1
చమ్కీ
ఇంత నీడ దుప్పటి మీదేసి
చెట్టు మౌనంగా కూర్చుంటుంది
ఆకాశం నీలి రంగును
గాలి కుంచెతో కలిపి
చెట్టుకింద నీడకు రంగులేస్తుంది
పిట్ట వొకటి తీగ మీద
ఉయ్యాలూగుతూ
కోతుల గెంతులను
ఉలికిపాటుతో పరిశీలిస్తుంది
కొమ్మల్లో చిక్కిన పొగ మంచు పేలికొకటి
పిట్ట పాటకు లాలనగా ఊగుతుంది
పైకి ఎక్కుపెట్టిన కుంచెలతో మరికొన్ని చెట్లు
వానలేని పూట ఏడు రంగుల్ని కలగంటూ
నీలి అద్దం కేసి దిగులు ముఖాలై
వీక్షిస్తూ వుంటాయి
నిశ్శబ్దం కుక్క పిల్లై నా వెంటపడుతుంది
అరుపుల్లేని ప్రేమలోకమొకటి
పిట్టల గుంపై వచ్చి మీద వాలుతుంది
చుట్టూ పరుచుకున్న నీడ మీద
పచ్చనాకొకదాన్ని చమ్కీలా కుడుతోంది చెట్టు
ఎండనీటి అలలు
నీడ తీరంతో యుద్ధం చేస్తూ
చెట్టు మొదలుకు
తలలు బాదుకుంటున్నాయి
2
గాయపడిన గాలి
గాలి గాయపడింది
మత కాలుష్యం
రాజకీయ కాలుష్యం
వ్యక్తిత్వ కాలుష్యం
అనేక కాలుష్యాల
ముళ్లు గీసుకుపోయి
రక్తసిక్తమయింది గాలి దేహం
గాలి కంఠనాళం పూడి
శ్వాసలు తెగిపడుతున్నాయి
స్వరపేటిక చిట్లి
నినాదాలు రోడ్డున పడ్డాయి
గాలి బెరడును తొలుస్తూ
ఏవేవో విష పురుగులు
గాలి చెట్టును కుళ్లగిస్తూ
దేశమంతా అల్లుకున్న
ఏవేవో విషవాయువులు
గాలిని శుభ్రం చేయాలి
కన్నీటితో కడిగితే లాభం లేదు
నెత్తురులో ముంచి తీయాలి
చైతన్యపు బండ మీద
గాలిని బాది పారేయాలి
ఉద్యమాల ఎండలో ఆరబెట్టి
గాలిని సాపు చేయాలి
మనుషులు శ్వాసించటానికి
ఆకుపచ్చని మొక్కల్లా
మనుషులంతా మళ్లీ మళ్లీ
పూయటానికి
గాలి నురగ మీద
పడవల్లా తేలిపోవటానికి
గాయపడిన గాలికి
సరికొత్త వైద్యం చేయాలి
గాలి మనుషులందరి
ఉమ్మడి ఆస్తి కదా
గాలిని కూడా తన్నుకెళ్లే
గద్దల విహారాన్ని
పసిగట్టాలి
పనిపట్టాలి
ఈ నేల మీద గింజలు
మొలకెత్తాలంటే
గాలి సహకారం తప్పనిసరి
ఇప్పుడు వీస్తున్న విషపు గాలిని
తూర్పార పట్టటం
అతని చేతుల్లోనే వుంది
చెమటతో తడిసిన చేతులతనివి
గాయపడిన గాలికి
కుట్లేయగల నేర్పరి కూడా అతడే
ఎప్పటిలాగే
గాయాన్ని మాన్పుకుని
గాలి వీయాల్సిందే!
3
చలి చొక్కా
చలిప్పుడో
కొత్త చొక్కా తొడుక్కుంది
చొక్కా మీద
రైతు పోరు బొమ్మలు
విత్తనాలు చల్లే పిడికిళ్లు
గాల్లో బుల్లెట్లను ఒడిసిపడుతున్నాయి
ఆకుపచ్చ చిత్రాల్ని గీసే పనిముట్లు
ఆయుధాలుగా వ్యూహాలు రచిస్తూ
రోడ్డు మీద పరేడు చేస్తున్నాయి
చుట్టూ అలుముకున్న చలి నెగళ్లు
చలిని తరిమేసే పనిలో
నిమగ్నమయ్యాయి
చలి మంటలకు చేతులు
కాపడం పెట్టుకుంటున్న దేహాలు వేడెక్కి
పదునైన ఆయుధాలుగా రూపొందుతూ
సరికొత్త యుద్ధ వ్యూహాలు రచిస్తున్నాయి
చలి చొక్కా మీద
ఇపుడు తిరుగుబాటు బొమ్మలు
పిడికెళ్లెత్తిన చేతులు
చేతుల చివర నాగళ్లు
పలుగులూ పారలూ
ఇక నియంత పీఠం కింద
పెకలింపు మొదలైంది
*
బావున్నాయి
Tq sir
Super kavitalu.Dhanyam
Bavunnay
చిత్తలూరి వారి కవితలు మూడు: చక్కని ఆకుపచ్చని imagery చెక్కిన చుక్కల చెమ్కీలు. నీడ దుప్పటి కప్పడం, ఎండనీటి అలలు చెట్టుకు తలలు బాదుకోవడం, చలి కొత్త చొక్కా తొడుక్కోవడం – ఇవన్నీ నాకు నచ్చిన నవీన భావచిత్రాలు. అభినందనలు.
Tq very much for your poetic concern sir.
చలి చొక్కా ..బావుంది