1
చిరునామా
వనమంతా
రాలు పూల దుఃఖం .
పిట్ట శోక షెహనాయి స్వర సంకేతం
వాయులీనంపై
తరగలుగా ..
పక్షి గొంతును
కోల్పోయాక
గోరంత చిగురు సాంత్వన.
జీవితమంతా
రాలు పూల స్వప్నాలు
మనిషి
బాధాతప్త నిర్వేద గానాలు
రంగస్థలంపై
దృశ్యాదృశ్యాలుగా
మానవుడు
దేహాన్ని కోల్పోయాక
పిడికెడంత మట్టి
శాశ్విత చిరునామా
***
2
దేహమే షహనాయి
ఒంటరిగా
ఒక పాట నడుస్తుంది లోలోన
ఏ యుగానిదది.
దేహం ఒక షహనాయి స్వరం
అడుగులు
కాటుక పిట్టలు
రెక్కలు దూదిపింజలు
యానం ఒక లోలకం
గమ్యం శూన్య వలయం
కాలం చెక్కిలి పై
అదృశ్యం గా ఒలికే
అశ్రుకణం
కళ్ళగోళాలనిండా
అనంత ఎడారులు
అనల దారుల్లో
అగ్ని ఉధృతి
అయినా ఈ పయనం
ఎప్పటిది
తెలిసి పాడినా
తెలియక పాడిన
అదిగో..ఆ గీతం
నీది..,నాదీ.. ఇక్కడ .మొలిచిన ప్రతి
ప్రాణిది.
*
Add comment