మానవ చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా ప్రపంచం మారుతోంది. అరచేతిలోని స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది. సమాచారం వెల్లువలా ముంచెత్తుతోంది. కానీ, ఈ సమాచార విప్లవం మనకు జ్ఞానాన్ని ఇస్తోందా? లేక గందరగోళంలో నెట్టేస్తోందా? అన్నది నేటి యువత ముందున్న అతి పెద్ద ప్రశ్న.
సరిగ్గా ఇక్కడే సాహిత్యం తన అసలైన పాత్రను పోషించాల్సి ఉంది. ‘సమూహ యూత్ లిటరేచర్ ఫెస్టివల్’ వేదికగా, ఈ కొత్త తరానికి, సాహిత్యానికి మధ్య ఉన్న అగాధాన్ని, వారు ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లను చర్చించుకోవడం ఇప్పటికి చాలా అవసరం.
ఒకప్పుడు సాహిత్యం అంటే తీరిక వేళల్లో చదువుకునే వ్యాపకం. కానీ నేడు, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, మానసిక స్థైర్యం కోసం వెదుక్కునే ఒక ఆసరా. నేటి యువతరం ఎదుర్కొంటున్న సవాళ్ళు విభిన్నమైనవి. గ్లోబలైజేషన్ తెచ్చిన అస్తిత్వ సంక్షోభం కెరీర్ పరుగులో ఎదురయ్యే విపరీతమైన మానసిక ఒత్తిళ్లు, సోషల్ మీడియా సృష్టించే కృత్రిమ ప్రమాణాలు, పర్యావరణ ఆందోళనలు… ఇవన్నీ వారిని నిరంతరం అభద్రతాభావానికి గురిచేస్తున్నాయి. ఈ మౌన ఘర్షణను వ్యక్తీకరించడానికి పాత సాహిత్య కొలమానాలు సరిపోవు.
సాహిత్యం కేవలం అలనాటి అందమైన జ్ఞాపకాలను నెమరువేసుకునే సాధనం కాదు. అది వర్తమానానికి అద్దం పట్టాలి. యువత భాషలో, వారి వేగంతో, వారి ఆలోచనా ధోరణికి దగ్గరగా ఉండే రచనలు రావాలి. రీల్స్, షార్ట్స్ ఇచ్చే క్షణికానందం నుంచి, పుస్తకం ఇచ్చే శాశ్వతమైన అనుభూతి వైపు వారిని మళ్ళించాలంటే, సాహిత్యం తన రూపురేఖలను మార్చుకోవాలి. డిజిటల్ మాధ్యమాలను శత్రువుగా కాకుండా, సాహిత్య వ్యాప్తికి మిత్రుడిగా మార్చుకునే చాకచక్యం రచయితలకు కావాలి. పాడ్కాస్ట్ కథలైనా, బ్లాగ్ కవితలైనా… మాధ్యమం ఏదైనా సరే, అంతిమ లక్ష్యం మనిషిలోని సున్నితత్వాన్ని తట్టిలేపడమే కావాలి.
యువజనోత్సవాలు సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? అనే ప్రశ్నకు సమాధానం మన రాజ్యాంగ ఆశయాల్లోనే ఉంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని, లౌకిక విలువలను కాపాడుకోవాలంటే నిరంతర సంభాషణ అవసరం. సాహిత్యం అటువంటి సంభాషణకు వీలు కల్పిస్తుంది. యువత ఎప్పుడైతే కథో, కవితో, వ్యాసమో చదువుతారో, వారు తమ పరిధి దాటి ఇతరుల జీవితాల్లోకి పరకాయ ప్రవేశం చేస్తారు. దళిత, బహుజన, మైనారిటీ, స్త్రీ జీవితాల అస్తిత్వ వేదనను అర్థం చేసుకునే సానుభూతి (Empathy) వారిలో పెరుగుతుంది. తద్వారా సమాజంలో అసహనం తగ్గి, ప్రజాస్వామిక విలువలు బలపడతాయి. ద్వేషం సులువుగా వ్యాపిస్తున్న ఈ రోజుల్లో, ప్రేమను, సహజీవనాన్ని నేర్పే సాహిత్య వేదికలు సమాజ ఆరోగ్యానికి అత్యవసరం.
ఈ గందరగోళ పరిస్థితుల్లో ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసే వేదికగా ‘సమూహ యూత్ లిటరేచర్ ఫెస్టివల్’ నిలుస్తోంది. ఇది కేవలం రచయితల సభ కాదు; ఇది భావి భారత పౌరుల అంతరంగ ఆవిష్కరణ. చెల్లాచెదురుగా ఉన్న యువ గొంతుకలను, విభిన్న ఆలోచనలను ఒకే గొడుగు కిందకు తేవడం ఇప్పుడు అత్యవసరం.
సామాజిక బాధ్యతను గుర్తుచేస్తూ, ప్రశ్నించే తత్వాన్ని, అన్యాయాన్ని ఎదిరించే ధైర్యాన్ని నూరిపోసే శక్తి అక్షరానికి మాత్రమే ఉంది. అలాంటి అక్షరాయుధాలను పదును పెట్టే కర్మాగారమే ఈ ఫెస్టివల్.
రండి, పాత తరపు అనుభవాన్ని, కొత్త తరపు ఆవేశాన్ని జోడించి సరికొత్త సాహిత్య చరిత్రను లిఖిద్దాం. మన చుట్టూ ఉన్న చీకట్లను పారద్రోలే కాగడాగా మన సాహిత్యాన్ని మారుద్దాం. కొత్త తరం రచయితల గొంతు వినేందుకు ఈ యువజనోత్సవంలో పాల్గొందాం.
***
సమూహ ప్రకటన ఇదీ:
యువతలో విద్యార్థుల్లో రాజ్యాంగం ప్రాథమికంగా నిర్దేశించిన లౌకిక ప్రజాస్వామ్య సమత్వ భావనని పెంపొందించే లక్ష్యంతో సమూహ ఈ కార్యక్రమం చేస్తున్నది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వంద మందికి పైగా ప్రముఖ సమకాలీన కవులు రచయితలు మరీ ముఖ్యంగా దాదాపు 60 మంది యువరచయితలు విద్యార్థులు పాల్గొనే ఈ ఉత్సవాన్ని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరుపుకుంటున్నాం. వివిధ వేదికలపై జరిగే ఈ కార్యక్రమంలో 12 సమాంతర సెషన్లలో మూడుతరాల గొంతుకలు తమ రచనానుభవాలు వినిపిస్తాయి. ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా తమిళ రచయిత్రి సుకీర్త రాణి, ఆత్మీయ అతిథిగా మహిళా విశ్వవిద్యాలయం విసి ప్రొ. సూర్యా ధనంజయ్ పాల్గొంటున్నారు. డార్జిలింగ్ కి చెందిన నేపాలీ ధిక్కార కవి మనోజ్ బోగటి తో ప్రత్యేక సెషన్ ఉంటుంది. కవిత్వంతో సంభాషణలో ముప్పై మంది యువ కవులు సీనియర్ కవులతో, కథతో ప్రయాణంలో మరో ముప్పై మంది యువ కథకులు సీనియర్ కథా రచయితలతో సంభాషిస్తారు.
భిన్న అస్తిత్వాలకు చెందిన మేధావులు విద్వేష కాలంలో రచయితల కర్తవ్యాలను సమీక్షిస్తారు. ఫాసిస్టు రాజకీయాలకు వ్యతిరేకంగా కవులు రచయితలూ ప్రతిఘటన స్వరాలు వినిపిస్తారు. కొత్త పాత రతరాలకు చెందిన ప్రచురణ కర్తలు ఆ రంగంలో ఎదురయ్యే సవాళ్ళను చర్చిస్తారు. రెండు వేదికలపై యువ రచయితల కొత్త పుస్తకాల పరిచయ సభలు జరుగుతాయి. కొత్త తరంలో పఠనాసక్తిని సామాజిక చింతనను పెంపొందించేందుకు డజనుకు పైగా పబ్లికేషన్ సంస్థలతో బుక్ స్టాల్స్ ఏర్పాటు చేసున్నాము. నిశ్శబ్దపు గోడల్ని ఛేదించేది యువశక్తే. ఆ శక్తిని ప్రజ్వలింపజేసేది సాహిత్యమే. వివిధ ప్రాంతాల్లో అట్టడుగు వర్గాల్లో మరుగున పడి ఉన్న యువతకు ఒక గొంతుకను, ఒక వేదికను ఇవ్వాలన్నదే ఈ సమూహ యువ సాహిత్య ఉత్సవం ప్రథమ ఆకాంక్ష.
సంప్రదించడానికి : మెర్సీ మార్గరెట్
9052809952 సెక్రెటరీ , సమూహ యూత్ లిటరేచర్ ఆర్గనైజింగ్ కమిటీ








Well written and good start
Good programme and best wishes for the success of the programme.
Well written
Best wishes -sec garu