జీవితం మీద ఆశ రగిలించిన కవుల గురించే …

ఇవాల్టి కవుల్లో ఎందరు కవిత్వంలోని ప్రాణాన్ని అంతర్లీనం చేసుకోగలిగారు?

‘శ్రీశ్రీ ఎందుకు నచ్చుతాడు?’ అన్న ప్రశ్నను తానే వేసి తానే జవాబిచ్చాడు చెలం.

‘అరుగో. పాత గోరీలకేసి మొహాలు తిప్పికొని నగిషీలు చెక్కుతున్నారు.. పాతపదాలకీ, ఊహలకీ చిత్రికలు పట్టి- ప్రేయసి మెల్లకన్నులమీద పద్యాలు అల్లుతున్నారు.

పాతపదాలూ,డిక్షన్, వర్ణనలూ, అలంకారాలూ, ఛందస్సూ, ఉపమానాలూ, పద్దతులూ, ఆచారాలు.. కవిత్వంలోవీ,జీవితంలోవీ..ఇంకా మళ్లీ లేవకుండా వాటి నడ్డి విరక్కొట్టాడు శ్రీశ్రీ.’

ఇది 1940లో చెలం శ్రీ శ్రీ మహాప్రస్థానానికి రాసిన ముందుమాట..

ఏమైనా మారిందా?

కవిత్వాలు రాసే వారి సంఖ్యకేమీ కొదువ లేదు.. కాని చెలం రాసినట్లు  పాత వాక్యాలకే నగిషీలు చెక్కీ చెక్కీ, పాతపదాలకీ,ఊహలకీ చిత్రికలు పట్టిన కవితల్లో జీవాన్ని, మట్టి వాసననూ వెతుక్కోవాల్సి వస్తోంది…

శ్రీశ్రీ కవితల్లో ఎక్కువవాటిలో పేర్కొన్న పద విన్యాసాల్నీ, శబ్ధ ఘోషనీ ధ్వనించమని చెప్పడం లేదు నేను. అప్పటి సామాజికావసరమూ, శ్రీశ్రీ నేపథ్యమూ ఇప్పుడు లేకపోవచ్చు..

కాని, మహాప్రస్థానంలో శ్రీశ్రీ ఆరవ కవిత ‘ఆకాశ దీపం’ చూడండి…

గదిలో ఎవరూ లేరు,
గదినిండా నిశ్శబ్దం.
సాయంత్రం ఆరున్నర,
గది లోపల చినుకుల వలె చీకట్లు…..

….
చూపు లేని చూపులతో తేరి

చూస్తున్నది గది

గదిలోపల ఏవేవో ఆవిరులు.
దూరాన నింగిమీద

తోచిన ఒక చుక్క
మిణుకు చూపులు మెలమెల్లగా విసిరి
గదిని తలపోతతో కౌగిలించుకొంటున్నది.

ఒక దురదృష్టజీవి
ఉదయం ఆరున్నరకు
ఆ గదిలోనే ఆరిపోయాడు.

అతని దీపం ఆ గదిలో
మూలనక్కి మూలుగుతున్నది.
ప్రమిదలో చమురు త్రాగుతూ
పలు దిక్కులు చూస్తున్నది.
చీకటి బోనులో
సింహములా నిలుచున్నది.

కత్తిగంటు మీద
నెత్తుటి బొట్టులాగున్నది.
ప్రమిదలో నిలిచి
పలు దిక్కులు చూస్తున్నది దీపం.

అకస్మాత్తుగా ఆ దీపం

ఆకాశతారను చూసింది

రాకాసి కేకలు వేసింది.

అలిసిపోయింది పాపం, దీపం.
ఆకాశతార ఆహ్వానగానం చేసింది.
దీపం ఆరిపోయింది.
తారగా మారిపోయింది.

ఆ దురదృష్టజీవి, అభాగ్యుడెవరు…ఎందుకు మరణించాడు.. ఏ లక్ష్యం కోసం మరణించాడు..  కత్తిగంటి మీద నెత్తుటిబొట్టులా వెలుగుతున్న, చీకటి బోనులో సింహంలా నిలుచున్న అతని దీపం కోసం ఆకాశ తార ఆహ్వానం ఎందుకు పలికింది? అది తారగా ఎందుకు మారింది? అది సామాన్య దీపం కాదు.. అతడిది సామాన్య మరణం కాదు. ఆ మరణ రహస్యం శ్రీశ్రీకే తెలుసు.   అతడి కవిత్వం మనను ఆ రహస్యం అర్థం చేసుకొమ్మంటుంది..

ఆధునిక వచన  కవిత్వానికి నిజానికి ఈ కవిత  నాంది పలికింది. మహాప్రస్థానంలో భిక్షువర్షీయసి, బాటసారి లాంటి కవితలు కూడా ఇదే మాదిరి మనముందు జీవన దృశ్యాల్ని నడిపించినా ఆకాశ దీపం కవిత్వంలోని ప్రాణాన్ని వెలిగించింది.

ఇది 85 ఏళ్ల క్రితం 1934లో రాసిన కవిత.

ఇవాల్టి కవుల్లో ఎందరు కవిత్వంలోని ప్రాణాన్ని అంతర్లీనం చేసుకోగలిగారు?

ఒక్కో సారి దుఖమేస్తుంది.

అయినా..

ప్రవాహాలు ఎక్కడికక్కడే ఆగిపోయినా.. కొన్ని నదులు అంతర్ధానమయినా, కొన్ని దీపాలు తారలుగా మారినా, తమలోని జల ఉబికేలా చేసుకున్నవారు నాకు జీవితంపై ఆశ రగిలిస్తారు. నేను సీనియర్ కవుల గురించీ, రాస్తూనే ఉన్న కవుల గురించీ మాట్లాడదలుచుకోలేదు. వారిలో కొందరు ప్రవహిస్తూనే ఉన్నారు. కొందరు ఎండమావులుగా మారారు. కొందరి తడి ఇంకిపోయి చాలా కాలమైంది.

లైన్లలో విభజించిన పదాల్ని వరుసగా పేరిస్తే వాక్యంలా మారే కవుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు.

కవిత్వాలు సామాజికమా, ఆత్మాశ్రయమా అన్న చర్చకు నేను పోదలుచుకోలేదు.

ఉన్నట్లుండి పొడవాటి పూలజడ విసురుగా ముఖానికి తగిలినట్లు, వెనక్కు తిరిగి ఎవరో మనను వెనుదిరిగి క్రీగంట నిశ్శ్దబ్దంగా  పలకరించినట్లు, అందమైన నవ్వు గుండెలో కలతలు రేపినట్లు, మేఘం సముద్రాన్ని పలకరించినట్లు కవిత్వాలు రాసే వారున్నారు. ఒక భావాన్నీ, ఒక జ్ఞాపకాన్నీ, ఒక వస్తువును విషయంగా తీసుకుని మన గుండెలో అలజడి చేసేవారెందరో ఉన్నారు.

అంతేకాదు,  అన్నం కుతకుత ఉడికినట్లు,  అకాల శిశిరంలో ఆకుల శిరస్సులు రాలినట్లు, కాళ్లకు నేలతల్లి కన్నీరు తాకినట్లు, గుమ్మం ముందు రెక్కలు తెగిన పావురంలా న్యూస్ పేపర్ కాగితాలు కొట్టుకుంటున్నట్లు, గడియారపు ముల్లుకు రక్తం అంటినట్లు కవిత్వాన్ని రాసేవాళ్లున్నారు. అక్షరాలతో నిప్పుల్ని రాజేసి గుండెను మండింపచేసేవారెందరో లేకపోలేదు.

ఈ తేడాలపై చెలం ఎప్పుడో చర్చించాడు.. నేను చర్చించనక్కర్లేదు.

నాకు జీవితం మీద ఆశ రగిలించిన కవుల గురించే మాట్లాడతాను.

మట్టి అంటిన పాదాలంటే నాకెంతో ఇష్టం. వాటిని స్పృశించాలనిపిస్తుంది.

ఒక కవి నాకు  పరిచయం అవుతూనే వానాకాలం పెంకుటిళ్లలో పై కప్పులనుంచి నత్తల బిందెలనుంచి ధారలుగా కారుతున్న వర్షపునీళ్లతో నన్ను తడిపాడు.

గూట్లో పిల్లలు రెక్కలు సర్దుతూ సడి చేస్తున్న తల్లి కాకి, వీధి సందుల్లోంచి కుక్కల మూలుగు, కాలువలోంచి కప్పల బెకబెక, కీచురాళ్ల రొద మధ్య బొటన వేలు తెగినా పట్టించుకోని తల్లి పొయ్యి మీంది దింపిన అన్నంతో నా కడుపు నింపాడు.

మట్టి పొరల్లోంచి ఉబికే వాసనను ఆఘ్రాణింపచేశాడు. పిర్రలపై నిక్కరు లాక్కుంటున్న బుడ్డోడి ఆకలిని గుర్తు చేశాడు.

ఒక్క మాటలో చెప్పాలంటే అతడు ప్రతి రాత్రీ ఊరునూ కలలోకి తీసుకువస్తున్నాడు. నీరులేని కళ్ల నదులు మనవైపే చూసేలా చేస్తున్నాడు.

అతడు బాలసుధాకర్ మౌళి. అప్పుడే ప్రసరిస్తున్న వెన్నెలను శిరసున నిలిపిన వాడు.

తాజాగా విడుదలైన అతడి ‘నీళ్లలోని చేప’ చదివినప్పుడల్లా మన హృదయ తటాకంలో ఒక చేప అందంగా, దిగులుగా,అన్వేషిస్తూ కదులుతున్నట్లనిపిస్తుంది.

ఇంకెందరు కవులున్నారో నా ప్రాణాలు నిలపడానికి.. అన్వేషిస్తూనే ఉన్నాను. తగుల్తూనే ఉన్నారు.

‘పొద్దున్నే పొలం వెళ్లే మానాన్న శిరస్సున కిరీటంలా అమరిపోతాడు సూర్యుడు’ అంటాడు వెంకటేశ్ పైడికొండల అనే కవి.

‘పొరలుపొరలుగా భూమిలోకి వర్షపు నీరింకినంత సునాయాసంగా మాయమైపోవడం ఆమెకు కొత్త కాదు..’ అన్నది మెర్సీ మార్గరెట్ .

 ‘పియానో మెట్లనుండి, చిరిగిన పరదాసందుల్లోంచి, సీతాకోక రెక్కల మీదుగా తప్పించుకుని పైపైకి పాకుతూ వస్తుందో రాగం, కనపడి వేళ్ల క్రిందపడి మనసు నలిగిపోతుంది; అని చెప్పింది మానస చామర్తి.

‘అందరి గోడలమీదా అతడి ఉత్తరం నిరసనై వేళ్లాడుతుంది..’ అన్నాడు కోడూరి విజయకుమార్.

‘కవిత్వమొక తీరని దాహం’ అని శ్రీశ్రీ అన్నట్లే ‘కవిత్వమొక తీరని దూప’ అంటాడు రవీందర్ వీరెల్లి .

‘డైరీలో నువ్వు రాసిన తడిఅక్షరాలు నాకళ్ళ ముందు కూర్చోని మాట్లాడుతుంటే
ఏడ్వకుండ ఎట్లా ఉండాలిరా?’ అని ఏడిపిస్తాడు తగుళ్ల గోపి.

‘నిద్రాసముద్రాల్లో ఈదులాడే ఎందరి  కలల్లో ఆకాశం ఒడ్డుకు చుక్కల్లా విసిరేసి చెట్ల నీడల్లో మౌన చిత్రాల్ని రచిస్తున్నట్లుంది..’అంటారు మట్టి పొత్తిళ్ల హరగోపాల్.

‘తగలబడుతున్న దేహాల నెత్తుటి వాసనలని మోసుకొస్తున్నప్పుడు పడమటి గాలికే కాదు నాక్కూడా నిద్రపట్టదు.  అది నిటారుగా నిలుచున్న శిఖరాగ్రాన్ని కూడా కూల్చేస్తుంది’ అంటాడు ఇబ్రాహీం నిర్గుణ్.

‘విత్తనంతో పాటు మట్టిలో పాతుకుని చుక్క నీటికోసం రెప్పలక్రింద ఆకాశాన్ని నిలబెట్టుకుంటాం’ అని అంటాడు‘పారిపోలేం’ కవి అద్దేపల్లి ప్రభు.

‘తడబడుతూ నడిచిన అడుగుల నేలంతా యుద్దభూమి రక్తచారికల వాసనింకా దూరం నుంచి వీస్తూనే ఉంది.’. అన్నాడు అనిల్ డ్యానీ.

ఇంకేందరున్నారో తెలియదు. తెలుసుకోవాలి.. ఉన్నవాళ్లంతా ఇంకిపోకూడదనే నా ఆశ.

ఒక స్తబ్దత ఏర్పడ్డల్లా ఒక తుఫాను దూసుకువస్తుంది.

‘బానిసల సంకెళ్లు బిగిసే పాడుకాలం లయిస్తుందా..’అన్న ప్రశ్న శ్రీశ్రీకే కాదు మనకు కూడా ఇప్పుడు కలుగుతోంది. శ్రీశ్రీ కి జీవితంలో విరక్తి కలగలేదు.

అభ్యుదయ కవులకూ, దిగంబర కవులకూ, విప్లవ కవులకూ కలగలేదు.

నేటి కవుల్లో కొందరు నాక్కూడా విరక్తి కలగకుండా చేస్తున్నారు..

ఎవరో వారు

నడిచి, నడిచి

ఎంతో దూరం వెళ్ళినా

వీపు వెనుకే

ఉన్నట్లున్నారు

ఎవరో వారు

కనురెప్పలపై కూడా

కనబడుతున్నారు

వేనవేల అనుభవాలు గడిచినా

మనసు పాదాల్ని పట్టుకు

లాగుతున్నారు

ఎవరో వారు

ప్రళయ ఘోష లోనే కాదు

నీరవ నిశ్శబ్దం లో కూడా

లొల్లాయి పాటలా

గుండె తడుతున్నారు

మరిచిపోని నినాదమై

శరీరాన్ని పిడికిలి చేస్తున్నారు

ఎవరో వారు

నేనెవరో నాకు చెబుతున్నారు

అమ్మ బువ్వ రుచో,

నాన్న చెమట తడో తెలియదు

ఆకాశం పై కాలు మోపినా

నేల వాసన నన్ను వీడదంటున్నారు

వారికి నా దండాలు

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ వ్యాసంలో నేనిష్టంగా చదివే అందమైన కవితలు రాసే మానస చామర్తి పేరు చూసి చాలా మురిశాను. మంచి కవులని, వారి కవితలని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు.

  • ఇలాగే మరిన్ని అద్భుతమైన వాక్యాలను పరిచయం చేస్తూ ఉండండి. చాలా బాగా రాసారు.

  • సార్.. ఇప్పుడు చూశాను..🙂 చాలా ఆనందం వేసింది.

  • సర్..మీరు బాగా చదివారు కాబట్టి బాధపడుతున్నారు. మేం చదువం కాబట్టి ఇలాగే రాస్తాం..ఇకపై మీ ఇష్టం.

  • ఇంత ఆలస్యంగా చూసి స్పందిస్తున్నందుకు మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయాను

    Thank You So Much Sir!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు