“ఓయ్యో, బర్రెగొడ్లు పొయ్యి మూడు రోజులయింది ఇంకా రాలేదు, ఒకసారి పొంగూరు చేలమీదుగా పొయ్యి చూసిరా, దొడ్లో ఎమన్నా కట్టేసిన్రో ఏమో” అని మా నాయన మా తాత్తో అంటుంటే కోడిపిల్లలకు సజ్జలేసేవాడ్నల్ల గిర్రున తిరిగినా. అప్పటికి ఓ వారం రోజుల నుండి చేల మీదకి పోవడానికి తెగ ప్రయత్నించి దానెమ్మ నాయాల్ది లే అని ఆసొదిలేసుకున్న నాకింతకంటే గొప్ప చాన్సు దొరకదని మా నాయిన బడికి పొయ్యేదాకా గమ్ముగుండి, తాత ఎమ్మటే పొయ్యి దఛ్చినపీది లో నా కంటే మొగోడు లేడని నిరూపించుకోవాలని , పొయినారం ఈ టయానికి జరిగిన అవమానం తిరిగిచ్ఛేయడానికి నిర్ణయించేసుకున్నా ఆ నిమిషం లోనే ..
అసలకి మందలేందనే గదా? ఆడికే వస్తుండ .
పల్లె టూర్లలో పిలకాయలకి ఆ రోజుల్లో యాడ్నో ఒక ఇంట్లో తప్పితే టీవీ లుండవు కాబట్టి సీసనుకొక ఆట రంగప్రవేశం చేసి అట్నే తిరిగిపోతుంటాయి .
ఒక సీసన్లో అగ్గిచెక్కులు, ఒక సీసను కు గోళీలాట, డబ్బా నిండేలోపు బిల్లం గోడి , బొంగరాలాట రుతువులు మారినంత సహజంగా జరిగిపోతుంటది ఈ తంతు అంతా .
అట్నే పొగాకు సీజను కు కొంచెం ముందు గా ఊళ్ళో పిలకాయలు చేల మీద పడతారు జీరంగి ల కోసం . జీరంగులు రెండు రంగుల్లో చూసేదానికి భలే ముచ్చటగా ఉంటాయి లే . ఒకటి ఎప్పుడూ బ్యాంకు తనకా లో ఉండి పండక్కి పబ్బానికి మా ఇంటి కొచ్చే మా నాయిన పచ్చరాయి ఉంగరం మెరిసినట్టు దొప్ప భలేగా మెరిసిపోతుంటే, ఇంకోటి మా ఊరి జెండామాను కి ఎగరతా ఉండే కెమినిస్టు జెండా రంగులో ఎర్రగా ఉంటది కానీ తల మాత్రం అదిగో పైన చెప్పినట్టు పచ్ఛంగా మెరుస్తుంటది. అంతందంగుండే రెక్కల కింద కొత్త పుస్తకాలకేసునే కాపీ కలరు మెరిక్కాగితం ఉన్నట్టు ఇంకో రెండు రెక్కలుంటాయి .ఏలిమీద పెట్టుకున్నప్పుడు ఎగిరేదానికి ఒక్కసారిగా రెక్కలు తెరిసినప్పుడే అయ్యి కనపడతయి. జీరంగులు కు పళ్ళోలు మీసాల సుబ్బరాయడు కున్నట్టు ముందు రెండు మీసాలుంటాయి నాకంటే మొగోడు లేదన్నట్టు .అసలు చెప్పాలంటే జీరంగి కంటే అందం గ ఇంకేముండదు . జీరంగులు ని పయిటేలప్పుడు అగ్గిపెట్టెల్లోంచి బయటకి తీసి అరుగు మీద తిరగతిప్పి పడుకో బెడితే గర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ అని సౌండు జేస్తా, ఎనిమిదో నెల పసిబిడ్డ ఏసినట్టు పైడిమానులు ఏస్తయి చూడు , అది చూడ్డం కంటే కుశాలేముండదు నాకసలు .
ఒకసారి మా ఇంటిపక్కనుండే సాయిళ్ల రమనన్న ని బతిమిలాడి బతిమలాడి ఒక్కసారి నా ఏళ్ల మీద పెట్టిచ్చుకున్న. అయ్యి ఆరు కాళ్లతో పాకుతుంటే భలే చక్కలిగిల్లు లే, దాన్నట్టనే నోరెళ్ళబెట్టి చూస్తుండగానే గర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ మని ఎగిరిపోయింది, మజ్జానం లెక్కల పిరిడ్లో ఒచ్చే ఇమానం సౌండు జేస్తా, ఇంగేముందా ఆ రోజుట్నించి చూసేదానిక్కూడా ఎవురూ జీరంగినియ్యరు నాకు.
జీరంగులు యాడ బడితే ఆడుండవు. తుమ్మ చెట్ల మీద మాత్రమే ఉంటయి. వాటికి మేత గ తుమ్మాకు మాత్రమే ఎయ్యాలి, ఊర్లో పెద్దోళ్ళు పొవ్వాకు ని ఎంత జాగ్రత్త గ చేసుకుంటారో సీజనోచ్చ్చేసరికి పిలకాయలు అంతకంటే జీరంగులని బాగా చూసుకుంటారు పిలకాయంటే మా వయసోల్లు కాదు ఆరో తరగతి ఎడో తరగతోళ్ళు. తిరనాళ్ళంతా వాళ్ళ కాడ్నే ఉండేది. నాకయితే వాళ్ళ ఎచ్ఛులు చూస్తే పట్టుకోని నూకబుద్ధి అయిద్ది కాని ఏం జేస్తమా ఏం జెయలేము. అన్నిటి కంటే ఆశ్చర్యం ఏందో చెప్పేనా? ఒక మూడు నాలుగు వారాలకి జీరంగులు గుడ్లు పెడతాయి. నాకు మాత్రం దానిని మించి బ్రమ్మాన్నమైన విషయం ఈ భూమ్మీద లేనే లేదసలు.
ఆ టైము లోనే మా క్లాసు లో ఒక రోజు ఒంటేలు బెల్లు కొట్టంగానే కేతిగుంట నాగేస్రావు చుట్టూ పిల్లకాయలు మూగుండడం చూసి ఎందాఁ అని చూస్తే, నా కళ్లు వెంకటేశు సినిమాలో అల్లా హీరోను మాదిరి ఇంత పెద్దయయినయి. రెండు జీరంగులు ..ఇంకేముందాఁ మొత్తం మీద నా కల నెరవేరేట్టుంది అనుకుని లోపలి బెల్లు కొట్టంగానే నాగేస్రావు దగ్గరికి పొయ్యి ఒక జీరంగి మీద చెయ్యి వెయ్యగానే తప్ అని ఒక దెబ్బెయ్యడం ,అందరూ పుసుక్కుమని నవ్వడము , ఆ నాయాలు పెద్ద పోటు మొగోడిలాగా అగ్గిపెట్టె తీసి జేబు లో పెట్టుకోవడమూ ఎమ్మటేనే జరిగిపోయినాయి.
అంతే …
అంత కంటే అవమానం ఇంకేం లేదు .
ఎంత అణుకుచున్న కంట్లోచి నీళ్లు ఆగకపోయె. “ఆ నాయాలు నాగేస్రావు ఎన్ని సార్లు కూడికలు తీసివేతలు నా నోడ్సులొంచి కాపీగొట్లా, ఎన్నిసార్లు పిచ్చ్చమ్మ అంగట్లో కొనుక్కున్న తిమ్మిరి పప్పరమెంటు అడిగితే ఎంగిలవద్దని చొక్కాలో మడిసి మరీ, కొరికి ఒక ముక్క పెట్టలా ?? ,“ అలాంటిది ఆ నాయలు మంచి సెడ్డున్నోడయితే అట్నేనా బళ్ళో అందరి ముందు నా పరువు తీసేదా?
ఎట్టయినా సరే నేంగూడా ఒక జీరంగి ని సంపాదించాలని ఇంటికి పొయ్యేదారిలో శిలమ్మ దగ్గరకి పోయి పదిపైసలు మొక్కుపెట్నా .
ఇంటికి పొయ్యి నీళ్లు నిప్పులు పోసుకోని మా యవ్వ తుడిసి తెచ్చిన లాంతరు ముందు పుస్తకం ఏసుకొని కూచ్చోనుండానే గాని మనసంతా జీరంగి మీదే . అస్లు అయినా జీరంగి మాత్రం యాడ్నో పచ్ఛేల దగ్గర తుమ్మచెట్ల మీద కాకుంటే ఇంటి ముందుండే చిటికేసరి చెట్టు మీదనో,తుర్రాయి చెట్టు మీదో ఉంటే దాని సొమ్మేం పోయింది. ఆ తర్వాతి రోజు నుంచి చేసిన ప్రయత్నాలేమీ ఫలించక ఆసొదిలేసుకున్న నాకు, ఇదిగో ఈ రోజు శిలమ్మ పున్నిమా అని మా నాయన మాటలు ఇన్నంక చిన్న కుశాల కాదు.
ఎట్టయినా చేలోకి పోయి జీరంగి తేవాలని డిసైడైపోయి పొయ్యి కాడ టకారు కిందున్న అగ్గిపెట్లో పుల్లల్ని జల్దారి గుంత లో పడేసి అగ్గిపెట్టెని రెడీ చేసుకున్నా.
మా నాయిన బయటికి పొంగానే ఆ మాట ఈ మాట జెప్పి మా తాత ని ఒప్పించడం ఎంత సేపా నాకా?
ఇప్పుడు మా తాత గురించి జెప్పాల
మా ఊళ్ళో అందరికీ రెండు పేర్లుంటయి. ఒకటి అమ్మా నాయన పెట్టిందయితే , ఇంగొకటి ఊరంతా పిలిచే మారు పేరు. మా తాతని ఊళ్ళో అందరూ పట్టపాయన అని పిలస్తరు . మా ఊళ్ళో కెల్లా ఫస్టుటైము మద్రాసు కెళ్ళింది మా తాతే అని, బాగా సంపాదించుకుని సుద్ధంగుంటే చూళ్లేక వాళ్ళక్క గయ్యాళి రంగమ్మ ఈడ పరిస్థితులేం బాగాలేవని అబద్దం జెప్పి తిరిగి ఊరికి రప్పిచ్చిందని, పట్నం పోయినాయన కాబట్టి పట్నంఆయన కాస్త పట్టపాయన గా మారిపోయిందని మా యవ్వ ఒకసారి జెపుతుంటే ఇన్నా.దఛ్చిన పీధి పిలకాలయలంతా పట్టపు తాత అని పిలస్తరు. నన్ను మాత్రం ఏ పనికిమాలినోడయినా పట్టపాయన మనవడు అంటే భలే సురుకొస్తది. అయినా అమ్మానాయిన పెట్టిన పేరుంటే మళ్లీ మారు పేర్లేంది ముడ్డి మీద తన్నే వాడు లేక అని అనుకునేవాడిని.
మా తాత మెరిట్ మిషను మీద మా యవ్వ కుట్టిన బన్నీను, పంచె కట్టుకోని పొద్దననంగా చద్దన్నం తిని దేలం కాడికి పొయినోడు మజ్జానం అన్నానికొస్తుంటే “ఓవ్వోవ్, తాతోస్తుండు అన్నం బెట్టు“ అని కేకాసేవాడిని, వరసందు లో కూచ్చొనున్నాకూడా, మా తాత చేతి కర్ర చేసే టక్కు టక్కు మని సౌండు గుర్తుపట్టి.
మా తాత చేతి కర్ర మాములు ఎదురు బొంగు. వాడి వాడి బొడిపెలు కూడా కాన్రాకుండా పొయ్యుదుకునే గొట్టం ఉన్నట్టు నున్నంగా ఉంటది. అప్పుడికీ మా తాతకి జెప్పిన “ ఈరాసామి చేతిలో వుండే నాగుపాము పడగ చేతి కర్ర తెచ్చుకోమని”. “నువ్వు పెద్దైనాక తీసిద్దువులేరా నా యబ్బా” అని తెగ్గొట్టేవాడు. ఇంక తాత తో పాటు పోవడానికి రెడీ అయ్యి ఇంటెనకాల వుండే సుబాబులు చెట్టు నరికి ఓకే కట్టె తెచ్చుకున్నా ఊతకి . మా తాత కట్టే టక్కు టక్కు మని పోతుంటే ఎనకాలే నేంగూడ . ఎర్రాగు దగ్గరికి పొయ్యేసరికి ఎవరో మొహం తెల్సి ,పేరు తెలీనామె యాడికి పట్టపాయనా మనవడిని తీస్కొని ఈ యాలప్పుడా అని అడిగింది ? ?
“నీ అబ్బడ గుద్దలోకిలే నువ్ పో , పట్టపాయనంట పట్టపాయన, బోడికత్తి కి “ అని నేననే లోపే
“ఓమ్మేయ్, గొడ్లు పోయినాయి, గెరిక చేలతట్టు ఎమన్నా చూసినావ?“ అని మా తాత అడిగిండు.
ఆమేం జెప్పిందో కూడా ఇనే ఓపికలేకపోయ నాకు ,
“ఓ తాతా, పోదం పాయా మజ్ఙానం అవద్దా “
“ఒరయ్యా, వాగు దాటేప్పుడు చెప్పులు తీసి చేతిలో పెట్టుకో”
“తాతో, నేను దాటలేను కానీ భుజాల మీద ఎత్తుకో “
నా యబ్బా, ఇంట్లో వుండగుడదంట రా , చెప్పిన మాటినే రకం కాకపోయ నువ్వు అంటానే భుజాల మీద వుండే టవలు నెత్తికి కట్టుకుంటా వంగిండు, నేను ఒక్క దుముకుతో పైకి ఎక్కినా. చేతిలో ఉన్న సుబాబులు కర్రను పట్టుకో మని మా తాతకిస్తే నీళ్లల్లో ఇసిరేసిండు ఇదొకడ్డం అంటా.
గెరిక చేలు స్టార్ట్ అయినంక యాడ గొడ్లు కనపడినా మా తాత పొయ్యి చూస్తుండు, నేను మటికి తుమ్మ చెట్లు ఎతికే పనిలోబడ్డా.
దారంతా చిన్న చిన్న ఛిట్ట్రేగి చెట్లు కరకంపకారి చెట్లు తప్పితే ఒక్క తుమ్మచెట్టు కనపడలా
దారిలో కనపడిన కుందేలుకొమ్ములు తుంచుకొని తింటావుంటే
గ్ర్ర్ర్ర్ర్ర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్…..
ఎనక్కి తిరిగి చూద్దునుగా ,
జీరంగి
గుండొక్కసారిగా దడ దడ లాడింది
రెక్కలేసుకుని గుర్అని నెత్తి మీదనుంచి ముందుకి పోతావుంది
యెట్టయినా పట్టుకోవాలని దానెనకాలే పడ్డా
దానికి తెలిసినట్టు ఎత్తుకెత్తు కు ఎగర్తా ఉంది. కొంచెం ఎత్తుకు పొయ్యేది ఎగిరి పట్టుకోబొయ్యేలోపల న చిటికినేలు తగిలి ఇంకా ఎత్తుకు పొయ్యి కటవ దాటి పోయింది .
మా తాత చిన్న పిల్లోడిలాగా కనిపించే దూరం కి పొయ్యి “ఓరయ్యా,రారా తొందరగానా పచ్ఛేల మీదగా బర్రె గొడ్లుముడాయంట చూసొద్దమా” అని కేకేసిండు.
ఛ, చిక్కినట్టే చిక్కి తప్పిచ్ఛుకునిందని ఇంకొంచెం ముందుకు పోయి చూద్దాం అనుకుని వెళ్తే పాపం మా తాత గెరికచేలు దాటినంక ఊరంతుండే మర్రి చెట్టుకింద కూర్చొని నా కోసం చూస్తావుండేవాడల్లా నన్ను జూసి లేచి నడవడం స్టార్ట్ చేసిండు
“ఓ తాతో , నాకు జీరంగి కావాలా .. “
“ఓ తాతో , ఇంటుండా “..
“నువ్వు రారా నాయనా..ఎండ చూడు ఎట్ట కాస్తుందో”
నిమ్మ చేలు దాటుకోని పొయినా గూడా యాడా తుమ్మ చెట్టనేది కనపడకపోయ
“ఓ తాతో, పచ్చేలు ఇంకెంత దూరముందా అనడిగినా “
“వచ్చిన్నంత దూరం వుంది బిన్నా నడువు” అని చేతికర్రాపేసుకొని పెద్ద పెద్దడుగులేస్తుండు
అట్నే కొంచెం దూరం పోతే నల్లంగా రేగడి తప్పితే ఒక చెట్టు లేదు
జీరంగులు దొరికేతట్టు లేవనుకొని ఎట్టయితే అట్టయింది లే అని మా తాత ని అడిగినా
“తాతా నాకొక జీరంగిణి తీసియ్యి ,బళ్ళో అందరి దగ్గరా ఉండయా “
“జీరంగులు ఈడ యాడుండయి రా తొడితోట్లో ఉంటయి గానీ “
“ఉంటయి తాతా ,ఇందాక గెరికిచేలకాడ ఒకటి జూసినానా .పట్టుకునేలోపు అందకుండా కటవ దాటిపోయిందా “ అన్నాకూడా ఇనపడనట్టుగా ముందుకు పోతానే ఉండు . ఎందుకో ఎనక్కి పొయ్యి ఇందాక కనిపిచ్చిన చోట ఎతికితే బాగున్ననిపించింది.
“తాతా నాకు దపీకేస్తుంది “
“నీ బండబడా ఇంటాపున ఉండ గుడుదంట రా ,ఇంకొంచెం ముందుకి పోతే తిరుపాలోళ్ళ కలుపు పీకతున్రు ఆడికి పోయి తాగుదువు ”
కొంచెం దూరం పోంగనే కూలీపనికి పొయ్యి వచ్చే వాళ్ళు ఎదురయ్యితే “వుమ్మే రేణం మంచిళ్ళు ఉంటే ఇయ్యండి ” అనడిగితే గోనిసంచి కి చుట్టున్న మంచిళ్లు బాటిలిచ్చిండ్రు .
నాలుగ్గుక్కలు తాగి రవ్వంత దూరం పొంగానే ఇంగ లాభం లేదని, ఎట్టయినా ఎనక్కి పోవాలనుకుని
“తాతా , నాకు కాళ్ళు నెప్పుడుతుండయి ఇంటికి పోదామా”.. అని అడిగిన
పొయ్యేతప్పుడు ఇందాక జీరంగి కనిపిచ్చిన చోట తుమ్మ చెట్లుంటాయేమో అని
ఆ మాటనేసరికి మా తాత కి బౌ కోపమొచ్చినట్టయింది
ఏం మాట్లాడకుండా ఎనక్కి తిరిగి నడవడం స్టార్ట్ చేసిండు
నేను అయన ఎనకాలే చప్పుడు చెయ్యకుండా అటూ ఇటూ చూస్తా నడస్తా ఉండా
ఎండ నడినెత్తి మీద కొచ్చిన జాము
మా తాత చేతి కర్ర సౌండు , కటవల్లోంచి కిర్రు పిట్ట సౌండు తప్పితే ఇంగేమీ ఇనపడటం లే
ఇందాక జీరంగి పోయినకాడికి వచ్చినంక దారిమల్లి కంప చెట్టులుండే కాడికి పోతే ఆడాడ తుమ్మచెట్లు
చుట్టూ చూస్తా ఉంటే ఒక తుమ్మ చెట్టు మీద ఒకటి, రెండు ,మూడు ,నాలుగు , ఓరీడెమ్మబడవ…నాలుగు జీరంగులు ఎండకి మెరిసిపోతా వుండాయి. నెమ్మది గా రెండుకాళ్ళెత్తి మునేళ్ళ మీద నించొని పచ్ఛ జీరంగు ఉండే కొమ్మ మీద వెలిసేలోపల గిర్రున ఎగిరింది
ఒక్కసారిగా గుండఁగెనంత పని అయింది
నాకు చేతికి అందటం లే
మా తాత యాడా ఆగకుండా ముందుకు పోయినోడు నన్ను చూసి ఏందో గొణుక్కుంటా ఉండు
ఇంకా లాభం లే
మా తాత దగ్గరికి గస పెట్టుకుంటా పోయినా
“ఓయ్యో, తుమ్మ చెట్టు మీద జీరంగులుండయి ,ఒక్క జీరంగి తీసిదిద్దువు రాయా నాకందటం లేదా “ అని అడిగినా
“నువ్ రారా అయ్యా పాపాలు తగల్తయా , నీతో సావైపోయిందా “
“బళ్ళో ఎవురికీ తగలని పాపాలు నాకేం తగలవు గాని నువ్ రాయా “
“నీ పాసుగాల , ఆ పురుగుల్ని ఇంటికి తీస్కొని పోతే మీ నాయన కొడ్తడు ,నువ్వొస్తవా నన్ను పొమ్మంటవ అనిండు చిరాకుగా “
సరే నీ చేతి కర్ర ఇయ్యా అని కర్రపట్టుకొని లాగితే చెయ్యిదిలిచ్చిండు
మా తాత మొహం మీద కోపం అట్నే తెలస్తావుంది
సరే ఏదయితే ఐయిందనీ మళ్ళీ ఎనక్కి లగెత్తుకుంటా పొయినా
తుమ్మచెట్టు మీదనే నాల్గు జీరంగులుండయి, అక్కం పక్కం కట్టెపుల్లలు గూడా లేకపోయే
నేను తెచ్చుకున్న సుబాబులు కట్టి వున్నా బాగుణ్ణు .
“ఓయ్యొ, ఒక్క జీరంగి తెసిద్దూవు రాయా, ఇంకెప్పుడూ ఏమడగనా” అని కేకేసి ఆడ్నే కింద కూర్చున్న
ఎర్రమట్టేడి కి కాళ్ళు, తొడలు కాల్తుండయి
మా తాత ని జూసిన ఎనక్కొస్తాడేమో అని, గట్టిగ కేకేసిండు “నేను పొయ్యి మీ నాయిని తోడుకొనొస్తా ఆడ్నే ఉండని “
నాలుగు జీరంగు లని ఒకసారి చుసిన
కళ్ళ నిండా నీళ్లు ఒక్కసారిగా
మా తాత నా తట్టు కూడా చూడకుండా ముందుకు పోతానే ఉండు
“ఓ తాతో…”
“ఓ వెంకట సుబ్బయ్యా …”
“నీ దూముతగల, ఓ పట్టపాయనా…” అని కేకేసినా చూల్లా
దారెమ్మట తాత కనపడనంత దూరం ఎల్లిపొయిండు
అంత భాద కు తోడు భయము తోడయింది
కన్నీళ్ల సందులోంచి చెట్టు మీద మసగ మసగ్గా కనిపిచ్చే నాలుగు జీరంగులని చూస్తా, ఒక్కసారి గట్టిగా మొదలకాడ పట్టుకొని ఊకించినా
గర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ అని నాలుగిమానాల సౌండు ఒకే సారి , నా ఏడుపు కేకలో కలిసిపోయె .
*
New way of story writing…!Congratulations karthik sir.
New way of story writing…!Congratulations karthik sir.
చాలా మంచి కథ.బాగుంది.నరెషన్ కొత్తగా ఉంది.యాస కథని నిలబెట్టింది.
అనిల్, ఈ కథకి తొలి రెవ్యూవర్ గా మీ ఫీడ్ బాక్ రచయితకి అందించాను. మీరు కథలకు ఫీడ్ బాక్ ఇవ్వడంలో కూడా ముందు వరసే! థాంక్ యు!
Anil Sir , Thank you very much for your feed back.
నేను రాసిన మొదటి కథ కి మీ స్పందన చాలా సంతోషం కలిగించింది.