జోంబీ టైగర్స్!

కరోనా కహానీలు

“తాతకు దగ్గులు నేర్పుతున్నారర్రా మీరు” నవ్వబోయి దగ్గాను.

“ఈ తాతలందరికీ యెప్పుడూ దగ్గులే యెందుకు?, మిగతావి నేర్పొచ్చుగా?” అడిగింది చిన్నమనమరాలు, చెపుతున్న కథను ఆపి.

ఆపిన కథని ముందుకు తీసుకు వెళ్ళకుండా ఆగింది పెద్ద మనుమరాలు.

“వయసుడుగుతుంటే కదా తాతలమవుతాం…” నే చెపుతుంటే యిద్దరూ ‘ఊ’ కొట్టారు. “వయసుడిగినప్పుడు అనారోగ్యం సహజం. అనారోగ్యం వున్నప్పుడు దగ్గూ అంతే సహజం” అన్నాను. సామెత యెందుకొచ్చిందో వాళ్ళకు అర్థమయినట్టే వుంది.

దాంతో మళ్ళీ కథలోకి వచ్చేశారు.

“ఎక్కడున్నాం తాతయ్యా?” అడిగారు.

“ఫ్లైట్లో…” అన్నాను.

“యస్… ఫ్లైటుల్లో మొత్తం అరవైయ్యారు వేల పులులు యిండియాలోకి వొచ్చి దిగాయి” చెప్పింది చిన్న మనమరాలు.

“పులులు అంటే మామూలు పులులు కాదు, జోంబీస్ పులులు” నాలుక బయటకుతీసి కనుగుడ్లు బిగించి మరీ భయపెట్టేలా ముఖం పెట్టింది పెద్ద మనుమరాలు.

పులులు ఫ్లైటుల్లో రావడం యేమిటో అర్థం కాక మా ముసల్ది జుట్టు పీక్కుంది. అదే… పేలు దువ్వెనతో జుట్టు సర్రున లాక్కు దువ్వింది.

“పులులు అంతరించి పోతున్నప్పుడు జోంబీస్ పులులయినా మనకు అవసరం. అంతరించిపోతున్న జాతిని కాపాడుకోవడానికి” అన్నాడు మా మనమరాళ్ళ తండ్రి… అదే మా అల్లుడు.

పులులూ పెద్ద పులులూ చిరుత పులులూ తెలిసిన మా ముసల్దానికి జోంబీస్ పులులేమిటో అర్థం కాలేదు. ఆ విషయం మా కోడలు అర్థం చేసుకున్నట్టే వుంది.

“డెడ్ బాడీసుకు మూమెంట్ వుంటుంది అత్తయ్యా, అంతే” అదో పెద్ద విషయం కాదన్నట్టు చెప్పింది మా కోడలు.

ఎగాదిగా చూసింది మా ముసల్ది.

అర్థం కాలేదేమో అని గ్రహించిన మా కోడలు మళ్ళీ చెప్పింది. “అంటే యీ జోంబీ అయిన వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల పరిసరాలలో వున్న వాళ్ళని కూడా జోంబీస్ గా మార్చేస్తారు, యెవరైనా యెంతటి వారైనా మారక తప్పదు” అని ఆగి “జోంబీ సినిమాలు చూస్తే మనకు బాగా అర్థమైపోతుంది” నమ్మకంగా అంది.

ఆపని చెయ్యకండి అన్నట్టు తలడ్డంగా వూపి చూశాను. నేను చూసిన జోంబీస్ సినిమాలు యిప్పటికి మర్చిపోలేదోమో యిప్పుడూ కడుపులో తిప్పింది.

పులులేమిటో అవి జోంబీస్ లక్షణాలు కలిగివుండడం యేమిటో నా మట్టి బుర్రకేమీ అర్థం కాలేదు. వాళ్ళ క్రియేటీవిటీని అడ్డుకోవడం మానేసి చెప్పమన్నట్టు ‘ఊ’ కొట్టాను.

“విమానాలల్లో పులులు యిండియా వచ్చేశాయి కదా? అలా వచ్చిన పులుల్ని అరణ్యంలోకి స్వేచ్ఛగా వదిలేశారు” చెప్పిన చిన్న మనమరాలే “ఏ అరణ్యంలోకి?” తనే మళ్ళీ అడిగింది.

మేమంతా చెప్పలేనట్టు చూస్తే “జనారణ్యంలోకి” అని చెపుతూ నవ్వింది పెద్ద మనమరాలు.

నేనూ మా ముసల్దీ  కొయ్యబారినట్టు చూశాం.

“జనం మధ్యలోకి పులుల్ని వదిలేశారా?”  నోరు తెరిచాడు మా అల్లుడు.

“మామూలు పులులు కాదు నాన్నా జోంబీస్ పులులు” గుర్తు చేసింది చిన్న మనమరాలు.

“శంషాబాద్ యేరియాలో వొక్క పులి వస్తేనే జనాలకు నిద్దర్లు లేవు?” మా కోడలు కూడా నోరు తెరచింది.

“ఇక్కడ దేశంలో మాత్రం జనాలకు ఫుల్లుగా నిద్రలు” నవ్వింది పెద్ద మనమరాలు.

“సిటీలోకి వొచ్చిన వొక్క పులిని పట్టుకోవడానికే గవర్నమెంటు ఫారెస్ట్ డిపార్టుమెంటుని దించింది. షూటర్లూ రిస్క్యూ టీంలూ బోలెడు హడావిడి చేసింది. అలాంటిది పులుల్ని అలా యెలా గవర్నమెంటు వొదిలేస్తుంది?” తలడ్డంగా వూపాడు మా అల్లుడు.

“కథకి కాళ్ళూ చేతులూ వుండవు” మా కోడలు నవ్వబోతే, మనమరాళ్ళు యిద్దరూ యింతెత్తున లేచారు. “మా కథకు కాళ్ళూ చేతులే కాదు, మెదడూ వుంది, కాకపోతే అది మీరు వాడాలి” అన్నారు.

మేమంతా వొకరి ముఖాలొకరం చూసుకున్నాం.

“యస్… మనమూ వొక్క పులిని పట్టించుకున్నంతగా అరవైయ్యారు వేల పులుల్ని పట్టించుకోలేదు” అంది చిన్న మనమరాలు.

“పులులకే బుద్ధి లేదు, గర్నమెంటుని యెందుకు అనడం?” యెకసెక్కంగా అంది మా ముసల్ది. కథ యేమి బోధ పడిందో యేమో?

“నిజమే, నానమ్మా… పాపం ఆ పులులకు తాము పులులమని కూడా తెలీదు” అంది చిన్న మనమరాలు.

“తాము జోంబీస్ మని కూడా తెలీదు” అంది పెద్ద మనమరాలు.

“మరేమిటి మందు?” అడిగాను.

“దానికి మందులేదు” యిద్దరూ కూడబలుక్కున్నట్టు అన్నారు.

మేం మళ్ళీ ముఖాముఖాలు చూసుకున్నాం.

“అయితే పులుల్ని బంధించి వుంటే బాగున్నంటారు” మా కోడలు జవాబు కోసం చూసింది.

“వాటి మనోభావాలు దెబ్బతినవూ?” నవ్వుతాలుగా అన్నాడు మా అల్లుడు.

“రెండు వారాలు బంధిస్తే చాలు, పులుల్లో ముందుగా ఆ జోంబీస్ లక్షణాలు పోతే పోగొడితే మిగతా అంతా జోంబీస్ గా తయారు కారు. ఇలా దేశమంతా ప్రపంచమంతా జోంబీస్ తయారుకాకుండా ఆపే వీలుండేది. పులులకు కూడా కష్టమే. తట్టుకున్న శక్తివున్న పులులు బతికిపోతాయి. లేనివి చచ్చిపోతాయి”

ఇది యేదో తెలిసిన కథలా వుంది. లేదు, అనుభవిస్తున్న కథలా వుంది.

“అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా యిప్పటికే మూడు కోట్లమందికి జోంబీస్ లక్షణాలు వచ్చేశాయి. కనీసం పదిలక్షల మంది చనిపోయారు. మనదేశంలో పరీక్షలు చేసిన వాళ్ళని మాత్రమే లెక్కపెడితే యాభై లక్షల మంది జోంబీస్ బారిన పడ్డారు. ఎనభైయ్యొక్క వేలమంది చనిపోయారు. కనీసం రోజుకి వెయ్యిమంది చనిపోతున్నారు… ”

మనుమరాళ్ళు చెప్పుకుపోతుంటే “అరవై వేల పులిల్ని ఆనాడే పక్కన పెట్టి వాటికి వైద్యం అందించి వుంటే బాగుణ్ణు. ఇప్పుడు నూటా ముప్పైకోట్ల మందిలో పులుల్ని వెతకడం పట్టుకోవడం పద్దుకుమాలిన పని” అంది ముసల్ది.

“నానమ్మా… నువ్వు వాడినట్టయినా మెదడుని వాడాల్సిన వాళ్ళు వాడివుంటే యిన్ని కడుపుకోతలూ గుండెమంటలూ వుండేవి కావు” అన్నారు మనమరాళ్ళు. ఇద్దరూ వాళ్ళ నాయనమ్మ చెరో బుగ్గన చెరో ముద్దూ పెట్టారు.

నాకు కథ అప్పటికి అర్థమయ్యింది.

*

బమ్మిడి జగదీశ్వరరావు

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి చురక అంటించారు అధికారానికి. నిజానికి ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. కానీ ఆ పరిష్కారం దిశగా ప్రభుత్వాలు పనిచేయవు.

  • Good satire, కానీ పట్టించుకోవలసిన వారు పట్టించుకుంటారా? సందేహమే.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు