జీవితం మీద ఆయనకి ఫిర్యాదులు లేవు!

జనవరి 18 ప్రముఖ అభ్యుదయ కవి, రచయిత, ఉద్యమజీవి కౌముది వర్ధంతి

1

ప్పుడెలా వుందో తెలియదు చింతకాని!

ఖమ్మం పక్కన చిన్న వూరు చింతకాని. ఆ రోజుల్లో చింతకాని స్టేషనులో పాసింజరు రైలు దిగితే వూళ్ళో నడిచి వెళ్లడానికి అర గంట పట్టేది. ఆ స్టేషను నించి వూరి నడి బొడ్డు – పీర్ల చావిడి- దాకా వెళ్తే మధ్యలో వొక పల్లెటూరి బతుకు ఎట్లా వుంటుందో అది అంతా అద్దంలో కనిపించినట్టు కనిపించేది. ఆ ఎగుడు దిగుడు బాటలు, అక్కడక్కడా విసిరేసినట్టుండే ఇళ్ళు, అనేక ఏళ్ల చరిత్ర భారంతో వంగిపోయినట్టున్న పెద్ద పెద్ద చింత చెట్లు, రాగి చెట్లు, మధ్యలో రామయ్య బావి, సీతమ్మ దిబ్బ….అబ్బాని తలుచుకున్నప్పుడల్లా ఈ పొడుగాటి బాట గుర్తొస్తుంది. సాయంత్రం బడి నించి వచ్చాక, రోజూ ఆ స్టేషను దాకా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం, నేనూ అబ్బా.

స్టేషనుకి చేరాక అప్పటికే ప్లాట్ ఫారం బెంచీల మీద ఇంకో ముగ్గురు నలుగురు టీచర్లు ఆయన కోసం ఎదురుచూస్తూ వుండే వాళ్ళు. అక్కడ బెంచీల మీద కూర్చోనో, ప్లాట్ ఫారం మీద నడుస్తూనో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు నేను స్టేషను ఆఫీసులో బెంజిమన్ మాస్టరు గారితో ఆయన యంత్ర సామగ్రితో ఆడుకుంటూ వుండే వాణ్ని. వొక గంటా, గంటన్నర తరవాత మేము ఇంటి ముఖం పట్టేవాళ్లం. ఈ మొత్తం దినచర్యలో నేను చాలా ప్రశ్నలు రువ్వుతూ వుండే వాణ్ని. కొన్ని మాటలు, కొంత మౌనం. కొన్ని ఆటలు, కొంత అల్లరి. కానీ, ఈ బాల్య అనుభవం వొక పునాది తరవాత నేను చేయబోయే రహస్య సాహిత్య ప్రయోగాలకు! అప్పటికే అబ్బా అనువాద నవల “కళంకిని” (1973) అచ్చయి, తెలుగు సాహిత్యలోకం ఆయన వైపు అబ్బురంగా చూడడం మొదలెట్టింది. వొక రచయిత విజయాన్ని కళ్ళారా చూడడం, చెవులారా వినడం అదే మొదలు నాకు.

చింతకాని స్కూల్లో అబ్బాజాన్ “మధురవాణి” అనే వొక గోడ పత్రిక నడిపే వాళ్ళు. అది రెండు నెలలకి వొక సారి దినపత్రిక సైజులో నాలుగు పుటలుగా స్కూలు లైబ్రరీలో అతి విశాలమయిన బోర్డు మీద అందమయిన ఆయన చేతిరాతతో దర్శనమిచ్చేది. టీచర్ అంటే పాఠాలు చెప్పడం మాత్రమే కాదనీ, విద్యార్థిలో సృజనాత్మకత పెంచే బాధ్యత అని ఆయన భావించే వారు. “సార్ క్లాసులో కూర్చుంటే చాలు, వొక్క సారి వింటే అదే మెదడులో నిలిచిపోతుంది,” అని విద్యార్థులు ఆయన గురించి గర్వంగా చెప్పేవాళ్ళు. కానీ, అక్కడితో ఆగకుండా ఆయన ఎంతో కొంత భాషా ప్రేమ, సాహిత్య సంస్కారం పెంచాలన్న దృష్టితో “మధురవాణి” మొదలు పెట్టారు. ఇందులో కేవలం విద్యార్థుల రచనలు మాత్రమే వేసే వాళ్ళు. వాటిని ఆయనే కొంత ఎడిట్ చేసి, ఆ దిన పత్రిక సైజు పోస్టర్ల మీద రాసే వారు. “సారు చేతిరాత కోసమే చదువుతున్నాం ఇది,” అని విద్యార్థులు అనే వాళ్ళు. ఆలోచనలు ఎంత ముఖ్యమో, చేతిరాత అంత ముఖ్యమని ఆయనకి పట్టింపు వుండేది. విద్యార్థులని దగ్గిర కూర్చొబెట్టుకుని, వాళ్ళ దస్తూరి దిద్దబెట్టే వారు ఆయన- ఈ “మధురవాణి” పత్రిక గోడమీద పెట్టే రోజుల్లో నేను అయిదో తరగతి. ఆ పత్రికలో నా రచన కనిపించాలని నా పట్టుదల. కానీ, అబ్బా వొక పట్టాన వాటిని వొప్పుకునే వారు కాదు. చాలా సార్లు తిరగరాయించేవారు. నిర్మొహమాటంగా నిరాకరించే వారు. అక్కడ వున్న కాలంలో “మధురవాణి”లో నేను అతికష్టమ్మీద వొక గేయం, వొక కథ మాత్రమే చూసుకోగలిగాను. కానీ, రచయితగా అది నాకొక ప్రయోగ శాల అయ్యింది, చాలా ప్రయోగాలు విఫలమయినా సరే!

ఇక ఇంటి విషయానికి వస్తే, పీర్ల చావిడి పక్కనే, మా ఇల్లు వుండేది. మా ఇల్లు అంటే కిలారు గోవింద రావు గారి ఇల్లు. ఆ రెండు గదుల ఇంట్లో తొమ్మిది మంది వుండే వాళ్ళం. దానికి తోడు, ఎప్పుడూ నాన్నగారి ఎవరో వొక సాహిత్య మిత్రుడు ఇంట్లో అతిధిగా వుండే వారు. వాళ్ళు మొదటి గదిని ఆక్రమించేస్తే, మేమంతా రెండో గదిలో ఇరుక్కుని వుండే వాళ్ళం. నేను మాత్రం మొదటి గదిలో ఆ సాహిత్య మిత్రుల సంభాషణలు వింటూ మూగిమొద్దులా కూర్చొని వుండే వాణ్ని. “ఒరే, నువ్వు కాస్త నోరు విప్పరా! నాకు భయమేస్తోంది నిన్ను చూస్తే!” అని వొక సారి దాశరథి గారు బయటికే అనేసి, నన్ను తన కుర్చీ పక్కన చేతుల్లోకి తీసుకుని, మాటల్లో దింపే ప్రయత్నం చేసే వారు. ఉర్దూ గజల్ వొకటి చెప్పి, దాన్ని నా చేత బట్టీ కొట్టించే వారు. అది నాకు ఎంతో వుత్సాహకరమయిన క్రీడ అయ్యింది. ఆ గజల్ రెండు పంక్తులూ నెమరేసుకుంటూ నేను, నా సొంత కవితలు కట్టే వాణ్ని. ముందు వాటిని పాడుకుంటూ తిరిగే వాణ్ని, నా స్నేహితులతో పాడించే వాణ్ని, ఆ తరవాత కాయితం మీద పెట్టే వాణ్ని. ఇదీ నా పాఠశాల!

ఈ మూడు భిన్న అనుభవాల కేంద్ర బిందువు అబ్బా. ఇక నిత్యనైమిత్తిక బతుక్కి వస్తే, ఆర్ధిక పరిస్తితులు బాగుండక, ఇంట్లో ఎప్పుడూ జొన్నన్నం, గోంగూర పచ్చడి మాత్రమే వుండేది. నెలకోసారి తెల్లన్నం, పావుకిలో మాంసం వండిన రోజు పండగలా వుండేది. కిలారు గోవిందరావు గారి ఇంటి నించి అప్పుడప్పుడూ కొంచెం ఎక్కువ పాలు, పెరుగు వచ్చిన రోజున అది మహాప్రసాదంలా వుండేది. కానీ, ఆర్థిక పరిస్తితులు బాగా లేవన్న బీద అరుపులు ఇంట్లో వినిపించేవి కావు. కొత్త పుస్తకాలు ఇంటికి వచ్చేవి, కొత్త కొత్త సాహిత్య మిత్రులు ఇంటికి వచ్చే వారు, చాలా కళకళలాడుతూ వుండేది ఇల్లు. “ఈ మాత్రం బర్కతు వుంది చాలు” అని తృప్తిపడేది అమ్మీ.

ఆ చిన్న వూళ్ళో మా చదువులు ఏమయిపోతాయో ఏమో అన్న బెంగతో కుటుంబాన్ని ఖమ్మం మార్చాలనుకున్నారు అబ్బా. చింతకాని, ఆ చుట్టుపక్కల వూళ్లలో ఈ విషయం తెలిసిపోయి, మా ఇల్లు వొక తీర్థ క్షేత్రమయ్యింది. ప్రతి వూరి నించీ విద్యార్థులు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులతో ఇరవైల, పాతిక సంఖ్యలో వచ్చి, అబ్బాకి నచ్చచెప్పే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వూళ్ళో పెద్ద పెద్ద రైతులు, నాయకులు ఖమ్మం జిల్లా పరిషత్తుకి వెళ్ళి అబ్బా బదిలీని ఆపడానికి ప్రయత్నించారు. కానీ, అబ్బా ఎవరి మాటా వినలేదు. చివరికి మాకు స్టేషనులో వీడ్కోలు ఇవ్వడానికి వూరంతా పెద్ద ఊరేగింపుగా స్టేషనుకు వచ్చింది, కళ్ల నీళ్ళు పెట్టుకొని!

2

“మీరు ఖిల్లాలోపల వుండాలి కౌముదీ సాబ్!”

అంటూ ఖమ్మం ముస్లిం మిత్రులు కొందరు ఖిల్లాలో చాలా చవకలో ఇల్లు చూపించారు. కానీ, అబ్బాకి అది ఇష్టం లేదు. “ఆ ఖిల్లా బంది ఖానా లా వుంది,” అనడం నాకు ఇప్పటికీ గుర్తు. కాంగ్రెస్ ఆఫీస్ వెనక ప్రసిద్ధ ఉర్దూ –తెలుగు రచయిత హీరాలాల్ మోరియా గారి ఇల్లు వుండేది. మళ్ళీ రెండు గదుల ఇల్లే, కానీ, చాలా పెద్ద ఆవరణ వుండేది. మోరియా గారు నామమాత్ర అద్దె మీద ఆ ఇల్లు మాకు ఇచ్చారు.

ఖమ్మం మా జీవితాల్లో పెద్ద కుదుపు. అబ్బా ఆలోచనల్లో కొత్త మలుపు. “సరిత” అనే టైటిల్ తో వొక సాహిత్య పత్రిక పెట్టాలని ఖమ్మంలో ఆయన “సాహితి ప్రెస్” పెట్టారు. ఖమ్మానికి ఆ ప్రెస్ అతి కొద్ది కాలంలోనే అదొక సాహిత్య కేంద్రంగా మారింది. కానీ, పత్రిక మొదటి సంచిక వచ్చే లోపలే, అబ్బా నష్టాల్లో కూరుకుపోయారు. ప్రెస్ నిండా మునిగింది, మేము అప్పుల్లో దిగడిపోయాం. ఆ తరవాత మా ఆర్థిక జీవనం మా చేతుల్లో లేకుండా పోయింది.

ఆ పరిస్థితుల్లో అబ్బా తెలుగు ప్రసంగాలు విన్న వొక క్రైస్తవ మిషనరీ ప్రచురణ సంస్థ ఆయన్ని వాళ్ళ తెలుగు విభాగం డైరెక్టరుగా ఆహ్వానించింది. మంచి జీతము, నాకు ఆస్ట్రేలియాలో కాలేజీ చదువుకి ఉపకారవేతనమూ ఆఫర్ చేసింది. “నా విశ్వాసాలకి దరిదాపుల్లో లేని ఏ పని నేను చేయలేను. పైగా, నా ఈమాన్ (faith) ని అమ్ముకోలేను,” అని అబ్బా ఖరాఖండిగా చెప్పడం నాకు గుర్తుంది. అబ్బా ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఆయన చిత్తశుద్ధీ, సిద్ధాంత బలమూ కనిపించేవి. ఆయన అరబ్బీ, ఉర్దూ, ఫార్సీ బాగా చదువుకున్నారు, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సంస్కృతంతో పాటు! ఇస్లాం, వేదాలూ, మార్క్సిజం కూడా బాగా చదువుకున్నారు, ప్రాచీన ఆధునిక సిద్ధాంతాలతో పాటు! కానీ, వీటిలో వేటికీ ఆయన పూర్తిగా తలవంచలేదు. “అవన్నీ కళ్ళు తెరిపించాలి కానీ, కళ్ళు మూయకూడదు, అవన్నీ తలలో వుండాలి, కానీ అవే తల చుట్టూ రోకలి కాకూడదు,” అనే వారు. అటు అమ్మీ తరఫునా, ఇటు అబ్బా తరఫునా మా కుటుంబానికి కమ్యూనిస్టు చరిత్ర వుంది. అట్లా అని, వీళ్ళెవ్వరూ ఇస్లాం కి దూరం కాలేదు, అవి వొకే వొరలో ఎట్లా ఇముడుతాయి అని కొందరికి ఆశ్చర్యం కలిగిస్తూ.

తాతయ్య గారు నిజాం కొలువులో పనిచేశారు. దానికి భిన్నంగా నిజాంకి వ్యతిరేకంగా ఆయుధాలు దూసిన కమ్యూనిస్టుల పక్షం వహించారు అటు అమ్మీ తరఫు వాళ్ళు, ఇటు అబ్బా తరఫు వాళ్లు కూడా! పార్టీ కోసం వున్నదంతా వూడ్చిపెట్టారు, బంగారం లాంటి ఇనామ్ భూముల్ని కూడా ఖాతర్ చెయ్యలేదు. తీవ్ర ఆర్థిక కష్టానష్టాల్లో వున్నప్పుడు, బాగా కోపం వచ్చినప్పుడు అమ్మి అప్పుడపుడూ అనేది, “భూములూ ఇళ్ళు వదిలేసి, మీ అబ్బా పుస్తకాల గోనె సంచి వీపునేసుకుని, బెజవాడ వెళ్ళిపోయారు, పార్టీ కోసం!” అని. ఇంతా చేస్తే, అమ్మి కుటుంబం కూడా పార్టీ కోసం చివరి బంగారపు తునక కూడా ఇచ్చేసిన వాళ్ళే! పార్టీ రెండుగా చీలిపోయాక తమ ఇల్లే వాటాలు పడి, చీలిపోయినంత క్షోభ పడ్డారు, ఆ క్షోభ అబ్బాని చివరి దాకా వెంటాడుతూనే వుండింది, ఇలా మిగలాలా అని!

3

“షంషుద్దీన్, నువ్వు రచనని అంతగా పట్టించుకోవడం లేదు. నువ్వు చాలా రాయగలవు. రాయాలి,”

అని అబ్బా బాల్యమిత్రులు, ఆనక బంధువులూ అయిన హనీఫ్ పెద నాన్న గారు ఎప్పుడూ అబ్బాని కోప్పడుతూ వుండే వారు. రచయితగా ఆయన ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయిందని ఆయన మిత్రులు చాలా మంది ఇప్పటికీ అంటూ వుంటారు. ఆయన రచనలు ఇప్పుడు పెద్దగా అందుబాటులో లేకపోవడం మా దురదృష్టం. ఆయన 1960 నించి 1975 వరకూ విశాలాంధ్ర, యువజన, ప్రగతి, జనశక్తి, ఆంధ్రజ్యోతి పత్రికల్లో

విస్తృతంగా సమీక్షలూ, కవిత్వం, కథలూ రాశారు, అనువాదాలు చేశారు. అభ్యుదయ రచయితల సంఘం ప్రచురించిన ప్రతి ప్రత్యేక సంకలనంలోనూ ఆయన కవిత్వం కనిపిస్తూనే వుండేది. కానీ, ఇదంతా నాకు రచయితగా వూహ తెలియని వయసు ముందే ఎక్కువగా జరిగాయి. బడి పంతులు బదిలీల బతుకులో వొక వూరంటూ స్థిరం లేకపోవడంతో చాలా రచనలు పోయాయి, ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి చాలా రచనలు దగ్ధం అయ్యాయని పెద నాన్న గారు అంటూండే వారు. ఇప్పుడు మిగిలిన కొన్ని కవితలయినా పెద నాన్నగారు తన ఇంట్లో భద్రపరచిన నోట్ పుస్తకాల నించి తీసినవి కొన్ని, కవితలు. నేను అక్కడా, ఇక్కడా తీసి దాచిపెట్టినవీ ఇంకొన్ని, ఇప్పుడు ఖాదర్ బాబాయ్ కొత్తగా సేకరిస్తున్నవి కొన్ని.

1975 తరవాత రచనకి సంబంధించి అబ్బా దృక్పథంలో చాలా మార్పు వచ్చింది. “నాకు ఎందుకో చదవడంలో వున్న ఆనందం, రాయడంలో దొరకడం లేదు,” అనే వారు చాలా సార్లు. “అది రాయకుండా వుండడానికి వొక మిష మాత్రమే!” అని నేనొకటి రెండు సార్లు అన్నాను కూడా! కానీ, పార్టీ చీలిక ఆయన మీద గాఢమయిన ప్రభావం వేసిందని నాకు గట్టిగా అనిపించేది. అట్లా అని, పార్టీ పట్ల ఆయన నిబద్ధత ఏమీ తగ్గలేదు. ఖమ్మం వచ్చాక ఆయన అరసం సాహిత్య సమావేశాల్లో, సభల్లో నిమగ్నం అయ్యారు. అరసం అధ్యక్షుడిగా ఆయన ఖమ్మం జిల్లాలో చేసిన కృషి చిన్నదేమీ కాదు. మారుమూల పల్లెలో ఎక్కడ ఏ కవి, ఏ రచయిత దాగి వున్నా, ఖమ్మం పట్టుకొచ్చి, వేదిక ఎక్కించి, వాళ్ళ రచనల్ని తానే పత్రికలకి కూడా పంపించి, అదొక ఉద్యమంగా చేశారు. బెజవాడ, హైదారాబాద్, వైజాగ్ లాంటి సాహిత్య కేంద్రాలతో ఖమ్మంని అనుసంధానించి, ఖమ్మం జిల్లా సాహిత్య ఆవరణని పెంచారు. ఆ తీవ్రత చూస్తూ, “నువు కావ్యకర్తవి కావాలి కానీ, కార్యకర్తగా మాత్రమే మిగలకూడదు,” అని హనీఫ్ గారు గట్టిగానే మందలించే వారు.

ప్రజా నాట్య మండలి, అరసం వారసత్వ ప్రభావం వల్ల తానే వొక ఉద్యమంగా వుండడం, నిరంతరం జనంలో పని చెయ్యడం ఆయనకిష్టమయ్యింది. అక్షరదీపం కార్యక్రమం మొదటి సారి ప్రవేశపెట్టినప్పుడు, ఖమ్మం జిల్లా మారుమూల పల్లెల్లోకి ఆయన ఆ దీపాన్ని పట్టుకుని నడిచారు. రోడ్లు దిగని సర్కారీ జీపులకి సైతం పల్లె బాట చూపించారు, జీపు వెళ్లని చోటికి కాలి నడకన వెళ్ళి, తరగతులు నిర్వహించారు. నిరక్షరాస్యుల కోసం కథలూ, పాటలు రాసి, రాయించి, వాటిని పల్లెల్లో మార్మోగేట్టు చేశారు, ఆ క్రమంలో ఆయన ఆరోగ్యం దెబ్బ తినడం మొదలయ్యింది. దీనికి తోడు కుటుంబ ఆర్థిక పరిస్థితులు నానాటికీ దిగజారడం మొదలయ్యింది. నా చేతికి డిగ్రీ రాక ముందే, నేను వుద్యోగంలోకి వెళ్లాల్సి వచ్చింది. దిగువ మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే కష్టాలన్నీ వొక్క పెట్టున దాడి చేశాయి.

పరిస్తితులు ఎటు తిరిగి ఎటు వచ్చినా, ఇంట్లో సాహిత్య వాతావరణం మాత్రం స్వచ్ఛంగా అలా మిగిలిపోయింది. అన్ని పని వొత్తిళ్ల మధ్యా, ఈతి బాధల మధ్య కూడా అబ్బా కనీసం అయిదారు గంటలు పుస్తక పఠనంలో గడిపే వారు. ముందు గదిలో పడక్కుర్చీలో అలా పుస్తకం ముందు విధేయంగా వుండే వారు. “నేను పాఠకుడిని మాత్రమే!” అని నిర్ద్వంద్వంగా చెప్పే వారు. “వొక గంట రాస్తే బాగుంటుంది” అనే వాణ్ని. కానీ, ఆయనలోని రచయితని ఉత్సాహ పరచడం అంత తేలిక కాదు. ఆయనలోని వొక పర్ఫెక్షనిస్ట్ ఎప్పుడూ ఆయనకి అడ్డంకి. “రాస్తే ఇట్లా రాయాలి,” అని కొన్ని ఉదాహరణలు చూపించేవారు. రచయితగా ఆయనకి అలాంటి ఆదర్శాలు కొన్ని వుండేవి, అవి ఎన్నడూ వాస్తవికతతో రాజీ పడేవి కాదు. ఆయన ఉదాహరించే రచయితలు అటు సంస్కృతం నించి ఇటు ఆంగ్లం వరకూ వాళ్లు తెలుగులో అనువాదాలకయినా లొంగని శక్తిమంతులే, కానీ – “నిజమే కావచ్చు, కానీ, వాళ్లెవ్వరూ మీరు మాత్రమే రాయాల్సింది రాయలేరు కదా?!” అనే వాణ్ని నేను. అదే దశలో ఆయన మళ్ళీ పత్రికా రచయితగా మారడం వల్ల రచనా వ్యాసంగం వేరే దారికి మళ్ళింది. తరవాత హిందీ ఉర్దూ నించి అనువాదాల కోసం ఎన్ని ప్రచురణ సంస్థలు అడిగినా, ఆయన వొప్పుకోలేదు. “అనువాదం అనేది వొక వ్యసనం. అలవాటు పడితే, అందులో కూరుకుపోతాం. రాయగలిగితే, ఎప్పటికయినా సొంత రచనే చెయ్యాలి. వొక బృహత్తరమయిన నవల రాయాలి,” అనే వారు. ఆ నవల రాసే రోజు రాలేదు, ఈలోపు ఆయన ఆరోగ్యం క్షీణించింది. కనీసం రెటైర్మెంట్ వయసు కూడా రాక ముందే, ఆయన కన్ను మూశారు.

ఆయన రచయితగా రాయాల్సినంత రాయలేదని మా అందరికీ అసంతృప్తి తప్ప, ఆయన మటుకు ఆయన సంతృప్తిగా జీవించారనే నాకు అనిపిస్తుంది. జీవితం మీద ఆయనకి ఫిర్యాదులు లేవు. అది తిరిగిన అన్ని మలుపులూ ఆయనకి తెలిసినవే, అవి ఆయనకి అపరిచితమయినవీ, ఆశ్చర్యకరమయినవీ కావు. అటు రచయితగా, ఇటు వ్యక్తిగా కూడా తన అర్ధాంతర నిష్క్రమణ అబ్బాకి ముందే తెలుసేమో అని చాలా సార్లు అనిపిస్తుంది నాకు. కనీసం అట్లా అనుకొని తృప్తి పడడం మినహా మేం చెయ్యగలిగిందేమీ లేక పోయింది!

*

అఫ్సర్

8 comments

Leave a Reply to భాస్కర్ పులికల్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ అబ్బా గారి గురించి వ్రాసిన మీ మాటలు మీ గుండెలోనుంచి వచ్చినందువల్ల , ప్రతీ పాఠకుడిని కదిలించి వేస్తుందని నా నమ్మకము. చాలా మంది పుంఖాను పుంఖాలుగా వ్రాస్తే, మీ అబ్బా లాంటి వారు ఆచి తూచి గొప్ప రచనలు చేస్తారు…అదీ తన ఆత్మ సంతృప్తికే, పది మంది మెప్పుకోసం కాదు. వారి మిగిల్చిన రచనలు వారి గొప్పదనానికి మచ్చుతునకలు. కానీ మీ లాంటి అనేక మందికి చిన్నప్పుడే సాహిత్యం మీద ప్రేమ కలిగించడం కంటే గొప్ప పని ఏముంటుంది? ఆ విధంగా ఆయన స్ఫూర్తి ద్వారా వ్రాస్తున్న వారి రచనలు లో ఆయన కనిపిస్తూనే ఉంటారు. అలా ఆయన అమర జీవులే. ఆయన జీవించిన విధానికి, సాహిత్య కృషికి నా జోహార్లు 🙏

  • జ్ఞాపకాల సంచిలోంచి కొన్ని పాఠకుల కోసం

  • కౌముది గారి గురించి వినటమే కానీ
    ఇవాళ మీ వ్యాసంతో ఆయన్ని చూసినట్టనిపించింది.
    ఆయన మీరు రాయాలని కలగనుంటారు అఫ్సర్ గారు
    చాలా చాలా కృతజ్ఞతలు 🙏

    • మన బెజవాడ రేడియోతో ఆయనకి చాలా అనుబంధం వుంది. సూక్తి సుధతో పాటు అనేక కార్యక్రమాలు చేశారు.

  • Mee balyam , Mee father gurinchi chala baga chepperu .Maku teliyani vishyaalu ivi .
    Sahityamlo kutumba varasatwam jeans tappakunda tarataraalu praptistae .Iete santananiki -leda grand children ki vastayani naku anubhavam .Tandrigarinunchi kodukki -kooturuku ravadam jarugutunna parnaamam.
    Mee rachanalu intakumundu teliyavu .Saranga channel dwara telyadam santosham .Great project Afsar garu!
    Annapurna.

  • ఆయన నిరాడంబరత నాకు బాగా నచ్చేది. అంతేకాకుండా.. ఆంధ్రజ్యోతి విలేకరిగా తన జూనియర్స్ ను నడిపించడంలో.. కదిలించడంలో.. వారికి జ్ఞాన బోధ చేయడంలో.. ఆయన సరైన గురువుగా కనిపించేవారు. నాకు గుర్తున్నంతవరకూ.. జర్నలిజంలో ఎంత ఎత్తుకు ఎదిగినా సంపాదించగలిగేది ఆత్మ తృప్తి తప్ప మరేమీ ఉండదని… ఆ రోజుల్లోనే చెప్పేవారు. గురుతుల్యుల జ్ఞాపకాలు నెమరేసుకోవడం చాలా ఆనందంగా ఉంది

  • ఒక గొప్ప జీవితం గురించి ఏంతో గొప్పగా చెప్పారు. ఎన్ని దొరికితే అన్ని ఆయన రచనలు వెలుగులోకి తీసుకురండి. సారంగ లోనే ఒక ఫీచర్ ల రెగ్యులర్ గా వెయ్యండి. ఆలస్యం చెయ్యకుండా అందుబాటులోకి తెండి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు