శ్రీపతి పూర్తి పేరు చలపతిరావు. శ్రీపతి కలం పేరు. ఆయన చాలా తక్కువ రచనలు చేసినా రచయితగా పేరుగాంచిన వారు. మృదు స్వభావి. ఇతరులకు సహాయపడటంలో అందరికంటే ముందుండేవారు. గొప్ప స్నేహశీలి. ఆయన భార్య, పెద్దబ్బాయి ఈ ఐదారేళ్లలోపు చనిపోయారు. చిన్నబ్బాయి సంగ్రామ్ అమెరికాలో ఉంటున్నాడు. ముందు శ్రీపతి హబ్సీగూడలో తన స్వగృహంలో ఉండేవారు. ఆ ఇల్లు పెద్దబ్బాయికి ఇచ్చేసి, దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలనీలో ఒక ఫ్లాట్ కొనుక్కుని తన భార్యతో అక్కడ నివసించేవారు. ఆయన భార్య ఈ మధ్య కాలంలోనే చనిపోయారు. అక్కడి నుంచి ఆయన ఒంటరివాడయ్యారు.
శ్రీపతి గారు స్కూల్ టీచర్‌గా పని చేసి రిటైరయ్యారు. ఆయన భార్య కూడా అదే స్కూల్లో టీచర్‌గా పని చేసేవారు. శ్రీపతి గారు రచయితలు, కవులు, కళాకారులతో అతి సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. చిత్రకళ, శిల్పకళలపైనా వ్యాసాలు రాసేవారు.
1970లలో ఏర్పడిన విప్లవ రచయితల సంఘం(విరసం) సంస్థానకులలో ఒకరు. ‘ఎక్స్‌రే’ అనే కలం పేరుతో విప్లవ కవిత్వం రాశారు. దాదాపుగా ఒక 10 పుస్తకాలు వెలువడి ఉంటాయి ఆయనవి. 1970లో ‘కథ’ ఉద్యమం నడిపి, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించారు. హోరు, జనం, కథ.. మొదలైన కథాసంపుటాలు వెలువరించారు. పై పుస్తకాల్లో ప్రముఖులైన రచయితలెందరో కథలు రాశారు. ఆ ‘కథ’ ఉద్యమం ఒక దశాబ్దం పాటు నడిచింది. అది ఒక చారిత్రక సందర్భం.
ఏ మంచి రచన పత్రికల్లో ప్రచురితమైనా, పుస్తకరూపంలో వచ్చినా ఆ రచనలను తన భుజాల మీద వేసుకుని ప్రమోట్ చేసేవారు. నిగర్వి. ఆయన స్వచ్ఛమైన నవ్వును మిత్రులు, రచయితలు ఎన్నటికీ మరిచిపోరు. అందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్న శ్రీపతి గారు గొప్ప వ్యక్తి. ఆయన చనిపోయిన సందర్భంలో సాహితీలోకం మొత్తంగా ఆయనకు అంజలి ఘటిస్తుంది.
*
సారంగ ద్వారానే శ్రీపతి గారు లేరని, ఇక రారని తెలిసింది. ఇండియా టుడే, తెలుగులో వచ్చినప్పుడు దాంట్లో మంచి కథల్ని పాఠకులకి అందించారు. నాకు తెలిసినంతవరకు శ్రీపతి గారు దిల్లీలో కొన్నేళ్లు తెలుగులో వార్తలు (AIR) చదివారు.
Very nice tribute