టూ బీ ఆర్ నాట్ టూ బీ!

ప్రపంచ జనాభా రోజురోజుకీ పెరుగుతున్నదే గానీ తరగట్లేదు. రకరకాల వ్యాధుల నివారణకీ, వాటినించీ ఉపశమనాన్ని కలిగించడానికీ, వాటిని నిరోధించడానికీ మందులని కనుక్కోవడంవల్ల గత శతాబ్దంలో మానవాళి సగటు ఆయుష్షు పెరిగింది. దానికి తోడు, బీదరికం ఈ భూప్రపంచాన్ని వదిలి ఎక్కడికీ పోలేదు గానీ ప్రపంచవ్యాప్తంగా తిండీ, బట్టా దొరుకుతున్న ప్రజల శాతం గత అర్థశతాబ్దంలో పెరిగింది. ఫలితం, జనాభా పెరుగుదల అధికమై అన్నిరకాల వనరులకీ పోటీ పరిస్థితి ఇప్పటికే ఏర్పడింది. ఈ పరిస్థితి క్లిష్టమయ్యే సూచనలే తప్ప మెరుగయ్యే అవకాశం కనుచూపుమేరలో కనిపించడంలేదు. ఈ సమస్యకు మానవాళి ఆచరణకు సాధ్యమయ్యే పరిష్కారాన్ని కనుక్కుంటుందా?

ఈ ప్రశ్న దాదాపు అరవయ్యేళ్ల క్రితమే Kurt Vonnegut, Jr., మదిలోకి వచ్చింది. దానికి ఆయనకు తోచిన పరిష్కారం ఆధారంగా అల్లబడ్డ కథ 2BR02B. 1962 లో ప్రచురింపబడ్డ ఈ కథలో కొత్తశతాబ్దం వచ్చేసరికి ప్రపంచ జనాభా ఇరవై బిలియన్లు దాటుతుందని రచయిత ఊహించాడు. దానితోబాటే, రోగాలూ, నేరాలూ, మురికివాడలూ, యుద్ధాలూ లేకుండా అందరూ సఖ్యంగా ఉంటున్న సమాజం ప్రపంచంలో నెలకొంటుందని ఆశపడ్డాడు. (రచయిత ఊహించలేదు గానీ, ఒక పరిష్కారం కింద జనాభా నియంత్రణకోసం చైనా దేశం ఒక కుటుంబానికి ఒకే సంతతిని పరిమితంచేసి దాన్ని అధిగమించినవాళ్లని శిక్షించిందని, కానీ ఇంకే దేశమూ ఆ మార్గాన్ని అనుసరించకపోవడమే గాక చైనా కూడా ఆ పరిష్కారాన్ని బుట్టదాఖలు చేసిందనీ మనకు తెలుసు.) ఇది బలిచక్రవర్తి ఏలినకాలం వంటిదే నని అనలేకపోవడానికి కారణం, ఈ కథలోని సమాజంలో అందరికీ వయసు పెరుగుతూనే ఉంటుంది గానీ, ఎవరికీ మరణం లేదు. ఎక్కడయినా జననం తప్పని పరిస్థితుల్లో ఆ ప్రాణి తల్లి గర్భం నుండీ బయటపడి గాలి పీల్చుకునేసరికి ఆ పెరుగుదలకు విరుగుడుగా ఒక పౌరుడు ఈ భూమి మీద నించీ నిష్క్రమించాలి. అది కూడా స్వఛ్ఛందంగానే! ఆ అవసరం లేకపోతే, రెండువందల యాభయ్యేళ్ల వయసువాళ్లు కూడా ‘జరామరణ భయం’ లేకుండా కాలం గడిపేస్తారు. నిష్క్రమిద్దా మనుకున్నవాళ్లు ఫోన్ చెయ్యవలసిన నంబర్ 2BR02B. టూ బీ ఆర్ నాట్ టూ బీ!

ఈ కథ ఒక హాస్పిటల్ లాబీలో మొదలవుతుంది. రెండువందల ఏళ్ల వయసున్న ఒకతను ఆ లాబీలో గోడమీద పెయింటింగ్ వేస్తూంటాడు. (తమాషా ఏమిటంటే, రచయిత అతన్ని ఓల్డ్‌మాన్ అనే అంటాడు.) అతను వేస్తున్న పెయింటింగ్ శీర్షిక ‘The Happy Garden of Life.’ అంత ఆనందకరమైన, పర్ఫెక్ట్ ఉద్యానవనం ఇంకెక్కడా ఉండబోదు. దానిలో మొక్కలతోబాటు కొంతమంది వ్యక్తులున్నట్లు ఆ పెయింటర్ చిత్రీకరిస్తున్నాడు. మొండాల బొమ్మలు పూర్తయాయి వాటికి మొహాలని చేర్చడమే మిగిలింది – ఒక్కదానికి తప్ప. పూర్తయింది, రెండువందల నలభయ్యేళ్ల వయసున్న డాక్టర్ హిట్జ్ మొహాన్ని ఒక మొండానికి తగిలించడం. డాక్టర్ హిట్జ్ ఆ హాస్పిటల్ కి అతిముఖ్యమైన ప్రసూతి వైద్యుడు. స్వఛ్ఛందంగా మరణించేవాళ్ల కోసం మొదటి గాస్ ఛాంబర్‌ని నెలకొల్పాడు. అక్కడకు వచ్చిన లియోరా చెబుతుంది. ఆమె మొహాన్ని ఆ బొమ్మలోని ఒక మొండానికి తగిలించడంకోసం పోజు నివ్వడానికి ఆ రోజు ఆమెని అక్కడకు పిలిచారు. ఆమెది 2BR02B కి ఫోన్ చేసినవాళ్ల కోరిక నెరవేర్చే వృత్తి.

ఆ లాబీలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఎడ్వర్డ్ వేలింగ్. అతని భార్య ప్రసవ సమయం ఆసన్నమై అక్కడి కొచ్చింది. ఆమె డెలివరీ చేసిన డాక్టర్ హిట్జ్ లాబీలోకి వచ్చి లియోరాని చూసి, ఆమె వృత్తిగూర్చి తెలిసినవా డవడంవల్ల ఆ ప్రసవంలో ముగ్గురు పిల్లలు పుట్టినట్లు చెబుతాడు. చట్టప్రకారం, ప్రాణాలని వదలడానికి సిద్ధపడ్డ ముగ్గురు వ్యక్తులు ఉంటేనే ఆ ముగ్గురు పిల్లలూ బ్రతుకుతారని ఆమెకు తెలుసు. అందుకని ఆమె “మరి ముగ్గురు దొరికారా?” అని ప్రశ్నిస్తుంది. “ఒకళ్లు మాత్రం దొరికారట, ఇంకొక ఇద్దరికోసం వెదుకుతున్నారు,” అని జవాబొస్తుంది. కాన్పులో ఒక్కరే పుడతారన్న అంచనాతో ఉన్న వేలింగ్ దంపతులకి ఇది పెద్ద దెబ్బ. ఆ ముగ్గురు పిల్లల్లో ఎవరు బ్రతకాలో వాళ్లు నిర్ణయించాలి, లేదా ఇంకొక ఇద్దరిని 2BR02B కి ఫోన్ చెయ్యడానికి ఒప్పించాలి. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణింపతరమా? ఈ పంక్తిదాకా చదివిన పాఠకులకి కథ ముగింపుని చెప్పి చదవాలనుకుంటున్న వాళ్ల కుతూహలం మీద నీళ్లు జల్లడం నా అభిమతం కాదు గనుక ఇక్కడితో ఆపుతాను.

*

ఇరవయ్యొకటవ శతాబ్దం మొదలయేసరికి రచయిత ఊహించినట్లు ప్రపంచ జనాభా ఇరవై బిలియన్లని చేరలేదు గానీ, ఎనిమిది బిలియన్ల దగ్గరే భూమి మీది వాతావరణంలోని మార్పులు ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి. అందుకని జనాభా పెరుగుదల గూర్చిన ఆందోళన ఈనాడు కూడా ఉన్నది. కానీ, ఈ ఆందోళన కోణంలో సైన్స్ ఫిక్షన్ కథల తయారీలో ఉండే సాధకబాధకాలని యాభయ్యేళ్లకి పైగా వయసున్న ఈ కథ ఆధారంగా అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు పరిచయం చేసిన “ఫ్లవర్స్ ఫర్ ఆల్జేర్నాన్” కథలో లాగా కాకుండా ఈ కథలోని ఒక కీలక మయిన అంశానికి ఎప్పుడో కాలం చెల్లింది. అదే, పిండం తల్లిగర్భంలో ఉండగానే అది ఆడో, మగో కనుక్కోవడంతో బాటు ఎన్ని పిండా లున్నాయో కనుక్కునే స్థితికి సైన్స్ డెవలప్ అవడం. ఆ లోటు ఉన్నా గానీ, సారాంశం గూర్చీ, కథలోని మిగిలిన విషయాల గూర్చీ ఆలోచింపజేసే కథ గనుక ఇది చదవవలసిన కథల కోవలోకి వస్తుంది.

రచయిత గూర్చి:

KURT VONNEGUT, JR., అమెరికన్ రచయిత. కథలూ, నవలలూ, నాటకాలూ రాశాడు. మిగిలిన వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

 

తాడికొండ శివకుమార శర్మ

వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్. ఐ.ఐ.టి. మద్రాసులో బాచెలర్స్ డిగ్రీ తరువాత రట్గర్స్ యూనివర్సిటీలో పి.హెచ్.డి. వాషింగ్టన్, డి.సి., సబర్బ్స్ లో పాతికేళ్ళకి పైగా నివాసం. మొదటి కథ "సంశయాత్మా వినశ్యతి" రచన మాస పత్రికలో 2002 లో వచ్చింది. ఇప్పటి దాకా యాభైకి పైగా కథలు పలు పత్రికల్లో వచ్చాయి, కొన్ని బహుమతుల నందుకున్నాయి. "విదేశ గమనే," (జనవరి 2016 లో) "స్వల్పజ్ఞుడు" (జనవరి 2018 లో) అన్న కథా సంకలనాలు వెలువరించారు. "అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ" ధారావాహికగా వాకిలి వెబ్ పత్రికలో, ఆ తరువాత అదే శీర్షికతో నవలగా వెలువడింది. అయిదు నాటికలు రచించారు, కొన్నింటికి దర్శకత్వం వహిస్తూ నటించి, డెలావర్ నాటక పోటీల్లో ప్రదర్శించారు. "ఇది అహల్య కథ కాదు" ప్రదర్శన అజో-విభో-కందాళం వారి వార్షిక ఉత్సవాల్లో నిజామాబాదులో 2006 లో, తరువాత 2007 లో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగింది.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు