మనం రాస్తున్నవన్నీ నచ్చినవే అయినా కొన్ని ఎక్కువ సార్లు గుర్తుకు వచ్చేవిగా ఉంటాయి. అలా గుర్తుకు రావడానికి రాయడానికి దోహదం చేసిన పరిస్థితో,సందర్భమో ఏదైనా కావచ్చు. మనల్ని వెంటాడుతూ ఉంటాయి.అందుకు ఆ వస్తువుతో మనకున్న దగ్గరితనం కావచ్చని నేననుకుంటాను. ఇలా ఆలోచిస్తుంటే ఇప్పటిదాకా రాసినవాటిల్లో ఎక్కువసార్లు గుర్తుకు వచ్చి నన్ను బాగా ఆలోచింపజేసిన కవితల్లో ఇష్ట కవితగా యాలై పూడ్సింది కవితను ముందుగా చెబుతాను.
ఈ కవిత ఎక్కువ గుర్తుకు రావడానికి కారణం ఆ కవితను రాసిన సందర్భం. రాయించిన సందర్భం నన్నెంతో ఆలోసింపజేశాయి.చరిత్ర,భూగోళం, సివిక్స్ చదువుకున్న విద్యార్థిగానే కాక ఉపాధ్యాయుడిగా కూడా నా చుట్టూ వున్న పరిసరాలు నన్ను ఎక్కువగా ఆలోసింపజేస్తుంటాయి.కదిలిస్తుంటాయి.కొన్ని ప్రశ్నలయి లోపల గుచ్చుతూ ఉంటాయి. చదువుకున్న, చదువుకుంటున్న విషయాల్లో, సమాజాన్ని ప్రభావితం చేసిన మార్క్స్, పూలే, అంబేద్కర్ వంటి దార్శనీకుల ఆలోచినలు… రాస్తున్న విషయం పట్ల కొంత స్పష్టతను, ఎరుకను అందించాయి.యాలై పూడ్సింది కవిత రాయడానికి అదే పేరుతో కవితా సంపుటి తేవడానికి కూడా ఈ ఆలోచనలు ప్రభావితం చేశాయని అనుకుంటాను. కవిత్వంలో నాదైన దృష్టిని ఏర్పరిచాయని నేను భావిస్తాను.
కవిత రాస్తున్న సందర్భం,సమయం ఏదైనా అది ఆ సంఘటనకు ,సమయానికి మాత్రమే చెందినదిగానే కాక మొత్తం సమాజంపై దాని ప్రభావం,అది చేస్తున్న గాయం,తవ్వుతున్న అగాధం వంటివి ఒక యూనివర్సల్ గా ఎలా చెప్పగలుతున్నామో చాలా ముఖ్యమని నాకనిపిస్తుంది.నేడు మనం అటువంటి చూపుతో జీవించాల్సిన విశ్వవేదికపై ఉన్నాం. కనుక ఇది అవసరమని తలుస్తాను.పీడనకు గురవుతున్న సమూహంపట్ల నిలబడాలని విశ్వసిస్తాను.సాంఘీక విప్లవకారుడు పెరియార్ రామస్వామి గారు అన్నట్టు వివక్ష దోపిడీ ఈ స్థాయిలో వున్నా అది నా శత్రువు అన్న అవగాహన,స్పష్టతను గౌరవిస్తాను.ఇదే నా మిగిలిన కవితలల్లో ఉన్నట్టే యాలై పూడ్సింది కవితలోనూ కనిపిస్తుంది. వినిపిస్తుంది.
సహజంగా నేను పుట్టుకతో,జీవిస్తున్న వాతావరణంతో పీడిత ప్రజల,దోపిడీకి గురవుతున్న సమూహానికి చెందిన వాడిని కాబట్టి ఆ అనుభవాలను సంబంధించిన వ్యక్తీకరణ నా కవిత్వంలో మామూలుగానే చేరుతుంది.ఇదే యాలై పూడ్సింది కవితలోనూ రాశాను.ఇంకానా ఇకపై చెల్లదనే నిరసన గొంతుల్ని కలగన్నాను.
ఆ కవితకు పురికొల్పిన సందర్భం చాలా విశిష్టమైనది.దేశమంతా వేడుక చేసుకునే ముఖ్యమైంది.ఆ రోజు ఆగస్టు 15 ఎప్పటిలాగే నేను పనిచేస్తున్న పాఠశాలలో ఉదయాన్నే జెండా వందనం కార్యక్రమం పూర్తికాగానే పిల్లను సమావేశ పరిచి ప్రతి ఏడాదిలాగే పిల్లలచేత దేశభక్తి గురించి,దేశనాయకుల గురించి,స్వాతంత్య్ర దినోత్సవపు ప్రాముఖ్యత గురించి,మహనీయులు త్యాగాల గురించి,బ్రిటీష్ వారు దేశాన్ని ఎలా దోచుకున్నారో,ఎలా ప్రజల్ని కష్టపెట్టారో వంటి విషయాలను ప్రసంగాలుగా, పాటలుగా,పద్యాలుగా చెప్పించడం.ఆ తరువాత వొంతులువారిగా ప్రధానోపాధ్యాయులు,అతిధులు మాట్లాడటం,ఉపాధ్యాయులు మాట్లాడటం పూర్తి అయింది. ఆ సంధర్భంగా నేను మాట్లాడుతూ నా అవగాహన మేరకు,సమకాలీన దేశపరిస్థితులు ప్రస్తావిస్తూ”ఇంగ్లీషు వారు దేశాన్ని దోచుకున్నారుసరే,ప్రజల్ని కష్టపెట్టారు సరే వాళ్ళు మన దేశాన్ని వదిలివెళ్లి డెబ్భైఏళ్ళు దాటిపోయింది.
ఇప్పటికీ దోపిడీకి గురవుతున్న కుటుంబాల పరిస్థితి ఏమిటి.తిండిలేక అలమటిస్తున్న బతుకులేంటి,ముఖ్యంగా శ్రమిక కుటుంబాల,ఉత్పాదక కుటుంబాలపై సాగుతున్న అణచివేత, దోపీడీ దాస్టీకాల మాటేమిటి.దేశాన్ని మాతృసమానంగా భావిస్తూనే ఆడపిల్లల పై,తల్లుల పై జరుగుతున్న ఘోరలేమిటి? అంతా ఒక్కటే అంటూనే అంటూ మైలా అంటూ సాగుతున్న వెలివేతల దుర్మార్గపు అమానవీయ దుర్ఘటనలు ఏమిటి?రాజ్యాంగంపై ప్రమాణాలు చేసి పదవుల్లో వుండేటోళ్లు దోపిడీదారులకు,కార్పొరేట్శక్తులకు కాపాలగాస్తూ సామాన్య జనజీవితాన్ని చిదిమేస్తున్న వ్యవస్థ ఏమిటి?ఇలా ఎన్నో ఆలోచనకు కందిరీగల్లా చుట్టుముట్టాయి.
ఈ పరిస్థితులు మారాలంటే దోపిడీకి గురవుతున్న,అనేకాలుగా అణచబడుతున్న కుటుంబాలు ఉమ్మడిగా ఆలోచించాల్సిన అవసరం ఏమిటి?ఉమ్మడి కార్యాచరణ ఏమిటి ? నేటి మోసపూరిత మైన రాజకీయాలను ఎలా చూడాల్సివుంది.పౌరస్వేచ్ఛను ఎలా కాపాడుకోవాలి.వంటి విషయాల్ని కొంతవరకు మాట్లాడినాను. సమావేశం అయ్యాక ఇంటికెళ్తున్నా మనసులో ఇవన్నీ కదులుతూనే ఉన్నాయి. నిజమే కదా..!ప్రతిసారి పిల్లల్ని కాళ్ళు తిమ్మిరెక్కేలా కూర్చోపెట్టి బ్రిటీసువారు చేసినవే చెబుతూ ఇంకా ఎంతకాలం జరుగుతున్న మోషాల్ని కప్పిపుచ్చుకునే ముసుగులు సిద్ధపరుస్తాం.?నేడు మన పాలకులు,వారి నీడలో పెట్టుబడిదారులు దోపిడీ ముఠాలు చేస్తున్న దారుణాలు ఏమిటి..ప్రజల్ని కేవలం ఓటర్లుగా ,అస్తిత్వం లేని,ఆత్మగౌరవంలేని మానసిక బానిసత్వంలోకి నెట్టివేస్తూ సాగుతున్న కుట్రలు ఏమిటి?.ఇంకా ఎన్నో ప్రశ్నలు, కలవరపాట్లు నాచే యాలై పూడ్సింది కవితను రాయించాయి.
యాలై పూడ్సింది అంటే మా చిత్తూరు జిల్లా తూర్పు,దక్షణ ప్రాంతం,తమిళనాడు సరిహద్దుప్రాంతపు ఊళ్లలో వ్యవహరించే మాట. ఈ మాటకు అర్థం సమయం మించిపోయింది, సమయం అయిపోయింది అని. ఈమాట నేను చిన్నతనం నుంచి వింటున్నాను.ఇళ్లలో ,కయ్యల్లో పనులు చేసుకునేటపుడు టైం అయిపోయింది త్వరపడండి అనేందుకు,పని త్వరగా పూర్తిచేయాలి అనేందుకు,సిద్ధపడండి అనేందుకు నిత్యం వ్యవహరిస్తుంటారు.ఈ మాటనే
ఇపుడు జరుగుతున్న ఈ దోపిడీలకు, దారుణాలు,మోసపూరిత రాజకీయాలకు,వాటి ఫలితంగా సమాజంలో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలకు,కడగండ్లకు కాలం చెల్లిందని గట్టిగా గొంతెతి చెప్పడానికి సరైన మాటగా భావించాను.ఇప్పుడు సామాన్య ప్రజలంతా మాట్లాడాల్సిన అవసరాన్ని యాలై పూడ్సిందిలో వినిపించాను. అందునా బహుజన సమాజపు తల్లుల గొంతుతో పలికించాను.శ్రామిక కుటుంబాల తల్లుల్లో వుండే చైతన్యాన్ని,ఎరుకను,ఎదురు తిరిగే గుణాన్ని “వారగా బోండప్పా/వాకిలి చిమ్మాలి/కల్లాపు జల్లాలి”అంటూ వ్యస్థను శుద్ధిచేయాల్సిన అవసరాన్ని చెప్పాను.
నేడు విద్వేషపూరిత రాజకీయ వాతావరణం విస్తరిస్తూ ఒకే నేలలో పుట్టిన జనాన్ని కులం పేరుతో, మతంపేరుతో,అనేక ముద్రలతో చీలికలుగా చేస్తున్న వంచన నడుస్తోంది. సభలలో సమావేశాల్లో నీతులు వల్లిస్తూనే ప్రజాస్వామ్యానికి గోతులు తీస్తున్న ఎత్తుడుగడలు సాగుతున్నాయి.మతం రాజకీయ వస్తువు అయింది.దేవుడు రాజకీయ వస్తువు అయ్యాడు, ఆవు రాజకీయ వస్తువు అయింది. తిండి రాజకీయ వస్తువు అయింది.భాష రాజకీయ వస్తువు అయింది.ఒక వ్యూహాత్మక విద్వంసం వేళ్లూనుకొంటుంది.సహజవనరులు,సహజమైన సాంస్కృతిక జీవనం దాడికి గురవుతూ ఆధిపత్యపు బుల్డోజర్ల కింది ఛిద్రమవుతోంది.అన్నిటికి మించి పౌరస్వేచ్ఛకు,జీవించే హక్కుకు,మాట్లాడే హక్కుకు ఉచ్చులు బిగిసుకుంటున్నాయి.ప్రభుత్వాలే రాజ్యంగవిలువలకు,ఆదర్శాలు,ఆశయాలకు దూరంగా జరుగుతున్నాయి.ఇవి పట్టించుకుని చర్చిస్తున్న గొంతులు చెరసాలలో బంధీలవుతున్నాయి.అంతకంతకూ చాపకిందనీరులా ఆక్రమిస్తున్న మనువాదాపు పోకడలు ఒకవైపు కోరలు సాస్తూనే ఉన్నాయి.ఇవన్నీ మాట్లాడాల్సిన సందర్భంలో ఉన్నాం.మనిషిని మనిషిగా నిలబెట్టాల్సిన అనివార్యతలో ఉన్నాం. ఇవన్నీ మాట్లాడడానికి సమయం అయిపోయిందని గుర్తుచేస్తూ పిలిచిన పిలుపుగా యాలైపూడ్సింది మాటను,కవితను అభిప్రాయపడుతాను.అప్పటిదాకా రాసిన కవితలన్నిటికి ఒక ఉమ్మడి గొంతుకగా ఈ కవిత సరిపోతుందని పేరునే పుస్తకం పేరుపెట్టి యాలైపూడ్సింది కవిత సంపుటి తీసుకువచ్చాను.
డెబ్భై ఐదేళ్ల స్వేచ్చా భారతదేశం అమృతోత్సవాలు జరువుకుంటున్న మాతృదేశం తనకు తానుగా సవరించుకున్న వర్తమాన గొంతుక యాలైపూడ్సింది కవిత.
యాలై పూడ్సింది
యాలై పూడుస్తావుంది
ఎంతకాలం ఈ ఏగులాట
కొన్నాలికిలో బెల్లంపూసుకొని
అంగిట్లో యిసం బెట్టుకొని
బలే మాట్లాడతా వుండారు కాదబ్బా..
బలే బేలిపిస్తావుండారు గదయ్యా!
కాళ్లు తిమ్మిరెక్కేలా పిల్లకాయల్ని కూకోబెట్టి
నీతికోతలు కొస్తావుండారే..!
ఇంగులీసోడు యలబారి ఏండ్లు గడస్తావున్నా..
దుమ్మెత్తి పోస్తారే గానీ
దేశం లోపల దొరల సంగతేందీ…?
దేశమొదిలి పోతున్న దొంగల కతేందీ..?
సెలవిస్తారా సామీ!
దేశాన్ని భారతమ్మని పిల్సుకుంటున్నామే…
ఈ దేశాన ఆడకూతుర్ల మానపేనాలు
చితికి బూడిదై పోతున్న అగత్త్యమేందీ…?
అంతో ఇంతో సదువుకున్నోళ్ళంతా..
కులాల పేరుతో
మతాల పేరుతో..
యీదులంతా పూనకమొచ్చి ఊగిపోతావుంటే…
తంటాలు పెట్టిన తోడేళ్ళు…
బోగాలతో కులికే బంగళాల్లో
ముక్కలు తింటూనో
వక్కాకు నములుతూనో
పకపకాలాడతావుండే అన్నేకారిరోజుల్లో
తలా ఇంత కూడుబెడుతూ..
కల్లాల్లో కుమిలి కుమిలి మగ్గిపోతున్న మట్టిబతుకేలెందీ..?
యవుడు కూడు వోడు తింటావుంటే…
కూటికుండ కాడా
కూరసట్టి కాడా…
కారుకూతలేంది…ఈ కత్తిగాట్లేందీ..
కాలమిట్టా కడతేరిపోవాల్సిందేనా..!?
ఏనుగుపై
సత్తిపెమానాలు జేసీ పీఠాలెక్కినోళ్లు…
ఏనుగు తొండం తగలబడిపోతావుంటే చూస్తూ కూడా
వులుకూ పలుకూలేని ఉప్పాట యాందీ….?
ఉప్పూఊరుగాయకు పనికిరాని ఊకదంపుడేంది??
యాడాదికొకతూరి ఏదోవొకసాకున
జెండాలు ఎగరేయడం మాలూలైపూడ్సింది గదా
జుబ్బాలుసాటునగబ్బుతానాలు అగుపిచ్చకుండా
జబ్బలు సర్సుకోండి
ఎవుడేడపోతే యాముండాదిలే
మీరు కోరుకున్నకొండమీదే వాన గురువాల
కయ్యల్లో
కాల్వల్లో
ఈదుల్లో
ఊళ్ళల్లో
మట్టి రగతం దేశబకితై పారతావుంటే..
దేముడిరాగంలో దొంగభజన్లు సాగుతుండాల..
సాల్లే….సాల్లే..
పొద్దుమొలస్తావుంది
మీ మోసకారి పాటల్కి ఇంకా ఇంకా
మా మద్దెలవాయించలేం…
వారగాబోండప్పా
యాలై పూడ్సింది…
వాకిలి చిమ్మాలా…
కల్లాపుజల్లాలా…
*** *** ***
కవితా నేపథ్యం కఠినంగా ఉంది.కవిత సున్నితంగా బాధిస్తుంది.
ఇదే ‘రసన’ కాబోలు.
థాంక్యూ మేడం
థాంక్యూ మేడం💐
ఎక్సలెంట్ పోయం ,దాని వివరణాత్మక విశ్లేషణ
నీకు సారంగ వెబ్ పత్రకకు శుభాభినందనలు తమ్ముడు
థాంక్యూ అన్న💐
చాలా బావుంది అన్న.. కవిత వెనుక ఒక లోతైన తండ్లాటను నీ మాటతోనే విప్పి చెప్పడం ఆలోచింపజేస్తోంది. చాలా సహజంగా వాస్తవ రూపాన్ని వ్యక్త పరిచిన కవితగా నిలబడుతుంది. ఇవ్వాళ్టికి అవసరమైన మాటలు అన్న.. శుభాకాంక్షలు.
థాంక్యూ తమ్ముడు💐💐
విశ్లేషణ బాగుంది…. అభినందనలు
థాంక్యూ అన్న💐
Gurthu chesthunnav Raju
థాంక్యూ మిత్రమా
అక్షరాల వెనుక చదివాక కవిత మనసుకు మరింత దగ్గరైంది.
అభినందనలు
డా. లక్ష్మీ రాఘవ
ధన్యవాదాలు మేడమ్💐