చారిటీ-ఎన్జీవోలు-అరిస్టోక్రసీ ఆఫ్ లేబర్

నీ ఇంటి ముందు ఒక మనిషి దాహంతో ఎండుకుపోయి కనిపించాడనుకో, కాసిన్ని నీళ్లు పోసి ప్రాణం నిలుపుతావా! అది వ్యవస్థాగత పరిష్కారం కాదు కాబట్టి పోవోయ్ అని చంపేస్తావా! ఆ కష్టాలు చూస్తే కడుపులో దేవినట్టు ఉంటోంది, బతుకుమీదే విరక్తి పుట్టేట్టు ఉంది, చేయగలిగినంత ఏదో ఒకటి చేయడం కనీస మానవత్వం అని ఎవరైనా అనుకుని ఏదైనా చేస్తున్నారనుకోండి. అసలీ మానవతా వాదం అనేదేదైతే ఉందో అది బూర్జువా మరియూ తొక్కా, లెదరూ అని నువ్వు ఉపన్యాసం అందుకుంటే నీ బుర్రచెడింది అని అర్థం. గొడవ పెట్టుకోవడానికి కారణాలు అక్కర్లేదు. ప్రైవేట్ కాలేజ్ ప్రిన్సిపల్ కరోనా లాక్డౌన్ వల్ల కూలీకి వెళ్లాల్సి వచ్చింది అని వార్త వచ్చింది అనుకో, అదేంటి కూలీపనికి పోవడం తప్పా అని కూడా నువ్వు అందుకోవచ్చు. దృక్పథం లోపించిన తర్కం లక్ష్యం లేని బాణం.

చారిటీతో సమస్యలున్న మాట వాస్తవం. కానీ అది పూర్తిగా వేరే కథ. అది వేరే ప్లేన్. తలమూ వేరు, సందర్భమూ వేరు.

ఇది మన జీవితాల్లో ఎన్నడూ చూడనటువంటి మహా విషాదం. ఏలినవారు ముందస్తు ఆలోచన లేకుండా తెచ్చిపెట్టిన విషాదం. రాష్ట ప్రభుత్వాలు చేయదల్చుకున్నవేవో చేస్తున్నాయి. చేయగలిగినంత చేస్తున్నామని చెపుతున్నాయి. ఎంత చేస్తున్నాయో, ఎంత చేయలేకపోతున్నాయో తెలీదు కానీ కలిచివేస్తున్నది. ఎమోషనల్ కాని స్థిరచిత్తులకు కూడా కన్నీళ్లొస్తున్నాయి- దృశ్యాలు చూస్తుంటే కథనాలు చదువుతుంటే. ఏం చేద్దాం మరి! చేయగలిగినంత చేయడమా, లేక హ బ్రద్ధర్, సర్వరోగ నివారిణి అయినటువంటి ఆ ఒహ్హటి దక్క మరేదియున్నూ అంగీకారంకాదే అని పద్మాసనం వేసి కూర్చోవడమా! అది కూడా దాటిపోయి శారదా అని అరిచేయడమా!

అరటిపళ్లూ, గుడ్లూ పంచడం కంటే అవి పంచేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడమే సరైనది అవుతుంది అనొచ్చు. సూనృతమే. కానీ అది ఎప్పటికయ్యేను? ఈ లోపు కళ్లముందు కనిపించే బీభత్సాన్ని ఏం చేయాలి? ఆ బాధ్యత ఎవరిది? వ్యక్తులదా! సంస్థలదా! కాలే పసిపాదాలను మాడే పసి కడుపులను చూల్లేక నాలుగు మెతుకులు, నాలుగు జతల చెప్పులు పంచారనుకో. నాలుగు బస్సులువేసి పంపించారనుకో. ఎవరికైనా వచ్చిన నష్టం ఏమిటి? ఇంత మహా విషాదంలో ప్రభుత్వం తాలూకు చేతులు దూరని తాకని మూలలుండొచ్చు. అక్కడికి ఈచేతులు చేరాయనుకో. నీ సమస్యఏంటి? అస్సలు ఆ కష్టాలను చూస్తూ ఎవరికైనా ఎలా కూర్చోబుద్దవుతుంది స్థిమితంగా. ఈ క్షణాలు మన జీవితాల్లో ఇంతకుముందు లేవు. బహుశా మన జీవితకాలంలో మళ్లీ చూస్తామని అనుకోవడం లేదు.

చారిటీతో సమస్య పూర్తిగా వేరే. స్కేల్ వేరే. క్యాపిటల్ మీదా ఫైనాన్స్ క్యాపిటల్ మీద పట్టున్న మహా ప్రభువులు మహా దాతల రూపమెత్తి సాయానికి గేట్లెత్తినపుడు అదిగో అపుడు చేయాల్సిన చర్చ. పదిదేశాల సంపద ఒక్కడే పోగేసుకుని అందులో చిన్న శకలాన్ని పంచుతూ జీమూతవాహనుడి వలె వెలిగిపోతున్నపుడు చేయవలసిన చర్చ. కోట్లాది ప్రజల శ్రమను దోచుకుని అందులో అణువంత పంచి దాన్ని ప్రచారంలో పెట్టి మొదటి దాన్ని ఎలా దాచేయగలుగుతున్నారో చూశారా అని అడగాల్సిన ప్రశ్న. రాత్రి పడుకుని పొద్దున లేచేసరికి కొన్ని దేశాల సంపదను మించి సంపాదించే భయానక కుబేరులు దాతల రూపంలో అన్ని చోట్లా కనిపిస్తుంటే చేయాల్సిన చర్చ. ఏదో ఒక సామూహిక వనరు మీద పాలకుల అండతో మోనోపలీ సాధించి అందులోనే చిన్న ముక్కను జనానికి పంచుతూ వెలిగే దాతలకు సంబంధించిన చర్చ. ప్రజల సంఘటిత రూపాలకు ప్రత్యామ్నాయంగా చారిటీని నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నపుడు చేయాల్సిన చర్చ.

ఆ చారిటీ ఒక డైవర్షన్ స్కీమ్. లేమికి లేపనాలు రాస్తూ దానికి మూల కారణమైన అసమానతను కనపడనీయకుండా చేసే ప్రయత్నం. బలవంతులు ప్రయత్నపూర్వకంగా చేసే ప్రాజెక్ట్.

ఇంట్లో ఏదో వండుకొచ్చి, నలుగురి దగ్గర నాలుగు ఐదొందళ్లు తీసుకుని అక్కడో ఇక్కడో అదో ఇదో సేకరించి నలుగురి ఆకలి తీర్చే వ్యవహారానికి ఆ చర్చకు అస్సలు సంబంధం లేదు. పరిమాణాత్మకము గుణాత్మకము కాబోదా యందురేమో. కేశమూ భోషాణము కూడా అవదు. ఇక్కడ పరిణామమూ లేదు, గుణమూ లేదు. అస్సలెక్కడా పోలికేలేదు. అంతమాత్రాన అదే పరిష్కారమని కాదు. నిర్దుష్టమైన సమస్యను నిర్దుష్ట పరిస్థితుల్లోనే అంచనా వేయాలి. అన్నింటిని సాధారణీకరించకూడదు. ప్రత్యేక సందర్భాలుంటాయి.

వీళ్లేమీ ఆల్టర్నేటివ్గా చారిటీని ప్రచారం చేయడం లేదు. అదే వ్యవస్థ రోగానికి పరిష్కారమనీ చెప్పడం లేదు. కళ్లముందు మనుషులు పోతున్నపుడు, ‘‘కుండా సట్టీ మూటగట్టుకుని ఉండా బిడ్డల సంకనెత్తుకుని మాసం మాసం గాసం కోసం దేశం దేశం తిరిగే పేదలు‘‘ కళక్లముందు మహా ప్రవాహంలా కదిలిపోతున్నపుడు, ప్రాణాలు పోతున్నపుడు, భరించలేని నిస్సహాయత వ్యాపించినప్పుడు, లోపలెక్కడో కదలిపోతున్నపుడు, దుక్ఖం వ్యాపించి అన్నంముద్ద సయించనప్పుడు తమకు తోచిందేదో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సాయం చేసేవాళ్లందరూ అలాగే ఉన్నారని నేనేమీ చెప్పబోవడం లేదు. ఇలాంటి సమూహ యత్నాల్లో విడి విడి వ్యక్తుల ఉద్దేశ్యాలను చర్చించడం మొదలెడితే తేల్చేదేమీ ఉండదు. ఏ సమూహంలోనైనా ఉన్నట్టే సాయం చేసేవాళ్లలోనూ రకరకాల వాళ్లుంటారు. అస్సలే ప్రచారమూ కోరుకోకుండా చేసేవాల్లుంటారు. కాస్త ఎక్కువ ప్రచారం కోరుకునే వారుంటారు. పత్రికల్లో తెలిసినవారికి ఫోన్ చేసి మా ఫోటో బాగా రావాల అని రిక్వెస్టాజ్ణాలు చేసేవాళ్లుంటారు.అందులో కూడా కక్కుర్తికి పాల్పడే వారు సైతం ఉంటే ఉండొచ్చు. కానీ అది చాలా సమూహాలకు వర్తిస్తుంది. అందర్నీ ఒక గాటన కట్టలేం. కానీ అది మన సమస్య కాదు. ఏదో చేయడానికి నలుగురు ఒక చోట గుమికూడినపుడు అందరూ ఉంటారు. అట్లాంటి సమస్యలు ఉంటే వాళ్లు తేల్చుకుంటారు. మనకేంటి మధ్యలో కాన్స్టిపేషన్.

ఇపుడూ ఏదైనా పెద్దసమస్య మీద ప్రజాసంఘాలుఉమ్మడి కార్యాచరణవేదిక అట్లా ఏర్పాటు చేశాయనుకోండి,. ఏమవుతుంది? పేరుకు నలభై ఒక్క సంఘాలొచ్చేస్తాయి. కానీ చాలా సార్లు పని మాత్రం ప్రతిపాదించిన ఒక్క సంఘం పనే. మిగిలిన సంఘాల నాయకులు భాగస్వాములుగా ఉపన్యాసాలివ్వడానికి అతిధుల్లా వస్తారు. ఫలానాసంఘంగా ఫలానా సంఘం నాయకత్వంగా అని ఘాట్టిగా ప్రచారంలో పోటీపడతారు. జనాన్ని పోగేయడం కార్యక్రమాన్నినిర్వహించడం లాంటి మొత్తం పని మాత్రం ఎవరైతే తొలుత ప్రతిపాదించారో వారు వారి గడ్డి వారు కుడుచుకుని చేసుకోవాల్సిందే. మళ్లీ ప్రెస్మీట్ సమయానికి మాత్రం మేం…ఫలానా సంఘంగా….అని నామవాచకాలను సాగదీసి మరీ చెపుతూ ఉంటారు. ఉమ్మడి వేదికలునడిపిన వారిలో చాలామందికి ఇది అనుభవమే. అలా అని ఉమ్మడి వేదికలొద్దని చెపుతామా. ఎంతో చైతన్యవంతమైన, త్యాగపూరితమైన, ప్రపంచాన్ని విముక్తి చేసే బాధ్యతను తమ భుజాలమీద వేసుకున్న సంఘాలకే అట్లా ఉంటే ఏదో చేతనైన సాయం చేద్దాం అనుకుని నలుగురు ఒకచోట చేరిన గుంపుమీద అంత భారమెందుకు మోపవలె. అసలు ఎదుటి వ్యక్తులు చేసే పని నేను కోరుకున్నట్టే లేదనే గ్యాస్ర్టోప్రాబ్లమ్ ఎవరికైనా ఎందుకుండవలె. సమూహం అన్నతర్వాత రకరకాల వాళ్లుంటారు. వాళ్లెవరు, వాళ్ల గుణగుణములెట్టివి అని ధర్మపీఠం నుంచి గర్జించే బదులు వాళ్ల వల్ల నలుగరికి నాలుగు మెతుకులు అందాయా, నలుగురు వాళ్ల ఊరుకు చేరడానికి దారిదొరికిందా అని కదా చూడాలి. అది కదా ముఖ్యం. అది కూడా చూడనక్కర్లేదు. నడుం కింద కాశీ తువ్వాల వేసుకుని పడుకోండి. నష్టమేమీ లేదు .కానీ ఆ తువ్వాలు పెదరాయుడి తువ్వాల లాగా భుజమ్మేదేసుకుని ఇచట తీర్పులివ్వబడును బోర్డు పెట్టుకోవడమెందుకు. అందరి మీద తీర్పులివ్వాలనుకోవడం, తీర్పులిచ్చే స్థానంలో తమను తామునిలబెట్టుకోవడం మానసిక రోగం. ఆ సమూహంలో ఎలాంటి వాళ్లున్నా ఏం చేసినా వాళ్లు వాళ్లందరినీ శత్రుపూరితంగా తిట్టిపోయడానికి అర్హత అయితే కాదు. వాళ్లు విమర్శకు అతీతులు అని చెప్పబోవడం లేదు. మొత్తంగానే అదేదో జరగకూడనిది ఏదో జరిగిపోతుంది అని కడువేదనతో కంటిమీద కునుకు లేకుండా బాధపడనక్కర్లేదని మాత్రమే.

విచిత్రమేమిటంటే ఇటీవల సంస్థల కంటే కొంతమంది నైతికతను కాపాడే పెదరాయుళ్లు తయారయిపోయారు సోషల్ మీడియా పుణ్యమాని. ఐడియాస్ కంటే కనీసం ఇష్యూస్ కంటే వ్యక్తుల నైతికతల తీర్పులివ్వడమే పెద్దరాజకీయ కార్యక్రమంగా పెట్టుకున్న వారు తయారయ్యారు. అజ్ణానమూ, దురుసుతనమూ- డబుల్ బారెల్ గన్స్.

ఆ బుడ్డదాని ఫొటో దగ్గరకే వద్దాం. అది అద్భుతమైన ఫీలింగ్ ఉన్న ఫొటో. అందులో ఏమి కొంపలు మునిగిపోయాయి. ఏ విలువలు మునిగిపోయాయి. అవును. ప్రైవసీ గొడవలు అవీ ఉంటాయి. ఎవరి ప్రైవసీ గురించి మాట్లాడుతున్నారు. ప్రైవసీ అనేది ఏదో ఒకటి ఉన్నవాళ్ల ప్రివిలేజ్. అది పోయేదేమీ లేనోళ్ల ప్రాపర్టీ కాదు. అయినంత మాత్రాన వాళ్లకు మాత్రం ప్రైవసీ హక్కులుండవా అనేది పూర్తిగా టెక్నికల్ ఆర్గుమెంట్. ఆకలి ముందు అవమానం ముందు ప్రైవసీ ఆర్గుమెంట్ నిలబడదు. అదసలు అక్కడ ప్రసక్తేకాదు. మెడ, దానికి అటు ఇటూ రెండు చెవులు, మధ్యలో ఒక తలకాయ ఉన్నవాళ్లు చేసే ఆలోచన కాదు. ఒకవేళ ఆ బిడ్డ పెద్దదై చాలా పెద్దదై ఏ కలెక్టరో అయినా అప్పుడు ఈ ఫొటో బయటకొచ్చినా అప్పటికి బానే చెప్పుకుంటది దాని గురించి. పెద్దదయ్యాక ఎట్లా పాపం అని వెస్టర్న్ కళ్లద్దాలతో చించీ చించీ మనోవేదన పెట్టుకుని ఎవరూ మంచాన పడక్కర్లే. ముందు బిడ్డ బతికి ఊరికి చేరాల ఈ రోడ్లన్నీ నడిచి, కష్టాలన్నీ గడిచి. పైకెదిగితే అంతకంటే ఏం కావాలి. ఎదిగాక గతించిన పేదరికం అంత నొప్పేయదు. నోస్టాల్జియాగా అది బానే ఉంటది. తుపాకీ ఆ పసి భుజాలమీద మోపడం అన్యాయం. అసున్నితం.

మళ్లీ చారిటీ దగ్గరకు వద్దాం. అది పూర్తిగా వేరే సందర్భంలో చేయాల్సిన చర్చ. గొంతెండిపోతున్న వాళ్లకు గుక్కెడు నీళ్లు పోస్తున్నపుడు అడ్డమొచ్చి, ఆగండీ(మూడు సార్లు వినిపించాలి) అని సినిమాలో మాదిరి అరిచి గోల చేయాల్సిన అంశమైతే కాదు. దీనితో సంబంధం లేకుండా చారిటీని దానికదిగా చర్చిద్దాం.

చారిటీ

చారిటీ అనేది ఒక రూపంగా చూస్తే పెట్టుబడిదారి వ్యవస్థ బై ప్రాడక్ట్. ఫ్యూడల్ వ్యవస్థలో అణచివేతకున్న స్థానం సంక్షేమానికి లేదు. కానీ అందులోనూ అక్కడక్కడా సేవకు ప్రతిఫలంగా వ్యక్తి కేంద్రకంగా సాగే దానగుణం ధర్మకర్తృత్వం కొంత ఉంటుంది. అది సేవలు మెచ్చి రాజు విసిరేసే కాసుల మూట. దాసికి విసిరేసే పైసా. దొర పాలేరుకు విసిరేసే పరిగె. నాట్యానికి మెచ్చి కచేరిలో విసిరే కరెన్సీ కాగితం. లేదా పుణ్యం మూట కట్టుకోవడానికి యాచకుడికి అనాధకు వేసే తిరిపెం. ఏ రూపమైనా అది భిక్షే. మార్కెట్ యుగంలో దాన్ని వ్యవస్థీకరించిన రూపం చారిటీ. ఇది సోఫిస్టికేటెడ్. లేమిలో ఉన్న వారికి కలిమి ఉన్న వారు ఏదో రూపంలో చేసే సేవ. మరీ కిందనున్న వారినికాస్త పైకి చేర్చే చేయూత కూడా ఉంటుంది. అనారోగ్యం, ఆకలి, అవిటితనం, అనాధ, .ఇట్లా ఆయా అంశాలకు వెచ్చించే మొత్తం,. కొన్ని చోట్ల కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ-csr. ఇక్కడ పాత పద్ధతుల్లోని దుర్భరత్వం ఉండదు. పాత వ్యవస్థలో మాదిరి వైయక్తికమైనది కాదు. వ్యవస్థీకృతంగా సాగేది. దాని మీద ఉన్న ప్రధాన విమర్శలు ఇవీ…అది ఆస్తి పోగేసుకోవడానికి సాధికారత కల్పిస్తుంది. పై చేయి కింది చేయికి సాధికారత కల్పిస్తుంది. అసమానత్వంలోని క్రూరత్వాన్ని కప్పేస్తుంది. వ్యవస్ఠ తాలూకు రోగానికి వ్యక్తుల్లో బూటకపు పరిష్కారాన్ని చూపిస్తుంది. కలిమి గలిగిన వారు లేని వారికి సాయం చేయుట. గిల్ట్ నుంచి విముక్తి పొందుట కూడా అక్కడక్కడా ఇందులో భాగంగా ఉంటుంది. గాంధీ బోధించే ధర్మకర్తృత్వం వేరే, అది ఫ్యూడల్ తలంలో చేసింది. కానీ వర్తమాన దృశ్యానికి అనువుగా పెట్టుబడిదారి విధానపు ఉక్కు మహిళ మార్గరెట్ థాచర్ గారి చారిటోపన్యాసాన్ని ప్రస్తావించుకోవచ్చు.

No-one would remember the Good Samaritan if he’d only had good intentions; he had money. ( ‘‘మంచి మనసు మాత్రమే ఉంటే చాలదు. ఆస్తి కూడా కూడా ఉంటేనే నిన్ను గుర్తుపెట్టుకుంటారు’’)

అని ఆమె ఒక ఇంటర్య్వూలో వాకృచ్చారు.

Philanthropic institutions forsooth! As though you rendered the proletarians a service in first sucking out their very life-blood and then practising your self-complacent, Pharisaic philanthropy upon them, placing yourselves before the world as mighty benefactors of humanity when you give back to the plundered victims the hundredth part of what belongs to them! Charity which degrades him who gives more than him who takes; charity which treads the downtrodden still deeper in the dust, which demands that the degraded, the pariah cast out by society, shall first surrender the last that remains to him, his very claim to manhood, shall first beg for mercy before your mercy deigns to press, in the shape of an alms, the brand of degradation upon his brow. ( https://www.marxists.org/archive/marx/works/1845/condition-working-class/ch13.htm )

ఏంగెల్స్ మాట ఇది. చారిటీ మీద ఈ ఎంగెల్స్ అభిప్రాయం ఆ తర్వాత అనేక పాయలుగా సాగుతూనే ఉంది.

కాని దాని తలమూ పరిమాణమూ వేరు. ఆయన చర్చించిన సందర్బము కూడా పూర్తిగా వేరే. పెట్టుబడి ప్రయాణం లాగే చారిటీ కూడా అనేకానేక రూపాలు తీసుకుంది. ఇవాళ అన్ని పెట్టుబడి దారిదేశాల ప్రయాణాలు ఒక్కటి ఎట్లా కావో అన్ని చారిటీలు ఒక్కటి కావు- మౌలికంగా సామాన్య లక్షణం ఉన్నప్పటికీ. చారిటీతో పాటు ఉదారంగా వ్యవహరించడం అనేది ఒక విలువగా చేరింది. ముఖ్యంగా ఐరోపాలో. చారిటీ, అరిస్టోక్రసీ ఆఫ్ లేబర్, వెల్ఫేర్ క్యాపిటలిజమ్ మూడూ కలగలసి కనిపిస్తాయి. ఆధునిక రాజ్యాలు, పెట్టుబడిదారి దేశాలు, పార్ల మెంటరీ ప్రజాస్వామ్య దేశాల్లాగే. ముఖ్యంగా ఐరోపా చరిత్రలో. పెట్టుబడి దారి దేశాలు ఆది గురువుల అంచనాలను దాటి కొత్త మార్గాలు పట్టాయి. కార్మికులకు పెట్టుబడిదారునికి మధ్యవైరుధ్యం షార్పెన్ కానవసరం లేని మార్గాలను పట్టాయి. అది పాలకులు పేదలకు ఇచ్చిన కన్సెషన్స్ అనొచ్చు గానీ అది మరీ చిన్నమాట అవుతుంది. కన్సెషన్స్, కరప్షన్, ఆపర్చునిజమ్, ఎన్నికల్లో గెలవడం కోసం లాంటి పదాలన్నీ విషయాన్ని సింప్లిఫై చేస్తాయి. ఆ ఛాయలు కూడా ఉంటాయి కానీ అవి మాత్రమే కాదు. అవి మాత్రమే అయితే ఇపుడు ప్రపంచవ్యాప్తంగా వీటి గురించి ఇంతమంది తలలు బద్దలు కొట్టుకోనక్కర్లేదు,. పెట్టుబడిదారీ విధానమే అంతకుముందు ఊహించనటువంటి కొత్త డైరక్షన్స్ తీసుకుంది. పాలకులు ప్రభుత్వానికి మార్కెట్కు మధ్య సంబంధాలను కోఆర్డినేట్ చేసే ప్రొఫెషనల్స్ గా మారిపోయిన స్థితి ప్రధానంగా కనిపిస్తుంది-మౌలికమైన ఆస్తి సంబంధాలను కాపాడుతూనే. టాక్సేషన్ లేదా పన్నుల వ్యవస్థ ఆ సంబంధాలను సమన్వయం చేసే ఆయుధంగా మారింది. అసమానతలను ఏదో ఒక స్థాయిలో ఉండనిస్తూనే దాన్ని లెవల్ చేసే అస్ర్తంగా మారింది. ఆసియా దేశాల కంటే ఐరోపాలో అంటే అడ్దాన్స్డ్ కాపిటలిస్ట్ కంట్రీస్లో అసమానతలు తక్కువగా ఉన్నాయి ఇవాళ. ఎక్కడైతే వైరుధ్యం ముదిరి పెట్టుబడి దారి వ్యవస్థ తన గ్రేవ్ డిగ్గర్స్ ను తానే తయారు చేసుకుంటుందని ఆదిగురువులు భావించారో అక్కడ పరిస్థితి వేరేగా తయారైంది. అడ్వాన్స్డ్ పెట్టుబడిదారీ దేశాల కంటే భారత్, బ్రెజిల్ లాంటి వర్థమాన దేశాల్లోనే అసమానతలు భయానకంగా ఉన్నాయి. 21 వ శతాబ్దపు పెట్టుబడి రచయిత పికెట్టి పరిశోధించి మనముందుకు తెచ్చినగణాంకాలుఇవి. In 2018, the share of the top decile (the highest 10 percent of earners) in national income was 34 percent in Europe, 41 percent in China, 46 percent in Russia, 48 percent in the United States, 54 percent in sub-Saharan Africa, 55 percent in India, 56 percent in Brazil, and 64 percent in the Middle East.

80ల తర్వాత అంటే ప్రపంచీకరణ అని చెప్పుకుంటున్న పరిణామాల తర్వాత అసమానతలు అన్ని చోట్లా వేగంగా పెరుగుతున్నాయని పికెట్టి అధ్యయనం చెపుతోంది. పెట్టుబడిదారీ విధానం అసమానతలను కాపాడేదిగా ఉంటే దాని పతాకరూపమైన నియో లిబరలిజం వాటిని మరింత పెంచేదిగా ఉంది. సోషల్ డెమోక్రాట్ల ట్రెండ్ ఏదో రూపంలో బలంగా ఉన్న చోట వీటిని లెవల్ చేయడానికి ప్రోగ్రెసివ్ పన్నుల పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. అలాంటి అనేక చర్యలను కలిపి అమలుచేస్తున్న వెల్ఫేర్ కాపిటలిస్ట్ కంట్రీస్ చుట్టూచాలా చర్చ ఉంది.

అరిస్టోక్రసీ ఆఫ్ లేబర్

19వ శతాబ్ది చివరి భాగంలో అమెరికన్ స్టీల్ టైకూన్ కార్నిగె తీసుకున్న వైఖరికి 20 వ శతాబ్దిలో హెన్రీఫోర్డ్ తీసుకున్న వైఖరికి చాలా తేడా ఉంది. జీతాలు అస్సలు పెంచకూడదు, అది లాభాలను దెబ్బతీస్తుంది అని మొదటి ఆయన వాదిస్తే అదే దేశంలో ఆయన తర్వాత ఆటోమొబైల్ రంగంలో తిరుగులేని కింగ్ గా మారిన ఫోర్డ్ అందరూ కళ్లు తేలేసేంత జీతాలపెంపు చేపట్టారు. జీతాల పెంపు సిద్ధాంతంలో భాగంగా చేపట్టారు. అప్పటికింకా సాధారణం కాకపోయినా ఐదురోజుల వర్కింగ్ డే అన్నారు. సాటిపెట్టుబడిదారులు నోరెళ్లబెట్టేలా చేశారు. కాకపోతే కార్మిక సంఘాలను వ్యతిరేకించారు. వేతనాలు పెంచినా లాభాలేమీ తగ్గవు అని నిరూపించడమే కాకుండా ప్రపచంలో అత్యంత ధనవంతుడిగా కూడా మారారు. ఆయన ఎఫీషియన్సీ అన్నారు కానీ మోనోపలీ కాకుండా కేవలం ఎఫీషియెన్సీ తోనే అయ్యింది కాదు. కార్నిగే చారిటీ ఉండాలి కానీ అది బిజినెస్ పెంచుకునే చారిటీ అంటే ఫోర్డ్ ఇంకో రూట్ తీసుకున్నారు. అదే సమయంలో అదే దేశంలో పెట్రోల్ కింగ్ రాక్ ఫెల్లర్ చారిటీని ఎత్తు పీట ఎక్కించారు. మోనోపలీకి నిలువెత్తురూపం రాక్ ఫెల్లర్. తర్వాత ఆ బ్యాటన్ అందుకున్న వాడు బిల్ గేట్స్. పెట్టుబడి ధార్మిక లక్షణానికి ప్రవక్తలైన కార్నిగీ, ఫోర్డ్, రాక్ ఫెల్లర్, బిల్ గేట్స్ పెట్టుబడి- దాతృత్వం జంటప్రయాణానికి దారి గురుతులు. కార్నిగె స్టీల్ మాగ్నెట్ అయితే ఫోర్డ్ ఆటోమొబైల్ జెయింట్ కావడం, రాక్ ఫెల్లర్ అమెరికా ప్రభుత్వమే భయపడేంత స్థాయిలో మోనోపలీ పెట్రోల్ వ్యాపారి కావడం, అక్కడినుంచి బ్యాటన్ గిగ్ ఇకానమీ కి ఆద్యుడైనటువంటి బిల్ గేట్స్ కి చేరడం పెట్టుబడి ప్రయాణానికి సంబంధించిన దశల్ని చూపించే పరిణామం. పెట్టుబడితో పాటు చారిటీ ప్రయాణానికి సంబంధించిన గురుతులు.

గేట్స్ ఈ కాలపు పెట్టుబడిదారుడి స్వరూపమైతే జూలియన్ అసాంజె ఈ కాలపు తిరుగుబాటుదారుడిగా గుర్తింపు పొందడం మరొక కీలక పరిణామం. నాణేనికి అటూ ఇటూ ఇద్దరూ కాలంలో వచ్చిన మార్పుకు ప్రతినిధులు.

అట్లాగే వేతనాలు_లాభాల మధ్య ఈక్వేషన్ మారిపోతూ వచ్చింది. లాభాల కోసం కార్మికులను పీల్చి పిప్పి చేయడం అనేది అది వైరుధ్యాన్ని షార్పెన్ చేయడం అనే ఆదిగురువుల అంచనా ప్రకారం పెట్టుబడి ప్రయాణించలేదు.

(The worker becomes a pauper; he sinks deeper and deeper below the conditions of existence of his own class-THE COMMUIST MANIFESTO )

శ్రమ అంటేనే భౌతిక శ్రమగా భావించే రోజుల నాటి సూత్రీకరణలు వేరు. నేటి పరిస్థితి వేరు. కాలక్రమేణా కార్మికులు తిరుగుబాటు చేసి కూల్చనవసరం లేని స్థాయిలోనే లాభాలు పిండుకునే మార్గాలను కనిపెట్టారు. భౌతిక శ్రమనుంచి బౌద్ధిక శ్రమకు ఎక్కువమంది ప్రయాణం చేస్తున్న కొద్దీ ఆ ప్రయాణం స్పష్టంగా కనిపించే ప్రదేశాల్లో మార్పులు కూడా అంతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజ్యం స్వభావంలో కూడా ఆ మార్పు కనిపిస్తూ వస్తున్నది. అది వెల్ఫేర్ రూట్ తీసుకుంది. ఐరోపా దేశాలు కనీస వేతనానికి గరిష్ట వేతనానికి మధ్య వ్యత్యాసాన్ని బాగా తగ్గించి ఆ రకంగా వ్యత్యాసాలు మరీ ఘోరంగా లేకుండా చేశాయి. ఆదాయాల మీద భారీ పన్నులేసి వాటిని సంక్షేమం మీద ఖర్చుచేసే పద్ధతిని కూడా ఎంచుకున్నాయి.

ఎంత కాలం ఇలా అనే దానిమీద ఎవరి భాష్యం వారికుండొచ్చు. అవి సామ్రాజ్యవాద రూపమెత్తి పేదదేశాలను కొల్లగొట్టడం వల్లే ఆ స్థాయి జీవన ప్రమాణాలు ఆ దేశాల్లోని పౌరులకు అందించగలుగుతున్నాయనే వాదన ఉంది. లెనిన్ దాన్ని విస్తృతంగా చర్చించాడు. మార్క్స్, ఏంగెల్స్, లెనిన్, మావోలను మనుషులుగా కాకుండా దైవస్వరూపులుగా భక్తి ప్రపత్తులు ప్రదర్శిస్తూ వారి మాటలు వేదవాక్కులుగా ఆచరించే చోట ఏమో కానీ అలా లేని చోట మాత్రం సోషలిస్ట్ శిబిరంలోనే బోలెడంత చర్చ ఉంది. భక్తితో వచ్చే సమస్య ఏంటంటే ఒక్క పదం కూడా మార్చడానికి మనసొప్పదు. పొరబాటున వేరెవరైనా పదం వేరే ఉపయోగిస్తే రివిజనిస్టులు, పెటీ బూర్జువాలు, జారినవారు, దిగజారిన వారు అనే ముద్రలు తయారుగా పెట్టుకునే ముద్రాక్షసులు లేదా ముద్రేవతలు ఉంటారు. పెట్టుబడిదారీ విధానం అంత్యదశలో ఉందనే మాట అపుడెపుడో ఖాయం చేసి పెట్టుకున్నారు. నాకు ఊహ వచ్చినప్పటినుంచిపెట్టుబడిదారీ విధానం ‘‘పీకల్లోతు సంక్షోభంలో’’ ఉందని చదువుతూనే ఉన్నా. అంతకుముందు రాసిన పుస్తకాల్లోనూ అలానే ఉండడం గమనించా. ఒక సెంటీమీటరైనా కిందకు దిగి సంక్షోభం గుండెలకాడికి అయినా దిగిందనో లేదో పైకి గడ్డందాకా ఎగబాకిందనో మాత్రం చదవలే. సంక్షోభం స్టేటస్ కో లోనే ఉన్నట్టుంది అర్థశతాబ్దానికి పైబడి. ఆత్మస్థైర్యం నింపుకోవడానికి ప్రత్యర్ధిని మైక్రోస్కోపులో చూపడం, మనల్ని భూతద్దంలో చూపడం అనేది చాలా కాలంగా సాగుతున్న ప్రక్రియ. సమస్య ఎక్కడొస్తుందీ అంటే పదే పదే ప్రచారం చేయడం వల్ల తెలిసిన వారు కూడా దాన్ని నమ్మే స్థితి ఎదురవుతుంది. అది ప్రమాదకరమైన హాలూసినేషన్. అసమానతలను కాపాడే పెట్టుబడిదారీ వ్యవస్థ కచ్చితంగా ప్రత్యర్థే , కానీ బలమైన ప్రత్యర్ధి. చాలా బలమైన ప్రత్యర్థి.

విస్తారంగా చర్చించడం వల్ల లెనిన్ పేరుతోనూ, చర్చకు కేంద్రం కావడం వల్ల కౌట్క్సీ పేరుతోనూ అరిస్ట్రోక్రసీ ఆఫ్ లేబర్ ప్రాచుర్యం పొందింది గానీ వాస్తవానికి ఏంగెల్స్ స్వయంగా ఈ అంశాన్ని చర్చించి ఉన్నారు. ఏంగెల్స్ బ్రిటన్లో పెరిగిపోతున్న వర్కింగ్ క్లాస్ అరిస్ర్టోక్రసీని మాత్రమే కాకుండా అమెరికాలొ మొగ్గ తొడుగుతున్న పరిస్థితి గురించి కూడా మాట్లాడారు. (ఆయన బతికి ఉన్న రోజుల్లో బ్రిటనే పెట్టుబడి దారి కేంద్రం. అమెరికా అప్పటికి అంతగా ఎదగలే.) బహుశా ఇంగ్లండ్ వర్కింగ్ క్లాస్ గురించి అందులో అరిస్టోక్రసీ ఆఫ్ లేబర్ గురించి చర్చిస్తున్న వ్యాసంలోనే అమెరిన్ ఉదంతాన్ని కూడా ఫుట్ నోట్స్లో రాసినట్టు గుర్తు. అయితే వర్కింగ్ క్లాస్ దాన్నుంచి తొందరలోనే బయటపడి విప్లవంలో భాగమవుతుందని కూడా ఆశించాడు.అది వేరే కథ. ఆయన బతికున్నపుడు దాని పరిధి చాలా చిన్నది. ఆ సెక్షన్లు చిన్నవి. కానీ విచిత్రంగా అర్థ శతాబ్దం తర్వాత రాసిన లెనిన్ కూడా ఆ సెక్షన్స్ ను చిన్నవిగానే చూపించే ప్రయత్నం చేశారు. టినీ మైనారిటీ అనే అర్థంలోనే రాశారు.

A privileged upper stratum the millions proletariat in the imperialist countries lives partly at the expense of hundreds of of in the uncivilised nations. (Imperialism and the Split in Socialism)

ఈ ధోరణి ఎక్కువ కాలం కొనసాగదని కూడా అక్కడక్కడా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆయన ఆశాభావం ఎక్కువ సేపు నిలవలే. అది అంత చిన్నసంఖ్యలో లేదన్న విషయమూ దానితో మొదలైన అలజడి కూడా ఆయన 1915 నించి 20 వరకూ రాసిన రచనల్లో కనిపిస్తుంది.. సోషలిస్ట్ విప్లవాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం అనే పనిలో ఉన్న లెనిన్కు ఈ పరిణామం మింగుడు పడలేదు. ఇట్లా అయితే ఈ కార్మికులేమి విప్లవం తెస్తారు అనేదాకా వెళ్లారు. 1920లో సెకెండ్ ఇంటర్నేషనల్ దగ్గరకొచ్చేసరికి ఆయనలో వచ్చిన మార్పు చూడొచ్చు.

The industrial workers cannot fulfill their world-historical mission of emancipating mankind from the yoke of capital and from wars if these workers concern themselves exclusively with their narrow craft, narrow trade interests, and smugly confine themselves to care and concern for improving their own, sometimes tolerable, petty bourgeois conditions. This is exactly what happens in many advanced countries to the “labor aristocracy” which serves as the base of the alleged Socialist parties of the Second International.( “Preliminary Draft on the Agrarian Question for the Second Congress of the Communist Theses International” (1920)

TOLERABLE అంటే భరించదగ్గ స్థితి అనే ఎక్స్ప్రెషన్ ఆయన వాడిందే. వాళ్ల స్థితిని వాళ్లు మెరుగుపర్చుకోవడానికి పరిమితమైతే విప్లవం ముందుకు పోదు అనే మాట ఉంది చూశారు అక్కడ కాంప్లెక్సిటీ దాగుంది. అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఆయా శ్రామిక సమూహాలు తమ పోరాటాలు తాము చేసుకుని తమ స్థితిని కొంతమేర మెరుగుపర్చుకున్నారు. పశ్చిమదేశాల్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుందని వాళ్ల బండి వాళ్లే తోలుకుంటారని, పని మనుషులు ఉండరని వాళ్లు శ్రమను గౌరవిస్తారని కొన్ని మాటల వినిపిస్తూ ఉంటాయి. కానీ అది వ్యక్తుల ఇచ్చకు సంస్కారానికి సంబంధించింది కాదు. అక్కడ శ్రమ విలువ(ఎక్సెంజ్ వాల్యూ) ఎక్కువ. పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న ఉద్యోగులు కూడా అఫర్డ్ చేయలేరు.

ఏమైనా అడ్వాన్స్డ్ కంట్రీస్లో పారిశ్రామిక కార్మికవర్గం పెట్టుబడిదారి వ్యవస్థను బొందపెట్టే గ్రేవ్ డిగ్గర్స్గా మారలే. ఈ పరిణామాల వల్లే వాన్ గార్డ్ థియరీని కౌట్స్కీ 1901లోనే ప్రశ్నించారు(To What Extent is the Communist Manifesto Obsolete?-1901) మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రానురాను రెవల్యూషనరీ మార్క్సిస్టుల కంటే సోషల్ డెమోక్రాట్లు,లేబర్ పార్టీలే అక్కడ ప్రధానమైన లెఫ్ట్ గా మారిపాయాయి. బ్రిటన్ మార్క్సిస్టు చింతనాపరుడు డేవిడ్ హార్వే లాంటి వాళ్లు కొన్ని ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. అలాంటి వారు వివిధ దేశాల్లో వివిధ రకాల మోడిఫికేషన్స్ చేస్తూ కొత్త ప్రతిపాదనలు చేస్తున్నారు. అక్కడ ఇంకా స్వల్ప స్థాయిలో మిగిలిపోయిన రెవల్యూషనరీ మార్క్సిస్టులకు వీరికి మధ్య చర్చ నడుస్తోంది. అయితే వీరు ప్రతిపాదిస్తున్న సోషలిజం మేనిఫెస్టోలో ఆదిగురువులు చెప్పిన పెటీ బూర్జువాసోషలిజానికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ రెండూ ఒకటైతే కాదు. ప్రత్యామ్నాయం మీద ప్రపంచవ్యాప్తంగా వామపక్ష చింతనాపరుల్లో మథనం సాగుతున్నది.

కుప్ప కూలిన సెకెండ్ ఇంటర్నేషనల్ కీలకమైన పరిణామాన్ని కూడా పట్టిస్తుంది. తొలి ఇంటర్నేషనల్ మార్క్సిస్టులకు అనార్కిస్టులకు మధ్య భావజాల ఘర్షణగా మారితే రెండో ఇంటర్నేషనల్ నాటికి అది రెవల్యూషనరీ మార్క్సిస్టులకు సోషల్ డెమెక్రాట్లకు మధ్య కేంద్రీకృతం కావడం గమనించాల్సిన పరిణామం. లెనిన్ ఈ టైంలో సోషల్ డెమోక్రాటిక్ పార్టీలతో వారి జాతీయవాద భావాలతో యుద్ధంలో వారు అనుసరించిన విధానాలతో ఆయా దేశాల్లోని ఆర్థిక పోరాటాలతో ఏ స్థాయిలో విభేదించారో ఆ టైంలో రాసిన రాసిన వ్యాసాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

లెనిన్ ఇంపీయరియలిజం గురించి చర్చిస్తున్నపుడు ఈ అంశాన్ని విస్తారంగా ప్రస్తావించారు. అవి సామ్రాజ్యవాద దేశాలు కావడం వల్లే వలసదేశాలను పీల్చిపిప్పి చేయగా వచ్చిన డబ్బునుతమ దేశంలోని ప్రాలటేరియెట్లో చిన్న సెక్షన్లకు పంచిపెట్టగలుగుతున్నాయని లెనిన్ చెప్పారు. అయితే సామ్రాజ్యవాదానికి ఈ ధోరణికి సంబంధం లేదని సోషలిస్టు శిబరంలోనే లెక్కలతో నిరూపించే ప్రయత్నం చేసినవారున్నారు. అలాగే సామ్రాజ్యవాద నిర్వచనం పరిధిలోకి రానిదేశాల్లోనూ ఈ ధోరణిని చూపించి దీనిసంగతేంటని చర్చించిన వారున్నారు. ఆసియా పని అయిపోయి సామ్రాజ్యవాద దేశాలు ఇపుడు ఆప్రికా మీద పడ్డాయి కాబట్టి అది కూడా అయిపోతే పశ్చిమదేశాల్లో ప్రస్తుతమున్న జీవన ప్రమాణాలు మెయిన్టెయిన్ చేయడం కష్టమని ప్రోలటేరియెట్ తమ బాధ్యతను గుర్తుచేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసే ఆశా జీవుల సైతం ఉన్నారు. ఆ థియరీకి కాలం చెల్లిపోయిందనుకునే వారు అది ఉత్తుత్తి ఆశావాదమని మొత్తంగానే పెట్టుబడిదారీ విధానంలో వచ్చిన మార్పులను సింప్లిస్టిక్ ధోరణిలో చూడకుండా స్టడీచేసి ఆల్టర్ నేటివ్ను రూపొందించుకోవాల్సి ఉంటుందని భావిస్తారు. కొన్ని దేశాల్లోని కొన్ని పరిస్థితులపై నాటి లెనిన్ కన్సర్న్ ఇవాళ సర్వవ్యాప్తమైంది. పెట్టుబడి దారి వ్యవస్థ బలపడిన ప్రతిదేశంలోనూ నిలువెత్తు ప్రశ్నగా నిలబడుతున్నది.

ఏమైనా ఫ్యూడల్ దశనుంచి ఇటీవల(ఇటీవల అనేది రిలేటివ్) పెట్టుబడిదారి దశలోకి వచ్చిన దేశాల్లోనే అసమానతలు మరీ దారుణంగా ఉన్నాయి. అసమానతలు దారుణంగాఉన్నాయి. పొరబాట్న ఎవరైనా కారుకొంటేనో ఇంట్లో ఎసి పెట్టుకుంటేనో ధనికుడేమో అని అనుకునే దరిద్రమైన ఫేజ్లోనే మనమున్నాం. దాన్నే అరిస్టోక్రసీ ఆఫ్ లేబర్ అనుకుంటే అందులోనూ నిచ్చెనమెట్ల వ్యవస్థ ఉంది మనకు. కులంలోనే కాదు, దరిద్రంలోనూ సంపదలోనూ నిచ్చెనమెట్ల వ్యవస్థ మన వ్యవస్థ లక్షణం.

సరే ఆచర్చకు ఇది సందర్భము కాదు కాబట్టి చారిటీల దగ్గరనుంచి ఎన్జీవోల దగ్గరకు వద్దాం.

విముక్తిసేవ

ఎన్జీవోల గురించి మాట్లాడేటప్పుడు చాలామంది పాతకాలపు మాటలనే వల్లె వేస్తుంటారు. మన దగ్గర అయితే వాళ్లు కరప్ట్ అని విలాసవంతమైన జీవితం అనుభవిస్తుంటారని పిచ్చి మాటలు వినిపిస్తూ ఉంటాయి. తెలుగు నాట ఈ విమర్శలు ఎవరిగురించైతేచేస్తున్నారో వాళ్లెపుడూ ప్రైవేట్ జెట్లలో తిరిగినట్టు నాకు తెలీదు. ఆడికార్లలో తిరగడం కూడా చూడలే. తిరిగితే మాత్రం తప్పాఅనేది వేరే కథ. ఈ విలాసం అనే పదం ఎట్లా అయిపోయింది అంటే అది మన భావదారిద్ర్యానికి సంకేతంగా మారిపోయింది. సింప్లిసిటీని ఒక పెద్ద గీతగా మార్చేసి దానికి మన అస్తిత్వాన్ని బట్టి ఏవో స్టాండర్డ్స్ ఫిక్స్ చేసి ముద్రలు వేసే పద్ధతి రాజ్యమేలుతా ఉంది. గాంధీకి ఆ రోజు అవసరమై ఉండొచ్చు గానీ ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఈ దిక్కుమాలిన సింప్లిసిటీ ప్రత్యామ్నాయ రాజకీయ విలువ ఎందుకైందో తెలీదు. సింప్లిసిటీతో ఉండొద్దని కాదు. దాన్ని రాజకీయాలను దాటి పరమప్రమాణంగా మార్చడం వల్ల జరుగుతున్న నష్టం గురించి. అందులో ప్రమాణాలు ఎవరికి వారివే. అబ్బో, ఆయన కారున్న విప్లవకారుడండీ అని ఒకరిద్దరు ప్రొఫెసర్ల గురించి మా చిన్నప్పుడు అనుకునే వాళ్లు. ఇవాళ టీచర్లు కూడా కారు కొనదగిన పరిస్థితి వచ్చేశాక వాళ్లే అత్యధికంగా ఉండే ప్రజాసంఘాల్లో ఆ మాట వినిపించడం తగ్గిపోయింది. సో ఈ ప్రమాణం స్థిరమైనదేమీ కాదు. నువ్వున్న స్థానాన్ని బట్టి నిర్ణయించేదే. అసలు ఏ సౌకర్యవంతమైన వస్తువైనా అది అందరికీ అందాలి అనుకోవాలి కానీ అదసలు ఉండడమే తప్పు అనే భావన అయితే సరైంది కాదు.

ఇక రెండో విమర్శ. అవినీతి. ఎందులో లేదు. ప్రత్యామ్నాయ రాజకీయాల్లో మాత్రం అస్సలు లేదని చెప్పగలమా. ఏదో ఫండ్స్తో మీటింగ్ పెట్టుకుంటే అది అవినీతా! ఏం రాజకీయాలబ్బా. అంతకుమించి ఇందులో మాట్లాడడానికి ఏమీ లేదు.

విలాసవంతమైన జీవితమూ, అవినీతి లేకుండా ఉంటే ఎన్జీవోలు సమ్మతమే అన్నమాట! దెష్టోయ్, దైద్రమోయ్!

అసలు సమస్య అది కాదు. ఎన్జీవోలు నిర్దుష్ట ప్రదేశంలో నిర్దుష్ట క్షేత్రంలో ఒక పని చేసి అది అన్ని చోట్లా సాధ్యమే అన్న భావన కలిగిస్తాయి. చిన్నపిల్లాడి చిటికెన వేలంత లేని సింగపూర్ను చూపించి భారత్ ఇట్లా ఎందుకు లేదు అని అడిగినట్టు. కొందరు వ్యక్తులు ప్రత్యక్షంగా పర్యవేక్షించగలిగిన ప్రదేశంలో పనిని చూపించి అదో నమూనాగా ప్రదర్శించబోతాయి. చాలా సందర్భాల్లో అది విశాల ప్రదేశానికి నమూనా కాకపోవచ్చు.

రెండో సమస్య చారిటీ కున్న సమస్యే. వ్యవస్థీకృతంగా పరిష్కారం కావాల్సిన విషయాలకు వ్యక్తుల్లోనో చారిటీలోనో పరిష్కారం చూపుతాయి.

సామాజికంగా రాజకీయంగా పరిష్కారం కావాల్సిన వ్యవస్థీకృత సమస్యలకు ఉపశమనం లాంటి మార్గాలు చూపి వాళ్లు పరిష్కారం దిశగా రాజకీయ చైతన్యం పొందకుండా కొంతమేర అడ్డుకుంటాయి. మనుషులు సంఘటితమై ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చో లేక మొత్తంగానే వ్యవస్థను మార్చకునో సాధించాల్సిన విషయాలను పైపై స్థాయిల్లో పరిష్కారాలు అందివ్వడం ద్వారా దారి తప్పిస్తాయి. అది ప్రతిసారీ ఉద్దేశ్యపూర్వకంగానే జరగనక్కర్లేదు. నీ చర్యల ఫలితాన్ని నీ ఉద్దేశ్యం మాత్రమే నిర్ణయించదు. అయితే ఇది సంక్లిష్టమైన విషయం. దీనికి వారిని వ్యక్తులుగా బాధ్యులు చేయలేము. చాలా సందర్భాల్లో ఇది ఆయా ప్రాంతాల్లోని బాధితులకు సాంత్వన కలిగించొచ్చు. అపుడెపుడో పరిష్కారమవుతుంది కాబట్టి అసలు ఉపశమనమే వద్దని చెప్పలేముకదా. అలాగంటే ఉద్యమాల్లో కూలీరేట్ల పెంపు వేతనాల పెంపు వంటి ఆర్థిక ఉద్యమాలను పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. అవే ఉద్యమాలుగా అవే డిమాండ్లుగా మారడం వేరేకొస.

మూడో ప్రధాన సమస్య-చారిటీ సందర్భంగా చెప్పుకున్నదే. ఎన్జీవోలు చారిటీ అవిభాజ్యమైన, అంతస్సంబధమున్న విషయాలు. అవి ఏదో ఒక లేమిని ప్రధానంగా అడ్రస్ చేస్తాయి. దానికి మౌలిక కారణమైన అసమానతలను గానీ అసమానతలకు దారితీసే వ్యవస్థను గానీ అంతగా పట్టించుకోవు. పట్టించుకునేసంస్థలు కూడా కొన్ని ఉన్నప్పటికీ ప్రధానంగా వాటిచూపు సర్వీసే. విముక్తి కాదు.

ఇలాంటిదే మరోటి. మనుషుల వేదనలను బాధలన విడివిడిఅంశాలుగా చూడడం. సిస్టమ్ నుంచి అటానమస్ కాజెస్ ను విడిగా చూసి విడి పరిష్కారాలు వెతకడం. అవే పరిష్కారాలని నమ్మడం, నమ్మించబూనడం.

ఇక్కడ పిడుక్కీ బియ్యానికి ఒకటే మంత్రం అప్లయ్ చేయకుండా కేస్ బై కేస్ చూడాల్సి వస్తుంది. వారు ఇస్తున్నరాజీకయ సందేశం ఎట్లాంటిది, వారు పంపుతున్నసింబాలిజం ఎట్లాంటిది, అందుతున్న సాయం లేదా పెట్టుబడి ఏ స్థాయిది ఎక్కడినుంచి వస్తున్నది అని చూడాల్సి వస్తుంది. మళ్లీ చారిటీ విషయంలో చెప్పుకున్నదే. ప్రభుత్వాలను విధానాలను శాశించే ప్రభావితం చేసేస్థాయిలో కొన్ని ఎన్జీవోలు ఉంటాయి. వాటి కథ వేరే. కానీ తెలుగు నేల మీద పదే పదే ఎన్జీవోల మీద విమర్శలు వస్తున్నది వాటిమీద కాదు. ఏవో కొన్ని బాధిత సమూహాల చైతన్యం కోసం పనిచేస్తున్న చిన్న చిన్న సంస్థల మీద వస్తూ ఉంటాయి. ఎందుకంటే అవే మనకు తారసపడతా ఉంటాయి. మన మాజీ మిత్రులు తారసపడుతూ ఉంటారు. ఏవో మీటింగులు పెట్టడం, పుస్తకాలువేయడం లాంటివి చేసే సంస్థల మీద మనకు గొంతుకాడికి ఉంటది. అది ఇట్లా వ్యక్తం అవుతూ ఉంటుంది.

సో, మనకు నచ్చలేదు కాబట్టో మనకు తెలిసి నిన్న మొన్నటి దాకా మనతో ఉన్న వాళ్లు అటు వైపు వెళ్లారు కాబట్టో వ్యక్తుల మీద తోచిన రాళ్లు వేస్తామంటే కుదరదు. నీతో ఉండి బయటకొచ్చిన వారికి కూడా బతికే హక్కు ఉంటుంది కదా, వారికి తెలిసినది, తాముచేసిన పనికి దగ్గరగా ఉండేది ఎన్జీవో వర్క్. కాస్త రాత చదువు బేస్ ఉన్నవాళ్లు మీడియాలోకి రావడం కూడా ఆనవాయితీ. వాళ్లు బతకాలి కదా, పైగా ఏదో చేస్తూ బతకడం అనేది ఎంచుకున్నందుకు వారిని తిట్టుకోవడం ఎందుకు. అవినీతి చాలాచోట్ల ఉండొచ్చు, ఎన్జీవోల్లోనూ ఉండొచ్చు. నాకు తెలిసీ తాము ఎంచుకున్న క్షేత్రంలో చిత్తశుద్దితో పనిచేస్తున్న అనేక మంది వ్యక్తులను చూశాను. చిత్తశుధ్దితో పనిచేస్తున్నంత మాత్రాన వారెంచుకున్న మార్గం పూర్తి పరిష్కారమార్గం అవ్వదు. చిత్తశుద్ది లేకపోయినంత మాత్రాన ఎంచుకున్న మార్గం పరిష్కారమార్గం కాకుండా పోదు. చిత్తశుద్ధి అనేది వైయక్తికమైన విలువ. పని సంస్థాగగతమైనది. చిత్తశుద్ధి అవినీతి అనేవి మౌలికంగా ఫలితాన్ని నిర్దేశించే అంశాలు కావిక్కడ. వారిలో ఎక్కువమంది మాజీ ప్రత్యామ్నాయ రాజకీయ యాక్టివిస్టులు కావడం యాదృచ్చికమేమీ కాదు. ముఖ్యంగా లేట్ 80స్ నుంచి ఇంకా 90ల నుంచి ఈ వలస ఆరంభమైంది.

విముక్తి బాట నుంచి సేవా బాటకు హైవే పడింది. చాలా విలువైన శక్తులను ప్రత్యామ్నాయ రాజకీయాలు కోల్పోయాయి. ఇది ఈ రూట్లో అయ్యేది కాదు ఏదన్నా అయ్యేపనిచేద్దాం అని వచ్చిన వారుండొచ్చు. బతికుండగా కొంత ఫలితం కనిపించే పని ఊరట పొందిన బాధితుల కళ్లలో వెలుగును చూసి ఆ రకంగా తృప్తిని ఆస్వాదిద్దాం అని వచ్చినవారుండొచ్చు. కేవలం విభేదాల కారణంగా బయటకు వచ్చి వేరే దారిలేక ఆ బాట పట్టిన వారూ ఉండొచ్చు. తరచుగా వినపడే పదజాలంలో చెప్పుకోవాంలంటే సంసిద్ధత లేకపోవడం కూడా కావచ్చు. ఏమైనా అది ఫిక్షన్ ను పెంచింది. సంస్థల సైజును బట్టే విమర్శించాలా, మన చుట్టూ ఉన్నవి కూడా అదే భావజాలంతో పనిచేసే సంస్థలు కదా అనే ప్రశ్న రావచ్చును. విమర్శించవచ్చును. కానీ సందర్బమూ పద్ధతీ వేరే.

విమర్శ మంచిదే కానీ మళ్లీ ఇక్కడా పదే పదే వైయ్యక్తికమైన నైతికత స్థాయికి దాన్ని దిగజార్చకూడదు. సమస్య రాజకీయ పరమైనది.

*

 

జీ.ఎస్. రామ్మోహన్

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి అంశం. విపులమైన విశ్లేషణ. పూర్తిగా చదివి జాగ్రత్తగా వ్యాఖ్యానించాలి. ఆ పని చేయాలని అనుకుంటున్నాను. ముందుగా మీ శ్రమకు(బౌద్ధిక, భౌతిక) నా అభివందనలు.

  • జి‌ఎస్ రామ్మోహన్ గారూ రాసిన ఈ సుధీర్గ వ్యాసం చదివాక చాలా అయోమయంలో పడ్డాను.

    మార్చ్ 24 చాడీచప్పుడు లేకుండా కరోన వ్యాధి నిర్మూలం కోసం ప్రకటించిన లక్డౌన్ వల్ల కొన్ని కోట్లమంది వలస కార్మికులు ఉన్నపళంగా తం ఉద్యోగాలు కోల్పోయి, జీతం లేకుండా రోడ్డు మీద పడినప్పుడు వల్లజీవితమేంటో అర్ధం చేసుకోడానికి కొంత టైమ్ పట్టింది.
    అమెరికా లో పోలీస్ తెల్లజాతి పోలీసులు ఒక నల్ల జాతి అతన్ని దారుణంగా చంపినందుకు దేశమంతా జరిగిన ఆందోళన, మన దేశం లో దేముడిని, కర్మను నమ్ము కున్న ప్రజలకు ఈడెప్పుడో చేసిన కర్మ అని నోరుమూసుకొని వాళ్లకేమి పట్టనట్టు ఉండిపియారు.

    వలస కార్మికులందరూ పని చేసిన చోట ఉండడానికి వీలుకాక తమ స్వంత ఊళ్ళకు వెళ్లిపోవలసివొచ్చింది. ఆ పరిస్తుల్లో ప్రభుత్వం వాళ్ళను వారి – వారి ఊరు వెళ్లడానికి ఏర్పాటు చేయక పోతే వారు సుదీర్గ నడక మొదలుపెట్టారు.

    అప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఆ నిర్భాగ్యులకు ఆసరాగా కొంతమంది నిలబడ్డారు. అవి ఎన్‌జి‌ఓ లు కూడా కాదు కొంతమంది సమూహంగా చేరి వాళ్ళకు సహాపడ్డారు.

    అందులో ఒక్స్ ముద్దుల చిన్నారి ఫోటో (రామోహన రావు గారూ కూడా ప్రస్తావించారు) వివిధ వ్యాఖ్యలతో మీడియా లో రావడం జరిగింది.
    చారిటి లేదా దానం, అంటూ రామ్మోహనరావు గారూ రాసిన ఇంత పెద్ద వ్యాసం లో అది తప్పో వొప్పో అర్ధం కాకుండా చాలా తెలివిగా రాశారు.

    ఇందులో , మార్గరేట్ తేచర్, ఎంగెల్స్ , లెనిన్ వగయిరా ని కోట్ చేస్తూ ఒక పి‌హెచ్‌డి వ్యాసం లాగా చారిటి అన్న విష్యం మీద వ్యాసం రాశారు.

    జరిగిన ఘోరం లో కొన్ని వందలమంది ఆకలి వల్ల చనిపోయారు కొన్ని లక్షల మంది రేపేలా అన్నప్రశ్న.

    ఈ పరిస్తితి లో వాళ్ళ పరిధిలో ఉన్న కొన్ని వేలమందికి భోజనం పెట్టి వల్ల వల్ల ఉర్లు వెళ్లడానికి సహాయపడితే (రామ్మోహన్ గారూ చెప్పిన ఎన్‌జి‌ఓ లు కాదు) ఈ వ్యాసమేంటో అర్ధమవ్వడానికి నా బుల్లిబుర్రకు అర్ధం కాలేదు )

    అసలు ప్రశ్న ఇంతమందిని దారుణంగా వధపెట్టిన రాజకీయం మీద ఆందోళన ఎందుకు జరగలేదని.

    • వలస కార్మికులకు సాయం చేసిన వాళ్లను తిడతాండావా పొగడ తాండావా అని కదా అడగతాండారు. తొలి పేరా తొలివాక్యం లోనే ఉండాది కదాసర్! మళ్లో సారి చదవండి సర్,
      తెలివిగా రాసేంత తెలివి తేటలు లేవండీ.

      • సర్, మొదటి పేరా చదవకుండా వ్యాసం చడవలేదండీ. మొత్తం వ్యాసం చదివేక వ్యాఖ్య రాసానండి.

        సరిగ్గా అర్ధం చేసుకొనే తెలివితేటలు మాకుండాల కదా సర్. ఒక చిన్న విషయానికి మీరిచ్చిన విపులమయిన సూచనలు అర్ధం చేసుకొనే పెద్ద తెలివితేటలు లేవని నా వ్యాఖ్య చివర్లో నేనే రాసుకున్నాను. “ఈ వ్యాసమేంటో అర్ధమవ్వడానికి నా బుల్లిబుర్రకు అర్ధం కాలేదు”

  • Pegullo aakali ragilevaadiki adi takshana samasya. Buvve – adi vyakti pettinadainaa, santarpanalo pettinadainaa- daa niki takshana parishkaaram. Nee sudeergha charcha saaraamshamgaa naaku arthamaindi idi. Daanni kavitaaveshamto kluptamgaa raaste 2+2=4 annanta suluvugaa undedi. Nuvvemo – bahushaa uddeshapoorvakamgaane– ‘Charity’ ane chinna maata chuttoo charitranoo, vartamaanaannee, siddhaantaalanoo, inkaa aneka vishayaalanoo cherchi, mathinchadamto kondariki ‘Conclusion’ emiti anna sandeham kaliginattundi. Nenaite conclude cheyakapovadame correct anukuntaanu. Nuvve cheppinattu ‘Antima Teerpulu’ cheppeyyadam “Anta Veejee’ ayina vishayam kaadidi. Nenaita baagaa aalochanalo paddaa chadivaakaa.’Aadiguruvula Kaalajnaanam aksharam pollupokundaa jarigiteerutundanee, raatri kanna rangula kala poddu podichesariki andarikee pravesham unna vasantavaatikalaa saakshaatkaristundanee nammina, ragilina, uppongina, aanaka challaarina, kungina dinaalu gurtochhi nittoorchaanu koodaa Ramoo!

  • రామ్మెహనరావు గారూ మీ వ్యాసం చదివిన తరువాత నాకు కొన్ని సందేహాలు కలిగాయి. అవి మీ ముందు ఉంచుతున్నాను. ఇక్కడే అవకాశం ఉంటే వివరించగలరు. లేకపోతే అవకాశం తీసుకుని మీరు వ్యాస రూపంలో చెప్పగలరని కోరుతున్నాను.

    1) శ్రమ అంటేనే భౌతిక శ్రమగా భావించే రోజుల నాటి సూత్రీకరణలు వేరు. నేటి పరిస్థితి వేరు. కాలక్రమేణా కార్మికులు తిరుగుబాటు చేసి కూల్చనవసరం లేని స్థాయిలోనే లాభాలు పిండుకునే మార్గాలను కనిపెట్టారు.
    నా సందేహం: నేడు భౌతిక శ్రమ లేదా? కూల్చనవసరం లేని స్థాయిలో లాభాలు పిండుకునే మార్గాలను కనిపెట్టారని అన్నారు. ఇదెలా?

    2)పాలకులు ప్రభుత్వానికి మార్కెట్కు మధ్య సంబంధాలను కోఆర్డినేట్ చేసే ప్రొఫెషనల్స్ గా మారిపోయిన స్థితి ప్రధానంగా కనిపిస్తుంది-మౌలికమైన ఆస్తి సంబంధాలను కాపాడుతూనే. టాక్సేషన్ లేదా పన్నుల వ్యవస్థ ఆ సంబంధాలను సమన్వయం చేసే ఆయుధంగా మారింది. అసమానతలను ఏదో ఒక స్థాయిలో ఉండనిస్తూనే దాన్ని లెవల్ చేసే అస్ర్తంగా మారింది.
    నాసందేహం :ఎలా లెవెల్ చేస్తుందో కాస్త వివరించగలరు

    3)ముఖ్యంగా ఐరోపా చరిత్రలో. పెట్టుబడి దారి దేశాలు ఆది గురువుల అంచనాలను దాటి కొత్త మార్గాలు పట్టాయి.
    నా సందేహం : ఆదిగురువులు అంటే ఎవరు? వారి అంచనాలను దాని ఎలా కొత్తమార్గాలు పట్టిందో తెలపగలరు.
    4)ఎక్కడైతే వైరుధ్యం ముదిరి పెట్టుబడి దారి వ్యవస్థ తన గ్రేవ్ డిగ్గర్స్ ను తానే తయారు చేసుకుంటుందని ఆదిగురువులు భావించారో అక్కడ పరిస్థితి వేరేగా తయారైంది. అడ్వాన్స్డ్ పెట్టుబడిదారీ దేశాల కంటే భారత్, బ్రెజిల్ లాంటి వర్థమాన దేశాల్లోనే అసమానతలు భయానకంగా ఉన్నాయి.
    నా సందేహం: అక్కడి పరిస్థితి ఎలా వేరేగా తయారయ్యిందో తెలపగలరు.

    5)) వేతనాలు_లాభాల మధ్య ఈక్వేషన్ మారిపోతూ వచ్చింది. లాభాల కోసం కార్మికులను పీల్చి పిప్పి చేయడం అనేది అది వైరుధ్యాన్ని షార్పెన్ చేయడం అనే ఆదిగురువుల అంచనా ప్రకారం పెట్టుబడి ప్రయాణించలేదు.
    నా సందేహం : అలా ప్రయాణించకుండా మరెలా ప్రయాణిస్తుందో కాస్త వివరించగలరు

    6) )రాజ్యం స్వభావంలో కూడా ఆ మార్పు కనిపిస్తూ వస్తున్నది. అది వెల్ఫేర్ రూట్ తీసుకుంది. ఐరోపా దేశాలు కనీస వేతనానికి గరిష్ట వేతనానికి మధ్య వ్యత్యాసాన్ని బాగా తగ్గించి ఆ రకంగా వ్యత్యాసాలు మరీ ఘోరంగా లేకుండా చేశాయి. ఆదాయాల మీద భారీ పన్నులేసి వాటిని సంక్షేమం మీద ఖర్చుచేసే పద్ధతిని కూడా ఎంచుకున్నాయి.
    నా సందేహం : సంక్షేమం ఎందుకు ఉనికిలోకి వచ్చింది? అది వ్యత్యాసాలను తగ్గిస్తుందా లేక సామాజిక ఉద్రిక్తతలను తగ్గిస్తుందా? వివరించగలరు.

    7)అవి సామ్రాజ్యవాద రూపమెత్తి పేదదేశాలను కొల్లగొట్టడం వల్లే ఆ స్థాయి జీవన ప్రమాణాలు ఆ దేశాల్లోని పౌరులకు అందించగలుగుతున్నాయనే వాదన ఉంది.
    నా సందేహం : కొల్లగొట్టిన దానిలో కార్మికులకు పంచుతున్నారా అభివృద్ధి దేశాల్లో? ఇదెలా?

    8) ఏంగెల్స్ బ్రిటన్లో పెరిగిపోతున్న వర్కింగ్ క్లాస్ అరిస్ర్టోక్రసీని మాత్రమే కాకుండా అమెరికాలొ మొగ్గ తొడుగుతున్న పరిస్థితి గురించి కూడా మాట్లాడారు. (ఆయన బతికి ఉన్న రోజుల్లో బ్రిటనే పెట్టుబడి దారి కేంద్రం. అమెరికా అప్పటికి అంతగా ఎదగలే.) బహుశా ఇంగ్లండ్ వర్కింగ్ క్లాస్ గురించి అందులో అరిస్టోక్రసీ ఆఫ్ లేబర్ గురించి చర్చిస్తున్న వ్యాసంలోనే అమెరిన్ ఉదంతాన్ని కూడా ఫుట్ నోట్స్లో రాసినట్టు గుర్తు.
    నా సందేహం : మీరు ఉదహరించిన రెండు దేశాల్లో కూడా వర్కింగ్ క్లాస్ అరిస్ట్రోకసీ అని రాయలేదు. వర్కింగ్ క్లాస్ యూనియన్స్, యూనియన్ లీడర్లు గురించి రాశారు. మీరు వర్కింగ్ క్లాస్ అరిస్ట్రోకసీ అని రాశారు. …ఎంగెల్స్ ఏ వ్యాసాల్లో చెప్పారో వాటి లింక్ లు ఇవ్వగలరు.

    • ముందుగా మీ ఎనిమిదో ప్రశ్నకు సమాధానం చెపుతాను.
      The tendency of the Capitalist system towards the ultimate splitting-up of society into two classes, a few millionaires on the one hand, and a great mass of mere wage-workers on the other, this tendency, though constantly crossed and counteracted by other social agencies, works nowhere with greater force than in America; and the result has been the production of a class of native American wage-workers, who form, indeed, the aristocracy of the wage-working class as compared with the immigrants, but who become conscious more and more every day of their solidarity with the latter and who feel all the more acutely their present condemnation to life-long wage-toil, because they still remember the bygone days, when it was comparatively easy to rise to a higher social level.”( Engels. The Condition of the Working Class in England
      Preface to the American Edition-1887- see appendix) ఇదీ ఆ కోట్. ఇందులో అరిస్టోక్రసీ ఆఫ్ ది వేజ్ వర్కింగ్ క్లాస్ అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా!
      అలాగే మిగిలిన ప్రశ్నలు కూడా మరికాస్త వర్కవుట్ చేసి అడగండి. జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాిను. మీకూ నాకూ టైం సేవ్ అవుతుంది. అన్నట్టు అడ్వాన్సడ్ కంట్రీస్లో అసమానతలు తగ్గింపులో వాళ్లు పన్నుల పద్ధతిని ఎట్లా వాడుకుంటున్నారనేది వివరంగా తెలుసుకోవాలంటే థామస్ పికెటి పెట్టుబడి(21వ శతాబ్దిలో) చదవండి. అసమానతలకు సంబంధించి ఆ దేశాలకు మనకు ఉన్న తేడా వివరించడానికి ఆయన టేబుల్స్ రెండు ఇచ్చాను. అవి సాంకేతిక కారణాల వల్ల ఇక్కడ పేస్ట్ అవ్వలేదు. నా ఫేస్ బుక్ పేజీమీద షేర్ చేశాను. వీలైతే చూడండి. అవి చూశాక కూడా కాస్త రీ షేప్ చేసుకుంటారా లేక ఇవే ప్రశ్నలా అనేదాన్ని బట్టి ఆనక మాట్లాడుకుందాం.

  • ” the aristocracy of the wage-working class as compared with the immigrants, but who become conscious more and more every day of their solidarity with the latter and who feel all the more acutely their present condemnation to life-long wage-toil, because they still remember the bygone days, when it was comparatively easy to rise to a higher social level.” సార్… దీని అర్ధం ఏమిటి సార్

    • డిక్షనరీలో వెతకండి. లేదంటే గూగుల్లో ఫ్రీ డిక్షనరీస్ ఉంటాయి. మీకు దొరక్క పోతే చెప్పండి. వాటి లింక్స్ పెడతాను.

  • Excellent . You dealt many issues at one strech. There is a logic and sensible argument.But lay mem like me can not comprehend the narrative .Yet you intiate good debate on understanding of issues plaguing the society. Nice . understanding ur narrative requires basic knowledge or introduction of all issues.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు