అనువాదం: అవినేని భాస్కర్
డాన్స్ పేరుతో ఒప్పుల కుప్ప వయ్యారి భామ ఆడే అమ్మాయిలు
డాన్స్ తారా స్థాయికి చేరే వేళవుతుంది. తొలిసారిగా కలిసివచ్చిన వాళ్ళతో కాకుండా వేరే వాళ్ళతో కలిసి డాన్స్ చేసే సమయం అదే. మీరు ముందే మందు కొట్టేసి కూర్చునలా చూస్తూ ఉంటే పిట్టలు మీ చుట్టూ చేరి డాన్స్ చేస్తాయని ఊహల్లో విహరించకండి.
అమ్మాయిలు వేరే అమ్మాయిలతో కలిసి డాన్స్ చేస్తారు. అది పెద్ద ఆసక్తికరంగా ఏమీ ఉండదు – పల్లెటూళ్ళలో చిన్న పిల్లలు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి చుట్టూ నిల్చుని చేతుల పట్టుకుని ”పసుపూన పుట్టావు గొబ్బమ్మ నీవు, పసుపున పెరిగావు గొబ్బమ్మ నీవు, రాచ కొండల పైన రాగాలమేనా…” అని పాడుకుంటూ చక్కర్లు కొట్టరూ? అలానే డాన్స్ చేస్తారు. అక్కడ హిప్‌హాప్ ప్లే అవుతున్నా, తీన్మార్ ప్లే అవుతున్నా సరే వీళ్ళ డాన్స్ లో తేడా ఉండదు.
ఇప్పుడు డాన్స్ ఫ్లోర్ లో జనం ఎక్కువగా ఉండటం వల్ల, ఊరికే బస్సుకు కాచుకున్నట్టు కాలు మార్చి కాలు పెట్టి నిల్చున్నా, డాన్స్ చేస్తున్నా రద్దీ కారణంగా పక్కనున్న వాళ్ళకు టచ్ అవ్వడం తప్పదు.
ఈ సమయం కోసమే ఎదురుచూపులు అన్నట్టు ఎందరో ఆ వేళకి డాన్స్ ఫ్లోరుకొచ్చి కాలు మార్చి కాలు పెట్టి డాన్స్ చేస్తుంటారు. ఎవరన్నా అమ్మాయి ఒక్క క్షణం అలా టచ్ చెయ్యకపోతుందా అన్న వెర్రి ఆశ వాళ్ళది. అమ్మాయిలే తామంత తాముగా టచ్ చేసే పరిస్థితి కల్పించుకుని ఎదురు చూస్తుంటారు కొందరు – అంటే అమ్మాయి ఏ మాత్రం కదిలినా వీళ్ళకు తగలక తప్పదు అన్నంత అడ్డంగా నిల్చునే టెక్నిక్ ఆసాములు వీళ్ళు. మందు ఇచ్చే ధైర్యంతో కావాలనే గోకే వాళ్ళూ ఉంటారు. యాదృచ్ఛికంగా తాకితే అమ్మాయిలూ ఏం పట్టించుకోరు. పట్టించుకోరు అనడం సరైన స్టేట్మెంట్ కాదేమో. వాళ్ళకు మత్తువల్ల ఆ సంగతి స్పురణకు రాదంతే. మందలో మేకలు కాస్త వేగంగా పరుగు తీసినప్పుడు ఒకదాన్నొకటి ఒరుసుకుంటూ వెళ్తున్నా ఆ స్పర్శ వాటికెలా తెలియదో, తెలిసినా ఎలా పట్టించుకోవో, ఇదీ అంతే. ఇక ఆ మేక తాగుంటే? పాపం ఆ మేకకు తెలిసే సంసస్యే లేదు!
ఆ అమ్మాయి ఆక్షేపించక పోవడాన్నే పాజిటివ్ సిగ్నల్ గా తీసుకుని పళ్ళు రాలగొట్టించుకుంటారు కొందరు. పెద్ద సర్కారు ఉద్యోగులు, బొజ్జున్న వ్యాపారవేత్తలంతా అమ్మాయిల వంక చూపు నిలిపి కొంగల్లా ఒంటి కాలి జపం చేస్తుంటారు. ఏ చిన్న అవకాశం దొరికినా చాలు వాళ్ళ దగ్గరకు వెళ్ళి హాయ్ చెప్పి, తాము పెద్ద యూత్ అన్నట్టు పోజులిస్తూ బంగారపు దంతాలతో ఇకిలిస్తుంటారు. వీళ్ళకు ఏ కాస్త క్రియేటివిటీనూ ఏడ్చి చావదు. మీ బిల్లు నేను సెటిల్ చేస్తాను అంటూ అందరూ అదే పాత ఐడియా ఫాలో అవుతుంటారు. అమ్మాయిలు గుంపుగా ఉంటే ఆ ఆఫర్ చాలా వరకు స్వీకరిస్తారు. ఒంటరిగానో, ఇద్దరు ముగ్గరుగానో అయితే మెత్తగా తిరస్కరిస్తారు. అయినా బలవంతంగా మొహమాట పెడుతుంటారు ఈ రిచ్ అంకుల్స్.
బిల్లు సెటిల్ చేసి, ఇంప్రెస్ చేసి, అమ్మాయిని పటాయించి, ఎత్తుకెళ్ళాలన్నదే వీళ్ళ ఉద్ధేశం. బిల్లు సెటిలింగ్ కి అమ్మాయిలు ఒప్పుకుంటే, తదుపరి చర్య మొదలెటతారు. తన కాస్ట్‌లీ కార్, ఈసీయార్ రోడ్లో బీచ్ బంగళా అంటూ పొడిగిస్తారు. మినిస్టర్ తెలుసు, ఐఏఎస్ ఆఫీసర్ లు తరచు కలుస్తుంటారు, ఏదైనా కావాలంటే చేసి పెట్టగలను అన్నట్టు గేలం వేస్తారు. ఇలా ఎన్ని చేపలు చిక్కి ఫిష్ ఫ్రై అయ్యాయో… ఈ విషయం గురించి ఓ స్నేహితురాలిని అడిగాను.
“వీళ్ళకు ఇలా జరుగుతుందని తెలుసా? అమాయకంగా ఇరుక్కుంటారా?”
“అంతా తెలుసు, అరాత్తు. అంత అమాయకమైన అమ్మాయిలెవరూ పబ్బుకు రారు.” అని సెలవిచ్చింది.
కొందరమ్మాయిలైతే పర్సులో పది రూపాయలు కూడా లేకుండా ధైర్యంగా పబ్బుకొస్తారు. డబ్బే లేకుండా పీకల్దాకా తాగుతారు, గంతులేస్తారు.
ఎవరి చూపు వారి మీదుంది, ఎవరు వారికి వలవేస్తున్నాడు అన్నది వాళ్ళకు బాగా తెలుసు. ఆ చొంగ కార్చే సుందరుడు తప్పకుండా అప్రోచ్ అయ్యి బిల్లు సెటిల్ చేస్తాడని వాళ్ళకు కచ్చితంగా తెలుసు. బిల్లు సెటిల్ అవ్వగానే ఎస్కేప్.
”బిల్లు సెటిల్ చేశాడు కాబట్టి ఏదైనా ఫేవర్ చెయ్యాల్సిన ఆబ్లికేషన్ ఉంటుంది కదా?”
“ఇట్ డిపెండ్స్.. అయితే, అంతా తెలిసే చేస్తారు. అమాయకులో, అబలలో ఎవర్లేరిక్కడ.” అన్నది స్నేహితురాలు.
తమాషా ఏంటంటే, పబ్బుకు జంటగానే వెళ్ళాలి కాబట్టి, నాంకేవాస్తే అని ఎవరో ఒక అబ్బాయినో, అమ్మాయినో వెంటేసుకుని వెళ్తారు. అలా వెళ్ళేవాళ్ళ డీలింగేంటంటే, లోపలికి వెళ్ళేవరకే కలిసుంటాం. లోపలికెళ్ళగానే నువ్వెవరో, నేనెవరో అన్నట్టు విడిపోవాలి. నువ్వు నీకు నచ్చిన వాళ్ళను చూసుకో, నేను నాకు తగినవాళ్ళను చూసుకుంటాను అన్న ఒప్పందంతోనే లోపలకి వెళ్తారు.
అలా వెళ్ళిన వాళ్ళు బయటొచ్చేప్పుడు వేరే వాళ్ళతో జంటగా వాస్తారు. ఇందులో కామెడీ ఏంటంటే, వీళ్ళు నానా తిప్పలూ పడి జత కలిసిన వాళ్ళు కూడా నాంకేవాస్తే కేండిడేట్లే అన్నదే.
ఇదిలా ఉండగా, స్మోకింగ్ ఏరియాలో ఓ అన్యాయం జరుగుతుంటుంది. పబ్బులోపలికి వచ్చినప్పట్నుంచి కొన్ని ఆత్మలు స్మోకింగ్ ఏరియాలోనే ఉంటారు. ఆ స్మోకింగ్ ఏరియా చెత్త కుండీలా ఉంటుంది. అక్కడ కూర్చుని తాగడంకంటే ఇంటి గడపలోనో, మేడ మెట్ల మీదో కూర్చుని తాగొచ్చు. అదేంటో మరి వేలకు వేలు తగలబెట్టి మరీ పబ్బుకొచ్చి అంత చెత్త స్మోకింగ్ ఏరియా వాతావరణంలో కాలాయాపన చేస్తుంటారు.
కొందరు గర్ల్ ఫ్రండుతో వచ్చి, ఆమెను పబ్బులో వదిలి పెట్టి చివరి దాకా స్మోకింగ్ ఏరియాలోనే గడిపేస్తుంటారు. ఇదేం మానసిక రుగ్మతో ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు. కాస్త సంస్కారవంతులైన జంటలు తమ తమ జోడీలతో వెళ్ళిపోతారు. గుంపుగా వచ్చిన అమ్మాయిలు, డాన్స్ చేస్తుండగా, ఆ గుంపుకు చెందిన ఒక అమ్మాయి టాయ్లెట్ లో పడిపోయుంటుంది. ఆమె టాయ్లెట్లో పడున్న సంగతి గ్రూపుకు తెలీదు. బాధ్యత గల బాయ్ ఫ్రెండుతో వచ్చిన అమ్మాయి అలా పడిపోతే ఆమెకేం ఇబ్బందిలేదు. అయితే డీలింగులోనో, మరో రకంగానో సెటప్ చేసుకొచ్చి అమ్మాయి తాగి తూలుంతుంటే, వాళ్ళని తీసుకొచ్చిన మగాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు బట్టులు చెదిరిపోయి, వాంతి చేసుకుని, టాయ్లెట్లోనే పడుండాల్సిందే. అలాంటప్పు వాంతిని చేత్తో అందుకుని, కడిగి ఆదరించే మరో మగ మహాత్ముడు ఆమెకు ఆదర్శ ప్రేమికుడయ్యే అవకాశం ఉంది.
(రౌండప్ కొనసాగుతుంది)
మూలం: ‘కుంకుమమ్’ అనే అరవ వార పత్రకలో సీరీస్ గా వస్తున్న వ్యాసం. తేదీ: 16 ఆగస్ట్ 2019.
Add comment