కవిగా, విమర్శకులుగా, కథకులుగా, సంపాదకులుగా బహుముఖీన సృజనతో కాలం వెంట సాగిపోతున్న రచయిత కాంచనపల్లి గోవర్ధన రాజు. వీరి కలం నుండి ‘భావమంజరి’, ‘ఆచూకి’, ‘చేదబావి’, ‘తన్లాట’ (దీర్ఘకావ్యం), ‘కల ఇంకా మిగిలే ఉంది’ లాంటి కవిత్వ సంపుటాలు, ‘ఒక వర్షం కురిసిన రోజు’ కథా సంపుటి వెలువడ్డాయి. ‘మునుం’ దీని ఆంగ్ల అనువాదం ‘ఓడ్ టు ది ఫ్రంట్ లైన్ ఫార్మేషన్’ లకు సహ సంపాదకత్వం వహించారు. ‘కవితా మంజరి, ‘కలల దారుల్లో’, కాళోజీ యాది’ లాంటి పుస్తకాలకు సంపాదకులుగా ఉన్నారు. కొన్ని సినిమాలకు పాటలు కూడా అందించారు. తెలంగాణ, మరీ ముఖ్యంగా తన స్వగ్రామమైన జూలపల్లి మట్టిని, సబ్బండ వర్ణాల జీవితాలను కథలుగా మలిచిన కాంచనపల్లి కలం నుండి జాలువారిన ఒక మంచి కథ ‘నాన్న – ఒక వర్షం రోజు’’. ఈ కథ మొదట 14 ఏప్రిల్ 2013న నమస్తే తెలంగాణ ‘బతుకమ్మ’లో ప్రచురింపబడింది.
వాన వల్లే కదా జీవితం ఇంద్రధనస్సులా పూసేది. దుఃఖంతో తడవని కన్నుండనట్లే, వానలో తడవని మనిషి ఉండడని సామెత. చిన్నప్పుడు వాన నీటి కాలువలో కాగితపు పడవలు వేసి జీవిత తాత్వికతను తెలుసుకుంటూ వాటి వెంట పయనించిన బాల్యం ఎంత గొప్పది. మేఘాలు వెండి దారాలతో భూమి దేహానికి రంగురంగుల వస్త్రాన్ని నేసే క్రమాన్ని చూడడం కన్నా గొప్ప దృశ్యం మరేముంటుంది. ప్రకృతికున్నట్లు, మనిషికున్నట్లు వానకెన్నో ముఖాలు. కొత్త కొత్త ఆశలు, నిరాశలు, ఆశ్చర్యాలు, ఆనందం, భయం, బీభత్సం, విషాదం, దుఃఖం.. ఇలా ఎన్నో విధాలుగా పలకరిస్తుంది మనల్ని వాన. ఒక్కో మనిషిని, ఒక్కో ఇంటిని, ఒక్క నేలను ఒక్కోలా తడిపేస్తుంది వాన. గుండెల్నే కాదు, ఆలోచనల్నీ తడిమే వాన కథలు తెలుగులో చాలా వచ్చాయి. వీటిలో డా. కాంచనపల్లి రాసిన ఈ కథ చాలా విలక్షణమైనది.
మనిషికన్నా ముందే ఈ భూమి మీదికి వచ్చిన వాన మనిషి రాకడకు సర్వం సిద్ధం చేసింది. వానే మనిషి జీవితాన్ని మూడు రుతువులుగా విభజించింది. ఉపనదిలా మనిషితో పాటు కలిసి నడిచింది. ఒక్కోసారి మనిషి చేయి పట్టుకొని నడవడానికి మొరాయించి అతని ప్రాణం తీసింది. అందుకే వాన మనిషికి నేస్తం, శత్రువు కూడా. మనిషి జీవితం వాన చుట్టే అల్లుకొని ఉంది. వాన కోసం యజ్ఞ, యాగాలు చేసే నేలలున్నట్లే, వాన వద్దే వద్దని మొక్కే చేతులూ ఉన్నాయి. తొలకరి, తేలికపాటి, ఒక మోస్తరు, ముసురు, అతివృష్టి, కుంభవృష్టి, కుండపోత, జడివాన, హోరాహోరీ.. ఇలా వర్షానికి ఎన్నో పేర్లు అలాగే ముంచేవాన, తేల్చే వాన, మురికి చేసే వాన, ప్రాణాధార వాన, కడిగి పారేసేవాన, నూకలు చెల్లించే వాన, సర్వం నాశనం చేసే వాన… ఎన్నో వానలు. వాన లేని నేలకు మనుగడ లేనట్లే, వాన లేని మనిషికి బతుకు లేదు. వాన చుట్టూ ఎన్నో జ్ఞాపకాలు, వాన చుట్టూ ఎంతో జీవితం. వాగును, వంకను, పిట్టను, పుట్టను, కొండను, కోనను కదిలించి కొత్త చైతన్యాన్ని నింపే వాన ఒక్కోసారి కరోనాలాగే మనిషిని ఇంటిలోనే బంధించేస్తుంది.
వాస్తనికి వానే నిజమైన అతిథి. ఏ తిథి లేకుండా ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేస్తుంది. వేకువజాము, సాయంత్రం, పగలు, రాత్రే కాదు ఏ వేళా పాలా లేకుండా వచ్చి ఒక్కోసారి మెడలు పట్టి ఊళ్ళో నుండి నూకేసినా పోదు. కురిసీ, కురవక రెండు విధాలుగా ఏడిపిస్తుంది వాన. అనాథలను, బిచ్చగాళ్లను, సామాన్యులను, ధనవంతులను, రైతులనే కాదు అప్పుడప్పుడు చదువు చెప్పే బడి పంతుళ్లను కూడా తిప్పల పెడుతుంది వాన. రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో అయితే పొరుగూరికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి చేరేదాకా భయమే వానతోని. మధ్యలో ఎక్కడైనా వర్షం అందుకుంటే ఎక్కడో అక్కడ కట్టుబడి పోవడమే. మొండిగా అడుగు వేస్తే నిట్టనిలువునా తడిసి పోవడమే. ఈ కథలో కూడా అలాగే రామచంద్రయ్య సారు కాలి నడకన చదువు చెప్పే ఊరు నుండి స్వగ్రామానికి బయలుదేరి నడుమనే వానలో నిలువునా తడిసి ముద్దై పోతాడు. ఏ రాత్రో వణుకుతూ ఇంటికి చేరుకుంటాడు. “బయట నిలకడగా ఉంది వర్షం. ఇంట్లో కురుస్తున్నట్టే ఉంది. పెంకుటిల్లు వర్షానికి తడబడుతున్నట్లే ఉంది. పెంకుటిల్లు పైన అక్కడక్కడ గూన పెంకలు చెదిరి ఉన్నాయేమో వాటి సందుల్లోంచి లోపలికి ధారగా కారుతున్నాయి నీళ్ళు. కారే నీళ్ళ దగ్గర పళ్ళాలు, గిన్నెలు పెడుతున్నారు అమ్మ, నానమ్మ. అరుగు ముందు తలుపులు లేక పోవడంతో జల్లు చల్లు లోపలికి విసిరి విసిరి కొడుతుంది.”
ఇంతటి వానలో తడుస్తూ రామచంద్రయ్య అన్ని దినుసులతో పాటు అరటి పళ్ళు కూడా తెస్తాడు పిల్లల కోసం. వాళ్ళ తల్లి అరటి పళ్లను తలా ఒకటి ఇచ్చి ఒకటి రామచంద్రయ్యకు కూడా ఇస్తుంది. అన్నా, చెల్లెళ్ళు నాన్న అరటి పండు తినడు. నాకే ఇస్తాడు అంటే నాకే ఇస్తాడని దెబ్బలాడుకుంటూ ఎదురు చూస్తారు. రామచంద్రయ్య ఇదేమీ పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ అరటి పండు మొత్తం తనే తినేస్తాడు. పిల్లలకు నిరాశ కలుగుతుంది. అయ్యో ఎంత పని అయిపాయే పిల్లలు అడుగుతున్నా వినిపించుకోకుండా ఏదో ఆలోచిస్తూ మొత్తం నేనే తినేశానే అని ఆ తండ్రి మనసు బాధ పడుతుంది. పిల్లల కోసం మళ్ళీ అరటి పళ్ళు తెద్దామని అప్పటికప్పుడు బోరున వర్షం కొడుతున్నా లెక్క చేయకుండా అరటి పళ్ల కోసం బయటకు వెళ్తాడు. చివరికి ఏమైంది. అరటి పళ్ళు దొరికాయా? ఆ తండ్రి మనసు ఎంతలా తపన పడిందీ కథలోనే చదవాలి.
కథ నిండా వర్షమే. కథలోని అక్షరాలతో పాటు మనం కూడా వానకు తడిసి ముద్దవుతాం. కథ వర్షంతోనే మొదలై, వర్షంతోనే ముగుస్తుంది. కథ నడుస్తుంటే నేపథ్యంలో వాన సవ్వడి మనల్ని వెంటాడుతుంది. ఒకనాటి బడి పంతుళ్ల జీవితం ఎలా ఉండేదో ఈ కథలో కథకుడు మనకు కళ్ళకు కట్టిస్తాడు. జీతభత్యాలు తక్కువ ఉన్న రోజుల్లో కుటుంబ పోషణ కోసం టీచర్లు పిల్లల మీద, గ్రామం మీద ఎలా ఆధారపడేవారో కూడా తెలుస్తుంది. అంతే కాదు వేణ్ణీళ్ళకు చన్నీళ్ళకు లాగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా ఉపాంత ఉపాధి చూసుకునేవారు ఊపాధ్యాయులు. అందుకే ఈ కథలోని రామచంద్రయ్య మాష్టారు తీరిక వేళల్లో పంచాంగం చూడడం, జాతకాలు చూడడం, పురాణ కథలు చెప్పడం చేసేవాడు. దీనికి బదులుగా గ్రామస్తులు గౌరవంగా తృణమో ఫణమో వస్తు రూపేణ ఇచ్చుకునేవారు. ఇదొక వైపైతే ఈ కథ ప్రధానంగా ఒక తండ్రి మనసు ఎంత గొప్పదో, ఎంత బాధ్యతాయుతమైనదో చెప్పడానికి ప్రయత్నించిన కథ. వర్షపు నీటికి రంగు, రుచి, వాసన ఏమీ ఉండవు. అలాగే తండ్రి మనసు కూడా వాన నీరంతటి స్వచ్చంగా ఉంటుందని కథకుడు చెప్పకనే చెప్తాడు. ఒక వైపు వానలో తడిసి వచ్చిన కొడుకు కోసం తపించే తల్లి మనసు, మరో వైపు పిల్లల కోసం తపించే తండ్రి హృదయం ఇవి రెండూ సమ పాళ్లలో పొంగి పొర్లి హృదయాన్ని ఆర్ద్ర పరుస్తాయి. వాన చుట్టూనే జీవితం ముడి పడి ఉందని చెప్తూనే వాన ఎంతలా బాధ పెడుతుందో కూడా చెప్తుందీ కథ. పిల్లల మనస్తత్వం, భార్య అనురాగం కూడా వ్యక్తమవుతుంది.
కథ చెప్పడానికి ఎంచుకున్న శిల్పం కూడా ఆకట్టుకుంటుంది. కథలోని పాత్రలు అయిదే. యాకబెల్లి పాత్ర కూడా ఉంటుంది కాని తెర మీదికి రాదు. ఇంత చిన్న కథలోనే పాత్రల్ని గుండెకు హత్తుకునేలా మలిచిన తీరు కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఏ పాత్ర ఎంత స్థాయిలో తన పాత్రను పోషించాలో అంతే పోషించి కథను బిగువుగా నడిపిస్తాయి. ఇది కథకుడి శిల్ప నైపుణ్యాన్ని పట్టి చూపుతుంది. వాన, జీవితం రెండూ ఒకదాన్ని ఒకటి ఒరుసుకుంటూ పయనించడాన్ని కథకుడు చాలా బాగా చిత్రించాడు. ఇక్కడే కథకుడి విజయం దాగి ఉంది.
జోరుగా కురుస్తున్న వాన తాను వ్యవధి తీసుకోదు కానీ మనకు వ్యవధినిస్తుంది. కానీ ఇందులోని నాన్న దాన్ని దాటి ప్రవర్తిస్తాడు. నిజ జీవితంలో వాన ఎన్నో సత్యాలను మనకు ఎరుక పరుస్తుంది. ఈ కథ కూడా జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవని జీవిత తత్వాన్ని బోధించి ముగుస్తుంది. మనిషిని నిలబెట్టే వాన మనిషిని కూల్చేస్తుంది కూడా. అందుకు ఈ కథ ఒక ఉదాహరణ. అంతే కాదు మనల్ని మనం తెలుసుకునేలా చేసి శుభ్రపరుస్తుంది కూడా. ఇందులోని వాన ధైర్యాన్ని వెనువెంటనే భయాన్ని కూడా చూపెడుతుంది. బయట వాన కొడుతుంటే లోన ఉండే మనుషులు బయటి వ్యక్తి కోసం ఎలా తపిస్తారో కూడా చూపెడుతాడు కథకుడు.
నులి వెచ్చని అమ్మ ప్రేమ, వానలో గొడుగులాంటి నాన్న మమకారం, పిల్లల మారాము, వర్షంలో పొడి బట్టలాంటి భార్య అనురాగం అన్నీ పాఠకుల్ని ఉక్కిబిక్కిరి చేస్తాయి. ఇది వాన కోసం రాసిన కథ కాదు. నాన్న కోసం రాసిన కథ. వాన వెంటబడి కథ రాయించుకుందా? నాన్న కథ రాస్తుంటే వాన అందులో ఒక పాత్ర అయిందా? అయితే చివరికి నాన్న గెల్చాడా..? వాన గెల్చిందా..?
*
నాన్నను వర్షాన్ని చదవాలనిపిస్తుంది….. శ్రీధర్ మంచి కథను పరిచయం చేశారు… మంచి రచయితను కూడా………..
నంది శ్రీనివాస్
congratulations to sridhar and kanchanapalli garu
రివ్యూ బాగుంది
మట్టి బంధం విడదీయరానిది కదా! మట్టి నుండి పొందిన మమకారం జీవితాంతం ఉండిపోతది. అలాంటి మమకారం జీర్ణించుకున్న మా ఊరి కాంచనపల్లి గారు కథలో ఆకాశం నుండి కురిసే వానని, ఆకాశమంత విశాలహృదయమున్న నాన్న ని బాగా చిత్రించారు. కథా రచయితకు, వ్యాసం అందించిన విమర్శకునికి నా సహృదయ కృతజ్ఞతలు.
Thank you very much sir…
విశ్లేషణ అద్భుతంగా ఉంది..వానలో నేనూ తడిచి ముద్దయినట్టు అనుభూతి చెందాను. అభినందనలు 👋👋👋👌👌👌💐💐💐🙏
ఇప్పుడున్న కాలానికి తగ్గట్టుగా కథ సెలెక్ట్ చేసి, మంచి కథ కు చక్కటి విశ్లేషణ అందించారు సార్..
మంచి పరిచయం సార్.బావుంది.
బాగుంది సార్..
A good story.better review.congrats .
చివరికి నాన్న గెల్చాడా..? వాన గెల్చిందా..? అంటే …. కథకుడు గెలిచాడు. సమీక్షకుడు గెలిచాడు. వాన వర్ణన ఒక కవిత లాగా సాగింది. కథకుడికి సమీక్ష కుడికి ఇద్దరికీ అభినందనలు.
Thank you sir…
కథావిశ్లేషణ ఎప్పటిలాగానే నన్ను ఒక మంచి కథ చదివేలా చేసింది.మీకు అభినందనలు.
డా. కాంచనపల్లి గోవర్ధనరాజు సార్, నమస్తే.
14 ఏప్రిల్ 2013 న నమస్తే తెలంగాణ ‘బతుకమ్మ’ ఆధివారం అనుబంధం లో ప్రచురింపబడిన ‘ నాన్న – ఒక వర్షం రోజు ’ కధ సాఫ్ట్ కాపీ మీ వద్ద ఉండే అవకాశం ఉందా. దాన్ని మిత్రులకు పంపించాలని ఉంది.
సారంగ అంతర్జాల పత్రికలో మీ యీ అపురూపమైన కధను అద్భుతంగా, కవితాత్మకంగా పరిచయం చేసిన డా. శ్రీధర్ వెల్దండి గారు మీ కధ కాపీ ( రంధి తెలంగాణ కత 2013 కధల సంపుటి పుస్తకం లోని పేజీల స్కాన్ ) కూడా జతచేసి పాఠకులకు ఎంతో మేలు చేసారు.
యీ పొద్దు ఇక్కడ బెంగుళూరులో వానపడుతున్నప్పుడు మీ కధ పరిచయం అయ్యింది. బయట కురుతున్న వాన నా కళ్లల్లోంచి కూడా కురిసింది.
పళ్లపొడులు, బినాకా పేస్ట్ లు ఇంకా రాని రోజుల్లో బొగ్గు, కచ్చిక, వేపపుల్ల లతో పళ్లు తోవుకున్న మా చిన్ననాటి జ్నాపకాలు, నాయన తెచ్చిన అర్టిపొళ్లు తిన్న రుచులు, సాయంకాలాలు నా చెయ్యిపట్టుకుని షికారుకి తీసుకెళుతూ తను చెప్పిన ఎన్నెన్నో సుద్దులు చాలా చాలా తలపుకుతెచ్చాయి ‘నాన్న – ఒక వర్షం రోజు’ కత.
మీ లాగే గొరుసన్న కూడా “ వాన కధ “ అని ఓ ఆర్తితో కూడిన కధరాసారని చెప్పాను కదా సార్… ( పాలమూరు, విశాఖ మాండలీకాల సవ్యచాచి , చెయ్యితిరిగిన సీనియర్ కధా రచయిత గొరుసు జగదీశ్పరరెడ్డి “ గజయీతరాలు “ కధల పుస్తకం పాఠకులకు అందుబాటులోకి తేవడం లేదు అంటూ తనని ఆడిపోసుకుంటూ )
త్రిపుర తండ్రి కధలు పుస్తకం మీకు అందించాలనే నా ఉత్సాహాన్ని వోరిమితో భరిస్తారు కదూ…
~ ఇట్లు, మీ కె.కె. రామయ్య
కె.కె. రామయ్యగారు మీ అభిమానానికి ధన్యవాదాలు…
😷
అద్భుతమైన విశ్లేషణ …
డా. వెల్దండి శ్రీధర్ గారు వానను ఎన్నో కొత్త డైమెన్షన్ లలో, కోణాలలో, నవ్య భావాలతో స్పృశించారు.
మనిషికి, వానకి ఉన్న నిగూఢమైన, లోలోతుల నుండి అనంతమైన nodes తో కూడి ఉన్న complex, critical, strong connections ను మరియు వాటి మధ్య ఉన్న సంబంధానికి ఆధారమైన (సైన్స్ కి అందని ) తాత్విక శక్తిని తన అమోఘమైన ఊహాశక్తితో ఆక్షరీకరణ చేసి, చెప్పారానంత ఆనుభూతిని, ఆర్ద్రతను, మనోవికాసాన్ని మనపై పన్నీరులా చిలకరించారు శ్రీధర్ గారు.
వాన అనేది మనిషిని ఎప్పుడు తనవాడిగా, ఎప్పుడు పరాయివాడిగా చూస్తుందో అనేది ఎంతటి అంతుచిక్కని వ్యవహారామో ఇంతకుముందు ఎప్పుడూ లేనివిధంగా అలవోకగా వివరించారు.
డా.కాంచనపల్లి గారి కలం నుండి ఆవిష్కరించబడిన సహజాతి సహజమైన, మట్టిలోంచి పుట్టినంతటి స్వచ్ఛమైన, అద్వితీయమైన కథ ఇది.
హృదయంలో ఎన్నో భావోద్వేగాలను తట్టిలేపి మనల్ని గంటల తరబడి వెంటాడే కథ
ఇది. కథ చదవని వాళ్ళ ను కూడా చదవాలనే ఉత్సుకతను రగలించేలా విశ్లేషణ చేశారు శ్రీధర్ గారు. మనసుకు హత్త్తుకొనేలా ఉన్న ఈ రివ్యూ కథ ఇదివరకే చదివిన వారిని కూడా మళ్ళీ చదివిస్తుంది.
డా. ప్రసాద రాజుగారు చాలా చాలా ధన్యవాదాలు… మీ స్పందన కూడా చాలా బావుంది…
ఈ ఎడతెరిపి లేని వానకు భయపడి పడకగదిలో వెచ్చగా కూర్చుని కథాకచ్చీరులోకి వెళ్లగా శ్రీధర్ గారి విశ్లేషణ నా బుర్రపై ఓ చరుపు చరచి నా మనసును జూలపల్లి లోని పెంకుటింటికి లాక్కుపోయింది. నేను ఒక రామచంద్రయ్య నై పోయాను. ఎందుకంటే వర్షంలో తడిస్తే నాకూ అలాగే వణుకు వచ్చేస్తుంది.
ఒక చిన్న పాయింట్ కు ఊహించని ముగింపును జోడించి రచయిత రాజుగారు ఒక సామాన్య తండ్రి అనురాగాన్నీ, ఆరాటాన్నీ ఎంతో హృద్యంగా, ఆర్ద్రంగా చిత్రీకరించారు.
ఇక శ్రీధర్ గారి విశ్లేషణ విషయానికొస్తే, ‘ నేనింతటి గొప్ప కథను రాశానా!? ‘ అని కథను రాసిన రచయిత సైతం (రాజుగారు అన్యదా భావించరనే నమ్మకం) ఆనందంతో ఆశ్చర్యచకితులయ్యేంత అద్భుతంగా శ్రీధర్ గారు విశ్లేషించారు. కథాత్మను తాత్వికత కోణంలో ఔపోసన పట్టి ఎంతో కవితాత్మకంగా ఆవిష్కరించారు. వారి విశ్లేషణాత్మక దృష్టిలో పడడం ఈ కథ చేసుకున్న పుణ్యం. ఈ రకంగా ఇది తెలుగు కథా సాహిత్యంలో చిరకాలం నిలిచిపోతుంది.
ఇంతటి ఉదాత్తమైన కథను రాసిన రాజుగారికీ,
దానికి అనితర సాధ్యమైన తన అద్భుత శైలితో సొబగులద్ది మళ్లీ చదివి, తరించేలా చేసిన శ్రీధర్ గారికీ హృదయ పూర్వక అభినందనలు !!!
నరసింహారెడ్డి గారూ మీ అద్భుతమైన స్పందనకు ధన్యవాదాలు…
వాన తీరు, నాన్న తీరు ఒక ప్రేమ ఒక బాధ పెనవేసు కొన్న జీవిత సత్యాన్ని
విశ్లేషించిన తీరు ఆసక్తిదాయకం,
కథ ముగింపు పైన కూడా రాసివుంటే, ఆ అనుభూతి చివరి దాకా అంది వుండేదనిపించింది.
ఇద్దరికీ అభినందనలు
దాసరాజు రామారావు గారు,
గమనించే ఉంటారు డా. కాంచనపల్లి గోవర్ధనరాజు గారి ‘నాన్న – ఒక వర్షం రోజు’’ కధను కూడా జతచేసారు డా. శ్రీధర్ వెల్దండి గారు ( మొదటి పేరాలో బ్లూ కలర్ తో హైలైట్ చేసిన ఆ లింకు నొక్కితే శ్రమతీసుకుని వారు జతచేసిన కధ స్కాన్ కాపీ ( pdf file ) డౌన్లోడ్ చేసుకోవచ్చు ).
డా. కాంచనపల్లి గారి కధల సంపుటి ” ఒక వర్షం కురిసిన రోజు ” విశాలాంధ్ర బుక్ హౌస్, నవోదయ బుక్ హౌస్, కాచీగూడ వారివద్ద లభ్యం అని చెప్పారు డా. కాంచనపల్లి మాస్టారు గారు.
శ్రీధర్ గారు, శ్రీనివాస్ సంగిశెట్టి గార్లు అమెజాన్ ఆన్ లైన్ షాపింగ్ లో 2013 నుండి 2018 వరకూ వచ్చిన తెలంగాణా కధల ఆరు పుస్తకాల సెట్టు …. తన్లాట, రివాజు, రంధి, కుర్రాడు, దావత్, అలుగు …. పెట్టారు కానీ ప్రస్తుతం కాపీలు అయిపోయాయి అని మెసేజ్ వస్తున్నాది. శ్రీధర్ సామిని రిక్వెస్ట్ చేసి యీ చిన్న లోపం సరిచెయ్యమని చెప్పాల.
Sridhar Veldhandi & Srinivas Sangishetty – Telangana Khathalu 2013 to 2018 (Set of 6 books) – Aalugu, Dhavath, Kurradu, Randhi, Rivaju & Thanlata (Telugu) Paperback
https://www.amazon.in/Sridhar-Veldhandi-Srinivas-Sangishetty-Telangana/dp/B084DN2GYT/ref=sr_1_2?dchild=1&keywords=randhi&qid=1597727013&s=books&sr=1-2
ధన్యవాదాలు కె.కె. రామయ్య గారు & దాసరాజు రామారావు గారు… మీరు పైన అడిగిన తెలంగాణ కథ పుస్తకాలు అయిపోలేదు. కరోనా వల్ల కొద్దిగా అంతరాయం కలిగింది. త్వరలోనే సరిచేస్తాను.
కాంచనపల్లి గారి శైలి అద్భుతమైనదఅద్భుతమైనది.కథలో పాత్రలతో ప్రయాణిస్తూ లోకి వెళ్ళిపోతాము.విశ్లేషణ కూడా బాగుంది. ఇరువురి కీ అభినందనలు
Thank you Usharani garu..
It’s very nice. Anni emotions chala baga chupinchaaru. Ela aina chivariki nanna ne gelusthaaru😊
Very nice review
Very nice review. Chala baga raasaru
గంగుల నరసింహా రెడ్డి గారూ బాగున్నారా! ఈ కథ పై విశ్లేషణ చదువుతున్నప్పుడు మీకు ఆంధ్రప్రభ వారపత్రిక(1993?లో) నిర్వహించిన కథల పోటీలో ప్రథమ బహుమతి తెచ్చిపెట్టిన ‘వానకురిసింది’ జ్ఞాపకం వచ్చింది.
గుండెబోయిన శ్రీనివాస్.
వరంగల్.
శ్రీ శ్రీనివాస్ గారికి నమస్సులు. నా కథ
” వాన కురిసింది” మీకింకా జ్ణాపకం ఉందంటే ఎంతో ఆశ్చర్యమూ, ఆనందమూ కలిగాయి. ధన్యవాదాలు.
ఆ కథ గురించి ఇక్కడో విషయం చెప్పాలి. దాని కన్నా తండ్రిని పేరుకు నేనే అయినా, దాని గొప్పదనాన్ని గుర్తించి అది మరుగున పడిపోకుండా ఇన్నాళ్లుగా కాపాడుతూ వస్తున్న “పెంచిన తండ్రి” వేరే ఉన్నారు. ( వారిలాగే ఎన్నో మంచి కథలను మనసులో పెట్టుకొని కాపాడుతూ వస్తున్నారు) వారెవరో కాదు “శ్రీ గొరుసు జగదీశ్వర్ రెడ్డిగారు. కాపాడడమే కాకుండా ఆ కథను “ఇద్దరయ్యల” చేతిలో పెట్టారు. వారే శ్రీ ఖదీర్ బాబుగారు మరియు శ్రీ వెల్దండి శ్రీధర్ గారు. శ్రీ ఖదీర్ గారు దానిని ఏకంగా తాను సంకలనం చేసిన “ఉత్తమ తెలుగు వాన కథలు” అనే పుస్తకం లో స్థానం కల్పించి, హోదాను కలిగించి ఆ కథనూ, నన్నూ తరింపజేశారు. ఇక శ్రీ వెల్దండి శ్రీధర్ గారయితే ఆ కథను ఇదే వేదిక “కథా కచ్ఛీరు” పై “తెలంగాణ విరహపు నేలమీద వాన కురిసింది” అనే అందమైన title తో అద్భుతమైన విశ్లేషణ రాసి దానికి అజరామరమైన కీర్తిని ఆపాదించి దానినీ, నన్నూ చరితార్థుల్ని చేశారు. అందుకు నేను శ్రీ ఖదీర్ బాబు గారికీ, శ్రీ వెల్దండి శ్రీధర్ గారికీ మళ్లీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శ్రీ గొరుసు జగదీశ్వర్ రెడ్డి గారికి ఎందుకు చెప్పట్లేదంటే ఆ కథ బాగోగులు చూసే బాధ్యత దానిని పెంచిన తండ్రి అయిన గొరుసు గారిదే కానీ ని
నాది కాదు కాబట్టి.
శ్రీ వెల్దండి శ్రీధర్ గారు రాసిన ఆ అద్భుతమైన విశ్లేషణ మీరూ తప్పక చదవాలని ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నాను. చదివగలరు. మీకు ధన్యవాదాలు.
https://magazine.saarangabooks.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b0%e0%b0%b9%e0%b0%aa%e0%b1%81-%e0%b0%a8%e0%b1%87%e0%b0%b2-%e0%b0%ae%e0%b1%80%e0%b0%a6-%e0%b0%b5/
2013లో బతుకమ్మలో చడివినప్పటి జ్ఞాపకాల్ని మళ్ళీ నెమరువేసుకున్నట్లయ్యింది శ్రీధర్ గారి లోతైన విశ్లేషణ ద్వారా. కథకుడు కథను ఎంత తాజాగా ప్రకృతిలో మమేకమై రాశాడో విశ్లేషకుడు కూడా అంతే కథతో తాదాత్మ్యం చెంది రాశాడనిపిస్తుంది.కాంచనపల్లి బేసిగ్గా కవి కావటం మూలాన కథకూడా కవితాత్మకంగా సాగింది. ఇద్దరికి హృదయపూర్వక అభినందనలు.
Thank you sir…
Kanchanapally garu racinchina varsham kurisina ratri story pina meeru chesina vishleshana chala bagundi . Sridhar garu .
Thank you sir…
మీరు చెప్పినట్లు వాన జ్ఞాపకం ఒక్కొక్కరి జీవితం లో ఒక్కో అనుభవాన్ని, అనుభూతి ని కలిగిస్తూ… జీవితం లో అది కూడా ఒక ప్రాముఖ్యత ను కలిగి ఉంటుంది.. శ్రీధర్ గారి విశ్లేషణ చదివిన పాఠకుడు
ఈ కథను చదవాలని పరితపించే విధంగా అధ్బుతంగా ఆసక్తి కరమైన ధోరణి తో కథను పరిచయం చేశారు…
శ్రీధర్ గారి కలం ఇలాంటి విశ్లేషణ లు ఒలికించినంత కాలం… సాహితీ లోకం హర్షిస్తూనే ఉంటుంది…
కథ మీద మీ సమీక్ష చదువుతుంటే కూడా వర్షంలో తడుస్తున్న అనుభూతి కలుగుతుంది.