చెప్పినదే మళ్ళా మళ్ళా …

చీకట్లో ముద్దగా నానిన, ఎవరో నడిచి వెళ్ళిపోయిన నలిగిన ముద్దబంతి పూవులా తాను మిగిలినప్పుడు?

చెప్పినదే మళ్ళా మళ్ళా చెబుతోన్నదా మీ అమ్మ మీతో? చీకట్లో ఆగకుండా వర్షం కురిసే చప్పుడూ ఇంకా మిమ్మల్ని ముంచివేసే బరువైన అలసట ఏదో పేరుకుంటుందా మీలో అప్పుడు? చిరాకుగా అనిపిస్తుందా మీకు? “అమ్మా, చాలిక ఆపు” అని విసుగుతో అరవాలనిపిస్తున్నదా? ఏమీ అనలేక, చెప్పలేక విసురుగా లేచి అక్కడ నుంచి పారిపోవాలని అనిపిస్తున్నదా? ఆవిడ తన లోకంలో తాను మునిగిపోయి, సోయి లేకుండా మీకు పట్టని విషయాలను పదే పదే అదే వణికే గొంతుకతో అడుగుతున్నప్పుడు? చెప్బుతున్నప్పుడు? మధ్యలో క్షణకాలం ఆగి మీ ముఖంలోకి ఏదో వెదుకుతో చూస్తున్నప్పుడు? తిరిగి మళ్ళా “చిట్టీ వేయి. ఇల్లు కొనుక్కో. ఏం చేస్తున్నావు జీతం?”లాంటి వాటిని నిందాపూర్వకమైన స్వరంతో చెప్పడం, అడగడం మొదలు పెట్టినప్పుడు, ఎంతకాలం ఈ భారం అని అనిపించినదా మీకు? అప్పుడు? అడిగీ, అడిగీ, చెప్పీ చెప్పీ

ఆ తరువాత వర్షం ఆగిపోతే ఒక నిశ్శబ్దం తన ఆవరణలోనూ, మీలోనూ బూజులాగా వ్యాపించిందా?  వానలో నానిన ఆకులు, మీలో తనలో రాలి, వాటికి పైగా ఒక పిల్లి చిన్నగా ‘మ్యావ్’ మని అరుస్తో ఎందుకో గుమ్మం వద్ద ఆగి లోపలికి చూసిందా? బండలపై పగిలిన నీటి అద్దాలలో ఆకాశమూ పగిలి ఉన్నదా అప్పుడు? దూరంగా, పిల్లల అరుపులు వినిపించినవా? దగ్గరగా, వంటరితనం మరొకసారి మరో సాయంకాలమయ్యి ఆపై రాత్రిగా మారి గుప్పెడు మందులై, ఎముకల పోగైన శరీరమై, చివరికి ఇక మంచంపై మునగదీసుకు పడుకున్నదా? ఆనక అర్థరాత్రిలో ఎందుకో ఉలిక్కిపడి లేచి, తిరిగి నిద్ర రాక, గతాలలో కూరుకుపోయి పగుళ్లిచ్చిన నేలయై పెదాలు ఎండి ఉన్నదా అప్పుడు? తన గుండె చప్పుడు తనకే వినిపించి, చేతికందే దూరంలో మనిషి లేక నీళ్ల బాటిల్ కోసం తడుముకుని, చీకట్లో కనపడక ముందుకు తూలిపడి ‘అమ్మా’ అని మీ అమ్మ మూలిగి అక్కడే కూలబడిపోయి  ఉన్నదా అప్పుడు? తన కళ్ళు తడియై హృదయం నీరై ఉన్నదా అప్పుడు? చెప్పినవే పదే పదే చెబుతో, అడిగినవే మళ్ళీ మళ్ళీ అడుగుతో, జ్ఞాపిక శక్తీ  కోల్పోతో క్రమేణా తను వెలిసిపోతున్నప్పుడు? చీకట్లో ముద్దగా నానిన, ఎవరో నడిచి వెళ్ళిపోయిన నలిగిన ముద్దబంతి పూవులా తాను మిగిలినప్పుడు?

***

చెప్పినదే మళ్ళా మళ్ళా చెబుతోన్నదా మీ అమ్మ మీతో? కొత్త విషయాలు ఏవీ లేని, కొత్త వాటికి ఆస్కారం ఇవ్వని జీవితాన్ని నెట్టుకు వస్తున్న మీ ముదుసలి తల్లి, చెప్పినవే మళ్ళా మళ్ళా చెబుతోన్నదా మీతో? ఏదోనాడు నువ్వూ అదే దారిలో వెడతావని తోచి ఒళ్ళు జలదరించి క్షణకాలం భీతి కలిగినదా మీకు అప్పుడు? ముసలి తల్లులు అడిగినవే తిరిగి పదే పదే మిమ్మల్ని అడగటం ఒక భావ ప్రకటన అనీ, తాను బ్రతికే ఉన్నదనీ, తనని పట్టించుకోమని చెప్పుకోవడమనీ ఆకస్మికంగా తోచి, మీ కన్నులు, మీ శరీరాలూ-

నీటి రంగుని అద్దుకున్నావా అప్పుడు? నరాలు తేలిన, వణికే ఆ చేతుల్ని ఒక్కసారి పదిలంగా పుచ్చుకుని, కూర్చోవాలని అనిపించిందా మీకు అప్పుడు? తాను అడిగినవే మళ్ళా మళ్ళా ఆడినప్పుడు, చెప్పినవే మళ్ళా మళ్ళా చెప్పినప్పుడు, ఇక ఏమీ అడగక తాను మరిక ఆగిపోయి నిశ్శబ్దంగా ఉన్నప్పుడూ, ఆ నిస్సహాయ స్థితి అవగతమై మీ గుండె ముక్కలైనదా అప్పుడు? దగ్గరుండీ ఇంత దూరమెట్లయితిమి? అని ఒక్కసారిగా తోచి శరీరమంతటి కన్నీటి చుక్కగా తను అగుపించి, ఆవిడ్ని కావలించుకుని ‘నేనున్నా’ అని చెప్పాలని అనిపించినదా మీకు? ఒక్కసారైనా, అప్పుడు?

***

(from upcoming Madre: Revised Edition)

శ్రీకాంత్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు