చెంపదెబ్బ

“అరేయ్ వేస్ట్ ఫెలో సాగర్‌గా..! ఒంటరిగా సముద్రం దగ్గరికి వెళ్లొద్దని చెప్పానా? మళ్లీ ఎందుకు వెళ్లావ్?”

“ఎందుకు వద్దో చెప్తే.. నేను వెళ్లను అని నీకు చాలా సార్లు చెప్పాకదా?” సాగర్ ఈ ప్రశ్న ఎన్నిసార్లు వేసినా తులసి సమాధానం చెప్పేది కాదు. కానీ ఈసారి ఎందుకో చెప్పాలనిపించింది.

‘’సరే! చెప్తా కానీ, లేచి కొంచెం వెనక్కి వచ్చి నా పక్కన కూర్చో..!’’ అంది. వెంటనే సాగర్ వెనక్కి తిరిగి చూశాడు. తులసి పడవను ఆనుకొని కూర్చొని సాగర్ వైపే చూస్తోంది. కాల్ కట్ చేసి లేచి, వెనక్కి వెళ్లి తులసి దగ్గర నుంచున్నాడు సాగర్. పక్కన కూర్చోమన్నట్లు చేత్తో సైగ చేసింది తులసి.

అమ్మ ముఖంలో ఈసారి కోపం కనిపించలేదు సాగర్‌కి. సముద్రం దగ్గరికి వెళ్తానంటేనే కోప్పడే అమ్మ ఇవాళ ప్రశాంతంగా ఎందుకు నవ్వుతోందో అర్థం కాలేదు.

“వచ్చా కదా! చెప్పు. ఎందుకు సముద్రం దగ్గరికి రావద్దంటున్నావో? 17 ఏళ్ల కొడుక్కి స్వేచ్ఛనివ్వవా? మోడ్రన్ అమ్మవేనా నువ్వసలు?”

చివరి మాటలు తులసిని నవ్వించాయి. ఎప్పుడైనా తులసి మరీ కట్టడి చేస్తుందని అనిపిస్తుంటే అవే వాక్యాలు ప్రయోగిస్తుంటాడు.

“మోడ్రన్ అమ్మని కాబట్టే, నీతోపాటు మొన్నటిదాకా టిక్‌టాక్‌లు, ఇప్పుడు ఇన్‌స్టా రీల్స్ చేస్తున్నాను. నువ్ ఆ టిండర్‌లు, omegleలు ట్రై చేస్తున్నావని తెలిసినా, ఓ కంట గమనిస్తూ ఉన్నాను. ఇంకా నీ గర్ల్ ఫ్రెండ్..” టక్కున అమ్మ నోరు మూసేశాడు సాగర్.

“మోడ్రన్ అమ్మ గారూ.. ఇంక చాలు! మీరేం చెప్పదలుచుకున్నారో నాకర్థమైంది. ఈ టాపిక్ వదిలేసి, ఆ సముద్రం గురించి మాట్లాడమ్మా ప్లీజ్”

తులసి నవ్వింది. సాగర్ కూడా నవ్వుతూ చేయి తీసేశాడు.

“సాగర్! నువ్వు సరదా పడే ఈ సముద్రంలో దాక్కున్న గాంభీర్యం నీకింత వరకు పరిచయం కాలేదు. ఓసారి పరిచయమైతే ఈ సముద్రం నిన్ను భయపెడుతుంది”

“నాకెందుకు తెలీదు. సముద్రానికి కోపమొచ్చిందనుకో సునామీని తెచ్చి మనందర్ని తనలోకి లాగేసుకుంటుంది. అప్పుడు నాన్నని తీసుకెళ్లినట్లు..”

“అది గాంభీర్యం కాదు. గాంభీర్యం అంటే అది కాదు. గుండె బద్దలయిపోయే నిజాల్ని దాచి పైకి మాత్రం మామూలుగా ఉండటం. నీకెప్పుడు ఈ సముద్రం అలా అనిపించని, కనిపించని సముద్రం పలకరింపులు ఇకపై అలా మారే రోజులు వచ్చాయి’’

“అమ్మా! కొంచెం అర్థమయ్యేలా చెప్పమ్మా?” చిరాకు ముఖం పెట్టాడు సాగర్.

“మీ నాన్న సునామీ వల్ల ప్రాణాలు కోల్పోలేదు’’

తులసి చూపులు సముద్రం వైపు నుంచి సాగర్ వైపుకు వెళ్లలేదు. చూపుల్ని అటు తిప్పాలని ఉన్నా, తులసి అందుకు సిద్ధంగా లేదు.

‘’అమ్మా..’’

సాగర్ కి అమ్మని ఇంకోసారి అడగాలని కానీ, ‘అమ్మా’ అని ఇంకోసారి పలకరించాలని గానీ లేదు. అమ్మ అంత స్థిరంగా మాట్లాడ్డం, అదీ తనవైపు కనీసం చూడకుండా మాట్లాడ్డం సాగర్ ఇది వరకు ఒక్కసారే చూశాడు. మూణ్నెళ్ల క్రితం అమ్మకి క్యాన్సర్ వచ్చిందని తెలిసినప్పుడు ఇంతే స్థిరంగా మాట్లాడింది. కూర్చోబెట్టి మరీ చెప్పింది.

“సాగర్! ఈ అమ్మ ప్రాణాల కోసం పోరాటం చేసే సమయం వచ్చింది. నేను పోరాడతాను. ఒడ్డుకు చేరుకోవాలని తహతహలాడే అలల్లాగానే పోరాడతాను. కానీ, ఫలితం నా చేతుల్లో లేదు. అందుకే నువ్వు ధైర్యంగా ఉండాలి. నేనూ ఉండని ఈ ప్రపంచంలో నా కొడుగ్గా నీ జీవితాన్ని కొనసాగించాలి” అంటూ ఏడుస్తున్న సాగర్ ని దగ్గరికి తీసుకుంది.

మళ్లీ ఇప్పుడు..

రెండు నిమిషాలపాటు ఇద్దరూ మౌనంగా ఉన్నారు.

“సాగర్! నీకు మేం పెట్టుకున్న పేరు అది కాదు. భవీంద్ర. మీ తాత గారి పేరు కలిసొచ్చేలా పెట్టుకున్నాం. కానీ‌ అరుణ్ ఈ సముద్రంలో కలిసిపోయిన క్షణం నుంచి నిన్ను సాగర్‌గానే పిలుచుకుంటున్నాన్నేను’’ తల తిప్పకుండానే  మళ్లీ మాట్లాడింది తులసి.

‘’నాన్న సునామీ వలన చనిపోలేదన్నావ్?’’

‘’అవును. ఈ సముద్రం నేను దాచిన భయంకరమైన నిజాన్ని, నాతోపాటే తనలో కూడా దాచుకుంది. నా ప్రాణంగా ప్రేమించే అరుణ్ దేహాన్ని నన్ను చూడనివ్వకుండా దాచుకుంది. పరువు అంటూ కన్నకూతురి భర్తను కూడా చంపేసిన నా తండ్రి క్రూరత్వాన్ని కూడా దాచుకుంది. నేనెప్పుడు వచ్చినా, గాంభీర్యంతో నా వంక చూస్తుంది. ఇంకా ఎన్నాళ్లు దాస్తావ్ అని! ఒక్కోసారి నేనే చెప్పనా అన్నట్లు తన అలల్ని నీ దగ్గరికి పంపిస్తున్నట్లు అనిపిస్తుంది నాకు.”

అమ్మెప్పుడూ తాత గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. అమ్మానాన్నల ప్రేమని తాత అంగీకరించకపోతే, ఇంట్లో నుంచి వచ్చేసి పెళ్లి చేసుకున్నామని చెప్పింది. నాన్నతో కలిసి చెన్నైలో స్థిరపడ్డామని చెప్పింది. నాన్న సునామీలో ప్రాణాలు కోల్పోయాడని చెప్పింది. తాత పరువు మర్యాదలకు భంగం కలిగించడం ఇష్టం లేక ఇక్కడే ఉండిపోయినట్లు చెప్పింది. తాత ఫొటో కూడా చూపించలేదు. కానీ, ఇప్పుడేమో! సాగర్ నిజాన్ని జీర్ణించుకునే స్థితిలో లేడు.

“ఇప్పుడు కూడా నాకీనిజం చెప్పాలని లేదు. కానీ తెలుసుకోవాల్సిన అవసరం నీకుంది. ఈ క్యాన్సర్ నన్నేం చేస్తుందో నాకు తెలీదు. నేను లేని ఈ ప్రపంచం నీకు శూన్యంలా కనిపించడం నాకు ఇష్టం లేదు. అకారణంగా మీ నాన్న దూరమైతే, ఆ లోటు కూడా తెలీకుండా నిన్ను పెంచాను. ఇప్పుడు నేనూ నిన్ను వదలి వెళ్లాల్సి వస్తుందని అనుకోలేదు. కానీ వచ్చేసింది. అందుకే చెప్పాల్సి వస్తోంది. ఈ నిజం తెలిసాక ఈ సముద్రం నీక్కూడా గంభీరంగానే కనిపిస్తుంది.

నాకైతే ఇప్పటికీ అలానే కనిపిస్తుంది. వచ్చే ప్రతి అలా లోపలికి రమ్మని పిలుస్తున్నట్లే అనిపిస్తుంది. దూరం నుంచి ఉధృతంగా ఒడ్డుకు వస్తున్న అల నీ అరుణ్‌ని చూపిస్తా రా! అని పిలిచినట్లే అనిపిస్తుంది. నీ బంధం నన్ను ఆపింది’’

సాగర్ మౌనంగానే కూర్చున్నాడు. తులసి చెప్తోంది.

“అరుణ్‌కి నాకూ బీచ్ అంటే చాలా ఇష్టం. అందుకే పది నిమిషాల్లో మెరీనా బీచ్‌కి చేరుకునేలా ఇల్లు తీసుకున్నాం. తన కారణంగా కుటుంబానికి నేను దూరమయ్యానని అరుణ్ బాధపడేవాడు.

పెళ్లై రెండేళ్లవుతోంది. నువ్ పుట్టి మూడు నెలలు. ఓరోజు నాన్న నుంచి ఫోన్ వచ్చింది. నాన్న నా కోసం ఫోన్ చేసి బాగోగులు అడుగుతున్నాడు. ఇన్నాళ్లకి మా నాన్న మనసు కరిగిందన్న ఆనందంలో ఏడుపొచ్చేసింది నాకు. “తల్లీ నన్ను క్షమించు! ఊర్లో పరువుకు భయపడే నిన్ను బాధపెట్టాను. నువ్వు చెన్నైలోనే ఉన్నావని తెలిసింది. నిన్ను చూడాలనుందమ్మా. రేపు ఉదయాన్నే వస్తానమ్మా” అంటూ నాన్న కాల్ కట్ చేశాడు. అరుణ్ ఎంతో ఆనందపడ్డాడు.

ఆరోజు 26 డిసెంబర్ 2004

ఉదయం 6.30 గంటలకు నాన్న నుంచి ఫోన్ వచ్చింది. సెంట్రల్ బస్టాండ్‌కు అరుణ్ వెళ్లాడు నాన్నని తీసుకొద్దామని. నాన్నకి బీచ్ ఒడ్డున కూర్చోవడమంటే మరీ ఇష్టం. ఇంటికన్నా ముందు బీచ్‌ని, మూడు నెలల వయసున్న నిన్నూ చూపిద్దామని బీచ్ దగ్గరికి బయల్దేరా నేను. పది నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాను. నాన్న వాళ్ల కోసం ఎదురుచూస్తున్నాను. యథాలాపంగా పక్కకు చూసిన నాకు పార్కింగ్ లాట్‌లో అరుణ్ బైక్ కనిపించింది. వచ్చేశారన్న మాట! మరి నాకెందుకు అరుణ్ ఫోన్ చేయలేదు అనుకుంటూ బీచ్ వైపు తిరిగాను.

దూరంగా.. అరుణ్ కిందపడుతున్నట్లు కనిపించింది.

అరుణ్.. అవును అరుణే..! తెల్లచొక్కా రక్తంతో తడిసిపోతోంది. ‘అయ్యో! అరుణ్’ అంటూ ఏడుస్తూ నిన్ను ఎత్తుకుని తన వైపు పరిగెత్తాను. ఆ వెనక ఉన్న సముద్రం ఉగ్రరూపాన్ని చూడటం అదే తొలిసారి. అంతలోనే ఎవరో నన్ను పట్టుకొని వెనక్కి లాగారు.  పెద్ద రాకాసి అలలు మీదకొస్తున్నాయి. అంతా గందరగోళం. విధ్వంసం. చూస్తుండగానే పెద్ద అల ఒకటి అరుణ్‌ని లోపలికి లాగేసుకుంది. తను సముద్రంలో కలిసిపోయాడు. ఎవరో రక్షించారు. నిన్నూ.. నన్నూ!

అరుణ్ చనిపోయాడని తెలుసు. అరుణ్ మృతదేహం కోసం వెతికాను. పిచ్చిదానిలాగా ఆ బీచ్ దగ్గర తిరిగాను. ఎంతో మంది పోలీసులు, ఆసుపత్రులు, అంబులెన్సులు.. ఎక్కడా లేదు. నాన్న మోసం చేశాడు. ఇన్నాళ్లుగా ఆచూకీ తెలీక ఆగాడు. తెలిసుంటే ఏనాడో చంపేసేవాడని అర్థమై గుండె బద్దలైంది. కళ్ల ముందు పెరిగిన కూతురి మీద ఇష్టం కన్నా, కనిపించని పరువు కోసం మనిషిని చంపేంత క్రూరత్వం నా తండ్రిలో ఉందని తెలిసి అసహ్యమేసింది. నాకూ, ఈ సముద్రానికి మాత్రమే తెలిసిన ఈ నిజం ఇన్నాళ్లకు నీకు చెప్పాలనిపించింది. పదిహేడేళ్ల కొడుక్కి సమాజంలోని మరో కోణం గురించి కూడా చెప్పాలి. అసహ్యకరమైన కోణం అది. బంధాల కన్నా ఎదుటి వ్యక్తి ఇచ్చే కితాబుల్లో పరువుని వెతుక్కునే సమాజం గురించి నువ్ తెలుసుకోవాల్సిన సమయం ఇది.”

తులసి కళ్లు వర్షిస్తున్నాయి. సాగర్ ఏడుస్తూనే ఉన్నాడు. సముద్రాన్ని చూసినప్పుడల్లా అమ్మ ఎందుకు పరధ్యానంగా ఉండేదో ఇప్పుడే అర్థమవుతోంది సాగర్‌కి. వారానికి కనీసం రెండుసార్లు పట్టుబట్టి మరీ ఇక్కడకి తీసుకొస్తున్నాడు తను. అమ్మ మనసును బాధపెట్టానన్న విషయం గ్రహించి ఏడుపు తన్నుకొస్తోంది. కొంచెంసేపు ఎవరూ మాట్లాడుకోలేదు. “అమ్మా! తాతని శిక్షించాలనిపించలేదా నీకు?” సాగర్ తులసి చేయి పట్టుకుంటూ అడిగాడు.

“కూతురి జీవితాన్ని నాశనం చేస్తున్నాననే స్పృహతోనే ఈ పని చేసిన అతనికి ఏ శిక్ష విధిస్తే మాత్రం ప్రాయశ్చిత్తం కలుగుతోంది చెప్పు.”

రాత్రవుతోంది. సాగర్ టైం చూశాడు. ఆ వాచ్ చూపిస్తోంది సమయం 7:09 నిమిషాలు. తేదీ 26 డిసెంబర్ 2020. నాన్న చనిపోయిన రోజు ఇదే కదూ! గుండె బరువెక్కింది. అమ్మ ఇంకెంత బాధని అనుభవిస్తుందో గ్రహించి వెంటనే లేచాడు.

“అమ్మా వెళ్దామా?”

తులసి మౌనంగా లేచింది. ఇంటికి వెళ్లారిద్దరూ.

ఆ తరువాత సాగర్ బీచ్‌కు రావడం తగ్గించేశాడు. సముద్రం వైపు చూడాలనిపించట్లేదు తనకి.

***

రెండేళ్లు గడిచాయి. తులసి ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఆరోగ్యం క్షీణిస్తున్నా,అదే నిబ్బరంతో సాగర్ కలల్ని నెరవేర్చే సహకారం అందిస్తోంది. సాగర్ అమ్మని సంతోషంగా ఉంచడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తను ఇచ్చిన తోడ్పాటుతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌‌గా, యూట్యూబర్‌గా మంచి గుర్తింపే సాధించాడు. లక్షలాది మంది రోజూ గెట్ వెల్ సూన్ అని మెసేజ్‌లు పంపిస్తూనే ఉంటారు. తులసి సాగర్ ఉన్నంత సేపూ నవ్వుతూ ఉండేందుకే ప్రయత్నిస్తుంది. ఓరోజు ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. తులసి ఫ్యామిలీ డాక్టర్ తులసి తన గురించి సాగర్‌కి చెప్పేశారు. పరిస్థితి చేయిదాంటిందన్నారు.

సాగర్ ధైర్యం వాస్తవాన్ని తట్టుకునేంత స్థాయిలో లేదు. కుప్పకూలాడు. అమ్మ కోసం ఏం చేయలేని నిస్సహాయతలో కూరుకుపోయాడు. తన కోసం ఏదైనా చేయాలనుంది. నిర్ణయం తీసుకున్నాడు. ఆసుపత్రి నుంచి నేరుగా ఇంటికెళ్లాడు. అమ్మ గదిలోకి వెళ్లి ఏవో ఫొటోలు, డైరీలు వెతికాడు. తన స్నేహితుడు తేజూకి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తరువాత కొన్ని కాల్స్ చేశాడు.

తులసి స్నేహితులతో మాట్లాడాడు. మర్నాడు ఉదయం అందరూ వచ్చారు. తులసిని అంబులెన్స్‌లోకి జాగ్రత్తగా ఎక్కించారు. ఎక్కడికి అని ఓపిక తెచ్చుకుని అడిగింది. సాగర్ ఏం చెప్పలేదు. ప్రయాణం మొదలైంది. మిగిలినవారు మూడు కార్లలో బయల్దేరారు.

కొన్ని గంటల తర్వాత అంబులెన్స్ ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించింది. కొంత సేపటికి ఓ గ్రామంలోకి, ఆ తరువాత ఓ ఇంటి ముందు ఆగింది.  అన్ని బండ్లు ఊళ్లోకి వచ్చేసరికి ఇరుగుపొరుగూ గుమిగూడారు. సాగర్ అంబులెన్స్‌లో నుంచి దిగి, ఆ ఇంటి లోపలికి వెళ్లే లోపే ఓ పెద్దాయన ఆ ఇంట్లోనుంచి వస్తున్నాడు. పెద్దాయనే! పెద్దరికం కనిపిస్తోంది. సాగర్ వేగంగా వెళ్లి, ఆయన చేయి పట్టుకొని అంబులెన్స్ దగ్గరికి తీసుకొచ్చాడు.

తులసిని చూసి ఆ పెద్దమనిషిలో ముఖకవళికలు మారిపోయాయి. మిశ్రమ స్పందన అది. తులసి ముఖంలో మాత్రం ఏ మార్పు లేదు. అంతే నిశ్చలంగా ఉంది.

సాగర్ తులసి దగ్గరకి వెళ్లాడు. నర్సు సాయంతో కూర్చొబెట్టగలిగారు. జనాలందరూ తులసిని గుర్తుపట్టారు.

‘తులసమ్మా’ అరిచారెవరో!

‘తులసీ.. తులసేనా?’

ఇంట్లో నుంచి పెద్దావిడ పరిగెత్తుకొచ్చింది. భోరున ఏడుస్తూ తులసిని అక్కున చేర్చుకుంది.

‘తులసమ్మ బతికే ఉందిరా?’ మాటలు గాలికన్నా వేగంగా పరుగులు తీస్తున్నాయ్.

ఆ పెద్దమనిషి అలానే నుంచొని ఉన్నాడు. సాగర్ ఇంటివైపు చూశాడు. వరండాలో తన తల్లి ఫొటో. ఎంతో అందంగా నవ్వుతున్న ఫొటోకి దండ. సాగర్ ఆ పెద్దమనిషి కళ్లల్లోకి చూశాడు.

తులసి వైపే కోపంగా చూస్తున్నాడాయన. “నువ్వు చచ్చావని ఆ రోజే ఊరంతా చెప్పా. మళ్లీ ఎందుకు దాపురించావ్. నీ మొఖం చూడ్డానికే కంపరంగా ఉంది నాకు..” కోపం కట్టలు తెంచుకుంది ఆ పెద్ద మనిషిలో.

తన తండ్రి ఊపిరిని తీసిన ఈ పెద్ద మనిషినేనా అమ్మ మంచోడని చెప్పింది అని గుర్తొచ్చి అసహ్యమేసింది సాగర్‌కి. నర్సు సాయంతో స్ట్రెచర్‌ను ఆ పెద్ద మనిషికి దగ్గరగా తీసుకెళ్లాడు. తులసి చేయిని గట్టిగా పట్టుకొని ఆ పెద్ద మనిషి చెంప ఛెళ్లుమనిపించాడు.

ఊహించని ఆ సంఘటనకి అంతా విస్తుపోయారు. తులసి నిశ్చేష్టురాలైంది. ఆ పెద్దమనిషి పెద్దరికాన్ని గంగలో కలిపే చెంప దెబ్బ అది.  ఓ కుటుంబానికి కడుపుకోతను మిగిల్చిన పరువుదాహానికి చెంపదెబ్బ అది. ప్రేమించిన పాపానికి కూతురి జీవితాన్ని నాశనం చేసినందుకు తండ్రికి విధించిన శిక్షలాంటిది ఆ చెంపదెబ్బ.

కొంతసేపటిదాకా ఎవరూ మాట్లాడలేదు. సాగర్ తులసిని అంబులెన్స్‌లోకి ఎక్కించాడు. ఆ ఊరి నుంచి బళ్లన్నీ తిరుగు ప్రయాణమయ్యాయి. తులసి చేయి పట్టుకునే కూర్చున్నాడు సాగర్. తులసి కళ్లలోంచి కన్నీరు వస్తోంది. తాను కొట్టింది తన తండ్రిని కాదు. నిండు ప్రాణాన్ని బలితీసుకున్న రాక్షసత్వాన్ని. కనిపించని పరువు కోసం, దూరంగా ఉన్న కూతుర్ని వెతికి పట్టుకుని మరీ, ఒంటరిని చేసిన మూర్ఖత్వాన్ని.

**

ఊరి నుంచి వచ్చేశాక తులసి సముద్రాన్ని చూస్తానని అడిగింది. అప్పటి నుంచి అమ్మని బీచ్ దగ్గరికి తీసుకెళ్లేవాడు సాగర్. కొన్నాళ్లకు తులసి పోరాటం ముగిసింది. అంత్యక్రియలకు ఊరి నుంచి చాలా మందే వచ్చారు. తులసి తల్లి కూడా వచ్చింది. ఆ పెద్ద మనిషి కూడా వచ్చాడు.

తన కూతురి అంత్యక్రియలు జరిపించి, తన మనవడిని అక్కున చేర్చుకుని మళ్లీ పెద్దరికాన్ని నిలబెట్టుకుందామని కావొచ్చు! లేదంటే ఆ చెంప దెబ్బ వల్ల కలిగిన ప్రాయశ్చిత్తమూ కావొచ్చు.

*

వాస్తవానికి దగ్గరగా ఉండే కథలు ఇష్టం

హాయ్ భానుప్రకాశ్! సాహిత్యంతో మీ పరిచయం ఎప్పుడు మొదలైంది?

* మాది కృష్ణా జిల్లా జగ్గయ్యపేట దగ్గర మక్కపేట. పదేళ్ల వయసులో వరంగల్ జిల్లాలోని తాతయ్య వాళ్ల దగ్గరికి వెళ్లాను. ఇంటర్ వరకూ అక్కడే చదువుకున్నాను. ఆ తరువాత చదువంతా విజయవాడలోనే సాగింది. మా ఇంట్లో అందరికీ పుస్తకాలు చదవడం అలవాటు. పదేళ్ల వయసు నుంచే నేనూ చదవడం మొదలుపెట్టాను. ఇంట్లో యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి, మధుబాబు నవలలు ఉండేవి‌. మా చిన్న మావయ్య బాబ్జీ ద్వారా సాహిత్యంపై మక్కువ మరింత పెరిగింది. అలా చిన్నప్పటి నుంచే సాహిత్యం మీద ఇష్టం ఏర్పడింది.

చిన్నప్పుడు ఏమైనా రాశారా? తొలి కథ ఎప్పుడు రాశారు?

* చిన్నప్పుడు చదవడమే అలవాటు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక మరింత ఎక్కువగా చదవడం మొదలుపెట్టాను. 2012 నుంచి కార్టూన్లు, కవితలు, కథలు రాయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత అవి కొన్ని పత్రికలకు పంపినా వెనక్కి వచ్చేశాయి. 2017 ఉగాది టైంలో హాస్యానందం మాసపత్రికకు ఒక కథ పంపాను. దాని పేరు ‘బామ్మా మజాకా’. ఎడిటర్ పి.రాము గారికి ఆ కథ నచ్చి వెంటనే ప్రచురించారు. అలా హాస్యానందం ఉగాది సంచికలో తొలి కథ రాశాను.

ఆ తర్వాత కథారచన ఎలా కొనసాగింది?

* 2017లో ఈనాడు దినపత్రికలో ఉద్యోగంలో చేరాను. దానికీ నా కథారచనే కారణం. అప్పటికే హాస్యానందంలో నాలుగు, వేరే పత్రికలో మరో రెండు కథలు రాశాను‌. వాటిని చూసి నేను బాగా రాస్తున్నానని నన్ను తీసుకున్నారు.‌ అక్కడి నుంచి ‘విపుల-చతుర’ మాసపత్రికల్లో పనిచేయడం మొదలుపెట్టాను. అక్కడే సాహిత్యం గురించి ఎక్కువగా తెలుసుకున్నాను. విపులలో సుమారు ఏడాదిన్నరకు పైగా యూత్ కాలమ్ నిర్వహించాను. పనిలో భాగంగా రోజూ విభిన్న కథలు, అనువాదాలు చదవాల్సి వచ్చేది. దాని వల్ల కథారచనలో మెలకువలు నేర్చుకున్నాను‌.

 ఇప్పటి వరకు ఎన్ని కథలు రాశారు? మీకు పేరు తెచ్చిన కథ?

* ఇప్పటికి దాదాపు 25 కథలు రాశాను. అందులో 20 దాకా రకరకాల పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 2020 మార్చిలో తెలుగు వెలుగు మాసపత్రికలో రాసిన ‘చిట్టితల్లి’ కథ చదివి చాలా మంది ఫోన్ చేశారు. ఆ కథ చదివి బాధపడ్డాం అన్నారు. అలాంటివి మరిన్ని రావాలన్నారు. నేను రాసిన కథల్లో అది నాకు చాలా తృప్తినిచ్చింది.

 మీకు నచ్చిన రచయితలు? కథలు?

* గోపీచంద్, బుచ్చిబాబు, గొల్లపూడి మారుతీరావు.. వీళ్ల కథలు ఎక్కువగా చదివేవాణ్ణి. వాళ్ల శైలి నన్ను ప్రభావితం చేసింది. బుచ్చిబాబు గారి ‘నన్ను గురించి కథ రాయవూ’ చాలా ఇష్టం. మారుతీరావు గారి ‘అందమైన జీవితం’ కథ చాలా నచ్చింది. ఒకసారి విజయవాడ బుక్ ఫెయిర్‌లో గొల్లపూడి గారిని కలిశాను. ఆయనే నన్ను హాస్య కథలు రాయమని ప్రోత్సహించారు. ‘జనం అనుకునేది, మనం అనుకునేదే హాస్యం కాదు. హాస్య కథ అంటే గుర్తొచ్చిన ప్రతీసారీ నవ్వించాలి. అలాంటి కథ ఒక్కటి రాసి చూడు. హాస్య రచన ఎంత క్లిష్టమైనదో అర్థమవుతుంది. ఆ బాధేమిటో తెలుస్తుంది’ అన్నారు. ఆ తర్వాతే హాస్య కథలు రాయడం మొదలు పెట్టాను.

 ఇంకా ఎలాంటి కథలు రాయాలని ఉంది?

‌* నాకు వాస్తవానికి దగ్గరగా ఉండే కథలు ఇష్టం. కథలెప్పుడూ ఆకాశం నుంచి ఊడిపడినట్టు ఉండకూడదని అనిపిస్తుంది నాకు. ఆ పాత్రలు మనల్ని వెంటాడాలి. అలాంటి కథలు రాసేందుకు ఇష్టపడతాను. విజేతల కథలు కాకుండా పరాజితుల కథలు రాయాలని ఉంది. విజయమైనా, పరాజయమైనా ఆ ఇద్దరి అంతరంగాలు, బాధలు, ఆలోచనలూ‌ అన్ని తెలియాలి అనేది నా అభిప్రాయం.

కర్నాటి భానుప్రకాశ్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు