డామిట్!

పెళ్లి పందిరి చాలా సందడిగా ఉంది.

డోలూ సన్నాయీ మోగుతున్నాయి. ఆ సన్నాయి విద్వాంసుడి పిలక – రాగంతోబాటూ గమకంతోబాటూ గంతులేస్తోంది. డోలు మోగిస్తున్నవాడు సరేసరి. వీపుమీద కూడా ఎవరో వాయిస్తున్నట్టే కదిలిపోతున్నాడు. పదేళ్ల కుర్రాడొకడు గుడ్డిగా శృతిపెట్టెతో సహకరిస్తున్నాడు. ఇదంతా వింతగా ఉండి కొందరు కుర్రసన్నాసులు వాళ్లచుట్టూ చేరారు.

ఓ లాగుడు బండి మీద పది పదిహేను కొబ్బరిమట్టలు పట్టించుకుని.. వో నలుగురొచ్చేరు. ఆ కొబ్బరికొమ్మలతో వివాహ వేదిక నిర్మిస్తారు వాళ్లు. కొమ్మలే స్తంభాలూ, కొమ్మలే రూఫింగ్ ఆ వేదికకి. ఆ వేదికలో ఆ రోజు రాత్రి రెండు గంటల నలభై ఒక్క నిమిషానికి సుశీలా-రాంబాబుల వివాహం జరగబోతోంది.

ఉదయం పది గంటలవేళ..

గ్రీటింగ్ టెలిగ్రామ్‌లు తెచ్చిచ్చిన పోస్ట్‌మాన్‌కి నాలుగైదు పెద్ద పెద్ద లడ్డూలు స్వయంగా ఏరి ఓ పాకెట్లో పెట్టి అందించి, సన్నని ఆతృతతో ఆ గ్రీటింగ్స్‌ని చదువుతున్నాడు రాంబాబు.

“మే హెవెన్స్ చాయిసెస్ట్ బ్లెస్సింగ్స్ బీ ఆన్ ది కపుల్…”

“మెనీ హాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే..”

“విష్ యూ బోత్ ఎ హాపీ అండ్ పీస్‌ఫుల్ వెడ్డెడ్ లైఫ్..” అంటూ వెనుకనుంచి వినిపించిందొక గ్రీట్రింగ్.

గిరుక్కున వెనుదిరిగిన రాంబాబుకి చిన్ననాటి మితృడూ ఆప్తుడూ అయిన రమేష్ నవ్వుతూ కనబడ్డాడు.

“హల్లో డుంబూ! బాగున్నావా? ఎంతసేపయింది వచ్చి?” అన్నాడు రాంబాబు ఆప్యాయంగా అతన్ని కౌగలించుకుని.

రాంబాబు కౌగిలి నుంచి విడిపించుకుని – వినగూడనిదేదో విన్నట్లు సీరియస్‌గా ముఖం పెట్టి “నీకో సంగతి తెలుసా?” అని ప్రశ్నించేడు రమేష్.

“ఏమిటి?”

“నేనేం చదువుతున్నాను?” అడిగేడు రమేష్.

“ఎమ్‌బీబీయస్ ఫైనలియర్ కదా? ఏం, మానేసి బీసెంట్‌రోడ్‌లో అత్తర్ల షాపేమైనా పెట్టావా?”

“అదేం లేదు గానీ, నేను కాబోయే డాక్టర్నని తెలిసికూడా, నువ్వలా బాగున్నావా అని అడగడం బాగోలేదు గురూ. ఆ మాత్రం నా బాగు నేను చూసుకోలేకపోతే, ఇక నా చదువెందుకూ? సర్లేగానీ, ఏమిటీ లడ్డూలు పోస్ట్‌మాన్‌కి స్వయంగా తెచ్చి మరీ ఆప్యాయంగా అంటగడుతున్నావ్? లవ్ లెటర్లేమన్నా తెచ్చిచ్చాడా ఏంటి?”

“ష్ ఊరుకోరా బాబూ.. మా మరదలు పిల్ల ఇక్కడే ఉంది.. విందంటే పీకి చాకిరేవెట్టగలదు” అంటూ అతన్ని ఇంట్లోకి తీసుకెళ్లాడు రాంబాబు.

“చలపతిగారబ్బాయి కదూ? ఏం నాయనా.. కులాసేనా? ఒక్కడివే వచ్చినట్టుందే..” రమేష్‌ని చూస్తూనే గుర్తుపట్టిన రాంబాబు వాళ్ల నాన్నగారు సాదరంగా పలకరించేరు.

“కులాసాయేనండీ.. అమ్మకూడా వచ్చేదే. కానీ అక్క వచ్చింది స్టేట్స్ నుంచి.. తనని తీసుకుని మా మామయ్యని చూడ్డానికి రాజమండ్రి వెళ్లింది. నాన్నగారికేదో ఫారిన్ డెలిగేట్ల విజిటుందిట.. పెళ్లికి రాలేనందుకు క్షమించమన్నారు.. మిమ్మల్ని అడిగినట్లు చెప్పమన్నారు,” సవినయంగా జవాబిచ్చేడు రమేష్.

“పోన్లే నాయనా – నువ్వొచ్చావుగా.. సంతోషం. ఆ.. స్నానం అదీ కానివ్వు. ప్రయాణంలో అలిసిపోయుంటావు. ఒరేయ్ వీరా.. బాబుగారికి నీళ్లు తోడూ. షాంపూ ఉంటే సరే.. లేకపోతే తీసుకురా.. పద నాయనా తర్వాత మాట్లాడుకుందాం.. రామూ, నువ్వు నాతో రా” అని రాంబాబుతో సహా నిష్క్రమించాడాయన.

స్నానం చేసి బట్టలు మార్చుకుని వస్తున్న రమేష్‌కి కాఫీ గ్లాసందించింది ఒకావిడ.

“నువ్వేనా బాబూ చలపతిగారబ్బాయివి? డాక్టరీ చదువుతున్నావుటగా?”

“అవునండీ.. మీరూ..?” ఆవిడ ఎవరో తెలియదు అతనికి.

“నేనా? నేనూ.. రాంబాబు  మేనత్తనిలే.. అసలు నా కూతుర్నే చేసుకోవలసింది వాడు.. ఎందుకో వద్దనేశాడు.. ఆ గొడవంతా ఎందుగ్గానీ, ఈ మధ్య వారం రోజులనించీ తలా, వొళ్లూ, కళ్లూ కాళ్లూ ఒహటేమిటీ- అస్తమానూ అన్నీ పీకేస్తున్నాయి నాయనా.. కాస్త నీకు తెలిసిన మందులో రెండు చెప్పి పుణ్యం కట్టుకోబాబూ.. ఏదీ.. డాక్టరికి చూపించుకుందామంటే కుదిరిచావడంలేదు. ఇంతలో దేవుళ్లా నువ్వే ఎదురొచ్చావు గనక అడుగుతున్నా.  పెద్దదాన్ని ఏమనుకోకు బాబూ.. సరేగానీ పంచదార సరిపోయిందా? మరికాస్త వెయ్యనా?”

ఈ అనుభవం కొత్త కాదు రమేష్‌కి! తను థర్డ్ ఇయర్లో  ఉన్నప్పట్నుంచే ఇలా ఎవరింటికైనా వెళ్తే – వాళ్ల మాటల్లో ఎక్కడో ఓచోట ఇలా తమకేమైనా మందులని ప్రిస్క్రైబ్ చెయ్యమనడం – తనో పెద్ద డాక్టర్లా ఫీలౌతూ రాసివ్వడం,  ఆ తర్వాత అవి వాళ్లమీద సరిగ్గా పనిచేశాయా లేదా అని మధన పడడం అలవాటే. సాధారణంగా అతను రాసినవి పనిచేస్తూనే ఉండేవి. ఆవిడని కొన్ని వివరాలడిగి, ఓ పేపర్ మీద ఒక టానిక్కూ, రెండురకాల విటమిన్ మాత్రలూ రాసిచ్చేడు. “నీకడుపు చల్లగా నూరేళ్లు బ్రతుకు నాయనా..” అంటూ దీవించి పందిట్లో కలిసిపోయిందావిడ.

తర్వాత ముప్పావుగంట వ్యవధిలో ఇంకో ఇద్దరికి కూడా ఇలాగే మందులు రాసిచ్చాడు రమేష్.

ఇంతలో రాంబాబు వచ్చి భోజనానికి తీసుకెళ్లేడు అతన్ని.

విశాలమైన డాబామీద టార్పాలిన్లు వేసి, ఆరు వరసల్లో విస్తళ్లు పరిచేరు. వాటిలో కొన్ని అప్పుడే నిండాయి కూడా.

హఠాత్తుగా రమేష్ కళ్లముందో మెరుపు మెరిసింది.

ఆ పచ్చని పసిమి ఛాయ – గోదావరి మీద ప్రతిఫలించే సాయంకాలపు నీరెండ అయితే – ఆ నల్లని జుత్తు పాపికొండల మీదనుంచీ బద్ధకంగా దొర్లే కారు మబ్బులది.. వెన్నెల వెన్నలా చిక్కగా కురుస్తుంటే, చిన్న అలల క్రిందనించీ అప్పుడప్పుడు తళుక్కున మెరిసే చేపల్లాంటివైతే ఆ కళ్లు, ఆ ముక్కు రెక్కలు విడని గులాబీ మొగ్గ..

“ఎంత లవ్లీగా ఉందీ.. ఎంత హోమ్‌లీగా ఉందీ..” అనుకున్నాడు రమేష్. ఆ పిల్ల తనకేసే నడిచొస్తుంటే “నీ పేరు హంస కదా?” అనీ, ఆమె ఎర్రని లేత పెదవులు చూసి, “నాకు దొండకాయ కూరొద్దు” అనీ అందామనుకున్నాడు.

కానీ..

రమేష్ ముందున్న ఖాళీ విస్తరిని చివ్వున తీసేసి, వడివడిగా క్రిందికి వెళ్లిపోయిందామె. ఆశ్చర్యపోవడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాడు రమేష్.

వెంటనే తిరిగొచ్చిందామె.

అయితే ఈసారి ఆమె చేతిలో శుభ్రంగా కడిగిన పెద్ద విస్తరి వుంది. దాన్ని సూటిగా తెచ్చి అతని ముంచు పరచి, గ్లాసులో నీళ్లు పోస్తూ కనీకనపడనట్లు చిన్న నవ్వొకటి రమేష్ గుండెలోకి విసిరి – సాగిపోయింది.

గట్టిగా విజిలెయ్యబోయి – తమాయించుకుని – ఈసారి మళ్లీ ఆమె నెయ్యి తెచ్చినప్పుడు అలా చెయ్యిపట్టి ఉంచేడు ఆమె పెద్ద పెద్ద కళ్లలో దేన్నో వెతుకుతున్నట్లు చూస్తూ.. విస్తట్లో అన్నమంతా నెయ్యితో తడిసి మోపెడవుతున్నా అలా నెయ్యి పోస్తోనే ఉందాపిల్ల – నవ్వుని పెదాల చివర నిలబెట్టి. నాలుగప్పడాలు నేతిలో వేయించి తెచ్చి రమేష్ విస్తట్లో వేసింది.

ఆ బంతిలో –

అందరికీ రెండు ఆవడలు – రమేష్‌కి మూడు.

అందరికీ ఒక జాంగ్రీ – రమేష్‌కి రెండు.

ఎవరికీ లేని (సాంబార్లో) ముక్కాడ ముక్కలు నాలుగైదూ.. ప్లస్ తెల్లని పలువరుస కనీకనపడనట్లు వడ్డిస్తున్న చిరునవ్వులూ..

రమేష్ బొజ్జతోబాటు ఛాతీ కూడా ఉబ్బుతోంది. అవును మరి.. తను మాత్రం అందగాడు కాడా ఏంటి? ఆరడుగుల పొడవూ, విశాలమైన ఛాతీ, బలమైన చేతులూ కాళ్లు, ఆరోగ్యం ఉట్టిపడే కళ్లూ, చక్కని నొక్కుల తలకట్టూ, తీరైన మీసకట్టూ వున్న మగాళ్లని అందగాళ్లనే అంటారు.

ఆ పిల్ల తనమీద కనబరిచే శ్రద్ధకి కారణం ఊహించలేకపోలేదు రమేష్..

*   *   *

రాత్రి తొమ్మిదిగంటలు కావస్తూంది.

ముహూర్తం దాదాపు మూడింటికి కావడంతో కొంతమంది సెకండ్ షోలకి వెళ్లేరు. మరికొంతమంది పేకాడుతున్నారు. పిల్లలు మాత్రం పగలంతా ఆడిన ఆటలవలన అలిసిపోయి వొళ్లెరగకుండా నిద్రపోతున్నారు. పెళ్లి ముందరి తంతు పందిట్లో కొనసాగుతోంది.

మేడమెట్ల పక్కనే అరుగుమీద కూర్చుని, ఇర్వింగ్ వాలెస్ ‘ది సెకండ్ లేడీ’ చదువుతూ చదువుతూ –  కుర్చీలోనే జారగిలబడ్డాడు రమేష్. ధ్యాస పుస్తకం మీద లేనేలేదు.

మనసంతా ఆమె చుట్టూ పరిభ్రమిస్తోంది. ఈ కొద్ది గంటల్లోనూ కొన్ని వందలసార్లు ఇద్దరి కళ్లూ కలుసుకున్నాయి. ఎన్నో కబుర్లు చెప్పుకున్నాయి.

తను ఎన్నాళ్లనుంచో ఆరాధిస్తున్న ఊహాసుందరి ఈమే.. నిశ్చయంగా ఈమే.. అదిగో.. ఇటే వస్తోంది. ఏదో పని ఉన్నట్టు హడావుడిగా వస్తోంది. చేతిలో ఏమిటి.. తాంబూలం.. తన పెదవులు తాంబూలంతో మరింత ఎర్రబడటాన్ని ఇష్టంగా గమనించాడు రమేష్.

కుర్చీ చేతిమీద కిళ్లీ ఉంచి, పైకి రమ్మన్నట్టు కళ్లతోనే సూచించి, మెట్లెక్కి పైకి వెళ్లిందామె..

రమేష్ గుండె ఫ్రీజయింది.

వెంటనే తేరుకుని, మేడ మెట్లు ఎక్కసాగేడు.

అతన్నెవరూ పట్టించుకోలేదు.

వొళ్లు దూదిపింజలా అయిన భావన. ఆమె తన కుర్చీ పక్కన ఆగినప్పుడు, ఆమె మీది నుంచి వీచిన మరువం-మల్లెపూల పరిమళం ఇంకా వదల్లేదతన్ని. పసినిమ్మపండులాంటి ఆమె వొంటి ఛాయ గుర్తుకి రాగానే – అంత చల్లదనంలోనూ వొళ్లు వేడెక్కడం తెలుస్తోంది..

శీతాకాలం.. వెన్నల తప్ప ఏమీ లేదు ఆకాశంలో.. ఆమె పెదవి వొంపులో మెరుస్తున్న వెన్నెల తప్ప మరేమీ లేదు రమేష్ చూపులో..

పిట్టగోడకి అనుకుని.. తలవొంచుకుని.. ఆమె..

‘ఇప్పుడేం వడ్డిస్తుందో..” అన్నట్లు ఆతృతా, కోరికా నింపుకున్న కళ్లతో ఆమెని తాగేసేలా చూస్తూ.. ఆమెకి రెండు జానల దూరంలో రమేష్..

ఇద్దరి మధ్యా సముద్రమంత నిశ్శబ్దం..

మెల్లగా తలయెత్తిందామె.

రెండు క్షణాలు తదేకంగా రమేష్ కళ్లలోకి చూసింది.

గుటకెయ్యడానిక్కూడా గొంతులో తడిలేదు రమేష్‌కి.

పగడాల్లాంటి ఆమె లేత పెదవులు విడివడి..

“నా.. న.. న్నత్తికేమన్నా.. మ.. మ్మందుందేమో చె… చ్చెప్పరూ..?

 

* * *

(1986 జూలై  ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికలో ప్రచురితం)

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు