హైదరాబాద్‌ను వదిలించుకున్నట్టు, వదలడం ఇష్టం లేనట్టున్న ఒక మెయిన్ రోడ్డుకు పక్కన్నే ఉన్న ఒక రెస్టారెంట్‌లో చాయ్ తాగుతూ నీ గురించి ఆలోచిస్తాన్నేను. ఇలాంటి కేఫ్, రెస్టారెంట్ ఏది చూసినా చాయ్ తాగాలనిపిస్తే నాకు నువ్వు గుర్తొస్తావు.
నువ్వు కలిసిన తర్వాత ఎక్స్‌ప్లోర్ చేసినన్ని కేఫ్‌లను ఇంతకుముందెప్పుడూ ఎక్స్‌ప్లోర్ చేయలేదు నేను. అందులో చాయ్ తాగుతున్నంతసేపు నీ గురించే ఆలోచిస్తాను.
అక్కడ చాయ్ తాగి మ్యాప్ ఓపెన్ చేసి చూస్తానా! ఆ సందులోకి వెళ్లమంటుంది అది.
హైదరాబాద్‌కి వెళ్లే (హైదరాబాద్‌లోనే ఉన్న) మెయిన్ రోడ్డు మీద, ఇలాంటి సందులోంచి వెళ్తే ఒక ఊరు లాంటి కాలనీ రావడం నాకిప్పటికీ గొప్ప ఆశ్చర్యం. ఆ కాలనీ వరకూ వెళ్లే దారంతా ఒక కిలోమీటరున్నర ఉంటుందేమో!
చిన్న పల్లెటూరు ఉన్నట్టు ఉంటుంది. ఒక చెరువు, ఒక కట్ట, ఆ కట్ట మీదినుంచి బండ్లు పోవడానికి ఒక చాలా చిన్న దారి. నీకేమాత్రం సంబంధం లేని ఈ విజువల్‌ను నీకోసమే చూస్తున్నానేమో అనుకుంటా. ఇదంతా ఒక పనిలా, నన్ను నువ్వు పనికి పెట్టుకుని ఇదంతా చేయిస్తున్నట్టుగా ఉంటుంది అప్పుడప్పుడు. ఇష్టంగా చేస్తాను చూడు ఈ పని!
సాయంత్రం వరకూ ఉండి నా ఫ్రెండ్ డ్యూటీకి వెళ్లిపోయాడు. నా ఫ్రెండ్ వాళ్లావిడ (మేడం అని పిలుస్తాను నేనామెను), వాళ్లమ్మాయి, వాళ్ల కజిన్ నలుగురం ఆ కబుర్లూ, ఈ కబుర్లూ చెప్పుకుంటూ ఉన్నాం.
మేడం నన్ను వాళ్ల మిద్దె మీదికి తీసుకెళ్లి ఇంటిపంట చూపించింది. వాళ్లింటి పక్కనున్న ప్లేసంతా ఈ ఆరేళ్లలో ఎంత మారిందో చెప్పింది.
అక్కడొక దగ్గర కూర్చొని చూస్తే, ఇక్కడ సాయంత్రాలు ఎంత బాగుంటాయో చెప్తూ ఉంటే నాకు మా పెద్దమ్మ ఊరు గుర్తొచ్చింది.
వర్షాలొచ్చే కాలంలో పెద్దమ్మ వాళ్ల ఊరికుండే ఒక అందాన్ని నీకెప్పుడైనా చూపించాలనుకుంటా. ఆవిడ ఆరేళ్ల కిందటి విషయం చెప్పినప్పుడు, ఆరోజు ఆలోచన అచ్చంగా పెద్దమ్మ ఊరుకున్న అందంలా ఉంది.
“ఇల్లే నా ప్రపంచం కదా, సారెప్పుడో రాత్రి తిరిగొచ్చేవరకూ ఈ చెట్లూ, ఈ పొలాలు చూస్తుండేదాన్ని. ఇలా చూస్తూనే ఉన్నాననుకుంటానా, ఇది కాలేజీకొచ్చేసింది. ఈ ఊరేమో ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్‌లతో ఇలా మారిపోతోంది” అని ఆవిడ చెప్తూ పోతుంటే,
“మీరొక నవల రాయాలి!” అన్నా.
ఆవిడ గట్టిగా నవ్వి, “ఆ! అవును మల్లీ. రాయాలి” అంది.
చాలా సింపుల్‌గా బతికే వాళ్ల జీవితాల్లో కూడా నాకెందుకో చాలాసార్లు ఒక మ్యాజిక్ కనిపిస్తుంది.
అమ్మ, పెద్దమ్మ, వీధి చివరి ఆంటీ.. వీళ్ల జీవితాలు కాదు మళ్లీ. వీళ్లు సింపుల్‌గా ఉండరు. ఒక హంగామా ఉంటుంది. అదీ ఒక మ్యాజిక్. బ్యూటీ, చెప్పాలంటే!
వీటన్నింటి మధ్య నా ఫ్రెండ్ వైఫ్ ఈ మేడం ఉంది చూడూ.. వాళ్లు కొట్టుకుపోతారు. నాకెప్పుడైనా ఇలాంటి వాళ్ల గురించి చెప్పాలనిపిస్తుంది.
మా అక్క, ఈ మేడం, నా రూమ్మేట్ గురించి చెప్తా కదా, వాళ్లమ్మ… వీళ్ల గురించి.
ఉదయం నేను తిరిగొచ్చేప్పుడు మెయిన్ రోడ్డు మీది రెస్టారెంట్ వరకొచ్చి నన్ను డ్రాప్ చేసింది.
ఆమె తిరిగెళ్తూ, ఇంటివరకు ఏం ఆలోచిస్తూ ఉండొచ్చు? అసలేమీ ఆలోచించకుండా అలా నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు.
అలా వెళ్లేప్పుడు ఒక ఖాళీ ఉంటుంది చూడూ.. నేను ప్రయాణాలు చేసినప్పుడల్లా ఆ ఖాళీలో నిన్ను నింపుకుంటాను.
మెట్రో ఏ సికింద్రాబాద్ స్టేషన్‌నో దాటినప్పుడు.. సరిగ్గా అప్పుడు… హైదరాబాద్‌ను వదిలించుకున్నట్టున్న మెయిన్ రోడ్డు మీది రెస్టారెంట్ పక్కన సందులోంచి ఒక చిన్న రోడ్డు ఉంటుందని, అలా వెళ్తే ఒక ఊరొస్తుందని నీకు చెప్పాలనిపిస్తుంది. అంతే!
*
|
చిన్న ప్రపంచం
చాలా సింపుల్‌గా బతికే వాళ్ల జీవితాల్లో కూడా నాకెందుకో చాలాసార్లు ఒక మ్యాజిక్ కనిపిస్తుంది.
ఏం చదువుతున్నానో అంతగా తెలియలేదు కానీ మీ రాత వెంట నేను నడుచుకుంటూ చివరిదాకా వచ్చేశాక నాకనిపించింది ఇదీ…
The magic lies in being simple without knowing that it is what it is. ~meSayIt 🙂