“ఇప్పుడు నువ్వెళ్లకపోతే ఏమవుతుంది మమ్మీ? వెళ్లి తీరాలా?”
స్కూటీ నెమ్మదిగా నడుపుతూ మాట్లాడుతోంది.
“అయినా ఎంత దూరం ఉందని? ముందే వెళ్లకపోతే ఏం? ఆ రోజు పొద్దున్నే వెళ్లి సాయంత్రం రావచ్చు కదా!”
బండి కుదుపులకు నా చేతిలో ప్యాకెట్లు అటూఇటూ కదులుతున్నాయి.
“మావయ్య రెండు సెంటిమెంటు డైలాగులు చెప్పగానే రెడీ అయ్యావ్! అక్కడ అంత సీన్ లేదు. నీతో పని చేయించడం కోసమే పిలుస్తున్నారు వాళ్లు”
కొంచెం దూరంలో పానీపూరి బండి కనిపించింది. ఆపమన్నాను.
ఇద్దరం చెరో ప్లేటులో పెట్టించుకుని పక్కనున్న ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చున్నాం.
“పోయినసారి నువ్వు రావడం లేటైనప్పుడు తమ్ముడు ఇల్లు పీకి పందిరేశాడు. రాత్రి వంటకు ఎంత ఇబ్బంది అయ్యిందో తెల్సా? నాన్నకు అప్పుడే వేలు తెగింది. నానా గందరగోళం జరిగింది.”
పానీపూరి అంత రుచిగా లేదు. అయినా తింటుంటే అదో ఆనందం.
“చెప్పమ్మా! మరీ రెండు రోజుల ముందు వెళ్లి, ఫంక్షన్ చేసి రావాలా? నాన్నకైతే ఇష్టం లేదు మరి! అవసరమా ఇప్పుడీ ప్రయాణాలు?”
గాలి చల్లగా వీస్తోంది. వర్షం వచ్చేలా ఉంది. చెప్పాలి. వర్షం వచ్చేముందే చెప్పేయాలి.
“ఇంకో ప్లేట్ తింటావా?”
“ఊ..”
బండి వాడు ఇంకో ప్లేట్ తెచ్చిచ్చాడు. రోడ్డు మీద బండ్లన్నీ హడావిడిగా వెళ్తున్నాయి.
“చిన్నప్పుడు మా వీధి చివర కిరాణం షాపుండేది. బెల్లం తెమ్మని మా అమ్మ చెప్పడం ఆలస్యం, నేనంటే నేనంటూ నేనూ, మీ మావయ్య దెబ్బలాడుకునేవాళ్లం. బెల్లం కొన్నాక
ఆ షాపాయన మాకో చిన్న ముక్క ఇచ్చేవాడు. దాని కోసం పోటీ. కొంచం కొంచం చప్పరిస్తూ తింటుంటే భలే ఉండేది…”
తను ఊ కొడుతోంది.
“మా స్కూల్ పక్కనే జామతోట ఉండేది. నేనూ, మా ఫ్రెండ్సూ కలిసి దొంగతనంగా కాయలు తెంపుకునేవాళ్లం. ఇంటికి తెస్తే కోప్పడతారని బయటే బోరింగ్ దగ్గర నీళ్లతో కడుక్కుని తినేవాళ్లం.
నాకు నిమిషం ఇంట్లో కాలు నిలిస్తే ఒట్టు! ఎప్పుడూ బయటే. ఆ వీధి, ఈ వీధి అని తిరగడమే పని. రోజూ రాత్రి మీ అమ్మమ్మతో తిట్లే. అయినా ఉదయం మళ్లీ అదే తంతు. స్కూల్ నుంచి ఇంటికి కూడా రాకుండా అట్నుంచటే వెళ్లిపోయేదాన్ని. దీనికి కాళ్లకు చక్రాలున్నాయే అనేవాళ్లంతా.
టెన్త్ అయిపోగానే పెళ్లయింది. ఇక్కడికి వచ్చేశాను. ఇంటి పని, వంట పని.. ఇంక అదే లోకం. వారానికోసారి మీ నాన్న తీసుకెళ్తేనే గుడికో, సినిమాకో. ఏవైనా పెళ్లిళ్లు ఉంటే అక్కడికి. మీరు పుట్టేదాకా అంతే! మీరు పుట్టాక హాస్పిటళ్లు, తర్వాత స్కూళ్లు. ఎక్కడికెళ్లినా ఆయన భార్య, వాళ్ల కోడలు, వీళ్ల అమ్మ.. ఇదే మాట! నేనంటూ నాకోసం తిరిగే చోటు ఒక్కటీ లేదిక్కడ. అన్నిటికీ మీ నాన్నో, నానమ్మో పర్మిషన్ ఇవ్వాలి. చప్పరిస్తూ తినే బెల్లం ముక్క లేదు. దొంగతనంగా కోసే జామకాయలు లేవు.”
హారన్ శబ్దాలు ఆగాగి వినిపిస్తున్నాయి.
“ఇప్పటికీ మా ఇంటికి వెళ్తే ఎంత బాగుంటుందో తెలుసా? ఎవరికీ నా పరిచయం అక్కర్లేదు. ‘బేబీ’ అని ముద్దుపేరు పెట్టి పిలిచేవాళ్లు అక్కడున్నారు. నా చిన్నప్పటి సంగతులు, స్కూల్లో ఆడిన ఆటల గురించి గంటల కొద్దీ మాట్లాడే వాళ్లున్నారు. అవన్నీ వింటుంటే తృప్తిగా ఉంటుంది. మళ్లీ చిన్నపిల్లనయ్యాననిపిస్తుంది. వదిలేసి వస్తుంటే ఏడుపొస్తుంది.”
చెంపమీద నుంచి కన్నీళ్లు జారుతున్నాయి. ప్లేట్ పక్కన పెట్టి కళ్లు తుడుచుకున్నాను.
“మీ మావయ్య నన్ను ఎందుకైనా పిలవనీ, ఏ పనైనా చెప్పనీ.. వెళ్లడం వాళ్ల కోసం కాదు. నాకోసం. అది కూడా ఎప్పుడో ఇలా ఏడాదికొకసారి. ఈ మాత్రం దక్కని వాళ్లు ఎంతో మందున్నారు. ఇదంతా మీకూ, మీ నాన్నకూ అర్థం కాదు.”
తను నా వంకే వింతగా చూస్తూ ఉండిపోయింది. చినుకులు మొదలయ్యాయి. ఎన్నాళ్లవో..! ఇప్పుడు బయటికొస్తున్నాయి. మనసుకు ప్రశాంతంగా ఉంది.
*
పెళ్ళైయ్యాక ఎందుకో ప్రతీ స్త్రీకి పుట్టిల్లు చుట్టాల్లిల్లు అయిపోతుంది. కానీ స్వేచ్చగా మసలేది, తనకంటూ తానుగా బతికేది అక్కడే.
మీ కథల్లో భలే గమ్మత్తు ఉంటుంది. ఏటువంటి అనవసర వర్ణనలు లేకుండా సూటిగా చెప్పాలనుకున్న విషయం చెప్పటమే కాకుండా ఆ కథ మనసులో నిలిచిపోయేలా చెబుతారు. హ్యాట్సాఫ్ అండి
Baagundi annayya 💙💙😍😍
నిజంగా టచీగా రాసావు సాయి. అభినందనలు.
Excellent narration…most of the people will connect to it.
ఏడిపించావు..గతంలోకి తీసుకెళ్లి.
చిన్న కథ… చింత తీరే కథ.. సాయి వంశీ👍
ఎదో మ్యాజిక్ చేశినావ్ అన్న , తెప్పించేసినవ్ కన్నీళ్లు 😥 నువ్వు సళ్లగుండ 🥰
నిజమే చాలా మంది కి అలా పుట్టిన ఇళ్లకు వెళ్లే అవకాశం కూడా ఉండదు చాలా బాధ ఊపిరాడని ఫీలింగ్ అందులో నేను ఒక దాన్ని.
బాగా రాశారు.
Baagundi Sai Nice Story
సూటిగా సుత్తి లేకుండా, ఆ వాహనాలు తిరిగే హడావిడి రోడ్డు పక్కన పాని పూరి బండి పక్కన కూర్చోబెట్టి కూతురుతో బాటు పాఠకులను కూడా కూర్చోబెట్టి రెండే రెండు ముచ్చట్లతో మెట్టినింటి, పిల్లల బాధ్యతలతో (బాధలతో) పులిసిపోయిన స్త్రీ మనసు లో ఉన్న చిన్నతనం నాటి పసి హృదయం పదిలంగా ఉంది అనీ, అది తనని తాను చూసుకోవాలి అంటే, పుట్టింటలోనే అని హృద్యంగా అద్భుతంగా ఆవిష్కరించారు. మీరు మైక్రో అని రాసిన కథకి సమీక్షనే మరో కథ అయ్యేంత ఉంది అంటే మీ కథలో లోతు ఎంత ఉందో తెలుస్తుంది. బయట ప్రపంచాన్ని లోపల ప్రపంచాన్ని అనుసంధానం చేస్తూ విషయం ఇంజెక్షన్ నరంలోకి ఎక్కించినట్టు మీరు మనసులోకి ఎక్కించారు. మీ రచన నాకో వచన పాఠం. ధన్యవాదాలు.
Nice story
Nice story
కథ బావుంది