జింబో హ్యూస్టన్ ప్రవేశం

వంగూరి జీవిత కాలమ్-69

1975 మార్చ్ నెలాఖరున చలికాలం ఆఖరి రోజుల్లో అమెరికా ఉత్తరాదిన ఉన్న చికాగో నుంచి ముగ్గురు మరాఠీలలాగా శాస్త్రీ, రఘు, నేనూ దక్షిణాదిన ఉన్న హ్యూస్టన్ నగరానికి శాస్త్రి కారులో బయలుదేరాం. నా ప్రాణాలకి అది ఇంచుమించు గుడ్డి వాడు ఏనుగును వర్ణించడం లాంటి ప్రయాణమే. చికాగోలో ఇంటర్ స్టేట్ హై వే  ఎక్కేసి సుమారు 16 గంటలు ఆగకుండా డ్రైవ్ చేసేస్తే హ్యూస్టన్ వచ్చేసినట్టే. అమెరికాలో తొలి సుదీర్ఘ కారు ప్రయాణానికి నాకున్న పరిజ్ణానం నిండు సున్నా. అసలు ఈ ఫ్రీ వే సిస్టమ్ తెలియదు, కారు డ్రైవింగ్ రానే రాదు, పెద్ద, పెద్దవి తప్ప చాలా రాష్ట్రాల పేర్లు, నగరాల పేర్లు తెలియవు. అప్పటి దాకా హ్యూస్టన్ అనే పేరే విన లేదు. కంప్యూటర్లు, జిపిఎస్ లూ లేని ఆ రోజుల్లో అందరి కార్లలోనూ ఆయా నగరాల మేప్ లూ, రాష్ట్రాల మేప్ లూ, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికీ వెళ్ళేవీ…ఇలా అంతా మేప్ ల మయమే. కారులో మేప్ లేక పోతే అంతే సంగతులు. ఇక ఆ మేప్ చదవడం కూడా బ్రహ్మ విద్యే, అది కూడా మనకి రాదు. అంచేత ఆ ప్రయాణం సుమారు 20 గంటలూ, డ్రైవింగ్, మేప్ చూడడం, మధ్యలో పెట్రోలు కొట్టించుకోవడం లాంటి కష్టాలు ఆ అన్నదమ్ములు శాస్త్రీ, రఘూ పడితే నా పని మటుకు మధ్యలో ఆగినప్పుడు ఏదో చిప్స్, బిస్కట్లూ, పిజ్జాయో తినేయడం… వాళ్ళకి కాలక్షేపం కోసం కబుర్లు చెప్పడం, జోకులు చెప్పడం నా పని.

ఆ రోజుల్లో భారతీయులు న్యూయార్క్, చికాగో, లాస్ ఏంజెలేస్ లాంటి నగరాలకే కానీ అమెరికాలో నాలుగో పెద్ద నగరం అయినా కూడా హ్యూస్టన్ కి వలస వెళ్ళడం చాలా అరుదు. దానికి కారణం ఆ రోజుల్లో టెక్సస్ అనగానే గుర్రాలు తోలుకుంటూ అధునాతన నాగరికతకి దూరంగా ఉండి “హౌడీ” అని పలకరించుకునే కౌబాయ్ రాష్ట్రం అనే చిన్న చూపు ఉండేది. కానీ పెట్రోలు నిలవలు బాగా ఉన్న రాష్ట్రం కాబట్టి అమెరికా అంతటా అక్కడి నుంచే ఆ సరఫరా జరిగేది. మిగతా అమెరికా ఆర్ధిక మాంద్యంలో ఉంటే టెక్సస్ మటుకు పెట్రోలు ఉత్పత్తి, చమురు శుధ్ది కర్మాగారాలు వలన ఆర్ధికంగా  పురోగమిస్తూ ఇంజనీర్లకి ఉద్యోగావకాశాలు బాగా ఉండేవి. మేము ఇక్కడికి  వచ్చినది కూడా అందుకే కదా!. మొత్తానికి ఇలినాయ్ (ఇలినాయిస్ కాదు)  రాష్ట్రం నుంచి బయలుదేరిన మేము సుమారు ఆ 20 గంటల ప్రయాణం లోనూ ఇండియానా, మిసోరి, ఆర్కన్సా  (ఆర్కాన్సాస్ కాదు) మొదలైన రాష్ట్రాలు దాటుకుని, దారిలో అక్కడక్కడా సేద దీర్చుకుని ఒకానొక శుభ ముహూర్తాన హ్యూస్టన్  దాకా వచ్చేశాం. అది ఏప్రిల్, 1975 మొదటి వారం..ఈ వ్యాసం వ్రాస్తున్న సమయానికి  సరిగ్గా 47 సంవత్సరాల క్రిందట.

కె.ఎస్. మూర్తి

వచ్చిన చిక్కల్లా…అంత పెద్ద హ్యూస్టన్ లోనూ మా కంటే నెల ముందు వచ్చిన బసంత్ పట్నాయక్ తప్ప ఒక్క మానవుడు మా ముగ్గురిలో ఎవరికీ తెలీదు. 20 గంటల కారు ప్రయాణం తర్వాత మొహాలు వాడిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో కారు ఎక్కడో ఒక గేస్ స్టేషన్ లో ఆగి ఆ బసంత్ పట్నాయక్ ఇచ్చిన ఇంటి ఫోన్ నెంబర్ కి ఫోన్ చేశాం. సెల్ ఫోన్లు, కార్ ఫోన్లు లేని ఆ రోజుల్లో పబ్లిక్ ఫోన్ బూత్ లు ఎక్కడబడితే అక్కడే ఉండేవి.  అందులో ఒక నికెల్..అనగా ఐదు పైసల బిళ్ళ వేస్తే 5 నిముషాలు మాట్లాడ వచ్చును.  అలా ఫోన్ చేయగా, చేయగా, మా దగ్గర ఉన్న ఇంచుమించు ఆఖరి  నికెల్ కి  రాత్రి తొమ్మిది సమయానికి ఆ పట్నాయక్ ఫోన్ లో దొరికాడు. తీరా చూస్తే “నాకు ఇంకా ఉద్యోగం దొరక లేదు. హ్యూస్టన్ కి 60 మైళ్ళ దూరంలో ఉన్న ఎవరి దగ్గరో ఉంటున్నాను, ఇక్కడ మీరు ఉండడానికి చోటు లేదు, సారీ” అని చావు కబురు చల్లగా చెప్పాడు పట్నాయక్. అదంతా చెప్పి “అక్కడ రైస్ యూనివర్శిటీలో చదువుకుంటున్న ఇండియన్స్ అయిదారుమంది ఉన్నారు. అందులో నాకు మహంతి అనే స్నేహితుడు బాగా తెలుసు. మీరు రైస్ యూనివర్సిటీ లో ఎయిరోనాటిక్స్ డిపార్ట్ మేంట్ కి వెళ్ళి అతణ్ణి కలవండి. మీ గురించి అప్పుడే చెప్పాను. అతను మీకు ఏదైనా వాళ్ళ స్ట్యూడెంట్స్ అపార్ట్ మెంట్స్ లో చోటు చూపిస్తాడు.”అని చెప్పాడు పట్నాయక్. పట్నాయక్ ఉండే చోటే మనమూ ఉండొచ్చుకదా అని ధైర్యంగా అనుకున్న మేము ఇప్పుడు ఉండడానికి కొంప లేని ఈ కొంప ములిగే వార్త విని ఇప్పుడెలాగరా బాబోయ్ అని తర్జన భర్జన పడిపోయాం.  “ఇక లాభం లేదు” అని  మేప్ లు చూసుకుంటూ అక్కడకి దగ్గరలో ఉన్న ఒక మోటెల్ లో ఉందామా అని కనుక్కుంటే ఒక గదిలో ఇద్దరు కంటే ఉండకూడదు ట..అంటే మా ముగ్గురికీ రెండు గదులు తీసుకోవాలి అని వాళ్ళు  గట్టిగా చెప్పారు.  రెండు గదులకి డబ్బు దండగ అనిపించింది కానీ ఒకే గది తీసుకుంటే ఆ మూడో వాడు కారులో పడుకోవాలి కదా! వాళ్ళిద్దరూ కష్టపడి, నిద్రాహారాలు లేకుండా 20 గంటలు డ్రైవ్ చేశారు కాబట్టి శాస్త్రీకీ, రఘుకీ విశ్రాంతి కావాలి అంటే మోటెల్ గదిలో వాళ్ళు ఉండాలి. నేను కారులో పడుకోగలను. ఈ విషయం మీద కాస్సేపు దెబ్బలాడేసుకుని, వాళ్ళిద్దరినీ మోటెల్ లో చెక్ ఇన్ చేసి, నేను హ్యూస్టన్ లో నా మొదటి రాత్రి ఆరు బయట కారులో నిద్రపోయాను.

మొహంతీ

ఆ మర్నాడు పొద్దున్నే ముగ్గురం తయారు అయిపోయి వెతుక్కుంటూ ఆ రైస్ యూనివర్శిటీ కి వెళ్ళి , అక్కడ వెతగ్గా, వెతగ్గా మొత్తానికి అక్కడ డాక్టరేట్ చేస్తున్న ఆ మహంతి అనే యువకుడు దొరికాడు.  అతనితో పాటే పార్థా మిత్రా అనే బెంగాలీ కుర్రాడూ, కె. ఎస్. మూర్తి అనే తెలుగు అతనూ కూడా అప్పటికప్పుడే పరిచయం అయ్యారు. అదే ప్రపంచంలో వింతలలో వింత, అనుకోని ఆశ్చర్యం. ఆ మూర్తి అంటే ఎవరో కాదు. సాక్షాత్తూ మా రెండో వదిన గారి పిన తండ్రిగాఋ..అంటే కాకినాడ దేవాలయం వీధిలో మా చిన్నయ్య పిన మామ గారు  డా. రాంబాబు గారి రెండో కొడుకు. ఆయన పెద్ద కొడుకు, నా ఈడు వాడూ అయిన భాస్కర్ నాకు బాగానే తెలుసు కానీ ఈ రెండో కొడుకుని ఇండియాలో ఎప్పుడూ కలుసుకో లేదు. అమెరికాలో ఉన్నాడు అనే మాత్రం తెలుసు. అలాంటిది ఇక్కడ రైస్ యూనివర్శిటీ లో అనుకోని పరిస్థితులలో తారస పడడం ఎంతో ఆశ్చర్యం వేసింది.  మేము ఒకరికొకరు పరిచయాలు చేసుకుంటున్న సమయానికి ఎక్కడి నుంచో పట్నాయక్ కూడా వచ్చి చేరాడు. ఇప్పుడు అందరి ప్రధాన కర్తవ్యం మాకు ఉండడానికి వసతి కల్పించడమే. కానీ రైస్ యూనివర్శిటీ లో డాక్టరేట్ చేస్తున్న ఆ స్ట్యూడెంట్స్ పరిస్థితే అంతంత మాత్రమే. మా ముగ్గురినీ కానీ కనీసం ఒక్కరినైనా వాళ్ళ అతి చిన్న గదుల్లో ఉంచుకునే అవకాశం లేదు. పైగా ఎవరికీ కార్లు లేవు.  అంచేత మేమే ఒక ఎపార్ట్ మెంట్ తీసుకుందాం అనుకుని, మహంతి సహాయంతో ఆ చుట్టూ పక్కల ఆ మధ్యాహ్నం అంతా ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం. ఏ ఒక్క ఎపార్ట్మెంట్ కాంప్లెక్స్ వారూ మాకు ఎపార్ట్ మెంట్ ఇవ్వడానికి ఒప్పుకో లేదు. ఎందుకంటే, మాలో ఎవరికీ ఉద్యోగం లేదు, ఆదాయం లేదు, స్థానిక చిరునామా లేదు. ఆయనే ఉంటే మంగలి ఎందుకూ అన్నట్టు ఉంది మా పరిస్థితి. ఈ పరిణామం కూడా మేము ఊహించినదే.

ఆ రోజంతా వెతికినా ఫలితం లేక,  పట్నాయక్, మహంతి, మూర్తి..ఇలా అందరం ఏడవ లేక నవ్వినట్టు హాయిగా ఆ రాత్రి పిజ్జా హట్ కి వెళ్ళి, ఒకటో, రెండో బీర్ లు ఆస్వాదించి గత్యంతరం లేక మళ్ళీ మోటెల్ కి వెళ్ళిపోయాం. ఇవాళ మటుకు ఆ మోటెల్ వాడికి మస్కా కొట్టి నేను కూడా గదిలోనే కార్పెట్ మీద పడుకున్నాను. బెడ్ మీద నన్ను పడుకోమని పాపం శాస్త్రీ, రఘూ ఎంతో  బతిమాలారు. ఎంతయినా వాళ్ళకి సీనియర్ ని కదా…

ఇక హ్యూస్టన్ లో మూడో రోజు…ఇప్పటికీ మర్చిపోలేని రోజు….మానవత్వానికి మరపురాని రోజు…

ఆ వివరాలు మరొక సారి…

*

 

 

 

*

వంగూరి చిట్టెన్ రాజు

1 comment

Leave a Reply to Veena Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • శీర్షికలు టాబ్ క్లిక్ చేసి కాలంస్ కి వెళ్తే అక్కడ మీ తాజా పోస్ట్ ఉండేది ప్రతి నెలా, ఫిబ్రవరి వరకు. ఇప్పుడు 2022 సంచికలు క్లిక్ చేసి, తాజా నెల క్లిక్ చేసి, లోడ్ మోర్ క్లిక్ చేస్తే అక్కడ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు