తగుళ్ళ గోపాల్ కవితలు రెండు

1

ఇంతకుముందు నువ్వొచ్చుంటే

 

ఎన్ని సార్లు పిలిచినా
ఒక్కసారన్నా రాకపోతివి
లోకం మీద పనులుండనోళ్ళు ఎవరు చెప్పు?

పండుగకు రమ్మని పిలిస్తే
పరీక్షలున్నాయని చెప్పినవు
తమ్ముడి పెండ్లికి వస్తనని చెప్పి
రాకుండనే తప్పించుకున్నవు
నువ్వే రానప్పుడు
ఎన్ని కట్నకానుకలు పంపితే ఏంలాభం ?

ఇంతకు ముందు ఇక్కడే
పెద్దజాతర జరిగిందని చూపించడానికి
ఏ ఆనవాళ్ళు లేకపాయె
ఈ జాతరలో
ఈ మట్టిబొమ్మ తప్ప ఇప్పుడేం లేవు.
నలుగురు మేనత్తలతోటి
నాయిన, పెదనాయిన తోటి
కాలం పూలతేరులా సాగిపోయింది.

నిన్ను ఇంటికి పిలిపించి
ఎడారిని చూపించడం నాకిష్టం లేదు
కానీ, నీవు అడుగు పెట్టిన చోటు
ఒక ఊట సెలిమె
నువ్వు చూసిపోయిన తర్వాత
ఆ సెలిమె ముందు కూర్చోని
గొంతు తడుపుకుంటాను.

పూలచెట్లన్ని కూలిపోయిన తర్వాత
ఇల్లు చూడడానికొచ్చావు
వాకిట్లో నీకు ఏం చూపించి మాట్లాడను?

చుక్క తెగినట్టు
ఒక్కసారైనా వచ్చుంటే
ఇక్కడ పారిన చెమటనదుల గురించి
నువ్వే చెప్పెటోడివి కదా

ఊరు మీదంగనే పోతున్నవంట
ఒక్క పూటైనా ఉండిపోతే
మా పిల్లి ఎంత ప్రేమగల్లదో నీకు తెలిసుండేది

పెనుతుఫాను తర్వాత
చూసిపోవడానికొచ్చావు
కొంచెం ముందొచ్చుంటే
పొయ్యి రాజేసి జొన్నరొట్టెలు చేసే
ప్రేమతావుల్ని చూపించేవాడిని.

ఇంతకు ముందు నువ్వొచ్చుంటే
పూలచెట్టు కిందనే కూర్చునేవాళ్ళం
ఇలా జ్ఞాపకాలపూలను ఏరుకునే వాళ్ళం కాదు
ఇప్పటికైనా వచ్చినందుకు
నీ అరచేయి మునివేళ్ళకు ప్రేమముద్దులు

 

2

ఎదురుచూపు

 

ఈ వానలో
అమ్మ తప్పక వస్తుంది
నమ్మకమేందంటే-
మట్టి పొయ్యి తడిసిపోవడం
అమ్మకు అస్సలిష్టం ఉండదు.

*

రోజు వా వాకిట్లో మంచమేసి
నేల మీద పడుకుంటున్నాను
అమ్మ గురించి నాకు తెలుసు
నన్ను విడిచి అమ్మ ఉండలేదని
*
అప్పుడే విత్తనపు కార్తి వచ్చింది.
అమ్మా .. లే…
చెల్కంత దున్నిన
“ఒడిగట్టి విత్తనాలేదువూ!”

*

తగుళ్ళ గోపాల్ కవిత

తగుళ్ళ గోపాల్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మొదటి కవిత చాలా బాగుంది. ధ్వనిగర్భతంగా వుంది. నిర్మాణ కౌశలం ఆకట్టుకుంది. సున్నిత మానసిక బంధాలను, తడిమిన పదజాలం విశేషంగా చెప్పవచ్చు. కప్పి చెప్పే కవిత్వాన్ని మనసారా పలికించే, పలకరించే తగుళ్ళ గోపాల్ గారికి అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు