చింత చిగురు

“చింతాకు,

పుల్ల కూర,

తిందువు రారా బావమరిదీ …”అంటూ  రోడ్డు ప్రక్కనున్న  చింత చెట్ల కింద కబడ్డీ ఆట  ఆడుకుంటున్నారు మగ పిలకాయలు. చింత కాయలు తింటూ కబడ్డీ చూస్తున్నారు ఆడ పిలకాయలు.

*

              భారతక్క సంవత్సరమంతా వరి నాట్లు, కలుపు తీయడాలు,పొలం పనులకు వెళుతుంది. చిగుర్ల కాలంలో చింత చెట్ల పైన ఆధార పడుతుంది. ఎంత పెద్ద చెట్టైనా  అవలీలగా ఎక్కేస్తుంది. ‘భయం వేయదా’ అని ఎవరైనా అడిగితే “చిగుర్ల కాలంలో చింత చెట్ల మీద ఆధారపడడం అలవాటైపోయింది. చిన్నప్పటినుంచీ ఎక్కే చెట్లే కదా, అయినా నాకు చిటారు కొమ్మల్లోని చిగురాకును చూస్తే అవి చిగురులాగా  కనిపించదు. రెపరెపలాడే పది రూపాయల నోట్లలా అగుపిస్తాయి. సంసారానికి నాలుగు రూపాయలు దొరికినట్లే కదా, అయినా నా  మొగుడు బతికి ఉండగా నేర్పించి పోయిన విద్య కదా ఇది. నేను, నా మొగుడూ  కలిసి రోజుకు అయిదారు చెట్లు అవలీలగా ఎక్కి నాలుగైదు బుట్టలు కోసిన రోజులున్నాయి. రోజులో రెండు మూడు గంటలు ఆ కొమ్మా, ఈ  కొమ్మా తిరిగి  చింత చిగురు కొస్తే చాలు, రెండు మూడు వందలు మనచేతికి వచ్చినట్లే కదా” అని  బదులిస్తుంది.

“తిరుపతి కొండ పైన దారాలమ్మే కొడుకు సంపాదించేది చాలదా” అని దగ్గరి వాళ్ళు  అడిగితే“వేన్నీళ్ళకు చన్నీళ్ళు తోడు కదా” అని సమాధానమిస్తుంది.

బుట్ట నిండితే చాలు, భారతక్క కళ్ళు మిలమిలా  మెరిసిపోతాయి. ఎక్కడ లేని ఆనందంతో గంపను ఆకాశంలోకి ఎగరేసి కొంచెం చింతాకు కూడా నేల మీద పడకుండా పట్టుకుంటుంది.

బుట్ట నిండాకపచ్చ బంగారంలా కనిపించేచింత చిగురును చూస్తూ “అయినా, ఇంటికి నడిచి వచ్చే లక్ష్మీ దేవిని ఎవరైనా వద్దనుకుంటారా” అని బుట్టకి ఒకటికి రెండు సార్లు ముద్దు పెడుతుంది.

*

              సూర్యుని లేత ఎండకి శేషాచలం కొండలు తళతళా  మెరుస్తున్నాయి. ఆకాశంలో పక్షుల గుంపులు పల్టీలు కొడుతున్నాయి.

భారతక్క బుట్ట తీసుకుని రోడ్డు పైకి వచ్చింది.

కడప నుంచి తిరుపతి కి వెళ్లే దారిలో వున్న బాలపల్లి గ్రామం అది. రోడ్డుకు రెండు వైపులా చింత చెట్లువరుసగా సైనికుల లెక్కన చూసినంత దూరం ఉన్నాయి.

‘దారులకు ఇరు వైపులా అశోకుడు చెట్లు నాటించాడు’  అని, చిన్నప్పుడెప్పుడో సోషియల్ అయ్యోరు చెప్పింది గుర్తుకు వచ్చింది.

‘మన ఊరి చింత చెట్లు కూడా అశోకుడే  నాటించి ఉంటాడా.. ఏమో .. అయినా ఎవరు నాటితే మనకేమి? మనకు కావల్సింది చింత చిగురు’ అనుకుంటూ ముందుకు నడిచింది.

చింత చెట్ల లోని లేత చిగురు మిలమిలా మెరుస్తూ  కనిపించింది.

“హమ్మయ్య, బుట్ట నిండుకు వస్తుంది, తిరుపతి మార్కెట్ కు  వెళ్లి అమ్ముకుంటే డబ్బే డబ్బు …” అనుకుంటూ తల జుట్టు ముడి వేసింది. బుట్టను ఒకటికి రెండు సార్లు చెత్తా చెదారం లేకుండా చీర కొంగుతో తుడిచింది. చిన్నచిన్నగా వీస్తున్న గాలికి చెట్టు నుంచి చింత పూలు రాలి బుట్టలో పడ్డాయి. సంతోషంతో భారతక్క “నా చింతమ్మ తల్లే, నువ్వు చల్లగుండాల” అని దండం పెట్టింది.

చెట్టు ఎక్కేటప్పుడు అడ్డు రాకుండా చీరని గోచీలాగా కట్టుకుంది. చిన్నగా ఎగబాకుతూ, చేతికి అందిన చింత కాయలు కోస్తూ చెట్టు మధ్యకి చేరింది.

కబడ్డీ చూస్తున్న పొట్టి పావడ, పొట్టి జడలు  వేసుకున్న ఇద్దరు నాలుగో తరగతి  చదివే ఆడ పిలకాయలు పరుగెత్తుకుంటూ వచ్చి  “భారతక్కా, భారతక్కా,  చిన్న చిన్న లేత చింతకాయలు  నాలుగు నేల  మీదికి వేయకూడదా” అని అడిగినారు. వారి చీమిడి ముక్కులను చూసి- “పడిసెం పట్టి వుంది మీకు, చింత కాయలు ఎందుకు తింటారు” అని అడిగింది. “పట్టిన పడిసెం మూడు రోజులకు పోతుందిలే అక్కా, లేత చింతకాయలు మళ్ళీ మళ్ళీ దొరుకుతాయా” అని బదులిచ్చినారు.

“సరే మీ ఇష్టం” అంటూ, చీర కొంగులో దాచి ఉంచిన కొన్ని లేత కాయల్ని వారి పైకి విసిరింది. వారు కాగితంలో చుట్టుకొచ్చిన ఉప్పు, మిరపకాయలు, చింత కాయలు బండపై పెట్టి నూరినారు.

నూరిన ఊరిబిండి చప్పరిస్తూ,పుల్లటి రుచికి ‘హుష్ హుష్’ అంటూ-

చింతకాయ తొక్కు,

              చూచితేనే నోరూరు అని చెబుతూ, పరుగులు తీసినారు.

అదే సమయంలో జిగేల్ జిగేల్ చొక్కా వేసుకుని, మస్కట్ సెంటు కొట్టుకుని, స్టయిలు  స్టయిలుగా  నడిచి వెళ్తున్న పాస్ పోర్ట్ ప్రకాశం భారతక్కను చూసి నిలబడినాడు.

“చింత చెట్టు చిగురు చూడు,

చిన్నదాని పొగరు చూడు …” అని నాలికతో మీసాలు తడుముకుంటూ, కనుబొమ్మలు ఎగుర వేస్తూ పాట పాడినాడు.

ఉరిమి చూసిన భారతక్క “ఒరేయ్, చెక్క మొఖం వాడా, దిగి వచ్చినానంటే ఎముకలు విరగ కొడతాను రేయ్” అని అరిచింది.

ఎవరన్నా ఉన్నారేమో,ఎవరైనా చూసినారేమోనని ఆ పక్కా, ఈ పక్కా  చూసి ఎవ్వరూ చూడలేదని గమనించినాడు. “ఏ ఆకు  రాలినా  చింతాకు రాలదు కదా” అని అంటూ అక్కడి నుంచి గబగబా జారుకున్నాడు

చీరలు సైకిల్ పైన పెట్టుకుని ఊరూరూ తిరిగి అమ్మే ఇద్దరు మగవారు చింత చెట్టు కింద సైకిళ్లను ఆపారు. బీడీలు కాలుస్తూ చెట్టు పైకి చూసారు. కళకళలాడుతున్న చింత చిగురును చూసి “చింత తూత తూతిందే” అన్నాడు ఒకడు. “తూతే కాలం వస్తే తూతదా” అన్నాడు ఇంకొకడు.

చెట్టు పైనుంచి చూసిన  భారతక్క “దొందూ దొందే” అని అనుకుంది.

చీరల  వ్యాపారులు బీడీలు పూర్తిగా కాల్చేసి వారి దారిన వారు వెళ్లిపోయారు.

చిటారు కొమ్మన ఉన్న చింత చిగురు కోస్తోంది భారతక్క.

చిన్నగా వాన జల్లులు మొదలయ్యాయి.

ఇంజనీరింగ్ చదివే కొడుకును తీసుకుని ఒక తండ్రి బుల్లెట్ బండిలో  తిరుపతి లోని కాలేజీకి  వెళ్తున్నాడు. వానకి తడుస్తామని చింత చెట్టు కింద బండి ఆపాడు. చిటారు కొమ్మన ఉన్న  భారతక్కను కొడుకుకు చూపిస్తూ “డబ్బుల కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా జనం ఎన్నెన్ని  కష్టాలు పడుతున్నారో చూడు. వంద నోటు ఇస్తే పిజ్జాలకని, ఐసు క్రీములకని డబ్బులు దారబోస్తావు. కష్టపడి  సంపాదిస్తే తెలుస్తుంది డబ్బు విలువ. మేము ఇచ్చే డబ్బులతో జల్సాగా సినిమాలు షికార్లు తిరిగేది కాదు. డబ్బు విలువ తెలుసుకోవాలి” అని బుద్ది మాటలు చెప్పాడు. అలాగేనన్నట్లు కొడుకు తల ఊపాడు. అన్నీ విన్న భారతక్క చిన్న నవ్వు నవ్వింది.

ఇంతలో వాన నిలిచిపోయింది. బండి తిరుపతి వైపు “డుగు డుగు” అని శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయింది.

జోరుగా గాలి వీస్తోంది. ఊరిలోని వీధి కుక్కలు విచిత్రంగా మొరుగుతున్నాయి. చింత చెట్టు కొమ్మలు గాలికి  అటూఇటూ ఊగుతున్నాయి. వాటిని చూసిన  భారతక్క “వీటికేమైనా దెయ్యం పట్టిందా” అని అనుకుంది.

దూరంగా ఎవరో “భారతక్కా భారతక్కా”  అని అరుస్తున్నట్లు వినిపించింది. తల తిప్పి చూసింది. డ్వాక్రా లీడర్ లీల గెనాల మీద పరుగులు తీస్తూ వస్తోంది. ఏమి జరిగిందో ఏమోనని, భారతక్క చెట్టు మీదినుంచి చకచకా దిగింది.

“మీ పక్కింటి పొదలకూరు పద్మక్క కట్టెల పొయ్యి పైన వంట చేస్తూ ఉంటే, నిప్పు అంటుకుని వాళ్ళ ఇల్లు పూర్తిగా కాలిపోయింది. మీ గుడిసె కూడా అంటుకుంది. ఊర్లో వాళ్లంతా ఆర్పే దానికి పరుగులు తీస్తా ఉన్నారు. తిరుపతి ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేసినారు. ఎండకి తోడు, గాలి విపరీతంగా వీచింది. అగ్గి సరసరా మీ ఇంటి మీదికి ఎగబడింది”

విషయం విన్న భారతక్క బుట్ట అక్కడే పడేసి ఊర్లోకి పరుగులు తీసింది. భారతక్క వెనుకనే డ్వాక్రా లీడర్ లీల  బుట్ట ఎత్తుకుని పరిగెత్తింది.

భారతక్క ఏడ్చుకుంటూ కయ్యిలమ్మిటా కాల్వలమ్మిటా పరుగులు తీసింది. అప్పుడే సరుడు చెట్ల మధ్యన రెండు కోడెద్దులు పోట్లాడుకుంటున్నాయి. ‘ధభీ ధభీ’ మని భారతక్క పరుగులు తీస్తూ ఉంటే అవి పోట్లాడుకోవడం  ఆపి, ఆమె వెళ్లేంతవరకు గమ్మున ఉండి  మళ్ళీ పోట్లాడుకోవడం ప్రారంభించాయి.

గెనాల మీద పరుగెత్తుతూ ఉంటే, తుమ్మ ముల్లు గుచ్చుకుంది. చేత్తో ముల్లు తీసి విసిరి పారేసింది. కాలువ గట్టున ఉన్న పాచి మీద కాలు పెట్టడంతో సర్రున జారి  నీళ్లలో పడింది. గుడ్డలన్నీ తడిసి ముద్దయ్యాయి. ఒళ్ళు విదిలించుకుని తడి గుడ్డలతోనే ఊరు చేరింది.

ఊర్లో అమ్మలక్కలు కాలుతున్న గుడిసె పైన బిందెలతో నీళ్లు పోస్తున్నారు. వేడి

సెగకు అందరికీ చెమటలు పడుతున్నాయి. మంటల పొగలకు ముక్కులు మూసుకుపోయాయి. గుడిసె పక్కనున్న కానుగ చెట్టు ఆకులు మలమల మాడిపోయి ఉన్నాయి.

ఊర్లో వాళ్ళు పలకరిస్తున్నా భారతక్క పలకలేదు. పట్టుకోబోతే విదిలించుకుంది. పూనకం వచ్చిన మనిషి లాగా నడుస్తున్న ఆమెను చూసి  “భారతక్కా, నీకు పిచ్చి కానీ పట్టిందా?” అని జనం అరిచినారు.

నేరుగా కాలుతున్న గుడిసెలోకి దూరింది.

“ఎందుకెళ్లింది భారతక్క నిప్పుల్లోకి ? నగా నట్రా కోసమా?  దాచి పెట్టిన పైసల కోసమా? పొలం పత్రాల  కోసమా….ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బతక వచ్చు కదా” అని అరుస్తున్నారు

ఇంతలో భారతక్క కొడుకు పరుగులు తీస్తా వచ్చినాడు. “అమ్మా  అమ్మా” అని అరుస్తూ ఇంట్లోకి దూరినాడు. వడ్ల గింజలు,గుడ్డలు,వంట సామాన్లు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.

గాదె పక్కన పడి  ఉన్న  భారతక్కను ఎత్తుకుని గబగబా బయటికి తెచ్చినాడు. అమ్మలక్కలు ‘ఓ’ అని అరుస్తున్నారు. గుండెలు బాదుకుంటున్నారు.

ఇంటి ముందర ఉన్న  చాప తెచ్చి చింత చెట్టు కింద పరిచినారు. దాని మీద ఆమెను పడుకోబెట్టారు. ఆమె గుండె ఎగిరెగిరి కొట్టుకుంటోంది. భయంతో కాళ్ళు  చేతులు వణుకుతున్నాయి.

తడి గుడ్డతో ఒళ్ళంతా తుడిచినారు.నువ్వుల నూనె తెచ్చి అక్కడక్కడా పూసినారు. నీళ్లు తాగిపించినారు. భయపడ వద్దని, అంబులెన్సుకు ఫోన్ చేసినామని చెప్పినారు.

ఆమె ఒళ్ళంతా కాలి ఉంది. ‘నిప్పుల్లోకి ఎందుకెళ్ళిందో’ అని అరుస్తూ ఉంటే ఆమె చేతిలో ఒక సంచి కనిపించింది.

అందులో ఆమె పెళ్ళినాటి పట్టు చీర తళ తళా మెరుస్తోంది. అందరూ  ముక్కు మీద వేలు వేసుకున్నారు. సంచీలో ఇంకేమైనా ఉందేమోనని వెదికినారు. ఏమీ కనిపించలేదు.

“అంటే… డబ్బు ,నగలు, పొలం పత్రాలు…ఏవీ గొప్పగా భావించలేదు. తన పెళ్ళినాటి పట్టు చీర ముందర అవన్నీ ఆమెకు చాలా  చిన్నవిగా అనిపించినట్లు ఉన్నాయి” అని ఎవరో గట్టిగా  అరుస్తున్నారు.

భారతక్క చుట్టూ చేరిన అమ్మలక్కలు ఇలా చెప్పుకున్నారు-

“తాళి కట్టిన మొగుడే కదా ఆమె లోకం. ప్రపంచం చుట్టూ మొగుడు తిరిగితే మొగుడినే ప్రపంచమనుకుంది భారతక్క.

చింత చచ్చినా పులుపు చావదంటారు. మొగుడు చనిపోయి ఏండ్లు  గడిచినా, మొగుడిపైన ప్రేమ మాత్రం చావలేదు…

పెళ్లి అయ్యాక  భర్తనే  గాలి, నీరు, ఆహారంగా  భావించింది. తాళి కట్టిన మొగుడు చనిపోయినా పెళ్ళినాటి తీపి గురుతులు మరువలేదు.

ప్రేమించిన వారికి  తెలుస్తుంది ప్రేమ విలువ. భార్యా భర్తల మధ్యన తాళి బంధం మాత్రమే కాకుండా, ప్రేమ బంధం ఉండడం వల్లనే భారతక్క  పెళ్లి నాటి పట్టు చీరని అంత ఇష్టపడింది”

*

ఊర్లో వాళ్ళ కళ్ళు తడి అయ్యాయి. భారతక్క బతకాలని శేషాచలం కొండలవైపు తిరిగి ఏడుకొండలవాడిని మొక్కుకున్నారు.

దూరంగా ఫైర్ ఇంజన్ గంట మోగుతోంది.

గాలికి, చింత చెట్ల లోని చింత చిగురు అటూఇటూ  ఊగుతోంది.

*

ఆర్. సి. కృష్ణ స్వామి రాజు

పుట్టి పెరిగింది చిత్తూరు జిల్లా పుత్తూరు శల్య వైద్య కేంద్రమైన రాసపల్లి. పొట్ట కూటి కోసం తిరుపతిలో నివాసం. ముప్ఫై ఏళ్ల ముందు మూడేళ్ళ పాటు ఈనాడులో విలేఖరి ఉద్యోగం. గత ముప్ఫై ఏళ్లుగా ఎల్ ఐ సి లో డెవలప్ మెంట్ ఆఫీసర్ కొలువు. మూడు వందల పై చిలుకు చిన్నా పెద్దా కథలు ప్రముఖ పత్రికలలో తొంగి చూశాయి.
ఇప్పటి దాకా వెలుగులోకి వచ్చిన పుస్తకాలు ముగ్గురాళ్ళ మిట్ట, సల్లో సల్ల కథా సంపుటిలు. చిత్తూరు జిల్లా మాండలికంలో రాసిన ముగ్గురాళ్ళ మిట్టకు మక్కెన రామసుబ్బయ్య పురస్కారం, సల్లో సల్లకు శివేగారి దేవమ్మ పురస్కారం లభించాయి.ఇవి కాక ప్రస్తుతానికి రాజు గారి కథలు[ముప్పై బాలల బొమ్మల కథలు], పకోడి పొట్లం[అరవై కార్డు కథలు] పుస్తకాలుగా వచ్చి ఉన్నాయి.

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “చింత చిగురు చూస్తేనే నోరూరు” అన్నట్లుగానే కృష్ణ స్వామి రాజు గారు రాసిన “చింత చిగురు” కథ చిత్తూరు మాండలికంలో చింత చిగురు పులుసుగూర అంత కమ్మగా, లేత చింతకాయల తొక్కుపచ్చడిలా పుల్లపుల్లగా ఉంది. విలువలతో కూడిన కథలు రాయడంలో ఆయనది అందె వేసిన చేయి. రాజు గారికి అభినందనలు. మంచి కథను అందించిన సారంగధరుడు “అఫ్సర్ మొహమ్మద్” గారికి ధన్యవాదాలు.

  • జీవన పోరాటంలో ఆమెకు చింతచెట్లు ఏమంత ఎత్తుగా కనిపించలేదు. చిగురు కోసి, బతుకురథాన్ని ముందుకు లాగింది. దైనందిన జీవనంలో అనివార్యంగా కలిసిపోయిన పులుపును ఆమె ప్రేమించింది.
    అంతకన్నా ఎక్కువగా ఇష్టమైన వస్తువు మంటల్లో ఆహుతి అవుతుంటే తట్టుకోలేకపోయింది.
    రాజు గారి కథలో ఆమెతో పాటు కబడ్డీ ఆడే పిలకాయలు, పాస్‌పోర్ట్ ప్రకాశం, చీరలమ్మే వ్యాపారులు… ఇట్లా ఎన్నో పాత్రలు మనల్ని ఆప్యాయంగా పలకరిస్తాయి.
    కృష్ణస్వామి రాజు గారికి అభినందనలు.

    • మీ లాంటి పెద్ద రచయితలు నా కథను విశ్లేషించటం ఎంతో సంతోషం కలిగిస్తోంది సార్

  • మీకు కథ నచ్చినందులకు ధన్యవాదములు మేడమ్

  • రాయలసీమ జీవితాలను ప్రతిబింబించే మరో చక్కని కథ మీ కలంనుంచి! అభినందనలు రాజు గారూ! 💐💐💐

  • Hello sir sir story chala bagundi Ani patralu Mana madhyalo unnatu anipistundi manasuku hatukkuntta saralamga rayadam lo meeru ditta. Tirupati surrounding s villages and areas lo chinta chiguru to raka rakala pulla vantalu tinnatu kammaga undi katha

  • చాలా బాగుందండి భారతక్క పాపం, పొట్టకూటి కోసం చిటారు కొమ్మను కూడా ఎక్కేసింది. చింతచిగురు గురించి ఎంత బాగా చెప్పారు👌👌

  • చింత చిగురు అమ్మి జీవితాన్ని కొనసాగిస్తూ , ఎవరిని
    తన నీడని కూడా తాకనివ్వకుండా , కాలే ఇంట్లో నుండి మధురజ్ఞాపకాన్ని కాపాడిన తీరు కంట తడి
    పెట్టించింది. మీ కథలు చాలా బాగుంటాయి
    అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు