ఎప్పుడో నలబై ఏళ్ల కింద మొదటిసారి లెఫ్ట్ హాండెడ్ డిక్షనరీ చేతికందినప్పుడు అందులో ఎన్నెన్నో తలకిందుల వాస్తవాల నిర్వచనాలు చూసి దిగ్భ్రాంతి పడ్డాను. జూ అంటే ‘ఎ ప్లేస్ డివైజ్డ్ బై యానిమల్స్ టు స్టడీ ది హాబిట్స్ ఆఫ్ హ్యూమన్ బియింగ్స్’ అన్న నిర్వచనం మనసు మీది నుంచి చెరిగిపోలేదు. ఇప్పుడు కరోనా వైరస్ మహా విపత్తు కల్పించిన నిర్బంధం ఆ జూ వంటి స్థితి లాగే ఉన్నది.
సంఘ జీవి అని తనను తాను ప్రగల్భీకరించుకున్న మానవజీవి ఒంటరి ద్విపాద పశువులా మారింది. ఒక గదిలో బంధించబడి తలుపులు మూసుకుని, టీవీల, పత్రికల కిటికీల నుంచి, సోషల్ మీడియా కటకటాల నుంచి ప్రపంచ ప్రవర్తనను చూడక తప్పని స్థితి దాపురించింది. ఇనుప గ్రిల్స్ బిగించిన బాల్కనీలలో, దోమల మెష్ అతికించిన కిటికీలలో కత్తిరించిన విశాలాకాశం ముక్కలనే ప్రకృతిగా సంతృప్తి పడవలసిన దుస్థితి లోకం మీద పరుచుకుంది.
ఈ గాలరీ ప్రేక్షకత్వంలో జగన్నాటకం కొత్తగా, ఎన్నడూ చూడనట్టుగా, చూసినదే కొత్త అర్థాలలో సాగుతున్నది. అనూహ్యమైనది అనివార్యంగా, అనివార్యమైనది అదృశ్యంగా, అసాధారణమైనది అతిసాధారణంగా ఎన్నెన్ని సన్నివేశాలు, ఎన్నెన్ని ప్రవర్తనలు!
చూస్తున్నాను, చదువుతున్నాను, ఆలోచిస్తున్నాను, మథనపడుతున్నాను, నవ్వుకుంటున్నాను, బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను. మానవుడా అని శ్రీశ్రీ చూపిన సహస్ర రూపాలను గుర్తిస్తున్నాను. “జీవిత వాక్యంలో కర్త స్థానంలో ఉండవలసిన వాణ్ని కర్మ స్థానంలో ఉన్నాను” అని సికిందరాబాద్ కుట్ర కేసులో మొదటిసారి బోనులో నిలబడ్డప్పుడు న్యాయమూర్తితో కెవిఆర్ అన్నమాట ఇవాళ ప్రతి మనిషి విషయంలో నిజమవుతున్న విచిత్ర సందర్భాన్ని చూస్తున్నాను.
ఇంత అసాధారణం కూడ అతి సాధారణం కావడాన్నీ చూస్తున్నాను.
దేన్నయినా బంగారంగా మార్చే పరుసవేది విద్య గురించి మానవజాతి వేల ఏళ్లుగా కలలుగంటూ వచ్చింది. అది ఎప్పటికైనా సాధించడం అసాధ్యమేమో గాని, ఎంతటి అసాధారణ సందర్భాన్నైనా అతిసాధారణంగా మార్చడం, ఎటువంటి ఉత్పాతాలలో కూడ అట్టడుగు నుంచి మారకుండా, అల్పత్వాన్నీ, లోభాన్నీ, స్వార్థాన్నీ, ద్వేషాన్నీ, అసమానతనూ, హింసనూ వదులుకోకుండా ఉండడం మనిషికి సాధ్యమైనట్టే ఉంది.
ఇందుకు ఏ ఒక్కరూ మినహాయింపు కారు. ఏ ఒక్కరికీ ప్రపంచాన్ని ఎంతటి మహావిపత్తు ముంచెత్తుతున్నదో తెలుస్తున్నట్టు లేదు. ఒకానొక అత్యల్పప్రాణి అతలాకుతలం చేస్తున్నప్పుడు, మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నప్పుడు కూడ మనుషులు తమ అల్పత్వాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు లేరు.
ఇంత పెద్ద స్థాయిలో కాకపోయినప్పటికీ మృత్యువు, అనారోగ్యం, అంటువ్యాధి, యుద్ధం, అంతర్యుద్ధం, మతోన్మాద ఘర్షణల ఊచకోతలు, జలప్రళయం, మహా క్షామం, వరద, దావానలం, గృహదహనం, దౌర్జన్యం, మునిగిపోతున్న ఓడలో, కూలి పోతున్న విమానంలో, గుద్దుకుంటున్న రైలులో, ఢీకొంటున్న బస్సులో ఉన్న స్థితి, దొమ్మీలో చిక్కుకున్న స్థితి, నిలబెట్టి కాలుస్తున్నప్పటి స్థితి, గుడిసెలో బంధించి అగ్గిపెట్టినప్పటి స్థితి, వెంటాడి వేటాడి అడ్డంగా నరికిన స్థితి, అతి విలువైన మానవ ప్రాణాన్ని నీటి బుడగలా, దూదిపింజలా ఎగరగొట్టిన స్థితి, ఎన్నెన్ని అసాధారణ సన్నివేశాల్ని, దుస్సహ దృశ్యాల్ని చూసింది మానవజాతి, చూపింది చరిత్ర!
తెలుగువాళ్ల వరకే చూసుకున్నా ఏవో ఒకటి రెండు మినహాయింపులతో ఇవన్నీ అనుభవించినవాళ్లమే గద. ఎన్నెన్నో అసాధారణ సందర్భాలను దాటి వచ్చినవాళ్లమే గద. అవి జరుగుతున్నపుడూ జరిగిపోయిన తర్వాతా వాటి అతి సాధరణత్వానికి నవ్వుకున్నవాళ్లమే గద.
కాని ఇవాళ్టి ఉత్పాతం కొత్తది. స్థాయిలోనూ, వ్యాప్తిలోనూ, ప్రమాద తీవ్రతలోనూ ఇది కనీవినీ ఎరగని బృహత్తరమైనది.
కనుక ఇది మనలో ఏమన్నా మార్పు తెస్తుందేమో అని ఒక చిన్న ఆశ ఉండింది. ఇది మనను మారుస్తుందేమో. మనను ఇప్పటికైనా మనుషులను చేస్తుందేమో, నిజమైన సంఘజీవులుగా అంటే సహకార జీవులుగా, ప్రేమైక మానవులుగా మారుస్తుందేమో, ఇది మనలో స్వార్థాల, ఆస్తుల, లాభాల, భేషజాల, ఆధిక్యతల ప్రాధాన్యతను తగ్గిస్తుందేమో. మనను సరుకుల స్థానం నుంచి మనుషుల స్థానానికి మార్చడానికి ఏమన్నా చిన్నమెత్తు ప్రయత్నమైనా చేస్తుందేమో అని ఒక విచికిత్స ఉండింది.
కాని చూడగా ఏమీ మారినట్టు లేదు. ఎవరిని చూసినా ఈ ఉత్పాతం వారి హృదయం లోలోతులకు తగిలినట్టే కనిపించడం లేదు. మనం ఉంటామా లేదా, మానవజాతి భవిష్యత్తు ఉంటుందా లేదా, మన ఈ ఆస్తులూ భుజకీర్తులూ ప్రగల్భాలూ పటాటోపాలూ అతిశయాలూ మన మనుగడకు హామీ ఇవ్వలేకపోతున్నప్పుడు వాటి గురించి కనీస పునరాలోచన, ఒక సింహావలోకనం, ఒక అంతర్మథనం అవసరమనే ఆలోచన కూడ మొదలైనట్టు లేదు.
ప్రతి మనిషీ శ్మశాన వైరాగ్యాన్ని అనుభవిస్తారంటారు గదా, ప్రతి ప్రసవమూ ప్రసూతి వైరాగ్యానికి దారి తీస్తుందంటారు గదా. కళింగ యుద్ధంలో లక్షల మందిని తెగనరికి దయానదిని రక్తనదిగా మార్చిన దుర్మార్గమే పునరాలోచనకూ శాంతికీ దారి తీసిందంటారు గదా.
కరోనావైరస్ మహా విపత్తు మనలో ఏ ఆలోచనలూ ఏ మార్పులూ కలిగించడం లేదా? మన సామాజిక జీవనం గురించి, మన రాజకీయార్థిక జీవనం గురించి, మన అభివృద్ధి నమూనా గురించి, పర్యావరణం పట్లా, ప్రకృతి పట్లా మన దుర్మార్గం గురించి పునరాలోచించవలసిన అవసరాన్నైనా ఈ మహావిపత్తు కలిగించడం లేదా?
పాలకులలో, సంపన్నులలో ఏ మార్పూ లేదు. అదే ఆధిపత్య యావ, అవే అబద్ధాలు, అవే అతిశయోక్తులు, అవే ప్రగల్భాలు, అదే హింస, అదే హక్కుల హననం, అదే దౌర్జన్యం, అదే స్వార్థం, అదే లాభాపేక్ష, అదే ఆశ్రిత పక్షపాతం, అదే వంచనా శిల్పం, అదే అభివృద్ధి నమూనా.
మధ్యతరగతిలో అదే అల్పత్వం, అవే చీలికలు, అవే అసమానతా భావనలు, అదే అకారణ ద్వేషం, అవే అబద్ధాలు, అవే భేషజాలు, అదే హింసారాధన. అదే అధికార భజన. అవే కుట్రలు.
వ్యవస్థా నిర్వాహకులలో, వ్యవస్థా నిర్వాహకులమని అనుకుంటున్న వాళ్లే ఇలా ఏ మార్పూ లేకుండా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడ వాళ్లకు మనుషులమనీ, సంఘజీవులమనీ గుర్తు రానప్పుడు ఇక పేదలకు అవి ఆలోచించే తీరికైనా ఎక్కడున్నది? వ్యవస్థ రథ చక్రాలకింద నలిగిపోతున్న, క్షతగాత్రులవుతున్న, రాలిపోతున్న పేదలు ఈ అసాధారణ స్థితికి ఎలా స్పందిస్తారు? అయినా వారికి బతుకు అసాధారణం కానిదెన్నడు? మనుగడకోసం పెనుగులాటే వాళ్లకు అతి సాధారణం కదా. కరోనావైరస్ మహావిపత్తు వారికి కొత్తగా తెచ్చిన ఆపదేమున్నది, ఆకలి చావు స్థానంలో వైరస్ చావు తప్ప?
అసాధారణమే అతి సాధారణం. అతి సాధారణమే అసాధారణం. ఇదే చరిత్ర గతితర్కం.
*
బాగా రాశారు. మనంగా మారే అవకాశం చాలా తక్కువ.
మాంచి కవిత లా మీ భాషా ప్రవాహం, అంతే ఇదిగా మీ భావావేశం.
బాగా చెప్పారు మానవ మనస్తత్వం గురించి.
“కరోనావైరస్ మహా విపత్తు మనలో ఏ ఆలోచనలూ ఏ మార్పులూ కలిగించడం లేదా? మన సామాజిక జీవనం గురించి, మన రాజకీయార్థిక జీవనం గురించి, మన అభివృద్ధి నమూనా గురించి, పర్యావరణం పట్లా, ప్రకృతి పట్లా మన దుర్మార్గం గురించి పునరాలోచించవలసిన అవసరాన్నైనా ఈ మహావిపత్తు కలిగించడం లేదా?” మీరు చెప్పినట్టు ఏమి మారలేదు” ముఖ్యంగా మధ్యతరగతి లో . పేద వాళ్ళకి ఏమీ ఆలోచించే తిరికే లేదు . తిండి ఎలా అన్న ధ్యాస తప్పించి
ప్రియమైన దేవరకొండ సుబ్రహ్మణ్యం గారు,
కరోనావైరస్ మహా విపత్తులో మన సామాజిక జీవనం అన్నారు చూడండి… అది ఓ చిన్న మాట కాదు… పేదల జీవితాలలోని విలయతాండవం.
తిండికిలేక పిల్లా జెల్లా అంతా మలమలా మాడుతున్న జనారరణ్యపు చేతగాని ప్రాణుల అరణ్యరోదన ఇది. ( కొందరు మానవతాహృదయ దయాళువులు సాటి నిస్సహాయులకు సాయం చేస్తున్నా అది చాలదు )
ప్రస్థుతం భారత్ దేశం లోని నిరుపేదల కడగళ్లు గురించి కాక కేవలం గణాంకాలను ఉటంకిస్తున్నాను :
a) At present, 60 per cent of India’s population, or an estimated 812 million people, live below the poverty line with an income of US$ 3.2 per day ( around Rs 213/- per day ).
b) with the coronavirus pandemic and the economic consequences of an extended business shutdown India’s poorest will increase to 915 million or to 68 per cent.
Job losses, destruction of informal sector and inadequate government support could push India back by a decade in poverty-reduction progress.
ప్రస్థుత ఆర్థిక పతనం 1930లో వచ్చిన గ్రేట్ డిప్రెషన్ కన్నా దారుణంగా ఉందన్నారు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ( ఐఎంఎఫ్ ) చీఫ్ ఎకానమిస్ట్ గీతా గోపినాత్.
The Great Depression of 1929 devastated the U.S. & World economy. A third of all banks failed. 1) Unemployment rose to 25% and homelessness increased. 2) Housing prices plummeted 67%, international trade collapsed by 65%, 3) deflation soared above 10%. World trade plummeted 66% as measured in dollars 4) During the Depression, a third of the nation’s banks failed 5) The stock market lost 90% of its value between 1929 and 1932. It didn’t recover for 25 years.
https://www.business-standard.com/article/economy-policy/coronavirus-impact-over-100-million-indians-could-fall-below-poverty-line-120041700906_1.html
వీక్షణం వేణు గారూ…
మృత్యువు, అనారోగ్యం, అంటువ్యాధి, యుద్ధం, అంతర్యుద్ధం, మతోన్మాద ఘర్షణల ఊచకోతలు, జలప్రళయం, మహా క్షామం, వరద, దావానలం…. చూసిన మానవజాతిలో, సంఘజీవి మానవుడు ఒంటరి ద్విపాద పశువులా ప్రవర్తిస్తుండటం ( వాటితో పోల్చుకుంటున్నందుకు ప్రకృతి లోని పశుపక్ష్యాదుల క్షమార్పణ కోరుకుంటున్నాను )…
మరీ ఇంత తీక్షణ, ధిక్కార, ధీశాలి స్వరమా..
ఇదే చరిత్ర గతితర్కం అని తీర్పు ఇవ్వకండి…చరిత్రను తిరగరాసే భావి తరానికి స్వాగతం పలుకుతున్న మీరు.
ఎవరో వస్తారని ఏదో చేస్తారని, ఎదురు చూసి మోసపోకుమా
నిజం మరచి నిదురపోకుమా అన్న మహాకవి శ్రీశ్రీ ని స్మరిస్తూ
~ ఇట్లు, మీ కె.కె. రామయ్య
అంత సులభంగా బుద్ధిజీవులు ఏంటికి మారతారు సర్ . మీ పిచ్చి కాకపోతే ! కరోనా టైంలో స్థలాల రేట్లు తగ్గుతాయి కొందాం చానా అనిన వాళ్లను నెలలో పదిమందిని చూశా. ఉత్పాతంలోనూ, అంటు వ్యాధుల్లో వ్యాపారాలు ఎతుకుతున్నారు!
మనిషి మారడు
అర్థవంతమైన, అవసరమైన విశ్లేషణ సర్.