జూలెమ్మ

ఆ స్పర్శ, ఆ పొందిక, ఎముకుల పోగులాంటి ఆ చెయ్యి ఇవ్వగలిగిన లాలన…ఎప్పటికీ మర్చిపోలేను. కానీ వాళ్ళు చూస్తుండగా నేను జూలెమ్మ కొంగు పట్టుకుంటే మా వాళ్ళకు ప్రాబ్లం.

 1946-47 ప్రాంతాల్లో ఒక బక్క చిక్కిన మళయాళీ అమ్మాయి. ఆంగ్లో  ఇండియన్ ల ఇళ్ళలో హెల్పర్ గా ట్రైనింగ్ అయిఉంది. ” నాకు ఉద్యోగం దొరుకుతుందా ? ” అని ప్రశ్నిస్తూ 172.రాయపేట హై రోడ్, మద్రాసు లో అడుగుపెట్టింది.

అది వీనస్ క్లినిక్. డాక్టర్ గాలి బాలసుందర రావు గారి ఇల్లు కూడా అదే.

అమాయకంగా, వినయం గా , ఏ పని చెప్పినా సరే చేస్తాను అన్న బాడీ లాంగ్వేజ్ తో ఉన్న ఆ అమ్మాయిని కేవలం జాలితో ఆయాగా పనిలో  పెట్టుకోవాలనుకున్నారు మా నాన్నగారు.

నువ్వు ఏం చెయ్యగలవు ? అన్న ఇంటర్ వ్యూ లో అర్థమైన విషయం – ఆమె బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడగలదు. Is,  Was ..అవి ఎక్కడ ఉండాలో అక్కడ లేవు. మళయాళం, ఇంగ్లీషు కూడా చదవడం, రాయడం బొత్తిగా రావు. ఏ ధైర్యం తో ఈమె నర్సు ఉద్యోగం కోసం వచ్చిందా అని ఆశ్చర్యపోయారు నాన్న గారి స్నేహితులు.

” నేర్చుకుంటాను ” – బక్కపలచగా ఉన్నా గంభీరమైన గొంతు. ఆమె బాడీ లాంగ్వేజ్ మారిపోవడం గమనించారు నాన్నగారు.  అప్పటికే భగీరథమ్మాళ్ , ఎమిలీ అని ఇద్దరు నర్సులు అక్కడ డ్యూటీ లో ఉండేవారు. ఇద్దరూ మళయాళీలే. ట్రైనింగ్ అయి ఉండి, మంచి అనుభవం ఉన్నవారు.

అక్షరం ముక్క రాని ఈ పిల్ల ధైర్యం ఏమిటి?! అనుకున్నారు ఆ ఇద్దరు నర్సులు.

నాన్న ఇద్దరు స్నేహితులు, పేషెంట్స్, విజిటర్స్, నర్సులు – అందరి మధ్యనా భయపడకుండా నిలబడి తనకు కావలసినది అడుగుతూ , సాధించగలను అన్న పట్టుదలను చూసి ముచ్చట పడింది బాలసుందరరావు గారొక్కరే.

” తరిమెయ్యండి…ఎంత ధైర్యం.. ” వగైరా మాటలు చాలా వచ్చాయి.

ఈ పిల్లకు ఇంత desperation , పట్టుదల ఎలా వచ్చాయా అని ఆలోచిస్తున్నారు నాన్న.

” నీకు పెళ్ళి అయిందా ? ”

” అయింది. ముగ్గురు పిల్లలు ”

అదిరిపోయారు అంతా…అంత చిన్నమ్మాయిలా ఉన్నది.

” నీ భర్త ? ”

” ఏదో చిన్న ఉద్యోగం…ఇల్లు గడవడం కష్టం గా ఉంది…”

ఏ అవసరం ఆ పిల్లకు అంత ధైర్యం ఇచ్చిందో అర్థమైంది.

” రేపటినుంచీ పనిలోకి రా ! హెల్పర్ గా చేరు ” అని ఎమిలీని, భగీరథమ్మాళ్ ను పరిచయం చేసి –

” వీళ్ళమాట నువ్వు శ్రద్ధగా వినాలి..కంప్లైంట్ లు రాకూడదు ” అని వార్నింగ్ ఇచ్చారు నాన్న.

” అదేమిటి ? వెనకా ముందూ తెలియకుండా అలా ఉద్యోగం ఇచ్చెయ్యడం…” అని అనబోయారు శ్రేయోభిలాషులు.

” చదువు సంధ్య లేని బీదపిల్ల. ముగ్గురు పిల్లల తల్లి… అవసరం అన్నీ నేర్చుకోమంటుంది..చూద్దాము ” అన్నారు నాన్న.
అలా నాన్న దగ్గరకు ఉద్యోగం లోకి వచ్చింది జూలీ ఫ్రాన్సిస్.

భగీరథమ్మాళ్, ఎమిలీ ఇద్దరూ మళయాళీ లే గనుక భాష ప్రాబ్లం రాలేదు జూలీ కి. కానీ…కాంప్లెక్స్ ల ప్రాబ్లం ఎవరూ తప్పించుకోలేరుగా …

భగీరథమ్మాళ్ చాలా మంచిది…కానీ ధాష్టీకం చేసేది. డాక్టర్ గారి చేత మెప్పు పొందాలన్న ఉత్సాహం తో ఊపిరాడనీయకుండా ట్రైనింగ్ రెజుమే పెట్టేది జూలీ కి.
ఒకరోజు రాత్రి ఏడు  గంటలు దాటాక కూడా క్లీనింగ్ లు చేయిస్తున్న భగీరథమ్మాళ్ కు నాన్న చేత తిట్లు పడ్డాయి.

” ముగ్గురు బిడ్డల తల్లి..పొద్దునే ఎనిమిది గంటలకు వచ్చింది..వండుకోవడం, తినడం, సంసారం …ఏమీ అఖ్ఖర్లేదా ? ఆరు గంటల తరువాత ఉంచకండి..” అన్న బాస్ దేవుడిలా కనిపించారు జూలీకి.

50 రూపాయల అడ్వాన్స్, చాలా కష్టపడ్డావు అన్న మెచ్చుకోలు, తనను సూపర్ వైజ్ చేస్తున్న భగీరథమ్మాళ్ క్కు తిట్లు…
అలా మొదటి విజయం చవి చూసింది జూలెమ్మ. కాసు బంగారం 16 రూపాయలు ఉండగా 50 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన బాస్ కోటీశ్వరుడైన హీరోలా కనబడతాడు మరి…

పాపం భగీరథమ్మాళ్ బిత్తరపోయింది. ఒక నెలలో ఆవిడ ఎంత మంచిదో, ఎంత అభిమానం చూపిస్తుందో అర్థమైంది జూలెమ్మ కు.
కానీ – నల్లగా భారీగా ఉండి, తక్కువ మాట్లాడుతూ, ” ఎస్ డాక్టర్ ” అని ప్రతి విషయానికీ ముందుకు వచ్చే ఎమిలీ అసూయ, చిన్నచూపు తట్టుకోవడం కష్టమని అర్థమైంది ఎమిలీకి.

” నా కుక్క పేరు జూలీ ” అనగల లెవెల్ ఎమిలీది.

ఎదుటి మనిషి తనకన్నా తక్కువ స్థితిలో ఉన్నారని తెలియగానే ఏడిపించాలనే శాడిజం చాలా మందికి ఉంటుంది.
 నేను పుట్టినప్పుడు…

‘ మా డాక్టర్ పాప ..తెల్లగా బొద్దుగా ఉంది…” అని ఆనందం తో ఉయ్యాలలోంచి తీసుకుంటూ వైరు తగిలి బోర్లపడ్డ భగీరథమ్మాళ్ కు ముందు రెండు పళ్ళూ ఊడిపోయాయి పాపం.

” తను పడుతూ కూడా బిడ్డను జాగ్రత్తగా పైకి పట్టుకున్నది పాపం…” అని మా అమ్ముమ్మ, బామ్మ మంచిగా చెప్పేవారు.
” డాక్టర్ పాపను పడేశావు…ఏమైనా అయితే …? ” అని వీలైనంతవరకూ భగీరథమ్మాళ్ ను గిల్టీ చేసేది ఎమిలీ.
వీళ్ళిద్దరి మధ్య పాలిటిక్స్ ని సూక్ష్మగ్రాహి అయిన ఎమిలీ కనిపెట్టేసింది…చాలా తెలివిగా..ఎమిలీ ని ఎలా ఇరికించాలో ప్లాన్ చేసేది.
చక చక అన్ని పనులు…ఇంజక్షన్ చేయడం, బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ , డ్రెస్సింగ్ లు, పేషెంట్ లతో మంచిగా మాట్లాడడం, ధైర్యం చెప్పడం …ఇలా నాలుగేళ్ళలో ఆల్ ఇన్ వన్ అయిపోయింది జూలీ ఫ్రాన్సిస్.

అన్నింటిలోకీ ఆవిడ తెలివితేటలు ఎక్కడంటే …ఎవరికి ఏం చెప్తే ఆనందపడతారో అది మాట్లాడే లౌక్యం…ఎవరిని ఎక్కడ ఎలా గిల్టీ చేయాలో , చేస్తే ఎలా బ్లాక్ మెయిల్ అయిపోతారో అది తెలుసుకుని వాడడం…

ఇవి ఏ మనిషినైనా – పవర్ కాన్షియన్స్ ఉంటే సులభం గా పైకి తీసుకు వస్తాయి…ఈ లక్షణాలు కొంత ruthlessness  ని కూడా ఇస్తాయి.
నాలుగేళ్ళలో ఎమిలీ వెళ్ళిపోయింది..జూలీ నర్స్ అయిపోయింది డిగ్రీ లేకుండా. కొన్నాళ్ళకి భగీరథమ్మాళ్ రిటైర్ అయిపోయింది…ఆ తరువాత వచ్చే నర్సులుటెంపరరీ… పైగా వాళ్ళకు డిగ్రీలు, అనుభవం ఉన్నా ” మేము జూనియర్స్ మి ” అనిపించగల తెలివితేటలు ఉండేవి జూలెమ్మకు.

 

    ****
అప్పట్లో…అమ్మ లేని నాకు జూలెమ్మే గార్డియన్, గాడ్ మదర్, ఆయా…అన్నీ.
నాకు ఎంతిష్టమో మా జూలీ అంటే…
ఇంటి పైన మా బామ్మల సామ్రాజ్యం. కింద హాస్పిటల్లో నాన్న అధికారం..
మతం రీత్యా మా ఇంట్లో పెద్దవాళ్ళకు చాలా అభ్యంతరాలు ఉండేవి …” దాన్ని ముట్టుకోకు ” అంటే చెల్లుబడి అయ్యే కాలం…కానీ అట్లాంటి మాటలు అంటే మా నాన్న చంపేస్తాడనే భయం కూడా ఉండేది.

నాకు మాత్రం ఎప్పుడెపుడు కిందికి పారిపోయి వచ్చి మా జూలెమ్మ చేత ఇయర్ బడ్స్ తో చెవులు క్లీన్ చేయించుకుందామా…ఆవిడ ఒళ్ళో తల పెట్టుకుని అవేవో ఆంగ్లో ఇండియన్ పాటలు పాడుతుంటే నిద్రపోదామా అనిపించేది.

నన్ను చిల్డ్రన్స్ గార్డెన్ స్కూలు కు తీసుకువెళ్ళడం, ఇసకలో ఆడుకోవడానికి ఉషా టీచర్  రికమెండేషన్ తో చిన్న చిన్న గిన్నెలు ఇప్పించడం, మధ్యాహ్నం వచ్చి పెరుగన్నం పెట్టడం, సాయంత్రం సరిగ్గా స్కూలు వదిలే సమయానికి రిక్షా ఎక్కించి తీసుకురావడం …ఇవన్నీ జూలెమ్మ పనులే. రిక్షా రాకపోతే ఎత్తుకుని తీసుకువచ్చిన రోజులు ఎన్నో…

ఆ స్పర్శ, ఆ పొందిక, ఎముకుల పోగులాంటి ఆ చెయ్యి ఇవ్వగలిగిన లాలన…ఎప్పటికీ మర్చిపోలేను. కానీ వాళ్ళు చూస్తుండగా నేను జూలెమ్మ కొంగు పట్టుకుంటే మా వాళ్ళకు ప్రాబ్లం.

 మా పెద్ద బామ్మ లక్ష్మీదేవమ్మ, మా చిన్న బామ్మ శేషమ్మ గారు అక్కచెల్లెళ్ళు. ఉమామహేశ్వరమ్మ, సీతమ్మ వీళ్ళ కజిన్స్. కానీ వీళ్ళు నలుగురు అక్కచెల్లెళ్ళమని చెప్పుకునేవారు. మా పెద్ద బామ్మ ఆప్యాయత కోసరం సంవత్సరం లో రెండు మూడునెలల పాటు మద్రాసు వచ్చి ఉండిపోయేవారు. ఉమామహేశ్వర అమ్ముమ్మ భర్త తెన్నేటి రాఘవయ్య తాతయ్య గారు నాన్న కు సొంత మేనమామ అవడం వల్ల ఆయన కూడా అప్పుడప్పుడూ వచ్చి పోయేవారు. ఎర్రగా ఆజానుబాహువు…తాలూకా ఆఫీసులో ఉద్యోగం చేసేవారు. చాలా గట్టివాడు, వ్యవహారవేత్త, చాలా చాలా డబ్బు జాగ్రత్త మనిషి అని చెప్పుకునేవారు.

మా ఉమామహేశ్వర అమ్ముమ్మ ఎప్పుడూ ‘ మడి ‘లోనే ఉండేది. ఎరుపు తెలుపు కలిసిన చాయ, ముక్కుకు బేసరి. కొంచెం పళ్ళెత్తు. మాట కాస్త ముద్దగా ఉండేది.
అంత దూరం నుంచి ప్రసాదం ఎత్తి చేతిలో వేయడం గుర్తు. గన్నేరు చెట్టు మీది బూచివాడి కథలు – వాడు పిల్లల్నెత్తుకుపోతాడని చెప్పేది. అవి భయపెట్టే జ్ఞాపకాలు.

” మైల పడతావే నీ దుంప తెగ ” అనేది మా ఉమా మహేశ్వరమ్మ అమ్ముమ్మ ఊతపదం. చంపుకు తినేది మడితో.

” ఒక్కరోజు నాకు –  సమయానికి , కచ్చేరీకి వెళ్ళేలోపల తిండిపెట్టి ఎరగదు మీ అమ్ముమ్మ.. దిక్కుమాలిన మడి .. ” అని ఆవిడ లేకుండా చూసి తాతయ్య తిట్టిపోసేవారు…ఆవిడ అంటే ఆయనకు ధర్మపరమైన ప్రేమ .

 మెడలో కాసుల పేరు , గుళ్ళపేరు, నల్ల పూసలు …కళకళలాడుతుండే ఆవిడ…ఇప్పుడు ఆలోచిస్తే చాలా రొమాంటిక్ గా ఉండేదనిపిస్తుంది.
కానీ, పాపం ఆ తరంలో ఒక వర్గం వారికి… పైగా మహాపతివ్రతల కోవకు చెందామనుకునే ఇలాంటి సాధ్వీమణులకు ఎవరికీ రొమాన్స్ ఉండడం అనేది ‘ పాపం ‘. వాళ్ళ జీవితం లో అట్లాంటివి ఆలోచిస్తే రౌరవాది నరకాలకు పోతారని అందరికీ నూరిపోసేవాళ్ళు. పిల్లల్ని కనకపోతే ఆస్తి హక్కుల గొడవలు, గొడ్రాలన్న పేరు, పేరంటాల్లో వెలి….ఇట్లాంటి భయాలు ఉండేవి కాబట్టి చాలా భయం గా, తప్పు లాగా సంసారం చేసి పిల్లలని కని ఆ తరువాత ఈ విపరీతపు వేషాలు వేసేవారు కాబోలు…” చక్కటి భార్య, సంసారం ఉంది, ఆ తిరుగుబోతుతనం ఏమిటి ? ” అని దుమ్మెత్తిపోయబడ్డ చాలామంది మొగవాళ్ళ జీవితాల వెనకాల కొన్ని ఇట్లాంటి కథలు ఉండచ్చును.

” పొరపాటున ఆ రాధ పుట్టింది..పురిటి మంచం మీద కూడా మడి పాటించి ఉంటావు..రాధకు పసుపు నీళ్ళ చన్నీళ్ళు స్నానం చేయించిఉంటావు…అప్పుడు నీలుక్కుపోయిన మనిషి మళ్ళీ తేరుకోలేదు ..” అనేసి, ” ఏదీ ఆ అరిటిపండు ఇట్లా అఘోరించు..నువ్వెట్లాగూ మధ్యాహ్నం నాలుక్కే భోజనం పెడతావులే ..” అని ఏడిపించుకు తినేది మా హేమత్తయ్య.

ఆవిడకు రాధమ్మ ఆడబడుచు..పైగా అమాయకురాలు..అందుకని చెడుగుడు ఆడించేది హేమత్తయ్య.

” ఏం కూశావే .. ” అని ఒక్కసారి కర్ర పట్టుకు వెనకబడేది మా ఉమ్మమ్మామ్మ.
” మామయ్యా ! నువ్వు పిసినిగొట్టువాడివి కాబట్టి కానీ , లేకపోతే ఈ మడివాజమ్మ ను ఒదిలించుకునిమరొక సలక్షణమైన అమ్మాయిని చేసుకుని ఉండచ్చు కదా…ఈవిడ చేయి తాకితే మైల…మంచం ముట్టుకుంటే చన్నీళ్ళు బక్కెట్లతో పోస్తుందాయె…పాపం మామయ్య ! ఆయన కక్కుర్తి నీ ఇల్లాలితనాన్ని రక్షించేసిందిపో ” ఇట్లా రెచ్చగొడుతూనే ఉండేది హేమత్తయ్య.

తాతయ్య తో సహా అందరూ హేమత్తయ్య పార్టీ యే. కానీ ఉమ్మమ్ముమ్మ ఎదురుగా బయటపడే దమ్ములుండేవి కాదు ఎవరికీ. ఆవిడ ధాష్టీకమంతా పనివాళ్ళ మీదా నర్సుల మీదా ఆయాల మీదా చూపించేది.

ఒకరోజు నా పొరపాటు వల్ల జూలెమ్మ బలైపోయింది. మేడ మీదకు వచ్చిన జూలెమ్మ కనబడగానే నేను ఆవిడ కొంగు చాటున దాక్కున్నాను. అన్నం తినమంటారన్న భయం.

బట్టలన్నీ తీసేసి మడి గౌను కట్టుకుని చిన్న పీట మీద పొందిగ్గా కూర్చుని దాహం వేస్తే వేడి నీళ్ళు తాగుతూ…రోజూ అన్నం తినడం ఒక ప్రహసనం.
పెరుగన్నం లో కూడా వీలైతే నెయ్యి వేసి పెడితే తినే రకం నేను.

అట్లాంటి నాకు – ” నెయ్యి దగ్గు…వామన్నం తినాలి…వేడినీళ్ళే  తాగాలి …” ఇట్లాంటి నియంతృత్వపు రూల్స్ పెట్టేది ఉమ్మమ్ముమ్మ. ఆవిడ చెల్లెలు సీతమ్మ గారు చాలా మంచిది, కానీ అమాయకురాలు, బేల..పిల్లకు కాస్త రుచిగా పెడదాము అని ఆవిడ  అనుకున్నా ఉమ్మమ్ముమ్మ పడనిచ్చేది కాదు. మా పెద్ద బామ్మ ఏవో తినుబండారాలు [ ఆవిడ దృష్టిలో జబ్బు చెయ్యనివి ] చాటుగా జూలెమ్మకు ఇచ్చి నాకు పెట్టమనేది.

ఉమ్మమ్మ వంటింటి బైటకు రావడం..నేను జూలెమ్మ కొంగు చాటున దాక్కోవడం..

అంతే …భద్రకాళి అయిపోయింది. పాపం జూలెమ్మ ను తిట్లదండకం ఎత్తుకున్నది. నేను భయం తో గజగజ వణికిపోతున్నాను. నన్ను రోజాపూవు చెట్ల మధ్య పొదివి పట్టుకున్న జూలెమ్మ నాకు ఇంకా గుర్తు ఉన్నది.

నాలో బెరుకు…ఉమ్మమ్మ జూలెమ్మ ను కొట్టేస్తుందని…రక్షించడానికి హేమత్తయ్య కూడా లేదు.

మా బామ్మ ” ఉమ్మావ్..ఊరుకో ..” అంటోంది కానీ అది నిస్సహాయత లోంచి వచ్చిన మాట, పాపం.

మా అదృష్టం..సరిగ్గా అప్పుడు నాన్న రంగప్రవేశం చేశారు. రౌండ్స్ కు వెళ్ళి అట్లాగే వచ్చేశారు.
[ ” బూట్లు తియ్యరా సుందరం..ఆ బట్టలు మార్చుకు స్నానం చెయ్యి…బాలింత , చావు, పురుడు అన్నీ ఒకటే నీకు ” అని ఉమ్మమ్మ తిట్టిపోసేది. కానీ నాన్న పద్ధతి నాన్నదే. అందుకని చాలాసార్లు పసుపునీళ్ళ జాతరతో తృప్తి పడేది. ]

” నాన్నా ” అని చంక ఎక్కేశాను నేను.
” అది..ఆ..ఆ.. ” అని ఏదో రౌద్రం గా అనబోతోంది ఉమ్మమ్మ.
నాన్నకు పరిస్థితి అర్థమైంది.
” అమ్మో..కప్ప ” అని ఒక్క అరుపు అరిచారు.
ఆవిడకు కప్ప భయం కాబోలు !
” ఎక్కడరా సుందరం…” అని గావుకేక పెట్టేసి మైల బట్టల పెట్టె ఎక్కేసింది.
” దిగకు..అక్కడే ఉంది ! జూలీ , దాన్ని తరుము …” నాన్న సంజ్ఞ అర్థం చేసుకున్న జూలెమ్మ చీపురు తీసుకుని తరమబోయింది.
” అమ్మో ..” అని భయం తో జూలెమ్మ ను వాటేసుకున్నది ఉమ్మమ్మ.
ఎవ్వరికీ నవ్వు ఆగడం లేదు. నాన్న – మందహాసం, దరహాసం దాటిపోయి అట్టహాసం తో  పకపకా నవ్వుతున్నారు.
ఆ తరువాత దృశ్యాన్ని వర్ణించలేము…
హేమత్తయ్య కనబడగానే నాన్న చిలవలూ పలవలూ అల్లి చెప్పారు.
విరగబడి నవ్వి…ఆ తరువాత విషయానికి కవిత్వం జోడించి ఎంతమందికి వర్ణించి చెప్పిందో హేమత్తయ్య !
” మీరు మడితో అన్నం వండి దేవుడికి నైవేద్యాలు పెడితే దాన్ని జిజ్జమ్మకు తినిపించేది ఎవరు ? మీరెవరన్నా ఎండనబడి వెళ్ళి పెడుతున్నారా ? మూర్ఖత్వానికి హద్దు ఉండాలి…సాగుబడి రోగమంత పెద్ద వ్యాధి మరొకటి లేదు ” అని , తర్వాత నాన్న క్లాస్ పీకితే అంతా కిమన్నాస్తి !
సాగితే.. ఈ లాజిక్ లేని ఆర్భాటాలు భలే చెల్లుబడి అవుతాయి మరి…
జూలెమ్మలో పెద్దవాళ్ళ మీద గౌరవం, మర్యాద ఉండేవి. ఈ సీను తర్వాత చాలా అవకాశం తీసుకుని ఉండచ్చును…కానీ ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు మరి…

****
మధ్యలో కొన్నాళ్ళు జూలెమ్మ పని మానేసింది…కారణం తనకు పాప పుట్టడం.
జూలెమ్మ కు నేను కాక ప్రేమించడానికి పిల్లలుంటారు అని నాకు అర్థమయ్యేది కాదు.
తరువాత..పాండీ బజారుకు వచ్చాక, వెనక షెడ్డులో తన పిల్లలు, భర్త తో కాపురం పెట్టాక గానీ నాకు తన పిల్లలు పరిచయం కాలేదు.
పెద్దమ్మాయి ప్రేమ. తర్వాత బర్నాడ్, గీత, డార్తీ, రాబర్ట్.
జూలెమ్మ వంట, ఇల్లు సర్దుకోవడం చాలా బాగుండేవి నాకు.
మా ఇంట్లో కంచుగిన్నెలు, కుంపట్లు, వెండిసామాను…దేవుడి మందిరం దగ్గర నుంచి అంతా చిందరవందరగా ఉండేది. కానీ కేవలం కుండలు, సత్తు గిన్నెలు, మట్టిపొయ్యి, రేకుల షెడ్డు…వీటిని ఎంతో శుభ్రం గా, పద్ధతిగా పెట్టుకునేది జూలెమ్మ.
ఒక్కరోజు నలిగిన చీర కట్టేది కాదు. రోజూ అన్నం గంజి వార్చి చీరలకు పెట్టుకుని జామ చెట్టుకీ మామిడి చెట్టుకీ కట్టేది. ఇస్త్రీ చెయ్యనక్కరలేకుండా చీరలకు  గంజి పెట్టడం పెద్ద ఆర్టు అని నాకు తరువాత కానీ తెలియలేదు.
ఆవిడ కు ఉన్నది ఒక్క షెడ్డు..5 గురు పిల్లలు. భర్త ఫ్రాన్సిస్ హైకోర్ట్ లో ఏదో చిన్న ఉద్యోగం చేసేవాడు. చాలా కోపిష్టి.
ఆ ఇంట్లో గోడకు చిన్న మండపం లో జీసస్, మేరీ మాత..కొవ్వొత్తులు. ఆల్టర్ చాలా నీట్ గా ఉండేది.ప్రతిరోజూ సాయంత్రం అందరూ మోకాళ్ళ మీద కూర్చుని ప్రేయర్ చేసేవాళ్ళు.  జూలెమ్మ కు చదువు రాదు గానీ ప్రేయర్ విని నేర్చుకుని చాలా ఏకాగ్రత తో చేసేది. నాకు జ్వరం వచ్చినా గొంతు నొప్పి వచ్చినా మా జూలెమ్మ ప్రేయర్ చేస్తే తగ్గిపోతుందనుకునేదాన్ని.
చాలా రోజులు నేను కూడా ప్రేయర్ చేసేదాన్ని. నాకు కొన్ని పదాలు అర్థం కాకపోయినా..చెప్పలేక పోయినా…” నీ మనసులో ఏముందో అది చెప్పు ..జీసస్ వింటాడు ” అని జూలెమ్మ ప్రేమతో చెప్పే మాటలు…ఆ తరువాతి జీవితం లో భగవంతుడికి ఏది వినిపిస్తుందో నాకు అర్థమయేట్లు చేశాయి.
చర్చ్ కి తీసుకెళ్ళేది నన్ను. చర్చ్ లో నాకు నచ్చేది నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం లో అందరూ వినమ్రం గా మోకాళ్ళ మీద కూర్చుని భక్తిగా తలకాయ వంచి ….భగవంతుడికి విన్నవించడం చాలా నచ్చేది. పక్కన జూలెమ్మ అనే సెక్యూరిటీ మరింత ధైర్యం ఇచ్చేది. ఆ రొట్టెలు పంచడం, కొవ్వొత్తులు పెత్తడం…భలే సరదాగా ఉండేది.

నేను బి.ఏ పరీక్షల సమయం లో, విపరీతమైన కష్టాల్లో – అసలు చదువు పూర్తి చేస్తానా అనుకున్నప్పుడు …వేలాంగని మాతకు మొక్కుకో అని చెప్పింది జూలెమ్మ. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది తెలుగులో. డిగ్రీ పూర్తి అవగానే ఒక గ్రాము బంగారం బిళ్ళ మీద నా పేరు, హాల్ టికెట్ నంబరు చెక్కించి జూలెమ్మ కిచ్చి వేలాంగని పంపించటం గుర్తే నాకు…
జూలెమ్మ కు అంత శుభ్రం ఎక్కడిదా అని పెద్దదాన్ని అయిన తరువాత ఆలోచించేదాన్ని. వాళ్ళ చుట్టాల ఇళ్ళు – హాల్లో సోఫాలు, ప్లాస్టిక్ పూలతో బాగుండేవి కానీ వంటిళ్ళు ఘోరం. మా జూలెమ్మ పద్ధతి ఎవరి దగ్గరా కనబడేది కాదు. పిల్లలో మూడవ కూతురు డార్తీ కి వచ్చింది అంతే.
” శుభ్రం చేసేవాటిని ముందు శుభ్రం చెయ్యాలి ..” అన్నది  జూలెమ్మ దగ్గరే నేర్చుకున్నాను. బకెట్లు అడుగున శుభ్రం చెయ్యడం, చీపుళ్ళూ కుప్పతొట్లూ ముందు కడగడం…నిద్రలేవగానే పక్క నీట్ గా సర్దడం, ఎప్పటి పని అప్పుడు చెయ్యడం, కాఫీ తాగిన కప్పు వెంటనే కడిగిపెట్టే అవసరం…వీటన్నిటికీ గురువు ఆమే.
అంతే కాదు..బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, బి.పి.చూడడం, పేషెంట్ కు డ్రస్సింగ్ చేయడం…ఇవన్నీ నేర్పించింది.
మా నాన్న – విపరీతమైన దయతో, చాలా మందిని ” ఇంట్లో ఉండండి, ఉద్యోగాలు చూద్దాము ” అని చెప్పేసేవారు.
” బాలసుందరరావు, మా అబ్బాయి చెప్పినమాట వినడం లేదు ” అనో, ” ఉద్యోగం దొరకడం లేదు ” అనో ఒక ఉత్తరం రాసి పంపించేసేవారు  చాలామంది స్నేహితులు . నాన్న వెంటనే గార్డియన్ షిప్ తీసుకునేవారు. మా ఇంట్లో భోజనం, మధుర కళా నికేతన్ స్టేజ్ మీద పడక. ఏ మూడు నాలుగు నెలలకో ఉద్యోగాలు వేయించేవారు….అప్పుడు నాన్నగారి రికమెండేషన్ తో, వాళ్ళ వాళ్ళ అర్హతలనుబట్టి రైల్వేల్లో, బ్యాంకుల్లో, కార్పొరేషన్ లో…ఉద్యోగాలు వచ్చేసేవి.
వాళ్ళకు మధ్యలో జ్వరాలు వగైరా సమస్యలు వచ్చేవి. అప్పుడు నేను, జూలెమ్మ సేవలు చేసేవాళ్ళం. దయ, ఓర్పుఎంత అవసరమో నేర్పించింది జూలెమ్మ. అంతేకాదు..జబ్బు చేసిన వాళ్ళకు ఎన్ని వంకర కళలు, టాంట్రంస్ ఉంటాయో చెప్పేది. సేవ చేసినంతసేపూ తల్లిలా చేసేది…ఏదైనా కోపం వస్తే ఇంగ్లీష్ లో తిట్టేది [ తెలుగు అంత స్పీడ్ గా రాదు తిట్టడానికి ]
” తిట్లు బాగానే ఉన్నాయిగానీ గ్రమటిక్ మిస్టేక్స్… ” అని ఏడిపించేవారు నాన్న. మండిపోయేది జూలెమ్మకు.
” పిల్ల పెద్దదౌతోంది..ఏమిటి ఈ జనం ఇంట్లో ..? ” అని స్నేహితులు చీవాట్లు పెడితే ఎదురు హోటల్లో భోజనం టిక్కెట్లు కొనేవారు నాన్న.
‘ ఈ తలుపులు మూయబడవు ‘ అని , పాలగుమ్మి పద్మరాజు గారు మా 88.పాండీబజారు ఇంటి మీద నాటకం రాశారు.
మా నాన్నగారికి – తలుపులు గడియ వేయడం, బీరువాకు తాళం వేయడం అమానుషం అని ఫీలింగ్. మనుష్యుల మీద నమ్మకం లేదా / అనేవారు. ఫోనుకు తాళం వేయకూడదు…ఆ కాలం లో ఫోను ఒక లక్జరీ. చాలామంది ఫోన్లు వాడేసుకుని వెళ్ళిపోతే ఫోన్ డిస్ కనెక్ట్ అవకుండా ఉండడానికి మా అమ్మ నగలు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది.   ” కాసు బంగారం 50 రూపాయలు ఉండగా 1500 బిల్లు అంటే…” అరుస్తూనే ఉండేది జూలెమ్మ.
నాన్నగారు ఫీజు అడగరని అడ్డమైనవారూ అలుసు తీసుకుంటున్నారని జూలెమ్మ కు కోపం.
ఒక ఉండీ పెట్టింది. అడగఖ్ఖర్లేకుండా అందులో ఔదార్యం గా ఫీజు వేస్తారని తన ఉద్దేశ్యం. …నాన్న దానికి వ్యతిరేకం..” న్యూసెన్స్ పెట్టకు ” అని అరుస్తూనే ఉండేవారు.
ఒకామె చేతినిండా బంగారు గాజులు వేసుకుని, ఇంట్లో అందరికీ కన్సల్టేషన్ తీసుకుని , మందులు రాయించుకుని వెళ్ళిపోతూ ఉంటే …జూలెమ్మ ” మీకు తోచినది ఉండీ లో వేసి వెళ్ళండి ” అన్నది. ఆవిడ ఆశ్చర్యపోయి – ” ఫీజు లేని డాక్టర్ అని వచ్చాను…ఇదేమి కొత్త అలవాటు ..” అని పర్సు నిండా కట్టల డబ్బు నుంచి వెతికి వెతికి ఒక పైసా వేసి వెళ్ళింది.
మా నాన్న పగలబడి నవ్వారని అక్కడికక్కడే ఉండీ పగలగొట్టింది జూలెమ్మ. మూడు రోజులు మాట్లాడకుండా సాధించింది. ” చెత్త మనుష్యులు..చెత్త మనుష్యులు  ” అని పదిసార్లు తిట్టుకుని ఊరుకున్నది.
మా బామ్మల కోసరం తెలుగు నేర్చుకున్న జూలెమ్మ మొదట్లో – ” రెండు మనుష్యులు..నాలుగు పిల్లలు ” ఇలా మాట్లాడినా …రాను రాను ఎడాపెడా తిట్లు కూడా నేర్చుకున్నది. తరువాత మళయాళీ యాసతో తెలుగు ముద్దుముద్దుగా మాట్లాడేది .

****

నా మీద, నాన్న మీద, బామ్మల మీద చాలా పొసెసివ్ నెస్ ఉండేది జూలెమ్మకు.
నాన్న యోగా మిత్రులతో గంటలు గంటలు గడపడం, ఆడవాళ్ళ కష్టం సుఖం గంటలు గంటలు వినడం, నాడీ జ్యొతిష్యాలు, కౌన్సిలింగ్ లు చేస్తూ కన్సల్టింగ్ అవర్స్ మర్చిపోవడం, డ్రామా లు వేయించడం, మధురా కళానికేతన్ కోసరం ఇంటి అద్దెలు ఖర్చుపెట్టడం…ఇవన్నీ జూలెమ్మకు నచ్చేవి కావని నాకు ఎదుగుతున్నకొద్దీ అర్థమయ్యేది.

నాన్నకు మంచి డాక్టర్, ధన్వంతరి అని పేరున్నా ప్రొఫెషనలిజం లేదని కోపం ఉండేది జూలెమ్మకు.
నాన్న చేసే హీలింగ్ లు అంటే కూడా జూలెమ్మకు ఒళ్ళుమంట.
ఒక టెంపరరీ ఉద్యోగి కడుపు నెప్పితో మెలికలు తిరిగిపోతుంటే అతని నొప్పి నాన్న ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. అతను హాయిగా వెళ్ళిపోయాడు. ఈయన బాధ తట్టుకోలేకపోతుంటే జూలెమ్మకు బాధ.
” నీంగ ఎప్పో ఇప్పిడిదాం ..” [ మీరు ఎప్పుడూ ఇంతే ] …అడ్డమైన హీలింగులు చేసి అన్నీ మీదకు తెచ్చుకోండి…అని కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది.
” ఏమిటి నాన్నా ” అంటే
” దాని గోల దానిది…ఆ కుర్రాడిది టెంపరరీ ఉద్యోగం. కొత్తగా పెళ్ళైంది పాపం..ఈ కడుపునెప్పితో రేపు వెళ్ళకపోతే ఉద్యోగం నుంచి పీకేస్తారు. ..అందుకే నేను ట్రాన్స్ ఫర్ చేసుకున్నాను. ఒక పూట బాధ అంతే…తరువాత మాష్టరు [ సి.వి.వి ] గారి ప్రేయరు తోతగ్గించుకుంటాను అంతేగా ” అంటుంటే ఇంకా మండిపోయేది ఆమెకు.
నాన్నకు కాన్సర్ వచ్చినప్పుడు – ” ఈయన ఎక్కడునుంచో తెచ్చుకున్నాడు..నాకు తెలుసు ” అని సాధించేది.
నేను మడికట్టుకుని వంట చేసి బామ్మలకు పెట్టి కాలేజీ కి వెళితే ఆ తరువాత వాళ్ళకి గ్లూకోజ్ లూ హార్లిక్స్ లూ ఇవ్వడం జూలెమ్మే చేయవలసి వచ్చేది. ఇదెక్కడి హిపోక్రసీ అని ఎప్పుడూ ప్రశ్నించలేదు.
Familiarity brings not only contempt but sometimes power consciousness also.
చాలా ఇళ్ళలో control factor ఎవరిచేతుల్లో ఉన్నదో పరిశీలిస్తే చాలా రకాల మనస్తత్వాలు, మనుషుల బలాలు బలహీనతలు అర్థం అవుతాయి.
సాధారణం గా ఈ control factor ఎవరి చేతుల్లో ఉండాలంటే , ఆర్థిక స్తోమత, సామాజిక భద్రత ఇవ్వగలిగి కుటుంబం పట్ల ఆప్యాయత, బాధ్యత ఉన్నవాళ్ళ చేతుల్లో.
కానీ అది అన్ని కుటుంబాల్లో జరుగుతుందన్న నమ్మకం లేదు…ఎదటివారి ఆధారపడే తత్వం, మానసిక బలహీనతలు, సెల్ఫ్ పిటీ ఇవన్నీ తెలిసిన వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం.
కళాకారులు, కళాప్రియులు ..వీళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళ కష్టాలు, బాధలు వేరు రకం గా ఉంటాయి. పరమ కోపిష్టి, దేనికైనా వెంటనే రియాక్ట్ అయేవారు నాన్న. [ ఈయన ఎదటివారికి ఎమోషనల్ బాలన్స్ నేర్పించేవారు. ఆయన మాటలతో సామాజిక, ఆర్థిక, మానసిక సమస్యలు తీరినవారు వందల్లో ఉన్నారని చెప్పచ్చు…వైద్యుడిగా ధన్వంతరే…ఆయన చనిపోయిన తరువాత దాదాపు 30 మంది ఆయన ఫోటో మా దగ్గర ఉంచుకుంటామని,  మా పూజ గదిలో పెట్టుకుంటామని తీసుకువెళ్ళారు. నాన్నగారు దగ్గరపెట్టుకుని ఉద్యోగం వేయించిన అబ్బాయి పెద్ద ఆఫీసరై కనబడి, ” సిస్టర్..మీరు , జూలెమ్మ నాకు జ్వరం వస్తే ఎంత సేవ చేశారు..నాన్నగారి దగ్గర ఎన్ని నేర్చుకున్నాను..” అని పర్సులోంచి నాన్న ఫోటో తీసి చూపిస్తే ఆశ్చర్యపోయాను. ..నాన్న గొప్పతనం పక్కనపెడితే ఆ కుర్రాడి వ్యక్తిత్వానికి జోహార్ అనిపించింది ]
ఆలోచించి నిదానం గా నిర్ణయాలు తీసుకోగలిగే బామ్మ …కోపం, రోషం, కొంత పాండిత్యం కొంత అధికార దాహం ఉండే చిన్న బామ్మ …వీళ్ళ మీద పక్షవాతం, వృద్ధాప్యం, జీవితం పట్ల విసుగు, ఆర్థికమైన ఒత్తిడి పడ్డాయి. శాసించగల అధికారాలు – మంచీ చెడూ చూస్తూ సేవ చేస్తున్న జూలెమ్మ చేతుల్లోకి వెళ్ళాయి. అప్పటికి నాకు 19 ఏళ్ళు. ఎదురుచెప్పడం తెలియదు.
అక్షరం ముక్క రాని జూలెమ్మ దగ్గరకు – నాన్న స్నేహితులైన యోగా మిత్రులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, కమీషన్ వ్యాపారస్తులు, చీట్లు కట్టేవాళ్ళు, డబ్బులు వడ్డీకి తిప్పేవాళ్ళు, సినిమావాళ్ళు, బడ్డీ కొట్టు వ్యాపారస్థులు …అందరూ వచ్చేవారు. కేవలం డాక్టర్ గారి నర్సు గా కాకుండా వాళ్ళకి ఆత్మీయురాలైపోయింది. వాళ్ళ పర్సనల్ విషయాలు అన్నీ నాన్నగారి ద్వారా జూలెమ్మకు తెలిసిపోయి ఉండేవి.
ఇదంతా వెయ్యి కళ్ళున్న హేమత్తయ్య కనిపెట్టేసేది . ” జూలీ ఫ్రాన్సిస్..నువ్వు సామాన్యురాలివి కాదు ” అని చురకలు పెట్టేది. కాని ఆవిడ కూడా జూలెమ్మ సేవా తత్వానికి పడిపోయేది.

కొన్నాళ్ళకు నాన్నగారి పేషెంట్ లు కార్లు పంపితే ఇంటికి వెళ్ళి ఇంజక్షన్ లు చేసి ఫీజు, గిఫ్ట్ లు కలెక్ట్ చేసుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులకు బిజినెస్ లు, కమీషన్ లు, పెళ్ళి సంబంధాలు కుదర్చడం…చాలా చేసేది జూలెమ్మ.

నాన్నకు జబ్బు చేసిన తరువాత పెళ్ళి పత్రికలు జూలెమ్మకు ఇచ్చి మాకు ఇవ్వకుండా వెళ్ళే చాలామందిని చూశాను.
” జూలెమ్మ సంపాదన డాక్టర్ గారి సంపాదనకు మూడింతలవుతోంది..ఎప్పుడో ఎదురిల్లు కొనేస్తుంది ” అని జోక్ చేసేవారు రాణీ బుక్ సెంటర్ చౌదరాణి గారు.
నాది, నాకు అన్నవి వేళ్ళూనిన కొద్దీ ఇడపింగళ నాడుల్లాగా పెనవేసుకుని చాలా మార్పులు తెస్తాయి..తప్పదు.

 నాకు లేని పట్టు చీరలు, పట్టు పరికిణీ లు జూలెమ్మకూ వాళ్ళ అమ్మాయికీ ఉంటుండేవి. నేను చాలా బాధ్యతల్లో కష్టాల్లో మంచి రాంక్స్ తెచ్చుకుని తన కూతురు ఫెయిల్ అయినప్పుడు జూలెమ్మ మాటలు నన్ను బాధ పెట్టేవి. ఎందుకా అనుకునేదాన్ని. తను మెచ్చుకుంటే నాకు గోల్డ్ మెడల్ అనిపించేది.
నాకు ఆ కాంప్లెక్స్ అర్థమవడానికి కొంతకాలం పట్టింది.
నేను చదువుకుని ఏదన్నా ఉద్యోగం లో చేరి…అలా మామూలుగా ఉండిఉంటే జూలెమ్మ ప్రేమ నాకు అట్లాగే ఉండేదేమో. ..కానీ సినిమా స్టార్ భార్యను అవడం, బోలెడంత హడావిడి..ఇవన్నీ ఆమెకు అనుకోని విషయాలు అయిఉండచ్చు.
తరువాత అప్పుడప్పుడూ నా పిల్లల సంరక్షణ చూసేది. నాకు జ్వరం వస్తే , అమ్ముమ్మ ఊరు వెళితే – పిల్లలను తనదగ్గర పడుకోబెట్టుకునేది. ” మా జిజ్జమ్మ కు బాధ్యత తెలియదు.. పాపం ఏమిటో అలా పెరిగింది..” అని ఆకుకు అందకుండా పోకకు పొందకుండా మా అత్తగారు వాళ్ళతో మాట్లాడేది. నా ఆప్యాయత పొర తీసి చూస్తేగాని నాకు తన ఆంతర్యం అర్థం కాలేదు.

****

జూలెమ్మ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి ..అందరూ  హాయిగా సెటిల్ అయారు. ఆఖరి రోజుల్లో పెద్ద కూతురి ఇంట్లో ఉంటూ అప్పుడప్పుడూ ఫోన్ చేసి ” నువ్వు రా ” అనేది. తీరుబడి చేసుకుని వెళ్ళి చూసి , కొంచెం సేపు ఆవిడ పిల్లల మీద కంప్లైంట్ లు విని, కాళ్ళు పిసికి, దిండు కింద డబ్బులు  పెట్టి వచ్చేసేదాన్ని. తీరిక దొరికితే మావారు కూడా వచ్చేవారు.
రెండుసార్లు ఇంట్లోంచి వెళ్ళిపోయింది..వెతికి, తిట్టి పట్టుకు వచ్చారు పిల్లలు.
ఒకరోజు నన్ను అర్జంటుగా రమ్మని – ” నన్ను ఓల్డేజ్ హోం లో పెడతావా లేదా ?! ” అని పంతం పట్టింది.
మా బామ్మలకు, నాన్నకు, నా పిల్లలకు ఎంతో సెవ చేసింది జూలెమ్మ. నేను వెళ్ళలేని పరిస్థితిలో నాన్నతో తననే ఫ్లైట్ లో బాంబే హీరానందాజీ కాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరకు పంపాము.
ఎవరికైనా అరమరికలు లేని సేవ అందించే ఆమె అడిగినందుకు మంచి ఓల్డేజ్ హోం ఏర్పాటు చేద్దామని అనుకున్నాను…పిల్లలు పడనియ్యలేదు.
ఆమె తన చాదస్తం తో వాళ్ళను ఎన్ని ఇబ్బందులు పెట్టిందోచెప్పేవారు. చాలామంది పిల్లలలాగే తల్లి బలహీనతలు తెలిసినట్లుగా ఆవిడ ప్రత్యేకతలు గుర్తించలేనివాళ్ళే వాళ్ళు కూడా.
నేను అమెరికా లో ఉండగా పైలోకాలకు వెళ్ళిపోయిందని విన్నాను.
పదేళ్ళ క్రితం దాకా ఆవిడ పిల్లలు అప్పుడప్పుడూ వచ్చి చూసిపోయేవారు.
నా జీవితం లో చిన్నప్పుడు ఎంతో ప్రేమను ఇచ్చి గుండెల్లో దాచుకుని పెంచుకున్న జూలెమ్మ…నాకు ఆస్త్మా వస్తే నాన్న, బామ్మ లతోబాటు దగ్గర ఉండి రాత్రంతా ఎత్తుకుని మోసిన జూలెమ్మ..నాకు చాలా చాలా నేర్పించింది.
జూలెమ్మ ఏమంటుందోనన్న భయం..తను బాధపడుతుందేమోనన్న అభిమానం..చాలా ఉండేవి నాకు.
ఇవ్వాళ్టికీ ఆమెను తలుచుకుంటే…
జామకాయలు కోసి ఉప్పూ కారం రాసి , మామిడిచెట్టుకింద ఒళ్ళో పడుకోబెట్టుకుని తినిపించిన జూలెమ్మే గుర్తుకు వస్తుంది.
ఆవిడ పౌడరు వాసన..తెల్లచీర గంజి వాసన..ఎన్నో జ్ఞాపకాలు..మరుగునపడనివి..మర్చిపోలేనివి..
పాండీ బజార్ ఇంట్లో స్నేహితులు, తెలిసినవాళ్ళు, బంధువులు , నా స్కూలు క్లాస్మేట్స్ …అందరికీ జూలెమ్మ ఆత్మీయత జ్ఞాపకమే.  


*

 

 

 

జలంధర

కేవలం ఒక వాక్యంలో వొదగని అనుభవ విస్తృతితో రాస్తారు జలంధర. తెలుగు మాటలకు "పున్నాగ పూల" తావిని అద్దిన వారు. జీవితాన్ని జీవితంతోనే వ్యాఖ్యానించాలన్న సహజ సౌందర్య జిజ్ఞాసి.

4 comments

Leave a Reply to కె.కె. రామయ్య Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • విభిన్న వ్యక్తిత్వాలు…అనుబంధాలు….జ్ఞాపకాలు …ఎక్కడా ఆపకుండా చదివిస్తూ మనసును భారం చేస్తున్నాయి.

  • యీ క్రింది వాక్యాలలో ముద్రారాక్షం లాంటివి చోటుచేసుకున్నాయేమో అని కుంచెం అనుమానంగా ఉంది. దయచేసి సరిచేసి చూడగలరు ( సారంగ సంపాదక వర్గం కాని . . . యీ అనుసంధానం శీర్షిక తెరవెనుక సప్పోర్టు, జలంధరమ్మ గారి వీరాభిమాని అయిన డా. మైథిలి అబ్బరాజు గారు కాని )

    a) ” కానీ – నల్లగా భారీగా ఉండి, తక్కువ మాట్లాడుతూ, ” ఎస్ డాక్టర్ ” అని ప్రతి విషయానికీ ముందుకు వచ్చే ఎమిలీ అసూయ, చిన్నచూపు తట్టుకోవడం కష్టమని అర్థమైంది ఎమిలీకి ”

    – – – కష్టమని అర్థమైంది జూలెమ్మకు.

    b) ” వీళ్ళిద్దరి మధ్య పాలిటిక్స్ ని సూక్ష్మగ్రాహి అయిన ఎమిలీ కనిపెట్టేసింది…చాలా తెలివిగా.. ఎమిలీ ని ఎలా ఇరికించాలో ప్లాన్ చేసేది”

    వీళ్ళిద్దరి మధ్య ( భగీరథమ్మాళ్, ఎమిలీ మధ్య ) పాలిటిక్స్ ని సూక్ష్మగ్రాహి అయిన జూలీ కనిపెట్టేసింది.

    ~ గొరుసన్న గారి తంపులమారి రావయ్య

  • ఆ స్పర్శ, ఆ పొందిక, ఎముకుల పోగులాంటి ఆ చెయ్యి, జూలెమ్మ చెయ్యి ఇవ్వగలిగిన లాలన… అంటూ జీవిత తాత్వికతను రాగద్వేషాలకు అతీతంగా ఓ ఉన్నత స్థాయిలో, ఔనత్యంతో చెప్పడం ఎలా నేర్చుకున్నావు జలంధరమ్మా అంటూ ఆపుకోలేని నా ఉద్వేగాన్ని వారికి వినిపించాను ఫోను చేసి.

    మీరింతలా ఇంటెలిజెంట్ గా, ఇంటెలెక్చువల్ గా, బాలెన్స్డ్ పర్స్ నాలిటీగా ఎదగడానికి చిన్నతనం నుంచీ మీరు చూసిన పెద్దల ఆశీర్వాదమే కారణం అనుకునే వాడిని. కానీ ఇప్పుడు తెలుస్తున్నది, మీరు జీవితం నుంచి ఎంతెంతో నేర్చుకుంటూ ఎదిగారు అనీ అంటే ( మిమ్మల్ని కాకా పట్టడానికి ఇలా అనడం లేదు, ఓ ఉద్వేగం నాతో ఇలా మాట్లాడిస్తున్నది అని అంటే ) నా యీ డ్రామాలనీ నవ్వుతూ ఓర్చుకున్నారు.

    వర్షించే ముందు మేఘా వృత్తమైన ఆకాశంలో కనిపించే మెరుపుల్లా మీ నాన్నగారు ( గాలి బాలసుందర రావు ) గారి కొన్ని కొన్ని పార్స్వాలు; కొద్ది కొద్దిగా తెలియచేస్తున్నారు కానీ వారి పూర్తి ఆవిష్కరణ లో తడిసి ముద్దవ్వాలని ఉందీ అంటే . . . ఆ కాలం లోనే కాదు, యీ కాలం లోనూ అలాంటి వారెందరో ఉన్నారు. వాళ్లకి ప్రచారాల కన్నా ఆచరణలంటేనే ఇష్టం అని వివరించారు.

    మీ నాన్న గారివి, మీవీ, మరెందరో పెద్దలతో ఉన్నవీ కాలం నాటి మరిన్ని ఫొటోలు చూడాలని ఉంది అని అడిగితే అలాగేలే అనీ అన్నారు నవ్వుతూ.

    పాలగుమ్మి పద్మరాజు గారు, త్రిపుర గారి ఆప్తమిత్ర పెద్దలు భమిడిపాటి జగన్నాధరావు గారు, బెజవాడ పి. సత్యోతక్కయ్య, చినుకు పత్రిక నండూరి రాజ్ గోపాల్, కర్నూలు లోని సాహితీ పెద్దలు ఇంద్రకంటి వెంకటేశ్వర్లు, మొహమాట పడుతూ, నాపోరు పడలేక జలంధరమ్మ గారిని పలకరించిన వర్ధమాన కవయిత్రి తిర్పతి రేఖాజ్యోతి, బండ్లమూడి స్వాతి కుమారి, రిషీవ్యాలీ రాజశేఖర్ పిడూరి గార్ల ప్రస్థావన కూడా వచ్చింది మా ముచ్చట్లలో.

    తెన్నేటి లత గారి గురించీ, మా కామ్రేడ్ రంగాజీల ( రంగనాయకమ్మ ) గురించీ నా నిర్మొహమాట వ్యాఖ్యలను విని ( ఓ నేలక్లాసు పాఠకుడి వ్యాఖ్యలను విని ) . . . వ్యక్తుల్ని, వారి వ్యక్తిత్వాన్ని, వారి మానసిక తత్వాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో ఓ ఆచార్యవర్యుడిలా చెప్పారు.

    11వ శతాబ్దంలో విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించి, భారత దేశంలో వైష్ణవ సంప్రదాయాన్ని శాశ్వతంగా ప్రతిష్ఠింప చేసి మానవ మాత్రులంతా వేదాన్ని, వేద మంత్రాలను అధ్యయనం చేయడానికి అర్హులని చెప్పి, సమాజంలోని అధర్మాన్ని, దళితుల పట్ల జరుగుతున్న పీడనను, మూఢనమ్మకాలపైన బలంగా పోరాడి, మతతత్వం ద్వారా సమాజంలోని కులతత్వాన్ని తొలగించి, కుల మత, జాతివివక్ష లేకుండా భగవంతుడి ముందు అందరూ సమానులే అని భావ విప్లవం తీసుకొచ్చిన రామానుజాచార్యులను మించిన కమ్యూనిస్ట్ ను చూపలేము అనీ ఉదాహరించారు.

    నేనో ఎమోషనల్ పర్సన్ అని ( ఎమోషన్ లీ అన్ బాలెన్స్డ్ పర్సన్ అని ) తెలిసినవారందరూ అంటారండీ అంటే ఎమోషన్స్ లో కూడా పాసిటివ్ ఎమోషన్స్, నెగటివ్ ఎమోషన్స్ ఉంటాయి వాటిని ఎప్పుడు, ఎక్కడ వాడాలో అక్కడే ప్రదర్శించాలి అంటూ నన్ను వోదార్చారు నవ్వుతూ.

    పల్లె జీవితాన్ని చూసిన మీ శ్రీవారు చంద్రమోహన్ గారు, తళుకుబెళుకుల సినీ లోకాన్ని అక్కడి విజయాలను చవిచూసినా మౌలిక విలువల్ని విడవకుండా వినయం వొందనం, హాస్యప్రియత్నంతో అందరితో కలివిడిగా ఎలా ఉంటున్నారో అని ఉహూ ఇదవుతుంటే తనకి మరోలా ఉండటం చాతకాదు రావయ్యా అని నవ్వేసారు.

    యీ అనుసంధానం శీర్షిక – జూలెమ్మ లోని వాక్యాలలోని ముద్రారాక్షసాలను ( mismatch లను ) వారికి చదివి వినిపించగా వాటిని సరిచెయ్య వచ్చు అనీ అన్నారు.

    ~ ఇట్లు, త్రిపుర గారి బెంగళూరు బెమ్మ రాచ్చసుడు

  • జలంధర గారూ, ఇక్కడ మీ రచనల కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నాను. ఏమాత్రం వీలు దొరికినా తప్పక వ్రాయండి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు