జల దృశ్యం

మధ్యనే  ఆమెకు దానికీ వున్న
నాలుగు  దశాబ్దాల  అనుబంధం
పుటుక్కున తెగిపోయింది

‘చూపుడు వేలుకు గోరునామ
తడ తడ పెట్టినట్టు బాధ పడడం ఎందుకు
ఇంతకీ ఏమైంది  అడిగాను’

‘ మా చిన్నన్న చేయించి
తీసుకొచ్చి ఇచ్చిన  వస్తువు
విరిగిపోయిందని వేదనతో చెప్పింది ‘

‘ గా చిన్న విషయానికి అంత బాధెందుకు
బజారుకు పోయి చేయించుకోస్తాను ,

ఏమైంది ఎప్పుడు చేయించుకోస్తావ్
అరె! తీసుకపోయి తెచ్చేవరకు
కత్తితో కోయరాదా
ఓ ఉచిత సలహా ఇచ్చాను

ఆ ఉదయం  వంటింట్లోని పనులను
ఓ గంట వాయిదా వేసింది

సకలాన్ని  అకాలం చేసి
మౌన నిరసను తెలిపింది

అతని పేరు రాములు
రామ గోసగా నా వైపు చూసి
ఇప్పుడు చేయడం లేదు సార్
అంబేడ్కర్ చౌరస్తా దగ్గర
జూనియర్ కాలేజ్ పక్కన
సీస కమ్మరోళ్లు కొలిమి పెడతారు
అక్కడికి తీసుకపోండ్రి అన్నాడు

మరువక తీసుకుపోయి
తయారు చేయించుకవచ్చాను

మా ఆవిడ రక్తాన్ని
అది ఎన్నిసార్లు కండ్ల చూసిందో…

తీసుకొచ్చిన ఈలపీట తో
కూరగాయలు కోస్తూ
ఏమి  జ్ఞాపకం వచ్చిందో
కళ్ళ నిండా జలదృశ్యం
అందరూ అమాయకురాలు అంటరు కానీ
ఆమె గడసరి తనం నాకు మాత్రమే తెలుసు.

*

జూకంటి జగన్నాథం

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు