‘కత్తి కన్నా పదునైనది కలం’ అన్నది నా చిన్నతనం నుండే మా నాన్న కందివనం రఘురామయ్య గారి నుంచి తెలుసుకున్నాను. పాత్రికేయుడిగా ఆయన పని చేస్తున్న పత్రికలకు పుంఖానుపుంఖాలుగా ఎన్నో కథనాలు రాసేవారు. ఆయన్ను చూస్తూ పెరిగిన నాపై ఆ ప్రభావం ఎంతో ఉంది. ఆయనలా నేనూ రాయాలనే తాపత్రయం కలిగేది.
సైన్స్ మీద నాకున్న ఆసక్తి నన్ను జర్నలిజం వైపు వెళ్ళనివ్వలేదు కానీ, ఈ ‘రాయడం’ అనేది మాత్రం నా మనసులో బలంగా పాతుకుపోయింది. బహుశా అందుకేనేమో బియోటెక్నాలజీలో పీజీ చేసి, సైంటిఫిక్ ఈ-జర్నల్స్ పబ్లిషింగ్ సంస్థల్లో మేనేజింగ్ ఎడిటర్ గా పనిచేస్తున్న నన్ను, నా మనసు నాకు తెలీకుండానే సాహిత్యం వైపు అడుగులు వేయించి, సాహిత్యాన్నే నా వృత్తిగా మార్చుకునేలా చేసింది. ఈ విషయంలో మా అమ్మ వరలక్ష్మి గారు, నా భర్త నరేంద్రకుమార్ గారి ప్రోత్సాహం ఎంతో ఉంది.
నేను చదివిన మొదటి పుస్తకం చేతన్ భగత్ గారి ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ నవల. అది చదివాక నాకూ నవలలు రాయాలనే కోరిక పుట్టింది. అలా 2019 లో మొదట ఇంగ్లీష్ లో ఓ చిన్న సిరీస్ రాయడం మొదలు పెట్టాను. కానీ పూర్తి చేయలేకపోయాను. ఆ తర్వాత ఇంగ్లీష్ లోనే చిన్న చిన్న రైటప్స్, కొన్ని కథలు రాసాను. ఆ విధంగా ఇంగ్లీషు సాహిత్యంతో మొదలైన నా సాహిత్య ప్రస్థానం ఆ తరువాత తెలుగు సాహిత్యం వైపు పయనించింది. తెలుగులో ఇప్పటివరకు రెండు నవలలు, దాదాపు 33 కథలు రాసాను. నా కథలు నమస్తే తెలంగాణా, ఈనాడు, సారంగా, విశాలాక్షి, విశాలాంధ్ర, రమ్యభారతి, లోగిలి, సాహితీ కిరణం పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
నేను రచించిన ‘చీకటి వెలుగులు’ కథకు నమస్తే తెలంగాణా-ముల్కనూరు ప్రజాగ్రంథాలయం వారు నిర్వహించిన ‘కథ 2020’ పోటీలో విశిష్ట బహుమతి పొందడమే కాకుండా ఎందరో పాఠకాభిమానులను సంపాదించి పెట్టింది. నేను రచించిన మరో కథ ‘నాయిన చెప్పిన అబద్ధం’ కు రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనాడు వారు నిర్వహించిన ‘కథా విజయం 2020’ పోటీలో ప్రత్యేక బహుమతి లభించింది. ఈ కథ కూడా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నేను పత్రికలకు మొదటిసారిగా రాసిన ఈ రెండు కథలకూ బహుమతులు రావడంతో పాటు ఎందరో ప్రశంసలను అందుకోడం 2021లో నాకు తీపి జ్ఞాపకాలు. అలాగే, విశాలాంధ్ర-అరసం యువ పురస్కారం 2021 కథల పోటీలో కూడా నా కథ ‘నేను… మీ…!’ కు బహుమతి పొందాను. వీటితో పాటు ఇంకొన్ని పోటీల్లో కూడా బహుమతులు అందుకున్నాను.
నేను రాసిన మొదటి నవల ‘చైత్ర’. దీన్ని పుస్తకంగా వెలువరించాను.
గతంతో పోలిస్తే ఇప్పుడు మనం ఎంతో అభివృద్ధి చెందాము. కానీ ఈ పితృస్వామ్య సమాజంలో ఇంకా ఆడపిల్లల పట్ల చూపుతున్న వివక్షను, వారికి జరుగుతున్న అన్యాయాలను ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ఆడవాళ్లను ఎదగనివ్వకుండా అణచివేయడం, చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేసి వయసుకు మించిన బాధ్యతల కంచెలతో వారిని బంధించడం, ఆడపిల్లలను పుట్టగానే చెత్తకుప్పల పాలు చేయడం వంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదనే అంటాను. అటువంటి ఆడబిడ్డల గాధలే నా మొదటి నవల ‘చైత్ర’ ను రాయడానికి ప్రేరేపించాయి. ఈ అసమానతలను ఎత్తిచూపుతూనే, ఒక ఆడపిల్లకు తగిన ప్రోత్సాహం లభిస్తే ఆమె ఏదైనా సాధించగలదన్న విషయాన్ని నా నవలలో అక్షరీకరించాను.
ఈ నవలను 2020లో నవీన్ అవార్డ్స్ కోసం పంపించిన్నప్పుడు అంశపయ్య నవీన్ గారు చదివి నాకు ఫోన్ చేసి నన్ను ప్రశంసించడమే కాకుండా సాహిత్యంలో తొలి అడుగులు వేస్తున్న నాకు నవలా రచనకు సంబంధించి వారి విలువైన సూచనలు, సలహాలను అందివ్వడం మర్చిపోలేని అనుభూతి. అలాగే ఈ నవలను పుస్తకంగా తెచ్చే క్రమంలో రచయితలు శ్రీచరణ్ మిత్ర గారు, ఉండవిల్లి. ఎమ్ గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. వారిరువురికీ నెనరులు.
నా రచనలు సమాజాన్ని మార్చేయలేకపోవచ్చు కానీ, వాటిని చదివిన ఏ కొందరిలోనైనా ఆలోచనను రేకెత్తించగలిగితే నా అక్షరాలకు సార్థకత లభించినట్టే.
పుస్తకం: చైత్ర (నవల)
రచన: స్ఫూర్తి కందివనం
పేజీలు: 276
ధర: 200 రూపాయాలు (+పోస్టల్ చార్జీలు అదనం)
పత్రుల కోసం ఈ క్రింది ఈమెయిల్ ను సంప్రదించగలరు:
k.spoorthy20@gmail.com
*
గమ్యాన్ని చేరుకున్న “చైత్ర” : శ్రీచరణ్ మిత్ర
ఇది ఒక ఆడపిల్ల కథ అంటూ నవల పరిచయంలోనే రచయిత్రి పేర్కొన్న నవల చైత్ర. ఆడపిల్లల కథలు ఎన్ని చదవలేదు? ఐతే ఇది ప్రత్యేకత కలిగి ఉన్న అతి ధీమంతురాలైన ఆడపిల్ల కథ. మనం ఎదుర్కొంటున్న సమస్యలు, తన తోటివాళ్ళ సమస్యలు రచనా వస్తువులు అయితే అవి ఎంతో సహజంగా ఉంటాయి. ‘స్ఫూర్తి కందివనం’ చైత్ర నవలలో కనిపించినది అదే. స్త్రీలపై గల నిరాదరణనూ, పుట్టింటినుండే మొదలయ్యే అసమానతనూ గుర్తెరిగి, స్త్రీ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదన్న లక్ష్యంతో రచించిన మంచి నవల చైత్ర. స్ఫూర్తి రాసిన చైత్ర నవలలో అనుక్షణం కథానాయికకు జరుగుతున్న అన్యాయానికి అయ్యో అనుకోకుండా ఉండలేం. అయితే కథానాయిక ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటూ, ఒక్కో మెట్టును ఎంత కష్టానికైనా ఓర్చుకొని గమ్యాన్ని చేరుకోగలిగిన స్త్రీ.
మొదటి నవలలోనే ఇంత చక్కని సామాజిక విషయాన్ని తీసుకుని రాసిన స్ఫూర్తి ఏదో ఒక వాదానికో, ఇజానికో కట్టుబడ్డ రచయిత్రి కాదు. సమకాలీన, సామాజిక సమస్యలనెన్నింటినో లోతుగా అధ్యయనం చేసి, చిత్రవిచిత్రమైన మానవ ప్రవర్తనలనూ, పరిస్థితుల ప్రభావాలనూ నేర్పుగా అక్షరించగల రచయిత్రి.పైకి చాలా మెరుగ్గా, పట్టణాల్లో ఆధునికంగా, దృశ్యమాధ్యమాల్లో గొప్పగా కనిపిస్తున్న స్త్రీ బ్రతుకుల్లో ఒకప్పటి మన సంస్కర్తలు కోరుకున్న ప్రగతి ఇంకా పూర్తిగా సఫలం కాలేదు. అది చూపడానికి ఎంతో నిశిత దృష్టి ఉండాలి.
ప్రస్తుత తెలుగు సాహిత్యంలో ఓ యువ రచయిత్రి ఏమాత్రం కృతకం లేకుండా, సహజమైన భాషను ఉపయోగిస్తూ నవలను రాయడం చెప్పుకోదగ్గ విషయమే.ఇక రచన గురించి చెప్పాలంటే… రచయిత్రి తన అద్భుతమైన శైలితో మన వేలు పట్టుకుని కథనంలోకి తీసుకు పోతారు. తప్పక చదవాల్సిన మంచి రచన చైత్ర. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, గమ్యాన్ని చేరుకోవడానికి ఎంతటి కష్టమైనా ఎలా ఎదుర్కోవాలో చెప్పే రచన ఇది.ముఖ్యంగా ఆడపిల్లలచే ప్రతీ తల్లిదండ్రులు తప్పక చదివించాల్సిన నవల ఇది.ఈ నవలను రెండు అంకాలుగా విభజించవచ్చు.ఒక యువతి బాల్యం నుండీ ఎదుర్కొన్న అసమానత…. బాలికలు ఎప్పుడూ చదువులో చూపించే చురుకుదనం, అది జీర్ణించుకోలేని పురుషాహంకారం, ఆ విద్యను ఆమెకు దూరం చేయాలనుకునే దురహంకారం, అందుకు వారు వేసే పథకాలకు ప్రతీకలుగా తండ్రి యాదయ్య, తమ్ముడు చంటి ని స్పృష్టంగా చూస్తాం. ‘స్త్రీలు సహృదయంతో ఉండ గలిగితే మరో స్త్రీని తప్పక ఉద్ధరించగలరు’ అనే నేటి స్త్రీవాద భావాలకు ఊతమిచ్చేలా చైత్ర మాతృమూర్తి గౌరి, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలైన విద్యాధికురాలైన టీచర్ లక్ష్మీ పాత్రలు మనకు దర్శనమిస్తాయి. తాననుకున్న గమ్యాన్ని చేరడానికి ఒంటరి ఆడపిల్లకు ఎంత నేర్పు, ఎంత చాకచక్యం, ఓర్పు, సహనం ఉండాలో అన్నీ ఈ రచనలో చూస్తాం.
రెండవ అంకంలోకి వస్తే….గమ్యం చేరుకోవడానికి స్త్రీ అయినా, పురుషుడైనా ఎంతటి అంకితభావంతో ఉండాలో, ఎంత శ్రమ పడాలో ‘అగ్నిపర్వతం లాంటి సంకల్పం ముందు కష్టాలు, అవమానాలు అనే గడ్డి పరకలు ఎలా మొలకెత్తలేవు’ అనే విషయాన్ని చక్కగా చెబుతుంది ఇందులో కథానాయిక.అయితే ఆమె ఇంత కష్ట పడిందీ, పెద్దచదువులు చదివేసి ఏదో సుఖపడిపోదామని కాదు. తన అవసరం మేరకు చదువుకొని ఎప్పటికైనా దేశానికి ఉపయోగపడాలనే ఒక పవిత్ర లక్ష్యంతో ఉండటం నవలలో గొప్ప మలుపు.ఆ మలుపులో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని ఆమె అధిగమించిన విధానంలో ఎన్నో కొత్త విషయాలు అత్యంత ఆసక్తిని కలిగిస్తాయి.
నవలలో అంతర్భాగంగా నడిచిన ఆర్మీ యోధులు దేశరక్షణకు ఎంత కష్టపడేదీ, దేశమాత సంరక్షణ కోసం ఎంతటి త్యాగాలకు ఒడిగట్టెదీ, తమ కుటుంబాలను విడిచి, ప్రాణాలు పణంగా పెట్టి క్రమశిక్షణతో ఎలా ప్రవర్తిస్తారో, అతి సరళమైన భాషలో రాసిన రచయిత్రికి హేట్సాప్ చెప్పక తప్పదు. అంతటితో ఆగితే అది ఒక రకం నవల.కానీ….రచయిత్రి శత్రుదేశాల కుయుక్తుల్లో భాగంగా వేరొక దేశాన్ని ఇబ్బందులు పెట్టే ‘బయో టెర్రరిజం’ తో దాడులు చేస్తే ఎంత ఇబ్బందులు పడేదీ ఇప్పటి కోవిడ్ 19 (కరోనా) ద్వారా మనం అనుభవిస్తున్న బాధలను ముందుగానే ఊహించి, అది మన దేశంలోకి వ్యాపించక మునుపే ఈ నవలను రాసిన ద్రష్ట ‘స్ఫూర్తి కందివనం’. ఈ శత్రుదేశాల కుయుక్తుల్లో బలి అవుతున్న మన సైనికులు అమరులవుతున్న విధానం, వారికి మన భారతదేశం ఇచ్చే అపూర్వ గౌరవం ఎలాంటిదో నేటి పాఠకులకు కళ్ళకు కట్టినట్టు చూపించారు. దేశరక్షణ ఎంతటి పవిత్ర కార్యమో చెప్పిన మంచి కథ చైత్ర.ఏది ఏమైనా ఒక పేద అమ్మాయి తాను కోరుకున్న గమ్యాన్ని చేరడం తెలుగు సాహిత్యంలో మరీ అంత కొత్త విషయం కాకపోయినా, కొత్త రచయిత్రి కొత్తగా చెప్పడమే విశేషం.ప్రసిద్ధ రచయిత టాల్ స్టాయి చెప్పినట్లు “ఆనందమయ జీవిత విషాదాలు అన్నీ ఒకే రకాన్ని పొలివుంటాయి. కానీ నిరుపేదల జీవిత విషాదాలన్నీ ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటాయి”. ఆ ప్రత్యేకతను పట్టుకున్న రచయిత్రి స్ఫూర్తి కందివనం.
*
“సమకాలీన, సామాజిక సమస్యలనెన్నింటినో లోతుగా అధ్యయనం చేసి, చిత్రవిచిత్రమైన మానవ ప్రవర్తనలనూ, పరిస్థితుల ప్రభావాలనూ నేర్పుగా అక్షరించగల రచయిత్రి” శ్రీ చరణ్ గారు చెప్పింది అక్షర సత్యం స్పూర్తి గారు 💐💐
థాంక్యూ కిరణ్ గారు.