మామిడికాయ కోశాడనో
మరచెంబుని దొంగిలించాడనో
లేదా
తెల్లని తన కూతుర్ని
కౌగలించుకుని నల్లబరిచాడనో
మా అయ్యనో , మా అన్న నో ఊరి చావిడీ కి
ఎదురుగా హత్యలు చేసినట్టు
ఇతని హత్య అసలు కొత్తగాలేదు.
తల్లి పాలకు ,
తల్లి స్పర్శకు లేని రంగుల యుద్ధంలో
అతడు నలుపురంగై తెల్ల దేశానికి
నల్ల రంగు జెండా అయినందుకు
అతడిని హత్యచేశారు
అందుకే
అతడు ఊపిరి వొదులుతూ
ఊరవతలి వాడలోని
మరణాల జాబితాలో చేరిపోయాడు
డాలర్ల దర్జాలు , పరిశుద్ద గ్రంధాల ప్రవచనాలు
తనను బానిసగా చూస్తున్న చూపును ఎదిరించి
నగరం నడివీధిలో నడిచిన
తన జాతి పాదముద్రలు కౌగలించుకుని
మోకాలిక్రింద పెనుగులాటలో
నలిగిపోతున్న ఊపిరిని
కారంచేడు ఉద్యమాల పతాకాలను చేసి
చివరిగా ఎత్తిపట్టుకున్నాడు
అతడు వాషింగ్టన్లోనో
నేను
వామనుడి పాదం క్రిందో నలిగిపోయిన వాళ్ళంకాదు
ఈ దేశం
రేపు నాదేనంటూ “భీమ్” పాదాలు
నడిచిన దారిలో ధిక్కారస్వరంతో
సుడులుతిరుగుతూ
చరిత్ర గుండెలపై సంచరిస్తున్నాను.
*
అతడు నలుపు రంగై తెల్ల దేశానికి నల్ల రంగైనందుకు
Excellent
అన్నా అభినందనలు