చేనేత బతుకుల సంక్షోభ సముద్రం “వైపని”

నిదానంగా ప్రవహించే మానేరులా మొదలైన కథ, ముగింపుకొచ్చే సరికి మన మనసు గట్లను కోస్తూ హృదయన్నంతా రక్తసిక్తం చేస్తుంది.

నాలుగున్నర దశాబ్దాలుగా తెలంగాణ కవితాకాశంపై తనదైన మట్టి ముద్రలను వేస్తూ సాగిపోతున్న జూకంటి జగన్నాథం తెలుగు నేలపై ప్రపంచీకరణ ప్రమాదాన్ని ముందుగానే తన కవిత్వంతో ఎలుగెత్తి చాటిన తొలి కోడి. కవిత్వంతో పాటు కథలు కూడా రాసినా కవులుగానే ప్రఖ్యాతిగాంచిన (ఇటీవలనే వీరి సమగ్ర కవిత్వ సంకలనం పాఠకుల ముందుకు వచ్చింది.) జూకంటి తాను దశాబ్ద కాలంలో రాసిన 12 కథల్ని ‘వైపని’ పేర 2004లోనే సంపుటిగా తీసుకువచ్చారు. తన కళ్ళముందే తన ఊరు, మనిషి, ప్రకృతి ఆనవాలు లేకుండా చెదలుపట్టిపోతుంటే ఒక మానవత్వమున్న మనిషిగా కదిలిపోయి దుక్కించే కథకుని తన్లాట కనిపిస్తుంది ఈ సంపుటిలో. ఎప్పటికప్పుడు సామాజిక చలనాల్ని కవిత్వీకరించడమే కాదు కథీకరించడం కూడా జూకంటికి బాగా తెలుసు.

ఈ కథలు వచ్చి నేటికి 14 ఏళ్ళయినా వీటి ప్రాసంగికత తగ్గలేదనడానికి వైపని కథ మంచి ఉదాహరణ. ఈ కథ 2002లో ఇండియా టుడే వార్షిక సంచికలో ప్రచురింపబడింది. మనిషి దేహాన్ని వర్ణమయం చేసి, మానవులను నాగరికులను చేసిన  చేనేత కార్మికులకు ఈ లోకం ఆకలి చావులనే బహుమతిగా ఇచ్చింది. సిరిసిల్లనే కాదు దేశంలోని అనేక వస్త్రోత్పత్తి కేంద్రాలు ఈ రోజు ఎంతో సంక్షోభంలో ఉన్నాయనేదానికి ఇంకా కొనసాగుతున్న ఆకలి చావులే నిదర్శనం. సరిగ్గా ‘వైపని’ కథ కూడా పవర్ లూమ్ కార్మికుల ఆత్మహత్యలను, చేనేత రంగంలోని సంక్షోభాన్ని, ప్రభుత్వాల ‘ఊం తడి’ చర్యలను చిత్రించిన కథ.

సక్కుబాయికి రజస్వల అయ్యీ కాక ముందే తులసీరాంతోని పెండ్లి జరుగింది. అత్తగారు కూరెల్ల. సక్కుబాయికి ఆరుగురు ఆడబిడ్డలు. అప్పటికే నలుగురికి పెండ్లి అయింది. ఇంకా ఇద్దరు పెండ్లికి ఉన్నారు. తులసీరాం బొంబాయిలో పవర్లూమ్ కార్మికుడు. పెండ్లి కాగానే తాను బొంబాయి పోనని చెప్పేస్తాడు. కానీ పిల్లగాడు బొంబాయిలో పని చేస్తున్నడంటేనే మేం పిల్లనిచ్చి పెండ్లి చేస్తిమి ఇప్పుడు పోనంటే ఎట్లా అని సక్కుబాయి తండ్రి గొడవ పెడుతాడు. ఇప్పుడు మన కుల కశ్పి చేనేత సరిగా నడుస్తలేదు. ఇంకా ఇద్దరు ఆడి పిల్లలు పెండ్లికున్నరు. ఈసారికి బొంబాయికి పొమ్మని తులసీరాం తల్లిదండ్రులు ఒక్కతీరుగ చెప్తారు. అయినా తులసీరాం పోనే పోనని మంకుపట్టు పడుతాడు. చివరాఖరికి కోడలుతోనే చెప్పించి మొత్తం మీద తులసీరాంను బొంబాయికి పంపిస్తారు. కానీ నెల తిరక్కుండానే తిరిగి వస్తాడు.

ఎర్రగా బుర్రగా ఉన్న పిల్లను చేస్తే ఇట్లనే అవుతుందని సక్కుబాయి అత్త మామ గులుగుతారు. వాళ్ళ పోరు పడలేక ఈ సారి సక్కుబాయిని కూడా బొంబాయికి తీసుకొని పోతాడు. ఊకే తిని కూసుంటే ఎట్లా అని సక్కుబాయి మెల్లగా బీడీలు చేయడం నేర్చుకుంటుంది. ఓ బిడ్డా, కొడుకు పుడుతారు. కష్టాల్లోనే అయినా అలాగే సాగిపోతే వాళ్ళ సంసారం బావుండేది. కానీ దురదృష్టం మరాఠీల గొడవల రూపంలో వచ్చింది. ఆ అల్లర్లలో తులసీరాంను ఎవరో కత్తులతో పొడిచి చంపేస్తారు. పుట్టెడు దుక్కంతో సక్కుబాయి బిక్కు బిక్కుమంటూ పిల్లల్ని పట్టుకొని కూరెల్లకు చేరుతుంది. కానీ ఊరందరి కండ్లూ సక్కుబాయి మీదనే. సంసారం కూడా అంతంత మాత్రంగానే నడుస్తుంటుంది. ఇక చేసేది లేక చేనేత పనిముట్లను దూలాలకు కట్టి సిరిసిల్లకు చేరుతారు.

కానీ ఇక్కడ ఇంకో సమస్య. సక్కుబాయి మామ పని చేసే చోట వాళ్ల ‘సేటు’ సక్కుబాయి మీద కన్నేసి సక్కుబాయిని ‘ఉంచుకుంట’ నని లేకపోతే ‘రెండో పెళ్లి’ చేసుకుంటానని సతాయిస్తాడు. సక్కుబాయి ఒప్పుకోదు. కాలం గడుస్తుంటుంది. అట్లో ఇట్లో బిడ్డ పెళ్లి చేస్తుంది. కొడుకు రవి రెక్క బొక్క ముదురక ముందే సైజింగ్ ల తయారైన భీముల మీంచి రెండు మూడు వెయిల పాలిస్టర్ పొగుల్ని ఒక్కటొకటిని జాలిల నుంచి ఏనెలకు ఎక్కించే ‘వైపని’ (వైపుతో చేసే పని) కి పోతాడు. కొడుకు తొవ్వల పడ్డాడని పెండ్లి చేస్తుంది. పని ఒత్తిడికి క్రమంగా రవికి తాగుడు, గుట్కాలు అలవాటైతాయి. ఒక్కోసారి పని సరిగా దొరుకది పైసలకు కటకట మొదలవుతుంది. అత్తా, కోడండ్లకు, భార్యా, భర్తలకు గొడవలవుతాయి. ఏమైందో ఏమోగని ఓ రాత్రి కోడలు కొడుక్కు ఇడుపుకాగితం ఇస్తాననుకుంటూ తల్లిగారింటికి పోతుంది. రవి ‘అరీ’ అనడు ‘శివ’ అనడు పని దొరికిన్నాడు చేస్తున్నాడు. లేని నాడు లేదు. బిడ్డ సంసారం కూడా అంతంత మాత్రంగానే సాగుతుంటుంది. ఆమె కూడా బీడీలు చేసీ చేసీ టి. బి. రోగం తెచ్చుకుంటుంది. మందులు వాడుకుంటుంది. కానీ సంసారం ఈదలేక కుటుంబమంతా పురుగుల మందు తాగి చనిపోతారు. మనుమరాలు ఒక్కతి బతికి బయట పడుతుంది. ఓసారి రవి అక్క ఇంటికి పోయేసరికి తిండికి కూడా లేని ఆమె దీన స్థితి చూసి చలించి పోతాడు. అక్కకు బుడ్డ పైస ఇవ్వలేని తనెందుకు బతికి అనే మనాదితో ఇంటికి వచ్చి గదిలోకి వెళ్ళి ఒంటిపై కిరోసిన్ పోసుకొని అగ్గిపుల్ల అంటించుకుంటాడు. సక్కుబాయి చేతిలున్న బీడీ చుట్టి లేస్తాననుకునే సరికి అంతా అయిపోతుంది. రవి మంటల్లో నిలువునా కాలిపోతాడు. చూస్తుండగానే ప్రాణం పోతుంది.

సిరిసిల్ల తహసిల్ ఆఫీస్ ముందు చేనేత ఆత్మ హత్యల మీద మీటింగ్ జరుగుతుంది. సక్కుబాయి మనుమరాలు శాంతను పట్టుకొని మీటింగ్ లో కూర్చుంటుంది. గడిచిన జీవితం తాలూకు సంగతులన్నీ సక్కుబాయికి ఒక్కొక్కటే గుర్తుకొస్తుంటాయి. మీటింగ్ లో నాయకులు ఏదేదో మాట్లాడుతుంటారు. ఇప్పటికే చేనేత కార్మికుల కోసం చాలా చేశామని, ఇంకా చేస్తామని. సక్కుబాయికి లోలోపల్నుంచీ దుక్కం ఎత్తేసుకొస్తుంది. కానీ తమాయించుకుంటుంది. చివరికి పట్టన పగిలి  ముఖం మీద కొంగు కప్పుకొని బిగ్గరగా ఏడుస్తుంది. ‘ఏమైంది ఏమైంది’ అంటూ సభలో కలకలం మొదలవుతుంది. వేదిక మీదున్న మంత్రి వెంటనే స్పందించి తాను శాంతను దత్తత తీసుకొని పెండ్లి అయ్యేదాకా పోషిస్తానని సెలవిస్తాడు. సక్కుబాయి కంటికేడు దారాలు ఏడుస్తూనే ఉంటుంది. ఎవరో ఊకుంచుతున్నారు. “మానానికి జానెడు బట్ట కడుపుల పేగులు నోట్లెకు రాంగా శాలోల్ల  ఉసురు గోస వట్టిగ పోదు. వెనుక ఎవరో అంటున్నారు. చూసే కండ్లలో దుమ్ము వడ్డది. ఆకలి కడుపులో మన్ను వడ్డది. మంత్రులు మర్యాదస్థులు వస్తూనే ఉన్నారు. సభలు నీటి మీద రాతలు. హామీలు చేతి కొసవేళ్లు తడిపి కదిలిపోతూనే ఉన్నాయి. వగలు ఓదార్పు తతంగం జరుగుతూనే ఉంది. కార్మికుల ఆత్మ హత్యల హోమం మాత్రం ఆగడం లేదు.”

కథంతా గతం, వర్తమానం అనే కామన్ శిల్పంలో సాగినా కథ నిండా కన్నీటి ఉప్పదనం పర్చుకొని ఉంటుంది. నిదానంగా ప్రవహించే మానేరులా మొదలైన కథ, ముగింపుకొచ్చే సరికి మన మనసు గట్లను కోస్తూ హృదయన్నంతా రక్తసిక్తం చేస్తుంది. చేనేత కుటుంబంలో పుట్టి కుల కశ్పిని వారసత్వంగా స్వీకరించడం ఎంత బలహీనతో తెలుపుతుందీ కథ. చేనేత రంగంలోని సంక్షోభాన్ని చెప్తూనే ఈ కథ పాలకుల ఉదాసీన వైఖరిని ఎండగడుతుంది. నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉత్తుత్తి హామీలు, జీవికను అందించని పథకాలు… ఇవన్నీ చేనేత కార్మికుడి పేదరికం ముందు ఎలా జారి పడిపోతున్నాయో చిత్రించిన కథ.

ఈ కథ ఒక్కటీ చేనేత కథలకు ప్రతినిధిలాంటిది. మన హృదయం మీద పెరుకుపోయిన సాంచాల కాబూసును తుడిచేసే కథ. చేనేత రంగ సంక్షోభం యొక్క మూలాలను తడిమిన కథ. శతాబ్దాలుగా ప్రభుత్వాలు ఎంత పేలవమైన వైఖరిని చేనేత రంగం పట్ల అనుసరిస్తున్నాయో ఒక నిస్సహాయ గొంతుతో  చెప్పిన కథ. ఇందులోని సక్కుబాయి, రవి పాత్రలు నిజానికి ఒట్టి పాత్రలు కావు సిరిసిల్లకు పోతే ప్రతీ ఇంట్లో కనిపించే నిలువెత్తు జీవశ్చవాలు. గిట్టుబాటు ధర, మార్కెట్ సౌకర్యం, ముడి పదార్థాలపై సబ్సీడీ, కార్మికులకు ఉచిత భీమా, అనారోగ్య సమస్యలకు ఉచిత హెల్త్ కార్డులు, నివాస యోగ్యమైన ఇల్లు, తాగుడుకు బానిసలు కాకుండా కౌన్సెలింగ్ సెంటర్లు, పిల్లలకు ఉచిత విద్యా సౌకర్యం… ఇత్యాది ఎన్నింటినో మర్చిపోయి చేనేత బట్టలకు సినిమా తారలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించడం, ఐదు రూపాయలకే భోజనం… లాంటి పైపై చర్యలకు పూనుకోవడం వలన సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. ఇప్పటికైనా సాధికారిక కమిటీని ఒకదాన్ని వేసి తగు చర్యలు తీసుకుంటే తప్ప ఈ గాయాల్ని /ఆత్మహత్యలను ఆపలేం. ఇలాంటి కథలను పాలకుల చేత చదివించాలి. అప్పుడుగాని  చేనేత  జీవితాల అంతర్భాగంలో కదిలే అగ్ని పర్వతాల చప్పుడు వాళ్ళకు వినిపించదు. కచ్చితంగా చేనేత కథలపై వచ్చిన కథల్లో ఈ కథ ఒక మైలు రాయి.

*

 

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

3 comments

Leave a Reply to Dr. Veldandi Sridhar Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గొప్ప కథ. ఎప్పటిలాగే మీ విశ్లేషణ బాగుంది సర్. వ్యవసాయం, చేనేత రంగం…. ఏ రంగాన్ని మాత్రం పాలకులు పట్టించుకున్నారని. కవులు, కథకుల వల్ల నైనా కొంత చర్చ జరుగుతోంది లేకుంటే ఈ అంశాలు ఎప్పుడో చరిత్రలో కలిసిపోయేవి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు