చిట్టెమ్మ… చుట్టం కాని ఆత్మబంధువు…!!

జ్వరం అంటురోగం కాదని తెలిసినా… తన కారణంగా పిల్లలున్న ఇల్లు ఇబ్బంది పడకూడదన్న సొంత లాక్ డౌన్ నిర్ణయం ఆమెది.

‘‘అన్నపూర్ణమ్మా.. మడి కట్టుకున్నావా… ఏం వండుతున్నావ్… ఎక్కడికి వెళ్లారాయన. కోర్టుకా… ముంగండా…’’
‘‘ఏమ్మా… కుమారమ్మా.. పరీచ్చలా… రాత్రంతా లేట్లు వేసుకునే ఉన్నావు. ఓ దోవలు. కంటి మీద కునుకు లేదనుకో. అయినా సదువుకో తల్లి. నా నిద్రకేముందిలే’’

‘‘ఏమ్మా.. భానమ్మా… వంకాయి కొత్తిమీరి కారం వండావా… ఈదిలోకి వస్తోంది నీ కొత్తిమీర వాసన’’
ఇలా అగ్రహారంలో అందరి ఇళ్లకి సొంత మనిషిలా తిగిరేది చిట్టెమ్మ గారు.

నాలుగు నుంచి నాలుగున్నర అడుగుల పొడవు… ఏమంత లావు… మరీ సన్నం కాని గుప్పెడు మనిషి. బోర్లించిన గిన్నె మీద వెండి తీగల్లా మెరిసిపోయే తెల్లటి వెంట్రుకలు. వాటికి మధ్యలో బియ్యంలో రాళ్లలా అక్కడక్కడా నల్లటి వెంట్రుకలు. ఇందిరా గాంధీలా బాపుడ్ (బాబ్ డ్) హేర్. ఇస్త్రీ లేకపోయినా… పెద్దగా మాసిపోని చీర… అక్కడక్కడా చిన్నచిన్న నల్లటి మచ్చలతో… మోచేతుల వరకూ వచ్చిన లూజు రవిక.  ఆ రవికని కూడా ముడి కట్టుకునే వారు.

కాళ్లకి చెప్పులు…, చేతులకు గాజులు వేసుకున్న చిట్టెమ్మ గారిని నేనెప్పుడూ చూడలేదు. ముఖాన బొట్టు కూడా కనిపించిన గుర్తు లేదు. బోసిపళ్లతో  చిట్టెమ్మగారు నవ్వుతూ  అగ్రహారంలో కల తిరుగుతూంటే రాత్రి పగలు తేడా తెలియని సూర్య చంద్రుల సంగమంలా ఉండేది. ఏ ఊరో… ఎక్కడి నుంచి వచ్చారో…. అగ్రహారంలో ఎవరి బంధువో…. బ్రాహ్మలే అయినా ఏ శాఖో కొంద‌రికి తెలుసేమో కాని నాలాగే చాలమందికి తెలియదు. నియోగులు ఎక్కువగా ఉన్న కూచిమంచి అగ్రహారంలో వారింటికి వెళ్తే చిట్టెమ్మ గారు ఆరువేల నియోగి. అగ్రహారంలో మైనార్టీలైన వైదికుల ఇంట్లో అడుగుపెడితే చిట్టెమ్మ గారు వైదికి. ఏడెనిమిది కుటుంబాలే  ఉన్న ద్రావిళ్ల ఇంట్లో చిట్టెమ్మ గారు కనిపిస్తే ద్రావిడ ఆడపడుచు. అంతలా కలిసిపోయేది ఆ మహాతల్లి.

అగ్రహారం ప్రారంభంలో ఉన్న పోడూరారి ఇంటి దగ్గర కనిపించిన చిట్టెమ్మ గారు ఉత్తర క్షణంలో అగ్రహారానికి ఆ చివర ఉన్న చంద్రమోళేశ్వర స్వామి గుడి అరుగు మీద కనిపించే వారు. తుపానుకి మారుపేరు చిట్టెమ్మ గారి నడక. ఆంధ్రా ఉద్యమ సమయంలో దేశ ఏలికను ఎగతాళి చేసేందుకు ప్రారంభమై మాలాంటి కుర్రాళ్ల నోళ్లలో నిత్యం నానే ‘‘ఇందిరా గాంధీ… కారబ్బూందీ’’ నినాదం వింటే మాత్రం చిట్టెమ్మకి చిర్రెత్తుకొచ్చేది. కొట్టేది కాదు కాని… ఆ ప్రయత్నం చేస్తూనే మర్యాదగా తిట్టేది.  ఏ ఇంటికి యజమాని కాని చిట్టెమ్మ అగ్రహారంలో అన్ని ఇళ్లకు యజమానిగానే తిరిగేది. ఎక్కడో ఏ అరుగు మీదో పడుకుని పొద్దు పొడవక ముందే లేచి ఏ ఇంటి పెరట్లోనో కాలక్రత్యాలు తీర్చుకునేది. సరిగ్గా కాఫీల సమయానికి ఎవరో ఒకరింటికి వెళ్లి మాట కలిపేది.

ఉదయాన్నే చిట్టెమ్మని చూసిన డిగ్రీ కాలేజీ పిల్లలు చాలా అసహనంగా ‘వచ్చేసింది’ అని ఆవిడకి వినపడేలా పైకే అనేసేవారు.  అది విన్న చిట్టెమ్మ  బోసినవ్వుతో ‘‘రాక చస్తానా… పుత్తకాలు పట్టుకుని బయల్దేరండి స్కూళ్లకి’’ అంటూ లోపల తొలి చేస్తున్న దుఖ్ఖాన్ని దింగమింగుకునేది. అమలాపురం ఎస్ కే బీ ఆర్ కాలేజీలో డిగ్రీ క్లాసులు ఉదయం 7-30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగిసేవి. తిరిగి ఇంటర్మీడియట్ క్లాసులు 12-30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకూ  నడిచేవి. దీనికి కారణం కోనసీమలో చాలా పేరు ప్రఖ్యాతున్న కాలేజీ ఎస్ కేబీఆర్ కాలేజీ ఒక్కటే.  చుట్టుప‌క్క‌ల గ్రామాల నుంచి డిగ్రీ చ‌దివేందుకు ఉద‌యం, ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దివేందుకు మ‌ధ్యాహ్నం కాలేజీకి చాలా మంది వ‌చ్చేవారు. ఉదయం డిగ్రీ కాలేజీకి వెళ్లే వారితో అగ్రహారంలో దాదాపు అన్ని ఇళ్లు సందడిగా ఉండేవి. హైస్కూల్ కి వెళ్లే మాలాంటి పిల్లల హడావుడి సరేసరి. అదిగో అలాంటి హడావుడి ఉదయపు వేళల్లో వచ్చే చిట్టెమ్మ గారు వంట గదికి ముందో… వెనకో గుమ్మానికి ఆనుకుని గడప మీద మోచేయి ఆనించుకుని కుడి కాలు లోపలికి మడచుకుని… ఎడం కాలు సగం మడతపెట్టి కూర్చునేది. ఆ కూర్చోవడంలో ‘కాఫీ ఇవ్వండి’ అనే డిమాండ్ దాగి ఉండేది.

అగ్రహారంలో అన్ని ఇళ్లు ఎకబిగిన తిరిగేయడం, అక్కడ వారేం మాట్లాడుకున్నారో ఆ మాటలు మరొకరి ఇంట్లో మోసేసి ఆ పూట గడుపుకోవడం చిట్టెమ్మకి తెలీదు. ఏ ఇంట్లో మంచి జరిగినా ఆ మంచిని నేటి వాట్సాప్ కి వంద రెట్లు స్పీడుగా అందరికి తెలిసేలా చేసేదావిడ. అగ్రహారంలో దాదాపు ప్రతి ఇంటి లోగుట్టు చిట్టెమ్మకి తెలుసు. కాని ఏ ఒక్కరి దగ్గర కూడా ఆ గుట్టుని రట్టు చేసేది కాదావిడ. అలాగని ఏ ఇంట్లో అయినా ఇబ్బందులు పడుతూంటే మాత్రం వాటిని కడుపులోనే దాచుకునేది తప్ప పెదవి దాటనిచ్చేది కాదు. ‘పెదవి దాటితే పృద్వి దాటుతుంది’ అనే సామెత చిట్టెమ్మ గారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలీదనుకుంటాను. ఇంటికి బంధువులు ఎవరైనా వస్తే ఆ సమయంలోనే చిట్టెమ్మ గారు కూడా వస్తే తనకు తానే ‘మీరు మాస్టారి బంధువులా.. మా అన్నపూర్ణమ్మ తరపువారా… నేను ఈ ఇంట్లో దాన్నే. నన్ను మీరెరగరు’ అని పరిచయంలాంటిది చేసేసుకునేది. అంతే కాదు.. తన వల్ల ఆ ఇంటి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ‘ఊరికే వచ్చానమ్మా. చూసిపోదామని. బోయినానికేం కాదు’ అని ఓ నవ్వు నవ్వేసి వెళ్లిపోయేది.

తన రాక కారణంగా ఆ ఇంటికి వచ్చిన బంధువులు, ఆ ఇంటి వారు ఇబ్బంది పడకూడదన్న మధ్యతరగతి సామాజిక ఎరుక చిట్టెమ్మగారిలో కనిపించేది. అగ్రహారంలో ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా మూడు నాలుగు రోజుల పాటు చిట్టెమ్మ సందడి అంతా ఇంతా కాదు. అలాగని పనులు చేసేది కాదు. నలుగురు కూర్చున్న చోటకి వెళ్లి మాట కలిపేది. పెళ్లి జ‌రుగుతూంటే విడిది ఇంట్లో మగ పెళ్లివారి దగ్గరికి వెళ్లి పెళ్లి కూతురు గురించి, ఆ కుటుంబం గురించి నాలుగు మంచి మాటలు చెప్పేది మహాతల్లి. అప్పగింతల వేళ తన కూతుర్ని అత్తవారింటికి పంపుతున్నట్లుగా కన్నీళ్లు పెట్టుకునేది చిట్టెమ్మ. తనను విసుక్కున్న…, ఎగతాళి చేసిన ఆడపిల్లల పెళ్లి అయినా సరే వాటిని ఇసుమంతైనా తలంపులోకి తెచ్చుకోకుండా ఆ పిల్లల గురించి నాలుగు మంచి మాటలు చెప్పేదావిడ. ఎంతో మంది కూచిమంచి వారు ఉన్న  అగ్రహారంలో ఓ కూచిమంచి వారి ఇంటి పెరట్లో కొందరు మధ్య వయస్కులు పేకాట ఆడే వారు. అది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. లాయ‌ర్లు ఎక్కువ‌గా ఉన్న అగ్ర‌హారానికి వేరే పని కోసం ఒకరిద్దరు పోలీసులు వచ్చినా… అలా వచ్చిన వారిని చిట్టెమ్మ చూసి బియ్యం కొట్టు రాజు గారి ఇంటి పెరట్లోంచో… గాదె రామం గారి ఇంటి పెరట్లోంచో మెల్లగా వెళ్లి పోలీసుల సంగతి పేకాట బ్రందానికి చేరవేసేదావిడ‌.  ఫైలేరియా కారణంగా చిట్టెమ్మకి ఏడాదికి రెండు మూడుసార్లు విపరీతమైన జ్వరం వచ్చేది. ఆ జ్వర తీవ్రతలో చిట్టెమ్మ పడిన వేదన వర్ణనాతీతం. ఏ అరుగు మీదో పడుకుని ముక్కుతూ… మూలుగుతూ బాధపడేది.

అగ్రహారంలో ఎవరో ఒకరు ఇంత కాఫీ ఇచ్చినా…. తినడానికి ఏ టిఫిన్ వంటిదో తీసుకువచ్చినా అది ఆ అరుగు వద్దకే తీసుకువెళ్లాలి కాని జ్వరం తగ్గే వరకూ ఎవ్వరింటికి వచ్చేది కాదు చిట్టెమ్మ. ఫైలేరియా జ్వరం అంటురోగం కాదని ఆమెకు తెలిసినా… తన కారణంగా పిల్లలున్న ఇల్లు ఇబ్బంది పడకూడదన్న సొంత లాక్ డౌన్ నిర్ణయం ఆమెది. అగ్రహారం చివరిలో శంకరమఠం దగ్గర ఉన్న రిక్షా స్టాండికి వెళ్లి వాళ్లలో ఓ రిక్షా వాడిని తీసుకు రమ్మని మాలాంటి కుర్రాళ్లని అడిగేది. అలా వచ్చిన రిక్షాలో ఎలాగో కూలబడి హైస్కూల్ రోడ్డు మ‌లుపులోని డాక్టర్ మంథా సుబ్బారావు గారి దగ్గరికి వెళ్లి ఆయన ఇచ్చిన మందో, టానిక్కో తీసుకుని వచ్చేసేది చిట్టెమ్మ. ఈ భూప్రపంచంలో తన జ్వరాన్ని తగ్గించేది…, తన శారీరిక బాధకు ఉపశమనం కలిగించేది డాక్టర్ మంథా సుబ్బారావు తప్ప వేరెవ్వరూ కాదని చిట్టెమ్మ గారికి అగ్రహారం అంత నమ్మకం. వృద్ధాప్యం చిట్టెమ్మని కుంగదీసింది. ఎవరితోనూ చేయించుకోకుండా ఆ నిరుపేద మహారాణి చిట్టెమ్మ శారీరిక ధర్మాన్ని అనుసరించి అనంతలోకాలకు వెళ్లిపోయింది.

స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే అన్న ఆత్రేయ మాటలు చిట్టెమ్మ గారి చివరి ప్రస్థానంలో నిజమయ్యాయి. అగ్రహారంలో ప్రతి ఒక్కరూ చిట్టెమ్మతో  అనుబంధాన్ని పంచుకున్నారు.  కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటూ ‘‘అగ్రహారంతో ఏ జన్మ రుణమో… ఇలా తీర్చుకుంది’’ అని కళ్లు వొత్తుకున్నారు. చిట్టెమ్మ అంత్యక్రియలే కాదు… తదనంతర ఉత్తర క్రియలను కూడా అగ్రహారంలో అందరూ కలిసే చేశారు. చిట్టెమ్మ మరణించిన పదో రోజున అగ్ర‌హారంలో కొంద‌రు కౌశిక ఒడ్డున ఆమెకి ధర్మోదకాలు ఇచ్చి తెలియని… వెంటాడే ఓ రుణం తీర్చుకున్నారు.  అగ్ర‌హారంలో ఎవ‌రికీ చుట్టం కాని  చిట్టె‌మ్మ త‌న మ‌ర‌ణంతో ఆత్మ‌బంధువుగా… అంద‌రి బంధువుగా మిలిగిపోయింది.

*

ముక్కామల చక్రధర్

26 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎప్పుడో చిన్నప్పుడు చూసిన, ఆట పట్టించిన చిట్టెమ్మని గుర్తుకు తెచ్చావు. అలాగే చిట్టెమ్మ రూపం తెలియని ఎందరి మనసులో ఆమె రూపాన్ని ముద్రించావు.
    ఆమె అగ్రహారం ఆడపడుచు. పిల్లల ఆట వస్తువు. ఒక ఇంట్లోంచి మరో ఇంట్లోకి వస్తువుల్ని మాత్రమే చేరవేసే కొరియర్ .రుచుల్ని చెప్పి రోజు గడుపుకునేది. అగ్రహారమంతా కలతిరిగేది.

    అందరి తల్లో నాలిక. వెరసి ఆత్మబందువు. బాగుంది బుజ్జి నీ ప్రయత్నం.ఇదే కొనసాగించు.

  • చాలా బాగా వ్రాసారు.నాకు గుర్తుకు వస్తుంది చినఁపుడు అమలాపురం మా పెదనాన ఇంటికి వచ్చినప్పుడు.Excellant…

  • చిట్టెమ్మ గారి గురించి చదువుతుంటే… మా ఊళ్ళో ఉండే బాలమ్మ గారు అనే ఓ వ్యక్తి(త్వం) గుర్తొచ్చాయి…
    పరోపకారి పాపన్న లాంటి ఈ పాత్ర ప్రతీ గ్రామంలో ఒకరో పోషిస్తూంటారు…

    పాఠకులను అలరించడంలో హ్యాట్రిక్ సాధించిన రచయితకు అభినందనలు..
    ఉషాకిరణ్

  • ఇది కూడా బాగుంది బుజ్జీ! మరో విషయం ఏవిటంటే, నేను మరచిపోయిన విషయాలు కొన్ని జ్ఞాపకం చేశావు ముఖ్యంగా రవికను ముడి వేసుకోనే స్త్రీలను నా చిన్నతనంలో చూశాను. అలాగే ఏ ఊరో… ఎక్కడి నుంచి వచ్చారో…. ఊళ్ళో ఎవరి బంధువో…తెలియదు కానీ అందరి ఇళ్లకి సొంత మనిషిలా తిరిగే ‘చిట్టెమ్మ’ లాంటి వారిని నేనెరుగుదును. ఊళ్ళో చాలా మందికి ఆత్మీయురాలుగా తిరుగాడిన వారిని నా బాల్యంలో చూశాను.

  • బుజ్జీ
    నీ రచనతో మరోక్కసారి చిట్టెమ్మగార్ని కళ్ళకు కట్టనట్లు గుర్తుచేసావు. అందరికీ ఆత్మభందువులా ఎలా అయిందో నువ్వు చేప్పకనే చెప్పావు. కుాచిమించివారి అగ్రహారం ఎందరికో ఆశ్రయం ఇచ్చింది అందులో చిట్టెమ్మగారు ఓకరు .అగ్రహారం ఓక జ్ఞా పకాల,అనుభవాలఖని నువ్వు ఓక్కోక్కటిగా త్రవ్వితీస్తున్నావు. నీకు నా అభినందనలు

  • మీ కథ చదవగానే.. చిన్నప్పటి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తుకు వచ్చాయి. చాలా చక్కగా చెప్పారు సార్.

  • Really excellent narration made me recollect all old and golden days.
    Thanku so much please keep writing many more
    After many days really I read through a full Telugu narration of our home town chittamma.

  • Really excellent narration made me recollect all old and golden days.
    Thanku so much please keep writing many more
    After many days really I read through a full Telugu narration of our home town chittamma.
    Best wishes to you.

  • సూపర్.. చాలా బాగుంది.. చిట్టెమ్మ గురించి వర్ణించిన తీరు simply superb. ప్రతి ఊరిలో అందరికీ తలలో నాలుకలా ఉండే ఇలాంటి ఆవిడ ఒకరు ఉంటారు. మా చోడవరం లో బుల్లెమ్మ అనే ఆవిడ ఉండేది. ఇది చదువుతుంటే ఆమె గుర్తొచ్చింది. మనసును బాల్యపు జ్ఞాపకాల పొరల్లోకి తీసుకెళ్ళిన చక్రధర్ గారు మీకు అభినందనలు. మీ వ్యాస పరంపరను ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ..

  • ఈ కథ చదివితే ప్రతి ఊరిలో ఒక చిట్టెమ్మ ఉంటే బాగుండు అనిపిస్తోంది.

  • నేను చూడలేకపోయిన చిట్టెమ్మను మీ మనసుతో చూపించారు. అక్షరాలతో చదివించారు. రచన బాగుంది సర్… అభినందనలు

  • శతకం పూరించాలి శంకరమంచి అమరావతి కథలు తరహాలో

  • Marapu porallo padipoyina Chittemma garni bagaa jnapakam chesharu. Naynu evidani chushanu. Agraharamlo vaalla gurinche kaakundaa, Agraharamtho anubandham vunna Amalapuram vaalla gurinchi kudaa raayandi. Vanda paatralu mee munduki vachi vaalipothsyi “nannu gurinchi kadha rasyavuu?” ani..
    Sri. Chakradhar avignamgaa raaseyandi. -Pemmaraju Gopalakrishna, Hyd

  • కూచి మంచి అగ్రహారం వాళ్లే కాదు సాహిత్య పిపాసకులు ఎవరయినా ఆనందించే రచన. ఏ రచన అయినా జీవితానికి దగ్గర గా ఉంటేనే విలువ. అటువంటిది జీవితం లోంచే ప్రత్యక్షం గా తీసుకుంటే ఇంక చెప్పాలా. ఏనాటి చిట్టెమ్మ. రచయిత గా జీవితం చిన్నప్పటి జ్ఞాపకాలు మస్తిష్కం లో ముద్రించుకోవడం తోటే ప్రారంభమవుతుంది అనడానికి నీ రచన నిదర్శనం. మనః పూర్వక అభినందనలు – రమణ శర్మ. అన్నట్టు మాఇల్లు కూడా చేర్చి నందుకు ఆనందం

  • పట్టాభివీధిలో నివసించిన మాకు చిట్టెమ్మ గార్ని గుర్తు చేశారు. ధన్యవాదాలు.

  • చిట్టెమ్మగారిని చిరంజీవిని చేశావురా బుజ్జీ! నీ అక్షరాన్ని కూడా చిరంజీవిని చేసుకున్నావు. చాల బావుంది.ఆ👏👏👏

  • ఏమని చెప్పేది, ఎన్నో సంవత్సరాల క్రితం మన అగ్రహారం ఏలేసిన ఇందిరాగాంధీ. అలియాస్ చిట్టెమ్మ…..చిట్టెమ్మగారు….కళ్ళ ముందు కడలాడేలా చేసేసావ్….మన అందరికీ, మన అగ్రహారం కు కామన్ బంధువు….మన ఇంట్లో అంతా భోజనం అయిన తరువాత వచ్చి భోజనం చేయటం, అదీ అందరూ చేశారో లేదో కనుక్కుని, ఇంకా గుర్తుంది. కానీ ఆవిడ వ్యక్తిగత విషయాలు ఎవ్వరికీ తెలియవు. ఒక అబ్బాయి ఉండేవాడిని అతను సరిగ్గా చూడకుండా ఈమెను వదిలేసాడని. ఏదో కొద్దీ సమాచారం అదీ నిజమో కాదో తెలియదు..కానీ ఆవిడ అగ్రహారం నికి ఆడపడుచులా బతికింది. కూచిమించి వారి అగ్రహారం విషయం ఎవరు తలుచుకున్నా….ఈవిడి ప్రహసనం ,ప్రస్థానం గుర్తుకురావసినదే…చిట్టెమ్మగారికి నమస్కరిస్తూ, గుర్తుకు తెచ్చిన బుజ్జుకి అభినందిస్తూ……రాము.సరిపేల్ల.

  • చాలాబాగారాశావు బుజ్జీ. ఒక చిట్టెమ్మ గారి గురించి చెప్పి ఎన్ని ఊళ్లలో ఎందరో చిట్టెమ్మల గురించి చెప్పావు. చిట్టెమ్మ యూనివర్సల్ .

  • బాగా చెప్పావు చక్రి

  • డియర్ చక్రీ…
    కూచిమంచి అగ్రహార కేంద్రకంగా నీదైన ‘petits récit’ కి నువ్వు పూనుకున్నాక ఆ కథన పద్ధతిలో ఒక అంతస్సూత్రాన్ని అల్లుకోవాలి. అది ప్రయత్నపూర్వకంగా చేసేది కాదు, చేయకూడదు కూడా. వస్తువు పట్ల ఆపేక్షే నీకు ఆ శైలీగతమైన వరాన్ని అందిస్తుంది. ఈ context లోంచి చూస్తే, ఈ అగ్రహారం కథకుడి వయసు అప్పుడు- ఇప్పుడు మధ్య లోలకమై ఉండొచ్చు. చదువరులకి నువ్వెవరో, నీ వయసెంతో తెలీక పోయినా, తలపోత- వ్యక్తీకరణకి మధ్య సుమారు మూడున్నర దశాబ్దాల వ్యవధి ఉన్నట్టు అర్థమౌతుంటుంది. అప్పటి టీనేజ్ కుర్రాడు, ఇప్పుడు ఒక సంపూర్ణ (పోనీ అసంపూర్ణ) వ్యక్తిత్వం సంతరించుకొని చెప్పుకుంటున్న ఉపకథనాలుగా వీటిని అర్థం చేసుకోవచ్చు. ఈ little narratives కి ఎంత విస్తృతి ఉందో, అంత పరిమితి కూడా ఉంటుంది. మహాకథనాల్లో రచయిత లాగా సర్వజ్ఞుడిగా, సర్వాంతర్యామి అయిన భగవంతుడిలా అవతారమెత్తే దర్జా ఉండదు.
    1. “లోపల తొలి చేస్తున్న దుఖ్ఖాన్ని దింగమింగుకునేది”
    – చిట్టెమ్మ గారు కురచైన కొద్ది మనిషి, అన్ని కుటుంబాలకీ తలలో నాలుక, అందరి బంధువు అన్నది నాణేనికి ఒక వైపు. కానీ, “ఉదయాన్నే చిట్టెమ్మని చూసిన డిగ్రీ కాలేజీ పిల్లలు చాలా అసహనంగా ‘వచ్చేసింది’ అని ఆవిడకి వినపడేలా పైకే అనేసేవారు.” ఈ డిగ్రీ కాలేజ్ పిల్లలు- అంటే తర్వాతి తరం; బహుశా వారికి వెనకటి తరాల కలివిడితనం, వాళ్ల దృష్టిలో intrusion కావొచ్చు. ఆ డిగ్రీ పిల్లల కట్టె విరుపు మాటలు, చేష్టలు – వాళ్ల కంటే ఓ నాలుగైదేళ్లు చిన్నవాడైన ఈ హైస్కూల్ కుర్రాడి కళ్ల బడిందనుకుందాం. అప్పుడు ఇతనికి మనసు చివుక్కుమంటే, చిట్టెమ్మ గారి తరఫున – “లోపల తొలి చేస్తున్న దుఖ్ఖాన్ని దింగమింగుకుంటున్నట్టు అనిపించేది…”- అనే అర్థమొచ్చేలా రాయాలి. లేదా ఆనాటి దృశ్యాన్ని ఈనాడు పరిపక్వమైన బుద్ధితో సమీక్షించుకొని, ” లోపల తొలి చేస్తున్న దుఖ్ఖాన్ని దింగమింగుకునేదేమో…” అని రాయాల్సి ఉండేది. కానీ, “లోపల తొలి చేస్తున్న దుఖ్ఖాన్ని దింగమింగుకునేది”- అని ఆమె లోపలికి తొంగిచూసినట్టు రాసే వెసులుబాటు ముక్కామల బుజ్జికి లేదు.
    2. హైస్కూలు కుర్రాడైన బుజ్జికి చిట్టెమ్మ గారి వివరాలు ఏవీ తెలీవు. కానీ, మూడున్నర దశాబ్దాల తర్వాత ఆమె గురించి తలుచుకుంటున్నప్పుడు ఆ వివరాలు తెలుసుకోవల్సిన, వాటిని కథనంలో చొప్పించాల్సిన అవసరం ఉంది. టీనేజ్ కుర్రాడి ఆలోచన, అవగాహనల పరంగా చూస్తే అప్పటికే చిట్టెమ్మ గారిది ముగ్గుబుట్ట వంటి తల, బోసినవ్వు, కాళ్లకి చెప్పులు, చేతికి గాజులు, నుదుటికి బొట్టు లేవు. ఆమె విధవరాలా, spinster గా మిగిలిపోయిందా, నా అనేవాళ్లు ఎవరూ లేరా? ఈ ప్రశ్నలు చదవరుల కంటే ముందు కథకుడికే కలగాలి. ఈ అగ్రహారీకులైన ఓ పాఠకుడు (రాము సరిపెల్ల గారు)- ఆమె కొడుకు చేత నిరాదరణకి గురైన తల్లి అన్నట్టు చెప్పారు తన స్పందనలో. వయసులో ఉండటం- వయసుడగటం, అందంగా ఉండటం, లేదా అనాకారితనం, marital status, కులం… వంటి అనేకానేక వాస్తవిక అంశాల బట్టి ఒక స్త్రీ మీద ఆమె చుట్టూ ఉన్న సమాజానికి సంబంధం ఉంటుంది; ఆదరణ, నిరాదరణ ఆధారపడి ఉంటుంది. జీవితంలోని వెలుగునీడల వల్ల ప్రభావితమయ్యే సాదాసీదా మనుషులం కదా, అటువంటి ఏ ఏ నీడల వల్లో చిట్టెమ్మ గారు తంపులమారి అయినట్టయితే, చలం గారి ‘శేషమ్మ’లా ఉంటే, అగ్రహారం చూసే చూపులో తేడా ఉంటుంది కదా. లేదా, రాము సరిపెల్ల గారు సూచనప్రాయంగా అన్నట్టు ఆమె బతుకులో ఎన్నో ఎగుడుదిగుళ్లు ఉన్నప్పటికీ, వాటి ప్రభావాలకి లోనవకుండా, మనసుని నిష్కల్మషంగా ఉంచుకున్నట్టయితే, చిట్టెమ్మ గారు మానుషాతీతంగా బ్రతికినట్టే కదా. కాబట్టి, ఆమె వివరాలు చెప్పకపోవడం, అంటే తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం ఇందులో లోపం.
    3. ఇందులో అచ్చుతప్పులు, syntactical errors ఉన్నాయి, బహుశా, రచయితే (అంటే నువ్వే) వాటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
    “వంట గదికి ముందో… వెనకో గుమ్మానికి ఆనుకుని గడప మీద మోచేయి ఆనించుకుని కుడి కాలు లోపలికి మడచుకుని… ఎడం కాలు సగం మడతపెట్టి కూర్చునేది.”- వంటి యోగాసాధకులకే సాధ్యమయ్యే భంగిమల description ని పోల్చుకోవడం నాకు కొంచెం కష్టంగా తోచింది.

  • అగ్రహారం ఆత్మబంధువుచిట్టిమ్మ కథ బాగుంది.. సర్.,మాఅమ్మమ్మ గారి,అమ్మగారి తరం లో,అలాంటి వారి,ఉండి ఉండవచ్చు.. ఇప్పుడు, పల్లె లోనే లేరు, ఇక అగ్రహారం లో,ఎక్కడ అలాంటి మనుషులు.?సర్

  • అసలు ఇంత బాగా ఎలా రాయగలుగుతారు మాస్టారూ…

  • అందరి బంధువమా..

    అగ్రహారం చిట్టెమ్మ..

    చాలా చాలా బాగుంది బుజ్జి గారు.

    మీకు అభినందనలు.🌹🌹

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు