గోడల్లేని గ్లోబల్ విలేజ్ కావాలి

వంశీకృష్ణకి అరవై అంటే నమ్మడం కష్టమే! రొటీన్ కంటే భిన్నమైన ప్రయాణం, భిన్నమైన అనుభవాలు. ఈ సందర్భంగా వంశీ మిత్రులు ఒక జూమ్ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇది సారంగ ప్రత్యేక సంభాషణ. ఇవి కొన్ని ప్రశ్నలు మాత్రమే! మీకూ కొన్ని ప్రశ్నలు వుండే వుంటాయి. వాటిని కింద కామెంట్ల రూపంలో సంధించండి. వీలునిబట్టి వంశీకృష్ణ వాటికి సమాధానాలు ఇస్తారు. 

వంశీకృష్ణ కి పరిచయమా?!

రోజూ కనిపించే ముఖ సంతకం. వివిధ ప్రక్రియల మధ్య అనుదిన సంచారం. లోతైన అధ్యయనమూ, దాంతోపాటు ఆలోచనా సమపాళ్లలో కలగలసిపోయిన అరుదైన సాహిత్య చిరునామా. ఇవాళ వంశీ కృష్ణ అరవయ్యేళ్ళ ప్రయాణం మరో మైలురాయిని అందుకుంటున్న సందర్భంగా ఒక సంభాషణ- 

ఇవి కొన్ని ప్రశ్నలు మాత్రమే! మీకూ కొన్ని ప్రశ్నలు వుండే వుంటాయి. వాటిని కింద కామెంట్ల రూపంలో సంధించండి. వీలునిబట్టి వంశీకృష్ణ వాటికి సమాధానాలు ఇస్తారు. 

*

వంశీ అంటే అనేకం. కవిత్వం, కథ, విమర్శా, అనువాదాలు, సినిమా- ఇలా. అసలు మీ దృష్టిలో “వంశీకృష్ణ ” ఎవరు?

ఇవన్నీ కలిస్తేనే నేను. ఏది రాసినా హృదయస్ఫూర్తి గా రాశాను. కొన్ని సార్లు గాయపడ్డాను. కొన్ని సార్లు గాయపరచాను. లోపలి దుఖాన్ని మాత్రం పోగొట్టుకోలేదు. అందుకే ఇలా వున్నానేమో.

పందిళ్లపల్లి, ఖమ్మం, నందిగామ- ఇలా మూడూళ్ళ ముచ్చట కదా మీ జీవనయానం. వంశీ మనసు ఏ వూళ్ళో చిక్కుబడింది?

ఇంకా చాలా వూళ్ళున్నాయి. తిరువూరు, ముదినేపల్లి, చీమలపాడు, జగ్గయ్యపేట ఇలా చాలా. ప్రతి ఊరూ నా సొంత ఊరు లాగే అనిపిస్తుంది. నిజానికి నా లోపలే ఒక ఊరు వుంది. పచ్చటి చెట్లు, ప్రవహించే ఒకానొక మున్నేరు, వేణుగోపాల స్వామి గుడి, గన్నేరు, మందార పూల చెట్లు, వినిపించే తిరుప్పావై లేదా లింగాష్టకం పోనీ మసీదు లోంచి అజా. ఇది నా ఊరు. నాలో వున్న ఊరు

చాలా చదివారు, చాలా మందిని కలిశారు,ఎన్నో అనుభవాల్ని చూశారు. ఇప్పటిదాకా మిమ్మల్ని బాగా కదిలించిన అనుభవం?

నేనసలే కూపస్థ మండూకాన్ని. నా మిత్రులతో పోలిస్తే చదివింది చాలా తక్కువ. కలిసింది ఇంకా తక్కువ.మిత్రులతో కలిసిన సందర్భాలలో నేర్చుకున్నదే ఎక్కువ. ఏ అనుభవాన్నీ నేను హృదయం లోకి తీసుకోను. కనుక కదిలించి, ఊపేసిన అనుభవం ఏదీ లేదు. అయినా మీరు అడిగారు కనుక చెప్తాను. యాభైయి ఏళ్ళ క్రితం వదిలి వెళ్ళిపోయిన కొడుకు నెత్తుటి ముద్దాయినాడని తెలిసిన తల్లి ఆ కొడుకు చివరి చూపు కోసం తల్ల డిల్లడం, రాజ్యం నిరాకరించడం నన్ను కదిలించింది. ఇది పరోక్ష అనుభవం అయినా సరే

మొదటి రచన యెప్పుడు, యెలా పుట్టింది?

అచ్చయిన మొదటి రచన ఆర్త గీతం అనే కవిత. ఆగస్టు 12 మధ్యాహ్నం పూట పందిళ్ల పల్లి లో మా యింటి దగ్గర వున్న వేప చెట్టు కింద కూర్చుని రాశా. ఆంధ్రజ్యోతి విజయవాడ అని రాసి పోస్ట్ చేస్తే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ అనుబంధం లో నండూరి అచ్చేసారు. ఆంధ్ర దేశం లో సంచలనం సృష్టించిన రమీజాబీ కేసు ను దృష్టిలో పెట్టుకుని రాసిన జీవితమా నీకు జోహార్లు మెదటి కథ. ఆదివారం వార పత్రిక కధల పోటీలో బహుమతి పొందింది. కథ, కవిత రెండూ సామాజికమైన అంశాలు కదిలిస్తే రాసినవే.

కృష్ణ మూర్తి, రమణ మహర్షి, విశ్వ దర్శనం ఇలా చదివారు కదా, జీవితం పట్ల మీ దృక్పధం ఏమిటీ?

ఎవరికైనా జననం ఒక ప్రారంభం. మరణం ఒక ముగింపు. ఈ రెండింటి మధ్యా ఒక దీర్ఘ మెలకువ జీవితం. మెలకువ అంటే కేవలం కళ్ళు తెరచుకుని చూడటం మాత్రమే కాదు. ఆత్మ ను వెలిగించి ఆ వెలుగు లో ఈ విశాల విశ్వాన్ని చూడటం. కృష్ణ మూర్తి, రమణ మహర్షి ఇద్దరూ, ఒకరు నేను ఏమిటో తెలుసుకోమంటారు. మరొకరు నేను వదిలించుకోమంటారు. నేను వదిలించుకుంటే నువ్వొక విశాల విశ్వం లో ఒక భాగం అవుతావు. చెట్టు లాగో,పిట్ట లాగో, పువ్వు లాగో, నవ్వు లాగో. అలా విశాల విశ్వం లో భాగమైనప్పుడు ఆ అపరిమితమైన ఆనందానికి అంతే ఉండదు. అయితే ఇదంతా అంత తేలిక గా సాధ్య పడదు.

ఈ అసహన కాలం లో ఒక కవిగా, రచయిత గా మీరు ఎలాంటి పాత్ర పోషించాలి అనుకుంటున్నారు?

నేను మొదట గా పాఠకుడిని. కవి రచయిత తరువాత. పాఠకుడిగా నేనేమి కోరుకుంటున్నాను అన్నదే అసలు ప్రశ్న. ఎల్ల లోకములు ఒక్క ఇల్లయ్ అనే భావన బావుంటుంది. విశ్వామంతా ప్రాణ విభుడి ఇల్లయి ఉండ వీధి వాకిలి ఏది చెల్లెలా అని కృష్ణ శాస్త్రి అడి గినట్టు ఈ విశ్వమంతటీనీ ఒక్క ఇల్లులా మార్చగల సాహిత్యం కావాలి. గ్లోబల్ విలేజ్ అనే కాన్సెప్ట్ దేశాల మధ్య వాణిజ్య హద్దులు చేరిపేసింది కానీ మనుషుల మధ్య చెప్పలేనన్ని గోడలు సృష్టించింది. ఆ గోడలు పగుల గొట్టే సాహిత్యం కావాలి. ఒక రూమీ, ఒక లాల్ డెడ్, ఒక శ్రీ శ్రీ, ఒక ఫైజ్ కలిసి సృష్టించే సాహిత్యం కావాలి

ఒక మైలురాయి దగ్గిర ఇప్పుడు నిలబడ్డారు. ఇక్కడి నుంచి ఇంకొన్ని మైళ్ళ దూరంలోని మీ ప్రయాణాన్ని మీరెలా చూస్తున్నారు?

నడచి వచ్చిన దారి సరే. తెలిసిందే. కానీ నడవ వలసిన దారి మీద ఏ అవగాహనా లేదు. పెట్టుకున్న లక్ష్యాలు ఏవీ లేవు కనుక చేరాల్సిన గమ్యం ఏదీ లేదు. గమనమే నా గమ్యం. ఆ గమనం ఎంత మానవీయం గా ఉండాలి అన్న దాని పట్లే నా ఆసక్తి అంతా.

*

 

అఫ్సర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు