వారందరు ఈ కవి స్వప్నాలతో కరచాలనం చేయాల్సిందే.  ‘నిన్నటి రాత్రి స్వప్నంగా మారి/ నన్ను వెంటాడుతుంటే/ వర్షం సాంబ్రాణి పొగలా/పొద్దటి పూలను కమ్ముకొని నన్ను హత్తుకుంటుంది’  ఈ కవిత్వ సంపుటి నిండా ఇట్లాంటి తడి ఆరని కవిత్వ పాదాలను మన గుండెలకు హత్తుకోవాల్సిందే.  ‘పున్నమి వెన్నెల్లో, పూదోటల్లో/పరిమళమై విహరిస్తున్న/ నా కలలను ఎవరో ఎత్తుకెళ్ళారు’ అంటున్న కవితో మనం కూడా ఆ కలలను పట్టుకోవడానికి  వెతుకుదాం పదండిక..!
*

గోపగాని రవీందర్‌

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • The collection of verses is amazing.. The expreesions with appropriate words are fantastic. Hat’s off to the poet and the review by sri Gopagani Ravinder sir is up to the mark.. Congratulations to both of them..

  • లోతైన, గాఢత వున్న కవిత్వాన్ని సరిగ్గా అంచనా వేశారు. కవి పిసినారితనం వదిలి విస్తృతంగా రాయాల్సిన సందర్భాన్ని గుర్తెరగాలని కోరుతున్న.
    ఇద్దరికీ అభినందనలు.

  • ఒద్దిరాజు గారు తన కవిత్వాన్ని సాంబ్రాణి పొగ చేసి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. పారే నీరు సీతాకోక ల గుంపు అని చెప్పి కవితా నందమ్ కలిగిస్తున్నారు. బాధ్యత కలిగిన కవి గా,నిత్య సాధకుడు గా సమీక్షకులు బాగా అభివర్ణించారు

  • ఒద్దిరాజు గారు తన కవిత్వాన్ని సాంబ్రాణి పొగ చేసి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. పారే నీరు సీతాకోక ల గుంపు అని చెప్పి కవితా నందమ్ కలిగిస్తున్నారు. బాధ్యత కలిగిన కవి గా,నిత్య సాధకుడు గా సమీక్షకులు బాగా అభివర్ణించారు. అభినందనలు.

  • లోతైన, బలమైన కవిత్వాన్ని ఎత్తిపట్టిన సమీక్ష.
    “నీటి మూటను గట్టి
    పొలాల్లో విప్పితే
    అది సీతాకోకచిలుకలగుంపౌతుంది”
    మనసును పట్టేసే కవిత్వం. ప్రవీణ్ కు, సమీక్షకునికి
    అభినందనలు.

  • ” రైతు పొలాలను గీసే చిత్రికారుని ” గా , “పంటలను కలగంటున్న స్వాప్నికుని”గ, “మన నాగరికతను నెత్తికెత్తుకున్న ఆధునికుని ” గా వర్ణించిన ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ మంచి కవి . సామాజిక బాధ్యత కవి కి ఇలా ఉండాలి అని అనిపించే కవిత్వం ఇతనిది . ప్రవీణ్ కుమార్ కొత్త కవితా సంపుటి ‘పరా వలయం‘ కవిత్వం లో ని అంతరాత్మ ను చక్కగా ఒడిసిపట్టి విశ్లేషణ చేసిన గోపగాని రవీందర్ కు అభినందనలు. ప్రవీణ్ కుమార్ కూ అభినందనలు
    – కొండపల్లి నీహారిణి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు