మొన్నామధ్య మెట్రో రైల్ స్టేషన్ లిఫ్ట్స్ లో యువజంటలు ముద్దెట్టుకుంటున్నారని గోలగోలైంది. టీవీలు మోత మోగించేసాయట. న్యూస్ పేపర్లు గగ్గోలెత్తించాయి. నేనూ సోషల్ మీడియాలో హడావిడి గమనించాను. ఆడా, మగా అందరూ లింగాతీతంగా గడ్డాలు మీసాల్లేని మనువు తాతల్లా ముందు ఖిన్నులై, స్థాణువులై…ఇంకా ఏదేదో అయిపోయి ఆ తరువాత నశించి, కృశించి పోతున్న సంప్రదాయ రథాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలని చూసారు. ఇంతలో పుల్వామా ఘటన జరిగి అందరి అటెన్షన్ మారిపోయింది కానీ ఆ చుంబన దృశ్యం ఆత్మాహుతి దాడి కన్నా భీతావహంగా కనిపించింది చాలామందికి.
****
మన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ నిరాడంబరతకు, నిజాయితీకి, స్వఛ్ఛతకి పేరొందిన వాడు. ఒక సాంప్రదాయక ప్యూరిస్టు. అటువంటి దేశాయ్ గారు తాను మహరాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో ఒకసారి పేపర్లో బొంబాయి రెడ్ లైట్ ఏరియాలో జరుగుతున్న “నైతిక” విధ్వంసం గురించి, దోపిడీ గురించి చదివారు. వెంటనే ఆయన తన సెక్రటరీని పిలిచి ఒక్క వారం రోజుల్లో రెడ్ లైట్ ఏరియాని మూసేయాలని, సెక్స్ వర్కర్స్ అందరికీ పునరావాసం కల్పించాలని, అక్కడ మళ్ళీ “వ్యాపారం” జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని హుకుం జారీ చేసారు. అప్పుడు ఆయన కార్యదర్శి గారు కొన్ని గణాంకాలు వివరించారు. “అయ్యా! బొంబాయి జనాభా నలభై లక్షలుంటుంది. అందులో కుటుంబ జనాభా ఒక ముప్ఫై, ముప్ఫై ఐదు లక్షలుంటే మిగతా వారందరూ బ్రతుకుతెరువు కోసం దేశవ్యాప్తంగా అన్ని మూలల నుండి ఒంటరిగా వచ్చిన పురుషులే. వారందరూ కుటుంబాల నుండి దూరంగా వుంటున్నవారే. వారు తమ సెక్స్ అవసరాల కోసం రెడ్ లైట్ ఏరియా మీదనే ఆధారపడతారు. వారికి కానీ మీరు ఆ అవకాశం లేకుండా చేస్తే అంతకు మించిన బీభత్సం జరుగుతుంది” అన్నారట. అప్పుడు గాంధీని మించిన గాంధేయవాది ఐన మొరార్జి గుటకలు మింగుతూ ఏం చెప్పలేక, చేయలేక వుండిపోయారట. ఈ విషయం నేను చాలా కాలం క్రితం ఎక్కడో చదివాను. ఎందులో చదివానో ఇప్పుడు గుర్తు లేదు.
సరే, ఈ ఉదంతం ఎందుకు చెబుతున్నానో మీకిప్పుడు అర్ధం అయుండాలి. కామం అనే మానవ సహజాతం ఎంత బలమైనదో అని చెప్పటమే నా ఉద్దేశ్యం కానీ వేశ్యావృత్తిని సమర్ధించటం కాదని మీకు తెలుసని నాకు తెలుసు. సూర్యుడిని చూడమని వేలు చూపిస్తే తెలివైన వారు సూర్యుడి వైపు చూస్తారని, తెలివి తక్కువ వారు వేలు వంక చూసి సూర్యుడెక్కడ అని అడుగుతారని కూడా మీకు తెలుసని కూడా నాకు తెలుసు.
****
మానవ సహజాతాల్లో అత్యంత తృప్తిని, అత్యంత అసంతృప్తినీ కలిగించేది కామమే. దీని చుట్టూ అల్లుకున్న విలువలు, విధ్వంసం మరే విషయం చుట్టువుండవు. దాన్ని దారుణంగా కంట్రోల్ చేయటం వల్ల కూడా మానవ సంబంధాల్లో హింస ఏర్పడుతుంది. మన వ్యవస్థలో లైంగిక సంబంధాలతో సహా అన్ని మానవ సంబంధాల్లోనూ ప్రజాస్వామికత లోపించే విధంగానే విలువలు వున్నాయి. ప్రజల్లో భిన్న సమూహాల మధ్య అణచివేతకి అలవాటు పడ్డ నేల మీద సహజాతాలు కూడా అణచివేతకే గురవుతాయి. అణచివేయక పోతే అనర్ధానికి, విశృంఖలత్వానికి దారి తీస్తుందన్న భయం విలువల భావజాలంగా రూపాంతరం చెందింది. నిజానికి ఈ అణచివేతే విశంఖలత్వానికి దారి తీస్తుందనేది మనం ఆలోచించటానికి, ఒప్పుకోటానికి సంశయించే విషయం. ఇన్ని లైంగిక దాడులు, అత్యాచారాలు విశృంఖలత్వంలో భాగం కాదా? అడ్డూ అదుపూలేని విధంగా జనాభ పెరిగిపోవటం స్త్రీల శరీరాల మీద అమలయ్యే లైంగిక విశృంఖలత్వం కాదా? సరైన విధంగా ఎడ్యుకేట్ చేసి స్వీయ నియంత్రణలో ఉంచుకోవాల్సిన కామాన్ని భయభ్రాంతుల్ని చేసైనా సరే అణచివేయాలనే ధోరణి మన విలువలది. ఈ అణచివేత ప్రధానంగా పురుషుల కంటే స్త్రీలకే వర్తిస్తుంది. స్త్రీలు ముడుచుకుపోయి వివాహానికి ముందుగా రాబోయే భర్త కోసం, వివాహమయ్యాక భర్త కోసం, విధవరాలయ్యాక పోయిన భర్త స్వర్గ సుఖాల కోసం తమ లైంగిక సంవేదనల్ని అణచివేసుకొని పాతివ్రత్యాన్ని కాపాడుకుంటుంటారు. సాతివ్రత్యాలు, శీలాలు అవసరం లేని మరి పురుషులు తమ సాతివ్రత్యాన్ని ఎలా పోగొట్టుకోవాలి? పురుషుల యొక్క ఆ అవసరాల్ని తీర్చటానికి ఏర్పాటైనదే వేశ్యా వృత్తి. వంద మంది పురుషుల కోరికల లోడ్ ని ఒక స్త్రీ స్వీకరించటం ద్వారా ఆమె తన బ్రతుకుతెరువుని వెతుక్కునే విధంగా ఏర్పాటైనదే వేశ్యా వృత్తి. ఎక్కడ స్త్రీల మీద అధికంగా ఆంక్షలుంటాయో అక్కడ వ్యభిచారమూ అధికంగానే వుంటుంది. కనుకనే అణచివేతే విశృంఖలత్వానికి, వ్యభిచారానికి అసలు హేతువని భవదీయుడు వంటి వారు మొత్తుకుంటున్నారు.
****
కాలం మారుతున్నది. బాలికలు బాలురతో, యువతులు యువకులతో, స్త్రీలు పురుషులతో అన్ని జీవనచక్రంలోని అన్ని దశల్లోనూ దీటుగా పోటీ పడుతున్నారు. ఆర్ధికంగా కింది వర్గాలతో తప్ప స్త్రీ విద్య అనేది ఇప్పుడు ప్రశ్నించాల్సిన విషయమే కాదు. దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి అమ్మాయిల్లో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతున్నది. కొంతమంది నోర్లు నొక్కుకుంటున్నా అమ్మాయిలు, అబ్బాయిల స్నేహం అనేది ఒక నిషిద్ధ వ్యవహారం కాదు. ఆడపిల్లలు బైటకి రావటం, మగపిల్లలతో సమానంగా కదలగలగటం ఇపుడే మాత్రం ఆశ్చర్యార్ధకం కాదు. స్త్రీలు విరివిగా బైటకి రావటం వలన మార్కెట్ బాగా జోరందుకుంది. విద్యారంగపు మార్కెట్ మాత్రమే కాక, సౌందర్య సాధనాలు, దుస్తులు, రెస్టారెంట్లు, స్కూటరెట్ల అధిక వినియోగం వల్ల మోటార్ వాహనాలు…ఈ మార్కెట్లన్నీ బాగా జోరందుకున్నాయి. వాళ్ళు బీర్లు కూడా తాగుతున్నారని వాపోయేవారిని వాపోనివ్వండి కానీ పదో తరగతి తో చదువాపించేసి, 18కో, 20కో పెళ్ళి చేసేసి తల్లులుగా మార్చేయటాన్ని మించిన చెడ్డ విషయం కాదు. (మళ్ళీ అదే చెప్తున్నా వాళ్ళు బీర్ తాగటం మంచిదని నేనన్నాననే వాదనలు చేయొద్దని. నేనన్నది వాళ్ళు ఫ్రీగా కదలగలగటం గురించి. వేలుని కాదు సూర్యుడి వైపు చూడాలి మాస్టారూ!)
పాతికేళ్ళొచ్చినా, ముప్ఫైకి దగ్గర పడుతున్నా ఏదో కోర్సులోనో, పరిశోధనల్లోనో బిజీగా వుండి ఆశలు, ఆకాంక్షలు ఎక్కువగా, అవకాశాలు తక్కువగా వున్న వాతావరణంలో పెళ్ళనేది కెరీర్ కంటే తక్కువ ప్రాధాన్యతాంశంగా మారిన పరిస్తితుల్లో లైంగిక సహాజాతాల తృప్తి ఎంతవరకు అణచుకోవటం సాధ్యం? అణచుకోకపోతే బరితెగిస్తారా? అని ప్రశ్నించే వారందరూ తాము కూడా ఇప్పటి బిలేటెడ్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ కి, డిలేడ్ మేరేజెస్ కి బాధ్యులేనని గుర్తుంచుకోవాలి. కౌమార్య వయసు నుండే స్వేఛ్ఛకి దారితీసే వాతావరణం, సంస్కృతిని తాము రెండు చేతులూ చాచి ఆహ్వానిస్తున్న విషయం గురించి పెద్దలు మర్చిపోయి మర్చిపోయి మన సంస్కృతి, సాంప్రదాయం అంటూ మూర్ఛనలు పోకూడదు.
****
“వై షుడ్ బాయ్స్ అలోన్ హావ్ ద ఫన్?” అన్న ఒక స్కూటరెట్ అడ్వర్టైజ్మెంట్ ఆడపిల్లల మీద చూపించే ప్రభావం అపారం. అది నిజానికి ఇవాల్టి సగటు ఆడపిల్లల మనోస్తితికి దర్పణం లాంటిది. మగపిల్లల కంటే తామేం తక్కూ అని వారనుకోవటం లేదు. వాళ్ళు మగపిల్లల్లాగే బళ్ళ మీద తిరగటానికి, ఈటింగ్ జాయింట్స్ లో టైం గడపటానికి, మల్టీప్లెక్స్ ల్లో సినిమాలు చూడటానికి, ఇంకా చెప్పాలంటే పబ్బులకి, క్లబ్బులకి విహార యాత్రలకి, లాంగ్ డ్రైవ్ లకి వెనుకాడటం లేదు. డేటింగ్ లో, రిలేషన్షిప్ లో వుండటం సాధారణమైపోయింది. వాటి బ్రేకప్ల్స్ ఇంకా సర్వ సాధారణమైపోయింది. ఇన్ హిబిషన్స్ (బిడియాలు) తగ్గి, వినోద ప్రేమ, సమానత్వ కాంక్ష, సెన్సాఫ్ హ్యూమర్, వేగవంతమైన కదలికలు, ఆత్మవిశ్వాసం…ఇవీ ఈ తరం అమ్మాయిల్లో బాగా కనిపిస్తున్న ధోరణులు. ప్రేమ స్థానంలో డేటింగ్, ప్రేమికుల స్థానంలో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి మెల్లిగా పెళ్ళి స్థానాన్ని రిలేషన్షిప్ ఆక్రమించుకుంటున్నది. అయితే ఏదో ఒక చదువై పోయి, ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అయినవారు పెళ్ళి పీటలెక్కుతుండగా, అలా కాలేనివాళ్ళు డేటింగ్స్, రిలేషషిప్స్ లో ప్రవేశిస్తున్నారు. నా చిన్నప్పుడు 20, 22 ఏళ్ళ వయసు ఆడపిల్లలు పెళ్ళి కాకపొతే గుండెల మీద కుంపట్లని భావించబడే వారు. నా జనరేషన్ కి అది పాతికేళ్ళకి పెరిగింది. ప్రస్తుత జనరేషన్లో 25 ఏళ్ళకి ఇంకా చదువుకుంటున్నారు.
కొద్దిపాటి చదువుతో జిల్లాల నుండి, మారుమూల పల్లెల నుండి సిటీలకి వచ్చి షాపింగ్ మాల్స్ లో, కాల్ సెంటర్లలో, నర్సులుగా, డెలివరీ బాయ్స్ గా, క్యాబ్ డ్రైవర్స్ గా, ఇంకా ఎన్నో రకాల చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే యువతీ యువకులు లక్షల్లో వుంటారు. కురవని మేఘాల్లాంటి రాని ఉద్యోగాల కోసం, గ్రూప్స్ పరీక్షల కోసం కలలు కంటూ, శిక్షణలు తీసుకుంటూ వేలాదిమంది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ చుట్టు పక్కలా, ఇంకా సుందరయ్య విజ్ఞాన కేంద్రం, సిటీ సెంట్రల్ లైబ్రరీలో వందలాదిగా కుర్చీలేక్కూర్చొని పోటీ పుస్తకాలతో కుస్తీ పట్టే ముప్ఫైల్లో వున్న యువత మనకి అతి మామూలుగా కనబడతారు. కెరీర్ ముఖ్యమైపోయి, పెళ్ళి చేసుకోనంత మాత్రాన ప్రకృతి ఊరుకుంటుందా? వాళ్ళనలా ఊరుకోమని చెప్పే అర్హత ఎవరికుంటుంది? ఒక తోడు దొరికి, కోరిక పుట్టినప్పుడల్లా “ఛా! ఇది మన సంప్రదాయం కాదు. మనం ఇలా చేయకూడదు” అనే అసాధారణ, అసహజ మనోస్తితిని వారి నుండి ఆశించటం హాస్యాస్పదం. డిగ్రీ అయిన వెంటనే జీవితంలో సెటిల్ కాగలిగే వారెంతమంది? తొలి ఇరవైల్లో పెళ్ళి చేసుకునే అవకాశం ఎందరికుంటుంది?
అదిగో! నా వైపు అలా గుర్రుగా చూడకండి. పద్ధతీ పాడు లేకుండా అలా తిరిగేస్తారా? అంటూ కోగంటి చాటేశ్వర్రావులా నన్ను నిలదీయకండి. నేను జరుగుతున్నదే చెబుతున్నాను. కాలానుగుణంగా విలువలు మారతాయంటున్నాను.అనివార్యతల్ని గుర్తించలేని మీ సంప్రదాయ దృష్టికోణాన్ని మార్చుకోమంటున్నాను. వేలుని కాకుండా సూర్యుడి వైపే చూడమంటున్నాను.
****
లైంగిక స్వేఛ్ఛ అనేది ఒక ఫాషన్ కాదు. అయితే దాని పట్ల సరైన అవగాహన లేకపోతే ఎక్కువగా నష్టపోయేది స్త్రీలే. కానీ కట్టడి కంటే విద్య ముఖ్యం అని నేను నమ్ముతాను. అణచివేత కంటే స్వీయ నియంత్రణ సరైన విలువనుకుంటాను. స్వీయ నియంత్రణలో స్వంత నిర్ణయం, చాయిస్, స్మార్ట్ నెస్స్ వుంటాయి. అణచివేత ఉల్లంఘనకి దారి తీస్తుంది. బలవంతంగా తొక్కిపెడితే మొదట్లో అనుకున్నట్లు వ్యభిచారం పెరగటానికి దోహదం చేస్తుంది. స్వీయ నియంత్రణ అంటే కోల్పోవటం కాదు. లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ కదలటమే. ఐతే యువతకి అంతటి పరిణతి రావాలంటే ముందు సమాజం అవలంభించే మోరల్ పోలీసింగ్ వదులుకోవాలి. మారుతున్న కాలాన్ని అర్ధం చేసుకొని నైతిక తీర్పులకి పాల్పడటం మానేయాలి. వ్యక్తుల ప్రైవసీని గౌరవించే తత్వం అలవరుచుకోవాలి. జీవితంలో శృంగారం ఒక భాగమే కానీ అదే మొత్తం జీవితం అనే హ్రస్వ దృష్టి నుండి బైటపడాలి. నైతిక విలువలన్నింటినీ దేహం చుట్టు అల్లటం మానేయాలి. శృంగారం అనేది బూతు కాదని, ప్రకృతిలో భాగమని, దాన్ని అణచివేస్తేనే మనసులో స్వైరకల్పన(ఫాంటసీ)లు పెరిగి, శృంగారం బూతుగా మారుతుందని, సున్నితత్వం స్థానంలో హింస పెరుగుతుందని అర్ధం చేసుకోవాలి. ఇవాల్టి జనరేషన్ తమ కెరీర్ పట్ల వున్న కన్సర్న్స్ ని మనం అర్ధం చేసుకోవాలి. వారి సహజాత కాంక్షల్ని గౌరవించాలి. వయసు వచ్చిన పిల్లలతో తల్లిదండ్రులు అన్ని విషయాలు చర్చించాలి. వారి విషయంలో నిజాయితీగా ప్రజాస్వామిక దృక్పథంతో వుండాలి. వాళ్ళు తప్పు చేస్తే, నష్టపోతే ధైర్యం చెప్పాలి. మద్దతు ఇవ్వాలి. అంతే కానీ నైతిక విలువల చర్నాకోలాతో విరుచుకు పడకూడదు.
****
అన్నట్లు ఈ మార్పు అంతా ఏదో ఒక రాత్రి పూట హాయిగా నిద్రపోయి పొద్దున్నే లేవంగానే పేపర్లో కనబడే వార్త కాదు. అంతర్బాహ్య సంఘర్షణ జరగాలి. అందులో నేను కూడా భాగమే. నన్ను నేను చాలా మార్చుకుంటున్నాను. మరి మీరు?
*
|
చుంబనాలు – చర్నాకోలాలు!
ఈ మార్పు అంతా ఏదో ఒక రాత్రి పూట హాయిగా నిద్రపోయి పొద్దున్నే లేవంగానే పేపర్లో కనబడే వార్త కాదు.
స్త్రీలుగా పుట్టి అర్థం చేసుకోలేని ఎన్నో విషయాలు వాళ్ళ కోణం నుంచి రాసారు. ఇది కొందరికి అర్థం అవటానికి ఇంకో వంద ఏళ్ళు పట్టవచ్చును.
ధన్యవాదాలు విజయగారూ!
బాగా చెప్పారు. మారుతున్న విలువలని అర్థం చేసుకుంటే ఈ ఘర్షణ వుండదు.
Thank you andi
సూర్యుడిని చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి కొందరికి అందుకే మీరెంత మొత్తుకున్నా వేలునే చూస్తామంటారు!
నా భయం కూడా అదే. అందుకే పదేపదే హెచ్చరించాల్సొచ్చింది.
వేలును కాదు.. సూర్యుడిని చూపించారు.
భలే రాశారు.. ముక్కున వేలేసుకునేట్లు.
ధన్యవాదాలు
మంచి అభివృద్ధి కరమైన వ్యాసం. మీరు గొప్ప స్త్రీ వాద రచయిత. మీకవితల్లో కనిపించే గొప్పభావం మీ వ్యసంలో కూడా కనిపిస్తుంది. నిజానికి తర్కాన్ని అందించే మీ రచనా పధ్ధతి బాగుంటుంది. ఏదిఏమైనా స్త్రీ ల పట్ల మీ బాధ్యతాయుత మైన రచనలకు ధన్యవాదాలు.
ధన్యవాదాలు మంగళగారూ!
కృష్ణగారు! మంచి విశ్లేషణతో కూడిన posting ” చుంబనాలు-చర్నాకోలాలు” మీరు ఒక్కొక్క విషయాన్ని విమర్శించినతీరు, విశ్లేషించిన విధం with reasoning బాగుంది. కానీ మనుషులు మారాలి!!! ధన్యవాదాలు !
ధన్యవాదాలు సుశీల గారూ!
Krishnagaru namaste,
నేను ఇక్కడకు వచ్చేది తక్కువే, కానీ కొన్ని వ్యాసాలు మాత్రం చదువుతాను. అది ఎవరో రేఫరెన్స్ ఇచ్చారనో లేక నా అంతట నాకు నచ్చి ఇష్టపడో చదువుతాను. స్పందన ఇవ్వటంలో కొంచెం అలసత్వం మాట నిజమే ఐనా కొన్ని పోస్ట్స్ కి స్పందించకుండా ఉండలేం. అందులో ఇదొకటి. మీరు నిర్మొహమాటానికి చిరునామా అన్నది అందరికి తెల్సిన విషయమే అయినా కొన్ని వ్యాసాలు మరికొన్ని ఆలోచనలకి మార్గదర్షకత్వమని నా నమ్మకం. అలాగే ఇది కూడా ఒకటి. ఈ వ్యాసంపై మరోస్సారి సుదీర్ఘంగా చర్చిద్దాం . అభినందనలు
ధన్యవాదాలు వాసుదేవ్ గారూ!