“జీవితంలో సంతృప్తి పడడం నేర్చుకున్న వ్యక్తి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. ఆది చేతకాని వ్యక్తి ఎప్పుడూ దుఃఖానికి గురవుతూ ఉంటాడు” అన్నాడో విజ్ఞుడు.
రావి కొండలరావు గారు ఎప్పుడూ ఆనందంగా కనిపించేవారు. చుట్టూ ఉన్నవారికి ఆనందాన్ని పంచడానికి ప్రయత్నించేవారు. ‘విజయచిత్ర’లో ఉద్యోగరీత్యా, ఆ తర్వాత అనుబంధం రీత్యా – నాలుగున్నర దశాబ్దాలకు పైగా సాన్నిహిత్యంతో ఆయనలో నేను చూచిన ప్రత్యేకతల్లో ఇదొకటి.
ఆయన బహుముఖ ప్రజ్ఞల గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అవి అందరికీ తెలిసిన విషయాలే. ఆమాటకొస్తే ప్రజ్ఞలని ఆయన చెప్పుకునేవారు కాదు.
” కూటికోసం కోటి విద్యలు. బతకడానికి ఒక విద్య ఉంటే చాలదనిపించి, నాలుగు విద్యలు నేర్చుకుంటే, ఏదో ఒకటి ఎప్పుడో ఒకప్పుడు పనికిరాక పోతుందా అని జీవనోపాధి కోసం పడ్డ తంటాలే అవన్నీ” అని నిర్మోహమాటంగా చెప్పగలిగే “డౌన్ టు ఎర్త్” ధోరణి కూడా ఆయన ప్రత్యేకతల్లో ఒకటి.
అందువల్ల వ్యక్తిగా ఆయన ప్రత్యేకతల వల్ల నాలాంటి వారు ఎలా ఆకర్షితులయ్యారో చెప్పడమే నా ఉద్దేశ్యం.
నేను ‘విజయచిత్ర’లో ఉపసంపాదకుడి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, సంపాదకుడు, ప్రచురణకర్త విశ్వనాథ రెడ్డి ( విశ్వం) ఆదేశం మేరకు, రావి కొండలరావు గారే నన్ను ఇంటర్వ్యూ చేశారు. అది ఇంటర్వ్యూలా జరుగలేదు! కథలు, సాహిత్యం, సినిమాలు వంటి విషయాలపై ఇష్టాగోష్ఠిలా సాగింది. అంతా అయిన తర్వాత, ‘కథలు రాయగలిగిన వారికి జర్నలిజం-అదీ ఫిలిం జర్నలిజంలో నెగ్గుకురావడం సులభమౌతుంది’ అని తేల్చేశారు!
నాకు ఆశ్చర్యం కలిగించిన అంశం- అంతకు ముందు నాకు సన్నిహితులైన వారు ‘హెచ్చరించినట్లు’ ఆయన ‘ మీరెవరివారూ?’ లేదా ‘మీ ఇంటి పేరేమిటీ?’ వంటి ప్రశ్నలేవీ అడగలేదు. ( చాలా మంది ‘మీ కులం ఏమిటీ?’ అని అడగడం అనాగరికంగా ఉంటుందని లౌక్యంగా అలా అడుగుతారు. ‘విజయచిత్ర లో నేను చేరిన తర్వాత నా అభిమాన అభ్యుదయ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని విజయా గార్డెన్స్ లో ఓ పాట రికార్డింగ్ లో కలుసుకొని, నన్ను నేను పరిచయం చేసుకున్నప్పుడు- ఆయన తన స్క్రించింగ్ ప్యాడ్ లో ‘ మీరెవరివారూ? అని రాసి చూపించి నాకు షాకిచ్చారు!) చాలా మంది పెద్దల్లోనే ఆ కుల వ్యాకులం పట్టిపీడిస్తున్నప్పుడు –
సామాన్యుల్లో చాలా మంది దాన్ని పట్టుకొని వేలాడడంలో ఆశ్చర్యం ఏమీ లేదని నాకు అప్పుడే అనిపించింది. అయితే, కొండలరావు గారు వాటికి దూరంగా ఉండడం- ఆయన సుగుణాల్లో ఒకటి. ఇక ఆయన దుర్గుణాలు ఏవిటంటే, ఆయన ‘తీర్థం’ తీసుకోరు, ‘సిగరెట్టు’కాల్చరు.
ఆయనకు సంప్రదాయాలంటే గౌరవం. ‘వనిత’ పత్రికలోని ‘బామ్మగారి పేజి’ ఆయనే రాసేవారు. అది చదివితే – ఆ విషయం బాగా అర్థమౌతుంది. ఇవాళ ‘వరలక్ష్మి వ్రతం’ కదా – అని ఆయన మాటల సందర్భంలో అంటే నేను ఆకతాయితనంగా, ‘జి. వరలక్ష్మి వ్రతమా? లేక ఎస్. వరలక్ష్మి వ్రతమా?’ అని అంటే ఆయన నవ్వేసేవారు. అపహాస్యం చేస్తున్నట్టు ఫీలయ్యేవారు కాదు.
మేము ‘చందమామ బిల్డింగ్స్’ లో ఒకే ఛత్రం కింద పని చేస్తున్నప్పుడు- మాకందరికీ పెద్ద దిక్కు కొడవటిగంటి కుటుంబరావు గారే! ఆయన చందమామ పత్రిక కు నిర్వాహక సంపాదకులు. నాకు సమయం దొరికినప్పుడల్లా-ఆ విభాగానికి వెళ్ళి కుటుంబరావు గారితోను, అసిస్టెంట్ ఎడిటర్, ‘చందమామ’లో అధ్బుతమైన సిరియల్స్ రాసే, దాసరి సుబ్రహ్మణ్యంతో కబుర్ల కచేరి చేసేవాణ్ణి. కుటుంబరావు గారి రచనలు, ఆయన మార్క్సిస్టు భావజాలం నుంచి స్ఫూర్తి పొందిన వారిలో నేనూ ఒకణ్ణి. ఐతే, నాకంటే ఎక్కువగా రావికొండలరావు గారికి కుటుంబరావు గారితో సాన్నిహిత్యం ఉండేది. కానీ ఆయన ప్రభావం కొండలరావు గారి మీద దాదాపు లేదనే చెప్పాలి. కొండలరావు గారిది ఎప్పుడూ ఒక్కటే సిధ్ధాంతం, ఏం రాసినా సరే వినోద ప్రధానంగా ఉండాలి.
ఆ వినోదంలో ఎలాంటి కల్తీ లేకుండా, ఆబాల గోపాలానికి అది ఆరోగ్యదాయకంగా ఉండాలి.
సరే అదీ మంచిదే. మంచి వినోదాన్ని అందరూ హర్షిస్తారు. అలా రావికొండలరావు గారు “ఇజాల” ప్రమేయం లేకుండా, అందరి హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకోగలిగారు. ఇక మా కార్యాలయానికి హాస్యప్రియులైన రచయితలు, నటులు, దర్శక, నిర్మాతలు ఎవరైన కొండలరావు గారిని కలుసుకోడానికి వస్తే, ఆయన నన్ను తన క్యాబిన్ కి రమ్మనేవారు. ఇక మేం కూర్చుంటే – కబుర్లే కబుర్లు. ఆ కబుర్లలో నవ్వుల పువ్వులు వెల్లివిరిసేవి. ఇక , ఆయన ఎవరి మాటలైనా- చెప్పాలనిపిస్తే, వాళ్ళ గొంతునే అనుకరించి చెప్పేవారు. అది చాలా తమాషాగా ఉండేది. ఆయన ఆరుద్ర గారి గొంతుని గొప్పగా మిమిక్రి చేసేవారు-ఎంతగొప్పగా అంటే, ఆరుద్ర గారే మెచ్చుకున్నంత గొప్పగా!
ఇక షూటింగ్ చేసి వస్తే, మాటల సందర్భంలో ఆ ముచ్చట్లు చెప్పేవారు. అవి రాయడానికి వీల్లేని కబుర్లు. కానీ తమాషాగా ఉండేవి. ఉదా: ఆయన ఒకసారి ఆయన ‘వేములవాడ భీమకవి’లో నటించినప్పుడు ఓ ముచ్చట చెప్పారు. అది ఎన్టీఆర్ సొంత చిత్రం. ఒక ఘట్టంలో వెండిముక్క, పొడుం డబ్బా కావలసి వచ్చిందంట! అది కొనడానికి ప్రొడక్షన్ మేనేజర్- ఎన్టీఆర్ అనుమతి కోసం అడిగారట. అప్పుడు ఎన్టీఆర్- ఒక్కసారి ఆగమని ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళారు. ఎప్పుడో పది సంవత్సరాల క్రితం- తాము తీసిన మరో చిత్రంలో వాడిన పొడుండబ్బా- స్టోర్ రూంలో ఫలాన చోట ఉంటుందనీ, దాన్ని తీసుకొస్తే చాలనీ, కొత్తగా కొనే అవసరం లేదని ఆ ప్రొడక్షన్ మేనేజర్ తో చెప్పేసరికి- ఎన్టీఆర్ ‘ పొదుపరితనానికి’ సెట్లో ఉన్నవారందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు! ‘ఎన్టీఆరా మజాకా’ అని ఈ సంగతి చెప్పి నవ్వించారు కొండలరావు గారు.
పికాసో చిత్రకళను అర్థం చేసుకోవడం కష్టమని చెబుతారు. ఒకసారి ఓ చిత్రకళా ప్రదర్శనలో పికాసో చిత్రం ముందు నిలబడి ఇద్దరు పెద్దలు తీవ్రంగా వాదించుకుంటున్నారు. అప్పుడు పికాసో వచ్చి, ఆ చిత్రాన్నీ-ఆ పెద్దలను ఎగాదిగా చూసి, తలకిందులు గా పెట్టి ఉన్న ఆ చిత్రాన్ని సరిగ్గా పెట్టి వెళ్ళిపోయారట!
కొందరు రాసే అబస్ట్రాక్ట్ కవితలు చదివి మాకూ అలానే అనిపించేది. ఒకసారి కొండలరావు గారికీ, నాకూ మాటల సందర్భంలో ఇదే ప్రస్తావన వచ్చింది.
‘ఆకాశంలో తోకచుక్క తెగింది.
సాగర కన్య చేయి తాచింది’ అని నేనంటే, ‘ రుద్రవీణ కల భగ్నమైంది ఎక్కడో తీతువు పిట్ట కూసింది’ అని కొండలరావు గారన్నారు. ఇలా మాటలు ఓ ఇరవై వరకూ కలిపాం. ‘ఇంకేం కవిత తయారైంది-మనిద్దరి పేర్లతో పంపిద్దాం’ అన్నారు కొండలరావు గారు. ‘సార్..నా పేరుతో పంపిస్తే ఎడిటర్ కి అనుమానం రావచ్చు. మీ పేరుతోనే పంపించండి’ అని దగ్గరుండి ఓ ప్రముఖ వారపత్రికకి పోస్టు చేయించాను.
ఆ పత్రిక దీపావళి ప్రత్యేక సంచిక పోస్ట్ లో వచ్చింది. చూస్తే, చుట్టూ మంచి డిజైను, చక్కని బొమ్మలతో ‘మా కవిత’ గొప్పగా ముద్రితమైంది. ఇద్దరం తెగ నవ్వుకున్నాం.
‘విజయచిత్ర’లో మేం కలిసి పని చేసిన కాలంలో ఇలాంటి ముచ్చట్లు ఎన్నెన్నో.
ఇంకా నిన్నో మొన్నో జరిగినట్లు ఆ దృశ్యం నా కళ్ళ ముందు కదలాడుతోంది. సాహితీ మిత్రులు అట్లూరి అనిల్, వేమూరి సత్యనారాయణ గారు ‘రావి కొండలరావు గారితో ఓ సాయంకాలం’ అని ఓ అపురూపమైన సందర్భం ఏర్పాటు చేసి ఆహ్వానించినప్పుడు సంబరపడుతూ వెళ్ళాను. చాలా కాలం తర్వాత కలుసుకున్నప్పటి ఆ ఆనందం అనిర్వచనీయం. ఆయన పక్కనే కూర్చుని, ప్రసంగ వశాత్తు ఎదైన మరిచిపోయినప్పుడు గుర్తు చేస్తూ వచ్చాను. ఎంతో సంతోషించారు.
ఆ సభలో ఎవరో ‘తెలుగు మేస్టారి’ ప్రసంగం చెప్పమన్నారు. దానికి ఆయన సమాధానం: ‘అది ఎంటర్ టైన్ మెంట్ కిందికి వస్తుంది అంటే టాక్స్ పడుతుంది’. అని చమత్కారంగా చెప్పి నవ్వించారు.
కల్లోల భరితమైన ఈ జీవిత నాటక రంగం నుంచి నవ్వించే నాయకులు నిష్క్రమించినప్పుడల్లా గుండె బరువెక్కుతుంది.
కల్తీ లేని వినోదాన్ని అందించిన రావి కొండలరావు గారు ఇప్పుడు మన మధ్య లేరు. కానీ వారు మిగిల్చని నవ్వులే మనకు మణులు, మాణిక్యాలు.
*
ఈశ్వర్ గారూ
చాలా బాగా రాసారు
రావి కొండలరావు గారి గురించి.
వారితో మీకున్న అనుబంధం గొప్పది.
కుల జాడ్యం గురించి బాగా చెప్పారు.
మీకు ధన్య వాదాలు.
__డా.కె.ఎల్.వి.ప్రసాద్
హనంకొండ.
రావి కొండల రావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అని అందరికీ తెలిసినదే.
కానీ ఉన్నత స్థాయి వ్యక్తిగా, స్నేహశీలుడీగా ఆయన ఆత్మీయతని ఆస్వాదించిన వారికి తెలుసు. అలాంటి వారిలో నేను కూడా ఒకడిని కావడం కేవలం నా అదృష్టం.
చాలా మంచి వ్యాసంతో నివాళి అర్పించారు ఈశ్వర్ గారు.
రావి కొండలరావు, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన మరణం విషాదమే, కాని సంపూర్ణ జీవితాన్ని గడిపిన మహానుబావుడు, తన జీవితం ఒక పాటశాల లా మనకు ఎన్నో పాటాలు నేర్పుతుంది. ఈశ్వర్ గారు బాగా రాసారు. ధన్యవాదాలు.