పుస్తకం: జీరో నెంబర్ 1, రచయిత : మొహమ్మద్ గౌస్, పేజీలు : 118, ధర : 150
నేను పుట్టింది నంద్యాల దగ్గరైనా పెరిగింది మాత్రం అంతా విశాఖపట్నంలోనే. కానీ ప్రతి వేసవి సెలవులకు నంద్యాల వెళ్లడం అలవాటు. అలా వెళ్తున్నపుడు గిద్దలూరు, నంద్యాల మధ్య ఉన్న నల్లమల్ల అడవి మధ్యలో ఒక పాత రైల్వే వంతెన ఉండేది. ఆ వంతెన చుట్టూ ఒక కథ అల్లి, అది బ్రిటిష్ వాళ్ళ సరుకు రవాణా ఆపడానికి అప్పటి స్వతంత్ర యోధులు దాన్ని పేల్చేశారు అని సినిమాగా తీశారు. కానీ మా నాన్న చెప్పిన విషయం ఏంటంటే కొత్త ట్రాక్స్ వేసిన తర్వాత పాత వంతెన వాడటం మానేశారు అని. కానీ ఇప్పటికీ నేను ఆ సినిమాలో చూపించిన విషయాన్ని నమ్మడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఒక చిన్న చరిత్ర లాంటి కట్టుకథ ఉంది.. ఇలానే మన ఊర్లో ఎన్నో కట్టడాలకు లేదా ప్రదేశాలకు ఇలాంటి కథలే ఉంటాయి. ఇలాంటి కథలు పెద్దవాళ్ళు ఆశ్చర్యంతో వింటే, చిన్నపిల్లలు భయంతో వింటారు. కాలక్రమేణా ఈ కథలే కొన్నిసార్లు ఆ ఊరు చరిత్రగా మారే అవకాశం కూడా ఉంది. ఇదే అంశాన్ని తన కథనంగా తీసుకొని మొహమ్మద్ గౌస్ రాసిన నవలే “జీరో నెంబర్ 1”.
అనంతపురం జిల్లా పెన్నా నదికి ఆనుకోని ఉండే ఒక గ్రామంలో ఒక పాత భవంతి ఉంది. ఆ భవంతి చుట్టూ ఒక కథ కూడా ఆ ఊరులో ప్రాచుర్యంలో ఉంది. అలాంటి భవంతి దగ్గర్లో సూరిగాడు అనే ఇరవైఐదు ఏళ్ల యువకుడు వచ్చి చికెన్ షాప్ పెట్టుకుంటాడు. చికెన్ షాప్ పెట్టుకున్న తర్వాత సూరికి వచ్చిన కష్టాలు ఏంటి..? వాటి తాను ఎలా ఎదురుకున్నాడు.?, సూరి ఆ భవంతికి ఉన్న కట్టుకథను మార్చాడా..? వంటి విషయాలు తెలియాలి అంటే ఈ నవల చదవాల్సిందే.
ఈ నవలలోని కథ చిన్నగా అనిపించినా, కథలో ఎన్నో పొరలు ఉన్నాయి. ఒక క్రైమ్ థ్రిల్లర్ అని చెప్తున్నా.., అంతర్లీనంగా మనుషుల మధ్య ఉండే అసమానతలు, వివక్షలు వంటి సాంఘిక అంశాలు గురించి కూడా స్పృశించారు.
గౌస్ రాసిన “గాజుల సంచి” పుస్తకంలోని కొన్ని కథలలోని పాత్రలు ఈ నవలలో కూడా కనిపించడం పాఠకుడిగా నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది.
కథలోని పాత్రలు, కథకుడు కూడా అనంతపురం జిల్లా మాండలీకం మాట్లాడడం వల్ల కథకు మరింత ప్రాంతీయత చేకూరింది. అలానే చికెన్ షాప్ నడుపుకునే వ్యక్తిని కథా నాయకుడిగా పెట్టి కథను చెప్పడం చాలా బాగా నచ్చింది. సూరిగాడి మనస్తత్వం కేవలం అతి తక్కువ మాటల్లో చెప్పడం వల్ల, ఒక గ్రే క్యారెక్టర్‌గా రూపాందించడం వల్ల కథకు మరింత పరిధి పెరిగింది.
ఈ నవలను కాఫ్కాకు, కేశవరెడ్డికి, పెన్నా నదికి అంకితం ఇచ్చిన రచయిత, తన కథ/కథనం ద్వారా కేశవరెడ్డికి, పెన్నానదికి ఎందుకు అంకితం ఇచ్చాడో అర్ధం అవుతుంది కానీ, కాఫ్కాకి ఎందుకు ఇచ్చాడో అర్ధం కాలేదు.
శశిరేఖ పాత్ర పడే కష్టాలు, బాబు ఆ ఊర్లో చేసే అఘాయిత్యాలను కూడా తన కథనంలో చేర్చివుంటే కథ నిడివి మరింత ఉండేది. అలానే నవల మొదట్లో ఎంతో నిదానంగా సాగే కథనం, చివర్లో కాస్త త్వరగా ముగించాలి అనే ఉద్దేశంతో రాసినట్టు అనిపించింది.
తెలుగులో పాఠకులను పెంచే మరో పుస్తకం ఈ “జీరో నెంబర్ -1”. కాసేపు అన్ని మర్చిపోయి ఒక వాస్తవిక కల్పన ప్రపంచంలోనికి వెళ్ళాలి అనుకొనేవాళ్ళకి ఈ పుస్తకం ఒక మంచి అవకాశం ఇస్తుంది.
ఈ పుస్తకం కావాల్సిన వాళ్ళు 9848023384 నంబర్ కి ఫోన్ చేసి కొనుకోవచ్చు.. లేదా అమెజాన్ నుంచి కూడా పొందచ్చు.
అమెజాన్ లింక్ : https://amzn.to/3NiY18s
*
Add comment