“కాలము సైకత తీరము
నడచినపుడే పడును జాడ
గాలి కదలెనా మళ్లీ కనిపించదు
నరుని గాధ”
అన్నారట కవి ఆవంత్స సోమసుందర్ గారు. గురువుగారి కవితా పంక్తులనే వారి శిష్యులు, కవి, రచయిత శ్రీ ఇంద్రగంటి ప్రసాద్ గారు శీర్షికగా తీసుకుని వెలువరించిన కవితా సంపుటి ఈ కాలం సైకత తీరం.
తీరానికి ఆహ్వానం పలుకుతూ ఇస్మాయిల్, మో ,నెరూడా, రూమి… లతో పాటు వారు ఎప్పుడో చదువుకున్న పురాస్మృతుల సంస్కృత కావ్యాల తాజాదనం కూడా వెన్నంటే ఉంది అంటారు. జీవితాన్ని దగ్గర నుండి చూసిన అనుభవం కనిపిస్తుంది ఈ కవితల్లో. వారందరినీ చదువుకోవడం వల్ల జీవితాన్ని ఆ విధంగా చూడగలిగారేమో మరి. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వీరి మొదటి కవితా సంపుటి #నడిచివచ్చినదారి. ఆ తరువాత మళ్లీ ఇదేనట .ఈ 30 ఏళ్ల వ్యవధిలో చూసిన ప్రపంచం, జీవితం కవితల్లో ప్రతిబింబించి ఉండాలి మరి. అందుకే అంటారు
జీవితాన్ని ఎంత దగ్గరగా చూస్తే
కవిత్వం దుఃఖ కెరటం అవుతుంది?
పదాలు పగిలి
పద్యమై రోదిస్తుంది? అని.(పద్యమై)
ఆ అనుభవాలలో నుండి అప్రయత్నంగా మెరిసిన మెరుపులు ఇవి
“వాక్యాల కోసం
వెతుక్కుంటూనే ఉన్నానా,
మెరుపులా, నవ్వే ధాన్యం గింజలా
పద్యమెలా విరిసిందో!
(చూస్తూనే ఉన్నానా)
“నవ్వే ధాన్యం గింజలా”
ఎందుకో ఇది చదవగానే పతంజలి శాస్త్రి గారి “ఆమె ఒక నల్లని విత్తనంలా ఉంది” అన్న మాట గుర్తొచ్చింది.
కొన్ని పోలికలు ఎంత బావుంటాయో.
ఓ తత్వ చింతన కనిపిస్తుంది ఈ కవితా పంక్తులలో.
‘అంతర్వేది’ లో భావన చూడండి
నీకేం
నువ్వు సముద్రంలో కలుస్తావు
ఎగిరే పక్షికి కూడా బోలెడంత సులువు
ఈ దుర్గమైన త్రోవలో
నేనే
దీపంలా కొండెక్కుతా …అని.
రంగులు హంగులు అమర్చుకోవడం కన్నా దేహ గేహం లోకి చూసే కొత్త దుర్భిణీ కావాలంటారు.(కొత్త దుర్భిణి)
ఓ వయసు దాటేక
ఏ రూపంలో వచ్చినా
కౌగిలించుకోవడమే
……………..
……………..
గాలి తిరిగినట్లే
గాలి కమ్మినట్లే
గాలి వదిలినట్లే
ఎంత దూరం నుంచి
ఎగురుకుంటూ వచ్చినా
ఇక్కడ ఉండడానికి రాని పక్షిలా
సమయమే ఎదురుచూస్తూ వుంటుంది.
(కౌగిలింత) – అని జీవిత సత్యాన్ని చెప్తారు.
చాలా కవితల్లో నాకు కనిపించినది ఒక భావుకుడు యాంత్రిక జీవితంలో; సూటు, బూటు, టై…వీటి మధ్య ఉక్కపోతలో,కార్పొరేట్ ప్రపంచంలో నలిగిపోతున్న బాధ.
అద్దంలో ఆఫీసు
ప్రత్యక్షమవుతుంది
అద్దాలమేడలో
చిలక గిలగిలా కొట్టు కొంటూ…
(అద్దమా? శబ్దాలంకారమా?)
చెప్పుల్లో కాళ్లు పెడితే
రోజు మొదలైనట్టే
చిల్లులు పడ్డ చెవుల్లో
ఉలి దెబ్బల మాటలు
మొదలైనట్టే. (మొదలైనట్టే)
గడ్డకట్టుకు పోతున్న ఉదయాస్తమయాల మధ్య ఆవిరైపోతున్న రోజుల్లో గంధ మారుతాన్నై వెన్నెలని ఒడిసి పట్టగలనా అన్న వేదన కనిపిస్తుంది
(ఒడిసి పట్టగలనా?)
ఇన్ని వేదనల మధ్య… జీవితంలో ఉన్న సౌందర్యాన్ని ఎలా ఆస్వాదించాలో కూడా తెలుస్తుంది కొన్ని చదివితే.
ఉదయా లెప్పుడూ అందంగానే ఉంటాయి.
వాటికోసం ఏ సముద్రం దగ్గరకో ,నది ముంగిటకో పోనవసరం లేదు. కిటికీ ముందు రాలిన పారిజాతాల పరిమళం, మంచు జారే చెట్ల ఆకుల గాంభీర్యం, డిసెంబర్ పూలు, గొబ్బి పువ్వులు, గాల్లో తేమ… చాలదూ ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించి సేద తీరటానికి ఏ నదో సముద్రమో నీ ఇంటికి వచ్చినట్టే కదా!
(‘ఉదయమెప్పుడూ ‘ లో భావన)
కోయిల కూతకు ‘కూ ‘ అంటే ‘కూ ‘ అనకపోయినా ఆ పిలుపు కోసం ఎదురు చూడాలి.
“నీ పిలుపు కోసం
కాచుకుని ఉండాలా
పిలుస్తూనే ఉంటావు
పని ఉన్నా లేకున్నా. ” అని అడుగుతూ “నేను సాదాసీదా మనిషిని
నాకూ చిన్న చిన్న పనులుంటాయి
ఆకాశం కేసి చూడడమో
పుస్తకంలో లీనమవడమో
ఏదో జ్ఞాపకాన్ని నెమరేసుకోవడమో అంతెందుకు నీ పిలుపు కోసం
చూస్తూ వుండడమో ”
అని కోయిలతో మాట్లాడుకోవాలి.(నీకు మాత్రం తెలుసా)
అద్దానికి అటున్న సముద్రంతో సంభాషించగలగాలి.
నీ మాట తనకి, తన ఘోష నీకు వినపడకపోయినా .సముద్రం పరిచిన నీటి కాగితాన్ని చదువుకోగలగాలి (అద్దానికి అటూ ఇటూ)
చొక్కా విప్పి మనల్ని మనం కొక్కేనికి తగిలించుకుని ఓ కప్పు టీ ,గ్లాసుడు మంచినీళ్లు, గుడ్డకుర్చీ, కళ్ళజోడు… తోడుగా ఏ పద్య సహస్రాల భారతమో, గద్య నాటకం కన్యాశుల్కమో తీసుకుని సాయంత్రం గడుపుకోవాలి .తలపుల విశ్వానికి తలుపులూ తెరవాలి.(చొక్కా విప్పి)
అలా తెరిచినప్పుడే
నీళ్ల భారంతో నడుస్తున్న
మబ్బు తలకెత్తుకున్న బిందెతో
అమ్మలా కనిపిస్తుంది (ఓ సాయంత్రం)
సుప్త చేతన స్థితిలో అంత నిద్రా ముగించి ఒక్క క్షణం కూడా నిలకడ లేని సీతాకోకచిలుక కనిపిస్తుంది. అయితే అది ఒక్క రంగు రంగుల సీతాకోకచిలుకలా మాత్రమే కాదు కనిపించేది. పూ పరాగాలు చేరవేస్తూ కొత్త జీవనానికి అంకురార్పణ చేసే సీతాకోకచిలుకలా. అలాగ కదూ చూడాలి!
అందాలు
మాత్రమే చూసే
మనిషివి
అండాలని మోయడం
ప్రపంచానికి పురుడు పోయడం
ఎప్పుడు గుర్తిస్తావు
అని కూడా అంటారు అక్కడే (ఎప్పుడు గుర్తిస్తావు?)🙏🙏
ఇలా ఎన్నెన్నో ఈ కవితల నిండా!
కవి అన్నట్టు ఈ పుస్తకంలో మొక్కుబడికీ, పెట్టుబడికి ,అవసరానికి ,ఉత్ప్రే రకానికి పుట్టిన కవితలు లేవు .అన్నీ సహజంగా ఆలోచనలు నాటుకుని, పక్వమై, తమంత తామే ఆవిష్కరించుకున్న పద్యాలు ఇవి.
ఈ పద్యాలకు చిత్రకారులు తల్లావఝుల శివాజీ గారు వేసిన చక్కని అర్థవంతమైన చిత్రాలు మరింత సొగసును ఇచ్చేయి.
అన్ని కవితలూ చదివేను. కానీ అన్నీ అర్థం అయ్యేయి అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేను. జీవితాన్ని అంత దగ్గరగా చూడలేదు కదా! బహుశా కాలం గడిచే కొద్దీ మెల్లమెల్లగా అర్థం అవుతాయి అంతవరకు అప్పుడప్పుడు తీసి చదువుకుంటూ ఉంటాను.
*
Add comment