మానవుడి జ్ఞానానికి పునాది తన చుట్టూ జరిగే విషయాల గురించి మాత్రమే కాదు, తనకి కనబడని, తెలియని సుదూర ప్రాంతాలలో ఏమేం జరుగుతుందనే జిజ్ఞాసే. అది కేవలం ఆసక్తి కాదు. మనిషిగా సమాజంలో తన ప్రయాణాన్ని అంచనా వేసుకునే పద్ధతి. వార్తా పత్రికలు ఈ ప్రయోజనాన్ని నెరవేర్చటానికే పుట్టాయి. కానీ ఈ రోజున వార్తకి జ్ఞాన ప్రాముఖ్యత కంటే వాణిజ్య ప్రాముఖ్యతే ఎక్కువ. క్రీ.శ.1566లో వెనిస్ నుండి మొట్టమొదటి చేతివ్రాతతో కూడిన వార్తా పత్రిక పుట్టి, అలాగే 1609లో జర్మనీలో మొట్టమొదటి ప్రింటెడ్ వార్తాపత్రికగా మారినప్పుడు ఏదో ఒకరోజున ‘వార్త ‘ ఒక భారీ పరిశ్రమగా మారుతుందని ఊహించి వుండకపోవచ్చు.
సాంకేతికంగా చూస్తే వార్త అంటే జరిగిన ఒక సంఘటనని తెలియచేయటమే. ఒకే రకమైన సంఘటనలు ఒక పది జరిగితే అది ఒక పరిణామం అవుతుంది. పదో సంఘటనకి ముందు తొమ్మిది సంఘటనలకి సంబంధించిన జ్ఞానం ఆ పరిణామాన్ని విశ్లేషించటానికి దారి తీస్తుంది. ఆ విధంగా ఒక వార్త వెలుగులో ఒక సాధారణ సత్యాన్ని ఆవిష్కరించటానికి వీలవుతుంది. ఆ రకంగా వార్తా పత్రికల విషయ పరిధి విస్తరిస్తుంది. విశ్లేషణ అనేది విశ్లేషకుడి ప్రాపంచిక దృక్పథానికి, జ్ఞాన పరిధికికి, వ్యక్తీకరణ సామర్ధ్యానికి లోబడి వుంటుంది. ఆ విశ్లేషణ చేసే వ్యక్తికి తన వృత్తి పట్ల, సమాజంపట్ల నిబద్ధత కలిగివుంటే ఆ విశ్లేషణ నిజాయితీగా, స్వఛ్ఛంగా, వాస్తవికంగా, విశాల జనహితాన్ని దృష్టిలో పెట్టుకొనేదిగా వుండొచ్చు. లేదా ఆ విశ్లేషకుడు తన ప్రయోజనానికి లేదా మరొకరి ప్రయోజనానికి అనుగుణంగా విశ్లేషణ చేసినప్పుడు జరిగేది వాస్తవాల వక్రీకరణ. వాస్తవాల వక్రీకరణ ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు ఏర్పరుచుకోవడానికి దారితీస్తుంది. అందుకే వార్తా రంగంలో పనిచేసేవారికి తిరుగులేని సత్యసంధత వుండాలి. వుండాలి సరే, అది వున్నదా అన్నదే అసలు ప్రశ్న!
****
వర్తమాన కాలంలో విలువలకి పూర్తి తిలోదాకాలిచ్చి అత్యంత దిగజారిపోయిన రంగాల్లో వార్తా రంగానికి సాటి మరోటి లేదు. ఇప్పుడు వార్త అంటే ప్రజలు తెలుసుకోవాల్సిన ఏదైనా సంఘటనకి సంబంధించిన సమాచారం కాదు. ప్రజల దృష్టిని విశాలం చేయగల పరిణామాలకు సంబంధించిన విశ్లేషణాత్మక వ్యాసాలో, కథనాలో కావు. వార్త అంటే ప్రజలకి “ఇలా అర్ధమవుతూ చేరాలి” అనే ఉద్దేశ్యంతో వండినన కొన్ని వాక్యాలు. వార్త అంటే ఇప్పుడు ప్రకటనల మధ్య మనల్ని ఎంతవరకు తాకాలో అంతవరకు మాత్రమే తాకే సమాచారం. వార్త అంటే ఇప్పుడు ఏదో ఒక రాజకీయ పార్టీకి, నాయకులకి సానుకూలంగా ప్రజల్లో అభిప్రాయాల నిర్మాణం. కావాలంటే అర్నబ్ గోస్వామి ‘షో’, మన రాష్ట్రాల్లో సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, ఈనాడు వంటి చానెళ్లు, పత్రికలు చూడండి. ఇంక ఈ రకమైన ‘వార్త’కి వాస్తవంతో సంబంధం ఏముంటుంది? అసలు వార్తారంగంలో విలువలు ఎందుకింతగా దిగజారిపోయాయి?
వార్త అచ్చు రూపంలో వున్నప్పుడే పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. జ్యూట్ వ్యాపారం చేసే గోయంకాల చేతుల్లో “ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్”, టీపొడి, ఇనుము నుండి కార్లు వరకు చేసే టాటా వారి చేతుల్లో “స్టేట్స్మెన్”, బిర్లా వారి “హిందుస్తాన్ టైంస్”, జైన్స్ వారి “టైంస్ ఆఫ్ ఇండియా” ఎం.ఆర్.ఎఫ్.వారి “మలయాళ మనోరమ” పత్రికలు ఇందుకు ఉదాహరణలు. 1990ల నుండి విజృంభించిన గ్లోబలైజేషన్ ప్రభావం కారణంగా పెట్టుబడిదారీ విధానం మాత్రమే దేశాభివృద్ధికి కీలకమని నమ్మిన నేపథ్యంలో ప్రజా జీవనానికి సంబంధించిన ప్రతి అంశమూ విద్య, వైద్యం నుండి వివాహాల వరకు ప్రతిదీ పరిశ్రమ అయిపోయింది. అలాగే వార్తా రంగం కూడా ఒక మెగా పరిశ్రమ అయింది. పరిశ్రమ అన్నాక అది వందకి రెండు వందల శాతం లాభాలకి సంబంధించినదే అయివుండాలి కదా. ఎక్కడైతే ప్రజల జీవనవిధానం వినిమయదారీ సంస్కృతి ధృతరాష్ట్ర కౌగిలిలోకి వెళ్లిపోతుందో అక్కడ వస్తూత్పత్తి పరిశ్రమల కంటే సేవారంగ పరిశ్రమలు ఎక్కువగా ముందుకొస్తాయి. సేవారంగ పరిశ్రమ అంటే వస్తువుల మార్కెట్ కి అనుకూలమైన పరిశ్రమ. మార్కెట్లో వస్తువులు అధికభాగం దిగుమతి చేయబడినవే అయుంటాయి. ఆ వస్తువుల అమ్మకాలకు అవసరమైన సేవారంగాలు పెరుగుతాయి. అలా అభివృద్ధి చెందిన సేవారంగమే నేటి మీడియా. అవును ఇప్పుడు వార్త ‘ప్రెస్ ‘ కి చెందినది కాదు. ఇప్పుడు వార్త ‘మీడియా’కి చెందినది!
****
‘ప్రెస్ ‘ అనే కాన్సెప్ట్ ‘మీడియా’గా రూపాంతరం చెందటమే ఈ శతాబ్దపు అతి భారీ వార్తల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. దూరదర్శన్ ఎప్పుడో యాభై ఏళ్ల నుండి వున్నప్పటికీ జనాల్ని పెద్దగా చేరింది లేదు 1990ల వరకు. 1990ల మొదట్లో మొదలైన ఉపగ్రహ ప్రైవేట్ ఉపగ్రహ చానెళ్ల ప్రవేశంతో విజువల్ న్యూస్ మొదలైంది. మామూలు ఎంటర్టెయిన్మెంట్ చానెళ్లలోనే వార్తా ప్రసారం వుండేది. సుమారు ఇరవై ఏళ్ల క్రితం 24 గంటల వార్తా చానెళ్లు మొదలయ్యాయి. ఐతే వార్త మీడియా అవటం అనే పరిణామం కేవలం విజువల్ న్యూస్ ఆవిర్భావం వల్ల మాత్రమే జరగలేదు. మీడియా వ్యూహాల్లో విజువల్ వార్తలు ఒకటి. వార్తలు విజువలైజ్ అవటం కంటే వార్తారంగం కార్పొరెటైజ్ అవటమే పెద్ద పరిణామం.
వార్త ఈ రోజున పఠనంగా కంటే దృశ్యంగానే ఎక్కువగా భారతీయుల్ని చేరుతున్నది. వార్తలకి పాఠకులు తగ్గిపోయి ప్రేక్షకులు పెరుగుతున్నారు. ఇది ప్రజల అభిరుచిలో వచ్చిన మార్పు కాదు. ఇది వినిమయ వస్తువులతో నిండిన మార్కెట్ అవసరాలకు అనుగుణంగా చేయబడిన ఏర్పాటు. ప్రకటనలకి వార్తా పత్రికల్లో దృశ్య మాద్యమంలో వుండేంత స్కోప్ వుండదు. దృశ్యం హత్తుకున్నంతగా ప్రింటెడ్ అక్షరాల్లో ప్రకటన ఆకట్టుకోదు. ప్రకటనలు దృశ్య మాధ్యమంలోనే మరింత ప్రభావవంతంగా ప్రజల్ని చేరగలవు కనుక మొత్తం వార్తారంగం కార్పొరేటైజ్ అవటం మార్కెట్ అవసరం. కార్పొరేటైజ్ అవటం అంటే అది మామూలు పెట్టుబడి స్థాయిని దాటిపోవటం. ఆర్ధిక దిగ్గజాలు రంగంలోకి దిగటం. ఇంక మార్కెట్ కి అనుకూలంగా మీడియా తయారయ్యాక ఏ రకంగానూ ప్రజల్ని మోసం చేసే వాణిజ్య విధానాలకి వ్యతిరేకంగా సత్యసంధమైన వార్తలకి అవకాశమే లేదు. ఇది ప్రెస్ మీడియాగా మారటం వల్ల జరిగే ప్రజావ్యతిరేక పరిణామాల్లో ఒకటి.
ఇప్పుడు ఒక్క వార్తా ఉపగ్రహ చానెల్ పెట్టాలంటే వందల కోట్ల రూపాయిలు కావాలి. కేవలం జర్నలిజం పట్ల ఆసక్తి వున్నవారెవ్వరూ చానెల్స్ పెట్టలేరు. అనివార్యంగా వార్తారంగంలో నిష్ణాతులై వుండి, ఉత్సాహం వున్న వారికి “ఇన్వెస్టర్స్” అవసరం వుంటుంది. మరి ఇన్వెస్టర్స్ ఊరకనే వందల కోట్లు పెడతారా? ఖచ్చితంగా పెట్టరు. వాళ్లకి అధికారంలో వున్న పార్టీలతో లేదా వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం పోరాడే పార్టీలతోనో వాణిజ్యావసరాలుంటాయి. వాణిజ్యావసరాలంటే వారి ఇతర పరిశ్రమల కోసం భూ కేటాయింపుల నుండి అనుమతుల మంజూరు (అడ్డదారిలోనే కావొచ్చు) వరకు పాలక పార్టీల ఆదరణ కావాలి. ఆ ఆదరణ సంపాదించుకోవటానికి మీడియా పరపతి వారికి కలిసివస్తుంది ఖచ్చితంగా. మరి పాలక పార్టీల ప్రాపకం సంపాదించాలంటే మీడియా ద్వారా సాధించాల్సిన ప్రజా ప్రయోజనాల కంటే పాలక పార్టీల ప్రయోజనాలే ముఖ్యం అవుతాయి. అంతేకాదు ఈ ఉపగ్రహ వార్తా చానెల్స్ ఏవీ కార్పొరేట్ దిగ్గజాల మోసాల గురించి మౌనం వహిస్తుంటాయి. ఎందుకంటే అవి కూడా ఆ తానులో గుడ్డముక్కలే కదా!
అలాగే అధికారంలో వున్న పార్టీల ప్రయోజనాలు నెరవేర్చని చానెల్స్ ఇబ్బందులు పడతాయి. అయితే నిజానికి వర్తమానంలో ఏదో ఒక పాలక/ప్రతిపక్ష పార్టీకి మద్దతివ్వని సుద్దపూస చానెల్స్ అంటూ ఏవీ లేవు. అవి ఏ పార్టీకి అనుకూలంగా వున్నాయనేదే పాయింట్. అధికారంలో వున్న పార్టీకి ఎదురుతిరిగినప్పుడు తాము ప్రజాస్వామ్య పరిరక్షులమని చెప్పుకుంటాయి ఆ చానెల్స్.
తమది దమ్మున్న చానెల్ అనే స్థాయిలో చెప్పుకోగలవు. అడ్వర్టైజ్మెంట్ల విషయంలో ప్రభుత్వ పక్షపాతానికి గురైనప్పటికీ తాము నిలబడ్డామని, మడమ తిప్పలేదని ఘనంగా చెప్పుకుంటాయి. అధికారంలోకి తమ అనుకూల పార్టీ రాగానే ఏదో విప్లవ ప్రభుత్వాలు ఏర్పడినట్లు బాకాలూదుతుంటాయి. దీన్ని మొత్తం పాలక వర్గాల గ్రూపు కుమ్ములాటల్లో భాగంగానే చూడాలి. “వాడు పోతే వీడు – వీడు పోతే వాడు రావటం” మినహా ప్రజలకి ఒరిగేదేమీ లేదు. కానీ ఏదో రూలింగ్ పార్టీకి అఫిలియేట్ అయివున్న ఈ చానెల్స్ మాత్రం ప్రజల తరపున ఆలోచించి పెడుతూ “ఒపీనియన్ చేంజ్” లేదా “ఒపీనియన్ బిల్డింగ్” కి పూనుకుంటూ వుంటాయి. అంటే సింపుల్ గా అనుకోవాలంటే “ఇప్పుడు వార్త ఏమిటి?” అనేదాని కంటే “ఇప్పుడు ఏది వార్తవ్వాలి?” అనేది ముఖ్యమై పోతున్నది.
ఏదో కంపెనీని టేకోవర్ చేసినట్లు చానెల్స్ ని, పత్రికల్ని కొనేయటం జరుగుతున్నది. ఇప్పుడు మన తెలుగు రాష్స్ట్రాల్లో కనుక చూస్తే పాలకపార్టీకి ఎంతో కొంత వ్యతిరేకత కనబరిచిన టీవీ 9, 10 టీవీల్ని ఆ పార్టీకి అనుకూలంగా వున్నవారే కొనేసారు. ఇంక ఈ చానెళ్లు చేసే పని ఏమిటి? పాలకులకి బాకాలూదటం మినహా! ప్రజలకి అన్యాయం చేయటం మినహా!!!
****
స్వాతంత్రోద్యమ కాలంలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసిన వార్తా పత్రికలకి ఒక జవాబుదారీతనం వుండేది. కొన్ని వృతి విలువలు పాటించేవారు. 1993 వరకు అనుకుంటాను బహుశా ఎలక్ట్రానికి మీడియా మీద ప్రభుత్వానిదే గుత్తాధిపత్యం. ఎప్పుడైతే ప్రభుత్వం గుత్తాధిపత్యం వదిలేసుకొని ప్రైవేట్ శాటిలైట్ చానెళ్లకి గేటులెత్తిందో అప్పటి నుండి వార్తలకి సత్యసంధత కంటే సంచలనమే ముఖ్యమైపోయింది. బ్రేకింగ్ న్యూస్ అంటే గుండె చిక్కబట్టుకునే పరిస్తితి వచ్చింది. ఒక ప్రముఖుడి మరణం లేదా హత్య దగ్గర నుండి వీధి కుక్కల బెడద వరకు అన్నీ బ్రేకింగ్ న్యూస్ పరిధిలోకి వచ్చేసింది. హఠత్తుగా ప్రజాదరణకి సంబంధించిన కొలతలొచ్చేసాయి. అదే టీఆర్పీ రేటింగ్. టీఆర్పి రెటింగ్ ని అనుసరించే యాడ్స్ వస్తుంటాయి. ఎలాగోలా ఏం చేసైనా సరే టీఆర్పి రేటింగ్స్ పెంచుకోవాలి. అంతే. కెమెరాలు తారల స్నానాలగదుల్లోకి తొంగి చూసి ఏ మాత్రం సిగ్గు లేకుండా ప్రైవేట్ పార్ట్స్ ప్రసారం చేస్తాయి. ఆశ్రమాల్లో దొంగ బాబాల కామకేళీల్ని కదలికలతో సహా చూపిస్తాయి. ప్రమాదాల బాధితుల్ని హాస్పిటళ్లకి చేర్చటం కంటే వాళ్లని ఆ దుస్తితిలో ఇంటర్వ్యూలు చేస్తాయి. మీడియా అంటే ఏమైనా చేయొచ్చు. ఏదైనా చెప్పొచ్చు. అదెంతవరకు వెళ్లిందంటే కొంతమంది మీడియా ప్రతినిధులు స్వయంగా బ్లాక్మెయిలింగ్ మాఫియాలా తయారయ్యారు. ఇదంతా కూడా అపరిమితమైన, జవాబుదారీతనం లేని, తణిఖీలేని విధానాల వల్లనే జరిగింది.
ప్రజలేం ఆలోచించాలో మీడియానే చెబుతుంది. దేని గురించి బాధపడాలో, దేన్ని లైట్ తీసుకోవాలో, దేని గురించి ఉద్యమాలు చేయాలో కూడా మీడియానే బోధిస్తుంటుంది. ఏది చెప్పినా టీఆర్పీ అనే లక్ష్యాన్ని దృష్టిలో వుంచుకునే చెబుతుంది. మీడియా ప్రభావం ప్రధానంగా అర్బన్ ప్రాంతానికి చెందినది. అందుకే దాని ఫోకస్ అంతా పట్టణ ప్రాంతాలపై వుంటుంది. ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన అత్యంత పాశవికమైనదే. కానీ గ్రామీణ ప్రాంతాలలో అంతకంటే ఘోరమైన సంఘటనలే జరుగుతాయి. కానీ అవి మీడియా దృష్టిని నోచుకోవు. గ్రామీణ ప్రాంతంలో అత్యంత దారుణమైన జీవన పరిస్తితుల కంటే పట్టణ ప్రాంతాల్లోని వీధి కుక్కల స్వైర విహారం మీడియాకి ముఖ్యమవుతుంది.
ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రపంచం మొత్తం మీద ఇప్పటికీ అత్యధికంగా ప్రజలు పత్రికలు చదువుతున్నది భారతదేశంలోనే. ఈ రోజున భారతదేశంలో మొత్తం లక్షా పదివేల పై చిలుకు పత్రికలు రిజిస్టర్ అయివున్నాయి. ఇవన్నీ వార్తా పత్రికలు కాకపోవచ్చు. ఇందులో కొన్ని బులెటిన్లు, సంస్థాగత పత్రికలు వుండొచ్చు. ప్రముఖ దినపత్రికలన్నీ ఆన్లైన్ ఎడిషన్స్ కూడా ఇస్తున్నాయి. ఇవి ఉపయోగకరంగానే వుంటున్నాయి. 24 గంటలు ఏదొ ఒక వార్త ప్రసారం చేయాలి కాబట్టి లేనిపోని చచ్చు వార్తల్ని చూపించే చానెళ్లకి కళ్ళప్పగించటం కన్న చదవటం అనే గొప్ప అలవాటుని కొనసాగించటమే ఉత్తమం.
****
వార్త అనేది తెలుసుకోవాల్సిన విషయమే కానీ చానెళ్లలో చూసి ఆనందించాల్సిన, కుదేలైపోవాల్సిన, కడుపులో తిప్పించుకోవాల్సిన విషయం కాదు. అన్నింటికంటే ముఖ్యంగా వార్త వినోదం కాదు.
చానెళ్లకి దూరంగా వుందాం. అది మన కళ్లకే కాదు, గుండెలకి కూడా మంచిది.
*
Good analysis about news and media. Thank you sir.
Thank you so much Prasuna garu!
నిజమండి. నేను ఇదే విషయం మీద ఒక కథ కూడా రాశాను. .మీరు చాలా చక్కగా వివరించారు.
Thank you so much Padmajarani garu!